ఖాళీతనాన్ని మోయలేని తపుకు
వీపుకంటుకుపోయిన కడుపు
ఆకలి పాటనందుకున్నాయి
కలలన్నీ పోగేసి పోసిన మండె మొలకలెత్తాలంటే
ఎన్ని కడవల కన్నీళ్ళతో తడపాలో!
గుండెల్ని నిలువునా చీల్చుకెళ్ళిన గోదారికి
ఏ ఊరి తరి ఎన్ని నెర్రెలు నేరిస్తేనేం?
ఎనుకటి తడి జ్ఞాపకాలను మోస్తూ
ఒళ్ళంతా విచ్చుకున్న పొడికళ్ళతో
ఎదురుచూస్తున్న చెరువును
సడిలేని మత్తడి
యెట్లా సముదాయిస్తది?
కాలువ మొదట్లో
ఆడుతున్న పిలగాండ్ల కళ్ళ నిండా
కదలని కాగితప్పడవల నీలినీడలు
పొద్దుగాలనంగా ఊరేగింపుకెళ్ళిన
కప్పతల్లి
పొద్దుగూకినా ఇల్లు చేరకపాయె.