[సంస్కృతాంధ్ర భాషలలో పండితుడైన అక్కిరాజు ఉమాకాన్తమ్ పంతులు భావకవుల కవిత్వాన్ని, ముఖ్యంగా కృష్ణశాస్త్రి కవిత్వాన్ని భారతీయ అలంకార శాస్త్రప్రమాణాలను పాటించడం లేదని, వ్యక్తికేంద్రకమైన, అస్పష్టమైన భావాలను వ్యక్తపరుస్తుందని తీవ్రంగా విమర్శిస్తూ 1928లో రాసిన గ్రంథం “నేటికాలపు కవిత్వం”. కృష్ణశాస్త్రి కవిత్వంపై ఇతర వ్యాసాలతోపాటు అక్కిరాజు ఉమాకాన్తమ్ గారి విమర్శనాగ్రంథం నుండి ఒక చిన్ని వ్యాసాన్ని ఈమాట పాఠకులకు స్థాలీపులాక న్యాయంగా అందజేస్తున్నాం — సం.]
పూర్వపక్షం
ఈ కాలపు కృతుల్లో స్వాతంత్ర్యమెక్కువ
“ఈకవులు నిక్కముగ స్వతంత్రులు”
-క. రామలింగారెడ్ది (లక్ష్మీకాంత తొలకరిపీఠిక)“నవకవులకు స్వేచ్ఛ ప్రాణము”
కట్టుబాటులోకవిత్వమా”- దే.కృష్ణశాస్త్రి (యేకాంతసేవపీఠిక)
“జగమునిండ స్వేచ్ఛాగానఝురులనింతు”. (కృష్ణపక్షం)“స్వాతంత్ర్య గీతానాదమే స్వర్ణయుగమునకు ప్రాణభూతము,
పోకడలు స్వతంత్రములు భావములు స్వతంత్రములు”
దశిక సూర్యప్రకాశరావు (భారతి)
అని ప్రకటించిన తీరున ఇప్పటికవులు స్వాతంత్ర్యాన్ని కనబరుస్తున్నారు. ఇట్లాటి స్వాతంత్ర్యం పూర్వుల్లో లేదు. కనుక ఇది కొత్తకవిత్వం అని వాదిస్తారు.
సమాధానం
స్వాతంత్ర్యం సర్వకాలాల్లోను వున్నది. ఒకహద్దుకు లోబడ్డ స్వాతంత్ర్యాన్ని ప్రాచీనకాలంనుండి భారతీయులు గౌరవిస్తున్నారు. ఇట్లాటి స్వాతంత్ర్యం రానురాను భవిష్యత్ప్రజల్లో నశిస్తుందని చింతపడ్డారు.
“స్వాతంత్ర్యం కౌశలం కాన్తిర్త్ధర్యం మార్దవమేవ చ (శ్రీభా)
అని యీగుణాన్ని శ్రీభాగవతకారుడు ప్రశంసిస్తున్నాడు.
“సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మ వశం సుఖం” (మను)
అని మనువు చెప్పుతున్నాడు.
అయితే నేను పాఠశాలనుమాని యెగురుతాను. ఆచార్యులవద్ద విద్యనేర్వడం స్వాతంత్ర్యానికిభంగం అందువల్ల నాకు యేవిద్యావద్దు అని అనడం అనర్థహేతువు. అజ్ఞానాపాదకం గనుక అది స్వాతంత్ర్యం గాదు. అందుకే కొన్నిహద్దులకు లోబడ్డ స్వాతంత్ర్యాన్ని భారతీయులు ఆరాధించారన్నాను. కవిత్వంలో చూస్తామా యెవరి మనః ప్రవృత్తిని అనుసరించి వారుసృష్టి చేశారు. కాళిదాససృష్టి వేరు భవభూతిసృష్టి వేరు. భవభూతి స్వతంత్రించి “ఏకోరసః కరుణఏవ” (ఉత్తర) అని ఉపదేశించాడు. “మురారేస్తృతీయః పన్థాః” అని ప్రసిద్దమేగదా! దీన్ని విస్తరించి వ్రాయవలసిన పనిలేదు. “నిరంకుశాః కవయః” అనేమాటలే చాలును అవి భారతీయ కవుల యీస్వాతంత్ర్యాన్ని అస్ఫుటధ్వనితో వినిపిస్తున్నవి కనుక స్వాతంత్ర్యం వల్ల ఈకాలపు కవిత్వం కొత్తదంటే అంగీకరించ వీలులేదంటున్నాను” జగమునిండ స్వేచ్చాగాన ఝురుల నింతు” అని యీతీరునచెప్పలేదుగదా అంటే అట్లాచెప్పడం ఒక శ్లాఘ్యలక్షణంగాదు.
ఉత్తములెప్పుడూ తమగుణాలను కార్యాలచేత విదితంచేస్తారు గాని చెప్పుకోరు. అది తేలిక మనుషుల యొక్క వెలితి లక్షణం ఈ సంగతినే.
“తస్య సంవృతమంత్రస్య గూఢాకారేంగితస్య చ.
ఫలానుమేయాః ప్రారంభాః” (రఘు)
(ఆలోచన గూఢంగావుండే ఆయన యత్నాలు ఫలాలవల్లనే కనుక్కోదగినవి.)
అనే పఙ్త్కులవల్ల కాళిదాసీభావాన్నే వ్యక్తం చేస్తున్నాడు
“బ్రువతే హి ఫలేన సాధవో న తు వాక్యేన నిజోపయోగితాం”
(సాధువులు నిజోపయోగితను మాటలచేత చెప్పరు. ఫలాల చేత కనబరుస్తారు.)
అని శ్రీహర్షు డీ అంశాన్నే తెలుపుతున్నాడు.
ఇంతకూ ఇట్లా చెపుకొన్నవాండ్లుకూడా వెనకవున్నారు
అర్జవవేష్టి తాఖిలమహామహిమండలమందు బూతులం బూర్ణుడ (జగ్గకవి – చంద్ర రేఖా)
“ఎవ్వరేమన్న నండ్రు నాకేమికొరత” (శ్రీనాథుడు-కాశీ)
ఈతీరుగా వారివారి స్వాతంత్ర్యాన్ని చెప్పుకొన్నారు. అసలిట్లా చెప్పుకొనడం లఘుత్వద్యోతక మని అది కొత్తగా దనితెలిపినాను. కనుక స్వాతంత్ర్యప్రకటనంవల్ల ఇప్పటికవిత్వం కొత్త అన్న మాట నిలువజాలదు.
“మ్రోడుమోక చివురులెత్తి మురుపుసూప”
“కర్కశశిలయ నవజీవ కళలుదేర”
“జగము నిండ స్వేచ్ఛాగాన ఝురులనింతు” (కృష్ణపక్షం)
అని యిట్లా ఆత్మస్తుతిచేసుకొనడం గూడా కొత్తగాదు:
ఇతరు లక్షరరమ్యతనాదరింప (భా- నన్నయ)
“విటుడు యతిగాక పోవునే వెస మదీయ
కావ్య వైరాగ్య వర్ణనాకర్ణనమున
యతి విటుడుగాకపోవునే యస్మదీయ
కావ్య శృంగారవర్ణనాకర్ణనమున”. (నృసింహకవి-కవి కర్ణ)
“ఆమూలా ద్రత్నసానో ర్మలయవలయితాదాచకూలాత్ పయోధేః
యావంతః సన్తి కావ్యప్రణయనపటవః తే విశంకం వదంతు”“మృద్వీకామధ్యనిర్యన్మసృణమధుఝురీమాధురీభాగ్యభాజాం
వాచామాచార్యతాయాః పదమనుభవితుం కోస్తి ధన్యో మదన్య”
(మేరువుమూలంనుండి మలయవలయితమైన సముద్రతీరందాకా వున్న కావ్యకర్తలు నిశ్శంకంగా చెప్పుదురుగాక. ద్రాక్షనుండి వచ్చే చిక్కటి మధువుయొక్క మాధుర్యభాగ్యంగలిగిన వాక్కులకు ఆచార్యపదం అనుభవింప ధన్యుడు నాకంటె అన్యు డెవడున్నాడు. జగన్నాథుడు) యీతీరుగా ఇట్లాటి ఆత్మస్తుతి యేసందర్బంలో చెప్పినా చిరకాలంనుండి వస్తున్నది. ఈఆత్మస్తుతులైనా యే వొకటిరెండు వాక్యాల్లోనో పద్యాల్లోనో చెప్పితే మితంగా వుంటుంది.
“కలికి పాటలకోయిల కులముమాది”
“పికకుమారకు నన్ను బాడుకొన నిమ్ము”
రాళ్లకు జీవకళవచ్చేటట్లు మోళ్లు చిగురులు పెట్టేటట్లు స్వేచ్ఛా
గానం చేస్తాను;
కట్టుబాట్లు తెగేటట్లు ఆకాశం ప్రత్రిధ్వనించగా స్వేచ్చాగానం చేస్తాను;
చిత్త మానంద మయమరీచికలసోల
హృదయ మానంద భంగమాలికలదేల
కనుల నానంద జనితాశ్రుకణములూర
జగము నిండ స్వేచ్ఛాగాన ఝురులనింతు
విశ్వమే పరవశమయి వెంటాడ
జగమునిండ స్వేచ్ఛాగాన ఝురులనింతు
మాయ మయ్యెదను నామధురగానమున
ఏను స్వేచ్ఛాకుమారుడ నేనుగగన
పథవిహారవిహంగమ పతిని నేను
మోహనవినీల జలధరమూర్తి నేను
ప్రళయ ఝుంఝూప్రభంజన స్వామి నేను.”
(దే. కృష్ణశాస్త్రి కృష్ణపక్షం)
అని యింకా యీతీరున ఆత్మస్తుతులు కృష్ణపక్షకర్తవలె చేసుకుంటే రోతగానే వుంటుంది.
పాపాయి అనేకృతిలో తత్కర్త
“లేశమేనియుఁ బ్రఖ్యాతి లేని నాకు
కలిగె పాపాయి తండ్రియన్ గౌరవంబు
పద్ధియంబులు నీపేర వ్రాయు కతన”“రాణ నొప్పారె నాంధ్రసారస్వతాబ్ధి
కావ్య మణులెన్నియో నేటికాలమందు
వాని నెల్లను సరిపోల్పవచ్చునొక్కొ
తావకానూనకావ్యరత్నంబుతోడ” (భారతి)
అని మొదట తన్ను తాను స్తుతించుకొని తరవాత యితరులు స్తుతించారని చెప్పుతున్నాడు. ఈస్తుతి ఇంకా వున్నదిగాని ఉదాహరించక మానుతున్నాను.
యెంకిపాటల్లో ఆత్మస్తుతిచేసుకో వీలులేక వాట్లో మాట్లాడేది పాత్రలే గనక ఆత్మస్తుతులను పాత్రలకు యెంకిపాటలకర్త ఒప్పగించాడు.
“కతకాడుమావూసె చెప్పాలె
ఈసీమ ఆసీమ అందరందాలు
తిన్నగా నినుజూసి దిద్దుకుంటారు
ముందు మనపాపణ్ని కిందదిగనీరు
యెంకొక్క దేవతై యెలిసెనంటారు.”
ఇవి నాయుడి ఆత్మస్తుతులు
ఈవక్రమార్గపుస్తుతులతో తనివిలేక–
“ఆమహోన్నతభవాలకు నాయెంకిపాటలే కారణమైతే ధన్యుడను … ధన్యుడను …. నన్ను ప్రత్యేకించి ఆహ్వానించి గౌరవించారు”
అని కూడా యెంకిపాటలకర్త చెప్పుకున్నాడు. యిట్లాటి ఆత్మస్తుతులు ఈతీరుగా రోతలోకి దిగి యీనాడు మెండైనవి ఇట్లాటివి యేకాలంలో నైనా సరే అల్పబుద్ధిత్వ సూచక మేగాని పరిణతిద్యోతకంగావు. కవికుల గురువు కాళిదాసు.
“మందః కవియశఃప్రార్థీ గమిష్యామ్యపహాస్యతాం” (రఘు)
(మందుడను కవియశస్సునుగోరి అపహాస్యతను పొందుతాను)
అని విజ్ఞలోకానికి వినతుడవుతున్నాడు.
అంతేగాని పికకుమారుణ్ణి కోయిలను, చిలకను అవి పాగడుకోలేదు. ఈ ఆత్మస్తుతి అధములుగూడా చేసుకోవచ్చును. మహాకవులను లోకం స్వయంగానే ఆరాధిస్తున్నది.
“వందే వాల్మికికోకిలం”
“పురా కవీనాం గుణనాప్రసంగే కనిష్ఠికాధిష్ఠితకాళిదాసా
అద్యాపి తత్తుల్యకవేరభావాత్ అనామికా సార్ధవతీ బభూవ”
“దాసతాం కాళిదాసస్య కవయః కే న విభ్రతి”
(గంగాదేవి – మధురా)
“నిర్గతాసు నవా కన్య కాళిదాసస్య సూ క్తిమ.
ప్రీతిర్మధురసార్ద్రాసు మంజరీష్వివ జాయతే. (హర్ష – బాణుడు)
“శ్లోకత్వమాపద్యత యస్య శోకః” (రఘు – కాళిదాసు)
అని మహాకవులు నాటికి నేటికి ఆరాధితులవుతున్నారు. అనుచితమైన ఆత్మస్తుతులు అల్పబుద్ధిత్వసూచికమని అది కొత్తకాదని చెప్పి యీ విమర్శ ముగిస్తున్నాను.