ఫ్రాగ్మెంట్స్

1.

పక్షుల కిలకిలారావాలతో
మొదలవ్వాల్సిన కొన్ని ఉదయాలు
తుపాకీ మోతలతో మొదలవటం
ఎంత విషాదం!

2.

చికన్ షాపు గంపలోంచి
కోడిపుంజు మెడ సారించి
కొక్కొరొక్కో అంటూ కూస్తోంది
గడియలు సూచిస్తూ

3.

బయట ఆగిపోయిన వాన
లోపల ఇంకా కురుస్తూనే ఉంది
కాలం నిండా తూనీగల గుంపు

4.

ఏమీ ఆశించకుండా కృతజ్ఞత
ఉదారంగా కరుణ చూపే వ్యక్తి కోసం
ఆమె ఇంకా ఎదురుచూస్తూనే ఉంది
హృదయం ఒక బార్ కోడెడ్ వస్తువు
అయిపోయిందన్న విషయం
ఆమెకెవరైనా చెపితే బాగుణ్ణు

5.

సరైన పదం కోసం
చీకట్లో తడుముకొంటూంటే
చేతికి సూర్యుని ముక్క తగిలింది
ఉదయం పద్యమై
విచ్చుకొంది