నవంబర్ 2025

Issue Index Image

తెలుగు నేలమీద సాహితీ సమావేశాలు కొత్త కాదు. 1975లో మొదలు పెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలనుండి అమెరికానుండి వచ్చే ప్రవాసాంధ్రుల సాహితీ సమావేశాల దాకా ఎన్నో సాహిత్యోత్సవాలు యేటేటా జరుగుతూనే ఉన్నాయి. కానీ అవన్నీ తెలుగు భాషకే పరిమితమయ్యాయి. తెలుగు నేలమీద దక్షిణ భారత భాషలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చే, ఒక ఉమ్మడి వేదికను సృష్టించే ప్రయత్నం బలంగా జరగలేదు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలకు కేవలం ఉమ్మడి ద్రావిడ భాషామూలాలు మాత్రమే కాదు, శతాబ్దాలుగా అల్లుకుపోయిన సాంస్కృతిక బంధాలు, విజయనగర సామ్రాజ్యంనుండి మద్రాస్ ప్రెసిడెన్సీవరకు ఉన్న ఉమ్మడి చారిత్రక అనుభవాలు ఉన్నాయి. ఈ సాన్నిహిత్యం మన సాహిత్యాలలో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. మనందరి సమస్యలు, సంస్కరణోద్యమాలు, ఆకాంక్షలు, పోరాటాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి.

తెలుగువారికి, తమ ఇరుగుపొరుగు భాషలైన తమిళ, కన్నడ, మలయాళ భాషలతో, వారివారి సాహిత్యాలతో పరిచయం చాలా తక్కువ అనేది తరచుగా వినిపించే విమర్శ. మన తెలుగు సాహిత్యం గురించి, తెలుగు భాష గురించి మన పొరుగు భాషల సాహిత్యప్రియులకు తెలిసినంతగా, తెలుగువారికి కన్నడ, తమిళ, మలయాళ సాహిత్యాల గురించిగానీ, ఆ భాషా రచయితల గురించిగానీ అంతగా తెలియదన్న విమర్శలో కొంత నిజం లేకపోలేదు. అందుకు కొన్ని బలమైన చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. విజయనగర రాజుల కాలంనుండి నాయకరాజులు, పీష్వాల పాలనాకాలం దాకా తెలుగే రాజభాషగా ఉండేది. మైసూరు రాజాస్థానంలోనూ తిరుమలరాయవంటి అనేక తెలుగు కృతికర్తలకు ఆదరణ లభించింది. అలాగే, కేరళ రాజైన స్వాతి తిరునాళ్ స్వయంగా తెలుగులో కీర్తనలు రాయడమే కాకుండా, త్యాగరాజు శిష్యుడైన కన్నయ్య భాగవతార్‌కు తన ఆస్థానంలో ఆశ్రయం కల్పించాడు. అంటే బ్రిటిష్ వారి రాకకు పూర్వం దక్షిణ భారతదేశంలో రాజభాషగా, సాంస్కృతిక భాషగా విశిష్టవైభవాన్ని గడించిన కారణంగా, దక్షిణ భారతదేశమంతటా తెలుగు మాతృభాష కాని వారికి కూడా తెలుగు అర్థం అవుతుంది. అందుకే తెలుగు వారి సాహిత్యం, కీర్తనలు, గేయాలు యథాతథంగానో అనువాదంగానో శతాబ్దాలుగా పొరుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. గత రెండు దశాబ్దాలలో తెలుగులోకి కొంత అనువాదం జరిగినా, తెలుగునేల మీద మన పొరుగు దక్షిణ భారతీయ సాహిత్యం గురించిన అవగాహన తక్కువేనని చెప్పుకోవాలి.

దక్షిణ భారతదేశంలో ఉన్న సాహితీ ఉద్దండులను తెలుగు వేదిక మీదకు ఆహ్వానించి, ఒక ఉన్నత స్థాయిలో, మేధోపరమైన సాహిత్య ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడం సాధ్యమేనా? మన సాహితీకారుల మధ్య ఉండే సహజమైన భేదాభిప్రాయాలను పక్కనపెట్టి, కేవలం సాహిత్యం కోసం, కొత్త గొంతుకలను వినడం కోసం అందరూ ఒకే వేదికపైకి రాగలరా? ఈ ప్రశ్నలకు కొద్ది రోజుల క్రితంవరకు చాలామందినుంచి “అది మనవల్ల కాదు, మనకు ఆ ‘సామూహిక సంస్కారం’ ఇంకా అలవడలేదు” అనే నిరాశాజనకమైన సమాధానమే వినిపించేది. కానీ, ఈ సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ, హైదరాబాద్ వేదికగా గత నెలలో జరిగిన ‘ఛాయ లిటరరీ ఫెస్టివల్’ ఒక కొత్త ఆశను చిగురింపజేసింది. ఇది కేవలం తెలుగు ఉత్సవంలా మిగిలిపోలేదు. దక్షిణ భారత భాషల ప్రఖ్యాత రచయితలనెందరినో ఒకే వేదికపైకి తెచ్చింది. విభిన్న భాషల మధ్య, ముఖ్యంగా అనువాదాల ద్వారా బలపడుతున్న సాహిత్య సంబంధాల గురించి అర్ధవంతమైన చర్చలకు ఇది వేదికైంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే కాకూడదు. ఈ ఉత్సవం ప్రదర్శించిన సామూహిక విజ్ఞత, నిర్వాహణా కౌశలం, భవిష్యత్తులో జరగబోయే మరెన్నో సాహిత్య కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలవాలి. తెలుగు సాహిత్యానికి, దక్షిణభాషా సాహిత్యాలకు, ఇది నిజంగా ఒక కొత్త వెలుగు ‘ఛాయ’.