ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II

స్కిట్ (S.C.I.T. Soc.Culture.Indian.Telugu)

యూజ్‌నెట్ గురించి, SCIT (తెలుగు యూజ్‌నెట్ న్యూస్‌గ్రూప్) గురించి ఇప్పుడు మాట్లాడడమంటే తేనెతుట్టె కదిలించినట్టు; పూలచెట్టును అదిలించినట్టు; పాత ఫొటోలను మళ్ళీ చూసినట్టు, పాత ఉత్తరాలను మళ్ళీ చదువుతున్నట్టు. ఆ రోజుల్ని తలచుకుంటుంటే జ్ఞాపకాల ఉధృతిలో కొట్టుకుపోతున్న భావన.

ఇలా SCITని నెమరు వేసుకుంటుంటే, తరుముకుంటూ వచ్చే చిన్నప్పుటి జ్ఞాపకం మా ఊళ్ళోని తమ్మిచెరువుకట్ట. ఈ చెరువు పక్కనే వేదఘోష వినిపిస్తూ ఓంకారేశ్వరాలయం ఉండేది. పేరుకు తగ్గట్టే ఈ తమ్మి చెరువు నిండా పద్మాలు, కమలాలు, అరవిందాలు అంటూ ఒక్కక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకునే అందమైన తామర పూలు. అట్ల తద్ది ఉయ్యాలలు, నారాయణ నామస్మరణలు, రామనవమి ఉత్సవాలు, చివరికి ప్రజానాట్యమండలి ప్రదర్శనలు కూడా ఈ చెరువు గట్టుమీదే జరిగేవి. సాయంత్రం ఊళ్ళోవారంతా ఈ గట్టుమీద చేరి ప్రపంచంలోని అన్నీ విషయాల గురించి సీరియస్‌గా చర్చించేవారు. ఊళ్ళోని వింతలూ, విశేషాలు, ఉద్యోగపువేటలు, పెళ్ళి సంబంధాలు అన్నింటికి కార్యరంగం ఈ చెరువు గట్టే. సినిమాలు, రాజకీయాలు, క్రికెట్ స్కోర్లు, వేదాంతం, విప్లవ నినాదాలు అన్నింటి గురించి ఇక్కడే తీవ్ర స్థాయిలో చర్చలు జరిగేవి. అప్పుడప్పుడే పాఠ్యపుస్తకాలు దాటి బయటి ప్రపంచం గురించి ఆలోచిస్తున్న నాపై ఆ చర్చలు బలమైన ముద్రవేశాయనే చెప్పక తప్పదు. ఊళ్ళోవారందరి రహస్యాలను గుంభనగా తనలో దాచుకొని నిండుగా కనిపించే మా ఊరి చెరువు లాంటిదే SCIT కూడా.

SCIT చరిత్ర

ఇంతకు ముందు భాగంలో చెప్పినట్లు మొదట్లో భారతదేశానికి సంబంధించిన విషయాలను చర్చించడానికి యూజ్‌నెట్‌లో net.nlang.india అన్న గ్రూప్ ఉండేది. 1987లో, యూజ్‌నెట్ పునర్విభజన తరువాత ఈ గ్రూప్ పేరు soc.culture.indian గా మారిపోయింది. ఆ రోజుల్లో విద్యార్థులుగా అమెరికాకు వచ్చేవారిలో దక్షిణ భారతీయులే ఎక్కువయినా, ఈ గ్రూపులో చర్చలన్నీ భాషాతీతంగా భారతదేశమంతటికీ సంబంధించిన విషయాల మీదే జరిగేవి. ఎప్పుడైనా సినిమాల గురించి మాట్లాడుకుంటే అది హిందీ సినిమాల గురించే ఉండేది. భారతీయ భాషల ఫాంట్ టెక్నాలజీ అభివృద్ధి చెందని ఆ రోజుల్లో చర్చలన్నీ ఇంగ్లీషులోనే జరిగేవి. 1989 లో పర్డ్యూ యూనివర్సిటీలో చదివే సూర్య కావూరి ‘ఆ రజనీకర మోహన బింబము’ అన్న ఘంటసాల పాటను ‘Savor it’ అన్న సబ్జెక్టుతో ఇంగ్లీష్ లిపిలో పోస్టు చేస్తే, తెలుగేతరులు ఆ పాటలో పదాలను “bimbo”, “pimp” అంటూ అటుయిటుగా విడగొట్టి అవహేళన చెయ్యడంతో ఆ గ్రూపులో పెద్ద దుమారం చెలరేగింది. అప్పుడే తెలుగుకు సంబంధించిన విషయాలు చర్చించుకోవడానికి ఒక ప్రత్యేక గ్రూప్ అవసరమని కొంతమంది తెలుగువారికి అనినిపించింది.

WETD (World Electronic Telugu Digest) – తెలుగు డైజెస్ట్

యూజ్‌‌నెట్ లో ఒక కొత్త న్యూస్‌గ్రూప్ సృష్టించాలంటే ఎంతో తతంగం ఉండేది. ముందుగా కొత్త గ్రూప్ యొక్క పేరు, లక్ష్యాలు, ప్రమేయాలను వివరిస్తూ RFD (Request for Discussion) తయారు చేసి సంబంధిత గ్రూపులలో పోస్ట్ చెయ్యాలి. దానిపై కొంత చర్చ జరిగిన తరువాత ఆ గ్రూప్ లక్ష్యాలకు ఏవైనా మార్పులు-చేర్పులు జరిగితే మళ్ళీ ఇంకో కొత్త RFD (Request for Discussion) పోస్ట్ చెయ్యాలి. అలా ఒక నెల రోజుల పాటు ఏ మార్పులు లేకుండా RFD పై చర్చ జరిగితే, ఆపై వోటింగుకి పిలుపునిస్తారు (CFV – Call For Votes). మూడు నాలుగు వారాల దాకా వోటింగ్ జరుగుతుంది. ఆ గ్రూప్ ఏర్పాటుకు అనుకూలంగా మూడింట రెండొంతుల మెజారిటీ వోట్లు వస్తే అప్పుడు ఆ కొత్త గ్రూప్ సృష్టించబడుతుంది (అనుకూలంగా కనీసం 100 వోట్లుఎక్కువ ఉండాలి). ఈ తతంగం అంతా పూర్తి అవ్వడానికి నాలుగు నెలల నుండి ఆరు నెలల దాక పట్టేది. మరీ వివాదాస్పదమైన జమ్మూకాశ్మీర్ (soc.culture.indian.jammu-kashmir) వంటి న్యూస్‌గ్రూపుల సృష్టికి సంవత్సరం పైగానే పట్టింది.

దీనికన్నా, ఒక మెయిలింగ్ లిస్ట్ ప్రారంభించడం చాలా సుళువు. అయితే ఆ రోజుల్లో కొన్ని పెద్ద యూనివర్సిటీలలో మాత్రమే మెయిల్ సర్వర్లు ఉండేవి. ప్రొఫెసర్ కె. వాణీనాథ రావు (కె.వి.రావు) గారు పనిచేస్తున్న బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ అటువంటి యూనివర్సిటీలలో ఒకటి. ఆయన సహాయంతో తెలుగువారు తెలుగుకు సంబంధించిన అన్ని విషయాలపై చర్చించడానికి వీలుగా WETD (World Electronic Telugu Digest) అన్న మెయిలింగ్ లిస్ట్ 1991లో ప్రారంభమయ్యింది. ఈ డైజస్టుకు మొదట్లో కె. టి. నారాయణ ఎడిటర్‌గా ఉండేవారు. తరువాత డెట్రాయిట్లో చదువుకుంటున్న సీతంరాజు ఉదయ భాస్కర శర్మ ఎడిటరై ఎంతో సమయాన్ని వెచ్చించి 1995 చివరి వరకూ ఈ డైజస్టును నడిపించారు.

స్కిట్ ఆవిర్భావం

ఈ-మెయిల్ సౌకర్యం ఉన్న వారందరూ తెలుగు డైజెస్ట్‌లో సభ్యులుగా చేరే అవకాశమున్నా, యూజ్‌నెట్ న్యూస్‌గ్రూపులకు ఉండే ఎన్నో వసతులు డైజస్ట్‌కు లేవు. ఉదాహరణకు, న్యూస్‌గ్రూపులు చదవడానికి ప్రత్యేక సభ్యత్వం అవసరం లేదు. డైజస్ట్‌లో సభ్యులుగా చేరితేనే అందులోని చర్చలను చదవడానికి వీలౌతుంది. అంతేకాక, డైజస్ట్ గురించి కొత్తగా ఇంటర్నెట్‌కి వచ్చే తెలుగు వారికి తెలియటం కష్టం. అదే న్యూస్‌గ్రూపు గురించి ప్రత్యేకంగా ప్రచారం చెయ్యాల్సిన అవసరం లేదు. యూజ్‌నెట్ సదుపాయం ఉన్న ప్రతి సర్వర్‌కి అన్ని ముఖ్యమైన న్యూస్‌గ్రూపులు అందజేయబడుతాయి. అంతేకాక, యూజ్‌నెట్ న్యూస్‌గ్రూపులు ఎవ్వరి సొంతం కావు, కానీ, WETD డైజస్ట్ మాత్రంఅది ప్రారంభించినవారి ఇష్టాలకి అనుగుణంగా నడుస్తుంది. “వాణీనాథుడు కోపగించితే చాలామందిని వెలివేయు” అని మరచిపోకుండా డైజస్టులో మసలుకోవాల్సివస్తుంది. ఇలా ఎన్నో కారణాల వల్ల తెలుగు వారికోసం ప్రత్యేకంగా న్యూస్‌గ్రూప్ సృష్టించాలని నడుం కట్టిన వారు ఆనంద కిషోర్, రమణ జువ్వాడి, రమణ ఈడూరి, శరత్ వేమూరి గార్లు.

భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్ర విభజన ఏ విధంగా అయితే తెలుగు, తమిళులకు ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుతో మొదలయ్యిందో, అదే విధంగా యూజ్‌నెట్‌లో భాషల ఆధారంగా విడివడి ప్రత్యేక న్యూస్‌గ్రూపులుగా ఏర్పడడం soc.culture.tamil, soc.culture.indian.telugu అన్న తమిళ, తెలుగు గ్రూపులతోనే ప్రారంభం కావడం విశేషం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రసాధనకు ఎంతగా వ్యతిరేకత వ్యక్తం అయ్యిందో, ప్రత్యేక తెలుగు యూజ్‌నెట్ గ్రూపు ఏర్పాటు కోసం చేసిన చర్చల్లో దాదాపు అదే విధమైన వ్యతిరేకత కనిపించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల భారతదేశం ఎంతగా నష్టపోయిందో, భాష పేరిట ప్రత్యేక న్యూస్‌గ్రూపులుగా విడిపోవడం వల్ల భారతీయ యూజ్‌నెట్ సభ్యులు అంతకంటే ఎక్కువ నష్టపోతారని ప్రతికూల వర్గాల వాదన. ఇటువంటి వాదన చేసిన వారిలో కె. టి. నారాయణ వంటి తెలుగువారే ముందుండడం చెప్పుకోదగ్గ విశేషం. తెలుగు కోసం ప్రత్యేక చర్చావేదిక ఏర్పాటుచేసుకుంటే తప్పేమీ లేదని, దాన్ని తెలుగువారు భారతదేశం నుండి విడిపోయి వేరే రాష్ట్రంగానో, దేశంగానో ప్రకటించుకున్నంత దేశద్రోహంగా పరిగణించాల్సిన అవసరంలేదని రమణ జువ్వాడి, ఆనంద కిశోర్, రామారావు కన్నెగంటి మొదలైనవారు చాలా ఓపికగా సమాధానాలిచ్చేవారు. మొదట్లో తెలుగు గ్రూప్ కోసం ప్రతిపాదించిన పేరు soc.culture.telugu అయినా ఈ చర్చల ఫలితంగా ఈ గ్రూప్ పేరును soc.culture.indian.telugu అని సవరించాల్సి వచ్చింది.

ఆరు నెలలపాటు సాగిన తీవ్ర వాదోపవాదాల మధ్య ఈ గ్రూప్ ఏర్పాటు పై ఆగస్ట్ 7, 1992 నాడు వోటింగ్ ముగిసింది. 338 మంది అనుకూలంగా వోటు వేస్తే, 103 మంది వ్యతిరేకించారు. ఆగస్ట్ 15, 1992 నాడు తెలుగు న్యూస్‌గ్రూపుగా soc.culture.indian.telugu ఆవిర్భవించింది.

SCIT స్వర్ణ యుగం: 1992-1996

ఇప్పటిలాగ బోలెడన్ని వెబ్ సైట్లు, చర్చా వేదికలు, అప్పట్లో లేవు కాబట్టి ఇంటర్నెట్టు అందుబాటులో ఉన్న తెలుగువారందరికీ SCIT ఒక కేంద్రస్థలంగా మారింది. ఎక్కువమంది యూనివర్సిటీల ద్వారా యూనిక్స్, వాక్స్, ఉపయోగించి పేజీలకి పేజీలు తెలుగుని ఆంగ్ల లిపిలో రాసేవాళ్ళు, చదివే వాళ్ళు (ఈ సందర్భంలోనే ఆనంద కిషోర్, రామారావు కన్నెగంటి గార్లు RIT సాఫ్ట్‌వేర్ కోసం సృష్టించిన R.T.S. లిప్యంతరీకరణ (transliteration) పద్ధతి వాడుకలోకి వచ్చింది). రూమ్మేట్ల కోసం అన్వేషణ, వరుడు లేక వధువు కావలెను ప్రకటనలు, ఇండియా నుంచి వస్తున్న తల్లిదండ్రులకు తోడుగా ఎవరైనా ప్రయాణం చేసేవాళ్ళుంటే చెప్పమనే విన్నపాలు, లేక ఇండియా వెళ్ళేవాళ్ళెవరైనా ఫలానా పాకెట్ తీసుకెళ్ళగలరేమో అనే అభ్యర్థనలు, వగైరాలన్నింటికీ SCIT వేదిక. సినిమాలు, రాజకీయాలు, ఫ్యాన్స్ ‌అసొసియేషన్స్, తానా, ఆటా సమావేశాలు, కులాలు, మతాలు, అన్నింటి గురించి ఇక్కడే చర్చలు జరిగేవి. అప్పుడప్పుడు, కొన్ని విషయాల్లో వాదోపవాదాలు శ్రుతి మించేవి. కొందరు సభ్యులు ‘కత్తుల రత్తయ్య’, ‘సూతపుత్ర’, ‘గండర గండడు’, ‘టిప్పు సుల్తాన్’, ‘దాన వీర శూర కర్ణ’ వంటి మారు పేర్లతో అనేక వివాదాస్పదమైన విషయాలపై ఇతర సభ్యులతో గొడవ పడేవారు.

ఇండియాకు తిరిగి వెళ్ళడం గురించి ఆ రోజుల్లో అన్ని భారతీయ గ్రూపులలో ఎంతో కొంత చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉండేది. అప్పట్లోనే ఆర్. కె. నారాయణ్ హిందులో రాసిన ఒక వ్యాసం ‘x=x+1 సిండ్రోమ్’ అమితంగా ప్రాచుర్యం పొందింది. అమెరికాకు వచ్చిన వాడెవ్వడూ ఇండియాకు తిరిగి వెళ్ళడు అని ఈ చర్చలలో పాల్గొనే వారి గట్టి నమ్మకం. అయితే, 20 సంవత్సరాలు అమెరికా-కెనడాలలో నివసించి CAIR (Center for Artificial Intelligence and Robotics) డైరెక్టరుగా భారతదేశానికి తిరిగి వెళ్ళిన డాక్టర్ ఎమ్. విద్యాసాగర్ గారు ఈ విషయాన్ని కూలంకషంగా చర్చిస్తూ SCITలో రాసిన వ్యాస పరంపర భారతీయ గ్రూపులన్నింటిలోనూ ఎనలేని సంచలనాన్ని సృష్టించింది. తెలుగు తెలియని ఇతర భారతీయులు కేవలం ఆయన వ్యాసాలు చదవడానికి, చర్చించడానికి తెలుగు యూజ్‌నెట్ గ్రూపుకి వచ్చేవారు. ఆయన వ్యాసాల వల్లనే ఇతర భారతీయ గ్రూపులలో SCITకి అప్పటిదాకా లేని గౌరవం, ప్రచారం లభించాయి.

SCIT ఏర్పాటు అయినా పాత తెలుగు డైజస్ట్ ఇంకా కొనసాగుతూనే ఉండేది. అయితే, SCIT చర్చలన్నీ తెలుగు డైజస్ట్ సభ్యులకు పంపే విధంగా తెలుగు డైజస్టుని SCITతో అనుసంధానం చేసారు. నెమ్మదిగా, డైజస్ట్ సభ్యులందరు నేరుగా SCITలోనే పొస్ట్ చెయ్యడం అలవాటు చేసుకోవడంతో తెలుగు డైజస్ట్ అవసరం తీరిపోయింది.

SCIT గ్రూపులో తెలుగు సాహిత్యం మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న మేమంతా ఒక కుటుంబంగా మసలుకునే వాళ్ళం. ఇప్పుడు ఈమాటలో ఛందస్సుపై సాధికారంగా రాస్తున్న జెజ్జాల కృష్ణమోహన రావు గారు ‘Gem of the Day’ అనే శీర్షికన వివిధ సూక్తులు, మంచి మాటలు ఏరి అందించే వారు. పారనంది లక్ష్మీ నరసింహంగారు (‘పాలన’ గా అప్పుడు, ఇప్పుడు ఇంటర్నెట్‌లో జగమెరిగినవారు) తెలుగు ప్రముఖుల గురించి మంచి వివరాలందిస్తూ ఒక శీర్షిక నడిపేవారు. పాలన, కొండలరెడ్డి గార్లు మనం ప్రతిరోజూ వాడే మజ్జిగ, ఇంగువ, ధనియ, గరం మసాల, తులసి వంటి పదార్థాలపై బయోకెమిస్ట్రీకి సంబంధించిన శాస్త్ర వివరాలందిస్తూ చర్చలు జరిపేవారు. రసగంధాయనం, జీవ రహస్యం, కొలెస్టరాలూ, గుండె జబ్బుల గురించి, ఫిజిక్సు, లెక్కలు, భాష, పదాల వ్యుత్పత్తి గురించి వేమూరి వెంకటేశ్వర రావు గారు కూలంకషంగా చర్చిస్తూ రాసేవారు. కథల గురించి, పద్యాల గురించి, కర్ణాటక సంగీతం గురించి, ఐఐటి కాన్పూర్లో కుశాగ్రబుద్ధుల గురించి ఆసక్తికరంగా రాసేవాడు నారాయణస్వామి శంకగిరి (అప్పుడు నాసీ, ఇప్పుడు బ్లాగులోకంలో “కొత్తపాళీ”గా పరిచితులు). రామభద్ర డొక్క జయదేవుని అష్టపదులపై రాసిన చక్కని వ్యాసాలు, పద్యాల గురించి ప్రభాకర్ విస్సావజ్ఝల రాసిన వ్యాస పరంపర తీపి గుర్తులు.

నాగా గొల్లకోట కితకిత పెట్టే కవితలు, వరిగొండ సుబ్బారావు మంచి పద్యాలు అందించేవారు. మురళి చారి, ‘సీనియర్’, ‘అమెరికాలో ఆపసోపాలు’ లాంటి హాస్యకథలు ధారావాహికగా రాస్తుండేవాడు (అవి ఇప్పుడు కూడా ఆయన బ్లాగు ‘తేటగీతి’ లో చాలా ఆదరణ పొందాయి). ‘నడిచే ఎన్‌సైక్లోపీడియా’ అని అప్పటికే పేరు పడిన పరుచూరి శ్రీనివాస్ జర్మనీ నించి పాత పాత సినిమాల గురించి, సంగీత, సాహిత్యాల గురించి ఆధారాలు, గ్రంథసూచికలతో సహా అందించే విస్తృతమైన సమాచారం అందరినీ అబ్బురపరిచేది. రామభద్ర డొక్కా, ఫణి డొక్కా, నాగులపల్లి శ్రీనివాస్ వంటి వారు సమస్యా పూరణలు ఇచ్చి, చక్కటి ఛందస్సుతో పూరించేవారు.తెలుగు సినిమాల గురించి ఇండియా నుండి రాసే కెప్టెన్ మధు ఆ రోజుల్లోనే శ్రీనివాస్ పరుచూరి, విష్ణుభొట్ల సోదరులు, ప్రభాకర్ విస్సావజ్ఝల తో పాటు కలిసి సినిమా పాటలలో రాగాల జాబితా తయారు చేసారు. ఆరోజుల్లో తెలుగు సాహిత్యం గురించి రాసే సభ్యులలో ఓ పాతిక మంది గురించి రామకృష్ణ పిల్లలమఱ్ఱి గారు రాసిన ‘పైలా పైలా పచ్చీసు’ పోస్టు చదివితే, ఇప్పటికీ ఆ జ్ఞాపకాల నాస్టాల్జియాలో మునిగిపోతాను.

అప్పట్లో SCITలో పాల్గొన్నవారికీ, పాల్గొనని వారికీ కూడా గుర్తుండిపోయే వ్యక్తి ‘కేటీ’ (కె. టి. నారాయణ). శ్రీశ్రీ రచనల్ని ‘pornography of emotionalism’ అంటూ రెచ్చగొడుతూ రాయడంలోనూ, కార్మికులను, కర్షకులను గాడిదలతో, పందులతో సమానంగా చూడడంలో తప్పు లేదంటూ క్యాపిటలిజానికి కొత్త భాష్యం చెప్పడంలోనూ కేటీకి సాటి రాగలవారు లేరు. కార్మికులు, కర్షకులు చేసే ఉత్పత్తి గాడిద చేసే ఉత్పత్తికన్న ఎక్కువ విలువైనది కానప్పుడు వారికి గాడిద కంటే ఎక్కువ విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని వితండ వాదన చేయడంలో కేటీ తెలుగుల పాలిటి రష్‌లింబా అనిపించేవాడు. దాదాపు ఇలాంటి వాదనతోనే, స్త్రీలను తక్కువగా చూడడంలో తప్పేమి లేదని మనుధర్మ శాస్త్రాలను సమర్థించేవాడు కేటీ. లాండ్ సీలింగుల మీద చర్చను హార్డీ (G. H. Hardy), ఫాన్ నోయ్‌మాన్(John von Neumann) పైన చర్చగాను, స్త్రీవాద రచన మీద చర్చను తానా(Telugu Association of North America) సంస్థకు, తన చక్కెర వ్యాధికి ఉన్న సంబంధంపై చర్చగా మార్చడంలో కేటీ చూపిన ప్రతిభ అసామాన్యం. ఇటువంటి ‘లూనత్వానికి’ తగినట్టి తర్కంతో, అంతే నిబ్బరంతో , సునిశితమైన హాస్యంతో జంపాల చౌదరిగారు ఇచ్చిన సమాధానాల పరంపర తలచుకుంటే ఇప్పటికీ తెరలు తెరలుగా నవ్వు వస్తుంది. జంపాలగారి సమాధానాలు ఇంటర్నెట్టుకు కొత్తగా వచ్చే వాళ్ళకు కేటీ లాంటి వాళ్ళను ఎలా ఎదుర్కోవాలి అన్న అంశంపై పాఠాలుగా చెప్పడానికి ఉపయోగించుకోవచ్చు.

వ్యక్తిగతంగా ఆ రోజుల్లో నన్ను అమితంగా ప్రభావితం చేసిన వారిలో చెప్పుకోవలసినవారు రామారావు కన్నెగంటి, బాపారావు, జంపాల చౌదరి, రామకృష్ణ పిల్లలమఱ్ఱి, వేలూరి వెంకటేశ్వర రావు గార్లు. అమెరికాకు వచ్చిన తొలిరోజుల్లో కాంట్(Kant), కనూత్(Knuth), కన్నెగంటి – ఈ ముగ్గురూ నాకు అత్యంత ఆరాధ్యులు. కాంట్ గురించి, కనూత్ గురించి ఎక్కడ ఏది కనిపించినా ఎంత ఉత్సాహంగా చదివేవాడినో అలాగే రామారావు కన్నెగంటి SCIT లో రాసిన ప్రతి పోస్టునీ అంతే ఉద్వేగంతో చదివేవాడిని. ఒక వారం రోజుల పాటు ఆయన పోస్టులో రాసిన విషయాలే మనసులో మెదులుతూ ఉండేవి. ఆయన రాసిన ప్రతి పోస్ట్ నాకో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నట్టు అనిపించేది.

ఇక భారతీయ చరిత్ర గురించి, రాజకీయాల గురించి, భాషా సాహిత్యాల గురించి లోతైన విశ్లేషణతో రాసే బాపారావు గారి పోస్టుల్ని కూడా వెర్రి అభిమానంతో చదివేవాడిని. ‘థ/ ధ’ అక్షరాల మధ్య తెలుగు వారికి ఉండే అయోమయం గురించి నేను SCITలో రాసిన ఒక పోస్టుకు జవాబుగా బాపారావు గారిచ్చిన సమాధానం, ఆ తరువాత ఆయన నాతో ప్రైవేటుగా చేసిన చర్చలే నాకు భాషాశాస్త్రంపై ఆసక్తి, అభిరుచి పెరగడానికి కారణమని చెప్పక తప్పదు.

దేశం కాని దేశంలో, బంధువులంతగా లేని రోజుల్లో నన్ను ఒక కుటుంబ మిత్రుడుగా ఆదరించి ఆదుకున్న స్నేహబాంధవుడు జంపాల చౌదరిగారు. తానా పత్రిక ఎడిటరుగా ఆయన SCIT సభ్యులెందరినో రచయితలుగా మార్చడమే కాక, నాచేత కూడా తానా పత్రికలో తెలుగు సినిమా పాట మీద ఆరు నెలల పాటు వ్యాసాలు రాయించి రచనా ప్రపంచాన్ని, ఎడిటింగ్ ప్రపంచాన్ని నాకు పరిచయం చేసారు. ఇప్పటికీ ఎడిటరుగా ఏదైనా నిర్ణయం తీసుకోవలసి వస్తే “What would JC do?” అని ఆలోచించేంతగా ఆయన నన్ను ప్రభావితం చేసారు.

సాహిత్యం, సౌహిత్యం, సౌమనస్యం – ఈ మూడింటి కలబోత రామకృష్ణ పిల్లలమఱ్ఱి గారు. తెలుగు పద్యసాహిత్యంలో ఆయనకున్న అపారమైన విజ్ఞానం, ఛందస్సు మీద ఆయనకున్న అధికారం, అందరినీ ఆప్యాయంగా పలకరించే సౌహార్దం, ఆ రోజుల్లో తెలుగు న్యూస్‌గ్రూపులో ఎంతో మందికి ఛందోబద్ధ పద్యాల మీద ఆసక్తి పెరగడానికి కారణాలని చెబితే అతిశయోక్తి కాదు. కూచిపూడి నృత్యనాటికల విశ్లేషణ, శాస్త్రీయ సంగీత కచేరీల సమీక్షలతో ఆయన చక్కని పోస్టులు రాసేవారు. ఆయనతో నాకు పరిచయం కలగకముందు ఛందస్సు, సంప్రదాయ సాహిత్యం, విశ్వనాథ సత్యనారాయణ మొదలైన అంశాలమీద కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉండేవి. రామకృష్ణ గారి వద్ద ఈమెయిల్ శిష్యరికం చేసిన తొలినాళ్ళలోనే ఈ అభిప్రాయాలన్నింటిని నేను పూర్తిగా పునఃపరిశీలించుకొవాల్సి వచ్చిందంటే ఆయన ప్రభావం నామీద ఎంతగా ఉందో తెలుస్తుంది.

ఆధునిక, సంప్రదాయ తెలుగు సాహిత్యాల గురించి, సంస్కృత, ప్రాకృత, పాశ్చాత్య రచయితల గురించి, సాహిత్య సిద్ధాంతాల గురించి, ఫిజిక్స్, ఫిలాసఫీల గురించి చక్కని చమత్కారంతో గిలిగింతలు పెడుతూ, ఒక్కోసారి పదునైన వ్యంగ్యంతో పొడుస్తూ , లోతుగా విశ్లేషిస్తూ రాసే వేలూరి వెంకటేశ్వర రావు గారు (ఇప్పుడు ఈమాట ముఖ్య సంపాదకులు) నాకు అప్పటికీ, ఇప్పటికీ గురుతుల్యులే.

ఇంకా, బొమ్మల కొలువు, సంక్రాంతి పతంగుల నుండి ఉత్తుత్తి అత్తయ్యలను ఆటపట్టించడం దాకా అన్ని రకాల జ్ఞాపకాల గురించి అవలీలగా రాసే కమల అనుపిండి, అన్నమయ్య పదాలనుండి ఆధునిక కథా సాహిత్యంపై ఆసక్తికరమైన సమాచారంతో చర్చించే పద్మ ఇంద్రగంటి, చెయ్యి తిరిగిన రచయితలైన సావిత్రి మాచిరాజు, శాంతిప్రియ కురద, ప్రవాస భారతీయ సంతతివారి విలక్షణమైన ధృక్పథాన్ని అందించే అరవింద పిల్లలమర్రి కూడా ఈ చర్చల్లో స్వేచ్ఛగా పాల్గొనడం SCIT ప్రత్యేకతగా ఉండేది.

SCIT లో రాజకీయాలు చర్చించకూడదు అన్న నియమావళి ఏమీ లేని కారణంగా రాజకీయ పరమైన వాడి, వేడి చర్చలతో పాటు కొన్నిసార్లు వెగటు పుట్టించే పోస్టులు కూడా వచ్చేవి. తానా, ఆటాలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల మీద చర్చ తెలియకుండానే కుల రాజకీయాల చర్చగా మారిపోయేది. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి గురించి మొదలైన చర్చ ఒక రాజకీయ పార్టీ అభిమానులు మరో రాజకీయ పార్టీపై దుమ్మెత్తి పోసే వాగ్వివాదంగా ముగిసేది. ఆ రోజుల్లోనే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం గురించి అప్పట్లో చాలా మంది హేమాహేమీలు పెద్ద వాదోపవాదాలతో, లోతైన చర్చ చేసినట్టు గుర్తు.

SCIT ద్వారా నాకు చాలా మంచి స్నేహితులు దొరికారు. జర్మనీలో ఉండే శ్రీనివాస్ పరుచూరి, లాస్ ఏంజలిస్‌లో ఉండే పద్మ ఇంద్రగంటి, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్న అక్కిరాజు భట్టిప్రోలు, డల్లాస్‌లో ఉండే చంద్ర కన్నెగంటి , ఈ మధ్య దాకా జాన్సన్ సిటీలో నివసించిన పాణిని శంఖవరం, ప్రస్తుతం సిన్సినాటిలో ఉంటున్న మాధవ్ మాచవరం (వీరిద్దరు ఇప్పుడు ఈమాట సంపాదకులు) మొదలైనవారు గత పదిహేనేళ్ళుగా నాకు ఆప్తమిత్రులుగా, ఈమాటకు అండదండలుగా ఉన్నారంటే అందుకు SCIT ద్వారా ఏర్పడిన స్నేహబలమే కారణం.

ఆటో మోడరేషన్, SCIT క్షీణ దశ

విద్యాసంస్థలకు, పరిశోధనా సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉండే యూజ్‌నెట్ 1993లో AOL లాంటి ఇంటర్నెట్టు సేవలు అందజేసే ప్రైవేట్ కంపెనీల సభ్యులకు కూడా చేరువయింది. తరువాతి కొద్ది నెలల్లోనే అనేక ఇతర సంస్థలు కూడా తమ సభ్యులకు యూజ్‌నెట్ ద్వారాలు తెరిచాయి. ఇలా ప్రతినెలా తండోపతండాలుగా కొత్త సభ్యులు చేరుతుండడంతో ప్రతి చర్చావేదికలోనూ చర్చల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది.

SCIT లోనూ 1994-1995 ప్రాంతాలలో చాలా మంది కొత్త సభ్యులు చేరారు.ఈ కొత్త సభ్యుల రాకతో కొత్త ఉత్సాహం వెల్లివిరిసి SCIT లోనూ చర్చల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ కాలంలో చర్చలు రాశి పరంగా పెరిగినా, వాసి పరంగా పలుచబడ్డాయని కొంతమంది పాత సభ్యులు అనుకునేవారు. అంతేకాక, ఈ కాలంలోనే అప్పటి దాక ఏ నియంత్రణ (Moderation)లేని భారతీయ గ్రూపులలో క్రాస్‌పోస్టుల బెడద ఎక్కువయ్యింది. కొంతమంది పనిగట్టుకొని తాము రాసిన ప్రతి పోస్టును 20కి పైగా ఉన్న భారతీయ గ్రూపులన్నింటికీ పంపేవారు. దానికి ఎవరైనా జవాబిస్తే, ఆ సమాధానం కూడా అన్ని గ్రూపులకూ వెళ్ళేది. అందువల్ల, SCIT ఈ క్రాస్‌పోస్టులతో నిండిపోయి, తెలుగుకు సంబంధించిన పోస్టులను వెతుక్కోవాల్సి వచ్చేది. ఖలిస్తాన్ వాది అయిన కుల్బీర్ సింగ్, మంత్ర కార్పరేషన్ అధిపతినని చెప్పుకునే డా. జై మహరాజ్ అనేవారిద్దరు SCITకి క్రాస్‌పోస్టులను ప్రతినిత్యం పంపేవారిలో ప్రముఖులు. ఈ క్రాస్‌పోస్టుల బెడద భరించలేకే ఆసక్తికరంగా రాసే చాలామంది తెలుగు సభ్యులు కూడా రాయడం మానుకున్నారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి ఆరి సీతారామయ్య, జంపాల చౌదరి, కమల అనుపిండి, బాపారావు, రమణ జువ్వాడి, అరవింద పిల్లలమర్రి, రత్నాకర్ శొంఠి, నేను కలిసి యాంత్రిక నియంత్రణ (Auto-Moderation) పద్ధతి ద్వారా SCITలో క్రాస్‌పోస్టులు నివారించాలని పూనుకున్నాం. యాంత్రిక నియంత్రణ ఉన్నప్పుడు క్రాస్‌పోస్ట్ చేయబడిన పోస్టు తిరస్కరించబడుతుంది. కానీ, SCITకి ఆటో మాడరేషన్ పెట్టడానికి SCIT కొత్తగా పెట్టినప్పుడు జరిగిన విధంగా మళ్ళీ వోటింగ్ జరపాలి. అందుకు సిద్ధపడి మేము 1996 మార్చ్ నెలలో ఈ విషయంపై వోటింగ్ ప్రతిపాదించాం. క్రాస్‌పోస్టర్లే కాక, పాటిబండ్ల సుధాకర్ వంటి తెలుగువారు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. తీవ్రస్థాయి వాగ్వివాదాల అనంతరం వోటింగ్ జరిగింది. మా ప్రతిపాదనకు అనుకూలంగా 276 వోట్లు, ప్రతికూలంగా 64 వోట్లు రావడంతో, జూన్ 13, 1996న SCITని ఆటో మాడరేట్ చేస్తునట్టుగా ప్రకటించారు.

ఆటో మాడరేషన్ ఉన్నా స్పామ్ (వాణిజ్య ప్రకటన్లలాంటి పోస్టులు), అనామకంగా రాసేవారి పోస్టులు ఎక్కువైపోవడం, తెలుగు భాషా సాహిత్యాల మీద అభిమానం ఉన్న వారంతా ‘తెలుసా’, ఆ తరువాత ‘రచ్చబండ‘ వంటి చర్చావేదికల్లోకి తరలిపోవడంతో 2000 నాటికి SCIT దాదాపు నిర్జీవమైపోయింది. అయితే, మొదట్లో డెజాన్యూస్, ఆ తరువాత గూగుల్ పాత యూజ్‌నెట్ చర్చలన్నిటినీ భద్రపరచడంతో, WETD, SCIT ఆర్కైవులు చాలామటుకు గూగుల్‌లో ఇప్పటికీ లభ్యమతున్నాయి. కొన్ని సార్లు గూగుల్‌లొ దేనికోసమో వెతుకుతున్నప్పుడు పాత SCIT పోస్టులు తీగలా తగిలి పాత జ్ఞాపకాల డొంకంతా కదిలించినప్పుడల్లా “జ్ఞాపకాలెప్పుడూ ఒంటరిగా పోవు, నా జీవితం సగాన్ని తీసుకునే పోతాయి!” అన్న చంద్ర కన్నెగంటి కవిత గుర్తొస్తూనే ఉంటుంది.

ఘంటసాల చర్చావేదిక

SCITలో సినీమా, సంగీత, సాహిత్యాల పై ఉత్సాహంగా చర్చలు జరుగుతున్న రోజుల్లో శ్రీధర్ బసవరాజు అనేయువకుడు తాను ఘంటసాల అభిమానని, ఘంటసాల గురించి ఒక ప్రత్యేక చర్చావేదిక ఏర్పాటు చెయ్యలని తన కోరికగా ఉందని SCIT లో ప్రకటించాడు. రెండవ తరం ప్రవాస భారతీయుల్లో ఒకడైన శ్రీధర్, ఘంటసాల గురించి ఇంత అభిమానాన్ని కనపర్చడం చూసి ఎంతో ఆనందపడ్డ శ్రీనివాస్ పరుచూరి, తానే చొరవ తీసుకొని తన మిత్రుడైన రత్నాకర్ శొంఠి చదువుతున్న విస్కాన్సిన్ లిస్ట్ సర్వర్ ద్వారా 1995 ఏప్రిల్‌లో ఘంటసాల మెయిలింగ్ లిస్టుని సృష్టించాడు. నాకు తెలిసినంత వరకు, తెలుగుకు సంబంధించిన విషయాలకు చర్చించుకోవడానికి సృష్టింపబడిన మొట్టమొదటి మెయిలింగ్ లిస్ట్ ఇది. ఈ లిస్టు ఆర్కైవులు కొన్ని ఇప్పటికీ విస్కాన్సిన్ యూనివర్సిటీ ftp సైటులో దొరుకుతాయి. ఈ మెయిలింగ్ లిస్ట్ ఇప్పటికీ యాహూ ద్వారా అప్రతిహతంగా నడుస్తోంది. ghantasala.info సైటు ఈ మెయిలింగ్ లిస్టుకి అనుబంధం.

తెలుసా – తెలుగు సాహిత్యం చర్చావేదిక

“ఇసుక రేణువులో సమస్త విశ్వాన్నీ,
గడ్డి పువ్వులో స్వర్గాన్నీ చూసి,
అరచేతిలో అనంతాన్ని,
ఘడియలో శాశ్వతత్వాన్ని బంధించడం.”

– విలియమ్ బ్లేక్

SCITలో స్పామ్, క్రాస్‌పోస్టుల రణగొణధ్వని ఎక్కువై అర్థవంతమైన చర్చల శాతం తగ్గిపోయిన రోజుల్లో, ఘంటసాల మెయిలింగ్ లిస్ట్ స్ఫూర్తిగా, తెలుగు సాహిత్యానికి సంబంధించిన చర్చలకోసం రామకృష్ణ పిల్లలమఱ్ఱి గారి ఆధ్వర్యంలో తెలుసా ఏర్పడింది. ఘంటసాల లిస్ట్ లాగే, ఇది కూడా విస్కాన్సిన్ యూనివర్సిటీ లిస్ట్ సర్వర్ మీద నడిచేది. అప్పటిదాకా, SCIT లో సినిమాల గురించి, రాజకీయాల గురించి, ఇతరత్రా లోకాభిరామాయణాల గురించి జరిగే చర్చల మధ్య సాహిత్యానికి సంబంధించిన చర్చల్ని వెతుక్కునే సాహితీ ప్రియులకు కేవలం తెలుగు సాహిత్యానికి సంబంధించిన చర్చల కోసమే ఏర్పడిన తెలుసా, అయాచితంగా అందివచ్చిన వరమయ్యింది. ఇరవయ్యొక్క మంది సభ్యులతో ప్రారంభమైన ఈ చర్చావేదిక త్వరలోనే వంద మందికి పైగా కొత్త సభ్యులను చేర్చుకొంది. తెలుగు సాహిత్యంపై చేసే చర్చలు నేరుగా తమ మెయిల్‌ బాక్సులలో రావడంతో ఈ చర్చలలో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది.

స్కిట్ లో ఉన్నప్పుడు సాహిత్యం మీద ఆసక్తి ఉన్నవారందరూ ఒక జట్టుగా మసలినా, సాహిత్యానికి ప్రత్యేకించిన తెలుసా వేదికపై మా మధ్య అభిప్రాయభేదాలు ప్రస్ఫుటంగా పొడచూపాయి. తెలుగు సాహిత్యాభిమానుల్లో సంప్రదాయ కవిత్వం మాత్రమే చర్చించడానికి ఇష్టపడేవారు కొందరైతే, ఆధునిక సాహిత్యం గురించి మాట్లాడని చర్చలన్నీ ఛాందసమని భావించేవారు మరికొందరు. కొంతమంది స్త్రీవాద సాహిత్యానికి అభిమానులైతే, కొంతమంది విరసం సభ్యులు, మరికొందరు సాహిత్యంలో రాజకీయాలు తగవని భావించే వారు. కొంతమందికి ఛందస్సు దాని లక్షణాల వివేచన ముఖ్యమైతే, మరికొందరికి భాషాశాస్త్రం, పదాల వ్యుత్పత్తి మీద ఆసక్తి మెండు. తెలుసా సభ్యులలో కొంతమంది స్వయంగా కవులు, రచయితలు అయినా, చాలా మంది కేవలం సాహితీ ప్రియులు. తెలుగు సాహిత్యంపై ఎన్ని రకాల భిన్నాభిప్రాయలకు తావు ఉందో అన్ని రకాల అభిప్రాయాలు తెలుసా చర్చల్లో వ్యక్తమయ్యేవి. ఇన్ని రకాల అభిప్రాయభేదాలున్నా, సభ్యత వీడకుండా, అద్భుతమైన సమాచారంతో, లోతైన విశ్లేషణతో చర్చలు సాగించడం తెలుసా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.

‘కవిత్వానికి ఛందస్సు అవసరమా?’ అన్న చర్చ మీద తీవ్రస్థాయిలో భేదాభిప్రాయాలు వ్యక్తం అయిన రోజుల్లో, రోజుకు 70కి పైగానే ఈమెయిళ్ళు వచ్చేవి. మార్క్సిజం గుణదోషాల గురించిన చర్చలో ప్రపంచ రాజకీయాల గురించి, హెగెల్, కాంట్ ఫిలాసఫీల గురించి, నియో మార్క్సిజం గురించి, కాపిటలిస్ట్ ఎకానమీల గురించి ఉన్నత స్థాయి చర్చలు జరిగేవి. ప్రబంధ సాహిత్యంలో శృంగారం పై చర్చ ఈస్థటిక్స్, లాక్షణీకుల సాహితీ సిద్ధాంతాలపై చర్చగా మారేది. తెలుగులో విరామ చిహ్నాల పై చర్చ భాషాశాస్త్ర పరమైన పదవిభజన సిద్ధాంతాల విశ్లేషణకు దారి తీసేది. అయితే, యూజ్‌నెట్ చర్చలలో గాడ్విన్ సూత్రం (Godwin’s Law) లాగా, తెలుసాలో ఏ చర్చ అయినా చాలా రోజులు సాగదీస్తే, అది చివరకు శ్రీశ్రీ-విశ్వనాథల మీద చర్చగానో, ఛందో-వచన కవిత్వాల మీద చర్చగానో పరిణామం చెంది ఆగిపోయేది.

తెలుసా ద్వారా ఇస్మాయిల్, స్మైల్, వాడ్రేవు చినవీరభద్రుడు, ఓల్గా, జయప్రభ, శివారెడ్డి, త్రిపుర, కనకప్రసాద్, విన్నకోట రవిశంకర్ వంటి కొంతమంది సమకాలీన రచయితల గురించి నేను తెలుసుకోగలిగాను. కవిగా, కథకుడిగా, వ్యాసకర్తగా ఆధునిక సాహిత్యాన్ని, సంప్రదాయ సాహిత్యాన్ని పరామర్శించి విమర్శించగల కె. వి. ఎస్. రామారావుగారి పరిచయం, శాస్త్రీయ సంగీతం గురించి ఓపిగ్గా, వివరంగా రాసే విష్ణుభొట్ల లక్ష్మన్నగారి పరిచయం తెలుసా ద్వారానే జరిగింది. ‘చేరాత’ల ద్వారా చేకూరి రామారావు గారు సమకాలీన తెలుగు సాహిత్యంలో కొత్తగా వినిపించే కవిత్వపు విభిన్న ధోరణులను, ఆయా కవులను తెలుగు ప్రపంచానికి పరిచయం చేసినట్టే, వేలూరి గారు ‘ఆధునిక కవితా పరిచయం’ అన్న శీర్షికతో వెలువరించిన వ్యాస పరంపర ద్వారా కొత్తగా వచ్చే తెలుగు కవిత్వాన్ని లోతుగా విశ్లేషించి, ఆయా కవులను ఇంటర్నెట్టు ప్రపంచానికి పరిచయం చేసారు.

శ్యామల రావు తాడిగడప, సదానంద, మాధవ్ తురుమెళ్ళ, జెజ్జాల మోహన రావు గార్ల వంటి వారు సంప్రదాయ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ చర్చలు సాగిస్తే, న్యాయపతి శ్రీనివాసరావు, ఉదయ భాస్కర్ నందివాడ, చంద్ర కన్నెగంటి మొదలైన వారు ఆధునిక కవిత్వాన్ని సమీక్షించే వ్యాసాలు రాసేవారు. కథా సాహిత్యం, నవలా సాహిత్యం గురించి జంపాల చౌదరి, నారాయణ స్వామి (నాసీ) శంకగిరి, జగదీష్ బిస, ఆరి సీతారామయ్య మొదలైన వారు తీవ్రంగా చర్చించుకొనేవారు. సాహిత్యానికి సంబంధించిన ఏ ప్రశ్నకైనా ఈ చర్చావేదికలో సమాధానం దొరికేదని ఆ రోజుల్లో అనుకునేవారు. వెల్చేరు నారాయణ రావు, చేకూరి రామారావు, భద్రిరాజు కృష్ణమూర్తి వంటి పండిత విద్వాంసులు కూడా ఈ గ్రూప్ సభ్యులుగా ఉండి అప్పుడప్పుడు చర్చలలో పాల్గొనడం విశేషం. తెలుగు సాహిత్యంలోని చర్చనీయాంశాలన్నింటిపై తెలుసా చర్చావేదికపై ఏదో ఒకరకమైన చర్చ జరిగి ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో! తెలుసా అర్కైవులు భావన సైటులోనూ, యాహూ సైటులోనూ ఇప్పటికీ లభ్యమవుతున్నాయి. ఎంతో విలువైన సాహితీ సమాచారం వున్న ఆర్కైవులు తెలుసావి.

అయితే, అంతవరకూ విస్కాన్సిన్ యూనివర్సిటీ లో విద్యార్థిగా చదువుకుంటున్న రత్నాకర్ శొంఠి 1999లో చదువు పూర్తి చేసుకొని ఆ యూనివర్సిటీ వదలివెళ్ళడంతో తెలుసా మెయిలింగ్ లిస్ట్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా, శ్రీనివాస్ పరుచూరి రచ్చబండ అన్న పేరుతో ఒక యాహూ గ్రూపును సృష్టించాడు. దాదాపు తెలుసా సభ్యులందరూ ఈ రచ్చబండకు తరలి రావడంతో, తెలుసా వారసత్వాన్ని పుచ్చుకున్న చర్చావేదికగా రచ్చబండ ఇప్పటికీ కొనసాగుతోంది.

ఈమాట వ్యవస్థాపక సంపాదక వర్గ సభ్యులు, ప్రస్తుత సంపాదకులు, మరెంతో మంది ఈమాట రచయితలు, పాఠకులు SCIT, తెలుసాల ద్వారా ఒకరికొకరు పరిచయమైన వాళ్ళే. ఈమాట వంటి పత్రికను స్థాపించాలన్న ఆలోచన ఈ వేదికలపై తొలినాళ్ళలో మేము సాగించిన చర్చలలోనే మొలకెత్తిందని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఈమాట పత్రిక ఇన్నేళ్ళుగా మనగలగడానికి కూడా SCIT, తెలుసా, రచ్చబండ సభ్యులందరి సమిష్టి కృషే కారణమని చెప్పక తప్పదు. SCIT, తెలుసా, రచ్చబండ– ఈ మూడూ ఈమాట పత్రికా సౌధానికి కనిపించని పునాదులు.

తెలుగు సాఫ్ట్‌వేర్ చరిత్ర

మొదటినుండీ కంప్యూటర్ టెక్నాలజీ నిర్మాణానికి, ఉపయోగానికి వాడుకున్న భాష ఇంగ్లీష్ భాష. కంప్యూటర్లు ప్రధానంగా అంకెలతో పని చేస్తాయి. ఒక్కో అక్షరానికీ లేదా వర్ణానికీ ఒక్కో సంఖ్యని కేటాయించి నిక్షిప్తం చేసుకొంటాయి. యూనీకోడ్ ప్రవేశానికి పూర్వం భాషలోని అక్షరాలకు సంఖ్యలను కేటాయించడానికి సార్వజనిక ప్రమాణంగా ఉన్న ASCIIలో 128 సంకేత స్థలాలు (code points) మాత్రమే ఉండేవి. ఇంగ్లీష్ భాషకు అవసరమైన అన్ని అక్షరాలు, విరామ చిహ్నాలను పూర్తిగా నిక్షిప్తం చేయడానికే ఈ సంకేత స్థలాలు సరిపోయేవి కాదు. ఆ తరువాత మిగితా యూరోపియన్ భాషలలోని అదనపు అక్షరాలకోసం నిర్మించిన Extended ASCII ప్రమాణాలలో 256 సంకేత స్థలాల వరకూ వాడుకోవచ్చు. ఆ రోజుల్లో ప్రత్యేకమైన టైప్‌సెటింగ్ (Typesetting) సాఫ్ట్‌వేర్ వాడితే గానీ తెలుగు వంటి మిగతా ప్రపంచ భాషలలోని అక్షరాలను నేరుగా చూపించడం సాధ్యమయ్యేది కాదు.

TeluguTeX

కనూత్ నిర్మించిన టెక్ (TeX) టైప్‌సెటింగ్ వ్యవస్థ ఆ రోజుల్లో యూనివర్సిటీలోనూ, పరిశోధనా సంస్థలలోను చాలా విరివిగా వాడేవారు. ఈ టెక్ (TeX) ముద్రణ వ్యవస్థ ఆధారంగా తెలుగు అక్షరాలు, ఒత్తులు, గుణింతాలకు అవసరమైన మెటాఫాంట్(METAFONT) మాక్రోలతో, లాటెక్ (LaTeX)కు పొడిగింపుగా నిర్మించిన తెలుగుటెక్ (TeluguTeX) నాకు తెలిసినంతవరకూ తెలుగు టైప్‌సెటింగ్ చరిత్రలో మొట్టమొదటి కృషి. దీన్ని 1990-1992 లో అయోవా స్టేట్ యూనివర్సిటీ ( Iowa State University) లో చదువుకుంటున్న లక్ష్మీ ముక్కవల్లి, లక్ష్మణ్ కుమార్ ముక్కవల్లి దంపతులు సృష్టించారు.

RIT/ RTS

ముక్కవల్లి దంపతులు సృష్టించిన తెలుగుటెక్ (TeluguTeX) తమ తమ యూనిక్స్ మెషీన్లపై ఇన్‌స్టాల్ చేసుకొని దాన్ని పనిచేసేట్టుగా చేయడం ఎంతటి ప్రోగ్రామర్ కైనా కష్టసాధ్యంగానే ఉండేది. అంతే కాకుండా, ముక్కవల్లి వారు వాడిన ఫోనెటిక్ ఇన్‌పుట్ స్కీమ్ కొంత అసహజంగా, అనియతంగా ఉండేది. వారి ఇన్‌పుట్ స్కీమ్ బదులుగా RTS (Rice Transliteration Standard) అన్న కొత్త స్కీమును తయారు చేసి, తెలుగుటెక్ సాఫ్ట్‌వేర్ ఇన్స్టలేషన్ సులభతరం చేయడానికి అవసరమైన స్క్రిప్టులతో RIT (Rice Inverse Transliterator) అన్న కొత్త సాఫ్ట్‌వేర్ రాసి అందజేసినవారు వారు రామారావు కన్నెగంటి, ఆనంద కిశోర్ ద్వయం. RIT, RTS మొట్టమొదటి వెర్షన్ 1992లో విడుదల అయ్యింది. RTS పద్ధతిని RIT సాఫ్ట్‌వేర్ కోసమే సృష్టించినా, ఈ సాఫ్ట్‌వేర్‌తో సంబంధం లేకుండా తెలుగు మాటల్ని ఇంగ్లీష్ లో రాయడానికి, చదవడానికి వీలుగా ఈ స్కీముని విరివిగా స్కిట్ లోనూ, WETD లోనూ ఉపయోగించడంతో, ఈ పద్ధతి యూజ్‌నెట్లో నిశ్శబ్దంగా అంగీకరింపబడిన ప్రమాణమైపోయింది. తెలుగు భాష మాత్రమే కాకుండా, కన్నడ, సంస్కృతం, ఒక్కోసారి తమిళం రాయటానికి కూడా RTS పద్దతిని పాటించడం ఇతర భారతీయ చర్చవేదికల్లో కనిపించేది.

ప్రాథమిక స్థాయి స్పెల్ చెక్కర్‌తో RIT 2.0 వర్షన్ 1993లో విడుదల అయితే, 1994-95లో జువ్వాడి రమణ, దేశికాచారిగారి తిక్కన ఫాంట్లకు సపోర్ట్ జతకూరుస్తూ దీన్ని పూర్తిగా తిరగ రాసి RIT 3.0 గా విడుదల చేసారు. ఆనంద కిశోర్ గారు, నేను కొంతకాలం స్పెల్ చెక్కర్ మీద పనిచేసి దాన్ని RIT 3.0కు అనుబంధ సాఫ్ట్‌వేర్‌గా జతచేసాము. అయితే, తెలుగు పదాలను విడగొట్టగలిగే మార్ఫలాజికల్ అనలైజర్ (Morphological Analyzer), సరైన నిఘంటువులు లేకుండా చక్కటి తెలుగు స్పెల్ చెక్కర్ నిర్మాణం దుస్సాధ్యమని మా ప్రయత్నాలవల్ల తెలిసింది.

పోతన ఫాంట్లు, సాఫ్ట్‌వేర్

1985 లో తన కావ్యం ‘హనుమప్ప నాయకుడు’ ప్రచురించినపుడు ఆ కావ్యంలో దొర్లిన ముద్రారాక్షసాలు చూడలేక, తన కావ్యాలని తనే టైప్‌సెట్టింగ్ చేసుకోవాలన్న సంకల్పంతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మాకింటాష్ (Macintosh) కంప్యూటరుపై అందమైన తెలుగు ఫాంట్లను కూర్చిన ఘనత దేశికాచారి గారిది. ఆంధ్ర భాగవత కర్త అయిన పోతనపై తనకున్న అభిమానంతో మొదటి ఫాంటుకు ‘పోతన’ అని పేరు పెట్టారీయన. మొట్టమొదటగా 1990 లో బిట్-మాపింగ్ ఫాంట్లుగా కూర్చి, ఆ తరువాత 1993 లో వీటిని పోస్ట్ స్క్రిప్ట్ ఫాంట్లుగా వెలువరించారు. ఈ ఫాంట్లను ఉపయోగిస్తూ తెలుగు టైప్ చెయ్యడానికి వీలుగా పోతన కీబోర్డ్ ను డిజైన్ చేసి, అందుకు తగిన సాఫ్ట్‌వేర్ కూడా తనే స్వయంగా రాసారు. అమెరికాలో నివసించే చాలామంది తొలితరం తెలుగువారు తెలుగులో రాయడానికి ఉపయోగించింది దేశికాచారి గారి పోతనా సాఫ్ట్‌వేరే.

1995లో జంపాల చౌదరిగారి చొరవతో పొందిన తానా ఆర్థిక సాయంతో దేశికాచారి గారు తన పోతన ఫాంటుని పబ్లిక్ డొమైన్‌లో ఉంచడానికి ఒప్పుకున్నారు. పబ్లిక్ డొమైన్ సాఫ్ట్‌వేర్ అయిన RIT 1994 దాకా ముక్కవల్లి ఫాంట్లమీదే ఆధారపడింది. 1995లో, పోతన ఫాంట్లకు ISO ప్రమాణాల స్థాయికై తగువిధంగా మార్పులు చేసిన రమణ జువ్వాడి , వీటిని ‘తిక్కన ఫాంట్స్’ అన్న పేరుతో RIT 3.0 తో పాటు పబ్లిక్ డొమైన్ లోకి 1995లో విడుదల చేసారు. ఆ తరువాతి కాలంలో చోడవరపు ప్రసాద్, రమణ జువ్వాడితో కలిసి వెబ్ లో వాడకానికి అణుగుణంగా ఈ ఫాంట్లకు మరికొన్ని మార్పులు చేసారు. 1998 లో ఈమాట తొలిసంచిక నుండీ 2004 దాకా ఈమాట పత్రిక ప్రచురణ పూర్తిగా తిక్కన ఫాంట్ల సాయంతోనే జరిగింది.

ఇవే కాక, ఆ రోజుల్లో భారతదేశంలో కమర్షియల్ ప్రచురణా సంస్థల నుండి రచన, అను, విజన్, ప్రభుత్వ సంస్థ అయిన C-DAC తయారు చేసిన LEAP ఆఫీస్ సాఫ్ట్‌వేర్లు కూడా లభ్యమౌతూ ఉండేవి. ఇవన్నీ వెబ్ అంతగా ప్రాచుర్యం పొందక ముందు జరిగిన తెలుగు సాఫ్ట్‌వేర్ ప్రయత్నాలు.

World Wide Web (విశ్వ వ్యాప్త వాగురం) ఆవిర్భావం

Gopher, WAIS

1993 దాకా ఇంటర్నెట్టుకు టెల్‌నెట్ (telnet), ఎఫ్.టీ.పీ.(ftp), యూజ్‌నెట్లు ప్రధానాంగాలు. అయితే ఎంతో వేగంగా విస్తరిస్తూ ఇంటర్నెట్టు 1990 నాటికే కేటలాగుల్లేని ఒక మహా గ్రంథాలయంలా తయారయ్యింది. మనకు కావల్సిన సమాచారం ఏ సైటులో ఉంటుందో, ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఈ సమస్యను తీర్చడానికి యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా వారు గోఫర్ (Gopher) అన్న ప్రోగ్రాంని తయారు చేసారు. ఇంటర్నెట్టుకు కనెక్ట్ అయిన ఏ మెషీన్ నుండైనా ఈ ప్రోగ్రాంని రన్ చేస్తే తన చుట్టుపక్కల ఉన్న సర్వర్లలో ఉన్న సమాచారాన్ని వెతికి వాటిని మెన్యూలుగా చూపెడుతుంది. ఒక మెన్యూని సెలక్ట్ చేసుకొని పక్క సైటుకు వెళ్తే, ఆ సైటులోని సమాచారం, ఆ చుట్టుపక్కల సైట్లలోని సమాచారం మళ్ళీ మెన్యూలుగా కనబడతాయి. ఇలా మనకు కావల్సిన సమాచారం దొరికేంతవరకూ, ఒక మెన్యూ నుండి ఇంకో మెన్యులోకి దూకుతూ ఇంటర్నెట్టంతా విహారం చెయ్యవచ్చు.

మెన్యూల ద్వారా కాకుండా, నేటి సర్చ్ ఇంజన్లలాగా మనకు కావల్సిన సమాచారాన్ని కీలక పదాల ఆధారంగా వెతకడానికి కేంబ్రిడ్జ్ లో ఉండే Thinking Machines సంస్థ వారు WAIS అన్న ప్రోగ్రామును తయారు చేసారు. 1990వ దశాబ్దపు తొలి రోజుల్లో Gopher, WAIS, రెండు జంట సాధనాలుగా ఆ రోజుల్లో నేటి వెబ్ సైట్లు అందించే సమాచారాన్ని ప్రాథమిక స్థాయిలో అందించేవి. వెబ్ పుట్టుక తరువాత వీటి వాడకం పూర్తిగా తగ్గిపోయి, 1995 కల్లా ఈ సాధనాలు రెండూ లుప్తమైపోయాయి.

వెబ్ సృష్టి

ఇప్పుడు మనం వాడుతున్న వెబ్ ప్రపంచాన్ని 50 యేళ్ళ క్రితమే ఊహించి, వెబ్ పేజీలలో ఉపయోగించే హైపర్‌లింకులతో కూడిన హైపర్‌టెక్స్ట్‌ని మొట్టమొదటగా ప్రతిపాదించిన ఘనత వానీవర్ బుష్ (Vannevar Bush)కే చెందాలి. మనం భవిష్యత్తులో సాధించగల విషయాలపై తన ఆలోచనల్ని ప్రకటిస్తూ 1945 లో అట్లాంటిక్ మంత్లీ పత్రికలో ‘As We May Think‘ అన్న వ్యాసం రాసారీయన. ఈనాడు అధునాతన ఐటీ టెక్నాలజీగా భావించే పర్సనల్ కంప్యూటర్లు, హైపర్లింకులు, సర్చ్ ఇంజన్ల గురించి ఆయన ఆ వ్యాసంలో ఆనాడే ఊహించగలగడం ఆశ్చకరమైన విషయమే. వానీవర్ బుష్ ఊహించిన హైపర్‌టెక్స్ట్‌ని సాధించడానికి 1980 దశాబ్దంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. 1987లో ఆపిల్ సంస్థ (Apple) వారు తయారు చేసిన HyperCard అన్న ప్రోగ్రాము, టెడ్ నెల్సన్ (Ted Nelson) నిర్మించిన Xanadu ప్రాజక్ట్ ఈ ప్రయత్నాలలో చెప్పుకోదగ్గవి.

అయితే, ఇప్పుడు ఇంటర్నెట్టుకు పర్యాయపదమైపోయిన నేటికాలపు వెబ్‌కి అంకురార్పణ జరిగింది స్విస్-ఫ్రెంచ్ సరిహద్దు ప్రాంతాలలో ఉన్నయూరోపియన్ హై ఎనర్జీ ఫిజిక్స్ లాబొరేటరీ, CERNలో. అందులో పని చేస్తున్న టిమ్ బెర్నర్స్-లీ నేడు మనం ఉపయోగిస్తున్న HTTP ప్రోటోకాల్ని, HTML భాషని, సైట్లను గుర్తించే URL పద్ధతిని 1990లో సృష్టించాడు. తన సహోద్యోగి అయిన రాబర్ట్ కేలో తో కలిసి CERN టెలీఫోన్ డైరక్టరీని చూపించే వెబ్ పేజీని మొదటి వెబ్ ప్రాజక్టుగా నిర్మించాడు. మొదట్లో CERNకే పరిమితమైన ఈ కొత్త వెబ్ ప్రపంచం గురించి టిమ్ బెర్నర్స్-లీ ఆగస్ట్ 1991 న alt.hypertext గ్రూప్‌లో పోస్ట్ చెయ్యడంతో ఇంటర్నెట్ లో కలకలం సృష్టించింది. ఇంటర్నెట్ సంబంధించిన అన్ని కంప్యూటర్ కాన్ఫరెన్సులలో ఇది చర్చనీయాంశమయ్యింది. అమెరికా లోని విశ్వవిద్యాలయాలలో, పరిశోధనా సంస్థలలో ప్రాథమిక స్థాయి వెబ్ సైట్ల నిర్మాణం మొదలయ్యింది. ఈ వెబ్ సైట్ల నిర్మాణంలో ఎదురయ్యే సాధక బాధకాల గురించి చర్చించడానికి comp.infosystems.www అన్న యూజ్‌నెట్ న్యూస్‌గ్రూప్ కూడా ప్రారంభమయ్యింది. అయితే, తొలి వెబ్ బ్రౌజర్ అయిన లిన్క్స్(Lynx) టెక్స్టు మాత్రమే చూపగలిగేది. అంతేకాక, మొట్టమొదట్లో నిర్మించిన వెబ్ సైట్లన్నీ, మెన్యూలుగానూ, మెన్యూల మెన్యూలుగానో ఉండి అప్పటికే ప్రాచుర్యం చెందిన గోఫర్ సైట్లకు ఏ మాత్రం మించిపోనివనిపించేవి. ఆ కారణం వల్లనేమో ఈ వెబ్ సైట్లు మొదట్లో అంతగా ప్రజాదరణ పొందలేదు.

గ్రాఫికల్ వెబ్ బ్రౌజర్

ఇదే రోజుల్లో అమెరికన్ కాంగ్రెస్ చేసిన ఒక తీర్మానం వెబ్ టెక్నాలజీ ప్రగతిని అనూహ్యమైన రీతిలో ప్రభావితం చేసింది. 1992లో ఇంటర్నెట్టును వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడానికి అనుమతిస్తూ అమెరికన్ కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని జారీ చేసింది. ఆల్ గోర్ (Al Gore) తాను సెనేటర్ గా ఉన్నప్పుడు 1991లో ప్రతిపాదించిన ‘National Information Infrastructure’ బిల్లు ఈ ప్రైవెటీకరణకు కారణమని చెప్పక తప్పదు. ఇంటర్నెట్టుకు వెన్నెముక అనదగ్గ NSFNET యొక్క ప్రైవేటీకరణ కూడా ఆ సంవత్సరమే మొదలయ్యింది. ఈ తీర్మానాల ఫలితంగా, తొలినుండి లాభాపేక్ష లేని పరిశోధనా, విద్యా, వైజ్ఞానిక రంగాలకు మాత్రమే పరిమితమైన ఇంటర్నెట్టు, 1993 నుండి వాణిజ్య రంగంలో జరిపే లావాదేవీల కోసం, ఇతర వాణిజ్య కార్యకలాపాల కోసం వాడడం మొదలయ్యింది.

గోర్ బిల్లు ద్వారా పొందిన ఆర్థిక సాయంతో 1992-93 లలో NCSA (National Center for Supercomputing Applications)కు పనిచేసే మార్క్ ఆండ్రీసన్ (Mark Andreesen) మొజాయిక్ (Mosaic) అన్న పేరుగల ఒక గ్రాఫికల్ బ్రౌజర్ ను నిర్మించాడు. వచనాన్ని బొమ్మలతోను, లింకులతోను కలిపి చూపించగలిగే ఈ బ్రౌజర్ నిర్మాణం తరువాతనే World Wide Web యొక్క శక్తి సామర్థ్యాలు లోకం అంతా వెల్లడి అయ్యాయి. ఆ సంవత్సరమే, ఇమ్మడి ముమ్మడిగా ప్రపంచమంతా వెబ్ సైట్ల నిర్మాణాలు మొదలయ్యాయి. అప్పటివరకూ ఇంటర్నెట్టుకు ఉపాంగాలకు ఉన్న ftp, gopher, WAIS వంటి ఇతర సాధనాల స్థానాన్ని వెబ్ పూర్తిగా ఆక్రమించింది. విద్యా, విజ్ఞాన సంస్థలే కాక ప్రైవేట్ సంస్థలు కూడా ఈ టెక్నాలజీ ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవడం మొదలు పెట్టడంతో కనీవిని ఎరుగని రీతిలో ఈ కొత్త టెక్నాలజీ అభివృద్ధి చెందింది. అనతికాలంలోనే, ఇంటర్నెట్టు అంటేనే వెబ్, వెబ్ అంటేనే ఇంటర్నెట్టు అన్నంతగా ఎదిగి ఈ వెబ్ టెక్నాలజీ ప్రపంచం అంతటా వేగంగా విస్తరించడం, కంప్యూటింగ్ చరిత్రలో నవశకానికి నాంది పలికింది.

(1999లో గోర్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పుడు, CNNకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తానే ఇంటర్నెట్టును కనుకున్నానని చెప్పినట్టుగా పత్రికలు ప్రకటించడం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. నిజానికి ఆ ఇంటర్వ్యూలో గోర్ చెప్పిన వాక్యం ఇది: “During my service in the United States Congress, I took the initiative in creating the Internet.” ఈ వాక్యంలో creating the Internet అని కాకుండా opening up the Internet అనో లేదా privatization of the Internet అనో చెప్పి వుంటే అంతగా నవ్వులపాలయ్యే వాడు కాదేమో).

వెబ్ ప్రపంచంలో తెలుగు

1994లో మొదలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ హోం పేజ్ సైటు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వెబ్ సైట్లలో మొట్టమొదటిదని చెప్పవచ్చు. దీనిని పద్మ ఇంగ్రగంటి గారి సహాయంతో జార్జ్ మేసన్ యూనివర్సిటీలో చదివే శ్రీనివాస్ సవరం, ఒక్లొహోమా లో చదివే సుజాత నీలం మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ప్రాథమిక వివరాలు(భౌగోళిక, రాజకీయ, సాంస్కృతిక వగైరా) ఇందులో పొందు పరచారు. క్లిక్ చేయగలిగే ఆంధ్రప్రదేశ్ పటం అప్పట్లో ఈ సైటు ప్రత్యేకత. సుజాత, శ్రీనివాస్ లిద్దరూ చదువు ముగించుకుని వెళ్ళిపోవడంతో ఈ సైటు ఒక సంవత్సరం మించి నడవలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్ సైటు తరవాత మరొక దశాబ్దానికి కానీ మొదలవలేదు.

తెలుగు లిటరరి హోం పేజ్

SCIT లో ప్రముఖ రచయితల రచనలు సేకరించి, ఒక్కచోట ఉంచాలన్న ప్రయత్నంతో నేను, పద్మ ఇంద్రగంటిగారు కలిసి 1994-95 సంవత్సరాలలో నిర్మించిన మొట్టమొదటి తెలుగు వెబ్ సైట్ ఇది. అప్పటికే, వెబ్ సైట్ నిర్మాణంలో మెళకువలు తెలుసుకున్న పద్మతో కలిసి పనిచేయటంతో, నాకు ఈ వెబ్ సైటు నిర్మించడం తేలికయ్యింది. SCIT రచనలే కాకుండా, తెలుగు భాషా చరిత్ర, తెలుగు సాహితీకారుల జీవిత చరిత్రలు, సాహితీ గ్రంథాలు, ఆంగ్ల అనువాదాలతో దీనిని ఒక సాహితీ విజ్ఞాన సర్వస్వంగా రూపుదిద్దాలని ఆ రోజుల్లో మా సంకల్పం. మొదట్లో, turnpike.net అన్న చోట ప్రారంభించి, వారిచ్చే డిస్క్ స్పేసు సరిపోకపోవడంతో దీన్ని బౌలింగ్ గ్రీన్ యూనివర్సిటీకి మార్చాము. ఈ వెబ్సైట్ మేము బౌలింగ్ గ్రీన్ యూనివర్సిటీకి మార్చిన కొద్ది రోజులకే ప్రొఫెసర్ కె. వి. రావుగారు దీన్ని సొంతం చేసుకోవడంతో ఆ వెబ్ సైట్ పైన తిరిగి మళ్ళీ పనిచెయ్యలేకపోయాం.(1995 లో ఈ సైట్ ప్రతిరూపాన్ని మా ఆర్కయివుల్లో చూడవచ్చు).

lekha.org

వెబ్ ఆవిర్భావానికి పూర్వం లాటెక్(laTeX), పేజిమేకర్ వంటి టైప్‌సెట్టింగ్ సాఫ్ట్‌వేర్ లోనూ ప్రింట్ చేసువోవడానికి వీలుగా తయారు చేసే పోస్ట్‌ స్క్రిప్ట్ ఫైల్లో మాత్రమే తెలుగు వాచకం కనబడేది. RIT సాఫ్ట్‌వేర్ వాడాలంటే, లాటెక్ సాఫ్ట్‌వేర్ ఉన్న యూనిక్స్ మెషీన్ తప్పనిసరి. వెబ్‌లో వాడకానికి అనుకూలంగా తెలుగు సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసి, ఆ పద్ధతిని భారతీయ భాషలన్నింటికి వర్తింపజేయాలన్న సంకల్పంతో రమణ జువ్వాడి 1996 లో lekha.org స్థాపించాడు. ఆ రోజుల్లో, తెలుగు సాఫ్ట్‌వేర్ మీద పనిచెయ్యాలనుకునే మా వంటి ఔత్సాహికులందరికీ, లేఖ (lekha.org) కేంద్ర స్థలంగా మారింది. DOS, Macintosh మెషీన్లపై పనిచేసేటట్టుగా RIT సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసాం. వెబ్‌లో వాడకానికి అనుకూలంగా తిక్కన ఫాంట్లు తయారయ్యాక నేరుగా వెబ్పేజీలు తయారుచెయ్యడానికి లేఖ సాఫ్ట్‌వేర్లో మార్పులు చేసాం. RTS లిప్యంతరీకరణ పద్ధతిని భారతీయ భాషలన్నింటికి పనికివచ్చే విధంగా విస్తరించి ISC అనే కొత్త స్కీమ్ ప్రతిపాదించిన వారు రమణ, అతని మిత్రుడు అరుణ్ గుప్తా. వారు ఆ రోజుల్లోనే, రెండవ సంతతి ప్రవాస భారతీయులు చడవడానికి వీలుగా డయాక్రిటిక్స్‌తో తెలుగు వాచకాన్ని చూపించడానికి వీలుగా Lekha Transliteration Scheme (LTS) కూడా ప్రతిపాదించారు. SCIT ఆటో-మాడరేషన్ కోసం, తెలుసా చర్చావేదికలోని చర్చలను నేను రాసిన ఒక ప్రోగ్రామ్ ద్వారా తెలుగులోకి తర్జుమా చేసి ఆర్కైవ్ చెయ్యడానికి కూడా lekha.org పనికి వచ్చింది (ఆ రోజుల్లో http://telusa.lekha.org ద్వారా తెలుసా ఈమెయిళ్ళు నేరుగా తెలుగులో చదవడానికి, రాయడానికి వీలుండేది). ఈమాట పత్రిక కూడా 2002 జనవరి దాకా eemaata.lekha.org అన్న అడ్రస్‌తో lekha.org నుండే వెలువడేదని ఈమాట పత్రికను తొలినుండి చదువుతున్న పాఠకులకు తెలుసు.

రంగవల్లి / రంగవల్లిక

DOS/Windows, యూనిక్స్, మాకింటాష్ వంటి మెషీన్లన్నింటిపై పనిచేసే జావా (Java) టెక్నాలజీని 1995 లో ప్రకటించడం ఒక కొత్త శకానికి నాంది. ఆ జావా టెక్నాలజీని వాడుతూ ‘రంగవల్లి’ అన్న పేరుతో తెలుగు సాఫ్ట్‌వేర్ నిర్మించిన ఘనత చోడవరపు ప్రసాద్ కు దక్కుతుంది. తరువాత, ఇదే సాఫ్ట్‌వేర్ కు కొన్ని మార్పులు చేసి, Netscape Composer కు ప్లగ్ఇన్‌గానూ, ‘మేఘసందేశం’ అన్న పేరుతో ఈమెయిల్ కంపోజర్ గానూ నిర్మించాడు. ఏ సాఫ్ట్‌వేర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా వెబ్ ద్వారా తెలుగు లోకి తర్జుమా చేసే ‘రంగవల్లిక‘ ఆ రోజుల్లో అమిత ప్రాచుర్యం పొందింది.

లేఖ, రంగవల్లి మాత్రమే కాక ఆ రోజుల్లో తెలుగు లిపిలో రాయడానికి పబ్లిక్ డొమైన్లో జరిగిన మరో మంచి కృషి శ్రీనివాస్ సిరిగిన తయారు చేసిన తెలుగు లిపి.

తొలితరం తెలుగు వెబ్‌సైట్లు

కుమార్ అంపని, మధుసూదన్ ఓరుగంటి నిర్వహణలో 1996లో ప్రారంభమైన ‘తెలుగు వాణి‘ మొట్టమొదటి తెలుగు వెబ్ చర్చావేదిక అని చెప్పవచ్చు. ఈ చర్చావేదికల్లో అంత్యాక్షరి ఫోరం ఆ రోజుల్లో అమిత ప్రజాదరణ పొందింది. శ్రీనివాస్ పరుచూరి సాయంతో శ్రీకాంత్ బండి తెలుగు సినిమా సమాచారాన్ని అందజేసే Telugu Film Serverని 1996లో ఆవిష్కరించారు. (1998 తరువాత దీనిని lekha.org కు తరలించారు). సిటి కేబుల్‌వారు రవి ప్రకాశ్ నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ వార్తల్ని అందించే మొదటి తెలుగు పోర్టల్‌ని తీసుకువచ్చారు. ఆ తరువాత కొన్ని తెలుగు వార్తా పత్రికలు తమ పత్రికలకు వెబ్ ఎడిషన్లు మొదలు పెట్టాయి. ఇంగ్లీషులో ఉండే తెలుగు సినిమాల పోర్టళ్ళు, పాటల వెబ్‌సైట్లు, తెలుగు సాంస్కృతిక, సాహితీ సంస్థల వెబ్‌సైట్లు కొన్ని సృష్టించబడ్డాయి. డాట్.కాం. బూమ్ ఉచ్ఛ దశలో ఉన్నప్పుడు తెలుగుకథ కోసం ప్రత్యేకించి ప్రముఖ కథకుడు ఆర్. ఉమామహేశ్వరరావు సంపాదకత్వంలో ఒక సైట్ నడిచింది. కానీ, అది కొద్దికాలానికే మూతపడింది. ఇంకా అప్పట్లో నిహార్ ఆన్ లైన్, ఇండియాఇన్ఫో లాంటి సైట్లలో వేమన వసంతలక్ష్మి (ప్రస్తుతం ఆంధ్రజ్యోతి లో) ఖదీర్‌బాబు (ప్రస్తుతం సాక్షి పత్రికలో) లాంటివాళ్ళు పనిచేసినప్పుడు సాహితీపరమైన వ్యాసాలకి కొంచెం ప్రాముఖ్యత నిచ్చారు. తెలుగు సాహిత్యం గురించి అరుదైన సమాచారాన్ని అందించే అడ్లూరి శేషుమాధవ రావు తెలుగు భాషా సాహిత్యం సైట్, వాడపల్లి శేషతల్పసాయి నిర్మించిన ఆంధ్రభారతిసైట్ తప్పకుండా చెప్పుకోవలసిన ప్రయత్నాలు. వీటిలో శేషుమాధవ రావు గారి సైటులో చాలా కాలం నించీ కొత్త సమాచారమేమీ లేకపోయినా ఇంకా కొనసాగుతోంది. ఆంధ్రభారతి సైటు సంప్రదాయ సంగీత సాహిత్యానికీ భాండాగారంగా కొనసాగుతోంది.

యూనీకోడ్ విప్లవం

తొలితరం తెలుగు సైట్లలో చాలా తక్కువ సైట్లు మాత్రమే తెలుగు లిపిని ఉపయోగించేవి. తెలుగు లిపిని వెబ్ పేజీలలో చూపించడానికి ప్రామాణికమైన పద్ధతి లేకపోవడం, తెలుగులిపిని బొమ్మల రూపంలో చూపే సైట్లు నడపడానికి కష్టం కావడంతో అవి తొందరగా మూతపడేవి. తెలుగు వంటి ఆంగ్లేతర భాషల/లిపుల కోసం ప్రత్యేకంగా సంకేత స్థలాలను కేటాయించే యూనికోడ్ ప్రమాణం (Unicode) 1991 నుండే అభివృద్ధి చెందినా, దానిని సమర్థించే (support) నిర్వహణా వ్యవస్థ (Operating System) లేకపోవడంతో 2003 వరకు యూనికోడ్ ప్రమాణాన్ని తెలుగు కోసం వాడుకోనే వీలు లేకపోయింది. కానీ, తెలుగు లిపిని కంప్యూటర్ తెరపై చూపడానికి, టైపు చెయ్యడానికి అవసరమైన వ్యవస్థను, వనరులను 2003లో Microsoft XP ఆపరేటింగ్ సిస్టమ్ లోనే పొందుపరచడంతో కంప్యూటర్లపై తెలుగు రాయడం, చదవడం ఎన్నడు లేనంతగా సుళువయ్యింది.

తెలుగు యూనీకోడ్ వాడకానికి, తెలుగులో ఈమెయిళ్ళు రాసుకోవడానికి, తెలుగు లిపిని ఉపయోగించి వెబ్‌సైట్లను నిర్మించడానికి, తెలుగు చర్చావేదికలకు, ఇంటర్నెట్టులోనే వెతకగలిగే తెలుగు డిక్షనరీల నిర్మాణానికి యూనీకోడ్ సరికొత్త ద్వారాలను తెరిచింది. యూనికోడ్ టెక్నాలజీతో పాటు, Web 2.0 ఇంటరాక్టివ్ ఫీచర్లు అందరికీ అందుబాటులోకి రావడంతో, తెలుగు బ్లాగులు, కొత్త తరం తెలుగు పత్రికలు, తెలుగు వికీపీడియా వంటి బృహత్తర ప్రాజెక్టులకు మార్గం సుగమమయ్యింది. 2004 లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్‌లో తెలుగు టైపు చేయడానికి నేను రాసిన IE Telugu Extension, దాని స్ఫూర్తిగా నాగార్జున వెన్న నిర్మించిన పద్మ సాఫ్ట్‌వేర్, దాని ఆధారంగా వీవెన్ నిర్మించిన లేఖిని వంటి పరికరాల సహాయంతో కంప్యూటర్లపై తెలుగు రాయడం సులభమైపోయింది. యూనికోడ్ లో రాయడానికే కాక, నాన్-యూనికోడ్ ఫాంట్లనుండి ఎన్నో భారతీయ భాషల వెబ్ సైట్లను, ఎన్నో ఫాంట్లను యూనికోడ్ లోకి తర్జుమా చేసే సాధనంగా నాగార్జున వెన్న సృష్టించిన పద్మ సాఫ్ట్‌వేర్ చాలా గొప్ప కృషి. రామారావు కన్నెగంటి, నేను కలిపి నడిపిన డిజిటల్ తెలుగు చర్చావేదిక మొదట్లో యూనికోడ్ ప్రచారానికి ఎంతో ఉపయోగపడింది. యూనికోడ్ ప్రమాణానికి అప్పటివరకూ అందులో లేని 14 తెలుగు అక్షరాలను జత చేయడానికి కూడా ఈ చర్చావేదికే సాధనంగా పనికి వచ్చింది. కంప్యూటర్లో తెలుగు లిపిలో రాయడం గురించి వీవెన్, కిరణ్ కుమార్ చావాల వంటి వారి కృషి ఫలితంగానే తెలుగు బ్లాగుల గురించి ఎనలేని ప్రచారం జరిగి, ఎన్నో కొత్త తెలుగు బ్లాగులు పుట్టుకొచ్చాయి. తెలుగును విస్తృతంగా వాడటం మొదలుపెడితే కానీ సమాచార విప్లవ ఫలితాల్ని తెలుగులో పూర్తిగా అనుభవించలేమని గుర్తించిన కొత్త తరం యువకులు, తెలుగు సాంకేతిక అభివృద్ధి కోసం, కంప్యూటర్లో తెలుగు గురించి ప్రాచరం చెయ్యడం కోసం e-తెలుగు అన్న సంస్థను స్థాపించి దీన్ని ఒక ఉద్యమంగా నడిపిస్తున్నారు.

ఈమాట పుట్టుక

రక్త ప్రసరణము లేని శరీరము ఎట్లు మరణావస్థ నొందునో,
అట్లే భావసంచారము లేని సంఘము నిర్జీవ స్థితి గాంచును.

– గూడూరి నమశ్శివాయ (తెలుగు పత్రికల గురించి మాట్లాడుతూ)

1997-98 ప్రాంతాలలో అమెరికాలో నివసించే తెలుగు సాహితీ ప్రియులు గుర్తుంచుకునే సంఘటనలు రెండున్నాయి. మొదటిది, 1997 లో తానావారు నవలల పోటీ పెట్టి బహుమతిగా లక్ష రూపాయలను ప్రకటించడం. నాకు తెలిసి అంతకు పూర్వం ఆటా, తానా సంస్థలు కథల, నవలల పోటీలు నిర్వహించినా బహుమతి సొమ్మెప్పుడూ పదివేల రూపాయలను మించలేదు. మురళి చందూరి, జంపాల చౌదరిల ఆధ్వర్యంలో లక్ష రూపాయల బహుమానంతో ప్రకటించిన నవలల పోటీ అటు ఆంధ్ర దేశంలోనూ, ఇటు అమెరికాలోనూ సంచలనం సృష్టించింది; “అయ్యబాబోయ్‌ లక్షరూపాయలే” అంటూ అందరి చేతా అనిపించింది. బహుమతి పొందిన చంద్రలత నవల ‘రేగడి విత్తులు’ కూడా అందరి ప్రశంసలు పొందింది. అప్పటిదాకా కమర్షియల్ నవలల ఉధృతితో మంచి తెలుగు నవలకు కాలం చెల్లిందని అనుకునే వారు కూడా ఈ లక్ష రూపాయల బహుమతి స్ఫూర్తిగా మళ్ళీ కొన్ని మంచి నవలలు వచ్చే సూచనలు కనబడుతున్నాయని హర్షం వెలిబుచ్చారు. అమెరికాలో ఉంటూ కూడా తెలుగు సాహిత్యగతిని కొంతైనా ప్రభావితం చేయవచ్చునని ఈ పోటీలు మా అందరిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాయని చెప్పవచ్చు.

రెండవది 1998 మే లో అట్లాంటాలో జరిగిన వంగూరి సాహితీ సదస్సు. అప్పటిదాకా యూజ్‌నెట్, తెలుసా వంటి అభౌతిక చర్చావేదికల్లో పరిచయమై స్నేహితులుగా మారిన సాహితీ మిత్రులందరినీ ఈ సదస్సుల మూలంగా ముఖాముఖిగా ఒక్కచోట కలుసుకోవడం మాలో చాలా మందికి ఒక మరపురాని అనుభూతి. అంతకు పూర్వం మందపాటి సత్యం, వంగూరి చిట్టెన్రాజు తో కలిసి ఆస్టిన్లో నిర్వహించిన టెక్సస్ ప్రాంతీయ సాహితీ సదస్సుకూడా టెక్సాస్ లో నివసిస్తున్న సాహితీ ప్రియులను, రచయితలను కలిపే వేదికగా పనికివచ్చింది.

ఈ రెండు సంఘటనలు మమ్మల్ని చర్చలను దాటి ఇంకా పెద్ద ప్రాజెక్టుల గురించి తలపెట్టడానికి స్ఫూర్తిగా పనికి వచ్చాయి. 1998 మే, జూన్‌ నెలల్లో కె. వి. ఎస్. రామారావు, కనకప్రసాద్‌, విష్ణుభొట్ల లక్ష్మన్న, కొంపెల్ల భాస్కర్‌, నేనూ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సస్‌, ఆస్టిన్‌ ఆవరణలో ప్రశాంతంగా ఉండే ఓ చర్చ్‌ పార్కింగ్‌ లాట్‌లో కలిసి లంచ్‌ చేస్తూ సాహిత్యం సంగతులు ముచ్చటించుకునే వాళ్ళం . SCIT, తెలుసా వంటి చర్చావేదికల్లో చర్చకు ఉన్నంత ప్రాధాన్యత కొత్త రచనలకు లేదని, అందువల్ల ఇక్కడ తెలుగులో రాసే రచయితలకు తమ రచనలు ప్రచురించటానికి ఇండియాలోని పత్రికలు తప్ప మరో చెప్పుకోదగ్గ మార్గాలు లేకపోవడం ఒక పెద్ద లోపమని చర్చించుకొనే వాళ్ళం. తెలుగుదేశంలో భారతి వంటి ఉత్తమ స్థాయి పత్రికలు మూతబడడానికి కారణం ముద్రణాభారం భరించలేకపోవడమేనని, కొత్త టెక్నాలజీని సరిగా ఉపయోగించుకుంటే ఆర్థిక సమస్యలు లేకుండా ఉన్నత ప్రమాణాలతో ఎలక్ట్రానిక్ పత్రికలను నడుపవచ్చునని అనుకునేవాళ్ళం. మనమే ఓ ఎలెక్ట్రానిక్‌ పత్రిక మొదలెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనను ఉత్సాహంగా ప్రతిపాదించిన వారు కె. వి. ఎస్. రామారావు. ఆ తరువాత, లక్ష్మన్న, భాస్కర్, నేను ఈ విషయం గురించి కె. వి. ఎస్. రామారావుగారి ఇంట్లో రెండు మూడు వారాంతాలు కలిసి చర్చించాం. ముందుగా కొందరు పరిచితులైన అనుభవజ్ఞుల అభిప్రాయాల కోసం వారిని సంప్రదించాం. దాదాపుగా అందరూ ఉత్సాహం చూపించారు; జాగ్రత్తలుచెప్పి ముందుకు సాగండని ప్రోత్సహించారు. డైనమిక్ ఫాంట్ వాడమని సలహా ఇచ్చి, దాని గురించిన సమాచారాన్ని అందించిన వారు రామారావు కన్నెగంటి.

1998 విజయదశమికి ఈమాట మొదటి సంచిక వెలువడింది. అయితే, ఆస్టిన్ నుండి అట్లాంటాకు ప్రతి వారాంతంలో నేను తిరుగుతూ ఉండడం వల్ల, డైనమిక్ ఫాంట్ టెక్నాలజీతో వెబ్‌సైట్ తయారు చేయడంలో జాప్యం జరిగింది. అందుకని, 1998 విజయదశమి రోజు నాడు ఈమాట తొలి సంచికను ఇమేజీలతో ప్రచురించబడింది. ప్రసాద్ చోడవరపు అందించిన సాయంతో తిక్కన డైనమిక్ ఫాంట్లు తయారు చేసి తొలిసంచికను eemaata.lekha.org సైట్ నుండి ముందు అనుకున్న విధంగానే డైనమిక్ ఫాంట్ టెక్నాలజీతో దీపావళి నాటికి తిరిగి వెలువరించాం.

1999 పూర్వార్ధంలో ఏదో యూనివర్సిటీ పని మీద వెల్చేరు నారాయణ రావుగారు ఆస్టిన్ రావడం తటస్థించింది. మా పత్రిక నిర్వాహణ గురించి ఆయనతో చర్చించడానికి మాకు ఈ పర్యటన బాగా పనికివచ్చింది. వాదాలతో, నినాదాలతో, సిద్ధాంతపు పడికట్టు మాటలతో, పద్యం ఎలా కట్టాలో తెలియని రోకలిబండ వచనపద్యాలతో తెలుగుభాష విసిగిపోయిందని, ఏదో ఒక పురోగమన దృక్పథం వుంటే చాలు కవిత్వం అయిపోతుందనే దృష్టి ఏర్పడిందనీ చెబుతూ, దేశం వదిలి రావడం వల్ల మనకు కలిగిన ఎడబాటు, మనలో ఒక స్వతంత్రతకీ, ధైర్యానికీ, ఒక కొత్త అనుభవాన్ని చెప్పడానికీ, కావలసిన మాటలు ఏరుకోడానికీ అవకాశం ఇచ్చిందని, ఈ వాతావరణాన్ని సరిగ్గా వినియోగించుకుంటే, కొన్ని కొత్త ఆలోచనలు, కొత్త విమర్శాప్రమాణాలూ, కొత్త సాహితీ ధోరణులు (genres) ఏర్పడడానికి మా పత్రిక దోహదం చేయగలదననీ వెల్చేరు వివరించారు. మేము అప్పటికే పాటిస్తున్న పీర్ రివ్యూ పద్ధతిని ప్రశంసిస్తూ, భావకవిత్వం రోజుల్లో కవులు ఒకరి పద్యాలు ఇంకొకరికి చూపించుకొని ఆ పద్యాలను మెరుగు పెట్టడానికి సలహాలు పొందేవారని, అది వారికి ఆ కాలంలో సమవుజ్జీ సమీక్ష (Peer Review) గా పనికివచ్చిందని చెప్పారు. మా ప్రయత్నాలకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం మాకు కొండంత బలానిచ్చినట్టనిపించింది.

ఈమాట విలువలు, సంప్రదాయాలు

సంపాదకుని విధులు

గతం పరిశోధించుకునీ, వర్తమానం సమన్వయించుకునీ, భవిష్యత్తు నిర్ధారణగా రూపించుకోవడమూ, అందుకు తగ్గ ఒక ప్రణాళిక వేసుకొని రచయితలను, పాఠకులను ఆ మార్గాన నడిపించడమూ – ఇవీ సంపాదకుని ముఖ్య విధులు.

– శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి

సోక్రటీస్ తనని తాను ఏథెన్స్ నగర వాసుల పాలిటి జోరీగ (gadfly) గాను, మంత్రసాని (midwife) గాను అభివర్ణించుకున్నాడు. జోరీగ లాగా తోటి ఏథేనియన్ల ఆలోచనాశ్వాలను కుట్టి వాటిని పరిగెత్తింపజేస్తానని చెప్పుకునేవాడు. అంతేకాక, మంత్రసానిగా పనిచేసిన తన తల్లి లక్షణాలే తనకు వచ్చాయని చెబుతూ, సాటి మానవుల ఉదాత్త భావాలను ప్రసవింపజేసే మంత్రసానితనమే తన వృత్తి అని కూడా సోక్రటీస్ చెప్పుకునేవాడు. సోక్రటీస్ తన గురించి చెప్పుకున్న లక్షణాలు పత్రికా సంపాదకులకు సరిగ్గా సరిపోతాయని నాకనిపిస్తుంది. రచయితను జోరీగ లాగా కుట్టి, తమ పత్రికకు అనుగుణమైన రచనను కూర్చడానికి ప్రేరేపించడం సంపాదకుని పని. ఆపై ఆ రచన పుట్టుకకు ముందు పురిటినొప్పులతో బాధపడే రచయితకు సాయపడేలా మంత్రసానితనం నెరపడమే సంపాదకుని ముఖ్య కర్తవ్యం.

తెలుగువారిలో ఇప్పటికీ చాలా మందికి సంపాదకుడంటే అచ్చుతప్పులు సరిదిద్ది అచ్చువేసేవాడు అన్న దురభిప్రాయం ఉంది. నిజానికి, పెద్ద పెద్ద ఆంగ్ల ప్రచురణ సంస్థలలో అచ్చు తప్పులు చూసి, విరామ చిహ్నాలు సవరించే యాంత్రికమైన పనిని కాపీ ఎడిటర్లు (Copy Editors) అనబడే చిన్న తరగతి సంపాదకులకు అప్పజెప్పుతారు. Acquisition Editor, Developmental Editor, Production Editor మొదలైన ఇతర శాఖలలోని సంపాదకులే రచనలోని ఇతివృత్తాన్ని, నిర్మాణ శిల్పాన్ని, శైలిని సమీక్షించి, లోపాలు సవరించి, ప్రచురణకు అవసరమైన మిగతా హంగులు సమకూర్చి, రచయితకు పాఠకులకు మధ్య వారధిని నిర్మించే పనిని దాదాపు పూర్తిచేస్తారు.

మా దృష్టిలో సంపాదకుడంటే సగం రచయిత. ఒక రచనను కూర్చడంలో రచయితల, సంపాదకుల శక్తి సామర్థ్యాలు పరస్పర సంపూరకాలు – ఈ ఇద్దరూ తమ తమ బాధ్యతలను నిర్వహిస్తేనే ఒక రచన సంపూర్ణాకృతిని పొందుతుందని మా గట్టి నమ్మకం. రచన కూర్చేటప్పుడు మెదడులో చైతన్యవంతమయ్యే భాగాలు వేరు; కూర్చిన ప్రతిని ఎడిట్ చెయ్యడానికి ఉపయోగపడే మస్తిష్కాంగాలు వేరు. రచయితకు సృజన ప్రధానం; సంపాదకునికి విమర్శక స్పృహతో కూడిన వివేచన ముఖ్యం. రచయితకు రచనా నిర్మాణ దక్షత కావాలి; సంపాదకునికి రచనలోని గుణాగుణాలను గ్రహించగలిగే అనుశీలనా కౌశలం ఉండాలి. రచయిత చూపు సృజనాత్మకం; సంపాదకుని చూపు విశ్లేషణాత్మకం. ఈ రకమైన దృష్టితో చూసినప్పుడు, రచయిత, సంపాదకుడు ఒకే ఆశయ సిద్ధి కోసం రెండు వేర్వేరు చివరలనుండి వ్యతిరేక మార్గాలలో ప్రయాణం చేసే భాగస్వాములని, వారిద్దరూ ఒకే చోట కలిసినప్పుడే వారు పనిచేసిన రచన ప్రచురణార్హతను పొందుతుందని అర్థం చేసుకోవచ్చు.

రాజశేఖరుని కావ్యమీమాంసలో కూడా ఈ ప్రతిభా భేదాలను గుర్తించినట్టు మనకు కనిపిస్తుంది. కారయిత్రీ, భావయిత్రీ అన్న గుణాల గురించి చర్చిస్తూ ఇలా అంటాడు:

కశ్చిద్వాచం రచయితుమలం శ్రోతుమే వాపరస్తాం
కళ్యాణీ తే మతిరుభయథా విస్మయం నస్తనోతి
న హ్యేకస్మిన్నతిశయవతాం సన్నిపాతో గుణానా
మేకః సూతే కనకముపల స్తత్పరీక్షాక్షమోఽ న్యః

– కావ్య మీమాంస (తెలుగు సేత: పుల్లెల శ్రీరామచంద్రుడు. 1979)

ఒకడు రచించుటకు మాత్రమే సమర్థుడు. మరియొకడు దానిని వినుటకు (విని పరీక్షించుటకు) మాత్రమే సమర్థుడు. ఉత్తమ గుణములకు ఒకే స్థానమున కలయిక ఉండదు కదా? బంగారము ఉత్పత్తి చేసెడి శిల యొకటి, దానిని పరీక్షణము చేయు శిల మరియొకటి (ఈ శ్లొకాన్ని నాకు సూచించి అందజేసిన వెల్చేరు నారాయణరావు గారికి నా కృతజ్ఞతలు).

అంతేకాక, మన ప్రాచీన కావ్యాలలోని అవతారికలలో పేర్కొన్న విద్వజ్జనులు, రసజ్ఞులు, సుకవి పండితులు మొదలైన వారు, మన కవులకు ప్రమాణంగా ఉండేవారని, కావ్య నిర్మాణ సమయంలో వారి నుండి సలహాలు, సూచనలు పొందేవారని కూడా మనం ఊహించవచ్చు. అల్లసాని పెద్దనదిగా చెప్పబడే చాటువులో “ఒప్పు తప్పరయు రసజ్ఞులు” లేకపోతే కృతి రచించడం శక్యం కాదని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. “పొరి బొరి నొప్ప సలాకల నొరసిన కుందనపు బూదెయును బోలె సభన్ సరసుల సంఘర్షణమున వరకవి కావ్యంబు మిగుల వన్నెకు నెక్కున్” అంటూ సభలో సరసుల మధ్య సంఘర్షణ వల్లే కావ్యం రాటుదేలుతుందని నంది మల్లయ, ఘంట సింగనలు అభిప్రాయ పడ్డారు. అంటే ఆనాటి సభలలో, రాజాస్థానాలలో సాహిత్య చర్చలు జరిపి కావ్యాలలోని మంచి చెడ్డలను విశ్లేషించే వారన్నమాట. నన్నయ్య ఆనాటి రాజాస్థానాన్ని వర్ణిస్తూ “అపార శబ్ద శాస్త్ర పారగులైన వైయాకరణులును భారత రామాయణాద్యనేక పౌరాణికులును … ఆదిగా గల విద్వజ్జనంబు” లున్నారన్నాడు. మారన “వేదవేదాంగ పారగులైన ధారుణీసురులును, సమస్త శాస్త్ర విదులైన విద్వాంసులును, వివిధ పురాణ ప్రవీణులైన పౌరాణీకులును” ఉన్నారన్నాడు. “ఎట్టి కవికైన దనకృతి ఇంపు” కావున “సరసులైన కవుల చెవులకు నెక్కిన గాని” దానికి విలువలేదని తిక్కన విశ్వసించాడు. ఇవి కాక ఆ రోజుల్లో సాహిత్యాన్ని ప్రత్యేకంగా చర్చించే పండిత పరిషత్తులుండేవని కూడా మనకు తెలుస్తుంది. అంటే ఈనాడు సంపాదకుడు నిర్వహిస్తున్న బాధ్యతలని ఆనాటి పండితులు, రసజ్ఞులు, తార్కికులు, పండిత పరిషత్తులు పూరించేవారని చెప్పుకోవచ్చు.

మా దృష్టిలో సంపాదకుడు రచయితకు తొలి విమర్శకుడు కావాలి. రచయితను ఆత్మీయుడైన మిత్రుడుగా పరామర్శించి, సలహాలు, సూచనలు అందజేయగలగాలి. రచనా నిర్మాణానికి రచయిత చేసిన కృషినంతటినీ గ్రహించి, ఏయే సందర్భాలలో ఎందుకు అతని కృషి విఫలమైందో, ఎక్కడ సఫలమైందో, ఎక్కడెక్కడ తగినంత జాగ్రత్త తీసుకోలేదో మొదలైన విషయాలను సహృదయతతో పట్టి ఇవ్వాలి. ఇవి ఈమాట తొలినాళ్ళ నుండి సంపాదకులుగా మేము అనుసరించడానికి ప్రయత్నించిన సూత్రాలు, స్వీకరించిన బాధ్యతలు.

సమవుజ్జీ సమీక్షలు

సైంటిఫిక్ జర్నల్స్‌లో పేపర్లని పీర్ రివ్యూ చేస్తే కాని ప్రచురించరు. అలాగే కంపెనీల్లో కూడా రాసిన ప్రతీ టెక్నికల్ పేపర్నీ ముందుగా కొంతమంది రివ్యూ చేస్తారు. ఈ పీర్ రివ్యూ పద్ధతిలో సమీక్షకులకి రచయితలెవరో తెలియదు; అట్లాగే, రచయితలకి సమీక్షకులెవరో తెలియదు. ప్రారంభం నుంచీ ఈమాటకి వచ్చిన రచనలని ప్రచురణకి ముందు ఈ పద్ధతిలో సమీక్షించాలని నిర్ణయించుకున్నాం. మంచి సాహిత్యానికి తోటి రచయితల సమీక్ష, విమర్శలు మేలు తప్ప కీడు చేయవని మా విశ్వాసం.

కొత్త టెక్నాలజీనీ, ఉన్నత ప్రమాణాలను తెలుగు వారికి పరిచయం చెయ్యడం

ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించుకొని, ఈమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తేలిక మార్గంలో అందేటట్టు చూడటం ఈమాట లక్ష్యాలలో ఒకటి.ఆధునిక మానవ జీవితంలో ముఖ్య భాగమైన సమాచార సాంకేతికజ్ఞానాన్ని (Information Technology) తగినట్టుగా ఉపయోగించుకోలేని భాషలన్నీ ఈ శతాబ్దాంతానికి లుప్తమైపోయే ప్రమాదముందని, ఆర్థికపరంగా ఆంగ్లంతో పోటీ పడలేని తెలుగు వంటి భాషల మనుగడకు ఇంటర్నెట్లో భాషాభివృద్ధి అత్యంత అవసరమని మా నమ్మకం. డైనమిక్ ఫాంట్లను ఉపయోగించడంలోనూ, యూనికోడ్ టెక్నాలజీనీ ఉపయోగించడంలోనూ, స్టైల్‌షీట్ల వాడుకలోనూ, వెబ్ 2.0 ఇంటరాక్టివ్ ఫీచర్లు అందించడంలోనూ ఈమాట మొట్టమొదటి సైట్‌గా నిలిచి, మిగతా తెలుగు వెబ్‌సైట్లకు మార్గదర్శకంగా ఉండే ప్రయత్నం చేసింది.

పాఠకుల అభిప్రాయాలు

వ్యక్తిగత దూషణలు లేకుండా విమర్శనాత్మక దృష్టితో రాసిన పాఠకుల అభిప్రాయాలు ఎంత నిష్కర్షగా వున్నాసరే రచనాకారులకు ఎంతగానో ఉపకరిస్తాయని మా గట్టి నమ్మకం. ఒక రచనపై పాఠకుల అభిప్రాయాలనీ, దృక్పథాన్నీ రచయితకు ప్రత్యక్షంగా, వెంటనే తెలియజేయగలగడం ముఖ్యమని తొలినుండి మా భావన. అందుకే, Web 2.0 అందించే ఇంటరాక్టివ్ ఫీచర్లు ఈమాట ప్రారభంలో లేకున్నా, తొలి సంచికనుండీ గెస్ట్ బుక్ ద్వారా పాఠకుల అభిప్రాయాలు తెలుపడానికి సౌకర్యాన్ని కల్పించాం.

పదేళ్ళ ఈమాట మాట

ఇప్పుడు పదేళ్ళ నిద్రగన్నేరు చెట్టు ఈమాట. కిచకిచమనే రచనల శబ్దం వినిపించే చిలకలు వాలిన చెట్టు ఈమాట. ఈ పదేళ్ళుగా ఈమాట బాలారిష్టాలు దాటుకుంటూ ఇప్పటిదాకా ఆశయభంగం కాకుండా, కాలానుగుణంగా మారుతూ ఇలా పెరగడానికి కారణం ప్రపంచపు నలుమూలలా ఉన్న సాహిత్యాభిమానులు అందించే సహాయ సహకారాలు మాత్రమే.

మొదట్లో రచనలు తక్కువగా ఉన్న రోజుల్లో ఈమాట ప్రచురణలకై సంపాదకులే అప్పుడప్పుడు రాస్తూ ఉండేవారు. తనకున్న సంస్కృత పరిచయంతో, కొంపెల్ల భాస్కర్ రాసిన ‘స్వప్న వాసవదత్తం’, ‘మన ఛాందసులు’, ‘ప్లే స్టేషన్’, ‘గంధర్వులెవరు?’ వంటి రచనలు మంచి ఆదరణ పొందాయి. కర్ణాటక సంగీతంలో ఒక్కొక్క రాగాన్ని తీసుకొని శాస్త్రీయంగా పరిచయం చేస్తూ, సినిమా పాటలు ఉదాహరణలుగా ఇస్తూ లక్ష్మన్న విష్ణుభొట్ల సంగీత వ్యాసావళి రాసేవారు. తెలుగు, సంస్కృతాల్లో పద్యాలు, ఛందస్సులు కెవియస్ రామరావుకి, కొంపెల్ల భాస్కర్‌కి బాగా ఇష్టమైన వ్యాపకాలు. అందువల్ల వీరిద్దరూ సంప్రదాయ సాహిత్యాన్ని ఈమాట సాహితీ గ్రంథాలయంలో ఉంచడానికి, తేలిక తెలుగు అనువాదాలతో వీటిని ఈమాట పాఠకులకి పరిచయం చేయడానికి ఎంతో శ్రమించేవారు. 20వ శతాబ్దికి వీడ్కోలు చెబుతూ, 1999లో వెల్చేరు నారాయణ రావు, జంపాల చౌదరి, కె. వి. ఎస్. రామారావులతో కలిసి ఆ శతాబ్దంలో గణించదగ్గ 100 పుస్తకాల జాబితా తయారు చెయ్యడం ఒక మరపురాని అనుభవం.

శ్రీనివాస్ పరుచూరి సంపాదక వర్గంలో సభ్యుడుగా లేకపోయినప్పటికీ, ఈమాట పత్రికకు అండదండగా నిలుస్తూ గత పదేళ్ళుగా ఆయన మాకు అందించిన సహకారం మరువలేనిది. ఈమాట వ్యాసాలను సమీక్షించడంలోనూ, చారిత్రకాంశాలను పరిశీలించడంలోనూ, పాత గ్రంధాలను సేకరించడంలోనూ ఈమాటకు ఆయన చాలా సహాయం చేసారు. ఈమాట ఆడియో గ్రంథాలయంలో ఇప్పుడు ఉన్న శబ్దతరంగాలలో ఎక్కువ భాగం ఆయన సేకరించి మాకందించినవే. తొలినాళ్ళ నుంచి ఈమాట రచయితలుగా, సమీక్షకులుగా , శ్రేయోభిలాషులుగా ఉంటూ మాకు సహాయం చేసిన ప్రముఖులలో కనకప్రసాద్‌, కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, కన్నెగంటి చంద్ర, వెల్చేరు నారాయణరావు, మాచిరాజు సావిత్రి ప్రభృతులను ప్రత్యేకించి పేర్కొనటం సమంజసం.

2006 ఎప్రిల్ లో పద్మ ఇంద్రగంటి ఈమాట సంపాదక వర్గంలో ప్రవేశించడం సాంకేతిక పరంగా ఈమాటకు ‘నిరుపేదకబ్బిన నిధి’. అప్పటిదాకా కొత్త సాంకేతికతను ఈమాటలో వాడడానికి దాదాపుగా ఒంటరి పోరాటం చేస్తున్న నాకు పద్మ తోడ్పాటు అయాచితంగా అందివచ్చిన వరం. అప్పడప్పుడే ప్రాచుర్యం పొందుతున్న web 2.0 ఇంటారాక్టివ్ ఫీచర్లను అభివృద్ధి చెయ్యడానికి Zopeతో గానీ, Drupalతో గానీ ప్రయోగాలు చెయ్యాలన్న ఆలోచనల్లోనే నేను కాలం వెళ్ళబుచ్చుతున్న రోజుల్లో, వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చెయ్యమని సలహా ఇచ్చి, నాకు తగిన విధంగా సహాయ సహకారాలందిస్తూ తను చేరిన ఇరవై రోజుల్లోనే ఈమాటను వర్డ్‌ప్రెస్‌కు తరలించిన ఘనత పద్మగారికే దక్కాలి.గత రెండేళ్ళలో సంపాదకులుగా చేరిన మాధవ్ మాచవరం, పాణిని గార్లు ఈమాట నిర్వాహణ బాధ్యతను తమ భుజస్కంధాల మీద మోస్తూ , ఈమాటకు చేరవచ్చే రచనలను జాప్యం చేయకుండా సమీక్షించి రచయితలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగించడంలోనూ, పత్రికాపరంగా చేసే నిర్ణయాలను పాఠకులకు తెలియజెప్పడంలోనూ, ఈమాట ఉన్నత ప్రమాణాలను కాపాడడంలోనూ, ఎంతో సమయాన్ని వెచ్చించి, అంకిత భావంతో పనిచేస్తున్నారు. 2008 లో సంపాదకుడిగా పనిచేసిన నాసీ శంకగిరి తన బ్లాగులో నిర్వహించిన కథల పోటీల ద్వారా కొన్ని మంచి కథలను ఈమాటకు అందించడంలోనూ, కొత్తతరం బ్లాగర్లలో ఈమాట గురించి ప్రచారం చేయడంలోనూ ఎంతో కృషి చేసారు.

WETD-SCIT-తెలుసా-రచ్చబండ చర్చావేదికల ద్వారా పెంపొందిన సంఘీభావం, ఆ వేదికల ద్వారా మేము సమిష్టిగా అలవర్చుకున్న సంప్రదాయాలు, విలువలే ఈమాట పదేళ్ళుగా మనగలగడానికి దోహదం చేసాయి. ఇంతకాలం పాటు మా మీద నమ్మకం ఉంచి ఆదరించి ప్రోత్సహించిన పాఠకులకు, రచయితలకు, శ్రేయోభిలాషులకు మా అభివందనాలు.

ముక్తాయింపు

అదేం దురదృష్టమో గాని మన తెలుగు వారికి కొన్ని సంప్రదాయాలు, విలువల ఆధారంగా సమిష్టిగా సంస్థల నిర్మాణం చేయడం అంతగా అలవాటు లేదనిపిస్తుంది. కొంత ప్రతిభా పాటవాలున్న ఒక వ్యక్తి ఒక సంస్థను స్థాపించడం, ఆ వ్యక్తి తెరమరుగు కాగానే ఆ సంస్థ కుప్పకూలడం మనకు తెలిసిన సంగతి. ఉదాహరణకి, పేరెన్నిక గన్న వావిళ్ళవారి ప్రెస్ , కాశీనాథుని ఆంధ్రపత్రిక, భారతి వంటి సాహితీ పత్రికలు కూడా ఒక వ్యక్తి ప్రోద్బలం వల్ల పనిచేసినవే. ప్రస్తుతం ఆంధ్రదేశంలో ఒక్క సాహితీ సంస్థలే కాదు, పత్రికలు, ప్రచురణ సంస్థలు, చివరకు రాజకీయ పార్టీలు కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడి నిర్మింపబడిన సంస్థలే. ఇందులో కొన్ని సంస్థల కార్యకలాపాలన్నీ కేవలం ఆ సంస్థ వ్యవస్థాపకుని ఆత్మోత్కర్ష కోసం చేసే ప్రదర్శనలే కావటం శోచనీయం.

ఇందుకు భిన్నంగా అమెరికాలో నాకు తెలిసిన పత్రికాసంస్థలు, ప్రచురణ సంస్థలు వారి సంస్థలను నడపడానికి తమ తమ సంప్రదాయాలను, విలువలను ప్రతిబింబించేలా తమదైన ఒక వ్యవస్థను (system) ఏర్పరచుకుంటాయి. తొలినాళ్ళలో ఆ సంస్థ ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తుల శక్తియుక్తుల మీదే ఆధారపడి పనిచేసినా, ఒక పటిష్టమైన వ్యవస్థ ఏర్పడిన తరువాత ఆ వ్యవస్థే సంస్థను నడిపిస్తుంది. ఆ పై ఎంతమంది వ్యక్తులు కొత్తగా చేరినా వారంతా ఆ వ్యవస్థ నిర్మాణ చట్రానికి లోబడే పనిచేస్తారు; అంతేకాక ఆ వ్యవస్థ కు కాలానుగుణంగా అవసరమైన మార్పులు చేస్తూ ఆ వ్యవస్థ మరింత పటిష్ట పడడానికి తోడ్పడుతారు. ఇదీ నాకు తెలిసి సమర్థవంతంగా పనిచేసే సంస్థల విజయరహస్యం.

ఈమాట పత్రిక కొందరు వ్యక్తుల సమిష్టి కృషి ఫలితంగా నడుస్తుంది కానీ, దీనికి ఒక సంస్థాస్వరూపం ఏర్పడిందని అప్పుడే చెప్పలేము. కె. వి. ఎస్. రామారావు గారి నాయకత్వంలో పదేళ్ళ క్రితం ఈమాట ప్రారంభించిన వ్యక్తులలో ఎవరూ ప్రస్తుత సంపాదక వర్గంలో లేరు. అయినా, సంస్థ అని అనడానికి కావలసిన వ్యవస్థ ఈమాటకింకా ఏర్పడలేదు. దానికింకా కొంతకాలం పడుతుందని నా అభిప్రాయం. ప్రస్తుత సంపాదక వర్గం ఉన్నతమైన ప్రమాణాలతో, విలువలతో ఈ పత్రికను నడిపిస్తూ, ఒక వ్యవస్థ గా దీనిని నిర్మించడానికి పాటుపడుతున్నదనీ, ఈమాటను కొన్ని సత్సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఒక సంస్థగా తీర్చిదిద్దుతున్నదనీ నమ్ముతున్నాను. తెలుగు సాహిత్యానికి ఆదరణ ఉన్నంతకాలం ఈమాట పత్రిక ఉంటుందనీ, ఉండాలనీ నా ఆశ, ఆకాంక్ష.

[ఈ వ్యాస రచనలో నాకు ఎంతగానో సహాయపడిన శ్రీనివాస్ పరుచూరి, ఈ వ్యాసాన్ని రాయమని నన్ను ప్రోత్సహించిన వెల్చేరు నారాయణ రావు, కొడవటిగంటి రోహిణీప్రసాద్, పద్మ ఇంద్రగంటి, సలహాలు సూచనలు అందచేసిన కె. వి. ఎస్. రామారావు, శ్రీనివాస్ నాగులపల్లి, లక్ష్మన్న విష్ణుభొట్ల గార్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. – సురేశ్ కొలిచాల

కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ చరిత్ర గురించి రాయడంలో A History of Modern Computing (Second edition) by Paul E. Ceruzzi పుస్తకం ఆధారం]