విషయమా? ఉచ్చారణా?

[1973 ఎప్రియల్ తెలుగుభాషాపత్రికలో ప్రచురించిన ఈ వ్యాసం, ఈమాట పాఠకులకోసం పునర్ముద్రితం. – సం.]

ఆక్స్‌ఫర్డులో ఆంగ్లం వెలిగించిన ఆనందరావు, బోస్టన్‌లో వైద్యం చదివిన బాబ్, అలబామాలో సైకాలజీ చదివిన ఆర్నాల్డు, టెక్సానులో పశు వైద్యప్రవీణుడిగా పనిచేస్తున్న పెర్రీ, నేనూ, ఒకరోజున Love అన్న పదాన్ని గురించి హెరాహోరీ యుద్ధం చేశాం. కాని అర్థం గురించి కాదు. దాన్ని ఎలా ఉచ్చరించాలీ అని. ఆక్స్‌ఫర్డులో లాగానా? బోస్టన్‌ లాగానా? లేకపోతే ఏలూరులో లాగానా? అసలు తగాదా ఎక్కడ వచ్చిందంటే ఏదో యింగ్లీషు మాటలో U అన్న అక్షరం మీద అర్ధ చంద్రాకారం వచ్చింది (Ŭ) ఎవరిదో ఆర్టికిల్ చదువుతూంటే. వెంటనే ఆనందరావు దాన్ని Love లో వ్-లా ఉచ్చరించాలీ అన్నాడు. Love ఎల్లా ఉచ్చరించాలో మాలో మాకు పొంతన కుదిరితేకదా Ŭ అన్న అక్షరం సరిగ్గా ఉచ్చరించటం తెలిసేది? అలబామావాడు “లావ్” అన్నారు. బోస్టనువారు ‘లవ్’ అన్నారు. టెక్సాసువాడు ‘లవ్వ్’ అన్నాడు. చివరికి కాస్తోకూస్తో చదువుకున్న మామల్సుమే కాబట్టి అన్నీ రైటే అని ఒప్పేసుకొని వ్యాసంలోని అసలు విషయచర్చలోకి వెళ్ళిపోయాం, ఆ రోజు.

అస్సలు ఇంతకీ చెప్పచ్చేదేమిటంటే, ఇంగ్లీషులో శబ్దలక్షణ సూచికలు (diacritic marks) కంఠతా పట్టి తు.చ. తప్పకుండా అల్లాగే ఉచ్చరించాలి అంటే, వాటి ప్రాతిపదికలుగా, ఉదాహరణలుగా యిచ్చిన మాటలు “సరిగ్గా ఉచ్చరించటం” తెలియాలి. “సరిగ్గా ఉచ్చరించటం” అంటే ఏమిటి? ఆక్స్‌ఫర్డులో లాగానా? అలబామా లాగానా? సరిగ్గా ఉచ్చరించటం అనేది చాలా కన్సర్వేటివ్ వ్యవహారం. ఉచ్ఛారణ దేశదేశానికీ, రాష్ట్రరాష్ట్రానికి, ఆ మాటకొస్తే జిల్లాజిల్లాకీ మారుతుంది. మన మాతృభాషలోనే కేవలం మాండలికమైన అనేక ఉచ్చారణలున్నాయి. గోదావరి జిల్లా పండితులు శ్రీకాకుళం వాడి భాష “యాస” అంటారు. కర్నూల్ రెడ్డి గోదావరివాడ్ని వత్తొత్తి పలికే వైదీకంపిల్లి అంటాడు. తెలంగాణా పటేల్ బెజ్‌వాడ వాడిది ఢోకాతెలుగు యార్, పొమ్మంటారు.

అయితే అందరూ తెలుగే మాట్లాడుతారు. ఒకర్ని ఒకరు అర్థం చేసుకోవటానికి డిక్ష్నరీలు మోసుకెళ్ళక్కర లేదు. ఉచ్చారణకి ప్రమాణాలు వుండటం మంచిదేననుకోండి. కానీ అది కొండని తవ్వి ఎలుకను పట్టేటయితే, శుద్దదండగ. డిక్ష్నరీలు అవసరమే కానీ often (ఆఫ్టెన్? ఆఫెన్?) మాత్రం కాదు.

తెలుగులో రాసేటప్పుడు, ముఖ్యంగా సాంకేతిక, వైజ్ఞానిక విషయాలు రాసేటప్పుడు, ఇంగ్లీషు మాటలు వాడటం అవసరం. (చాలా ఇంగ్లీషు మాటలు నిజానికి లాటిను, గ్రీకులనుంచి దిగుమతి అయిన ఆంగ్లేతర పదాలే. కొన్ని మాటలు తెలుగులో రాసుకుంటే, ఇంగ్లీషులో వున్నట్టుగా లేదా ఇంగ్లాండు వాడిలా ఉచ్చరించటం కుదరదు, వాస్తవమే. అంచేత “ఇంగ్లీషులో” లాగా ఉచ్చరించటానికి ప్రయత్నించటం వృధాప్రయాసేమో! ఇవ్వాళ మీరు ఒప్పుకోరేమో కానీ, “స్వచ్ఛంగా” పందికొక్కు అవి ఉచ్చరించలేక, తెల్లవాడు బాండీకూట్ Bandicoot అని ఇంగ్లీషు మాట తయారు చేసుకున్నాడు. అది ఇంగ్లీషు డిక్ష్నరీలోకి ఎక్కిపోయింది. కాబట్టి మనం కూడా Bandicoot ఆనక్కర్లేదు పందికొక్కును. అల్లాగే రోడ్డు, బన్ను టైము, పోస్టాఫీసు, గవర్నమెంటు యిలాంటి సవాలక్ష మాటలు ఈ రోజున శుభ్రమైన తెలుగు మాటలు. మడికట్టుకున్న సద్బ్రాహ్మణ మాటలు కావనుకోండి. తెలుగునుంచి ఇంగ్లీషు డిక్ష్నరీ రాసేటప్పుడు వీటిని తెలుగు మాటలుగానే రాసుకోవాలి. భాషాశాస్త్ర పరిశోధకుల కోసం యీ మాటల మూలం కూడా యివ్వడం మంచిది. లేకపోతే ఓయాభై ఏళ్ళ తర్వాత ప్రతిమాటమీదా బస్తాలకొద్దీ థీసిసులు ఉత్పన్నమౌతాయి. కొత్త తెలుగు డిక్షనరీలలో (అనేది ఒకటి వుందా? నా అజ్ఞానాన్ని మన్నించండి) యివన్నీ వుండే వుంటాయి.

ఇంగ్లీషులోంచి తెలుగులోకి వచ్చిన ఏ మాటా మనం “ఇంగ్లాండు” వాడిలాగా ఉచ్చరించటం లేదు. అస్సలు మనభాష అజంతభాష. అంటే ప్రతిమాటా అచ్చుతో అంతం అవుతుందని అర్థం. హలంత భాష కాదు. అంటే హల్లుతో మాటలు అంతం కావని కదా. తెలుగులో రాసుకున్న ఇంగ్లీషు మాటలు తెల్లవాడిలాగే ఉచ్చరించవలసిన అగత్యంలేదు, అత్యవసరం అయి కొంపలంటుకోపోతే తప్పు, అలా ఉచ్చరించకపోతే అమెరికా వారు గోధుమపిండి పంపించనంటే తప్ప.

తెలుగులో సాంకేతిక, వైజ్ఞానిక వ్యాసాలు రాసినప్పుడు అన్యభాషాపదాలు, తెలుగుమాటకి ప్రక్కనే బ్రాకెట్లలో యివ్వటం సమంజసం. అది జరుగుతూన్నది కూడాను. అంతేకాకుండా, యీ సదరు సాంకేతిక వ్యాసాలు, అస్సలు ఇంగ్లీషుజ్ఞానం పూజ్యం అయిన వాడి కోసం రాయటల్లేదుగా! ఒకవేళ అల్లాంటివాడికోసం రాసినా, వాడికి విషయం అర్థం అయేటట్లు రాయటం ముఖ్యంగానీ, ఉచ్చారణకోసం అక్షరాలకి చుక్కలు, గీతలు, తోకలు తగిలించి వాడిని నానాయాతనా పెట్టక్కడ లేదు. ఒకవేళ ఆ శబ్దలక్షణ సూచికలు పెట్టినా, వాడికి ఇంగ్లీషు రాకపోతే, దాన్ని గురించి కించిత్తైనా పట్టించుకోడు. ఇదేదో అచ్చుతప్పని వదిలేస్తాడు కూడాను. ఇంగ్లీషు నవలల మధ్యలో కాసిని ఫ్రెంచి మాటలొస్తే ఎంతమంది లైబ్రరికి పరిగెత్తికెళ్ళి డిక్ష్నరీ చూస్తున్నారు? అసలు యింతకీ ఇంగ్లీషు పూర్తిగా ఎత్తైయ్యలేదుగా భారతదేశంలో? ఇంగ్లీషులో అన్ని సబ్జెక్టులు చెప్పటంలేదు అంతే.

కోపరేటివు సెంట్రలుబ్యాంకు అన్నది Co-Operative Central Bank అన్న ఇంగ్లీషు మాటకి సిసలైన తెలుగు. ఇంగ్లీషు చదువుకున్నవాడు ‘యాస తెలుగు’లో “ఇంగ్లీషువాడిలా” చదువుతాడు దాన్ని. తెలుగులో తాటికాయలంతేసి అక్షరాలతో రాసివున్నప్పటికీ. ఇంగ్లీషురాని వాడు చక్కగా తెలుగులో రాసింది రాసినట్టుగా చదువుతాడు. అలా చదవటం వలన బ్యాంకు దివాళా తీయదుగా. Zeroని జీరో ఆని రాస్తే ఏం? అచ్చువేసేవాడికి, టైపుకొట్టేవారికి ఏ బాధ వుండదు. చాదస్తం వుంటే ౙీరో అని రాసుకోవచ్చు. ఇంగ్లీషు Zకి తలకట్టు, కొమ్ములు, తోకలు తగిలించటం మొదలెడితే అచ్చువేసే వాడికి పని పెచ్చు. మనకు ఖర్చు హెచ్చు. అంతేకాదు టైపు మార్చుకోవటం, ఏమంత తేలికైన, చవకైన పనికాదు. అస్సలు ఇంతకీ యీ ఉచ్చారణ వ్యామోహం దేవికీ?

ప్రపంచకంలో లిపివున్న ఏభాష ఉద్ధరించటానికైనా లిపిసంస్కరణ అన్నది చాకలి పద్దులో అన్నింటికన్న ఆఖర్న రాసేది. (చాకలివాడు జేబురుమాళ్ళు ఎప్పుడూ ఒకటో రెండో తక్కువే తెస్తాడు; మనం పట్టించుకోము కూడాను;)

Fungus అన్నమాట తెలుగులో ఫంగసు అని రాస్తాం. ఇంగ్లీషుమాట పక్కనే బ్రాకెట్లో యిస్తాం. కొంతకాలం. చాలాసార్లు చాలామంది ఆ మాటవాడితే, ఫంగసు తెలుగు మాట అయి కూర్చుంటుంది, నువ్వు ఎంత వద్దన్నప్పటికీ శుభ్రంగా తెలుగులో ఉచ్చరించబడుతుంది. మరి కొన్నాళ్ళ తర్వాత ఇంగ్లీషు పర్యాయపదంతో పాటు తెలుగు డిక్ష్నరీలోకి ఎక్కుతుంది; మనకి రెండేళ్ళకోసారి తెలుగు డిక్ష్నరీని సంస్కరించి వేసుకొనే ఓపిక వుంటే టైము, బ్యాంకు, ఇంజను, రిక్షా, తాఖీదు, ధరఖాస్తు, భర్తరపు, జప్తలాగా ఇదీ తెలుగు మాటై కూర్చుంటుంది.

ఆఖరిమాట రోమను లిపిలో భారతం రాసినప్పుడు, భగవద్గీత రాసినప్పుడు, శబ్దలక్షణ సూచికల నివ్వటం, అస్సలు సంస్కృత సంపర్కంలేని వాడికోసరం. అట్లాగే రోమను లిపిలో తెలుగు పుస్తకాలు రాసేవాళ్ళకి యీ సూచికలు కావాలి. ఎందుకంటే, తల వల పలక పడవ దగ్గిరనుంచీ శ్రీమద్రామాయణ కల్పవృక్షందాకా తెలుగు లిపి ఆధారం, ప్రమేయంలేకుండా ఆంధ్రేతరుడికి తెలుగు మజా చూపించాలి కాబట్టి, మనం ఇంగ్లీషు, జర్మను, రష్యను, లాటిను, గ్రీకుభాషలనుంచి సాంకేతిక పదాలను తెలుగులోకి తెచ్చుకునేటప్పుడు క్రొత్త మాటలని, సరి క్రొత్త మాటలవి, మొదటి సారిగా, మొట్ట మొదటిసారిగా తెలుగు భాషలోకి తీసుకుకొని వస్తున్నాం అవి గమనించాలి. నలుగురూ వాడితే అవి చెల్లుతాయి, లేకపోతే పడుకుంటాయి, నల్ల కంబళీ కప్పుకొని. అంతేకాని కేవలం స్వచ్ఛ ఉచ్చారణార్థం(!) మానవాళిని యమయాతన పెట్టటం అట్టే ఆరోగ్యకరం కాదు. విషయం ప్రధానం కానీ, ఉచ్చారణ కాదు, వైజ్ఞానిక లోకంలో.