గిడుగు వెంకట రామమూర్తి – రేఖాచిత్రం (1863 – 1940)

1. నేపథ్యం

19వ శతాబ్ది రెండోభాగం; బ్రిటిష్‌ పాలన క్రమంగా మనదేశమంతటా స్థిరపడుతున్నది. సంప్రదాయానికి, ఆధునికతకు ఘర్షణ ఏర్పడుతున్న సంధికాలం అది. ఆంగ్లేయుల విజ్ఞానశాస్త్రాలు, రాజకీయభావాలు, సంస్కృతి సాహిత్యాలు, భారతీయమేధావులను ఎందరినో ప్రభావితం చేశాయి. ఆ ఫలితంగా చాలామంది స్వాతంత్ర్యసంగ్రామంలో దూకారు. కొందరు సంపన్నులు ఇంగ్లీషుచదువుల్లో తెల్లదొరలకు దీటుగా ఉండాలని ఐ. సీ. ఎస్‌. చదువుకు లండన్‌ నగరానికి, పై చదువులకు ఆక్స్ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయాలకు వెళ్ళారు. మరికొందరు సమాజసంస్కరణే జీవిత లక్ష్యంగా దేశంలోనే వుండి ఉద్యమాలు లేవదీసారు.

తెలుగుదేశంలో ముగ్గురు మహనీయులు పందొమ్మిదోశతాబ్ది రెండోభాగంలో ఉద్యమకర్తలై సమాజానికి ఎంతో సేవ చేశారు – కందుకూరి వీరేశలింగం (1840-1919), గురజాడ వెంకట అప్పారావు (1861-1915), గిడుగు వెంకట రామమూర్తి (1863-1940). బాల్యవివాహాలు, ముసలివాళ్ళు చిన్నపిల్లలను పెండ్లి చేసుకోవటం, మరణించిన భర్తతో బలవంతంగా భార్యను సహగమనం చేయించటం (సతీసహగమనం), వితంతువివాహాన్ని నిషేధించటం, ఆడపిల్లల్ని అమ్ముకోవటం (కన్యాశుల్కం), అస్పృశ్యత, వేశ్యాలోలుపత్వం — ముఖ్యంగా అగ్రవర్ణాలలో ఉన్న మూఢవిశ్వాసాలు, మూఢాచారాల్లో కొన్ని. తన రచనల ద్వారా, వీటిని నిర్మూలించి సంఘంలో అభ్యుదయభావాలను, నూతనచైతన్యాన్ని తేవటానికి వీరేశలింగంగారు అవిశ్రాంతకృషి చేశారు. చాలావరకు కృతకృత్యులైనారు కూడా. ఉదాత్తశిల్పంతో సృజనాత్మకరచనల (కథానికలు, కన్యాశుల్కం, ముత్యాలసరాలు) ద్వారా సమాజంలో ఉన్న దురాచారాలను చిత్రించి సమాజాన్ని మరమ్మత్తు చేయటంతో పాటు ఆధునిక సాహిత్యప్రక్రియలకు మార్గదర్శకుడైనాడు గురజాడ అప్పారావు. వ్యవహార భాషలో 1897లో ఆయన మొదటరచించిన కన్యాశుల్కం ఈనాటికీ గొప్పనాటకమే. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి, వచనరచనకు కావ్యభాష పనికిరాదనీ, సామాన్యజనానికి అర్థమయ్యే సమకాలీన “శిష్టవ్యావహారికం”లో ఉండాలనీ ఆనాటి సాంప్రదాయికపండితులతో హోరాహోరీగా యుద్ధంచేసి ఆధునికప్రమాణభాషను ప్రతిష్టించటానికి మార్గదర్శకుడైనవాడు గిడుగు రామమూర్తి.

2. గిడుగు జీవితవిశేషాలు 1863 – 1911

గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగస్టు 29వ తేదీ శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవైమైళ్ళ దూరంలో ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. వీర్రాజు పర్వతాలపేట ఠాణాలో సముద్దారు (రివెన్యూ అధికారి) గా పనిచేస్తుండేవారు. 1875 దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది. తండ్రిగారు చోడవరం బదిలీ అయి అక్కడే విషజ్వరంతో 1875 లోనే చనిపోయారు. విజయనగరంలో మేనమామగారి ఇంట్లో ఉంటూ రామమూర్తి మహారాజావారి ఇంగ్లీషు పాఠశాలలో ప్రవేశించి 1879లో మెట్రిక్యులేషన్‌ పరీక్ష ప్యాసయ్యారు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావు రామమూర్తికి సహాధ్యాయి. ఆ ఏడే ఆయనకు పెండ్లి కూడా అయింది. 1880లో ముప్ఫై రూపాయల జీతం మీద పర్లాకిమిడీరాజావారి స్కూల్లో ఫస్టుఫారం లో చరిత్ర బోధించే అధ్యాపకుడైనాడు. సంసారబాధ్యత (తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు) రామమూర్తిపై బడింది. ప్రైవేటుగా చదివి 1886లో ఎఫ్‌.ఏ., 1894లో బి.ఏ. మొదటిరెండుభాగాలు, 1896లో మూడోభాగం ప్యాసై పట్టం పుచ్చుకున్నారు. ఇంగ్లీషు, సంస్కృతాలు గాక, ప్రధానపాఠ్యాంశంగా చరిత్ర తీసుకుని రాష్ట్రంలో ఫస్టుక్లాసులో, రెండోర్యాంకులో ఉత్తీర్ణులైనారు. రాజావారి హైస్కూలు కాలేజి అయింది. అప్పుడు ఆయనకు కాలేజి తరగతులకు పాఠాలు చెప్పే యోగ్యత వచ్చింది.

ఆరోజుల్లోనే ఆయనకు దగ్గర అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నారు. ఈపరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవరభాషలో పుస్తకాలు రాసి సొంతడబ్బుతో స్కూళ్ళుపెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళభాషలోనే చదువుచెప్పే ఏర్పాట్లు చేశారు. మద్రాసుప్రభుత్వం వారు ఈకృషికి మెచ్చి 1913లో “రావ్‌ బహదూర్‌” బిరుదు ఇచ్చారు. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణనిర్మాణ విధానం నేర్చుకొన్నారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించారు. సవర దక్షిణ ముండా భాష. మనదేశంలో మొట్టమొదట ముండా ఉపకుటుంబభాషను శాస్త్రీయంగా పరిశీలించినవాడు గిడుగు రామమూర్తి. ఆస్ట్రో-ఏషియాటిక్‌ భాషాకుటుంబంలో ఒక శాఖ ముండాభాషలు. ఆర్యభాషా వ్యవహర్తలు మనదేశానికి రాకముందు (క్రీ.పూ. 15వ శతాబ్ది) నుంచి వీళ్ళు మనదేశంలో స్థిరపడ్డారు. వీరిని “శబరు”లనే ఆదిమజాతిగా ఐతరేయబ్రాహ్మణం (క్రీ.పూ. 7వశతాబ్ది) లో పేర్కొన్నారు. హైస్కూల్లో చరిత్రపాఠం చెప్పేరోజుల్లోనే దగ్గరలో ఉన్న ముఖలింగదేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని చదివారు. విషయపరిశోధన చేసి వాటి ఆధారంగా ఎన్నో చారిత్రకాంశాలు, ముఖ్యంగా గాంగవంశీయులను గురించి రామమూర్తి ఇంగ్లీషులో ప్రామాణికవ్యాసాలు రాసి Indian Antiquary లోనూ Madras Literature and Science Society Journal లోనూ ప్రచురించారు. 1911లో గిడుగువారు 30 ఏళ్ళ సర్వీసు పూర్తికాగానే అధ్యాపకపదవి నుంచి స్వచ్ఛందంగా రిటైరయారు. అంతకుముందు కొద్ది సంవత్సరాల ముందే ఆధునికాంధ్రభాషాసంస్కరణ వైపు ఆయన దృష్టి మళ్ళింది.

3. వచనభాష సంస్కరణోద్యమం 1911-1915

1907లో J. A. Yates అనే ఇంగ్లీషుదొర ఉత్తరకోస్తాజిల్లాలకు స్కూళ్ళ ఇన్స్పెక్టర్‌గా వచ్చాడు. చిన్న తరగతుల్లో తెలుగుపండితులు పాఠాలు చెప్పేపద్ధతి ఆయనకు అర్థం కాలేదు. ప్రజలు వ్యవహరించేభాష, పుస్తకాలభాష మధ్య ఎందుకు తేడాలున్నాయి అన్నది ఆయన ముఖ్యసమస్య. అంతకుముందు తమిళదేశంలోనూ అదే సమస్య ఆయన్ను వేధించింది. విశాఖపట్నంలో Mrs A.V.N. College ప్రిన్సిపాల్‌గా ఉన్న పి.టి. శ్రీనివాస అయ్యంగారిని అడిగితే ఆయన గురజాడ, గిడుగులు దీనికి సమాధానం చెబుతారని అన్నారు. ఆవిధంగా గిడుగువారు జీవిత ఉత్తరార్థంలో ఈవిషయాన్ని గురించి గాఢంగా ఆలోచించి తెలుగు విద్యావిధానంలో అన్యాయం జరుగుతున్నదని గుర్తించారు. గురజాడ గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సుదొర — ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారికభాషోద్యమం ఆరంభమైంది. అప్పటికే ఇంగ్లీషులో భాషాశాస్త్రగ్రంథాలు చదివిన గిడుగు ప్రతియేడూ జరిగే అధ్యాపకసదస్సుల్లో జీవద్భాష ప్రాధాన్యాన్ని గురించి ఉపన్యాసాలిచ్చారు.

నన్నయ్య కాలానికే కావ్యభాషకు శాసనాల్లో కనిపించే వ్యవహారభాషకు దూరం ఏర్పడుతున్నట్టు గుర్తించవచ్చు. నన్నయ్య తనకు ముందు రచనల్లో సాంప్రదాయికంగా వచ్చే రూపాలను వాడాడు. శాసన భాషలో ఇస్తిమి, నాలుగో, ఇచ్చినాడు వంటి రూపాలు ఆకాలానికే ఉన్నాయి. లక్షణగ్రంథాలు కవిత్రయంవారి ప్రయోగాలే ఆధారంగా వెలిశాయి. పదసాహిత్యంలో వ్యవహారరూపాలు ఎక్కువగా కనిపించినా వ్యాకర్తలు వీటికి సాధుత్వం కల్పించలేదు. ప్రామాణికమైన వచనవాఙ్మయం తెలుగులో ఇటీవలి శతాబ్దుల్లోనే మొదలైంది. ఇంగ్లీషుపాలనలో అచ్చుయంత్రం రావటం, స్కూళ్ళు, కాలేజీలు స్థాపించి అందరికీ అందుబాటులో వుండే నూతనవిద్యావిధానం స్థాపించటం, కథ, వ్యాసం, నవల, నాటకం మొదలైన సాహిత్యప్రక్రియలు వ్యాపించటంవల్ల వచనభాషలో రచనలసంఖ్య పెరిగింది. దానికి కావ్యభాష అనువైందికాదని పైనలుగురు భాషాసంస్కరణోద్యమం చేపట్టారు.

1852లో సి. పి. బ్రౌన్‌ ఇలా అన్నాడు –
“Our native teachers would willingly reject common Telugu altogether and teach us the poetical dialect alone, which they themselves, however, cannot use in daily talking and writing” (“On the Telugu alphabet”, p. xxix, Mixed-dialect Dictionary, appended to C.P. Brown, Telugu-English Dictionary (1852 repr. by A.P. Sahitya Akademi in 1966)).

1897లో గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకానికి ముందుమాట రాస్తూ వ్యవహారభాషలో సృజనాత్మకరచనలు రావాలని ఆకాంక్షించాడు. 1909లో చాలామార్పులతో వచ్చిన కన్యాశుల్కం ద్వితీయసంపుటం ఉపోద్ఘాతంలో అప్పారావు ఇలా అన్నాడు –

“Principal P.T. Srinivasa Iyengar recently started a Telugu Teaching Reform Society, among the aims and objects of which, the cultivation of vernacular Telugu holds a prominent place, and Mr. Yates, whose name will always be remembered in the Telugu districts for the introduction of rational methods of teaching into our schools, has lent support to it by accepting the Presidentship of the society”. (Gopalreddy, B.,ed.p.x).

విజయనగరంలో “ఆంధ్రసాహిత్యసంఘము” ఏర్పడ్డది; దానికి గిడుగు రామమూర్తి ఉపాధ్యక్షుడు, బుర్రా శేషగిరిరావు కార్యదర్శి. 1911లో శ్రీనివాస అయ్యంగారు పండితుల వాదాన్ని ఖండిస్తూ ఇంగ్లీషులో “Death or life: a plea for vernaculars” అనే చిన్నపుస్తకంతోపాటు వ్యవహారభాషలో “లాంగ్‌మన్స్‌ అర్థ్‌మెటిక్కులు” అనే పుస్తకాన్ని ప్రచురించారు. అదే సంవత్సరం చెట్టి లక్ష్మీనరసింహం “గ్రీకు మిత్తులు” అనే పుస్తకాన్ని అచ్చువేశారు.

1912-13లో స్కూలుఫైనల్‌ లో వ్యాసరచన కావ్యభాషలో గాని ఆధునికభాషలో గాని రాయవచ్చునని స్కూలుఫైనల్‌ బోర్డు కార్యదర్శి ఒక జీ.ఓ. ఇచ్చాడు. ఆధునికభాషకు లక్ష్యంగా బ్రౌన్‌ తెలుగు రీడర్‌ ను, ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రచరిత్రను ఉదాహరించాడు. ఈమార్పుల వల్ల తెలుగుసాహిత్యానికి అపకారం జరుగుతుందని పండితుల్లో అలజడి బయలుదేరింది. మద్రాసులో జయంతి రామయ్య అధ్యక్షతన “ఆంధ్ర సాహిత్యపరిషత్తు” ఏర్పడ్డది. వావిలకొలను సుబ్బారావు, వేదం వేంకటరాయ శాస్త్రి లాంటి పండితులు జయంతి రామయ్య వాదాన్ని బలపరిచారు. దేశం అంతటా సభలుపెట్టి వ్యాసరచనపరీక్షలో ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను ఉపసంహరించాలని పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీసారు.

సంప్రదాయవాదుల ఉపపత్తులు —

  1. కావ్యభాష తెలుగుదేశమంతటా ఏకరూపతతో ఉన్నది. దానికి వ్యాకరణం, అనుశాసనం ఉన్నాయి. ఏది తప్పో ఏది ఒప్పో సులభంగా నిర్ణయించవచ్చు. వ్యవహారభాషలో విపరీతంగా వైవిధ్యం ఉంది; దానికి ప్రమాణం లేదు.
  2. వ్యాకర్తలు వ్యవహారభాషను “గ్రామ్యం” అన్నారు. అది రచనకు యోగ్యం కాదు. ముందుతరాల వారికి అటువంటిభాష అర్థంకాదు. ప్రాచీనసాహిత్యం ముందుతరాలవారికి అర్థంకాని స్థితి ఏర్పడుతుంది. అది తెలుగుసంస్కృతికి పెద్ద దెబ్బ.
  3. ఆధునికభాషను ప్రాచీనభాష దగ్గరికి తీసుకువెళ్ళాలి గాని ప్రాచీనభాషను సులభంగా మార్చే యత్నం చేయగూడదు.
  4. గ్రాంథికవ్యావహారికభాషల సంబంధం ప్రామాణికమైన ఇంగ్లీషుకు వాడుక ఇంగ్లీషుకు ఉన్న తేడాలాంటిది.

ఆధునికుల ఉపపత్తులు —

  1. కావ్యభాషకు, ఇప్పుడు జీవద్భాషగా వాడే తెలుగుకు మధ్య చాలా అంతరం ఉంది. కావ్యభాష కొద్దిమంది సొత్తు. జనసామాన్యానికి రాసే పుస్తకాలకు అది పనికిరాదు. కావ్యభాషలో ఇప్పుడు ఎంత గొప్పపండితుడైనా తప్పులేకుండా రాయలేడు.
  2. సమకాలీన వ్యవహారభాషలోనే ప్రాచీన వ్యాకర్తలు, పండితులు వ్యాఖ్యానాలు రాసారు. రాయవాచకం లాటి చరిత్రలు రాసారు. పద్యభాష వచనరచనకు, విద్యావ్యాప్తికి సాధనం కాలేదు. ఆధునికులు నేటిభాషలో ఆలోచిస్తారు గాని కృత్రిమమైన గ్రాంథికభాషలో ఆలోచించలేరు.
  3. శిష్టవ్యావహారికమంటే చదువుకొన్నవాళ్ళ భాష; సభల్లోను, వాగ్వాదాల్లోను వాడేది పామరులు వాడే “గ్రామ్యం” కాదు. గ్రాంథికవాదులు నిత్యవ్యవహారంలో వాడే భాషలో రాయటానికి ఎందుకు సంకోచిస్తారు?

ప్రభుత్వానికి ఎన్ని మహజర్లు వేలసంతకాలతో గ్రాంథికవాదులు పంపినా పై ఉత్తర్వులు ఉపసంహరించలేదు.

1913 ఏప్రిల్‌ నెలలో మద్రాసు యూనివర్సిటీ వారు ఎఫ్‌.ఏ. లో తెలుగువ్యాసరచనకు ఏభాషను ఉపయోగించాలో నిర్ణయించటానికి “కాంపోజిషన్‌ కమిటీ”ని నియమించారు. దానిలో (a) ఆధునికుల ప్రతినిధులుగా గిడుగు రామమూర్తి, గురజాడ అప్పారావు, పి.టి. శ్రీనివాస అయ్యంగారు, బుర్రా శేషగిరిరావులను, (b) ప్రాచీనభాషావాదుల ప్రతినిధులుగా వేదం వేంకటరాయ శాస్త్రి, జయంతి రామయ్య, కొమర్రాజు లక్ష్మణరావు, జి. వేంకటరంగయ్యలను నియోగించారు. మధ్యస్థులుగా ఆర్‌. రంగాచారి (అధ్యక్షుడు), ఠాంసన్‌ నియుక్తులైనారు. రంగాచారి ముగ్గురువ్యక్తులతో ఒక సబ్‌ కమిటీ వేసి “ఆధునిక – ప్రాచీన” రూపాల జాబితాలు రాయమని నిర్దేశించాడు.

“The nominal, pronominal and verbal forms be classified, as far as possible into archaic and current varieties and the current forms alone be allowed to be used in modern prose composition, current forms being determined from usage in literature as well as in polite speech prevailing among educated Telugu people” (అ. రమాపతిరావు, 1971 .. 85).

పై ఆదేశానుసారం ఆధునికరూపాలనే గిడుగు గురజాడలు సేకరిస్తే, కొమర్రాజు, జయంతి “ప్రాచీనరూపాల” జాబితాలు రాశారు. “as well as” అంటే సాహిత్యభాషలో ఉండి ఇప్పటివాళ్ళకు కూడా అర్థమయ్యేరూపాలనే విపరీతార్థం తీసారు. ఈలోపల మరోనలుగురు సభ్యులను రాయలసీమనుంచి కమిటీలో వేశారు. వాళ్ళంతా గ్రాంథికవాదులే. ఎక్కువమంది గ్రాంథికం వైపు మొగ్గటంతో వ్యావహారికవాదుల తీర్మానం నెగ్గలేదు. మద్రాసు యూనివర్సిటీ సిండికేటు ఆగస్టు 11, 1914న ఈకింది తీర్మానం చేసింది –
“Report of the Intermediate Composition Committee circulated by the direction of the Syndicate with the information that the Syndicate is not at present in a position to recognize what is known as Modern Telugu for University purposes” (అ. రమాపతిరావు, 1971 .. 97).

గురజాడ అప్పారావు “Minute of Dissent”ను కాంపోజిషన్‌ సబ్‌కమిటీకి అందచేశాడు. ఇది వ్యావహారిక భాషోద్యమంలో ఒక ముఖ్యమైన మైలురాయి. యూనివర్సిటీ నిర్ణయాన్నిబట్టి ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 22, 1915 న శైలీస్వేచ్ఛను ఉపసంహరిస్తూ ఒక ఉత్తరువు జారీ చేసింది. విద్యావిధానంలో వ్యవహారభాషకు స్థానం లేకుండాపోయింది. ఈపరిస్థితి 1970ల దాకా సాగింది.

4. వచనభాషాసంస్కరణోద్యమం 1915-40

స్కూలు కాలేజీ పుస్తకాల్లో గ్రాంథికభాషే పాతుకుపోయింది; కొన్నిటిలో వీరేశలింగంగారు ప్రతిపాదించిన సరళగ్రాంథికం కూడా వచ్చింది. గిడుగు రామమూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏరచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించాడు. 1919లో గిడుగు “తెలుగు” అనే మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాసపాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించాడు. కాని ఆపత్రిక ఒక ఏడాది మాత్రమే నడిచింది. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి, వీరేశలింగం, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైన కవులు, పండితులు వ్యావహారికభాషావాదం వైపు మొగ్గు చూపారు. 1919 ఫిబ్రవరి 28న రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షులుగా, గిడుగు కార్యదర్శిగా “వర్తమానాంధ్ర భాషాప్రవర్తకసమాజం” స్థాపించారు. 1933లో గిడుగు రామమూర్తి సప్తతిమహోత్సవం ఆయన అభిమానులు, శిష్యులు రాజమహేంద్రవరంలో బ్రహ్మాండంగా జరిపారు. తెలికచెర్ల వెంకటరత్నం సంపాదకుడుగా ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన 46 పరిశోధకవ్యాసాలతో Miscellany of Essays (వ్యాససంగ్రహం) అనే ఉద్గ్రంథాన్ని ఆయనకు సమర్పించారు. (?)1924లో కాకినాడలోని ఆంధ్రసాహిత్యపరిషత్తు ఆధికారికంగా వ్యావహారికభాషానిషేధాన్ని ఎత్తివేసింది. 1936లో నవ్యసాహిత్యపరిషత్తు అనే సంస్థను ఆధునికులు స్థాపించి సృజనాత్మకరచనల్లో శిష్టవ్యావహారికాన్ని ప్రోత్సహించే “ప్రతిభ” అనే సాహిత్యపత్రికను ప్రచురించారు. 1937లో తాపీ ధర్మారావుగారు సంపాదకులుగా “జనవాణి” అనే పత్రిక కేవలం ఆధునిక ప్రమాణభాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయటం మొదలుపెట్టింది.

మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవరభాషావ్యాకరణాన్ని 1931లోను, సవర-ఇంగ్లీషు కోశాన్ని 1938లోను అచ్చువేశారు. గిడుగువారి సవరభాషాకృషికి మెచ్చి Kaizer-e-Hind పతకాన్ని ప్రభుత్వం వారు ఆయనకు అందజేశారు.

గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికాసంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుదివిన్నపంలో వ్యావహారికభాషావ్యాప్తికి చాలా సంతృప్తి పొందారు. కాని, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టక పోవటానికి బాధపడ్డారు. ఆ విన్నపంలోని చివరిమాటలు –

“దేశభాష ద్వారా విద్య బోధిస్తేకాని ప్రయోజనం లేదు. శిష్టజనవ్యావహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రాంథికభాష గ్రంథాలలో కనబడేదే కాని వినబడేది కాదు. ప్రతిమ వంటిది. ప్రసంగాలలో గ్రాంథికభాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి.గ్రాంథికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆభాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను. నిర్దుష్టంగా ఎవరున్ను వ్రాయలేరు. వ్రాసినా వ్రాసేవారికి కష్టమే వినేవారికి కష్టమే. వ్రాసేవాండ్లేమి చేస్తున్నారు? భావం తమ సొంత (వాడుక) భాషలో రచించుకొని గ్రాంథికీకరణం చేస్తున్నారు. అది చదివేవాండ్లు వినేవాండ్లు తమ సొంత వాడుకమాటలలోకి మార్చుకొని అర్థంచేసుకొంటున్నారు. ఎందుకీ వృథాప్రయాస?

“స్వరాజ్యం కావలెనంటున్నాము. ప్రత్యేకాంధ్రరాష్ట్రము కోసం చిక్కుపడుతున్నాము. ప్రజాస్వామికపరిపాలనం కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితులలో మనప్రజలకు, సామాన్యజనులకు ఏభాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథరచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి. మీచేతులలో పత్రికలున్నవి. పత్రికల ద్వారా మీరు ఎంతైనా చేయగలరు”.
(From the Report submitted by the Telugu Language Committe to Andhra University, 1973: 99).

గిడుగు రామమూర్తి 1940, జనవరి 22 న కన్ను మూశారు.

భద్రిరాజు కృష్ణమూర్తి

రచయిత భద్రిరాజు కృష్ణమూర్తి గురించి: ఇరవయ్యవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులలో ఎన్నదగ్గ వ్యక్తి ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. ద్రావిడ భాషాశాస్త్రవిజ్ఞానిగా ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. గత శతాబ్దంలో ఆధునిక శాస్త్ర పద్ధతులలో ద్రావిడభాషా పరిశోధనను జరిపి ద్రావిడభాషాధ్యయన రంగానికి శాస్త్రీయతను కూర్చి స్థిరమైన పునాది ఏర్పరచిన వారిలో ముఖ్యులు. ఈయన 2003 లో రచించిన Dravidian Languages పుస్తకం గత రెండు శతాబ్దాల్లో ద్రావిడ భాషాధ్యయనంలో సాధించిన అభివృద్ధిని సాధికారకంగా చర్చించి నేటి తరం ద్రావిడ భాషా శాస్త్రజ్ఞుల పాలిటి ప్రమాణ గ్రంథంగా నిలిచిందని చెప్పవచ్చు. ద్రావిడ భాషా తత్వాన్ని గురించి, తెలుగు ధాతువుల ప్రాతిపదిక స్వరూప స్వభావాల గురించి, తెలుగు భాష నవీకరణ గురించి ఎన్నెన్నో పరిశోధనా గ్రంధాలు, వ్యాసాలు రచించాడు. ...