1. ట్రోయ్ యుద్ధం నిజమా, కల్పనా?
భారత యుద్ధం గురించి చదువుతున్నప్పుడు వచ్చే రకం సందేహాలే ట్రోయ్ యుద్ధం గురించి కూడా వస్తాయి. ఈ కథ పురాణమా? ఇతిహాసమా? ఈ యుద్ధం నిజంగా జరిగిందా? జరిగితే ఎప్పుడు జరిగింది? యుద్ధంలో కనిపించే సంఘటనలు, పాత్రలు (మనుష్యులు, దేవతలు) నిజమా? కల్పనా? ఈ యుద్ధం గురించి ఎవ్వరు రాసేరు? ఎప్పుడు రాసేరు? వగైరా, వగైరా!
ట్రోయ్‌లో జరిగిన యుద్ధం నిజమా, కల్పనా? అన్న ప్రశ్నను పక్కకి పెట్టి చూస్తే, ఈ కథయొక్క ప్రాముఖ్యం బాగా అర్థం అవుతుంది. ఎంతమంది చరిత్రకారులు, కవులు, కళాకారులు, పరిశోధకులు, ఎన్ని తరాలబట్టి ప్రభావితులు అవుతున్నారో చూస్తే ఈ కథయొక్క గొప్పదనం అర్థం అవుతుంది. ఆధునిక వైజ్ఞానిక, సాంకేతిక విప్లవాలకు ముందు పాశ్చాత్యుల నమ్మకాలు, విలువలు ఎలా ఉండేవో తెలుసుకోవాలంటే ఈ రెండు గ్రంథాలు చదవాలి. యుద్ధంలో ప్రతి చిన్న సంఘటనను పేరుపేరునా హోమర్ వర్ణించి చెబుతూ ఉంటే, “ఇంత విపులమైన వర్ణన నిజం కాక కల్పన ఎలా అవుతుంది?” అనిపిస్తుంది. మహాభారతయుద్ధాన్ని తిక్కన వర్ణించిన తీరు చూసినప్పుడు కూడా ఇదే రకం అనుభూతి కలుగుతుంది.
శాస్త్రవేత్తలు పురాతన కథాసాహిత్యాన్ని మూడు వర్గాలుగా విడగొడతారు: పురాణాలు (myths), వీరగాథలు (legends), జానపదకథలు (folktales). పురాణకథలలో సర్వసాధారణంగా మానవులు, దేవతలు, భీకరాకారులు, అరివీరభయంకరులు పాత్రలుగా కనబడుతుంటారు; ఆధిదైవిక సంఘటనలు (మానవులు, దేవతలు కలవగా పిల్లలు పుట్టడం, వదలిన అస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం, దివ్యదృష్టితో చూడడం, శపించడం, వగైరాలు) కనబడుతూ ఉంటాయి. ఆధిదైవిక సంఘటనలను మినహాయిస్తే మిగిలిన అంశాలు వీరగాథలలో కనబడుతూ ఉంటాయి. జానపదాలు మన అనుభవాలకు మరి కొంచెం దగ్గరగా ఉంటాయనుకోవచ్చు. ఒక జాతి చెప్పుకునే పురాణకథలనుబట్టి ఆనాటి ప్రజల నమ్మకాలేమిటి? ఎలా బ్రతికేవారు? వగైరా ప్రశ్నలకి సమాధానాలు చెప్పొచ్చు. పురాణాలు చెప్పే కథలన్నీ నిజమే అనిన్నీ, పురాణాలలో దర్శనమయ్యే వ్యక్తులు, రాజులూ, చారిత్రక సత్యాలనిన్నీ మనస్ఫూర్తిగా నమ్మిన ప్రజలు అలెగ్జాండర్ (దరిదాపుగా, మౌర్య చంద్రగుప్తుడి) కాలం వరకు గ్రీసులో ఉండేవారు. ఇప్పటికీ అటువంటి వ్యక్తులు మనకు మన సమాజాలలో తరచుగా తారసపడుతూనే ఉంటారు.
ట్రోయ్‌లో జరిగిన యుద్ధం గురించి మనకు ఉన్న ముఖ్యమైన ఆధారాలు గ్రీకు సాహిత్యంలో కనిపిస్తాయి; కానీ ఏ ఒక్క చోటా మనకి సాధికారికమైన ఆధారాలు కనబడవు. ఒకే కథ ఒకొక్క పాఠాంతరంలో ఒకొక్క విధంగా కనబడుతూ ఉంటుంది. ఈ యుద్ధం నిజంగా జరిగి ఉంటే అది సామాన్య శకానికి పూర్వం (సా.శ.పూ 1194-1184 మధ్య కాలంలో) జరిగి ఉండవచ్చని గ్రీకు శాస్త్రవేత్త ఎరతోస్తనీస్ (Eratosthenes, సా. శ. పూ. 276-194) వేసిన అంచనా నమ్మదగ్గదే అనడానికి అధారాలు కనిపిస్తున్నాయని పురావస్తు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అనగా, కంచు యుగపు (సా.శ.పూ. 3000-1200) చివరి దశలో అని మనం చెప్పుకోవచ్చు. అనగా అప్పటికి భారతదేశంలో సింధు నాగరికత అంతరించిపోయింది. గౌతమబుద్ధుడు, మహావీరుడు ఇంకా అవతరించలేదు. (ఇక్కడ వాడిన కాలమానంలో సా.శ.పూ. = క్రీ.పూ. = BCE. సా.శ. = క్రీ.శ. = CE)
సా.శ. 1870 లో జర్మనీ దేశపు వాణిజ్యవేత్త, ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు, హైన్రిక్ ష్లీమన్ (Heinrich Schliemann) పశ్చిమ టర్కీలో (ట్రోయ్ నగరపు సమీపంలో) జరిపిన తవ్వకాలలో ఒక శిథిలమైన కోటదిబ్బ, దాని చుట్టూ 25 మీటర్ల లోతు వరకు శిథిలమైన భవనాల అవశేషాలు కనిపించేయి. వాటి చుట్టూ 46 ఇతర వాటికలు కనిపించేయి. ఇటీవల జరిపిన మరికొన్ని తవ్వకాలలో కనబడ్డ ఒక పురాతన నగరం హైన్రిక్ ష్లీమన్ కనుక్కున్న నగరం కంటే పదింతలు పెద్దది అని తెలిసింది. ఈ నగరం ఉన్న ప్రాంతాలలో సా.శ.పూ. 3000 నుండి సా.శ.పూ. 1350 వరకు అనిర్విచ్ఛిన్నంగా జనావాసాలు ఉండేవని తీర్మానించేరు. అంతేకాదు. సా.శ.పూ. 1180 కి సంబంధించిన భూమి పొరలలో వేడికి మాడిపోయిన అవశేషాలూ, మానవ అస్థిపంజరాలూ కనిపించడంతో అవి ఏదో యుద్ధానికి సంబంధించినవే అయుంటాయని నమ్ముతున్నారు.
ఈ నగరం గురించి, అక్కడ జరిగిన యుద్ధం గురించి, ఆనోటా, ఈనోటా, జానపదుల నోటా 400 సంవత్సరాల తరువాత విన్న కథలని హోమర్ ఇలియాడ్, ఓడిస్సీ అనే రెండు ఉద్గ్రంథాలలో పొందుపరచి ఉంటాడు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇలియాడ్ సంకలనం సా.శ.పూ 750 లోను, ఓడిస్సీ సంకలనం సా.శ.పూ 725 లోను పూర్తి అయి ఉంటాయి. అనగా, కంచు యుగం (the Bronze Age) పూర్తి అయిపోయి ఆ భౌగోళిక ప్రాంతం చీకటి యుగం (Dark Age) లోకి ప్రవేశించిన తరువాత. అనగా, ఎప్పుడో ‘మా తాతలనాడు నేతులు తాగేం. కావలిస్తే మా మూతులు వాసన చూసుకోండి’ అనే ధోరణిలో హోమర్ గానం చేసిన జానపదకథ ఇది. ఇలా సంకలించబడ్డ మౌఖికకథల సమాహారం మార్పులు, చేర్పులతో లిఖిత రూపం దాల్చేసరికి మరికొన్ని దశాబ్దాలో, శతాబ్దాలో పట్టి ఉండవచ్చు.
“అసలు హోమర్ అనే వ్యక్తి నిజంగా ఉన్నాడా?” అని ప్రశ్నించేవాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని గ్రీకు మాండలికాలలో ‘హోమర్’ అంటే గుడ్డివాడు అని అర్థం వస్తుంది కనుక హోమర్ గుడ్డివాడయి ఉంటాడని కొందరి తీర్మానం. ఎందుకంటే ఓడిస్సీలో ఒక చోట ఒక అంధుడి పాత్ర ఉంటుంది. ఆ అంధుడు వచ్చి యుద్ధంలో విశేషాలను కథల రూపంలో చెబుతాడు. హోమర్ ఈ విధంగా తాను చెబుతున్న కథలో తానే ఒక పాత్రలా వచ్చేడని వీరి అభిప్రాయం. వ్యాసుడు కూడా భారత కథలో అక్కడక్కడ ‘అతిథి నటుడు’ గా వస్తూ ఉండడం గమనార్హం.
ఈ కథను చారిత్రకపరిశోధనకోణంనుండి విశ్లేషించడం కష్టం. ఈ కథలో తారసపడే చాలా పాత్రలు దైవాంశసంభూతులు (demigods) — అనగా దేవతలు, మానవులు కలవగా పుట్టినవారు. ఉదాహరణకి హెలెన్ ఒలింపియన్ దేవతల అధినేత అయిన జూస్ (Zeus; Zyoos) ఒక హంస రూపంలో వచ్చి మానవ వనిత లీడాని అనుభవించగా పుట్టిన సంతానం. అదే విధంగా హెలెన్‌ని పేరిస్ వశపరచుకోడానికి టైటన్ దేవత ఏఫ్రోడైటీ (aphrodite; ah-froh-DY-tee) వచ్చి చేసిన సహాయం కీలకం అవుతుంది. యుద్ధరంగంలో అనేక పర్యాయాలు దివినుండి భువికి దిగివచ్చిన దేవతలు ఇరుపక్షాలనూ సమర్థిస్తూ సహాయం అందిస్తారు. ఈ రకం సంఘటనలు నిజజీవితాలలో జరగడం అనేది మన అనుభవాలకు అతీతం. అలాగే యుద్ధం పది సంవత్సరాలు జరుగుతుంది. కంచుయుగంలో ట్రోయ్ నగరాన్ని పది రోజులు దిగ్బంధం చేసేరంటే నమ్మవచ్చేమో కాని పదేళ్ళు — అది కూడా నావికాదిగ్బంధం — అతిశయోక్తిలా అనిపిస్తుంది. మూడొంతులు, వైరం పదేళ్ళపాటు కొనసాగి ఉండవచ్చు. లేదా, యుద్ధం అడపాదడపా పదేళ్ళ కాలవ్యవధిలో జరిగి ఉండొచ్చు.
ఈ సమాచారం అంతటినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ట్రోయ్ అనే నగరం ఉండి ఉండవచ్చు. ఆ నగరం వద్ద పెద్ద యుద్ధం జరిగి ఉండవచ్చు. ఆ యుద్ధం జరగడానికి (హెలెన్ అనే) ఒక అందమైన యువతిని (పేరిస్ అనే) ఒక యువకుడు అపహరించడం కారణం అయి ఉండవచ్చు. ఈ కథలో కనిపించే కక్షలూ, కయ్యాలూ ఏళ్ళ తరబడి కొనసాగి ఉండవచ్చు. కానీ ఆ యుద్ధంలో కనీసం 30 మంది గ్రీకు సైనికులు ఒక కొయ్యగుర్రంలో దాగుని, దొంగచాటుగా ట్రోయ్ నగరంలో ప్రవేశించి, ఆ నగరాన్ని సర్వనాశనం చేయడం అతిశయోక్తిలా కనబడుతుంది. వీటిలో కొన్ని నిజంగా జరిగిన వేర్వేరు సంఘటనలు కావచ్చు. అదే విధంగా అకిల్లీస్వంటి వీరులు నిజంగా ఉండేవారనడానికి స్వతంత్రమైన సాక్ష్యాధారాలు కనబడవు. కానీ వీరందరూ నిజమైన వీరుల చరిత్రల ఆధారంగా కవి సృష్టించిన పాత్రలు కావచ్చు. అలాగే ఈ కథలో కనిపించే దేవతలకీ మానవులకి మధ్యనున్న సంబంధబాంధవ్యాలు మన అనుభవపరిధిలో నమ్మడానికి వీలు లేనివి. వీటిని కవి కల్పించిన ఉత్ప్రేక్షలు అనే అనుకోవాలి.
2. ఇలియాడ్ కథ: సంగ్రహంగా
హోమర్ రాసిన ఇలియాడ్ గ్రంథంలో కథ గ్రీకు సేనలకు, ట్రోయ్ సేనలకు మధ్య యుద్ధం తొమ్మిదో సంవత్సరంలో ఉండగా మొదలవుతుంది. అనగా యుద్ధం చివరి దశలో ఉండగా కథ చెప్పడం మొదలవుతుంది.
కవి, సాహిత్యాలకి అధిదేవత అయిన ‘మూజ్’ని ప్రార్థించి గ్రీకు యోధులలో అగ్రేసరుడైన అకిల్లీస్ (Achilles; ah-KIL-eez) కోపోద్రేకాలకి కారణమేమిటో చెప్పడంతో కథ ప్రారంభం అవుతుంది. ప్రారంభవాక్యంలో మొదటి మాట గ్రీకు భాషలో ‘Μηνιν’ (‘mēnin’, మేనిన్ అనగా ‘wrath or rage’ లేదా తీవ్రమైన ఆగ్రహం). రెండవ మాట ‘aeide,’ అనగా గేయం, పాట. మూడవ మాట ‘thea,’ అనగా దేవత. ఎవరీ దేవత? సాహిత్యాలకి అధిదేవత అయిన ‘మూజ్.’ అనగా, “ఓ దేవతా! అకిల్లీస్ ఆగ్రహంయొక్క పాట!” అని హోమర్ గ్రంథ రచన మొదలు పెడతాడు. ఇంగ్లీషులో, “Rage—Goddess, sing the rage of Achilles, son of Peleus.”
ఈ అకిల్లీస్ తండ్రి పెలియస్ (Peleus), ఒక కులీన రాజవంశీయుడైన మానవుడు. తల్లి తేటిస్ (Thetis) దైవగణాలకి చెందిన ఒక జలకన్య (nymph). ఇలియాడ్‌లో వచ్చే పాత్రలలో అత్యధికులు గ్రీసు దేశపు దక్షిణ పరగణాలనుండి వచ్చిన వారైతే ఒక్క అకిల్లీస్ మాత్రం ఉత్తరాదివాడు. రూపురేఖలలో తేడా ఉన్నవాడు. అనగా ఒక విధంగా ‘పరాయి’ వాడు. యవ్వనం, పరాక్రమం అతని భూషణాలు అయితే కూటనీతి, మంత్రాంగం తెలియని ఉడుకు రక్తం అతని శత్రువులు. అకిల్లీస్కి, గ్రీకు సర్వసేనాధిపతి అయిన అగమేమ్నాన్కి (Agamemnon; ag-ah-MEM-non) మధ్య వచ్చిన మనస్స్పర్ధల కారణంగా యుద్ధం చెయ్యనని ప్రతిన పూని అకిల్లీస్ తన గుడారంలో కూర్చుంటాడు. దరిదాపు యుద్ధం అంతం అయేవరకు అకిల్లీస్ అలకలోనే ఉంటాడు. చిట్టచివరికి తన ఆప్తమిత్రుడు పెట్రాక్లస్ (Patroclus; pa-TRO-klas) ట్రోయ్ రాకుమారుడు హెక్టర్ (Hector) చేతులలో మరణించేసరికి కోపోద్రేకాలు పెల్లుబుకగా దుమారంలా యుద్ధరంగంలోకి దూకి పెట్రాక్లస్ మరణానికి కారణభూతుడైన హెక్టర్‌ని హతమార్చి అతని మృతదేహాన్ని తన రథానికి కట్టి, ఈడ్చుకెళ్ళిపోతాడు. ట్రోయ్‌లో యువరాజుకు దహనసంస్కారాలు చేయాలి అంటే శవం ఉండదు. కొడుకు మృతదేహాన్ని తెచ్చుకుందుకని హెక్టర్ తండ్రి ప్రయాం (Priam; PRI-yum) అర్ధరాత్రి వేళ, ఒంటరిగా, రహస్యంగా, అకిల్లీస్ ఆవాసానికి వెళతాడు.
ప్రయాం రాకకి అకిల్లీస్ ఆశ్చర్యపోయి, “ఇంత గ్రీకు సైన్యాన్ని దాటుకొని నీ కొడుకు శవం కోసం నువ్వు నా గుడారానికి ఎలా రాగలిగావు?” అని అడిగితే, ప్రయాం అంటాడు, “ఇది నా రాజ్యం. నా రాజ్యం గురించి గ్రీకులకంటే నాకే ఎక్కువ తెలుసని అనుకుంటున్నాను. నీ దగ్గరకు రావడం నాకు పెద్ద సమస్య కాదు” అని సమాధానం చెప్పడంతో కథ పూర్తి అవుతుంది.
ఆశ్చర్యకరమైన విషయాలు ఏమిటంటే బహుళప్రచారం పొందిన కొయ్యగుర్రం ప్రస్తావన ఇలియాడ్‌లో కనిపించదు. అలాగే అకిల్లీస్ మరణం పేరిస్ బాణం ద్వారా, అపోలో సహాయంతో, జరిగినట్లు కూడా ఇలియాడ్‌లో కనిపించదు. యుద్ధం అయిన తరువాత అనేక ప్రక్షేపాలు కథలో చోటు చేసుకున్నాయి. అందుచేత చెప్పేవాడినిబట్టి కథ మారుతూ ఉంటుంది!!
ఇదీ టూకీగా ఇలియాడ్‌లో కథ. ఇదంతా ఒలింపస్ పర్వతం మీద నివసించే దేవుళ్ళ కనుసన్నలలో జరుగుతుంది. అనగా, ఈ దేవుళ్ళు కేవలం ప్రేక్షకులు కాదు. వీరు కూడా ఇరుపక్షాలకు వెనక ఉండి పురికొల్పడం, మద్దత్తు ఇవ్వడం, సహాయం చెయ్యడంవంటి పనులు చేస్తూ ఉంటారు. కనుక ట్రోయ్ యుద్ధం కేవలం రెండు మానవసైన్యాలకి పరిమితమైన యుద్ధం కాదు; దేవుళ్ళ మధ్య జరిగిన యుద్ధం కూడా. ఇది దేవుళ్ళ మధ్య జరిగిన ప్రచ్ఛన్నయుద్ధం. జూస్ పట్టమహిషి అయిన హీరా (Hera; HEE-ra), బుద్ధికి, యుద్ధాలకు అధినేత్రి అయిన అథీనా (Athena; ah-THEE-na), సముద్రాలకు అధిపతి అయిన పొసైడన్ (Poseidon; poh-SY-don) గ్రీకుల పక్షం అయితే ట్రోయ్ పక్షం కాసిన వారిలో అపోలో (Apollo; ah-POL-oh) ముఖ్యుడు. దేవుళ్ళ రాజైన జూస్ (Zeus; Zyoos) కూడా (రహస్యంగా, భార్యకు తెలియకుండా) ట్రోయ్ పక్షం కాస్తాడు.
హృదయవిదారకమైన అంశం ఏమిటంటే యుద్ధంలో మరణం తథ్యం. యుద్ధంలో పాల్గొనేవారు, తద్ద్వారా మరణించేవారిలో యువత ఎక్కువ. అకిల్లీస్ వయస్సులో పిన్నవాడు. ఉడుకు రక్తం వాడు. తల్లి ద్వారా సంక్రమించిన దైవాంశ దన్నుగా ఉన్నా యుద్ధంలో మరణాన్ని జయించలేకపోయాడు. “శౌర్యపరాక్రమాలతో అల్పకాలం బతికిన తరువాత వీరస్వర్గం కావాలా లేక సాధారణమైన జీవితంతో పూర్ణాయుర్దాయం కావాలా?” అని అడిగితే యుద్ధంలో మరణాన్ని ఎదుర్కొని వీరస్వర్గాన్నే కోరుకున్నాడు. అకిల్లీస్ చేతులలో వీరస్వర్గం పొందిన హెక్టర్ (Hector; HEK-Tar) కూడా యువకుడే!
మరి దేవుళ్ళ సంగతి? వారు అమరులు. వారికి మరణం లేదు. వారు వారి ఇష్టం వచ్చిన ఆటలు ఆడవచ్చు. మరణం లేకపోయినా, దేవతలు కూడా కొన్ని కష్టాలను ఎదుర్కోక తప్పలేదు. అకిల్లీస్ మరణంతో అతని తల్లి తేటిస్ గర్భశోకంతో బాధపడుతూనే ఉంది – నేటికీ!
భారతయుద్ధంలో వ్యాసుడు పద్దెనిమిది రోజుల యుద్ధాన్ని, దినాలవారీగా, వ్యూహాలవారీగా, అస్త్రాలవారీగా ఎలా వర్ణిస్తాడో హోమర్ కూడా అలా ఈ యుద్ధాన్ని వర్ణించుకుంటూ వస్తాడు. చిట్టచివరికి ట్రోయ్ నగరాన్ని పడగొట్టలేక గ్రీకు సేనలు ఒక వ్యూహం పన్ని పడవలలో ఎక్కి పారిపోయినట్లు నటిస్తారు. ఆ హడావిడిలో ఒక కొయ్యగుర్రాన్ని సముద్రపుటొడ్డున వదిలేసి మరీ పోతారు. ట్రోయ్ సేనలు వారి విజయానికి ఆ గుర్రం ఒక చిహ్నమని అనుకుంటూ దానిని ఈడ్చుకుని పట్టణం లోపలికి తీసుకుపోతారు. లోపలికి వెళ్ళిన తరువాత ఆ కొయ్యగుర్రం తలుపులు తెరుచుకుని గ్రీకు సేనావాహిని, ఒడిస్సియస్ (Odysseus; oh-DIS-yoos) నాయకత్వంలో, బయటకి వచ్చి ట్రోయ్ నగరాన్ని పరిపూర్ణంగా కొల్లగొట్టి, నిప్పుపెట్టి పోతారు. ఈ ఒడిస్సియస్ అనే గ్రీకు పేరు ఇంగ్లీషులో యులిసిస్గా మారింది.
భారతయుద్ధం ధర్మయుద్ధానికి ప్రతీక అయితే ట్రోయ్ యుద్ధం దేవతల ఆగ్రహానికి, స్వల్పబుద్ధికి ప్రతీక అనుకోవచ్చు.
గ్రీకు తత్త్వవేత్త ప్లేటో (సా. శ. పూ. 428 – 348) తనకు సుమారు నాలుగువందల ఏళ్ళ పూర్వుడైన హోమర్ కూర్చిన ‘ఇలియాడ్’ గురించి చెపుతూ ఇలా అన్నాడు: “దాదాపు ప్రతిరోజూ ఏథెన్స్ నగరంలోని విపణి వీథులలోనో, నాటక మందిరాలలోనో, లేక కొండవాలు పక్కనున్న విశాలమైన ఆరుబయలు మైదానంలోనో ఇరవైవేలకు పైగానే జనం పోగై, ఎవరో ఒక ప్రముఖ గాయకుడు ‘ఇలియాడ్’ లోని ‘హెక్టర్ మృతి’, ‘ప్రయాం రాజు – అకిల్లీస్ల భేటీ’ మొదలైన రసవద్ఘట్టాలను శ్రావ్యంగా గానం చేస్తుంటే శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటారు.”
విశ్వవిజేత అలెగ్జాండర్ (సా. శ. పూ. 356-322) ఇలియాడ్ గ్రంథాన్ని తన తలగడ కింద ఉంచుకుని, చదవాలని బుద్ధిపుట్టినప్పుడల్లా తీసి చదువుకునేవాడనీ, కుదిరినప్పుడల్లా ఇలియాడ్లోని ఘట్టాలు కథాంశాలుగా రచించబడ్డ నాటకాల ప్రదర్శనలు తిలకించేవాడనీ చరిత్రకారులు పేర్కొన్నారు.
యుద్ధం ముగిసిన తరువాత ఒడిస్సియస్ (యులిసిస్) తిరుగు ప్రయాణం చేసి ఇథకా చేరుకోవడానికి పదేళ్ళు పడుతుంది. ఈ తిరుగు ప్రయాణంలో ఒడిస్సియస్‌ని ఎదుర్కున్న సవాళ్ళని హోమర్ తన రెండవ గ్రంథం ‘ఓడిస్సీ’ లో వర్ణిస్తాడు. ‘ఓడిస్సీ’ రూఢ్యర్థం మహాప్రస్థానం.
సా. శ. పూ. 1 వ శతాబ్దంలో రోముకి చెందిన కవి వర్జిల్ ‘ఎనియాడ్’ (Aeneid) అనే గ్రంథంలో యుద్ధం ముగిసిన తరువాత కొందరు గ్రీకు యోధులు, ఎనియస్ (Aeneas) నేతృత్వంలో సముద్రం దాటుకుని ప్రస్తుతం టునీషియాలో ఉన్న కార్తేజ్ (Carthage) వచ్చి, అక్కడనుండి ఇటలీ వచ్చి, రోమ్ నగరం స్థాపనకు కారణభూతులు అవుతారని చెబుతాడు. హోమర్ రెండవ గ్రంథం ‘ఓడిస్సీ’, వర్జిల్ రాసిన ‘ఎనియాడ్’ సమాంతర గ్రంథాలు; ఓడిస్సీలో ఒడిస్సియస్ కథానాయకుడు అయితే ఎనియాడ్లో ఎనియస్ కథానాయకుడు అయినప్పటికీ రెండింటిలో కథలు మాత్రం ఒకటి కాదు.
3. అకిల్లీస్ జననం
స్వర్గానికి అధినేత అయిన జూస్‌కి ఉన్న అనేకమంది భార్యలలో ఒకతె టైటన్ దేవత థెమిస్ (Themis). “జూస్ కొడుకులలో ఒకడు జూస్ని పదవీభ్రష్టుడిని చేస్తాడు!” అని థెమిస్ జోస్యం చెప్పింది. ఈ జోస్యం ఇలా ఉండగా జూస్ ఒక రోజు సముద్రపుటొడ్డుకి విహారానికని వెళ్ళి, అక్కడ తేటిస్ (Thetis) అనే ఎలనాగను చూసి, మనసు పడి, పెళ్ళి చేసుకుంటానంటాడు. అప్పుడు “తేటిస్కి పుట్టబోయే కొడుకు తండ్రిని మించిన వాడు అవుతాడు” అని ప్రొమీథియస్ జోస్యం చెబుతాడు. (ఈ ప్రొమీథియస్సే మట్టితో మానవులను చేసి, ఆ మానవులకు నిప్పును బహుమానంగా ఇచ్చి మానవజాతి ప్రగతికి అంకురార్పణ చేసేడని ఒక కథ ఉంది!) జూస్ ఈ రెండు, రెండు కలిపితే నాలుగు అని లెక్క వేసుకుని, పెద్ద ఎత్తున కంగారుపడి, తేటిస్ని పెలియస్ అనే కులీన రాజవంశీయుడైన ముసలి మానవుడికి ఇచ్చి పెళ్ళి చెయ్యడానికి తాంబూలాలు ఇప్పించేసేడు. అప్పుడు ఈ ముసలి మానవుడికి తేటిస్ ద్వారా కొడుకంటూ పుడితే అతడు దైవాంశ సంభూతుడైన మానవుడు మాత్రమే అవుతాడు కానీ దేవుడు కాజాలడు కనుక తన ప్రాణానికి, పదవికి హాని ఉండదని జూస్ నమ్మిక. కనుక ఈ వివాహం మన కథకు కీలకం!
ఎంతో కీలకమైన ఈ పెలియస్ – తేటిస్ల వివాహాన్ని జూస్ దగ్గరుండి జరిపిస్తాడు. ఈ వివాహ వేదికలో రెండు కీలకమైన సంఘటనలు జరుగుతాయి. అందులో మొదటి సంఘటన: ఈ వివాహానికి సిద్ధులనదగ్గ ముగ్గురు వనితలు అతిథులుగా వస్తారు. వీరు దివ్యదృష్టితో వధూవరులకు కలగబోయే సంతానం గురించి జోస్యం చెబుతారు. ఒకామె, “మీకు అకిల్లీస్ అనే కొడుకు పుడతాడు. అతడు అందగాడు, బలవంతుడు, ధైర్యవంతుడు అవుతాడు!” అని చెబుతుంది. రెండవ సిద్ధురాలు, “మీ కొడుకును పరుగు వేగంలో మించినవాడు మరొకడు ఉండడు,” అంటుంది. మూడవ సిద్ధురాలు, “ట్రోయ్ నగరం భవిష్యత్తు మీ కొడుకు చేతులలోనే ఉంటుంది కానీ ఆ నగరపు విలుకాండ్ర చేతులలోనే మీ కొడుకు మరణం రాసి ఉంది!”
ఈ హెచ్చరికను మనస్సులో పెట్టుకుని అకిల్లీస్ పుట్టినప్పుడు తేటిస్ పిల్లవాడి మడమను మాత్రం చేతి మునివేళ్ళతో పట్టుకుని, అతని నగ్నశరీరాన్ని అంతటిని ఆర్కేడియాలో ఉన్న స్టిక్స్ (Styx) నదిలో ముంచింది. ఆ నదిలోని నీటితో తడిసిన మేర అంతా వజ్రంలా గట్టిపడిపోయింది – ఒక్క మడమ తప్ప. అందుకనే ఈ మడమ ఒక్కటే అతని శరీరంలో హననీయమైన (vulnerable) భాగం అయింది! (ఇతరత్రా బలిష్ఠంగా ఉన్న వ్యవస్థలో ప్రాణాంతకమైన దౌర్బల్యాన్ని వర్ణించడానికి ఆంగ్లంలో Achilles’ heel అనే పదబంధాన్ని వాడతారు.)
అకిల్లీస్ శుక్లపక్ష చంద్రుడిలా పెరిగి పెద్దవాడవుతూన్న సమయంలో అతని బాల్యమిత్రుడైన పెట్రాక్లస్తో కైరాన్ (Chiron; ki-rOn) అనే గురువు దగ్గరికి విద్యాబుద్ధులు నేర్చుకుందుకు పంపేరు. ఈ గురువు ఒక నరాశ్వం – అనగా మానవ శిరస్సు, గుర్రపు శరీరం ఉన్న విశిష్ట జీవి! ఈ నరాశ్వం శిష్యులిద్దరికీ గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, వేటాడం, పద్యాలు చదవడం, పిల్లనగ్రోవి మీద పాడడంవంటి విద్యలెన్నో నేర్పుతాడు.
పిల్లవాడు ఇలా ఎదగడం అంతా తల్లి కనుసన్నలలోనే జరుగుతూన్నా, ఆ మూడవ సిద్ధురాలు చెప్పిన జోస్యం తలుచుకున్నప్పుడల్లా ఆ తల్లి మనస్సు తల్లడిల్లుతూనే ఉంటుంది.
అకిల్లీస్ బాల్యదశలో ఉన్న రోజులలోనే సుదూరదేశంలో, సముద్రాలకి అవతల, ట్రోయ్ నగరంలో, రాణి హెకూబా గర్భవతియై ఉంది.
4. పేరిస్
1
కంచుయుగపు చివరి దశలో, అనగా సాధారణ శకారంభానికి 1000 ఏళ్ళ క్రితం, మధ్యధరాసముద్రపు ఉత్తరపు అంచున ఉన్న ఏజియన్ సముద్రాన్ని ఆనుకున్న భూభాగంలో, ఏథెన్స్, స్పార్టా, ట్రోయ్ అనే మూడు మహానగరాలు ఉండేవి. ప్రస్తుతం టర్కీగా వ్యవహరించబడే ప్రాంతాన్ని పూర్వం ఆసియా మైనర్ అనేవారు. ఈ ప్రాంతపు ఈశాన్య మూలన ట్రోయ్ నగరం ఉండేది. సముద్రపు దేవుడు పోసైడన్ సహాయంతో నిర్మించబడ్డ, దుర్భేద్యమైన ప్రాకారాలతో ఉన్న ట్రోయ్ నగరాన్ని రాజా ప్రయాం, రాణీ హెకూబా (Hecuba; he-KYOO-baa) జనరంజకంగా పరిపాలిస్తూ ఉండేవారు.
వీరికి కలిగిన ఏభయిమంది కొడుకులు, ఏభయిమంది కూతుళ్ళలో చెప్పుకోదగ్గవారు ముగ్గురు. అందరిలోకీ పెద్దవాడు, ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నవాడు అయిన హెక్టర్ యువరాజు. పితృభక్తి, దేశభక్తితోపాటు మిక్కిలి ధైర్యసాహసాలు కల వీరుడుగా ప్రసిద్ధి పొందేడు. హెక్టర్‌కి భార్య ఆండ్రొమాకే (Andromache) అన్నా, చిన్నారి కొడుకు స్కామాండ్రియస్ (Scamandrius) అన్నా విపరీతమైన ప్రేమాభిమానాలు. ఆ కాలంలో ఇతనిని మించిన యోధుడు ఒక్క అకిల్లీస్ మాత్రమే.
కసాండ్రా (Cassandra) హెక్టర్ చెల్లెలు. ప్రయాం-హెకూబాల పిల్లలందరిలో ఈమె మిక్కిలి దురదృష్టవంతురాలు. ఒలింపస్ పర్వతం మీద ఉండే అపోలో దేవుడు ఈమె అందాన్ని చూసి వెంటపడతాడు. తనని వివాహం చేసుకొంటే దివ్యదృష్టి ప్రసాదిస్తానని ఊరించి, మంత్రం ఉపదేశిస్తాడు. మంత్రం నేర్చుకున్న తరువాత కసాండ్రా అతనిని నిరాకరిస్తుంది. కోపోద్రిక్తుడైన అపోలో, దివ్యదృష్టితో కసాండ్రా చెప్పిన సంగతులను ఎవ్వరూ నమ్మరని శపిస్తాడు.
పేరిస్ (Paris) హెక్టర్, కసాండ్రాల తమ్ముడు. ఇతని జన్మ ట్రోయ్ పతనానికి దారి తీస్తుంది కనుక ఆ కథ సావధానంగా చెబుతాను.
గర్భవతిగా ఉన్న రాణి హెకూబా, ఒక రాత్రి, ఒక వింతైన జ్వాలను ప్రసవించినట్లు కలని కన్నది. రాజు ప్రయాం ఆస్థానజ్యోతిష్కుడిని పిలిపించి కలకు అర్థం చెప్పమని అడిగేరు.
“రాజా! రాణివారు ప్రసవించబోయే బాలుడు ట్రోయ్ నగరపు వినాశనానికి కారకుడు అవుతాడు! ఈ రాజ్యాన్ని, ప్రజలని రక్షించుకోవాలంటే ఈ బాలుడిని హతమార్చవలసిందే!” అని జోస్యంతో పాటు సలహా కూడా చెప్పేడు, ఆస్థానజ్యోతిష్కుడు.
భూపతనమైన వెంటనే బాలుడిని హతమార్చమని భటుడికి ఆదేశం ఇచ్చేడు రాజు. ముక్కుపచ్చలారని పసికందు ప్రాణాలు తియ్యలేక భటుడు ఆ పసికూనను ఇడా (Ida) పర్వతం మీద ఒక చెట్టు కింద వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ పసికందును ఒక ఎలుగుబంటి చూసింది. పాపను చూసి, జాలిపడిందో ఏమో, రాత్రల్లా కాపలా కాసింది. బాలుడు ఏమయ్యాడో చూద్దామని కుతూహలంతో మరునాడు భటుడు తిరిగి వచ్చేడు. ఆ బాలుడు ప్రాణాలతో కనిపించేసరికి “ఈ బాలుడు భవిష్యత్తులో ఏదో సాధించవలసి ఉంది. అందుకనే ప్రాణాలతో బయటపడ్డాడు” అనుకుంటూ ఆ పసివాడిని రహస్యంగా తన ఇంటికి తీసుకెళ్ళి పెంచుకున్నాడు. శుక్లపక్షచంద్రుడిలా పెరిగిన పేరిస్ స్ఫురద్రూపి, సత్యసంధుడు, శీలవంతుడుగా ముల్లోకాలలోనూ పేరు తెచ్చుకున్నాడు.
పందేలలో పోటీలకని పేరిస్ కోడె దూడలను పెంచేవాడు. పందెంలో తన గిత్తను ఎవరి గిత్త ఓడగొడితే వారికి బంగారు కిరీటం బహుమానంగా ఇస్తానని పేరిస్ ఒకసారి సవాలు విసిరేడు. స్వర్గలోకంలో ఉన్న ఐరీజ్ (Ares; AIR-eez) ఈ సవాలు విన్నాడు. తానే స్వయంగా ఒక గిత్త రూపం దాల్చి పోటీలోకి దిగేడు. యుద్ధాలకి అధినేత అయిన ఐరీజ్ ఈ పోటీని అనాయాసంగా గెలిచేడు. పేరిస్ పెద్దమనిషి తరహాలో ఓటమిని అంగీకరించి ఐరీజ్కి బంగారు కిరీటాన్ని బహూకరించేడు. ఈ సంఘటనతో “సత్యసంధుడు, మాట తప్పని పెద్దమనిషి” అని పేరిస్ భూమి మీద, స్వర్గంలోనూ పేరుప్రతిష్ఠలు తెచ్చుకున్నాడు. ఇలాంటి పేరు రావడంతో ఒక అనూహ్యమైన పందేనికి పేరిస్ ఎలా న్యాయనిర్ణేత అయేడో చూద్దాం.
2
పెలియస్-తేటిస్ వివాహ సందర్భంలో దేవతల అధినేత అయిన జూస్ ఒక బ్రహ్మండమైన విందు చేసాడు. విందుకి దేవతల అధినేత జూస్ అందరినీ ఆహ్వానించేడు; కోరుకుని కొరివితో తల గోక్కోవడం ఎందుకని పేచీకోరు ఏరీజ్ని (Eris ) ఆ విందుకి పిలవలేదు. జరిగిన పరాభవానికి ఆత్మాభిమానం దెబ్బతిన్న ఏరీజ్ పిలవని పేరంటంలా విందుకు రానే వచ్చింది. ఈ విధంగా తనకు జరిగిన అవమానానికి ఏరీజ్ కోపోద్రిక్తురాలు అయింది. అతిథులు బారులు తీర్చి భోజనాలు చేస్తున్న మందిరానికి అసహనంతో రగులుతున్న ఏరీజ్ గాలివానలా దూసుకు వచ్చింది. జూస్ ఆజ్ఞానుసారం హర్మీజ్ (Hermes; HUR-meez) ఆమెను లోపలికి రాకుండా అటకాయించి అగ్గి మీద గుగ్గిలం జల్లేడు. ఏరీజ్కి తక్కువ తిన్నదా? బయటనుండే “ఇదే నా పెండ్లి కానుక!” అంటూ బంతి భోజనాల మధ్యకి ఒక బంగారు ఏపిల్ పండును విసిరి వెళ్ళిపోయింది. ఆ పండు మీద ‘ఇది ముల్లోకాలలోనూ అందమైన అతివకు మాత్రమే’ అని రాసి ఉంది. ఇంకేముంది! “ఆ పండు నాదే!” అంటూ హీరా, అథీనా, ఏఫ్రొడైటీ అనే ముగ్గురు దేవతలు ఆ పండును స్వాధీనపరచుకుందుకి పోటీ పడ్డారు. హీరా సాక్షాత్తు జూస్ భార్య. పైపెచ్చు పట్టమహిషి. ఈమె స్త్రీలకు, వివాహజీవితాలకు అధినేత్రి. అథీనా విద్యలకు అధినేత్రి. ఏఫ్రొడైటీ అందాలకు దేవత.
ఈ ముగ్గురిలోనూ పండు ఎవ్వరికి చెందాలి? ముగ్గురూ దేవతలకి రాజైన జూస్ని తీర్పు చెప్పమన్నారు. జూస్‌కి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అయింది. ఎవరి పక్షాన తీర్పు చెబితే ఎవ్వరికి కోపం వస్తుందో. వారిలో ఒకామె తన పట్టమహిషి కూడా.
“ఈ సమస్యను న్యాయబద్ధంగా పరిష్కరించగలిగే స్తోమత భూలోకంలో ఉన్న ఒక్క పేరిస్‌కి తప్ప మరెవ్వరికీలేదు” అంటూ తన కొడుకు హర్మీజ్ని తోడు ఇచ్చి, అందరినీ భూలోకంలో ఇడా పర్వతం మీద పశువులను కాసుకుంటూన్న పేరిస్ దగ్గరకి పంపి, ఇబ్బందినుండి తప్పుకున్నాడు జూస్.
సాక్షాత్తు స్వర్గలోకానికి అధిపతి అయిన జూస్ తనయుడు హర్మీజ్ స్వయంగా వచ్చి అడుగుతూ ఉంటే పేరిస్ కాదనలేకపోయేడు.
దేవతల ముందు నిలబడి ముగ్గురిని పరకాయించి చూసేడు.
దేవతలు ముగ్గురూ ఎలాగో ఒకలాగ పేరిస్‌ని మభ్యపెట్టి తీర్పు తమవైపు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.
“నన్ను ఎంపిక చేస్తే నిన్ను ఐరోపాకు, ఆసియా మైనరుకు చక్రవర్తిని చేస్తాను!” అని ఆశ పెట్టింది హీరా.
అథీనా ముందుకి వచ్చి, “నీకు విద్యాబుద్ధులు ప్రసాదిస్తాను. యుద్ధరంగంలో తిరుగులేని అస్త్రాలు ఇస్తాను!” అని ఎర చూపించింది.
చిట్టచివరికి తన కురులను సుగంధం వెదజల్లే పువ్వులతో అలంకరించుకున్న ఏఫ్రొడైటీ ముందుకి వచ్చి, “పేరిస్! నువ్వు నన్ను ఎన్నుకున్నావంటే నీకు మరపురాని అనుభవాన్ని ప్రసాదిస్తాను. స్త్రీయొక్క ప్రేమ ఎలా ఉంటుందో చవి చూపిస్తాను. స్పార్టా రాణి హెలెన్‌ని మించిన అందగత్తె ఈ భూలోకంలో లేదు. ఆమె పొందు నీకు దక్కేలా వరం ఇస్తాను. ఆమె నీ సందిట బందీ అయేలా చేస్తాను! ఏమంటావు?”
పేరిస్ ఏఫ్రొడైటీ అందరిలోకీ అందగత్తె అని తీర్మానించి ఆమె అభిమానం చూరగొన్నాడు.
3
ఈలోగా ట్రోయ్ నగరంలో ఒక కుస్తీ పోటీ జరిగితే పేరిస్ ఆ పోటీలో పాల్గొంటాడు. ట్రోయ్ నగరంలో తనకు ఎదురైన ప్రత్యర్థులందరినీ – ప్రయాం రాజు కొడుకులని కూడా – ఓడిస్తాడు. ఆ సందర్భంలో ప్రయాం రాజు కూతురు కసాండ్రా – తనకి అపోలో ఇచ్చిన దివ్యదృష్టితో – పేరిస్ ఎవ్వరో గుర్తు పడుతుంది. అప్పుడు ప్రయాం తన కొడుకుని రాజ కుటుంబంలోకి స్వాగతిస్తాడు. ఈ సందర్భంలో పేరిస్ ట్రోయ్ నగరపు పతనానికి కారణమవుతాడని కసాండ్రా హెచ్చరిస్తుంది. కానీ అపోలో శాపప్రభావంవల్ల ఎవ్వరూ కసాండ్రా మాటలు నమ్మరు.
4
హెలెన్ అసాధారణమైన అందగత్తె. ఆమె పాణిగ్రహణం కోసం ఎందరో యువకులు ఉవ్విళ్ళూరేవారు. శూరులు, వీరులు, మేధావులు, ఒకరేమిటి? ఆ జాబితాలో మైసీనీ (Mycenae) రాజైన అగమేమ్నాన్, ఇథకా (Ithaca) రాజైన ఒడిస్సియస్, పైలోస్ (Pylos) రాజైన నెస్టర్, జూస్ మనవడు ఏజాక్స్ ప్రభృతులు ఉన్నారు! వీరిలో హెలెన్ ఎవరిని ఎన్నుకుంటే ఎవరికి కోపం వస్తుందో? అప్పుడు “ఈ చిక్కు సమస్యను పరిష్కరించడానికి మార్గం ఉంది, అదేదో చెబుతాను కానీ ముందు ఇకేరియస్ (Icarius) కుమార్తె పెనలొపీని (Penelope) నాకు ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇవ్వా”లని కూటనీతి తెలిసిన ఒడిస్సియస్ ఒక బేరం పెట్టేడు. అందరూ ఒప్పుకున్నారు. ఒడిస్సియస్ ఇచ్చిన సలహా ప్రకారం హెలెన్‌ని వరించడానికి వచ్చిన యువరాజులందరి దగ్గరనుండి హెలెన్ పెంపుడు తండ్రి తిందారియస్ (Tyndareus) ఒక హామీ తీసుకున్నాడు. భవిష్యత్తులో ఈ కాబోయే కొత్త దంపతులకు ఏ ఆపద వచ్చినా స్వయంవరానికి హాజరయిన వీరులు అందరూ సైన్యసమేతంగా వచ్చి హెలెన్‌ని రక్షించాలి. అందరూ ఆ నిబంధనకి ఒప్పుకున్నారు. అప్పుడు తిందారియస్ మెనలెయస్ని హెలెన్ భర్తగా ఎంపిక చేసేడు. (తిందారియస్ భార్య లీడాకి హంస రూపంలో వచ్చిన జూస్ ద్వారా పుట్టిన కూతురే హెలెన్.) అదే వివాహవేదిక మీద హెలెన్ (కవల) చెల్లెలు క్లైటెమ్నెస్ట్రా (Clytemnestra) మెనలెయస్ అన్నగారైన అగమేమ్నాన్ని భర్తగా స్వీకరించింది. (పెనలొపీ, హెలెన్ అన్నదమ్ముల బిడ్డలు.)
ఇలా పెళ్ళి అయిపోయి, హెలెన్ కాపురం చేస్తున్న సమయంలో పేరిస్ ఒక దౌత్యవర్గంతో ట్రోయ్‌లో ప్రవేశించి హెలెన్‌ని చూస్తాడు. ఏఫ్రొడైటీ వెనకనుండి, ఏరోస్ (Eros) పువ్వుల బాణం సహాయంతో, హెలెన్‌లో ప్రేమజ్వాలను పుట్టిస్తుంది. అప్పుడు పేరిస్ ఆమెని అపహరించి ట్రోయ్ తీసుకుపోతాడు. ఈ సంఘటనే ఒక మహాసంగ్రామానికి దారి తీసింది.
5. హెలెన్
1
హెలెన్ జగదేకసుందరి. ట్రోయ్ నగరపు రాజు ప్రయాం ఒక సందర్భంలో ఈమెకి ‘ట్రోయ్ నగరపు హెలెన్’ అనే బిరుదునిస్తాడు కనుక ‘ట్రోయ్ నగరపు హెలెన్’ అని వాడుకలో ఉన్నదిగాని, ఆమె నిజానికి స్పార్టా నగరానికి చెందిన మహిళ.
స్పార్టా నగరానికి తిందారియస్ రాజు. అతని రాణి లీడా. దేవరాజైన జూస్ ఒకసారి హంస రూపంలో తిరుగుతుండగా ఒక గద్ద తరుముకుంటూ వచ్చింది. అప్పుడు ఆ హంస లీడా ఆశ్రయాన్ని కోరింది. లీడాకు హంసపై అనురాగం పెరిగింది. వారిద్దరి సంగమం వలన లీడాకు రెండు అండాలు ఉదయించాయి. ఒక గుడ్డునుంచి అందమైన ఆడపిల్ల పుట్టింది. ఆమెకు హెలెన్ అని లీడా భర్త తిందారియస్ నామకరణం చేశాడు. ఈ గుడ్డునుండే మరొక అమ్మాయి పుట్టిందని వేరొక కథనం ఉంది. ఇలా ఒకే గుడ్డునుండి ఇద్దరు పిల్లలు పుడితే heteropaternal superfecundation అంటారు. అలా పుట్టిన కవల చెల్లెలు పేరు క్లైటెమ్నెస్ట్రా. రెండవ గుడ్డునుంచి ఇద్దరు మగ కవలపిల్లలు కలిగారు, వారి పేర్లు కేస్టర్, పోలక్స్. (ప్రస్తుతం నక్షత్ర రూపంలో ఉన్నారని అంటారు. ఆ నక్షత్రాల జంటనే మనం పునర్వసు అంటాం.) తిందారియస్ అన్నదమ్ముడి పేరు ఇకేరియస్. ఇతని కూతురు పెనలొపీ. ఈమె భర్త ఒడిస్సియస్. కనుక హెలెన్, క్లైటెమ్నెస్ట్రా, పెనలొపీ – ఈ ముగ్గురూ ఒకే శ్రేణికి చెందిన అందగత్తెలు అవడంలో అశ్చర్యం ఏమీ లేదు!
యవ్వన ప్రవేశం అవగానే హెలెన్ తండ్రి అయిన తిందారియస్, ఆమె వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఎందరో ఆమె హస్తాన్ని కోరుతూ వచ్చారు. ఏమి చేయాలో తెలియలేదు. ఒకరిని జామాతగా స్వీకరిస్తే మిగిలిన వారు ఆగ్రహించి యుద్ధానికి తలపడతారని అతడు భయపడ్డాడు. ఆమె హస్తాన్ని కోరుతూ వచ్చిన వారిలో ఒకడైన ఒడిస్సియస్, తనకి పెనలొపీని ఇచ్చి వివాహం చేస్తామని మాట ఇస్తే తాను ఈ సమస్యను పరిష్కరించగలనని అన్నాడు. అతని సూచనతో అందరినీ పిలిచి హెలెన్‌ని, ఆమె కాబోయే భర్తనూ రక్షిస్తామని అందరూ ప్రమాణం చేసిన పక్షంలోనే తాను కాబోయే జామాత నామధేయాన్ని ప్రకటించగలను అన్నాడు. అందరూ ఆలోచించుకున్నారు. హెలెన్ తమను చేపట్టే పక్షంలో మిగిలిన అందరి సహకారం తమకు ఉంటుందని ఆశపడ్డారు. అందరూ హెలెన్నూ ఆమె భర్తనూ కాపాడుతామని ప్రమాణం చేశారు. అప్పుడు తిందారియస్ హెలెన్‌ను మెనలెయస్కి భార్యగా ప్రకటించాడు. తిందారియస్ ఒక గుర్రాన్ని దేవతలకు బలి ఇచ్చి హెలెన్-మెనలెయస్ల వివాహం జరిపించాడు.
మెనలెయస్కి హెలెన్‌ని ఇవ్వడంలో రాజకీయం లేకపోలేదు. మెనలెయస్ ధనవంతుడు. అతనికి పెద్ద సైన్యం ఉంది. పెద్దల యెడల ఎలా ప్రవర్తించాలో ఎరిగిన వ్యక్తి. పెళ్ళి విషయంలో కూడా తనంత తానుగా ఎగబడలేదు; తన అన్నగారైన అగమేమ్నాన్ ద్వారా వర్తమానం పంపేడు. ఎందుకైనా మంచిదని ఈ పెళ్ళి జరిగితే ప్రేమదేవత ఏఫ్రొడైటీకి వంద గిత్తలను బలి ఇస్తానని మెనలెయస్ మొక్కుకున్నాడు కూడా. ఆ మొక్కు సంగతి మరచిపోయి ఏఫ్రొడైటీ ఆగ్రహానికి గురి అవుతాడు; అది వేరే సంగతి.
తిందారియస్ కూతురి వివాహమైనాక రాజ్యాన్ని అల్లుడికి అప్పగించాడు. హెలెన్, మెనలెయస్లకు ఒక కుమార్తె కలిగింది.
2
హెలెన్ వివాహమైన కొన్ని సంవత్సరాలకు, ఒక దినాన ఏఫ్రొడైటీకి అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చింది – తాను పేరిస్‌కి ఇచ్చిన వరం సంగతి. పేరిస్ పడుకున్న మంచం దరికి వచ్చి, “పేరిస్! నువ్వు గ్రీసు దేశం వెళ్ళదగ్గ సమయం ఆసన్నమయింది. అక్కడ స్పార్టా అనే నగరంలో, మెనలెయస్ అనే రాజు అంతఃపురంలో భువనైకసుందరి అనదగ్గ హెలెన్ ఉంది. ఆమె నీయందు ప్రేమలో పడే బాధ్యత నాది. లే! లేచి నీ బహుమానాన్ని చేజిక్కించుకో!” అని రెచ్చగొట్టింది.
(కానీ హెలెన్ అప్పటికే అందగాడైన మెనలెయస్ని పెళ్ళి చేసుకుని, అతనితో పిల్లలని కని సుఖంగా ఉంది. ఏఫ్రొడైటీకి, పేరిస్‌కి మధ్య ఉన్న ఈ ఒప్పందం సంగతి హెలెన్‌కి తెలియదు కదా?)
ఏఫ్రొడైటీ ప్రోత్సాహంతో, పేరిస్ ఏదో రాచకార్యం మిషతో మెనలెయస్కి అతిథిగా స్పార్టా వస్తాడు. పేరిస్ రాకలో అంతరార్థం తెలియక, పేరిస్ గౌరవార్థం మెనలెయస్ ఆర్భాటంగా పెద్ద విందు ఏర్పాటు చేస్తాడు. ఆ విందులో పేరిస్ పక్కనే కూర్చున్నది హెలెన్. ఆ అందాలరాశి పక్కనే ఉండడంతో సువర్ణఖచితమైన ఆ భవనపు గోడలుకానీ, ధగధగ మెరిసే దీపాల అలంకరణాలుకానీ, వాద్యబృందాల సంగీతంకానీ పేరిస్‌ని ఆకర్షించలేదు. నాజూగ్గా, సన్నగా, నున్నగా ఉన్న ఆమె శరీరం, శిల్పి చెక్కినట్లు ఉన్న ఆమె ముఖారవిందం, మెరుస్తూన్న నల్లని కురులు ఆమె భుజాలమీద పడి కదలాడుతూ ఉంటే… వాటన్నిటిని తలదన్ని మరకతాలను మరపించే ఆమె పచ్చని కళ్ళు అతనిని కట్టి పడేశాయి. ఆమెని ఎలాగైనా తనదానిని చేసుకోవాలనే ఆకాంక్ష అతని మస్తిష్కంలో బలపడింది.
వారిద్దరూ ఏకాంతంగా ఉన్న తరుణంలో నిర్భయంగా తన ప్రేమని వెల్లడించేడు. ఆమె స్పందనకి ఆశ్చర్యపోయాడు. “నేను మెనలెయస్ భార్యను. పైగా పిల్లల తల్లిని. అతిథిగా వచ్చి నువ్వు ఇలా ప్రవర్తించడం మర్యాదగా ఉందా?”
పేరిస్ నిరాశ చెందలేదు. హెలెన్ మెప్పు పొందడానికి రకరకాల మార్గాలు అన్వేషించేడు. మెనలెయస్ రాజప్రాసాదంలో లేని సమయంలో, ఏఫ్రొడైటీ, ఏరోస్ల సహాయంతో హెలెన్‌ని వశపరుచుకొని, ఆమెను, ఆమెతోపాటు స్పార్టాకి చెందిన బంగారం, నగలు, అపహరించుకొని ట్రోయ్ పట్టుకుపోయాడు. వారి మధ్య గాఢమైన బంధం ఏర్పడింది.
మెనలెయస్ తిరిగి రాజప్రాసాదం చేరుకొని, హెలెన్ పిల్లలని కూడా వదిలేసి పేరిస్‌తో పారిపోయిందని తెలుసుకుని ఉగ్రుడయ్యాడు. తన భార్యను వెనక్కి తెచ్చుకోవడానికి మెనలెయస్ బయలుదేరితే, హెలెన్ స్వయంవరంలో జరిగిన ఒప్పందం ప్రకారం హెలెన్ హస్తాన్ని అర్థించిన వారందరూ తన వెంట వచ్చి సహాయం చెయ్యాలి. మెనలెయస్ తన అన్నగారైన అగమేమ్నాన్ సహాయంతో ట్రోయ్ నగరం మీద దండయాత్రకు సహాయం అర్థిస్తూ వార్తాహరులని పంపేడు.
క్రీట్ ద్వీపంనుండి ఐడామినస్ (Idomeneus), ఇథకానుండి ఒడిస్సియస్ వచ్చేరు. ఆర్గోస్ (Argos) రాజ్యపు సైన్యాన్ని వెంటబెట్టుకుని డయొమీడీస్ (Diomedes), తదితరులు చాలామంది వచ్చేరు. అందరూ పొడుగ్గా, కోలగా ఉన్న దోనెలవంటి చెక్క పడవలలో వచ్చేరు. అన్నిటికి పల్చటి తెరచాపలు ఉన్నా, పడవలను నడపడానికి పడవ ఒక్కంటికి నూటఏభై వరకు కళాసులు తెడ్లు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఏభయిమంది తెడ్లు వేసి పడవలను నడుపుతూ ఉంటే, ఏభయిమంది వారి వెనుక దన్నుగా ఉంటారు. మరొక ఏభయిమంది పడవలో మిగిలిన వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు. సింధూర వృక్షపు మానులను దొలిచి నిర్మించిన ఈ పడవలకు నీటిమట్టం దగ్గర లావాటి, బలమైన, కంచుతో చేసిన కొమ్ము ఉంటుంది. శత్రువుల పడవలను ఈ కొమ్ముతో ఢీకొట్టి వాటిని ముంచెయ్యవచ్చు. నీటిమట్టానికి దిగువన ఈ పడవలన్నిటికి, నీరు లోపలికి చొరకుండా, నల్లటి కీలు పైపూతలా ఉంటుంది కాబట్టి ఈ పడవలను ముతకమాసిన పడవలు అని అంటారు.
హెలెన్ విముక్తికి ఒక వెయ్యి నూటఎనభైయారు యుద్ధ నౌకలలో, లక్షమంది యుద్ధవీరులు గ్రీసు దేశపు తూర్పు తీరంలో ప్రయాణానికి తయారుగా సిద్ధమయ్యారు! అందరిలోకీ పెద్దవాడూ, అనుభవజ్ఞుడూ, మెనలెయస్ అన్నగారూ అయిన అగమేమ్నాన్ సర్వసేనాధిపతిగా వ్యవహరించడం మొదలుపెట్టేడు.
ఇంత పెద్ద సైన్యంలోనూ ఒక్క వెలితి మిగిలిపోయింది! అదే అకిల్లీస్ ఉనికి! అకిల్లీస్ కానీ, అతని సైన్యపు జాడ కానీ ఎక్కడా లేదు! అకిల్లీస్ ఒక్కడే ట్రోయ్ సైన్యాన్ని ఓడించగలడని అకిల్లీస్ పుట్టకపూర్వమే మూడవ సిద్ధురాలు చెప్పిన జోస్యం ఇంకా చాలామందికి జ్ఞాపకం ఉంది!
ఎట్టకేలకు గ్రీకులు పడవలను, సైన్యాన్ని సమకూర్చుకుని ట్రోయ్ మీదకి దండెత్తి వెళ్ళారు. తొమ్మిది సంవత్సరాలు యుద్ధం చేసారు. చివరకు గ్రీకులు, అథీనా దేవత సలహాను అనుసరించి, ఒక పన్నాగం పన్నారు. ఒక కొయ్యగుర్రాన్ని నగరం వెలుపల వదిలి తాము వెనక్కి పోతున్నట్టుగా నటించారు. గుర్రాన్ని విజయచిహ్నంగా భావించిన ట్రోయ్ సైనికులు పట్టణంలోకి దాన్ని తీసుకెళ్ళారు. కొయ్యగుర్రం లోపల దాగున్న గ్రీకు సైనికులు రాత్రి వెలుపలకు వచ్చి కోట తలుపులు తీశారు. గ్రీకు సైనికులు నగరప్రవేశం చేసి, శత్రువులను గెలిచి, హెలెన్‌ని తమతో తీసుకెళ్ళారు. హెలెన్ విముక్తి కథను ఎందరో గ్రంథస్థం చేశారు. అందులో హోమర్ రచన ఇలియాడ్ ప్రసిద్ధమైనది.
హెలెన్ అపహరణ అనే పని ఆ రోజుల్లో కొత్తేమీ కాదు. ఇటువంటి ‘స్త్రీ గ్రహణాలు’ ఆ రోజుల్లో తరచుగా జరిగేవి. మైసీనీ (Mycenae) నుండి లో (Lo) అపహరణ, ఫినీషియా (Phoenicia) నుండి యూరోపా (Europa) అపహరణ కేవలం రెండు ఉదాహరణలు. కొల్చిస్ (Colchis) నుండి మీద్యాని (Medea) జేసన్ (Jason) అపహరించాడు. ట్రోయ్ నగరంనుండి హెరాక్లిస్ (హెర్క్యులిస్) రాకుమారి హీషన్ని (Hesione) అపహరించి ఆమెని టెలమన్కి (Telamon) కానుకగా ఇచ్చాడు. ఈ అపహరణలు జరిగినప్పుడు పర్యవసానంగా అనుకోని విపత్తులు ఏవీ రాకపోవడంతో హెలెన్‌ని దొంగిలించడానికి పేరిస్‌కి ధైర్యం వచ్చిందని చరిత్రకారుడు హెరొడోటస్ వ్యాఖ్యానిస్తాడు.
6. కసాండ్రా కథ
ఈ ఉదంతం ట్రోయ్ సంగ్రామం జరగడానికి ముందు జరిగిన కథ. కసాండ్రా (Cassandra) ట్రోయ్ నగరపు రాకుమారి. కసాండ్రా ట్రోయ్ నగరాన్ని పాలిస్తున్న రాజు ప్రయాంకీ, రాణి హెకూబాకీ పుట్టిన కవలపిల్లలలో ఆడపిల్ల; ఈమె కవల అన్న హెలినస్. కసాండ్రా తరువాత వేరొక కాన్పులో పుట్టినవాడు పేరిస్.
కసాండ్రా ఒక శాపగ్రస్తురాలైన వ్యక్తి. భవిష్యత్తులో ఏమి జరగబోతోందో చెప్పగలిగే శక్తి ఉన్న వ్యక్తి ఈమె. ఈ శక్తి ఈమెకు అపోలోనుంచి లభించింది. కానీ అపోలో ఇచ్చిన శాపంవల్ల ఈమె మాటను ఎవ్వరూ నమ్మరు. అదెంత ప్రమాదానికి దారి తీసిందో ఈ కథలో చూద్దాం.
నల్లటి కురులతో, కలువ రేకులలాంటి కళ్ళతో ఎంతో అందంగా ఉండేదని కసాండ్రాకు పేరు. అందమైన అమ్మాయిల కోసం అదే పనిగా వేటలో ఉన్న (దరిదాపు ఒలింపస్ కొండ మీద ఉన్న దేవతలంతా చేసే పని ఈ రకం వేటే!) అపోలో దేవుడి దృష్టి కసాండ్రా మీద పడింది. ప్రేమలో పడ్డాడు. వెంటపడ్డాడు. ప్రేమలో పడ్డ దేవతలను నిరాకరించే మనుష్యులు ఉంటారా? కానీ అదేమి విడ్డూరమో అపోలో అవస్థను చూసి కసాండ్రా నవ్వుకుంది; అతని ప్రేమను నిరాకరించింది.
కసాండ్రా మనస్సుని ఎలాగో ఒకలాగ గెలవాలనే తపనతో ఆమెకి అపూర్వమైన కానుకను ఇవ్వడానికి ప్రయత్నించేడు అపోలో. అన్నీ ఉన్న రాకుమారికి తను కొత్తగా ఏమి ఇవ్వగలడు? ఆమెకి అందం ఉంది. ఐశ్వర్యం ఉంది. కాని ఆమెకు లేనిది, తన దగ్గర ఉన్నది ఒకటి ఉంది. అది దివ్యదృష్టి — అనగా, భవిష్యత్తులోకి చూడగలిగే శక్తి. ఇంత ఆసక్తికరమైన ప్రేమ బహుమానం ఎదురైనప్పుడు కసాండ్రా కాదనలేకపోయింది. ప్రతిఫలం మీద ఆశతో అపోలోతో ‘వీపు గోకుడు బేరానికి’ కసాండ్రా ఒప్పుకుంది. తన వంతుగా అపోలో దివ్యదృష్టి ఇచ్చే మంత్రాన్ని కసాండ్రాకి ఉపదేశించేడు. మంత్రం నేర్చుకున్న తరువాత అపోలోకి ముట్టవలసిన ‘పారితోషికం’ ఇవ్వకుండా ఎగ్గొట్టింది; అపోలో ఎగబడుతూ చేస్తూన్న పురోగమనాలని కసాండ్రా నిరాకరించింది.
ఆత్మాభిమానం దెబ్బ తిన్న అపోలో ఉగ్రుడయాడు. తను కసాండ్రాకి నేర్పిన మంత్రాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేడు! తను చెయ్యగలిగిందల్లా ఆ మంత్రంవల్ల కసాండ్రాకి లాభం లేకుండా చెయ్యడం. అందుకని “నువ్వు దివ్యదృష్టితో చూసి చెప్పగలిగే జోస్యాన్ని ఎవ్వరూ నమ్మరు” అని శపించేడు. చెయ్యగలిగేది ఏమీ లేక కసాండ్రా తను నేర్చుకున్న దివ్యదృష్టి మంత్రాన్ని తన కవల అన్నదమ్ముడు హెలినస్కి ఉపదేశించింది. (కచ-దేవయాని కథకు, ఈ కథకు కొంత పోలిక కనబడుతుంది.)
కసాండ్రా చాలా సందర్భాలలో జోస్యం చెప్పింది; కాని ఎవ్వరూ నమ్మలేదు. అదే విషయాన్ని హెలినస్ చెబితే నమ్మేవారు. ఒక సారి ట్రోయ్ నగరంలో మల్లయుద్ధపు పోటీలు జరుగుతాయి. ఆ పోటీలో గెలిచిన పేరిస్‌ని కసాండ్రా తన దివ్యదృష్టితో చూసి అతను ‘చచ్చిపోయాడనుకున్న’ తన అన్నదమ్ముడే అని గుర్తించింది. అప్పటినుండి పేరిస్‌ని ట్రోయ్ రాజవంశంలో సభ్యుడుగా అంగీకరిస్తారు.
పేరిస్ స్పార్టా రాణీ హెలెన్‌ని దొంగిలించి వివాహం చేసుకుని ట్రోయ్ తీసుకు వస్తాడనిన్నీ, ఆ సంఘటన ట్రోయ్ నగరపు విధ్వంసానికి కారణం అవుతుందనిన్నీ, కనుక పేరిస్‌ని స్పార్టా వెళ్ళవద్దని బ్రతిమాలుతుంది కసాండ్రా. కానీ ఎవ్వరూ వినిపించుకోరు. ట్రోయ్ నగరం మీదకి దండెత్తి వచ్చే గ్రీసు దేశపు సేనాధిపతి అగమేమ్నాన్ యుద్ధ చివరిదశలో చనిపోతాడని జోస్యం చెబుతుంది. ఎవ్వరూ పట్టించుకోరు. తను కూడా ఆ యుద్ధం కారణంగా చచ్చిపోతానని చెబుతుంది. అంతా ‘పిచ్చి వాగుడు’ అని పెడచెవిని పెడతారు. చిట్టచివరికి గ్రీకులు రణరంగంలో వదలిపెట్టి వెళ్ళిన కర్రగుర్రాన్ని నగరం లోపలికి తీసుకురావద్దని కసాండ్రా హెచ్చరిస్తే ఎవ్వరూ వినరు.
ఈ రోజుల్లో అయితే కసాండ్రాలాంటి వ్యక్తిని ‘శకునపక్షి’ అని గేలి చేసి ఉండేవారు. మనకు అవగాహనలో లేని ఏదైనా శక్తివంతమైన ప్రభావంవల్ల మనకి ఏదో కీడు కలగబోతోందని జోస్యం చెప్పేమనుకొండి. ఉదాహరణకి “పర్యావరణం వెచ్చబడడంవల్ల పల్లపు ప్రాంతాలు ముంపుకు గురవుతాయి” అని ఒక శాస్త్రవేత్త జోస్యం చెప్పేడనుకోండి. అది మనకు వెంటనే నమ్మబుద్ది కాదు. రాబోయే ప్రమాదంనుండి తప్పించుకోడానికి కానీ, ఆ ప్రమాదంవల్ల కలిగే హానిని తగ్గించడానికి కానీ వ్యయ ప్రయాసలు, కాలయాపన కావచ్చు. మన రాజకీయ నాయకులకు రాబోయే ఎన్నికల మీద ఉన్న దృష్టి ఎప్పుడో పాతిక సంవత్సరాల తరువాత రాబోయే ముంపు మీద ఉండదు. ఇటువంటి సందర్భాలలో శాస్త్రవేత్తలు చెప్పే జోస్యానికి కసాండ్రా చెప్పిన జోస్యానికి పట్టిన గతే పడుతుంది.
7. అకిల్లీస్ రంగ ప్రవేశం
గ్రీకు సేనానాయకుడు అగమేమ్నాన్ ట్రోయ్ నగరం మీదకి దండెత్తి వెళ్ళడానికి సర్వసన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నాడన్న వార్త వినగానే అకిల్లీస్ తల్లి తేటిస్ భయపడింది. ఆమె వివాహసందర్భంలో మూడవ సిద్ధురాలు చెప్పిన జోస్యం ఆమె చెవులలో ఇంకా మ్రోగుతోంది. అందుకని చడీచప్పుడూ లేకుండా ఆమె అకిల్లీస్ని తీసుకుని తలదాచుకోడానికి ఒక మారుమూల ద్వీపానికి పారిపోయింది!
సర్వసేనాధిపతికి తెలుసు – అకిల్లీస్ యుద్ధంలో పోషించవలసి పాత్ర అతి ముఖ్యమైనదని. అందుకని అకిల్లీస్ని వెతికి పట్టుకుని, నయాన్నో భయాన్నో ఒప్పించి తీసుకురమ్మని, ఒడిస్సియస్‌ని పంపేడు. ఎట్టకేలకు ఒడిస్సియస్ వెతికి అకిల్లీస్ని పట్టుకుని, ఎత్తిపొడుపు మాటలతోటీ, ఆక్షేపణలతోటీ రెచ్చగొడతాడు. “గ్రీకు సైనికులంతా మన దేశంకోసం, మన ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడంకోసం ధైర్యంగా పోరాడుతూ ఉంటే నువ్వొక్కడివీ చేతులు నలుపుకుంటూ ఇంట్లో కూర్చుంటావా?”
నలుగురిలోనూ ‘పిరికిపంద’ అన్న అప్రతిష్ఠ పాలు కావలసి వస్తుందేమోనన్న భయంతో కాబోలు అకిల్లీస్ యుద్ధంలో తన పాత్ర పోషించడానికి ఒప్పుకుంటాడు. బయలుదేరే ముందు తన నిశ్చయాన్ని తెలియజేయడానికి వయస్సు మీరిపోతూన్న తండ్రి రాజా పెలియస్ దగ్గరకి వెళ్ళి, వినమ్రంగా నమస్కరించి, “ట్రోయ్ నగరంలో నాకు ఎదురయ్యే గండంనుండి రక్షించడానికి నా తల్లి ఎంతగానో ప్రయత్నించిందని నాకు తెలుసు. నా ధైర్యసాహసాలను ఇప్పటికే ఎన్నోసార్లు యుద్ధరంగాలలో ఋజువు చేసేను. అయినా అవసరమైన సమయంలో ఆప్తులను ఆదుకోలేదనే అవమానభారంతో బ్రతికేకంటే చిరకాలం బ్రతికి ఏమి బాముకోవాలి? కనుక నేను వెళుతున్నాను” అంటాడు.
కొడుకు మళ్ళా కళ్ళబడడన్న అనుమానం ఒక పక్క వేధిస్తూ ఉన్నా, తన వివాహసందర్భంలో దేవదేవుడు జూస్ తనకు బహుమానంగా ఇచ్చిన, ఆపాదమస్తకాన్ని కప్పే, అద్భుతమైన కవచాన్ని, సముద్రదేవుడు పొసైడన్ బహూకరించిన అమరమైన రెండు రథాశ్వాలను కొడుకుకు ఇచ్చేడు. అంతే కాకుండా అకిల్లీస్ చిన్ననాటి ప్రాణస్నేహితుడైన పెట్రాక్లస్ని వెంట నీడలా ఉండి అకిల్లీస్ని రక్షించమని కోరేడు.
అకిల్లీస్ నలభై మెరుగుమాసిన పడవలతో నిండిన నావికాబలంతో బయలుదేరి గ్రీకు సేనావాహినిలో చేరేడు!
అందరూ తయారుగా సమావేశం అయిన తరువాత సర్వసేనాధిపతి అగమేమ్నాన్ దేవతలను సంతోషపెట్టడానికి ఒక ఎనుబోతును బలి ఇచ్చేడు. అందరూ ప్రసాదం భక్షించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో దేవతల విగ్రహాలకి ఎదురుగా ఉన్న అగ్నిగుండంనుండి సింధూరవర్ణపు సర్పం ఒకటి బుసలు కొట్టుకుంటూ బయటకి వచ్చింది. వస్తూనే పక్కనే ఉన్న చెట్టుని చుట్టుకుని, పైకి ఎగబాకి, అక్కడ కొమ్మలమీద ఉన్న తొమ్మిది పిచికలను కబళించింది! దీని అర్థం ఏమిటని అక్కడ ఉన్న జోస్యుడు కాల్కస్ని అడిగేడు అగమేమ్నాన్!
“మీరు చేయబోయే యుద్ధం తొమ్మిది ఏళ్ళపాటు కొనసాగుతుందనిన్నీ, పదవ ఏటనే మీకు విజయం సిద్ధిస్తుందనీ దీని తాత్పర్యం!” అని జోస్యుడు కాల్కస్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చేడు.
పదేళ్ళపాటు యుద్ధం అనేసరికి సైనికులు నీరుగారిపోయేరు. “పదవ ఏట మనకు విజయం సిద్ధిస్తుందని జోస్యుడు చెబుతున్నాడు కదా! చివరికి విజయలక్ష్మి మనదే! ఆ అంతిమలక్ష్యాన్ని ఎదురుగా పెట్టుకుని ఆశావహంగా పోరాడుదాం,” అని అగమేమ్నాన్ అందరినీ ప్రోత్సాహపరచేడు.
(ట్రోజన్ యుద్ధకథలు వచ్చేనెలనుంచి)
