ధరణీరుహ — సమీక్షా వ్యాసం

“… వెన్నెల ఆకాశంలో చుక్కలు చూడగలగడం. కాలగమనంలో ఒక పొద్దు పొడిచే సమయానికి సాక్ష్యంగా తూర్పుకు ఎదురుగా నిలబడడం… సన్నని వెలుగు రేఖలు నీలాకాశపు సముద్రం మీద ఎర్రెర్రగా విచ్చుకోవడం…బాగుంటుంది. ఒక అడవి దారి మీద నేను చూసిన పొద్దుపొడుపుని ఇలా కాగితం మీదకు అనువదిస్తున్నాను. నా ఈ అనువాదం భావస్ఫోరకమో కాదోగాని ఎప్పుడైనా ఒక రోజు నిశ్శబ్దంగా ఉన్న అడవిలో ఒక శరత్ కాలపు వెన్నెలను మాత్రం చూడకుండా జీవితాన్ని ముగించడం ఒక విలుప్త నదీ ప్రవాహమే అవుతుందని చెప్పగలను.( పేజీ 103/ 104).”

తెలంగాణ సారస్వత పరిషత్ సాహిత్య పురస్కారం-2022, కుప్పాంబికా పురస్కారం-2023 అక్షరయాన్ సంస్థ , శ్రీ వేంకటేశ్వర బాల కుటీర్ సంస్థలు గుంటూరు వారి మాలతీ ప్రమద సాహితీ పురస్కారం-2023 , గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్‌వారి సేవారంగంలో పర్యావరణం/పరిశోధనాంశంలో జాతీయ పురస్కారం 2025 పొంది తెలుగు సాహితీరంగంలో తనదైన ముద్రతో కవితా సంపుటులు ప్రచురించిన దేవనపల్లి వీణవాణి తొలి వ్యాససంపుటి ధరణీరుహ. చూడగానే ముచ్చట గొలిపే ఆకర్షణీయమైన సైజులో, చైతన్యం కలిగించే చెట్ల ఆకుపచ్చ అంచున్న పచ్చ పసుపు చామంతి పూల చీరలాగా, జీవితపు పార్శ్వాలను ప్రతిఫలిస్తూ, ఊర్ధ్వానికే మన ప్రయాణం కొనసాగాలని సూచ్యప్రాయంగా తెలియజేస్తూ, మొదటి కవరు పేజీపై ఒక చెట్టు బొమ్మ, చివరి కవరు పేజీపై మహావాక్యాలకు సమానంగా మరో వాక్యం. అరణ్యంలో ప్రయాణం! ఇదీ, సూక్ష్మంగా ధరణీరుహ.

వీణావాణి తన వృత్తి, ప్రవృత్తులతో ఎంతో శ్రమించి, సేకరించి, భావశబలతతో ముప్పేటగా అల్లి 15 మెట్లుగా పొందుపరిచిన ఇది ఒక అరణ్యవీణ! పుడమి తల్లి మట్టి పొలుపును రంగరించి మంద్రంగా ఆలపించిన ఐంద్రజాలిక గీతం. కవిత్వం పేరుతో నేడు పుంఖానుపుంఖాలుగా వ్యాసాలను రాస్తూ, తమకు తోచిన రీతిన ముక్కలు ముక్కలుగా నరికి పంచుతూ, ఏదైనా ప్రశ్నిస్తే ‘వచనకవిత్వం మరి’ అంటూ మర్రిచెట్టు ఊడల్లా వెర్రితనాన్ని దిగేసుకుని, వికృతానందంతో పాఠకులను బెంబేలెత్తిస్తున్నది నేటి కవిత్వపు కాలం. అలాంటి కవిత్వ విపత్కర సమయంలో, వ్యాససంపుటి అన్న పేరు పెట్టినా, కవిత్వాన్ని ప్రతీ వాక్యంలో పొదిగిన మహాకావ్యం. pure poetic prose ఈ పుస్తకం. ప్రకృతిపై ప్రేమతో అమృతతుల్యమైన ఈ ప్రసాదాన్ని పాఠకులకోసం దేవనపల్లి వీణావాణి సంపూర్తిగా కవిత్వంలో ముంచి తేల్చి ఈ సంపుటిగా వెలువరించారు. ఎక్కడనుంచి మొదలుపెట్టినా, అది ఏ పేజీ అయినా, పూర్తిగా రసాలూరుతూ రంజిల్ల చేస్తుంది. మనకు వినిపిస్తున్న విశుద్ధరాగం పక్షిదా, చెట్టుదా, వీస్తున్న గాలిదా, పొటమరిస్తున్న చిగురుదా, అణగారిపోతున్న ఒక అనామక అనాథాంకురానిదా, “అమ్మా”, అని తల్లిని తలుచుకుంటున్న అడవి కూనదా, లుప్తమైపోతున్న ఒక వృక్షజాతి ఆఖరి ఆక్రందనమా? ఏది ఏమైనా, వీణావాణి చేతుల్లో అవన్నీ మైమరపించే మూర్ఛనలు పోయాయి. కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించాయి, కొన్ని ఆలోచనలలోకి నెట్టాయి, కొన్ని ఊరటనిచ్చాయి, కొన్ని వెంటాడాయి. ఇంకొన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.

వాడ్రేవు చినవీరభద్రుడుగారి “నేను తిరిగిన దారులు నదీనదాలు అడవులు కొండలు” పుస్తకంలో, అడవుల గురించి రెండు అద్భుతమైన వ్యాసాలు ఉంటాయి. అందులో అరకులోయ అడవుల గురించి వారు రాసింది చదివి, చేకూరి రామారావుగారు ఒళ్ళు పులకరిస్తూ, “ఆ రచనలలో అడవులతో పాటు మనుషులు ఉన్నారు. మనుషులను కొత్తగా చూడటం ఉన్నది. అది నాకు బాగా నచ్చింది” అన్నారట. అదే వ్యాసంలో “యత్రోన్నత … నిత్య జ్యోత్స్నాః… రమ్యాః ప్రదోషాః” అన్న కాళిదాసు శ్లోకాన్ని వీరభద్రుడు ఉటంకిస్తూ, ఆ అడవులలో ‘ఎప్పుడూ వెన్నెలేనట’ అని అంటారు. అలాగే శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ గురించి రాస్తూ, గుర్తుంచుకోదగ్గ వాక్యాలు: “ఇది వట్టి టైగర్ రిజర్వు కాదు. పెద్దపులి ఇక్కడ జీవజాలంలో అగ్రశ్రేణి ప్రాణి. అది బతకాలంటే దాని దిగువశ్రేణుల్లో మరెన్నో ప్రాణులు బతకాలి. జంతువులు, అనేకమైన వృక్షజాతులు, పొదలు, తీగలు, గడ్డి, కలప జాతులు, కలపనివ్వని జాతులు వంటివే కాక అడవి పైన ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడ్డ మనుష్య సమూహాలతో ‘ఇదంతా జీవవైవిధ్య సముదాయం'” అంటారాయన. ధరణీరుహలోని వ్యాసాల సారాంశం సంక్షిప్తంగా అంతే!

ఒక్కొక్కటి చదువుతూ నేను తబ్బిబైపోయాను. కన్నీళ్ళతో విషయ పరిపుష్టతకు కొన్ని చోట్లల్లో నాకు గుర్తుకు వచ్చిన వాక్యాలను రాసుకుంటూ, దానికి అనుసంధానంగా చదవవలసిన పుస్తకాలను మార్క్ చేసుకుంటూ. ‘ఇది ధరణీరుహ, భూమినుంచి అంకురించి ఊర్ధ్వమైనది’ అనుకుని, కాదు, ఇది ‘అంభోరుహ, తనూరుహ, మనోరుహ.’ ఉహు, అవీ కాదేమో. చిట్టి సోదరసోదరీమణులు తొలినాళ్ళలో నాదోపాసనాలంబనకు నేర్చుకునే అప్పయ్య దీక్షితార్ కృతి, ‘వరవీణా మృదుపాణి, వనరుహ లోచన రాణి…’ అన్నట్టు ఇది వనరుహ కాదు. ముచ్చటగా చెప్పాలంటే, మట్టి తల్లి మోమున మొలచి చిరకాలం నిలిచిపోయే ఒక మధురమైన ఊహ అన్న నిర్ధారణకు వచ్చాను!

అవని తల్లి మీద, అడవి మీద రాయడం ఎవరైనా చేయవచ్చు. కానీ బంగారానికి తావి అబ్బినట్టు, ఒక వృక్షశాస్త్రం చదువుకున్న వ్యక్తికి, ఆ శాస్త్రంపట్ల ఇచ్ఛుకత ఉన్న వ్యక్తికి, అదృష్టవశాత్తు వృత్తిపరంగా కూడా తాను చదువుకున్న జ్ఞానాన్ని ఉపయుక్తం చేసుకోగలిగే వెసులుబాటు కలిగి ఉండటం ఒక గొప్ప వరం. అందునా, అదే వ్యక్తి ఒక గొప్ప భావుకురాలు, కవయిత్రి అయితే అప్పుడు సాధికారికంగా రాయటం ఆమెకే చెల్లుతుంది. కనుకనే, వీణావాణి ఒక ఫారెస్ట్ ఆఫీసర్‌గా, అందునా ఒక స్త్రీగా, కవయిత్రిగా, తత్త్వవేత్తగా బహుముఖాలతో రంగప్రవేశం చేసి, ప్రకృతి తల్లికి పట్టు పావడాలు కట్టి, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించి, ఈ వ్యాసాభరణాన్ని వసుధకు బహూకరించి, తాను సృజించిన కవితావరణంలో కనువిందుగా కళ్ళకు కట్టిన కట్టు విప్పగలిగారు. “భూ విముక్తి, స్త్రీ విముక్తి, మొత్తం మానవజాతి విముక్తి కొరకే మనం పని చేయాల్సి ఉంది. శాంతిని సృష్టించుకోవాల్సి ఉంది.” అన్న ప్రముఖ అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి ‘వందనాశివ’ మాటలకు నూటికి నూరుపాళ్ళు న్యాయాన్ని చేకూర్చారు. చెప్పాలంటే, తానే కోట్ చేసినట్లుగా, ప్రఖ్యాత గ్రీకు తత్వవేత హేరాక్లేటెస్ వాక్యం, “ఏ మనిషీ ఒకే నదిలో రెండుసార్లు అడుగుపెట్టలేడు, ఎందుకంటే అది ఒకే నది కాదు అతను ఒకే మనిషి కాదు” అంటూ, క్షణక్షణానికి మారిపోతున్న కాలాన్ని, ప్రకృతిని పరవశంతో పెనవేసుకుంటూ, “ఏ మనిషీ ఒకసారి చూసిన అడవిని మళ్ళీ చూడలేడంటూ.” (పేజి 91), కాలయవనిక మీద కట్టిపడేసిన కారడవి కాళ్ళకట్లనూ చాకచక్యంగా విప్పదీసి కనువిందుగా నాట్యం చేయించగలిగింది.

ఈ సంపుటిలో 15 వ్యాసాలు ఉన్నాయి. ‘పూలవనం’తో నాటబడి ప్రారంభమై; ‘పురస్థాపనం’ అనే ఒళ్ళు జలదరించే ప్రక్రియను తెలియజేసి; ‘మండూకశోకాన్ని’ మంద్రగతిన కురిపించి; ఆ శోకవృష్టిలో తడవకుండా ‘దేవతా గొడుగులు’ విప్పించి; ‘వృక్షసాక్ష్యాన్ని’ విన్పించి; ‘అక్కర్లేని మొక్కలు’ నిజంగా అక్కరకు రానివేనా? అన్న ఆలోచనకు పాదు కట్టించి; గట్టి సంకల్పం ఉంటే గడ్డిపరకలతోనైనా ఘనసాగరాన్ని ఈదవచ్చు అన్నట్టు ‘గడ్డిపరకల’ గరిమనూ చర్చించి; ‘గొల్లవొంపులు’ సవరించి; ఆవేదన సంవేదనల మధ్య కలం కాగితం తీసుకుని, ఎర్రబడ్డ కళ్ళతో రాసిన, “విశ్వాత్మను నేను. మీలోనే ఉన్న అమానవుడ్ని ప్రశ్నిస్తుంటాను. అరచేతులనిండా అంటుకున్న చెంపలమీది ఉప్పునీటిని సాక్ష్యంగా పెట్టి నిలదీస్తాను. మీ నియమాల సంకెళ్ళలో ఇమడని ‘వ్యథశాల’ల ఆత్మల ఘోష మిమ్మల్ని వెంటాడుతుండగా వెనక్కి తిరిగి తిరిగి చూస్తాను. తనకు తానుగా మరణశాసనం రాసుకునే మానవజాతివైపు సూటిగా చూపుడువేలెత్తి హెచ్చరిస్తుంటాను” అని హెచ్చరించి; ‘ఆకాశపాయ’లలో తమోగుణాన్ని ప్రక్షాళన చేయించి; ‘జలపాత్ర’లలో ఆ అమరగంగాధారలను పట్టి అడవి జీవుల దాహార్తిని తీర్పించి “నిజాయితీగల ప్రయత్నానికి ప్రకృతి సహకరిస్తుందనే” నిరూపణతో ‘నిర్వాసితుల’ నిజరూప దర్శనం గావించి; ‘అమృతవృక్షపు’ ఛాయలలో పాఠకుడికి ఆదమరిపించి; విశ్వైక్యం చెందకుండా, విశ్వంతో విలీనం కాకుండా అనాథ బతుకు బతుకుతున్న నరుడిని ‘సరిహద్దు రేఖ’ను చెరుపుకోమనే సందేశం వివరించి ఈ వ్యాస సంపుటి ముగుస్తుంది.


ఇంతవరకు నేను ఒకటి రెండు కవితా సంపుటాలను నవలలను సమీక్షించి ఉన్నాను. కానీ, కవిత్వము-కథ-పర్యావరణం పట్ల దీక్షాకంకణం కట్టుకున్న కర్తవ్యం ఇవన్నీ కలగలసి ఉన్న వ్యాససంపుటిని సమీక్షించడం మాత్రం ఇదే మొదటిసారి. ఇందులో రచయిత్రి ప్రస్తావించిన ఎన్నో పుస్తకాలలో కనీసం నేను ఒకటి రెండు కూడా చదివి ఉండలేదు (ఒక్క Walden తప్ప). ఈ సమీక్షను ఆ పుస్తకాలన్నీ చదివి రాయడం కూడా ఇప్పుడు అసాధ్యమైన పని. అతి కష్టం మీద Ralph Waldo Emerson Essays వ్యాససంపుటిని ఈ సమీక్షానిమిత్తమై తెప్పించుకున్నప్పటికీ, కొంత స్వేచ్ఛ తీసుకుని వాటన్నింటినీ స్పృశించకుండా నాకున్న పరిమితజ్ఞానంతోనే ఈ సమీక్షను కొనసాగించాలని నిర్ణయించుకుని రాయడం మొదలుపెట్టాను. లేకపోతే, “మనం ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు” అని ఒక మహానుభావుడు చెప్పినట్టు, నేను రాయబోయే సమీక్ష ఈ జీవితపర్యంతమూ శ్రమించినా సాధ్యపడదు. As the writer is a very well read person, and at this juncture it is not possible for me to dwell on all things of her domain. అందుకనే, ఎన్నో విషయాలను అండర్లైన్ చేసుకుని రాయాలని ప్రగాఢంగా అనుకున్నా, నా పరిమితులకు లోబడే ఈ సమీక్షను కొనసాగిస్తున్నాను. “అంత కష్టపడి మిడిమిడి జ్ఞానంతో నీకు రాయవలసిన అవసరం ఏముందన్న” ప్రశ్నకు నా మటుకు నేను పెట్టుకున్న ‘పర్యావరణ పరిరక్షణ’ అన్న బాధ్యతే సమాధానమై నన్ను ప్రేరేపించింది. అంతేగాక, అడవిపట్ల నాకు ఉన్న మమకారం నన్ను ఈ సమీక్ష రాయమని మరింత ముందుకు నెట్టింది. నా దృష్టిలో, అడవి అంటే అమ్మ. అందరి ఆకలి తీర్చే కల్పతరువు. అడవి అంటే అలజడి. అంతటా పరుచుకున్న నిశ్శబ్దాన్ని అలవోకగా పగలగొట్టే ఒక బెబ్బులి కేక. అడవి అంటే ఆత్మ ధ్యానం. అలుపెరుగని అల్లకల్లోలంలోనూ అంతర్ముఖియై ఆలపించే మౌనగానం. పాటల పల్లకితో పరుగెత్తే పలుకు పిట్ట, ఊరే నీటి చెలమ, సుగంధం, రక్త చందనం. మనిషి మత్సరం తాకని మార్మికమైన ఋషి. అజరామరమైన గిరి పుత్రుడు ఏకలవ్యుడి కృషి. అడవి అంటే చైతన్యం! ప్రతిపగలూ ఎర్రపూత పురుడు పోసుకుని పులికి, మేకకూ ఒకేసారి పాలిచ్చి, పోషించి పరవశించే బాలింత. అడవి అంటే అందరినీ కడుపులో దాచుకునే అనంత దయారాశి, అమ్మోరు! అందుకనే ఈ సమీక్ష వ్రాయడం.

‘Anthropocene’ అని ఇంగ్లీషులో ఒక పదం ఉంది. వాతావరణం మరియు పర్యావరణాలపై మానవకార్యకలాపాల ప్రభావాన్ని చూపించే ప్రస్తుత భౌగోళికకాలం, అని మనం దాన్ని అనువదించుకోవచ్చు. ఇది Hallocene (హేలోసీన్ అంటే గ్రీకులో పూర్తిగా కొత్తదైన) తరువాతి కాలం. హేలోసీన్ దాదాపు భౌగోళిక యుగం ప్రారంభమైనప్పటినుంచి 11700 లక్షల సంవత్సరాల పూర్వం జరిగిన లాస్ట్ గ్లేషియల్ పీరియడ్ చివరి హిమనదీయ కాలమైతే, ఆంత్రోపోసీన్ ముఖ్యంగా 20, 21వ శతాబ్దంలో భూమిపై జరిగిన పరిణామాలకు మానవ వ్యవహారాలు ఎంతవరకు తమ ప్రభావాన్ని చూపిస్తాయో తెలియజేసే దారుణమైన పరిమిత కాలం. ఈ పదం యొక్క సృజన మొట్టమొదటిసారిగా 1980లో జరిగినా, వాతావరణ రసాయన శాస్త్రవేత్త పాల్ క్రుట్జన్ (Paul J Crutzen) 2000వ సంవత్సరంలో దీనిని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ఈ పదం నేటి పర్యావరణ సమావేశాలలో, చర్చలలో ఎంతగానో అంతర్భాగమై విశేషాన్ని సంతరించుకుంది. ఎందుకంటే, సృష్టిలో ఉన్న ఏ జంతుజాలమూ ధరిత్రికి చేయనంతటి వినాశనాన్ని, ఒక్క మానవుడే తన వంతు కృషిగా చేయగలుగుతున్నాడు. ‘హోమోసేపియన్’ అనబడే మనిషి, భూతలం మీద చేస్తున్న ఈ కరాళనృత్యానికి అంతు లేదు. దాదాపుగా 4.5 బిలియన్ సంవత్సరాల వయస్సుగల భూమిపై ఆధునిక మానవుడి అడుగుజాడలను ఒక రెండు లక్షల సంవత్సరాల క్రితంనుంచి మాత్రమే ట్రేస్ అవుట్ చేసుకోగలం. అటువంటిది, ఒక వంద సంవత్సరాల కాలంలోనే (Great Acceleration అని కూడా అంటారు) అత్యంత త్వరణంతో, వేగంతో, ఈ లేత నీలంరంగు గోళానికి చరమగీతం పాడే ముగింపు ప్రళయానికి, చావు వేగంతో మనిషి, బారలు బారలుగా అడుగులు వేసుకుపోతున్నాడు. అందువల్ల ఈ ఆంత్రోపోసీన్ కాలం అత్యంత పరిశీలనకు లోనవుతోంది.

అంతేకాక, Anthropocentric attitude అంటే, ‘భూమి, మనిషికోసం మాత్రమే సృష్టించబడిందన్న’ కొందరి మూర్ఖుల వాదనతో, ఎన్నో జీవజాతుల కోసమో పృధ్వి సృష్టించబడిందన్న మాట మనం విస్మరించడం జరుగుతోంది. కరోనాకాలం ఈ విషయాన్ని ఎంతగానో మనకు స్పష్టపరిచింది. మనిషి కదలికలే లేని ఆ సమయంలో, ప్రకృతి ఎంతగా పరవశించిందో, పక్షులు పచ్చటి కొమ్మల మీద ఎలా రెక్కలు విదిల్చి స్వేచ్ఛగా పాటలు పాడుకున్నాయో, డాల్ఫిన్లు తీరందాకా వచ్చి సంతోషంతో నృత్యాలెలా చేశాయో, మనమందరం మన కళ్ళారా చూసాం. అటువంటి పుడమితల్లి, నేడు ఇలా గ్లోబల్ వార్మింగ్‌తో, అకాలవర్షాలతో, ఉప్పెనలతో, భూగర్భజలాలు అడుగంటిపోవడంతో, నదీనదాల దిశలు మారిపోవడంతో, వాతావరణంలోని అనూహ్యమైన మార్పులతో అతలాకుతలమై పుచ్చిపోవడానికి కారణం మనిషి! అన్ని మృగాలకన్నా అత్యంత హేయమైన మనిషి అనే మృగం యొక్క ప్రత్యక్ష, పరోక్ష చర్యాఫలితమే నేటి ఈ అసమతుల్యానికి కారణం. వీణావాణి తన ప్రతి వ్యాసంలోనూ ఈ విచారాన్నే వ్యక్తపరిచారు. ఒక్కొక్క వ్యాసాన్నీ చదువుతున్నప్పుడు పర్యావరణంపట్ల, ప్రకృతిపట్ల, అడవిపట్ల ఆమె అలవికాని అనురాగం, ప్రేమ అందుకే మనకు ద్యోతకమవుతాయి. ఆమె ఆర్తి కొన్నిచోట్ల కంటతడి పెట్టిస్తే కొన్నిచోట్ల క్రోధావేశాలను కలిగిస్తుంది.

ఇప్పుడు ‘Ecocide’ అంటే ఏమిటో కూడా తెలియజేయవలసిన అవసరం ఉన్నది. మానవకార్యకలాపాలవల్ల సహజ పర్యావరణానికి జరుగుతున్న తీవ్రవిధ్వంసాన్ని ఇలా అంటారు. 2017లో దార్శనిక UK న్యాయవాది, దివంగత పాల్ హిగ్గిన్స్, పర్యావరణ కార్యకర్త జోజో మెహతా ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. విశ్వవ్యాప్తంగా గుర్తించబడిన అంతర్జాతీయ నేరం కానప్పటికీ, పర్యావరణ విధ్వంసాన్ని చట్టబద్ధంగా నిర్వచించి, Genocide(మారణహోమం), war crimes(యుద్ధ నేరాలు) లాగ ఒక అంతర్జాతీయనేరంగా గుర్తించి, ‘stop ecocide’ ప్రచారాన్ని లాభాపేక్షలేని తమ సంస్థ ద్వారా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అధికార పరిధిలోకి చేర్చడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎకోసైడ్‌కు ఉదాహరణలలో భారీ అటవీ నిర్మూలన కూడా నిస్సంశయంగా ఒకటి. ‘ధరణీరుహ’లో ఏ వివాదాలలోకి వెళ్ళకుండా ఈ నినాదాన్నే వైవిధ్యంగా ప్రతి పుటలోనూ వీణావాణి ప్రస్ఫుటీకరిస్తుంది. అందుకు ఈ పై రెండు విషయాల ప్రస్తావన ఇక్కడ చేయడం జరిగింది. Not only that she reiterates the ‘Kincentric Ecology’ against ‘Self-centric Ecology’. The Kincentric is rooted in indigenous worldviews, where as the other one aligns more with traditional anthropocentric viewpoints. ఆమె ప్రతి పేజీలోనూ స్వీయ-కేంద్రీకృత జీవావరణశాస్త్రానికి వ్యతిరేకంగా కిన్సెంట్రిక్ జీవావరణ శాస్త్రాన్ని ప్రతిపాదించింది. కిన్సెంట్రిక్ జీవావరణ శాస్త్రం, ప్రకృతి-అన్ని జీవరాశులకు నడుమ పరస్పరాధారిత ప్రాంతీయ ప్రపంచ దృష్టికోణాన్ని పంచి పెడితే, Self-centric అనేది, సంప్రదాయబద్ధంగా ‘మేదిని మానవుడొక్కడి కోసమే ఏర్పడిందన్న కేంద్రీకృత దృక్కోణంతో’ సమలేఖనం చేయబడింది. అదీ ఈ వ్యాససంపుటిని ఆమె రాయడానికి ముఖ్యోద్దేశ్యం అని నా ప్రగాఢ విశ్వాసం, నమ్మిక.

ఈ సంపుటి ఎంతో విజ్ఞానదాయకం. చదువుతున్న కొద్దీ చవులూరిస్తూ పాఠకుడిని అడవికి, అవనికి అట్టే కట్టిపెట్టేసి ఉంచుతుంది. ఈ వ్యాసాలన్నింటినీ చర్చించడం మొత్తం భూగోళాన్ని తలకెత్తుకుని మోసుకోవడం అంత కష్టసాధ్యమైన పని గనుక, కొన్నింటిని మాత్రమే చర్చించి ముగింపుకు ప్రస్థానం చేస్తాను.

‘అక్కర్లేని మొక్కలు’ చదువుతున్నప్పుడు, ఈ నడుమనే ఒక ప్రముఖ వార్తాపత్రిక, తమ స్పెషల్ ఎడిషన్ కథనంలో, కలుపు మొక్కల్లో ఉన్న పోషకపదార్థాలను గుర్తించి తమ ఆహారపుటలవాట్లలో చేర్చుకున్న గ్రామీణజీవితాన్ని తెలియజేసిన సంగతి స్ఫురణకు వచ్చింది. పనికిరాదనుకుని, మనం వేసుకున్న మొక్కకు అది నష్టాన్ని కలిగిస్తుందని, పీకి అవతల పారేస్తున్నాంగానీ, వాటి పోషకాల విలువలు తెలుసుకున్నప్పుడు బహుశా మనం ఆశ్చర్యపోక తప్పదు. ఈ విషయంలో, నేను ఎప్పుడో చదివిన ఒక వ్యాసమూ గుర్తుకు వచ్చింది. ఒక పూలతోటలోకి ప్రవేశించిన గోరాగారు పూలమొక్కలను పీకేస్తూ, కాయగూరల మొక్కలను నాటడం గుర్తుకు వచ్చింది. ‘ఎందుకిలాంటి పిచ్చి పని చేస్తున్నారని’ అతడ్ని ప్రశ్నిస్తే, ‘ఈ పనికిమాలిన పూలవల్ల కొందరికే అవసరం రావచ్చు కానీ, కాయగూరలు పళ్ళవల్ల ఎందరి కడుపులో మనం నింపవచ్చని’ ఆయన జవాబిచ్చారని గుర్తు. ఇది ‘పురస్థాపనమో’, ‘వరస్థాపనమో’ రచయిత్రే తెలియజేయాలి. అలాగే, ‘మండూకశోకం’ వ్యాసం చదువుతున్నప్పుడు, మా సీనియర్ మిత్రుడు అలాగే ఒక వార్తాపత్రికలో అండమాన్-నికోబార్ దీవులలో ఒక కప్ప జాతి అంతరించిపోవడం గురించి రాసిన వ్యాసమూ మతికి వచ్చాయి. ఆ సీనియర్ మిత్రుడికి ‘కప్పకాళ్ళు’ అంటే గొప్ప ప్రీతి. అతను కొచ్చిన్ (Kochi) పోస్టింగ్‌లో ఉన్నప్పుడు ఈ కప్పకాళ్ళ వంటకాన్ని ఒక మలయాళీ ముసలావిడ ప్రత్యేకంగా వండి పెడుతుంటే తినేవాడట (now it is banned). నేను ఈ విషయం గుర్తుకొచ్చి మరికొంత పరిశోధన చేస్తే, ఏటా కొన్ని కోట్ల టన్నుల కప్పకాళ్ళు యూరప్ దేశాలకు ఎగుమతి అవుతాయని తెలిసింది. కప్ప చర్మం పలుచగా ఉండటంవల్ల వాడే మసాలా దినుసులు, వంటద్రవ్యాల రుచి పూర్తిగా మాంసానికి పట్టి అత్యంత రుచికరంగా ఉంటాయట. ఒక్క సంవత్సరకాలంలోనే ఫ్రాన్స్‌లో ఎన్నో టన్నులు ‘గుటకాయ స్వాహా’ అయ్యాయన్న వార్త గుండెను కలచివేసింది. అలాగే, ఒక్కొక్క వ్యాసం చదువుతున్నప్పుడు మిన్నంటిన తరుఘోషలు ఘొల్లుమంటూ వినబడ్డాయి. చెట్లు ‘జీవన విశ్వవిద్యాలయాలని’, అడవికి చెట్టు వెన్నెముకలాంటిదని తెలిసినా, ఎన్నో ‘చిప్కో’ ఉద్యమాలు వచ్చినా, చెట్లు కొట్టడంవల్ల అటవీ అధికారులు తమ జీతం నుండి ఆ మూల్యాన్ని చెల్లించవలసి వస్తుందని తెలుసుకున్నా, మనం మారం! మన ఆలోచనా విధానమూ మారదు! అలాగే, వేటాడటంకన్నా ఎక్కువ నష్టం వాటి ఆవాసాలను ధ్వంసం చేయడంవల్ల కలుగుతుందని తెలిసినా మనకు గుండె కరగదు. అది పిచ్చుకల హననమైనా, పిల్లి జాతులు అంతరించిపోవడమైనా మనం ఏమాత్రం పరిగణలోకి తీసుకోం! కానీ వృత్తి, ప్రవృత్తుల రీత్యా, అలాగే ఒక స్త్రీ మూర్తి కావడంవల్ల, ఒక తత్త్వవేత్త అవడంవల్ల కూడా ధరణీరుహలో వీణావాణి ఈ తాపత్రయాన్ని తన తలకెత్తుకుంది. అదెంతో ప్రశంసించాల్సిన విషయం.


పుస్తకం పొడవునా, అడుగడుగునా ఖండచక్కెర పలుకులలాంటి కవితాపంక్తులు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. “అబ్బ. ఇది ఎంతో బాగుంది? దీనిని నేను తప్పక సమీక్షలో ప్రస్తుతించాలి.” అని నోట్ చేసుకునే లోపల, మరుసటి పేరాలో మరిన్ని లైన్లు, మనల్ని ముగ్ధమనోహరంగా, మరి మా సంగతేంటంటూ అడిగి బుంగమూతి పెట్టుకు అలిగి కూర్చుంటాయి. పర్యావరణం, ప్రకృతే కాకుండా ఈ వ్యాస సంపుటాలలో కొన్ని చారిత్రక శిలాశాసనాలపై వ్యాఖ్యలు, పురాణాది గ్రంథాలలోని శ్లోకాలు, పాఠాలు, సంధర్భానుసారంగా ఆంగ్ల కవితలు, జన్యుశాస్త్ర వివరాలు, జాతివివక్షతా బేధాలు (సారా వాట్ మాన్ వివరణ), కొన్ని ఆచార వ్యవహారాలు, అడవికి పంపే పండగ, ఎద్దుకు సారాయి తాగించడం (నా మట్టుకు నాకు గుర్రాలకు రమ్ తాగించడంవరకు మాత్రమే తెలుసు), రాజకీయ పరిమాణాలు (మన్యం తిరుగుబాటు) కూడా ఇతోధికంగా పొందుపరచబడి ఉన్నాయి.

అంతలో ఆమె తాత్వికత కూడా మనల్ని కొంత తన్మయత్వంలోకి తోస్తుంది. ‘నాకు గాలిలో ఎగురుతున్న సీతాకోకచిలుక, ఎండకు మెరుస్తున్న గులకరాయి ఒక్కలాగే కనిపిస్తున్నాయి’ లాంటి ఎమర్సన్, ‘నేచర్’ పుస్తకం నుండి ‘అతీతవాద/పారమార్థికవాద’ లేదా ‘తారకం’ ఆధారంగా ఊపిరిపోసుకున్న వాక్యాలూ పలకరిస్తాయి. ‘మానవాళికి ఏమీ తెలియదన్న ఒక్క విషయమే ఆయన నిరూపించదలచుకున్న పరమసత్యం’లాంటి తాత్వికసందేశాన్ని ఈ సంపుటి అలవోకగా ధారపోస్తుంది. అవును, సోదరి వీణావాణితో నేను వ్యక్తిగతంగా కలిసి చర్చించిన రెండు మూడు సందర్భాలలోనూ, ఫోనులోనూ నాకు ఇదే తెలియవచ్చింది. ‘ఫిలాసఫీ’అనేది ఆమె ‘ఫిలాసఫీ’గా మారిపోవడం. నిజమే, ఆమె ఒక తత్త్వవేత్త కనుకనే, తరూలతల తలపుల తలపులకు తన తాపత్రయాన్నీ జోడించి, తానూ తపించి, తపించి తారతమ్యాలను తొలగించి ఈ వ్యాససంపుటిని వెలువరించగలిగింది. అందుకే పుస్తకమంతా ఆమె యొక్క అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది.

ఈ వాక్యాలను చూడండి, “ప్రతి జన్మా వారి కర్మలతో లభిస్తుందనుకున్నట్లయితే, ఏ కర్మ చేస్తే నేను ఈ జన్మని ఎత్తగలను? నాకు చెప్పండి. ఏ కర్మ చేయడంవల్ల నేను మళ్ళీ చెట్టును అవుతాను? నా ముందు ఎగురుతున్న సీతాకోకచిలుకను అవుతాను? బాలకృష్ణుడు రోలుతో పడగొట్టిన రెండు మద్దిచెట్లు ఇద్దరు యక్షులుగా బయటపడ్డట్టు నా పక్కనే ఉన్న ఈ మద్దిచెట్టు ఎవరో ఒకరా? ప్రేమగా సాకుకుంటున్న నా కుండీలోని మొక్కలన్నీ నా పిల్లలేనా? అవి నాకు మళ్ళీ జన్మలో తల్లవుతాయా? ఈ జన్మల పురావృతవలయంనుండి నేను విడిపోలేనా? నేను ఎందుకు మనిషిగా పుట్టాలి. ఇది చెట్టుగానే ఎందుకు పుట్టాలి?” (పేజీ 166) ఈ వాక్యాలు చదివిన తర్వాత ఆమె మానవనిర్మితమైన సరిహద్దురేఖలను విస్మరించి మరో మహోదయంవైపు, ప్రకృతి మనోసీమలోకి అడుగిడడమే ధ్యేయంగా, మళ్ళీ ప్రకృతిలో తనను తాను మమేకం చేసుకోవడమే ఆశయంగా, బహుశా ఆమె కూడా అమ్మ కావడం వల్ల, అవని తల్లిని బిడ్డగా అక్కున చేర్చుకునో లేదూ, అవని తల్లి ఒడిలోకి బిడ్డగా చేరడమే ఆమె ప్రస్థానంగా, ఆమె ఒక అనంతచైతన్య జీవనప్రవాహంలో తనను తాను దర్శిస్తూ తిరిగి, తిరిగి పరిపూర్ణంగా ఎప్పుడూ కలిసే ఉన్నా, కలవాలన్న పెనుగులాటతో, వెదుకులాటతో అత్యంత జీవకారుణ్యంతో ఈ వ్యాససంపుటిని రచించిందని నాకనిపించింది. “నేను ఆ అదృశ్య హస్తవిన్యాసాన్ని గమనించడానికి ఉవ్విళ్ళూరుతుంటాను. నాకు నేను ఆశ్చర్యపోతుంటాను. ఎన్ని నిమిషాలో, అటువంటి ఆశ్చర్యసముద్రంలో మునకలేస్తూ గడిపేస్తుంటాను. ఆ భావంలో నాకు ఒంటరితనం తెలియదు. ఆ స్పృహలో నాకు భయం తెలియలేదు” ఇదంతా ఒక విశ్వాత్మలో విలీనం అయ్యే మహోన్నతమైన సన్నిధానం కాదా?. ఇరుకు గదిలో ఇమడకూడని విశాలమైన అడవిని బంధించిన కురచ వలను ఛేదించి విశాలవిశ్వమంతా పరచడమే కదా? ఒక ‘unification with oneness’ అని ఈ పుస్తకపు పాటర్న్ పరిశీలించిన తర్వాత నేను నిర్ధారణకు వచ్చాను.

మనోస్థిరతకోసమే ఋషులు వనవాసం చేసి ఉంటారంటారు వీణావాణి. మనోస్థిరత కోసమే కాకుండా, మానవాళి సుస్థిరత కోసం కూడా అడవిని మనం కాపాడుకోవాలి. అది ఒక పరస్పరాధారిత వ్యవస్థ. అది ఒక పూర్ణత. మనలోనూ ఒక అడవి ఉంటుంది. దానిలో మనం క్రూరమృగాలనే పెంచి పోషిస్తామా, సాధుజంతువులను కూడా తిరగనిస్తామా అన్న సంతులనం మన చేతులలోనే ఉంటుంది. అడవి ఎప్పుడూ లాలిస్తుంది, పాలిస్తుంది, సవాలు విసురుతుంది, ఒక్కొక్కసారి శాసిస్తుంది. కన్నెర్ర చేస్తే బూడిదా చేస్తుంది. అందుకే అడవి అమ్మోరు! ఇలాంటి అడవిని పూజించాలనో, కాపాడుకోవాలనో, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనో స్పృహను కలిగించే పుస్తకాలు మనం మరిన్ని చదవవలసిన అవసరం నేడు ఉన్నది.

‘ధరణీరుహ’లాంటి పుస్తకాలను మనం ఎక్కువగా చదవాలని ఎందుకు చెబుతున్నానంటే, ఎవరో ఒక పదహారేళ్ళ పిల్ల (గ్రేటా గుటెన్బర్గ్) తన గొంతు చించుకుని అంతర్జాతీయ వేదికపై “మా భవిష్యత్తును మీరెందుకు భస్మీపటలం చేస్తున్నారని?” ప్రశ్నిస్తే, అది ప్రపంచాధినేతలకు ఒక బధిరశంఖారావమైంది కనుక. ఆ నేరంలో మనందరం భాగస్వామ్యులం గనుక! ఇప్పటికైనా మించిపోయింది లేదు. పదండి. అడవిలోకి వెళ్లి ఆ ఆత్మలో లీనమైపోతూ, ఆకులో-ఆకుగా, పువ్వులో-పువ్వుగా, అత్యంతసరళంగా, సహజంగా జరగవలసిన ఒక సంతులనయాగంలో మనమూ సంతోషంగా భాగస్వామ్యం తీసుకుందాం. ఏదైనా ఇప్పటికిప్పుడే కావాలి, ఇప్పటికిప్పుడే నాటాలి, ఇప్పుడే పుష్పించాలి, పండాలి, కోసేయాలి, తినేయాలి, నాశనం చేయాలి. పీకవతల పారేయాలి. మరింత ప్రవర్ధనం చెందిన ఇంకో ప్రజాతిని వాడాలన్న పిచ్చితనం మానేద్దాం. ఎంతో నెమ్మదిగా రెక్కలు విచ్చుకుంటున్న పువ్వు సౌకుమార్యాన్ని, సౌందర్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనపైనే ఉందని గుర్తిద్దాం. కనీసం ఈ వ్యాససంపుటి చదివినందుకైనా రెండో, మూడో, నాలుగో చెట్లు నాటడం మన కనీసకర్తవ్యంగా అనుకుందాం. మితిమీరిన పారిశ్రామిక కాలుష్యప్రాంతాల్లో తప్పక గుబురుగా ‘మియావాకి’ ఫారెస్ట్‌లను కచ్చితంగా పెంచాలని ప్రభుత్వంచేత ఉత్తర్వులు జారీ చేయిద్దాం. ఉట్టి పుణ్యానికి ఏ మొక్కనో, పొదనో పీకి, తొక్కి అవతల పారేసే దుశ్చర్యలూ మానుకుందాం.

ఇంత గొప్ప వ్యాససంపుటిని వెలువరించిన వీణావాణి అభినందనీయురాలు. ఈ పుస్తకంలో కనీసం ఒక్క ఖండికనైనా పాఠంగా రెండు తెలుగు ప్రభుత్వాలలో ఎవరో ఒకరు కనీసం నాన్-డీటెయిల్డ్ పాఠ్యాంశాలుగా పొందుపరిస్తే, విద్యార్థులకు పర్యావరణ స్పృహతో పాటుగా అడగకుండానే పరమాన్నంలాంటి కవిత్వపు ప్రసాదం లభించగలదు. వీణవాణి సంకల్పమూ సిద్ధిస్తుంది. ఇటువంటి మరిన్ని వ్యాససంపుటులు ఆమె వెలువరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ… స్వస్తి!