గత సంవత్సరం తమిళానికి దీటుగా తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదో రుజువు చెయ్యడానికి ప్రయత్నిస్తూ తెలుగు పత్రికల్లో కనిపించిన వ్యాస పరంపర చూసి మొదట్లో ఆనంద పడ్డ వాళ్ళలో నేనూ ఒకణ్ని. ఈ వ్యాసాలు తెలుగు భాష పూర్వ చరిత్ర గురించి , తెలుగు వారి పుట్టు పూర్వోత్తరాల గురించి సమగ్రమైన చర్చకు, సశాస్త్రీయమైన పరిశోధనకు పాదుకొల్పుతాయని ఆశ పడ్డాను. తెలుగుదేశంలోని యూనివర్సిటీలకు, భాషా పరిశోధకులకు మన పూర్వ చరిత్ర గురించి ఉన్నత స్థాయిలో పరిశోధనలు జరుపడానికి అపూర్వమైన అవకాశం దొరికిందని పొంగిపోయాను. అయితే, కేవలం ఒకటి రెండు పదాల సారూప్యత ఆధారం చేసుకొని తెలుగు వారి గతాన్ని సుమేరియన్ల నుండి యూదుల సంతతి వరకు, బహ్రేన్ నుండి బర్మా జాతుల వరకు ఆపాదిస్తూ అన్ని పత్రికల్లోనూ వచ్చిన నేలబారు పరిశోధనలు నాలో నిరాశనే మిగిల్చాయని చెప్పాలి. ముఖ్యంగా, గత రెండు శతాబ్దాలుగా ఆధునిక భాషా శాస్త్రం సాధించిన అభివృద్ధి గురించి కనీస స్థాయి అవగాహన కూడా ఈ రచనల్లో కనిపించకపోవడం తీవ్రమైన అసంతృప్తిని, బాధని కలిగించింది.
ఇంతేకాక తెలుగు జన్మతః ద్రావిడ భాషా కుటుంబానికి చెందిందని కాల్డ్‌వెల్ శాస్త్రీయంగా నిరూపించి 150 సంవత్సరాలు అయినా, ఇంకా ఇది సంస్కృత జన్యమేనని వాదించే వారు ఈనాటికీ ఉండడం నమ్మలేని విషయం. గత సంవత్సర కాలంలో తెలుగును ప్రాచీన భాషగా నిరూపణ చేయడానికి ప్రతి ఒక్కరు యథాశక్తి పత్రికలకు సమర్పించుకొన్న వ్యాసాలలో సంస్కృత జన్య సిద్ధాంత వ్యాసాలు కూడా ఉండటం విచిత్రమే. చరిత్రకారుడిగా పేరున్న ఒక రచయిత తెలుగు, తమిళాది భాషలు సంస్కృత ప్రాకృత జన్యమైన పైశాచి భాషనుండి పుట్టాయని కొంత కాలంగా చాటింపు వేస్తున్న వారిలో ప్రముఖులు. ఈయనే అస్త్రాలయా ఆస్ట్రేలియా అయ్యిందని, మూడు వేల సంవత్సరాల క్రితమే అర్జునుడు అమెరికా పర్యటించినట్టు స్పష్టమైన ఆధారాలున్నాయని ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ మధ్య ఒక వ్యాసంలో ఆయన తెలుగు అంకెల గురించి రాస్తూ, “ఏక” శబ్దం నుండి “ఒక” , “దొందు” శబ్దం నుండి “రెండు” వచ్చాయని చెప్పి మూల ద్రావిడం మిధ్య అయిపోతుందని మరోమారు తనదైన నమ్మకాన్ని పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యం లో సజాతి పద నిర్ధారణకు, భాషా సంబంధ నిరూపణకు భాషాశాస్త్రం ఉపయోగించే ప్రాథమిక సూత్రాల గురించి ఒక ఔత్సాహిక విద్యార్థిగా నేను తెలుసుకొన్న కొన్ని విషయాలు ముచ్చటించడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.
భాషా సంబంధ నిరూపణ – తులనాత్మక పద్ధతి
ఏవైనా ఒక రెండు భాషల మధ్య సంబంధం నిరూపించాలంటే, ఆ భాషల్లో ఒకే రకంగా ధ్వనించే సమానార్థకాలైన పదాలని చూపించాలన్నది సామాన్యంగా వినిపించే అభిప్రాయం. ఒకే భాషా కుటుంబానికి చెందిన సోదర భాషల్లో తరచూ ఇటువంటి పదాలు కనిపిస్తాయి కూడా. కాని భాషాశాస్త్ర దృష్టితో చూస్తే ఇటువంటి పదాలు భాషా సంబంధ నిరూపణకు నిజంగా అత్యవసరం కాదు; ఒకవేళ ఉన్నా అవి మాత్రమే సరిపోవు. అదీకాక, చాలాసార్లు పదాలలో పైపైన కనిపించే పోలికలు, భాషలమధ్య లేని సంబంధమేదో ఉన్నట్టు మభ్య పెడుతాయి. ఉదాహరణకు తెలుగు, ఇంగ్లీష్ భాషలలో దాదాపు ఒకే అర్థం ఉండి ఒకే రకంగా ధ్వనించే ఈ పదాల జంటలను గమనించండి:
ఒన్ను | one |
అటక | attic |
నీటు | neat |
కాపు | cop |
పెట్టు | put |
పైన చూపిన జంట పదాల ఆధారంగా ఇంగ్లీష్ తెలుగు భాషనుండి పుట్టిందని వాదించడం ఎంత హాస్యాస్పదమో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.
ఆధునిక భాషా శాస్త్ర పరంగా రెండు భాషల మధ్య జన్మసంబంధ (genetic relationship) నిరూపణకు భాషావేత్తలు గత రెండు శతాబ్దాలుగా వాడుతున్న విధానాన్ని “తులనాత్మక పద్ధతి (Comparative Method)” అని అంటారు. ఈ విధానాన్ని వివరించే ముందు ఈ పద్ధతికి ఉపయోగపడే రెండు ప్రధానమైన అంశాల గురించి ప్రస్తావిస్తాను.
ధ్వని పరిణామం (Sound Change)
కన్నడ భాషతో కొద్దిపాటి పరిచయం ఉన్న తెలుగువారెవరైనా గమనించగలిగే విషయం, తెలుగులో /ప/ అక్షరంతో ప్రారంభమైన చాలా పదాలు కన్నడభాషలో /హ/ అక్షరంగా మారినట్టుగాకనిపించడం.
|
|
నిజానికి పాత కన్నడ లో(హలెగన్నడలో) ఈ పదాలన్నీ /ప/ అక్షరంతోనే ఉపయోగించేవారని, కాలక్రమేణా /ప/ ధ్వని /హ/ ధ్వనిగా రూపాంతరం చెందిందని మనకు తెలుస్తోంది. సరిగ్గా ఇటువంటి ధ్వని పరిణామం వల్లనే తెలుగు పదాలలో తాలవ్యాచ్చుల (front vowels) ముందు /క/ శబ్దం /చ/ శబ్దంగా మారింది . ఈ క్రింది తెలుగు కన్నడ పదాలను గమనించండి.
తెలుగు | కన్నడ |
---|---|
చెయ్యి | కై |
చెవి | కివి |
చెడు | కెడు |
చెఱువు | కెఱె |
ప్రాఙ్నన్నయ యుగ శాసనాలలో 8 వ శతాబ్ది దాకా చేయు ( <*కేయు) అనే క్రియకు రూపాలైన కేచిన (చేసిన), కేసి (చేసి), కేసిరి (చేసిరి) మున్నగునవి క-కారంతోనే ఉండేవి. ద్రావిడ భాషా కుటుంబంలోని ఇతర భాషల్లో కూడా ఈ పదాలు క-కారంతో ఉండటం బట్టి, మూల ద్రావిడ భాషలో ఈ పదాలన్నీ /క/-కారాలుగా ఉండేవని మనం గుర్తించవచ్చు. ఈ రకమైన ధ్వని పరిణామాలు ప్రపంచంలోని అన్ని భాషలలోనూ, అన్ని కాలాల్లోనూ జరుగుతూ వస్తున్నాయని ఆధునిక భాషావేత్తలు కనుగొనడం భాషా శాస్త్ర పరిశోధనలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చింది. ప్రపంచ భాషలలో, ముఖ్యంగా ఇండో-యూరోపియన్ భాషలలోని ధ్వని పరిణామాలను సూత్రీకరించే ధ్వని సూత్రాల నిర్మాణం శాస్త్రజ్ఞులను విస్మయ పరిచే ఎన్నో విషయాలను వెలుగులోకి తెచ్చింది. భాషా సంబంధాల విషయంలో అప్పటిదాకా అంతు చిక్కని సమస్యలనెన్నింటినో పరిష్కరించింది. సజాతి పద (cognate) నిరూపణకు "శబ్ద సామ్యం" ముఖ్యంకాదని ధ్వని సూత్ర శీలమైన "ధ్వని అనుగుణ్యత (Sound Correspondence)" ముఖ్యమని తెలియ జెప్పింది. ఉదాహరణకు, "దేవ" శబ్ద సంబంధమైన లాటిన్ భాషలోని deus అన్న పదం, అదే అర్థంలో వాడే గ్రీక్ భాషలోని theos అన్న పదం సజాతి పదాలని చాలా కాలంగా నమ్మేవారు. కానీ, సంస్కృత, లాటిన్ భాషలలోని /d/ ధ్వనికి గ్రీక్ భాషలోని /th/ ధ్వనికి ధ్వన్యనుగుణ్యత చూపించలేకపోవటం వల్ల ఈ రెండు పదాలు సజాతి పదాలన్న నమ్మకాన్ని అసత్య వాదంగా (false cognates) నిరూపించగలిగారు. నిజానికి, గ్రీక్ భాషలోని theos, లాటిన్ భాషలోని fes-, festus పదాలు, సజాతి పదాలని ఈ ధ్వన్యనుగుణ్యత సూత్రాల ద్వారా చూపించగలగటం ఈ సిద్ధాంతం యొక్క విజయాన్ని, శాస్త్ర నిబద్ధతను ధ్రువీకరించింది. అంతేకాక, ఈ సూత్రాల ఆధారంగానే శబ్ద సామ్యం లేని పదాలను కూడా సజాతి పదాలుగా నిరూపణ చెయ్యగలగడం ఈ సిద్ధాంతాల ద్వారా సాధించిన సత్ఫలితాల్లో ప్రధానమైనది. అర్మేనియన్ భాషలోని erku (=రెండు) పదానికి ఇండో-యూరోపియన్ మూల ధాతువైన *dw- (*ద్వ-) కు గల అనుబంధం క్రమబద్ధమైన ధ్వని సూత్రాల ఆధారంగా నిరూపించారు. ఈ ధ్వని సూత్రాల ఆధారంగానే ఇంగ్లీష్ భాషలోని /five/ అన్న పదాన్ని సంస్కృత భాషలోని /పంచ/ అన్న పదానికి సజాతి పదంగా రుజువు చెయ్యవచ్చు. ఆధునిక వ్యుత్పత్తి శాస్త్రానికి పునాదులు వేసిన వారిలో ఒకరిగా భావించే ఏ. ఎఫ్. పాట్ (A. F. Pott) అనే జర్మన్ భాషావేత్త "మినహాయింపులు లేని ధ్వని పరిణామ సూత్రాలు (Exceptionless Sound Laws)" ఉన్నాయని గాఢంగా నమ్మేవాడు. ఆ రోజుల్లో పైపైన కనిపించే పోలికల ఆధారంగా అశాస్త్రీయమైన భాషాసిద్ధాంతాలు చేసే వారిని - ఆయన మాటల్లో చెప్పాలంటే "champions of pseudo-etymologies, the comparative linguistic quacks [ ...] who let themselves be seduced by the sirens of phonetic similarity[7]" - ఆయన తీవ్రంగా దుయ్యబట్టేవాడు. అయితే ఏదో ఒక రకమైన మినహాయింపులు లేని ధ్వని సూత్రాలు చాలా తక్కువేనని నేటి భాషావేత్తలందరూ ఒప్పుకుంటారు.