ఆరేళ్ళ క్రితం, నాకు ఏభై యేళ్ళు నిండిన సందర్భంగా, ఏదైనా బాగా గుర్తుంచుకోదగ్గ ప్రయాణం చేద్దామనిపించింది. అప్పటికే దేశాలన్నీ ఒంటరిగా తిరగడం అన్నది నాకు నిత్యకృత్యంగా పరిణమించినా, నేనుండే యూకేలో కొండలూ గుట్టలూ మైదానాలూ రోజుల తరబడి తిరిగి వస్తోన్నా – వాటన్నిటినీ మించిన ట్రెక్ ఒకటి చేసి చూద్దాం అన్న ఆలోచన కలిగింది. నాలాంటి యాత్రాభిలాషే ఉన్న స్నేహితులతో మాట్లాడితే అందరూ ఆఫ్రికా ఖండంలోకెల్లా ఎత్తైన కిలిమంజారో శిఖరానికి ఓటు వేసారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న బాణీలో ఆ 5,895 మీటర్ల (19,341 అడుగులు!) శిఖరం కేసి వెళ్ళడం, అది అన్నప్రాశన నాడే ఆవకాయ అన్నం అవడం, అయినా పళ్ల బిగువున ఆ హిమశిఖరాన్ని ఎక్కి రావడం – అది జనవరి 2019 నాటి మరపురాని జ్ఞాపకం. వెళ్ళి వచ్చాక, ‘చేసిన సాహసం చాలు, ఇంకెప్పుడూ ఇలాంటి దుస్సాహసాలకు పూనుకోకూడదు’ అని కూడా అనుకున్నట్లు గుర్తు…
యాత్రలకు, సాహసాలకు పట్టుకుంటే వదలని గుణం ఉంది. కిలిమంజారో కలిగించిన గగుర్పాటు తగ్గాక, జ్ఞాపకాలు మధురస్మృతులుగా పరిణమించాక, ఇంకా ఇంకా అలాంటి అనుభవాలు కావాలనిపించాక, దృష్టి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (EBC) మీదకు మళ్ళింది. 2020 లో ఆ పని చేద్దామనుకున్నా కోవిడ్ ఆ ఆలోచనకు తాత్కాలికంగా గండి కొట్టింది. ఆ ప్రణాళిక వాయిదా పడింది. 2021 ఆగస్ట్ తర్వాత కోవిడ్ కాస్త ఉపశమించినా అది ఈబీసీ గురించి ఆలోచించే సమయం కాదనే అనిపించింది. అంచేత దృష్టిని మళ్ళా ఆఫ్రికా మీదకు మళ్లించి మొరాకో దేశం లోని మౌంట్ తుబ్‌కల్ (4167 మీటర్లు – 13,671 అడుగులు!) శిఖరారోహణ 2021 అక్టోబర్‌లో కావించాం.
2022 లో ఎవరెస్ట్ ఆలోచనకు పునఃప్రతిష్ఠ చేసి 23 మందిమి బృందంగా ఏర్పడి పదకొండు పన్నెండు రోజులపాటు హిమాలయాలలో తనివితీరా ట్రెక్ చేసి బేస్ క్యాంప్ చేరుకున్నాం. అంటామేగానీ హిమాలయాలలో తనివితీరడం అన్న మాటే ఉండదు. మరో ఏడాదికల్లా ఏకంగా 35 మందిమి బృందంగా ఏర్పడి 2023 అక్టోబర్‌లో అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్‌లో (ACT) పదకొండు రోజులు గడిపాం. 2024 వచ్చేసరికి హిమాలయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించి, దృష్టిని దక్షిణ అమెరికాలోని పెటగోనియా ప్రాంతంలో ఎనిమిది రోజులపాటు టోరెడ్ పైన్ (టవర్స్ ఆఫ్ బ్లూ – నీలి శిఖరాలు) అన్న మూడు నిడుపాటి నీలి పర్వతాలను చుట్టి వచ్చే వృత్తాకారపు ‘ఓ’ ట్రెక్ చేసాం. వెరసి 2019లో కిలిమంజారో దగ్గర మొదలయిన మా సుదీర్ఘ ట్రెక్‌ల శృంఖల అయిదారేళ్లపాటు ‘ఏడాదికో పెద్ద ట్రెక్’గా సాగుతూ వచ్చిందన్నమాట.
ఈ నేపథ్యంలో ‘2025 లో ఎక్కడికీ’ అన్న ప్రశ్న మాకు కలిగింది. మార్పుకోసం హిమాలయాలనుంచి పక్కకు మళ్ళి 2024 లో పెటగోనియా వెళ్లామేగానీ; ఆ ప్రాంతం, ఆ సరోవరాలు, గ్లేషియర్లు, గొగ్గురు గొగ్గురు మంచుకొండలు మమ్మల్ని బాగా ఆకట్టుకున్నాయేగానీ మనసు మాత్రం ‘హిమాలయాలు, హిమాలయాలు’ అని కలవరించడం మానలేదు. అప్పటికే ఈబీసీ, ఏసీబీ ట్రెక్‌లలో ఇరవై పాతిక రోజులపాటు ఉన్నత హిమాలయ శ్రేణుల మధ్య తిరుగాడినా ‘ఇంకా కావాలి, ఇంకా కావాలి’ అన్న తపన వెంటాడుతూనే వచ్చింది. మళ్ళా ఆ మహాపర్వతాల ఒడిలోకి చేరాలి అన్న కోరిక మెదలాడుతోనే ఉంది. నిజానికి నేను ఒకసారి వెళ్ళిన ప్రదేశానికి మరోసారి వెళ్ళడాన్ని ఇష్టపడను. ‘ఈ విశాల ప్రపంచంలో వెళ్ళిరావడానికి పది జన్మలు తిరిగినా తరగని ప్రదేశాలు ఉన్నపుడు ఒకే చోటికి మళ్ళా వెళ్ళడం ఎందుకూ?’ అన్నది నా ధోరణి.
హిమాలయాలు అందుకు మినహాయింపు అయ్యాయి.
తిరిగి తిరిగి వచ్చాక కూడా వాటి గురించి చదవడం, వాటి లోతూ వైశాల్యాలు తెలుసుకోవడం, అవి అందించగల ఎడతెగని అపురూపమైన అనుభవాల గురించి తెలుసుకోవడం కొనసాగించాను. తెలుసుకున్న కొద్దీ వాటి ఔన్నత్యం, వాటి ముందు నిలబడే మనిషి అల్పత్వం మనసులోకి ఇంకసాగాయి. హిమాలయాలు మరోసారి పిలుస్తున్నట్టు అనిపించసాగింది. ‘పద, ఇంకోసారి వెళ్ళివద్దాం’ అంటూ మనసు తట్టి లేపసాగింది. బుద్ధి కూడా ‘మనసు చెప్పిన మాట విను,’ అని హితవు పలకసాగింది.
ఈబీసీ ఏసీటీ ట్రెక్‌లు చేస్తున్నపుడు మొట్టమొదటిసారి మనస్లు సర్క్యూట్ గురించి విన్నాను. పై రెండింటితోపాటు ఇదీ కలసి హిమాలయాల ట్రెక్ ముప్పేట సమాహారం అవుతుందని తెలుసుకున్నాను. ఈబీసీ ఏసీటీలకన్నా మనస్లు మరింత దుర్గమమనీ, మరిన్ని విలక్షణమైన అనుభవాలకు హేతువనీ అర్థమయింది. ‘సంస్కృతి పరంగా ఉన్నత అనుభవాలు అందించే గ్రామసీమలు, ప్రకృతి సౌందర్యం పరంగా అపురూపమైన ఆనందాలు అందించే అజ్ఞాత హిమశిఖరాలు, నేపాల్ హిమాలయసీమలతో పరిపూర్ణంగా తాదాత్మ్యం చెందే అవకాశం కలిగించే ప్రాంతమది,’ అంటూ వినవచ్చిన మాటలు నా మనసులో నాటుకున్నాయి.
మనస్లు గురించి మా ట్రావెల్ ఏజెంట్ సూర్య దగ్గరా, గైడ్ బాబు గురుంగ్ దగ్గరా కదిపినపుడు వాళ్ళు కూడా “అది ఒక మ్యూజికల్ సీమ. ఈబీసీ ఏసీటీలలోని అన్ని ఉత్తమ లక్షణాలనూ తనలో సంతరించుకున్న ప్రాంతం. ఆ రెండింటికన్నా మీలాంటి వాళ్ళను మరింత ఆకట్టుకోగల ప్రాంతం,” అన్నారు. సూర్య, బాబులతో నాకు నాలుగయిదేళ్లుగా సన్నిహిత ట్రెకింగ్ సంబంధం ఉంది. వాళ్ళ మాట మీద గురి ఉంది.
అలా మా 2025 ట్రెకింగ్ కాలెండర్లో మనస్లు వచ్చి చేరింది. పీఠం వేసుకుని కూర్చుంది.
ప్రపంచంలో ఎనిమిదివేల మీటర్ల ఎత్తును దాటి ఉన్న 14 శిఖరాలలో మనస్లు ఒకటి. ఆ పధ్నాలుగు శిఖరాలూ హిమాలయాలు – కారాకోరం పర్వతశ్రేణులలోనే ఉండగా అందులో ఎనిమిది శిఖరాలు నేపాల్ దేశంలోనే ఉన్నాయి. 8163 మీటర్ల ఎత్తున ఉన్న మనస్లు నేపాల్ దేశపు నడుమ భాగంలో ఉంది. దానికి కుడి వేపున – తూర్పు దిక్కున – ఎవరెస్ట్ ఉంటే ఎడమ వేపున – పశ్చిమ దిశలో, అన్నపూర్ణ పర్వత శిఖరం ఉంది. ఈబీసీ ఏసీటీ ట్రెక్‌లలో కాలినడక వంద కిలోమీటర్లూ ఎనిమిది తొమ్మిది రోజులకూ పరిమితమయితే మనస్లు విషయంలో 177 కిలోమీటర్ల దూరం నడవవలసి ఉంటుంది. పైగా దారంతా లాండ్ స్లయిడ్ల మయమట; మరింత దుర్గమమట. ప్రమాదభరితమట. లోలోపలి ప్రాంతాలవడంవల్ల కష్టకాలాలు సంభవిస్తే సహాయాలు అందడం కూడా పోల్చి చూస్తే క్లిష్టమట. దారిలో వసతి సౌకర్యాలు కూడా ఎంతో ప్రాథమికమైనవట.
కిలిమంజారో దుస్సాహసమయితే ఆ అనుభవంతో ఈబీసీ ట్రెక్‌ను మరింత పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్నాం. ఉన్నత పర్వతశ్రేణుల శారీరక శ్రమకు మేము నిలబడగలమా? అన్న ప్రశ్నకు ఈబీసీ ట్రెక్ సమాధానం చెప్పింది. ఏసీటీ ట్రెక్‌లో, ఆరంభంలో, వాతావరణం అనుకూలించకపోవడంవల్ల మొదటి రోజే బృందమంతా ఎడతెగని వానలో పాతిక ముప్ఫై కిలోమీటర్లు నడవవలసి వచ్చింది. మంచు నిండిన థోరాంగ్ లా కనుమ దాటవలసి వచ్చింది. మానసిక దృఢత్వానికి ఆ అనుభవం తిరుగులేని పాఠమయింది. పెటగోనియా ట్రెక్‌లో ఏకంగా మంచు తుఫాను మమ్మల్ని ముంచెత్తింది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నడచిన సమయమది.
అన్నన్ని అనుభవాలు కలిగినా, వయసు అరవై వేపుకు దౌడు తీస్తోన్నా నాలోని భ్రమణకాంక్ష, సాహస ప్రవృత్తి తగ్గడం అటుంచి ఇంకా పెరగసాగాయి. నా శక్తియుక్తుల సీమ పొలిమేరను తాకనే లేదన్న భావన నాలో తిష్ట వేసుకుని కూర్చుంది. “అరవై దాటడం, శరీరం సహకరించకపోవడం జరగకముందే వీలయినన్ని ముఖ్యమైన, కష్టభరితమైన ట్రెక్‌లు చేయాలి,” అన్న సంకల్పం, నా శారీరక మానసిక పరిమితుల అంతిమ బిందువు చేరుకోవాలన్న కాంక్ష, అందుకు ఈ మనస్లు ట్రెక్ ఒక గీటురాయి అవుతుందన్న ఆలోచన – ఈ అంశాలన్నీ నన్ను మనస్లు పట్ల సానుకూలతతో నింపి వదిలాయి. “ఛలో మనస్లు” అని మనసు ఉర్రూతలూగేలాగా చేసాయి. అన్నట్టు ఈ మనస్లు అన్న పదం మనకు బాగా పరిచయమయిన ‘మనసు’ అన్న మాటలోంచి వచ్చినదేనట!
మనస్లు ట్రెక్కి వెళ్ళాలి అన్న నిర్ణయం తీసుకోగానే మా సూర్యతో కలసి వివరాలు చర్చించి మొత్తం యాత్రకు రూపకల్పన చేసాను. అంతా కలసి 18 రోజులు. ఖాట్మండూ చేరుకోవడం, ట్రెక్ పాయింట్‌కు వెళ్ళడం, ట్రెక్ మధ్యలో విరామదినాలు – వీటికి నాలుగు రోజులు తీసివేస్తే ట్రెక్కు నికరంగా 14 రోజులు. సగటున రోజుకు 15 కిలోమీటర్ల నడక. ఒక రోజు 20 కిలోమీటర్లు అవవచ్చు. మరో రోజు పదే అవవచ్చు – సగటున పదిహేను కిలోమీటర్లు. పట్టుదలకూ ఓర్మికీ ఈ మనస్లు యాత్ర ఒక పరీక్ష అన్నమాట.
ముందే చెప్పినట్లు మౌంట్ మనస్లు పర్వతశ్రేణి చుట్టూ తిరిగి వచ్చే ట్రెక్ ఇది. గోర్ఖా జిల్లాలోని మచ్ఛాఖోలా అన్నచోట మొదలుపెట్టి, బుధీగండకీ నది వెంట ఉత్తరాన ధర్మశాల అన్న టిబెట్ సరిహద్దు ప్రాంతానికి చేరి, పశ్చిమానికి మళ్ళి, మనస్లు పర్వతం పక్కగా సాగి, లార్కే పాస్ కనుమ దాటి, దక్షిణ దిశగా ప్రయాణం చేసి, మనాంగ్ జిల్లాలోని తిలిజె గ్రామం దగ్గర ముగిసే 177 కిలోమీటర్ల కాలినడక అది. అన్నట్టు ఈ ప్రయాణ ప్రక్రియలో ట్రెకర్లు మనస్లు పర్వతానికి అతి దగ్గరగా చేరుకుంటారట. దిగువనుంచి శిఖరం దాకా స్పష్టంగా చూడగలుగుతారట. ఈబీసీ ఏసీటీ ట్రెక్‌లలో ఆయా శిఖరాలు దూరంనుంచీ కనిపించీ కనిపించకుండా ఉండి మురిపిస్తే ఈ మనస్లు ట్రెక్‌లో ముఖ్యశిఖరాన్ని ఏ అడ్డంకులూ లేకుండా మనసారా చూడవచ్చునన్నమాట.
‘ఈ ట్రెక్ మామూలు విషయం కాదు. పాతికా ముప్ఫై ఐదుమందిని ఒక బృందంగా ఇముడ్చుకోగల శక్తి ఈ మార్గానికి లేదు. దారి క్లిష్టత దృష్ట్యా, పరిమిత వసతి సౌకర్యాల దృష్ట్యా, మీరు బృందపు సంఖ్యను 10-12 కు మించనివ్వకండి,’ అని సూర్య ఖచ్చితంగా చెప్పాడు. ఆ సూచనను పాటించి మేము బృందాన్ని పదిమందికే పరిమితం చేసాం.
గోపీనాథ్ యూకేలోని బర్మింగ్‌హామ్‌కు చెందిన దంతవైద్యుడు. అనితారాణి యూఎస్‌లోని హ్యూస్టన్‌కు చెందిన న్యూరాలజిస్టు. అదే ఊరికి చెందిన గిరీష్ సాఫ్ట్వేర్ ఇంజనీరు. మోహన్, శ్రీనివాస్‌లు మిస్సౌరి, ఇల్లినాయ్లకు చెందిన కాన్సర్ వైద్యులు. సురేష్ బోస్టన్ నగరానికి చెందిన జనరల్ ఫిజీషియన్. రమేష్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యుడు. అనిల్ యూకేలోని లేక్ డిస్ట్రిక్ట్‌కు చెందిన ఎనెస్తటిస్ట్. సందీప్ జర్మనీలోని న్యూరెంబెర్గ్ నగరానికి చెందిన ఐటీ స్పెషలిస్ట్. ఇహ నేను సరేసరి – లండన్‌కు చేరువలో నివసించే ఫోరెన్సిక్ సైకియాట్రిస్టును. అంతా కలసి పదిమందిమి.
వీళ్లలో అనితారాణి, గోపి నాతోబాటు ఈబీసీ, ఏసీటీ ట్రెక్‌లు చేసిన వాళ్ళు. మిగిలిన ఏడుగురూ కూడా ట్రెకింగ్‌లో బాగా అనుభవం ఉన్నవాళ్ళు – చాలావరకూ నాతోబాటు ఏదో ఒక పెద్దపాటి ట్రెక్‌లో పాల్గొన్నవాళ్ళు. స్థూలంగా చెప్పాలంటే మాది అనుభవజ్ఞుల బృందం. ఉన్నతశ్రేణి పర్వతాలలో తిరుగాడి వచ్చిన సభ్యులతో కూడిన బృందం.
మొత్తం బృందంలో అనితారాణి ఒక్కరే మహిళ. మేము బృందంగా ఏర్పడి కిలిమంజారో, తుబ్‌కల్ ట్రెక్‌లకు వెళ్ళినపుడు మాతోబాటు మహిళలను తీసుకువెళ్ళే సాహసం చేయలేకపోయాం. అనితారాణి అప్పుడు ఉత్సాహం చూపించినా వద్దన్నాం. అందుకు ఆమె కించపడింది కూడానూ. రెండు ట్రెక్‌లు చేసిన అనుభవం వచ్చాక 2022 లో ఈబీసీ ట్రెక్ పెట్టుకున్నపుడు పిడికిలి విప్పి అనితను చేర్చుకున్నాం. ఆమె తనతోబాటు మరో మహిళను తీసుకురావాలన్న షరతు పెట్టాం. ఆమె కజిన్ ఉమా అలా వచ్చి మా బృందంలో చేరారు. ఆ ఇద్దరూ ఈబీసీ ట్రెక్‌లో మా మగాళ్ల అంచనాలను మించి నడిచారు. మేము వారికి సహాయాలు చేయడం అటుంచి వాళ్ళే కొన్ని కొన్ని విషయాలలో చొరవ చేసి మాకు సహాయసహకారాలు అందించారు. ఈబీసీ ట్రెక్‌ను విజయవంతంగా ముగించారు. ఆ సంగతి తెలుసుకున్న మహిళలు మరో తొమ్మిదిమంది ఏసీటీ ట్రెక్‌లో మాతో కలసి నడిచారు. పెటగోనియా ట్రెక్‌లోనూ వారి సంఖ్య ఏడు. కానీ అనేక కారణాలవల్ల మనస్లు దగ్గరికి వచ్చేసరికి అనిత మా బృందంలోని ఒకే ఒక్క మహిళ అయింది. తనకున్న అనుభవం దృష్ట్యా, ఈబీసీ ఏసీటీ ట్రెక్లతో బాటు కొలరాడో రాష్ట్రంలోని ఫోర్టీనక్స్గా వ్యవహరించబడే పధ్నాలుగువేల అడుగుల ఎత్తును మించిన శిఖరాలను అధిరోహించిన వ్యక్తిగా, అనిత మా బృందంలో చేరడం విషయంలో మాకు ఏ సంకోచాలూ కలగలేదు. జెండర్ అన్నది అప్రస్తుత విషయం అయింది. మాతోబాటు ఆమె కూడా ఒక ట్రెకర్ – అంతే. తనకు తోడుగా, ఒక మహిళా గైడ్ ఉంటే బాగుంటుందని అనిత సూచించినపుడు ఆ ప్రయత్నం చేసి సమీఛ అన్న ఆమెను మాతో చేర్చుకున్నాం. ఆ మహిళా గైడ్ ట్రెక్‌లో అనితకు రూమ్మేట్గా కూడా ద్విపాత్రాభినయం చేసింది.
ఇదివరలో చేసినట్టుగానే మా బృందం వాళ్ళమంతా ట్రెక్ మొదలవడానికి కొన్ని నెలలు ముందునుంచీ జూమ్ సమావేశాలు నిర్వహించుకున్నాం. మనస్లు గురించి నేను చేసిన అధ్యయనం, పరిశోధనా వివరాలను సభ్యులందరితో ఆ సమావేశాల్లో పంచుకొనేవాడిని. ఆ వివరాలు విని ఆకళింపు చేసుకోవడం, చర్చల ద్వారా మరింత అవగాహన ఏర్పరచుకోవడం విషయంలో సభ్యులంతా చురుగ్గా ఉండేవారు. మనస్లులాంటి కఠినమైన ట్రెక్ విషయంలో ఆ అవగాహన పరిపూర్ణంగా కలగడం, ‘ట్రెక్‌లో పాల్గొందాం’ అని తాము తీసుకున్న నిర్ణయంలో ఈ క్లిష్టతలు బోధపడటం, అందుకు సభ్యులందరూ శారీరకంగా మానసికంగా సిద్ధపడటం ఎంతైనా అవసరం.
మా ఏర్పాట్లన్నీ ఒక కొలిక్కి వచ్చి మరో నెలరోజుల్లో ట్రెక్ మొదలుపెట్టే దశలో 2025 సెప్టెంబర్ ఆరంభంలో నేపాల్ దేశం జెన్ జెడ్ (Gen Z) విప్లవచర్యలతో అట్టుడికి పోయింది. దేశమంతటా సోషల్ మీడియా నిషేధించబడింది. మేము అనుకున్నట్టు అక్టోబర్ ఆరంభంలో ట్రెక్ ఆరంభించగలమా అన్న విషయం డోలాయమానం అయింది. కానీ ఎగసినంత త్వరలోనే ఆ విప్లవ జ్వాలలు సమసిపోయాయి. ప్రభుత్వం రాజీనామా చేసింది. సైన్యం మద్దతుతో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. అదే సమయంలో మనస్లు ప్రాంతంలో చెలరేగిన వర్షాలు కూడా తగ్గుమొహం పట్టాయి. మా ప్రణాళిక మళ్ళా పట్టాల మీద నిలిచింది.
అందరం అక్టోబర్ ఒకటో తారీఖుకల్లా ఖాట్మండూ చేరుకోసాగాం. అవి ఆ దేశంలో దశాయీ పండుగ రోజులు – అంటే మన దసరా అన్నమాట. ఊరంతా ఉత్సవ వాతావరణం. రెండు మూడు వారాల క్రితం చీకట్లు కమ్ముకుని హింస చెలరేగి అట్టుడికిపోయిన నగరమేనా ఇదీ అనిపించింది. సంతోషం కలిగింది. దుకాణాలు ఇంకా మూసి ఉన్నమాట నిజమేగానీ ఊరంతా పండుగ ఊరేగింపులు – వేలాది జనాలు.
అక్టోబర్ రెండున టీమ్ మీటింగ్ పెట్టుకున్నాం. గిరీష్‌ను టీమ్ ట్రెజరర్‌గానూ, సురేష్‌ను టీమ్ డాక్టర్‌గానూ, సందీప్‌ను భోజన వ్యవహారాల సమన్వయకర్తగానూ నియమించుకున్నాం. మేము తెచ్చుకున్న పచ్చళ్లు, తినుబండారాలు, మందులు రెండు పది పది కిలోల బ్యాగుల్లో సర్ది పోర్టర్లకు అందించాం. బాబు, రేషమ్‌లు ఇదివరలోలాగానే ఈసారి కూడా మాతో వచ్చే గైడ్లు. సమీ అని పిలవబడే సమీఛ అనితకు తోడునీడ. వాళ్ళిద్దరూ క్షణాల్లో కలసిపోవడం మాకు ముచ్చట కలిగించింది. ఇరవై పాతికేళ్ల నడుమ వయసు యువతి సమీఛ. బాగా చదువుకున్న మనిషి. చక్కని ఇంగ్లీషు. హిందీ సరేసరి. మేము చేసిన హిమాలయాల ట్రెక్‌లలో ఆమె మాతోపాటు వచ్చిన మొట్టమొదటి మహిళా గైడ్.
ఏసీటీ ట్రెక్లానే మనస్లు కూడా ఈ మధ్యనే ట్రెకర్లకు అందుబాటులోకి వచ్చిన మార్గం. 1990 నుంచీ ట్రెకర్లను అనుమతిస్తున్నారట. ఈ ట్రెకింగ్ మార్గంలో రోడ్లు అన్నవి లేవు. 1970ల్ ఏసీటీ ట్రెకర్లకు అందుబాటులోకి వచ్చినపుడు అక్కడా ఇలాగే రోడ్లు ఉండేవి కావు. క్రమక్రమంగా ఆ మార్గంలో జీపులు వెళ్ళే దారులు లోలోపలి మనాంగ్ వరకూ చొరబడ్డాయి. మనస్లు విషయంలో ఆ చొరబాటు ఇంకా జరగలేదు. అన్నట్టు ఏసీటీ ట్రెక్ ఆరంభమయ్యే ధారాపానీ గ్రామం, మనస్లు ట్రెక్ ముగిసే తిలిజె గ్రామం ఒకదానికి ఒకటి బాగా చేరువలో ఉన్న ఊళ్ళు. ఈసీబీ ట్రెక్‌లో 5644 మీటర్ల కాలాపత్థర్ కొండ గుట్టా, ఏసీటీలో 5146 మీటర్ల థోరాంగ్ లా కనుమ అత్యున్నత బిందువులయితే ఈ మనస్లు ట్రెక్‌లో 5160 మీటర్ల లార్కే పాస్ ట్రెకర్లు చేరుకునే అత్యున్నత ప్రదేశం.
మర్నాటి ఉదయం అందరం బ్రేక్‌ఫాస్ట్ దగ్గర కలిశాం. మేం ఉన్న దుసిల్ ప్రిన్సెస్ అన్నది ఈబీసీ, ఏసీటీ రోజుల్లో ఖాట్మండూలో ఉన్న మల్బరీ హోటల్కన్నా ఎంతో మెరుగైనది. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో దుసిల్ వాళ్ళు మా ముందు పరచిన వంటకాల విస్తృతి విస్తుగొలిపింది. ఉత్తర భారతదేశపు వంటకాలూ, దక్షిణ భారతపు రుచులతోబాటు కాంటినెంటల్ డిషెస్ కూడా కనిపించి పలకరించాయి. మా బృందంలో చిట్టచివరి సభ్యుడు శ్రీనివాస్ ఆ ఉదయం వచ్చి మాతో చేరాడు. అందరం ఖాట్మండూనుంచి ప్రయాణసన్నాహాలు మొదలెట్టాం. మేము తెచ్చుకున్న సామానంతా డఫెల్ బ్యాగుల్లో నింపి రిసెప్షన్లో వదిలాం. నేపాల్ దేశపు ట్రెకింగ్ ఏజన్సీలన్నిటికీ, తమ ట్రెకర్లకు నాణ్యమైన డఫెల్ బ్యాగ్స్ అందించడం అన్న మంచి ఆనవాయితీ ఉంది. వాటి మీద ఆయా ఏజెన్సీల లోగోలు ముద్రించి ఉంటాయి. ట్రెకింగ్ మార్గాలలో బస చేసే టీ హౌస్‌ల దగ్గర ఈ బ్యాగ్‌లన్నీ కలగలసి పోకుండా చేజారిపోకుండా కాపాడుకోడానికి లోగో కూడిన డఫెల్ బ్యాగ్‌లు బాగా సాయపడతాయి. గందరగోళాలకూ జాప్యాలకూ ఆస్కారముండదు. అలాగే ఒకే సైజు డఫెల్ బ్యాగులు ఉపయోగించడంవల్ల పోర్టర్లకూ అవి మోసుకురావడం సులభమవుతుంది. ఈసారి సూర్య మా అందరికీ డఫెల్ బ్యాగ్లతోబాటు తమ ఏజెన్సీ తరఫునుంచి చక్కని టోపీలు కూడా కానుకగా అందించాడు.
అందరం ఉదయం తొమ్మిది గంటలకు గ్రూప్ ఫోటో దిగాం. గడచిన రెండు ట్రెక్లతో పోలిస్తే ఈ బృందం బాగా చిన్నది గదా – మా అందరి మధ్యా వత్తిడిలేని హాయి నిండిన వాతావరణం వెల్లివిరిసింది.
ఆనాటి మా ప్రయాణపు లక్ష్యం ఖాట్మండూ దగ్గర వాహనాలు పట్టుకుని ట్రెకింగ్ ఆరంభబిందువు మచ్ఛాఖోలా చేరడం. 160 కిలోమీటర్లు. ఎనిమిది గంటలు. అందరం మూడు పురాతన టయోటా లాండ్‌క్రూజర్ వాహనాల్లో సర్దుకుని ప్రయాణం ఆరంభించాం. మా బృందంలో నాతోబాటు సూర్య, బాబు, రేషమ్ ఉన్నారు. వీళ్ళతో కలసి ఇలా ట్రెక్‌లకు వెళ్ళడం నాకు మూడవసారిగదా – మా మధ్య చక్కని అనుబంధం అప్పటికే ఏర్పడి ఉంది. స్నేహాలు పండి ఉన్నాయి. అంచేత అందరం క్షణాల్లో కబుర్లలో పడ్డాం. ఎన్నెన్నో విషయాలు. ఎన్నెన్నో చర్చలు… అనుభవాలు పంచుకోవడాలు. వారి సాహచర్యం నాకు ఎంతగానో నచ్చుతుంది. వాళ్ళ గురించీ వాళ్ళ దేశం గురించీ, హిమాలయాల గురించీ కబుర్లే కబుర్లు.
ఖాట్మండూ వీధులు నిర్మానుష్యంగా కనిపించాయి. కాసేపటికల్లా మా వాహనం ఖాట్మండూ-పొఖారా హైవే పట్టుకుంది. త్రిశూలి నది ఒడ్డు వెంట సాగింది. ఏసీటీ ట్రెక్కు ఇదే దారిలో వెళ్ళాం గదా – దారంతా సుపరిచితం. కానీ ఏసీటీకి వెళ్ళినప్పుడు బాగా వర్షంలో వెళ్ళాం – ఈసారి వర్షం లేకపోయేసరికి దారి మరింత స్పష్టంగా సుందరంగా కనిపించింది.
దారిలో ఎన్నెన్నో పల్లెలూ పట్నాలూ కనిపించాయి. ఊళ్ళన్నీ నేపాల్ సంప్రదాయపు ఢాకా టోపీలు పెట్టుకున్న పండుగ జీవులతో నిండి కనిపించాయి. “వాళ్ళంతా దశాయీ పండుగ కోసం ఖాట్మండూ వెళ్ళి తిరిగి వస్తున్నవాళ్ళు,” అని వివరించాడు సూర్య. వారిలో చాలామంది తిలకధారులై కనిపించారు. పెరుగూ బియ్యం కలసిన సింధూర తిలకాలవి. అక్కడి పెద్దవాళ్ళంతా ఈ తిలకం పెట్టి ‘శుభసౌభాగ్యాలు లభించుగాక’ అంటూ చిన్నవాళ్లను పండుగ సమయాలలో ఆశీర్వదించడం ఆనవాయితీ అట. అన్నట్టు తమ కుటుంబపు పెద్దలను కలసి వారి నుంచీ తిలక ఆశీర్వాదాలు పొందాడానికే సూర్య మాతోపాటు తన స్వగ్రామానికి ప్రయాణం కట్టాడు.
బాగా కురిసిన వర్షాల పుణ్యమా అని హైవే అంతా గుంటలు పడి కనిపించింది. రిపేరు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మలేఖు అన్న చోట అందరం భోజనం కోసం ఆగాం. త్రిశూలి నది ఒడ్డున ఉన్న ఆ రెస్టారెంటును చూడగానే పురాజ్ఞాపకాలు తోసుకు వచ్చాయి. రెండేళ్ల క్రితం ఏసీటీ ట్రెక్‌లో ఇక్కడే భోజనం కోసం ఆగాం. చక్కని భోజనం చేసినట్టు గుర్తు. ఈసారి కూడా మునుపాటిలానే చేపల వేపుడు, బంగాళా దుంపల కూర, ఫ్రైడ్ రైస్, చపాతీలు – వాతావరణం ఇదివరకటికన్నా సౌకర్యంగా ఉంది కదా – భోజనం కూడా మరి కాస్త రుచికరంగా తోచింది!
భోజనం ముగిశాక త్రిశూలి నదిని దాటి మా ప్రయాణం కొనసాగించాం. చిన్న చిన్న ఊళ్ళు… మెట్ల చిరు కమతాలలో వరి సాగు… కూరగాయల మళ్లు… అరటి తోటలు – పరిసరాలు కనువిందు చేసాయి. కొన్ని కొన్ని చోట్ల వర్షాకాలపు సెలయేళ్లు రోడ్డు మీదుగా ప్రవహించి వాటిని పాడు చేసిన ఛాయలు కనిపించాయి.
పొలాలూ తోటలూ దాటుకుని పర్వతాల మీదుగా దట్టమైన అడవిలో ప్రవేశించాం. ‘ఇదంతా రక్షితప్రాంతం. ఈ అడవిలో కట్టెలు కొట్టడం నిషిద్ధం’ అని వివరించాడు సూర్య. విరిగి పడిన కొమ్మలూ రెమ్మలను మాత్రం ఏరుకోవచ్చునట. ఆ కొండలలో కూడా ఇళ్ల చేరువలో, కొండచరియల్లో మెట్ల కమతాలు, వరి పంటలు ఉండటం గమనించాం.
“ఈ గ్రామాల్లో వరి పంట ఏడాదికి ఒక్క కాపే తీస్తారు. వర్షాకాలంలో నారుమళ్లు పోసి నాట్లు వేసి పంట తీస్తారు. రెండో పంట వేసేందుకు సరిపడేంత నీటి వనరులు వీళ్ళకి లేవు. నేపాల్ దేశంలో వరి ముఖ్యాహారం అయినా దేశపు అవసరాలకు సరిపడేటంత వరి పండదు. అంచేత బయట దేశాలనుంచి దిగుమతి చేసుకోవలసి వస్తోంది,” అని వివరించాడు సూర్య. ఒక పంట ముగిశాక అదనపు ఆదాయంకోసం గ్రామీణులు పశువుల పెంపకం, కూరగాయలు పండించడంలాంటి పనులమీద ఆధారపడతారట. చాలామంది యువకులు జీవనోపాధి కోసం ఖాట్మండూ వెళ్ళడం పరిపాటి అట. అవన్నీ విన్న తర్వాత చూడడానికి నేపాల్ గ్రామసీమలు సస్యశ్యామల క్షేత్రాల్లా కనిపించినా, తరచి చూస్తే అక్కడి జీవితం సవాళ్ళతో నిండినదనీ, నిరుద్యోగం అన్నది వాళ్ళని పట్టి పీడిస్తోందనీ బోధపడింది.
కాసేపట్లో ధాడింగ్ అన్న పట్టణం చేరుకున్నాం. అదే పేరిట ఉన్న జిల్లాకు ముఖ్యపట్టణమది. ఊరు చుట్టూ చక్కని కొండలు… కొండల నడుమ లోయలో ధాడింగ్ పట్టణం. దిగువనున్న కొండచరియల్లో మెట్ల వరిసాగు సరేసరి. చరియల ఎగువ భాగాలలో అంతా అడవి. ఆ ఊళ్ళో సూర్య దిగిపోయాడు. అక్కణ్ణుంచి వాళ్ళ ఊరు బైక్ మీద అరగంట ప్రయాణమట. మాతోపాటు రావలసిన తొమ్మిదిమంది పోర్టర్లవీ ఆ పట్నానికి చేరువలో ఉన్న గ్రామాలట. వాళ్ళంతా వచ్చి మాతో కలిసారు. వాళ్ళను ఎక్కించుకుని మా లాండ్క్రూజర్లు ముందుకు సాగాయి.
ఊరు దాటి కాస్తంత దూరం వెళ్ళగానే బాబు ఎంతో ఉత్తేజంతో ఓ కొండ వేపు చూపించాడు. “అదిగదిగో ఆ కొండ అవతల ఉన్న ఖుష్సుఖ్ అన్నదే నాకూ రేషమ్కూ స్వగ్రామం,” అంటూ ఉత్సాహంగా చెప్పుకొచ్చాడు. ఎన్ని నగరాలు చూసినా, ఎన్ని పట్నాలు తిరిగినా స్వగ్రామం స్వగ్రామమే… ఆ సంబరం బాబు కంఠస్వరంలో స్పష్టంగా కనిపించింది. ముచ్చట కలిగించింది. వాళ్ళ ఊళ్ళో 500 మంది నివసిస్తున్నారట.
బుధీగండకి నదిని దాటి మా వాహనాలు గోర్ఖా జిల్లాలో ప్రవేశించాయి. ధాడింగ్, గోర్ఖా జిల్లాలు గురుంగ్, తమాంగ్ తెగల నివాస ప్రాంతాలనీ, సోలు ఖుంబు జిల్లా షెర్పాల ప్రాంతమనీ చెప్పుకొచ్చాడు బాబు. షెర్పాలు ఎవరెస్ట్ ప్రాంతంలో ట్రెకింగ్ సీజన్లో పనులు చేసుకుంటూ వెళతారనీ, గురుంగ్, తమాంగ్ తెగల వాళ్ళు ఎవరెస్ట్‌కు పశ్చిమాన ఉన్న మనస్లు, అన్నపూర్ణ ప్రాంతాల్లో పనులు చూసుకుంటారనీ వివరించాడు బాబు. ఏది ఏమైనా ఈ జిల్లాల్లో మనుగడ సాగించడమన్నదే ఆర్థికంగా సామాజికంగా పెనుసవాలు అనీ, ట్రెకింగ్ ఋతువులో దొరికే పనీ పాటలే వాళ్ళకి జీవనాధారాలనీ వివరించాడు.
గోర్ఖా జిల్లాలో రోడ్డు ప్రయాణమన్నది సవాళ్ళతో నిండినది అనిపించింది. రోడ్ల నిండా రాళ్ళు, బురద,.. కొన్ని కొన్ని చోట్ల మా బళ్లు అక్కడి బండరాళ్ళ మీద జాగ్రత్తగా, ఎంతో నింపాదిగా సాగాయి. మరికొన్ని చోట్ల అవి నదీతీరం వెంబడే సాగినపుడు వాటి చక్రాలు నిడుపాటి కొండచరియలకు అంగుళాల దూరాన నడిచాయి. దారిలో తటస్థపడే ప్రతి కుదుపూ మేము చేస్తున్నది మామూలు ప్రయాణం కాదు – ఒక సాహసయాత్ర అని పదేపదే గుర్తు చేశాయి. దారి ఎంత ప్రమాదభరితంగా ఉన్నా అక్కడి దృశ్యాలు మమ్మల్ని కట్టి పడేసాయి. కాసేపటికల్లా పైనున్న కొండల మీదనుంచి క్రిందకు దుముకుతున్న జలపాతాల పరంపర ఉన్న ప్రాంతంలోకి అడుగుపెట్టాం.
ఆ జలపాత పరంపరలో న్యావులీ జలపాతం దగ్గర కాసేపు ఆగి ఆ దృశ్యాన్ని చూడటం అన్నది ఆనాటి మా ప్రయాణానికే హైలైట్ అని చెప్పుకోవాలి. మూడు అంచెల జలపాతమది. అలా అంచెలంచెలుగా కొండలమీద నాట్యం చేస్తూ మేమున్న చోటికి చేరిన ఆ నదీజలాలు అక్కడితో ఆగకుండా దిగువనున్న లోయలోకి దుమికి వెళ్ళడమన్నది మరువలేని దృశ్యం.
ఆ దృశ్యాన్ని ఊరికే రోడ్డు మీద నిలబడి చూడటమే సరిపోదని గ్రహించిన సహృదయ అధికారులు ఆ బుధీగండకి నది మీదుగా 100 మీటర్ల ఉయ్యాల వంతెన నిర్మించారు. ఆ వంతెనమీద నిలబడి జలధారలు లోయలోకి అమిత వేగంగా దుమికే దృశ్యం చూడటమన్నది పెట్టి పుడితేగానీ అందుబాటులోకి రాని అనుభవం. ఆ దృశ్యాన్ని చూస్తూ నేను మైమరచిపోయాను. అందరూ హడావుడిగా కెమెరాలు వెలికి తీసి ఫోటోలు తీస్తున్న సమయంలో నేను నిశ్చలంగా నిశ్శబ్దంగా అలా చూస్తూ ఉండిపోయాను.
ముందుకు వెళ్ళే కొద్దీ రోడ్డు కొత్త కొత్త సవాళ్లను విసరసాగింది. అనుభవజ్ఞులైన మా డ్రైవర్లు తొణకకుండా బెణకకుండా గొప్ప స్థైర్యంతో బళ్ళు నడిపారు. అక్కడ బండి నడపాలంటే అలాంటి ప్రాంతాలకే ప్రత్యేకమైన నైపుణ్యం ఉండి తీరాలి… అనుభవం పండి ఉండాలి.
50 ల తొలి దశలో ఉన్న మా జీపు డ్రైవర్ రామ్ తన నైపుణ్యంతో నన్ను ముగ్ధుణ్ణి చేసాడు. అలాగే పాతికేళ్ళ వయసు నిండిన ఆ వాహనాలన్నీ తమ వయసును పట్టించుకోకుండా నింపాదిగా సాగిపోయిన తీరు నన్ను అబ్బురపరచింది. జపాను వారి సాంకేతిక ప్రజ్ఞను తమలో నింపుకున్న ఈ 4×4 లాండ్క్రూజర్లు, బహుశా తమ వాహనవర్గంలో చిరకాలం నడచి మనుగడ సాగించగల శక్తిపరంగా ఉన్నత శ్రేణికి చెందినవై ఉండాలి.
సూర్యుడు కొండల మరుగున దాగే వేళలో మేమంతా మచ్ఛాఖోలా చేరుకున్నాం. పరిసరాలన్నీ సన్నగా పరచుకున్న నారింజరంగు వెలుగులో మెరిసిపోతోన్న సమయమది. పారుతోన్న నది ఆ వెలుగులను ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తోన్న మనోహర సమయమది. అక్కడ ఉన్న ఎవరెస్ట్ పోర్చ్ అన్న టీ హౌస్‌లో అందరం కుదురుకున్నాం. రోజంతా ప్రయాణంగదా, అందరం అలసిపోయిన మాట నిజమేగానీ జలపాతాల సౌందర్యం, కొండ దారుల భీతావహ అందం, మచ్ఛాఖోలా దాటి ముందుకు వెళ్ళినపుడు ఎదురయ్యే సాహసాలు – వాటి తలపుల ముందు అలసట తన ఉనికిని నిలుపుకోలేకపోయింది.
మా బృందమంతా కబుర్లలో పడింది. చెణుకులు, నవ్వులు, ఆహ్లాదాలు, సుఖోపశాంతులు… బలపడుతోన్న పరస్పర పరిచయాలు… టీ హౌస్ వాళ్ళు అందించిన రుచికరమైన భోజనం – ఇవన్నీ ఇలాంటి సమయాలలో మాలాంటి బృందాలకు సమకూరే పటిష్టమైన స్నేహాలకు పునాదులు – మరపురాని సాయంత్రమది. మాతోపాటు మా టీ హౌస్‌లో వసతి చేసిన పదిమంది ఉన్న స్పానిష్ బృందంతో మాటలు కలిశాయి. నిన్న, ఇవాల్టిలాగే రాబోయే రోజుల్లో కూడా వాతావరణం సానుకూలంగా ఉండగలదన్న ఆశాభావాన్ని అందరం పంచుకున్నాం.
డిన్నరు ముగియగానే బాబు గురుంగ్ మర్నాటి కార్యక్రమం వివరించాడు. మచ్ఛాఖోలానుంచి గంట ప్రయాణం చేసి జీపులు మమ్మల్ని 12 కిలోమీటర్ల దూరాన ఉన్న దోభన్ అన్న ఊరు చేరుస్తాయట. చేర్చి అవి తిరిగి ఖాట్మండూ వెళ్లిపోతాయట. దోభన్నుంచి ట్రెక్ మొదలుపెట్టి, 18 కిలోమీటర్ల దూరాన ఉన్న ఫిలిమ్ అన్న ఊరు చేరతామట. అందుకు ఆరేడు గంటలు పడుతుందట.
రాత్రి పెందరాళే నిద్రకు ఉపక్రమించాను. దూరంనుంచి వినిపిస్తోన్న బుధీగండకి గలగలలు జోలపాట పాడాయి.
మర్నాటి ఉదయం నాలుగు గంటలకే మెలకువ వచ్చింది. టీ హౌస్ పై కప్పు మీదనుంచి ధణధణమంటూ వినిపిస్తోన్న వర్షపాతపు ధ్వనులు నాకు అంత తొందరగా మెలకువ రావడానికి కారణమయాయి. తలుపు తెరచి చూసాను. బయటంతా కుండపోత. అన్నపూర్ణ ట్రెక్ మొట్టమొదటి రోజే ఇలా వర్షం ముంచెత్తడం, రోజంతా ఆ వర్షంలోనే ట్రెక్ చెయ్యడం గుర్తొచ్చింది. చరిత్ర పునరావృతం కాబోతోందా?!
ఏడింటికి అందరం బ్రేక్‌ఫాస్ట్‌కు చేరాం. ముగించాక రైన్ కోట్, రైన్ పాంట్, నిలువు రబ్బరు బూట్లు ధరించి వర్షాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడిపోయాం.
“జీపుల వాళ్ళు ముందుకు రామంటున్నారు,” అన్న శుభవార్త మోసుకు వచ్చాడు బాబు గురుంగ్. ఇలాంటి వర్షాలప్పుడు కొండచరియలు విరుచుకు పడి దారులు మూసుకుపోయే ప్రమాదముంది కాబట్టి ఆ జీపుల వాళ్ళ నిరాసక్తత. ఓ అరగంట తర్వాత వర్షం కాస్తంత తగ్గుమొహం పట్టాక అందరం కలసి, ‘బాబ్బాబు దారి ఎంతవరకు క్షేమంగా ఉంటుందో అంతవరకే రండి, ప్రమాదం అనిపించిన చోట మమ్మల్ని దింపేసి వెళ్లిపోండి,’ అని చెప్పి ఒప్పించి ముందుకు సాగాం.
అలా ముప్పావుగంటసేపు ఒక పక్క ఆకాశంలోకి ఎగసి పడే కొండ శిఖరాలు, మరో పక్క పాతాళంలోకి ప్రవహిస్తోన్నట్లు ఉన్న బుధీగండకి, మధ్య రాళ్ళూ బురదా నిండిన జీపు బాట – మొత్తానికి తోతాపానీ అన్న ఊరు చేరుకున్నాం. అప్పటికి ఆరు కిలోమీటర్లు జీపులో వచ్చాం. దోభన్ ఇంకా ఆరు కిలోమీటర్ల దూరాన ఉంది. ‘లాభం లేదండీ, ముందుకు జీపుల్లో వెళ్ళడం మీకూ మాకూ మంచిది కాదు’ అని జీపు డ్రైవర్లు హితవు పలికి వెనక్కి వెళ్లిపోయారు.
‘పదండి పోదాం’ అనుకుంటూ మేమంతా కాలినడకన ముందుకు సాగాం. మూడు నాలుగు వందల మీటర్లు వెళ్ళేసరికి దూరాన చలనమన్నది లేకుండా నిలబడిపోయిన జనసమూహం కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే బలమైన లాండ్ స్లైడ్ పుణ్యమా అని దారంతా మూతబడిపోయి కనిపించింది. ఇంకా రకరకాల పరిమాణాలుగల రాళ్ళూ రప్పలూ అడపాదడపా క్రిందకు జారుతూ కనిపించాయి. ఆ లాండ్ స్లైడ్ జరిగి ఆట్టే సమయం కాలేదన్న మాట. కొండలోని పెద్ద తునక ఒకటి జారి పడి దారిని పూర్తిగా కప్పేసింది – అసలు దారి అన్నది లేకుండా చేసేసింది. అంతా రాళ్ళూ బురదా – దారి ఎక్కడ ఉందో ఉజ్జాయింపుగా చూసుకుని నడవాలంటే కాళ్ళ క్రింద నిలకడలేని నేల, పైనుంచి జారిపడే రాళ్ళు… జారిపడిన కొండచరియ 200 మీటర్లు దిగువన ఉన్న నది ఒడ్డు దాకా వ్యాపించి ఉంది. ఏ కోణంనుంచి చూసినా ఏ మాత్రం ఆశ కలిగించని దృశ్యమది.
అంతా చేష్టలుడిగి నిలబడిపోయాం. నోట మాట రాని స్థితి అది. ఎవరితోనూ ఏమీ మాట్లాడలేని స్థితి… ట్రెక్ ఆరంభించకుండానే వెనక్కి తిరిగి వెళ్లిపోవాలా? మనసు మొద్దుబారిపోయింది. అందరిదీ అదే పరిస్థితి. ఎదురుగా ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయే గానీ అవి మొద్దుబారిన మనసులోకి ఇంకలేకపోతున్నాయి. ఆలోచనలు కొడిగట్టిన సమయం… అసలు ఆలోచన అంటూ వస్తే ఆ ప్రాంతాన్ని దాటి అవతలికి చేరుకోవడం అన్న పనే పెట్టుకోను – కానీ ఆలోచనలన్నవే లేని జడస్థితిలో అలా చూస్తూ ఉండిపోతున్నాం గదా!
కొంతమంది ఫ్రెంచి ట్రెకర్లూ, ఒకరిద్దరు డేనిష్ ట్రెకర్లూ కనిపించారు. వాళ్లదీ మాలానే అయోమయ స్థితి. రాత్రి కలసిన స్పానిష్ బృందం కనిపించనే లేదు. బహుశా ఆ ఉదయం బయల్దేరి ఉండకపోవచ్చు.
ఈ మొద్దుబారటాలు, అయోమయాలు, చేష్టలు ఉడగటాలు మాలాంటివాళ్ళకే – మా గైడ్ బాబు గురుంగ్‌కు ఆ తాకిడి తగిలినట్టు లేదు. ఎంతైనా ఇలాంటి విషయాల్లో అపారమైన అనుభవం ఉన్న మనిషి కదా… కార్యాచరణకు దిగాడు. మెల్లగా లాండ్ స్లైడ్ జరిగిన ప్రాంతం దగ్గరికి చేరాడు. 70-80 మీటర్లపాటు విస్తరించి ఉన్న ఆ మట్టీ బురదలలో ఒక తాత్కాలిక బాటను ఏర్పరచాడు. పడి ఉన్న రాళ్ళూ బండలనే తీసి, అమర్చి, కాలు మోపే వెసులుబాటు కల్పించుకున్నాడు. పైనుంచి పడుతోన్న రాళ్ళను జాగ్రత్తగా గమనించుకుంటూ మొత్తానికి అవతలి వేపుకు చేరాడు. అదే మార్గంలో తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేటపుడు మరిన్ని రాళ్ళను ఆ ఉండీలేని బాటలో చేర్చి మరికాస్త పటిష్టం చేసాడు. అక్కడ ఉన్న ఇతర గైడ్లు, సీనియర్ పోర్టర్లు గురుంగ్ చూపిన మార్గాన్ని అంది పుచ్చుకున్నారు.
మా బృందంలోని సీనియర్ పోర్టర్లు కూడా బాబుతో చేతులు కలిపారు. కొంతమంది బాటలోని కీలక ప్రదేశాలలో నిలబడి మాకందరికీ సాయం అందించసాగారు. మరికొంతమంది మా చేతులు పట్టుకుని జాగ్రత్తగా మమ్మల్ని బాట దాటించసాగారు. ఇంకొంతమంది పైనుంచి జారుతోన్న రాళ్ళను గమనిస్తూ హెచ్చరికలు చేయసాగారు.
మెల్లగా ఒక్కొక్కరం బాట దాటి అవతలి ‘గట్టు’ కు చేరుకున్నాం. నా వంతు వచ్చి నేను దాటినపుడు గైడ్లు చేస్తోన్న సూచనలను తూచా తప్పకుండా పాటించాను. వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే కీలకప్రదేశాలలో అడుగులు వేసాను. ప్రతి అడుగూ ఎంతో జాగ్రత్తగా, సర్వశక్తులూ కూడదీసుకుని వేసాను. కలవరపాటును దగ్గరికి చేరనివ్వలేదు. ఆందోళన చెందడం, వేస్తోన్న అడుగుల మీదనుంచి దృష్టిని క్షణకాలంపాటైనా మళ్లించడం ప్రాణాంతకమని తెలుసు.
మా బృందంలోని గిరీష్ ముందుగా అవతలి తీరం చేరి గైడ్లకు సాయపడ్డాడు. వారితోబాటు మాకూ సహాయ సహకారాలు అందించాడు. ఆ ప్రక్రియలో స్వల్పంగా గాయపడ్డాడు. ఓ పెద్దపాటి రాయి పైనుంచి దొర్లి వచ్చినపుడు అతని మోకాలు దిగువన చిన్న దెబ్బ తగిలింది. ప్లాస్టర్ వేయవలసి వచ్చింది. ఏదేమైనా మా బృందమంతటిలోనూ చురుకైన వ్యక్తి గిరీష్. ఎవరికి ఎలాంటి సాయం కావలసి వచ్చినా ఉత్సాహంతో ముందుండే మనిషి.
మేమలా ఆ లాండ్ స్లైడ్ ప్రాంతాన్ని దాటి ఉండని పక్షంలో తిరిగి మచ్ఛాఖోలా వెళ్ళడం తప్ప మరో దారి ఉండేదిగాదు. అలా వెళ్ళినా ఆ లాండ్ స్లైడ్‌ను తొలగించి బాటను పునరుద్ధరించడానికి ఎంత కాలం పట్టేదో తెలియదు. మా గైడ్ లు ముందడుగు వేసి ధైర్యం చేసి బాట దాటమని చెప్పినపుడు ఎవరం సందేహించలేదు. వాళ్ళ మీద పూర్తి నమ్మకంతో వాళ్ళు చెప్పింది చేసాం. అవతలి తీరం చేరాం. అలా అందరూ సభ్యులూ క్షేమంగా అవతలి గట్టు చేరుకున్నపుడు నాకు కలిగిన సంతోషం, రిలీఫ్ మాటల్లో చెప్పలేనివి.
మేమంతా దాటిన తర్వాత మా పోర్టర్లందరూ ఒక్కొక్కరూ పాతిక కిలోల బరువునెత్తుకుని జాగ్రత్తగా కీలక ప్రదేశం దాటారు. వాళ్ళంతా ఆ మట్టిలో పుట్టిన వాళ్ళు. ఆ మట్టికే చెందిన వాళ్ళు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసిన వాళ్ళు. అయినా వాళ్ళందరూ కూడా తీరం చేరేదాకా నేను తీరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోయాను. నేను దాటినపుడు నాలో కలగని ఆందోళన ఇతరులు దాటడం చూసినపుడు మాత్రం బాగా కమ్ముకువచ్చింది.
మా గైడ్లూ పోర్టర్లూ లాండ్ స్లైడ్ ప్రాంతం దాటించడంలో ప్రదర్శించిన సమయస్ఫూర్తికీ, సాహస ప్రవృత్తికీ మనసారా ధన్యవాదాలు చెప్పి అందరం నడక ఆరంభించాం.
నడక ఆరంభించామేగానీ మౌనం నన్ను విడిచిపెట్టనంది. గడచిన కొద్ది సమయంలో మేమంతా ఎంతటి రిస్క్ తీసుకున్నామో ఆ విషయం తలచుకొంటేనే ఒళ్ళంతా గగుర్పాటు. మా పదీ పదిహేనుమందిలో ఏ ఒక్కరి అడుగు తడబడినా, పాదాల క్రింది నేల జారిపోయినా వందల అడుగులు క్రిందకు దొర్లి నదీలోయలో తేలి ఉండే వాళ్ళం. అలా పడిన వాళ్ళను రక్షించి వెలికి తీసే సదుపాయమూ ఏమాత్రం లేని సందర్భమది. అదృష్టవశాత్తూ అందరం అలాంటి ప్రమాదంలో పడకుండా గట్టెక్కగలిగాం. అయినా ఈ అనుభవాన్ని రానున్న క్లిష్టకాలాలకు సంకేతాలుగా భావించుకోవాలేమో! మనస్లు ట్రెక్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు అని సూర్య, బాబు గురుంగ్ పదేపదే నొక్కి చెప్పింది ఇందుకేనేమో! రాబోయే పదీ పన్నెండు రోజులూ ఇలానే ఉండబోతున్నాయా? మనస్లు ట్రెక్కు సిద్ధపడటానికి నా శారీరక మానసిక శక్తుల పొలిమేరలు చూడాలన్న కోరిక నాకు ప్రేరణ… ఆ పొలిమేర మొదటి రోజునే చేరుకున్నానా? ఇంకా నేను అందుకోగల అంచులు ముందు ముందు పొంచి ఉన్నాయా?!
నడక ఆరంభించి ఓ కిలోమీటరు గడిచిందో లేదో మరో లాండ్ స్లైడ్ దర్శనమిచ్చింది. కాకపోతే గడచి వచ్చిన దానితో పోలిస్తే ఇది చిన్నపిల్లల బొమ్మలాట. నేల రాలిపడి చాలా సమయం గడిచినట్టుంది. దారి గట్టిపడి కనిపించింది. బాగా స్థిరంగా ఉంది. అప్పటికే ఓ కాలిదారి ఏర్పడిపోయి ఉంది. మేము చేయవలసినదల్లా ఆ కాలిబాటలో జాగ్రత్తగా నడచి వెళ్లడమే. అలా అనుకున్నానుగానీ అదీ అంత సులభమేమీ కాదని నడచి వెళ్ళడం మొదలెట్టాక బోధపడింది. అసలే సన్నటి కాలిబాట… ఆపైన లాండ్ స్లైడ్. మళ్ళా ఆ మట్టీ రాళ్ళ మీదుగా ఏర్పడిన మధ్యంతర దారి – ఆ దారి ఎంత సన్నపాటిది అంటే స్వేచ్ఛగా రెండడుగులు వేసే వెసులుబాటు కూడా లేదు. ఒక్కో అడుగూ ఆచితూచి వేస్తూ ఆ లాండ్ స్లైడ్ దాటవలసి వచ్చింది. ఏదేమైనా మా ట్రెకింగ్ మైండ్లు ఈ బాపతు విపత్తులకు బాగా అలవాటు పడిపోయాయని ఆ అడ్డంకిని దాటుతున్నపుడు స్పష్టమయింది. ఇదే మా మొదటి అవరోధం అయి ఉంటే భయపడి ఉండేవాళ్ళమే… కనీసం కంగారుపడి ఉండేవాళ్ళం. దీనికన్నా గాఢమయిన అవరోధాన్ని అరగంటా గంట క్రితమే దాటాం కదా – అంచేత ఇది ఇప్పుడు దాటడం సులభంగా జరిగిపోయింది. భయాందోళనలన్నవి లేకుండా, జాగ్రత్త మాత్రం పడుతూ రెండవ అవరోధాన్ని దాటేసాం.
మా కాలిబాట శిఖర ప్రాంతాల మీదుగా సాగింది. ఎడమ వేపున నిడుపాటి దిగుడు… కుడివేపున అంతే నిడుపాటి నదీలోయ. దారి పొడవునా కొండ చరియలలోంచి జలధారలు తిన్నగా మా నడకదారి మీద జల్లులు విరజిమ్మసాగాయి.
ఉదయంనుంచీ వర్షం పట్టుకుంది అనుకున్నాం గదా – ఆ వర్షం అదృష్టవశాత్తూ ఓ గంటసేపు బాగా తగ్గింది. ఆ తగ్గడం కూడా మేము మొదటి లాండ్ స్లైడ్ దాటుతున్నపుడు జరిగింది. ఆ సమయంలో వర్షం ఉధృతంగా ఉండి ఉన్న పక్షంలో ఆ అవరోధాన్ని దాటడం అన్న ప్రశ్నే ఉండేది గాదు. ఒకవేళ ప్రయత్నించినా నేలంతా జారుడు జారుడుగా ప్రమాదభరితంగా ఉందని గ్రహించాక తప్పకుండా నడక విరమించుకుని ఉండేవాళ్ళం.
రెండు లాండ్ స్లైడ్లూ దాటుకుని నడక కొనసాగించే సమయంలో వర్షం మళ్ళా పెద్దదయింది. అయినా మేము దాన్ని నిగ్రహించుకోగల పరిమితిలోనే నిలచి కురిసింది. మాకున్న వర్షం దుస్తుల పుణ్యమా అని మేమంతా ఏమాత్రం ‘తడవకుండా’ లోపల లోపల పొడిపొడిగా ఉండగలిగాం. ఏదేమైనా ఆ వానను స్నేహపూర్వకంగా పలకరించే చిలకరింపుగానే భావించవచ్చు. అలా నడుస్తూ ఉదయం పదకొండుగంటల ప్రాంతంలో దోభన్ అన్న ఊరు చేరుకున్నాం. వాతావరణం తేటగా ఉన్నపుడు ఈ ఊరిదాకా జీపులు నడుస్తాయి. మేము ముందు అనుకున్నది కూడా ఇక్కడి దాకా జీపుల్లో రావాలనే – మధ్యమార్గంలో జీపులు వదిలి నడవవలసి వచ్చింది.
ఊళ్ళోని టీ హౌస్‌లో టీ తాగుదామని ఆగాం. గొర్రెలు, పందులు, కోళ్ళు, బాతులను మేపుతోన్న గ్రామీణులు కనిపించారు. ఆ రెండు మూడు గంటల అనుభవంతో మాలోని భయాలు ఆందోళనలు తొలగిపోయాయి. నడచి వచ్చిన దుర్గమ మార్గాలను గురించి కులాసాగా కబుర్లు చెప్పుకునే స్థిమితం మా అందరిలో ఏర్పడింది. తరచి చూస్తే ఏ ఒక్కరూ భీతిల్లిపోయి కనిపించలేదు. నడచి వచ్చిన లాండ్ స్లైడ్ల విషయంలో ఏ విచారాలూ సంకోచాలూ ఎవరిలోనూ కనిపించలేదు. “కాసేపు అక్కడ ఆగి ఉండాలేమో, అంత రిస్కు తీసుకోవలసింది కాదేమో,” అన్న మాటగానీ కనీసం సూచనగానీ వినిపించలేదు. కనిపించలేదు. అదంతా చూసి నాకు గొప్ప సంతోషం, కాస్తంత ఆశ్చర్యం. మన దినసరి వ్యవహారాలలో చిన్న చిన్న రిస్క్‌ల విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఉంటాం. మీనమేషాలు లెక్కబెడుతూ ఉంటాం. ఈ హిమాలయ సీమలో ఏదో అదృశ్యశక్తి మా అందరి ఆలోచనలనూ ఏకీకృతం చేసి మాలో స్వతహాగా లేని చొరవా తెగింపులను ప్రవేశపెట్టిందా అనిపించింది. బహుశా ప్రకృతిమాతే ఆ అదృశ్య శక్తి అయి ఉండాలి. అందువల్లనే ఇల్లు విడిచి బయట ప్రపంచంలో తిరిగిన మనిషి ప్రపంచాన్నీ జీవితాన్నీ చూసే దృష్టిలో, జీవిత అవరోధాలను పరిష్కరించుకునే పద్ధతిలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ఆ మెరుగుదల దిశలో మేమంతా ప్రయాణం చేస్తున్నామా?! మానవుడు నాగరికం నేర్వక ముందు, వేట – ఫల సేకరణలతో మనుగడ సాగిస్తున్న సమయంలో ఉమ్మడి చైతన్యం నెలకొని ఉండేదనీ, ఉమ్మడి లక్ష్యాల కోసం అందరూ పాటుపడేవారనీ మానవశాస్త్ర నిపుణులు చెపుతూ ఉంటారు. సామాజికంగా సాంకేతికంగా మనిషి బాగా ఎదిగిన ఈ కాలంలో కూడా ఆ అనాది సులక్షణాలు మనిషిలో గుప్తంగా నిక్షిప్తమై ఉండి ఉంటాయనుకుంటాను. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే సమయంలో ఆ సామూహిక చైతన్యం తిరిగి తల ఎత్తి మంచి ఫలితాలను సాధిస్తుంది కాబోలు.
ఈనాడు మా బృందం పురోగమనం విషయంలో అచ్చంగా అదే జరిగింది. నాగరిక జీవితం అలవాటు చేసిన భయాలనూ సంకోచాలనూ పక్కనపెట్టి అందరం మాకు తెలియకుండానే ఆ అనాది స్పందనలను ఆశ్రయించాం. ప్రకృతిమాతనూ మా గైడ్‌లనూ నమ్ముకున్నాం. పరస్పరం ఒక్క మాటైనా అనుకోకుండా ఉమ్మడి నిర్ణయాలు తీసుకున్నాం. ముందుకు సాగాం. పర్వతాలు మాలోని సామూహిక చైతన్యం వెలికి వచ్చే వేదికలయ్యాయి. ప్రకృతి ఆ చైతన్యం సత్ఫలితాలు ఇచ్చేలా చేసింది. ఈ అనుభవం మాలోని బంధాలను పటిష్టం చేసింది.
ఇంతవరకూ వచ్చాక ముందుకు వెళ్లడమేగానీ వెనక్కు మళ్లడం అన్న ప్రసక్తే లేదని అందరికీ అర్థమయింది. అసలా అవసరం రానే రాదన్న నమ్మకం చిక్కింది. మాకున్న ఒకే ఒక్క గమ్యం లార్కే కనుమ దాటుకుని వెళ్ళి తిలిజె గ్రామం దగ్గర ట్రెక్ ముగించడమే అని బోధపడింది.











