రామాయణ, మహాభారతాలు ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, నీతి పాఠాలు. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి, రామాయణంలో ఒక పాత్ర. మహాభారతాన్ని విరచించిన వ్యాసమహర్షి భారతంలో ఒక పాత్ర. ఈ మహాకవులిద్దరూ వారి వారి కాలాలలో జరిగిన కథలను కావ్యాలుగా మలిచారో లేక అప్పటి చరిత్రను గ్రంథస్థం చేసారో చెప్పడం కష్టం.
రామాయణ, భారతాలలోని పాత్రలు, సందర్భాలు మహాభాగవతంలో తారసపడ్డా, ప్రధానంగా భాగవతం భగవంతుని లీలలు, మహత్తుల గురించిన పురాణకథలు. క్రితం అధ్యాయంలో చెప్పినలు, కథాసారం పాఠకుడికి చేరాలంటే ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా కథను ప్రదర్శించాలి. ఆసక్తి కలిగించడం కలిగించకపోవడమన్నది కల్పనల మీద, సన్నివేశాల కూర్పు మీద ఎక్కువగా ఆధారపడుతుంది. కథ ఆకట్టుకోవాలంటే కథలో వాతావరణం, పాత్రల స్వభావ స్వరూపాలు పాఠకుల కళ్ళ ముందు నిలపాలి.
సంస్కృతభాగవతంలో వ్యాసమహర్షి చెప్పింది కూడా కథలే అయినప్పటికీ, వారి ప్రధానోద్దేశం లోక ధర్మాలను సమాజానికి చెప్పడమై వుండవచ్చునని నాకనిపిస్తుంది. తెలుగు కావ్యాల సృష్టి ప్రారంభయ్యే నాటికి, అంటే నన్నయ కాలం నాటికి కావ్య నిర్మాణంలో, సాహిత్యలక్ష్యాలలో చాలా మార్పు వచ్చింది. చెప్పే విషయం పట్లనే కాక చెప్పే విధానానికి కూడా తగినంత ప్రాధాన్యతనివ్వడం కవులు మొదలు పెట్టారు. ఆంధ్రమహాభారతం, హరివంశం, కుమారసంభవం, ఉత్తర హరివంశం మొదలైన కావ్యాలలో శిల్పపరమైన ఈ మార్పును గమనించవచ్చు.
గజేంద్రమోక్షణం భాగవతంలోని అష్టమస్కంధంలోనిది. ప్రహ్లాదచరిత్ర, గజేంద్రమోక్షణం, క్షీరసాగరమథనం, వామనావతారకథ, రుక్మిణీకల్యాణం అనే యీ అయిదు ఘట్టాలు భాగవత పంచరత్నాలుగా ప్రచారంలో ఉన్నాయి.
వ్యాసమహర్షి భాగవతంలో చెప్పినవి భగవంతుని మహత్తుల గురించి చెప్పిన కథలే. వ్యాసుడు భాగవతంలో చెప్పిన ధర్మాలను, నియమాలను, నీతిని పోతన భాగవతంలో కూడా చెప్పారు. మహాభారత అనువాదమార్గాన్నే పోతన అనుసరించి, వ్యాస భాగవతాన్ని తెలుగులో అనుసృజన చేసారు. సాహిత్యం కావ్యయుగం నుంచి ప్రబంధయుగంలోకి ప్రవేశిస్తున్న సంధిసమయంలో తెలుగు భాగవతరచన జరిగింది. కవిత్రయం భారతాన్ని రచించిన కాలానికే, సామాజికధర్మాలను చెప్పడంతోబాటు, ‘కథను ఆసక్తికరంగా చెప్పా’లన్న ఆకాంక్ష, ‘కథను ఆసక్తికరంగా చెప్పవలసిన’అవసరం కవులకు కలిగింది. కథను ఆసక్తికరంగా చెప్పడానికి అనువైన కథన శిల్పాలకు కవులు మెరుగులు దిద్దుకున్నారు. కథను చెప్పే పద్ధతి నుంచి, కథను చూపించే దశకు ప్రయాణం సాగింది.
కవిత్వానికి మాధ్యమం భాష. సన్నివేశపరంగా, పాత్రల పరంగా దృశ్యీకరణకు అవకాశం ఉన్నప్పటికీ, భాష పరంగా కూడా కొన్ని అంశాలను కవి దృశ్యీకరణ సాధనాలుగా ఉపయోగిస్తాడు.
అవి దృశ్యీకరణకు అనుకూలమైన:
అ) భాషను వాడడం
ఆ) ఛందస్సును ఎన్నుకోవడం
ఇ) అలంకారాలను నియోగించడం
ఈ) పదసంయోజనం చేయడం
పోతన కవిత్వంలో దృశ్యీకరణకు పరాకాష్టగా గజేంద్రమోక్షణం నాకు కనిపిస్తుంది.
3.1 గజేంద్రమోక్షణం కథ
ఒకప్పుడు ఒక గజరాజు, ఒక పెద్ద ఏనుగుల సమూహానికి నాయకుడు. అతడు చాలా శక్తిమంతుడు. ఒక రోజు గజేంద్రుడు మిగిలిన ఏనుగులతో అడవిలో తిరుగుతూ, ఒక సరస్సు దగ్గరకొచ్చాడు. దాహార్తిని తీర్చుకోవడానికి ఆ సరస్సులోకి దిగాడు. ఆ సరస్సులో ఉన్న ఒక పెద్ద మొసలి గజేంద్రుని కాలును బలంగా పట్టుకుంది. మొసలి బారి నుండి బయట పడడానికి ఏనుగు శాయశక్తులా ప్రయత్నించింది. గజేంద్రుడిని విడిచిపెట్టకుండా ఉండడానికి మొసలి ప్రయత్నించింది. ఇద్దరికీ పెనుగులాట, గుంజాటన జరిగింది. స్థానబలంతో పెచ్చరిల్లిపోతున్న మొసలితో పోరుసల్పలేక తనను కాపాడమని ఏనుగు శ్రీహరిని వేడుకుంది.
ఏనుగు ప్రార్థన విన్న శ్రీహరి, ఉన్నపళంగా సరస్సు దగ్గరకొచ్చి మొసలిని చంపి, ఏనుగుని కాపాడి మోక్షం ప్రసాదించాడు.
క్లుప్తంగా ఇదీ గజేంద్రమోక్షణం కథ.
3.2 గజేంద్రమోక్షణంలో దృశ్యీకరణ విధానం
వ్యాసభాగవతంలోని శ్లోకాల క్రమాన్ని పోతన పాటించలేదు. మొదట గజేంద్రుని సంశయం, తదుపరి నిశ్చయబుద్ధితో భగవంతుని ప్రార్థించడం, ఆ వెంటనే శ్రీమహావిష్ణువు గజేంద్రుని రక్షించడాన్ని ఒక క్రమంలో తీర్చిదిద్దారు. అంటే కథలోని సన్నివేశాలను ఒక క్రమంలో పేర్చి కథనరూపాన్ని ఇచ్చారు. సినిమా భాషలో చెప్పాలంటే ‘స్కీన్ ప్లే ’ వ్రాసారు. ఇది పోతన గజేంద్రమోక్షణంలో ఒక విశేషం.
ఒక సూపర్ హిట్ యాక్షన్ సినిమాకు కావలసిన మసాలా దినుసులన్నీ ఈ కథలో ఉన్నాయి. అంటే నా ఉద్దేశ్యం ప్రేక్షకాదరణ పొందడానికి సినిమాకు కావలసిన హంగులన్నీ ఈ కథలో ఉన్నాయి.
‘హరిమేధునకు హరిణికి హరిగా జన్మించిన శ్రీమహావిష్ణువు, మొసలికి చిక్కిన ఏనుగును రక్షించి ప్రాణభయం పోగొట్టాడు’ అని శుకుడు పరీక్షిత్తుతో చెప్పాడు. అప్పుడు పరీక్షిత్తు ఈ క్రింది విధంగా శుకమహర్షిని అడిగాడు.
కం.
బోరాటం బెట్లు కలిగెఁ? బురుషోత్తముచే
నారాట మెట్లు మానెను
ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్.
(పోతన భాగవతము, అష్టమస్కంధం, పద్యం 19)
‘నీళ్ళలో తిరిగే మొసలికి, అడవుల్లో తిరిగే ఏనుగుకు యుద్ధం ఎందుకు వచ్చింది? హరి ఏ విధంగా ఆ తగవు తీర్చాడు, గజరాజునెలా రక్షించాడు?’ అన్న పరీక్షిత్తు ప్రశ్నలే పాఠకులలోనూ తలెత్తుతాయి.
అడవిలో తన సహచరులైన ఏనుగులతో సంచరిస్తూ, కులాసాగా తిరుగుతున్న గజరాజుకు ఒక నిర్మలమైన సరస్సు కనిపించింది. అక్కడి తామర తూడులను ప్రీతితో ఆరగించి, సరస్సులోని పద్మాలపైనుంచి వీచే సుగంధాలను ఆస్వాదిస్తూ గజేంద్రుడు సరోవరంలోనికి దిగాడు. ఆ సందర్భంలోనిది ఈ క్రింది పద్యం.
మ.
డభ మార్గంబున కెత్తి, నిక్కి, వడి నుడ్డాడించి పింజింప నా–
రభటిన్ నీరములోనఁ బెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్
నభమం దాడెడు మీన కర్కటములన్ బట్టెన్ సురల్ మ్రాన్పడన్.
(పోతన భాగవతము, అష్టమస్కంధం, పద్యం 47)
గజరాజు తొండంలోకి నీళ్ళు పీల్చు కొన్నాడు. ఆకాశం కేసి తొండాన్ని పైకెత్తి, శరీరాన్ని సాగదీసుకుని, పీల్చుకున్న నీటిని పుక్కిలించి వేగంగా పైకి చిమ్మాడు. పైకి చిమ్మిన నీటి వడికి, ఆ నీటితో పాటు పీతలు, మొసళ్ళు, చేపలు పైకెగసి ఆకాశంలో తిరిగే మీనరాశిని, కర్కాటకరాశిని పట్టుకొన్నాయి. దేవతలు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యచకితులు అయ్యారు. ఇది పై పద్యం భావం.
పాల్కురికి సోమనాథుని ‘తొలికోడి’ పద్యంలో అప్పుడే లేచి కూతవేసిన కోడి పాఠకుల కళ్ళముందు కనిపించినట్లే, ఠీవిగా నిల్చుని, తొండాన్నెత్తి ఆకాశం పైకి పుక్కిలిస్తున్న గజేంద్రుడు పాఠకుని కళ్ళ ముందు నిలుస్తాడు. రెండు పద్యాలకు స్వభావోక్తి అలంకారం సహజసిద్ధమైన శోభనిచ్చింది.
కవిత్వంలో పదచిత్రానికి, దృశ్యీకరణకు తేడా వుంది. పదచిత్రం ఒక ఛాయాచిత్రం, దృశ్యీకరణ చలనచిత్రం! మరో విధంగా చెప్పాలంటే పదచిత్రం ఒక నిప్పురవ్వ. దృశీకరణం ఒక జ్వాల!
ఏనుగుల గుంపు దాహం తీర్చుకోవడానికి బయల్దేరినప్పుడు, ఆ గుంపు నాయకుడైన గజేంద్రుడు సరోవరాన్ని చూసిన సందర్భం గురించి చెప్పిన పద్యం –
మ.
నటదిందిందిరవారమున్ గమఠమీనగ్రాహదుర్వారమున్
వటహింతాలరసాలసాలసుమనోవల్లీకుటీతీరముం
జటులోద్ధూతమరాళచక్రబకసంచారంబు గాసారమున్.
(పోతన భాగవతము, అష్టమస్కంధం, పద్యం 42)
గజరాజు చూసిన సరస్సు అప్పుడే విచ్చుకుంటున్న తామరలు, కలువలతో కళకళలాడుతోంది.
ఆ పూలమీద తుమ్మెదల సమూహం నాట్యం చేస్తున్నాయి. ఆ సరస్సు నిండా పెద్ద తాబేళ్ళూ, పెద్ద చేపలూ, వాటికంటే పెద్ద మొసళ్ళూ భయంకరంగా నీటిని ఎగజిమ్ముతూ తిరుగుతున్నాయి. వీటితోబాటు హంసలు, కొంగలు, చక్రవాకాలు వేగంగా సరస్సు మీద ఎగురుతున్నాయి. ఆ సరోవరం గట్టున మర్రి, తాడి, మామిడి, మద్ది చెట్లు, వాటితోపాటు పూల తీగెలు, పొదరిండ్లు ఉన్నాయి.
గజరాజు చూసిన మనోహరమైన సరోవర దృశ్యాన్ని, పాఠకులకు కళ్ళకు కట్టినట్లు చూపించారీ పద్యంలో. ఒక కొలను వుంది. కొలనులో పూలున్నాయి. చేపలున్నాయి…అన్న సాధారణ వర్ణనకు – కదులుతున్న తాబేళ్ళను, మొసళ్ళను; ఎగురుతున్న హంసలను, కొంగలను చేర్చి వర్ణనకు జీవం పోసారు.
ఈ పద్యంలోని ఎత్తుగడతోనే ప్రబంధ కవితా పితామహుడు అల్లసాని పెద్దన మనుచరిత్రలో ‘అటజని గాంచెన్’ పద్యం వ్రాసి వుండవచ్చని పండితులు అభిప్రాయపడ్డారు. పోతన నుంచి పెద్దన ప్రేరణ పొంది ఉండవచ్చునని ఊహ!
పద్యం ఎత్తుగడతో పాటు, ఈ మూడు పద్యాలు అక్కడ జరుగుతున్న సన్నివేశాలను దృశ్యీకరించినవే!!
ఏనుగు చేష్టలను ఒక లఘు చలనచిత్ర రూపంలో పోతనగారు పై పద్యంలో చూపించారు.
చాలా కథలకు ఇతివృత్తం సాధు పాత్రలకు, క్రూర పాత్రలకు జరిగే సంఘర్షణ. కథా నాయకునికి, ప్రతినాయకునికి మధ్య జరిగే సంఘర్షణే కథకు ఆయువుపట్టు. ఈ గజేంద్రమోక్షణం కథలో ‘కరణీకరోజ్ఝిత కంకణచ్ఛటఁ దోగి…’ అంటూ సాధురీతిలో గజరాజును చూపించి, ‘భుగభుగాయిత భూరి బుద్బుదచ్ఛటలతో’ అంటూ మొసలిని ఈ క్రింది పద్యంతో పరిచయం చేశారు పోతనామాత్యుడు. రెండు పద్యాలూ సీసాలే. రెండు పద్యాలలోనూ శబ్దార్థాలంకారాల వినియోగం ఉన్నతస్థాయిలో జరిగింది. ఇవి పద్యనిర్మాణశిల్పానికి సంబంధించిన విశేషాలు.
ఈ పద్యం సినిమాల్లో ప్రతి నాయకుడిని ప్రవేశపెట్టే సన్నివేశానికి సమానమైనదని నాకనిపించింది.
సీ.
కదలుచు దివికి భంగంబు లెగయ
భువన భయంకర ఫూత్కార రవమున
ఘోర నక్రగ్రాహకోటి బెగడ
వాలవిక్షేప దుర్వార ఝంఝానిల–
వశమున ఘుమఘుమావర్త మడర
కల్లోలజాల సంఘట్టనంబుల తటీ
తరులు మూలములతో ధరణి గూల
తే.
యదిరి కుప్పించి లంఘించి హుంకరించి
భాను కబళించి పట్టు స్వర్భాను పగిది
నొక్క మకరేంద్రు డిభరాజు నొడిసిపట్టె.
(పోతన భాగవతము, అష్టమస్కంధం, పద్యం 51)
ఏనుగుల గుంపు నీళ్ళలోకి దిగి ఆడుతున్న చిలిపి ఆటలకు, అల్లరికి అతలాకుతలం అయిపోతున్నది నీటి కొలను. అది గమనించింది ఆ కొలనులో నివసిస్తున్న ఒక మొసలి. అలాంటి ఇలాంటి మొసలికాదది. గజరాజుకు ధీటైనది. పైగా నీళ్ళలో ఉన్నప్పుడు దాని స్థానబలం దానికి ఉంటుంది కదా!
ఏనుగుల అల్లరికి అడ్డుకట్ట వేయాలనుకుంది. విజృంభించింది. ‘భుగభుగ’మనే శబ్దాలతో ఆకాశాన్నంటే బుడగలు రేపుతూ ఒక్కసారిగా మొసలి పైకెగసింది. తోకను ఈడ్చిఈడ్చి కొడుతూ ఫూత్కారనాదం చేస్తోంది. మొసలి చేష్టలతో పెద్ద గాలి పెల్లురేగింది. దానితో సరస్సులో ఘుమఘుమలాడే సుడి గిరగిరా తిరుగుతోంది. ఒకదానితో ఒకటి కొట్టుకునే అలల తాకిడికి, సుడిగాలులు పెనుగాలులై సరస్సు ఒడ్డున వున్న మహావృక్షాలు పెల్లగిల్లిపోతున్నాయి. ఆ మొసలి పట్టు చిక్కించుకొని కుప్పించి దూకుతూ హుంకరించి, సూర్యుడిని రాహువు పట్టుకున్నట్లు ఒడిసి పట్టుకొన్నది.
ఈ పద్యాన్ని చదువుతుంటే ఒక భయానక, బీభత్సదృశ్యం కళ్ళముందు కనిపిస్తుంది. ఈ పద్యంలో ఉపయోగించిన శబ్దాలు కూడా సరస్సులోని గందరగోళాన్ని, అల్లకల్లోలాన్ని ధ్వని రూపంలో వ్యక్తం చేస్తున్నాయి.
కం.
గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్
గరికి మకరి మకరికి గరి
భర మనుచును నతలకుతలభటు లదరిపడన్.
(పోతన భాగవతము, అష్టమస్కంధం, పద్యం 54)
మొసలి ఏనుగును మడుగులోకి గుంజుతోంది. ఏనుగు మొసలిని నేల మీదకు లాగుతోంది. అక్కడొక పెనుగులాట జరుగుతోంది. చూసే వాళ్ళు ‘మొసలికి ఏనుగు బరువైపోతోంది, ఏనుగుకు మొసలి బరువైపోతోంది. కాదు ఏనుగు మొసలికి భారమైపోతోంది, కాదు కాదు మొసలి ఏనుగుకు భారమైపోతోంది’ అనుకుంటూ ఎటూ తేల్చుకోలేక పోతున్నారు అంటూ అక్కడ సరస్సులో జరుగుతున్న ఒక గుంజాటనను కమనీయంగా కన్నులకు కట్టించారు పోతన.
ఈ పద్యంలో అక్కడ జరుగుతున్న సన్నివేశపు భావాన్ని శబ్దాలలో కూడా చెప్పడానికి ప్రయత్నించినట్లుగా కనిపిస్తుంది. ‘ర’కార పునరావృతం, ఏనుగుకూ, మొసలికి నడుమ సాగుతున్న స్పర్థను చూపిస్తోంది. కరి – మకరి, మకరి – కరి అంటూ ఏనుగుకూ, మొసలికి నడుమ పోరాటాన్ని, గుంజాటనను చిత్రీకరిస్తూ నేపథ్యసంగీతాన్ని కూడా సమకూర్చారనిపిస్తుంది.
ఉండేకొలది మకరం విజృంభిస్తోంది. మొసలి ధాటికి ఏనుగు తల్లడిల్లిపోతున్నది. మొసలిలో అంతకంతకూ ఉత్సాహం ఉవ్వెత్తున పొంగిపొరలుతోంది. నీటిలోనే పుట్టి, నీటిలోనే జీవనం సాగించే మొసలి పరాక్రమాన్ని చూపించే పద్యమిది.
శా.
న్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకున్ మాఱాకు హత్తించి ని–
ష్ఖేదబ్రహ్మపదావలంబనరతింగ్రీడించు యోగీంద్రు మ–
ర్యాదన్ నక్రము విక్రమించె గరి పాదాక్రాంతి నిర్వక్రమై.
(పోతన భాగవతము, అష్టమస్కంధం, పద్యం 65)
మొసలి రెండు కాళ్ళనూ గట్టిగా నేలకు తన్ని పెట్టింది. ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలను నియంత్రించుకుని ఊపిరి బిగపట్టింది. కళ్ళను, చెవులను, ముక్కును, నాలుకను, శరీరాన్ని — అంటే పంచేంద్రియాలను వశంలో పెట్టుకుంది. బుద్ధికి మారాకు తొడిగి, బ్రహ్మపదాన్ని చేరుకునే దారిలో విహరించే ఒక పరమయోగిపుంగవుడిలా ఆనందిస్తూ ఏనుగు పాదాలమీద పట్టును ఏ మాత్రం సడలించకుండా పట్టుకునే ఉంది మకరం. ‘ఇభలోకేంద్రుడు’ పద్యంలో చూపిన దృశ్యీకరణమే ఈ పద్యంలోనూ ఉంది.
దేనినైనా పట్టుకుని బలంగా లాగుతున్నప్పుడు మనిషి తీరు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది!
మకరంతో గెలవడం కష్టమని గజరాజుకు తెలిసిపోతోంది. ఎలా వీడితో గెలవాలి, రక్షించమని ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అని వాపోయాడు గజరాజు. తన గత వైభవాన్ని తలచుకుని బాధపడ్డాడు. కాలం గడుస్తున్న కొద్దీ సత్తువ తగ్గిపోతోంది. తాను ఎంత అలసిపోయాడో, శరీరం ఎంత నుజ్జునుజ్జు అయిపోతోందో చెప్పుకుంటూ ‘రావే వరద రక్షించు భద్రాత్మకా’ అంటూ దేవుణ్ణి ప్రార్థించాడు. సహాయం అందకపోయే సరికి దేవుడున్నాడో లేడో అన్న సందేహం కలిగింది. అంతిమంగా దేవుడు తప్ప తనను రక్షించే వారు మరెవరూ లేరనే గ్రహింపుకు వచ్చాడు. గజేంద్రుడు మనసా వాచా కర్మణా దేవుణ్ణి ప్రార్థించాడు.
గజేంద్రమోక్షణం ఒక దృశ్య కావ్యం. ఈ ఘట్టంలో ఒక అద్భుతమైన కథ వుంది. ఉత్కంఠ రేపే సన్నివేశాలున్నాయి. సహజమైన మనస్తత్త్వ చిత్రణ ఉంది. కష్ట సమయాలను దాటడానికి ఉపకరించే మార్గాల గురించిన సూచనలున్నాయి. గజేంద్రమోక్షణాన్ని అధ్యయనం చేసి, ఇందులో సూక్ష్మాలను ఆచరణలో పెట్టిన వారికి కష్టాలలోంచి బయటపడే దారులు దొరుకుతాయని పలువురి విశ్వాసం.
గజేంద్రుని ప్రార్థనలు ఆలకించిన శ్రీహరి, ఏనుగును రక్షించడానికి బయల్దేరే సందర్భంలోనిది ఈ క్రింది పద్యం. బహుళప్రాచుర్యం పొందినది. పాతతరం తెలుగు వాళ్ళకు చాలా మందికి కంఠతా వచ్చిన పద్యం.
మ.
పల మందారవనాంతరామృతసరఃప్రాంతేందుకాంతోపలో–
త్పలపర్యంకరమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి–
హ్వలనాగేంద్రము “పాహి పాహి” యన గుయ్యాలించి సంరంభియై.
(పోతన భాగవతము, అష్టమస్కంధం, పద్యం 95)
అది వైకుంఠపురం. ఆ పురంలో ఒక భవనసముదాయం. అందులో ఒక మేడ. మేడనానుకుని ఒక మందారాల పూల తోట. మరికాస్త లోపలికి వెళితే ఒక అందమైన కొలను. కొలను నిండా పరుచుకుని వున్న నల్లకలువలు. అక్కడ శ్రీహరి, ఒక మంచం మీద తన ప్రాణసఖి రమాదేవితో ఆనందంగా కాలక్షేపం చేస్తున్న సమయంలో, అంతులేని దుఃఖంతో ‘రక్షించు రక్షించు’మన్న ఏనుగు ప్రార్థన విని, మరే విషయాలూ పట్టించుకోకుండా ఏనుగును రక్షించడానికి హుటాహుటిన బయల్దేరారు శ్రీహరి.
హాలీవుడ్లో కెమెరాతో చిత్రదృశ్యీకరణం మొదలు పెట్టడానికి ముందుగా, చిత్రకారులతో సినిమా మొత్తాన్ని చిత్రాల రూపంలో గీయిస్తారు. దాదాపుగా ప్రతి సన్నివేశానికి బొమ్మలు గీయిస్తారు. గీసిన బొమ్మలను సన్నివేశాల క్రమంలో పేర్చి చూస్తే, నలుపు తెలుపుల్లో సినిమా మొత్తం కనిపిస్తుంది. ఇలా కథనంతటినీ చిత్రాల రూపంలోకి మార్చడాన్ని ‘Storyboard’ (తెలుగులో ‘కథనచిత్రాలు’ అనవచ్చు) అని వ్యవహరిస్తారు. ఇప్పుడు కొన్ని తెలుగు సినిమాలకు కూడా ‘కథనచిత్రాలు’ తయారు చేయిస్తున్నారు. (తెలుగు దర్శకుల్లో బాపు స్వయంగా చిత్రకారుడు కనక, ఇదే పద్ధతిని తన చిత్రాలన్నిటిలోనూ పాటించేవారు)
పైన చెప్పిన పద్యాన్ని సరళమైన వాక్యాల్లో ఈ క్రింది విధంగా వ్రాస్తే, ఒక్కో వాక్యం ఒక్కో చిత్రంగా గీయవచ్చు. చిత్రాలన్నింటినీ వరుసగా పేర్చితే పద్యంలో పోతన చిత్రీకరించిన సన్నివేశం దర్శనమిస్తుంది.
ఆకాశంలోంచి చూసినప్పుడు ఊరంతా కనిపిస్తుంది. అక్కణ్ణుంచి కాస్త క్రిందకు వచ్చి చూస్తే ఊరిలో ఉన్న వీథి అంతటినీ చూడవచ్చు. మరి కాస్త క్రిందకు వస్తే భవనసముదాయం కనిపిస్తుంది. ఇంకాస్త క్రిందకు వస్తే శ్రీహరి నివాసం అగుపిస్తుంది. నివాసంలోపలికి వెళితే, నివాసానికి ఆనుకుని ఉన్న మందారవనం కనిపిస్తుంది. వనంలోంచి మరికాస్త లోపలికి వెళితే సరస్సు కనిపిస్తుంది. సరస్సుకు దగ్గరగా వెళితే సరస్సులోని నల్లకలువలు కనిపిస్తాయి. ఇంకాస్త ముందుకు చూస్తే మధ్యలో వున్న మంచం కనిపిస్తుంది. మరికాస్త దగ్గరగా చూపుసారిస్తే మంచం మీద లక్ష్మీదేవితో సరససల్లాపాలాడుతున్న శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తారు.
‘కథనచిత్రాల’ను దృశ్యంలోకి బదలాయించడం తేలికైన పని. డ్రోన్ కెమెరాను చాలా ఎత్తులో ఉంచి వైకుంఠపురాన్నంతటినీ చిత్రించి, కొంత ఎత్తు తగ్గించి వీధిని, మరి కొంత ఎత్తు తగ్గించి భవన సముదాయాన్ని, తర్వాత ‘జూమ్ ఇన్’ (zoom-in) చేసి, శ్రీహరి నివాసాన్ని, ట్రాలీ మీద కెమెరానుంచి మందారవనాన్ని…ఇలా ఒక్కో వాక్యాన్ని ఒక షాట్ క్రింద కెమెరాలో బంధించవచ్చు.
పదిహేనవ శతాబ్దంలోని పోతనకు కెమెరాల గురించి, డ్రోనుల గురించి తెలిసే అవకాశంలేదు. కానీ తన ఊహలను కవిత్వంలోకి తర్జుమా చేసేటప్పుడు, చాలా జాగ్రత్తగా ప్రతి చిన్న వివరాన్ని పద్యంలో ఇమిడ్చి, కవిగా తాను ఏమి భావనలు చేసాడో ఆ భావనలు పాఠక/శ్రోతల మనోనేత్రం ముందు సాక్షాత్కరించేలా పద్యాలను నిర్మించాడు. కవికి చెప్పదలచుకున్న అంశం ఎంత ముఖ్యమో, ఎలా చెప్పాలన్నది కూడా అంతే ముఖ్యం. అప్పుడే కావ్య ప్రయోజనం సిద్ధిస్తుంది.
ప్రక్కనున్న లక్ష్మీదేవికి మాటమాత్రం చెప్పకుండా, తనకంటిపెట్టుకున్న ఆవిడ పమిట చెంగుతో సహా, ఏ ఆయుధాన్ని ధరించకుండా ఉన్నఫలాన తన భక్తుడిని రక్షించడానికి బయల్దేరిన శ్రీమన్నారాయణుడిని చూసి, స్వామి వెంట ఎవరెవరు బయల్దేరారో చెప్పిన ఈ క్రింది దృశ్యాన్ని చూద్దాం.
మ.
న్కను బక్షీంద్రుడు; వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ–
క్ర నికాయంబును, నారదుండు, ధ్వజినీకాంతుండు దా వచ్చి రొ–
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.
(పోతన భాగవతము, అష్టమస్కంధం, పద్యం 98)
విష్ణుమూర్తి వెంట లక్ష్మీదేవి బయల్దేరింది. ఆమె వెనుక అంతఃపురంలోని స్త్రీలు బయలుదేరారు. వారి వెనుక గరుత్మంతుడు బయల్దేరాడు. గరుత్మంతుడి ననుసరించి శార్ఙ్గమనే విల్లూ, కౌమోదకి అనే గదా, పాంచజన్యమనే శంఖమూ, సుదర్శనమనే చక్రమూ మొదలైనవన్నీ వరుసలో బయల్దేరాయి. వారితో పాటు, నిరంతరమూ నారాయణస్మరణతో గడిపే నారదుడు వచ్చి చేరాడు. సేనాపతి విష్వక్సేనులవారు కూడా అందరితో కలిసి బయల్దేరారు. వీరందరితో బాటు వైకుంఠపురంలోని జనులందరూ స్వామివారిననుసరించారు.
ఒక భక్తుని రక్షించడానికి బయల్దేరిన శ్రీహరిని ఆయన సతీమణి, అనుచరగణం, పురవాసులు అనుసరించారన్న విషయాన్ని ఒక క్రమంలో, చాలా వివరంగా, సన్నివేశం మన కళ్ళముందే జరుగుతుందా అని భ్రమించేలా చెప్పారు పోతన గారు.
శా.
శాటీముక్తకుచంబుతో, నదృఢచంచత్కాంతితో, శీర్ణ లా–
లాటాలేపముతో, మనోహరకరాలగ్నోత్తరీయంబుతో,
గోటీందుప్రభతో, నురోజభరసంకోచద్వలగ్నంబుతోన్.
(పోతన భాగవతము, అష్టమస్కంధం, పద్యం 102)
ఏనుగును కాపాడాలని పరుగులాంటి నడకతో బయల్దేరిన పతి వెనుక పరుగులెడుతున్న లక్ష్మీదేవి చెవిపోగులు కదలాడుతున్నాయి. భుజాలమీద కొప్పుముడి చిందులేస్తోంది. స్తనాలపైని పైట జారిపోయింది. నడుముకున్న ఒడ్డాణం వదులైపోయింది. నుదుటికి రాసుకున్న లేపనం చెదిరిపోయింది. పైటకొంగు మాత్రం ఇంకా శ్రీహరి చేతిలోనే ఉండిపోయింది. స్తనభారంతో ఆమె నడుము నకనక లాడుతోంది. కోటి చంద్రుల కాంతితో ఆమె ముఖం మెరిసిపోతోంది.
శ్రీహరి వెనుక వెడుతున్న లక్ష్మీదేవి రూపాన్ని సాక్షారింపచేసిన దృశ్యపద్యమిది.
పమిట కొంగును కూడా వదలకుండా పతిదేవుడు ఏకాగ్రతతో ఎక్కడకు వెళుతున్నాడో ఆలోచిస్తూ, పరిసరాలను గమనంలో వుంచుకోకుండా నడిచే ఒక మహా ఇల్లాలిని చూపించారు పోతన.
ఒక సంఘటనకు మనస్సులో చెలరేగే భావాలు సాధారణంగా వ్యక్తుల ప్రవర్తన ద్వారా వ్యక్తమవుతాయి. ప్రవర్తన రెండు విధాలు. ఒకటి భౌతికంగా కనిపించేది, మరొకటి చేష్టల ద్వారా ప్రదర్శించబడేది. అంటే ఒక సంఘటనకు స్పందన శారీరక మానసిక ధర్మాలననుసరించి ఉంటుంది. ఉదాహరణకు మనస్సు ఆనందంలో తేలియాడినప్పుడు కనిపించే ముఖానికి, మనస్సు విషాదంలో మునిగినప్పుడు అగుపించే ముఖానికి, మనస్సు ఉద్విగ్నతతో ఊగులాడుతున్నప్పుడు కనిపించే ముఖానికి ప్రస్ఫుటమైన తేడాలు కనిపిస్తాయి. అలాగే ఈ మూడు సందర్భాలలో వ్యక్తి ప్రవర్తనలో తేడాలుంటాయి.
సృజనాత్మక రచనల్లో పాత్రల స్పందనలు, ప్రతిస్పందనలు కొన్ని సందర్భాలలో ‘శరీరభాష ’లో చూపించాల్సిన అవసరం ఉంటుంది.
ఈ క్రింది సర్వ లఘు కందంలో, శ్రీవారిని అనుసరిస్తున్న శ్రీదేవి మానసికస్థితిని పోతనగారు, శారీరకభాషలోకి అనువదించి చూపించారు.
కం.
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్
వెడ వెడ సిడిముడి తడఁబడ
నడుగిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్.
(పోతన భాగవతము, అష్టమస్కంధం, పద్యం 103)
ఎక్కడికి వెళుతున్నారో తెలియదు. ఎందుకు వెళుతున్నారో తెలియదు. ఇల్లాలిగా భర్తను అనుసరించడం ధర్మం. పైగా తన పమిట కొంగు భర్త చేతుల్లో ఉందాయె! ఎక్కడికి వెళుతున్నారో అడుగుదామని నడకలో వేగం పెంచుతోంది. అడిగినా చెబుతాడా అని సంశయిస్తూ నడుస్తోంది. మనసంతా గందరగోళమైపోతోంది. దాంతో అడుగులు తడబడుతున్నాయి. అడుగులు వెయ్యడం, ఆపడంతో కొంతసేపటికి కాళ్ళు కదలలేని స్థితికి చేరుకుంటాయేమో అనిపిస్తోంది.
గజేంద్రమోక్షణంలో ఈ పద్యం చాలా ప్రసిద్ధిపొందింది. ఈ పద్యంలో దృశ్యీకరణంతో బాటు, ‘డ’కార పునరావృతి భావానికి శోభ తెచ్చింది. లక్ష్మీదేవి మానసికస్థితిని నడకలో తడబాటు ద్వారా చూపించడం, ఆ తడబాటును పద్యం నడకలోనూ, పదాల సంయోజనంలోనూ కేవలం 32 అక్షరాలలో చూపించడం మరో విశేషం!
మేఘం వెన్నంటి వెళ్ళే మెరుపు తీగలా విష్ణుమూర్తి వెంట లక్ష్మీదేవి వెళుతున్న సందర్భంలో, లక్ష్మీదేవి లావణ్యాన్ని, సొగసును మనోహరంగా ఒక సీసపద్యంలో వర్ణించారు పోతన.
సీ.
ముఖసరోజము నిండ ముసురు దేంట్లు
నళులఁ జోపగ జిల్క లల్ల నల్లన జేరి
యోష్ఠబింబద్యుతు లొడియ నుఱుకు
శుకముల దోల జక్షుర్మీనములకు మం–
దాకినీ పాఠీనలోక మెగుచు
మీనపంక్తులు దాట మెయిదీగెతో రాయ
శంపాలతలు మింట సరణి గట్టు
ఆ.
కుచయుగంబు దాకి క్రొవ్వు చూపు
మెలత మొగులు పిఱిది మెఱుగు దీగెయు బోలె
జలదవర్ణు వెనుక జరుగు నపుడు.
(పోతన భాగవతము, అష్టమస్కంధం, పద్యం 104)
ఆర్తరక్షణ కోసం బయల్దేరిన విష్ణుమూర్తిని అనుసరిస్తూ నడుస్తున్న లక్ష్మీదేవి నుదుటి మీద చెమట బిందువులను కురులు అంటుకుంటాయి కదా! ఆ అంటుకున్న ముంగురులను లక్ష్మీదేవి చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూంటే, పద్మంలాంటి ఆమె మోము మీద తుమ్మెదలు ‘జుంజుం’ అంటూ ఝంకారనాదాలు చేస్తూ ముసురుకున్నాయి. తుమ్మెదలను తోలుతుంటే ఎర్రని కాంతితో మెరుస్తున్న ఆమె క్రింది పెదవిని చూసి దొండపండు అనుకుని చిలకలు వచ్చి చేరాయి. చిలకలను ‘పొండి పొండం’టూ తోలుతూంటే చేపలలాంటి ఆమె కన్నులను చూసి ఆకాశగంగలోని పెద్ద పెద్ద చేపలు ఎగసిపడుతున్నాయి. చేపలను తప్పించుకు పోబోతుంటే, ఆమె శరీరపు మెరుపును చూసి తాకడానికి ఆకాశంలో మెరుపు తీగలన్నీ బారులు తీరాయి. మెరుపు తీగలను దాటి ముందుకు సాగగానే చక్రవాకపక్షుల జంటలు గుండ్రటి ఆమె పాలిండ్లను తాకాయి. మేఘం వెనుక వెళుతున్న మెరుపుతీగలా, నీలమేఘశ్యాముని వెనుక లక్ష్మీదేవి వెళుతోంది.
లక్ష్మీదేవి అందాన్ని అత్యంత సుందరంగా కళ్ళకు కట్టినట్లు వర్ణించిన పద్యమిది.
‘నానృషిః కురుతే కావ్యమ్’ అంటే ఋషి కాని వాడు కవి కాలేడు, కావ్యాన్ని వ్రాయలేడు. ద్రష్ట కాని వాడు కవి కాలేడు. కవి మనోనేత్రంతో దర్శించినదాన్ని ప్రపంచానికి కావ్యరూపంలో అందిస్తాడు. కావ్యాన్ని చదివిన వారి మనోయవనిక మీద మేఘం వెంట నడుస్తున్న మెరుపు తీగలాంటి లక్ష్మీదేవి రూపం ప్రత్యక్షమౌతుంది.
నుదురును అంటుకున్న ముంగురులు తుమ్మెదలలాగా ఉన్నాయట. కురులను తుమ్మెదలతో పోల్చడం కవిసమయం. కురులను సవరించుకున్నప్పుడు ముఖం పూర్తిగా కనిపిస్తుంది. పూర్తిగా కనిపించిన ముఖం పద్మంలా ఉంది. అందమైన ముఖాన్ని పద్మంతో పోల్చడం కవిసమయం. ముఖంలో కాంతివంతంగా కనిపిస్తున్న పెదవి, చేపల్లా కనిపిస్తున్న కళ్ళు – ఈ పోలికలూ కవిసమయాలే. వివరంగా, నింపాదిగా వర్ణించడానికి కావలసిన నిడివినిచ్చేది సీసపద్యం. ‘అడిగెదనని..’ చూపించదలచిన తొందరకు, హడావిడిని చూపించడానికి అతి చిన్నదైన కందాన్ని ఎన్నుకుంటే – వివరంగా, నింపాదిగా, మనసారా లక్ష్మీదేవి లావణ్యాన్ని చూపడానికి సీసపద్యాన్ని ఎన్నుకున్నారనిపిస్తోంది. సీస పద్యాల నిర్మాణంలో శ్రీనాథుడిది అందె వేసిన చేయి అంటారు. గజేంద్రమోక్షణంలో ‘కరణీకరోజ్ఝిత, భుగభుగాయిత, నిటలాలకము లంటి’ పద్యాలను గమనించినప్పుడు పోతన కూడా సీస పద్యాలను అత్యంత నేర్పుతో నిర్మించగలడనిపిస్తోంది.
పద్యంలో పొందుపరచిన వివరాలు, ఉపయోగించిన అలంకారాలు, ఆచితూచి వేసిన పదాలు – సందర్భాన్ని అత్యంత మనోజ్ఞంగా దృశ్యీకరిస్తాయి.
గజరాజును రక్షించేందుకు భూమి పైకి దిగి వస్తున్న శ్రీహరిని గురించి పారవశ్యంతో దేవతలు, ఆ దేవదేవుని గురించి మాట్లాడుతున్న సందర్భాన్ని చూపించే పద్యం –
మ.
ఖనినాదం బదె; చక్ర మల్లదె; భుజంగధ్వంసియున్ వాడె; క్ర–
న్నన నేతెంచె” నటంచు వేల్పులు ‘నమో నారాయణా’యేతి ని
స్వనులై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం జక్రికిన్.
(పోతన భాగవతము, అష్టమస్కంధం, పద్యం 107)
అదిగో శ్రీహరి విచ్చేస్తున్నాడు. చూడండి, అదిగో శ్రీహరి ప్రక్కనే లక్ష్మీదేవి ఉంది. శంఖ నాదమదిగో వినండి. శ్రీహరి ఆయుధం సుదర్శన చక్రమదిగో. సర్పాలను సర్వనాశనం చేసే గరుత్మంతుడక్కడే, స్వామి వారి చెంతనున్నాడు. భక్తుడైన గజరాజును రక్షించడానికి ఎంత తొందరగా వచ్చాడు మహానుభావుడు అని ఆనంద పారవశ్యంతో ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని జపిస్తున్నారు దేవతలు. గుంపులు గుంపులుగా చేరిన దేవతలతో, వారి మాటలతో, వారి ప్రార్థనల ఘోషలతో ఆకాశమంతా నిండి పోయింది.
దేవతల దృష్టికోణం నుంచి దృశ్యీకరించిన సన్నివేశమిది! పొడి పొడిగా శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవితోనూ, తన పరివారంతోనూ వచ్చాడని చెప్పే వీలున్నా కూడా, కవి అక్కడున్న దేవతల దృష్టికోణంలో ఈ సన్నివేశాన్ని రూపొందించడంతో ఈ పద్యాన్ని చదివేవారికి, వినేవారికి దృశ్యాన్ని నిర్మించుకుని చూసే వెసులుబాటు వచ్చింది. ఇక్కడ ‘చెప్పకు, చూపించు’ అన్న వాదాన్ని అత్యంత నేర్పుతో కవితాశిల్పంలోకి తర్జుమా చేసారు పోతనామాత్యుడు.
ఆలంకారికపరిభాషలో పోతన భాగవతం చంపూ కావ్యం. చంపూ కావ్యాలు పద్యాలు, వచనాలతో సాగుతాయి. వచనాన్ని గద్య అని కూడా అంటారు. గద్యను సాధారణంగా అవసరమైన సందర్భాలలో పద్యానికి పద్యానికి మధ్య ఒక వారధిలా వాడతారు. ఉదాహరణకు: గజేంద్రమోక్షణంలో ‘అని వితర్కించుచు’ (101), ‘మరియును’ (82), ‘ఇ వ్విధంబున’(68), ‘అప్పుడు’ (58) అనే వచనాలను గమనించ వచ్చు. ఉదహరించిన వచనాలన్నీ గజేంద్రమోక్షణం లోనివే.
అయితే కొన్ని సందర్భాలలో సుదీర్ఘమైన గద్యల అవసరం ఉంటుంది. పద్యానికి పద్యానికి మధ్య వచనాన్ని వారధిలాగానే కాకుండా, వచనాన్ని దృశ్యీకరణకు వాడడం గజేంద్ర మోక్షణంలో గమనించవచ్చు.
కావ్యం ఆరంభంలో త్రికూటమనే పర్వతాన్ని ఒక సీస పద్యంలో పరిచయం చేసి, పాఠకులను ఆ పర్వతాన్ని దగ్గరగా చూపించడానికా అన్నట్లు ఒక సుదీర్ఘమైన వచనాన్ని వ్రాసారు పోతన.
“అది మఱియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ వకుళ వంజుళ వట కుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సిందువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధూక తాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్థ కాంచన కందరాళ శిరీష శింశుపాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంతసమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరున్నివహాలంకృతంబును; మణివాలుకానేక విమల పులినతరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుక పిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్దళిత శాఖిశాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును; కనకమయ సలిల కాసార కాంచన కుముద కల్హార కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విటసముదయ సమీప సంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బక బలాక కోయష్టిక ముఖర జలవిహంగ విసర వివిధ కోలాహల బధిరీ భూత భూనభోంతరాళంబును; తుహినకరకాంత మరకత కమలరాగ వజ్ర వైఢూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌత మణిమయానేక శిఖరతట దరీ విహరమాణ విద్యాధర విబుధ సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నర కింపురుష మిథున సంతత సరస సల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును; గంధగజ గవయ గండభేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల శశ చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునై యొప్పు నప్పర్వత సమీపము నందు”.
(పోతన భాగవతము, అష్టమస్కంధం, వచనం 24)
పై వచనానికి సంక్షిప్త భావం:
ఆ త్రికూట పర్వతం దగ్గర ఏయే పండ్ల చెట్లున్నాయో వరుసగా చెబుతూ, అక్కడ ఏయే రకాల పూల చెట్లున్నాయో అవి ఆ పర్వతానికి ఎలా అలంకారాలుగా ఉన్నాయో చూపించారు.
ఆ చెట్ల కొమ్మలు, పొదలు ఎప్పుడూ చిగుర్లు చిగురిస్తూ ఉంటాయి. రెమ్మలు పల్లవిస్తూ, మొగ్గలు తొడగుతూ, పూలు పూస్తూ, పండ్లు కాస్తూ ఉంటాయి. ఆ చెట్లకు కాసిన పండిన పండ్లను చిలుకలు, కోయిలలు తమ ముక్కులతో పొడుచుకుని తింటున్నాయి. అలా ముక్కులతో పొడిచినప్పుడూ ఆ పండ్లకు పడ్డ రంధ్రాలనుండి రసాలు కారి కాలువలుగా ప్రవహిస్తున్నాయి.
ఆ పర్వతంలో చాలా మంచినీటి సరోవరాలున్నాయి. పసుపు కలువలు, తెల్లకలువలు, ఎఱ్ఱ కలువలు, పద్మములు ఆ సరస్సులకు అందాన్నిస్తున్నాయి. అక్కడ ఉన్న మదించిన గండు తుమ్మెదలు ఆ పూవుల సువాసనలను ఆఘ్రానిస్తూ, ఆ పూవుల మధువును ఎడతెగకుండ త్రాగి, తమ ప్రియురాళ్ళతో చేరి విహరిస్తున్నాయి.
ఆ దగ్గరలోనే చక్రవాకాలు, కలహంసలు, శకుంతపక్షులు, కారండవాలు, నీటికోళ్ళు, కొక్కెరలు, చీకుకొక్కెరలు, కొంగలు మొదలైన నీటిపక్షుల కలకలా రావాలతో ఆ ప్రాంతం సందడిగా ఉంది.
ఆ పర్వతం మీద చలువరాళ్ళు, మరకతాలు, వజ్రాలు, వైడూర్యాలు, నీలాలు, గోమేధికాలు, పుష్యరాగాలు నిండిన మనోహరమైన బంగారు, వెండి శిఖరాలు, లోయలు ఉన్నాయి.
అక్కడ దేవతలు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు, గరుడులు, గంధర్వులు, కిన్నరలు, కింపురుషులు తమ ప్రియురాళ్ళతో కలిసి జంటలు జంటలుగా విహరిస్తున్నారు. వారు ఆహ్లాదంగా మాట్లాడుకుంటూ, పాటలు పాడుతున్నారు.
మదపుటేనుగులు, సింహాలు, పులులు, ఖడ్గమృగాలు, శరభాలు, కోతులు,పిల్లులు గురుపోతులు, గండభేరుండాలు, ఎలుగుబంట్లు, తోడేళ్ళు, చమరీమృగాలు, కుందేళ్ళు, జింకలు, ముళ్ళపందులు, అడవిపందులు, అడవిదున్నలు, పెద్ద పెద్ద పాములు మొదలైన జంతువులు ఉన్నాయి. జంతువులు పోరాటాలు చేస్తుంటే చూసిన యమ భటులు సైతం భయపడి శరణు వేడుతుంటారు.
పోతన కెమెరాను పట్టుకుని త్రికూట పర్వతమంతా తిరిగి చిత్రీకరించి మనకు చూపించినట్లు అనిపిస్తుంది ఈ వచనాన్ని చదివినప్పుడు! ‘రవి కాంచని చోటును కూడా కవి కాంచును’ అన్నది ఈ వచనానికి సరిగ్గా సరిపోతుంది. తాను చూడడమే కాదు, చదివిన వారందరితోనూ త్రికూట పర్వతాన్ని వీక్షింపజేసారు.
ఈ వచనంలో పెద్దగా అలంకారాలు లేవు. సామాన్యమైన భాష ఉపయోగించినప్పటికీ, అందులో ఒక లయాత్మకత ఉంది. ‘అక్షరరమ్యత’ అనగానే ఆదికవి నన్నయ గుర్తుకు వస్తారు గానీ, పోతన పద్యగద్యాలు అక్షరరమ్యతతో అలరారుతుంటాయి. పద్యాలలోని భావాలు మనసుకు, శబ్దాలు వీనులకు విందు చేస్తుంటాయి.
గజేంద్రమోక్షణంలో మరెన్నో పద్య గద్యాలలో దృశ్యీకరణాంశాలు వున్నా ఈ పరిశోధనాంశం పరిధిని, పరిమితులను దృష్టిలో ఉంచుకుని స్థూల పరిచయం చేయడానికి ప్రయత్నం చేసాను.
వచ్చే అధ్యాయంలో పోతన తర్వాత వచ్చిన కవుల కావ్యాలలో దృశ్యీకరణను పరిశీలిద్దాం.