భైరప్ప హిందుత్వవాదం

కన్నడ రచయిత ఎస్.ఎల్. భైరప్ప చారిత్రకత, వాస్తవికత, ప్రగతిశీలత, కుల నిర్మూలన, స్త్రీ పక్షపాతంవంటి ఆధునిక ఆలోచనలకు సృజనాత్మక రూపం ఇచ్చిన ప్రగతిశీల రచయితగా ప్రసిద్ధుడు. అలాగే పురాణాలకు వాస్తవిక-చారిత్రక దృష్టితో ఆధునికరూపాన్ని ఇచ్చినవాడుగా సుపరిచితుడు. ఆయనే అనంతర కాలంలో వివాదాస్పద హిందుత్వవాదిగా అవతరించాడు. హిందూ రైటిస్టు భావాలకు కూడా చారిత్రక నవలారూపం ఇచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరు భైరప్పలు కనబడతారు: ఒకరు లెఫ్ట్-లీనింగ్, మరొకరు రైటిస్ట్ హిందుత్వవాది.

తెలుగు రచయితలు చలం, గోపీచంద్‌వంటివారు క్రమేపి ఆధ్యాత్మికత వైపు, ఆశ్రమజీవనం వైపు వెళ్లారు. కానీ వారి ఆధ్యాత్మిక రచనలు వివాదాస్పదం కాలేదు. అయితే భైరప్పలో వచ్చిన మార్పు ఆధ్యాత్మికమైనది కాదు, మతపరమైనది కాదు, రాజకీయపరమైనది; చారిత్రక వాస్తవికతను అర్థం చేసుకోవడంలో వచ్చిన మౌలిక మార్పు. ‘ఆవరణ’ నవల దీనికి స్పష్టమైన ఉదాహరణ.

‘ఆవరణ’ నవలలో భాగంగా ఇవ్వబడిన చరిత్రకారుల లిస్టు చూస్తే భైరప్ప పూర్తిగా వలసవాద పక్షపాత చరిత్రకారులు, హిందుత్వ చరిత్రకారుల పైన ఆధారపడ్డారని తెలుస్తుంది. ఆయన పూర్తిగా హిందూ రైటిస్టు ధోరణి వైపు మొగ్గుచూపటం అర్థం అవుతుంది. ఇదిగో ఆ లిస్టు.

  1. జదునాథ్ సర్కార్. మొఘల్, మరాఠా చరిత్రలను మూలాల ఆధారంగా విమర్శనాత్మకంగా అధ్యయనం చేశారు.అయినప్పటికీ ఆయన బ్రిటిష్ పద్దతులను అనుసరించారు. Apolitical/Centrist (లెఫ్ట్/రైట్ ప్రభావం తక్కువ) ముస్లిం రాజుల మతపరమైన, కరడుకట్టిన స్వభావాన్ని (religious fanaticism) గురించి ఆయన రాసిన దానిని ఆధునిక లౌకికవాద (Secular) చరిత్రకారులు విమర్శించారు. కొందరు ‘మతతత్త్వవాది’ అని ఆరోపించారు.
  2. ఆర్.సి. మజుందార్. జాతీయవాద (Nationalist) సిద్ధాంతం ఆయనది. భారతదేశ చరిత్రను భారతీయ దృక్పథంనుండి, దేశగౌరవాన్నీ నాగరికత యొక్క గొప్పతనాన్నీ నొక్కిచెబుతూ రాశారు. Right-Leaning/Nationalist. ఆయన హిందూ జాతీయవాద దృష్టితో చరిత్రను రాశారని, ముస్లిం రాజుల ఆక్రమణల విధ్వంసాన్ని అతిగా చూపారని ఆరోపణలు వచ్చాయి.
  3. సీతారాం గోయెల్. హిందూ పునరుద్ధరణ సాంస్కృతిక జాతీయవాదం (Hindu Revisionist/Cultural Nationalist). మధ్యయుగ భారతదేశంలో ఇస్లామిక్ పాలన కింద జరిగిన హిందూ దేవాలయాల విధ్వంసం గురించి రాశారు. తీవ్ర హిందూ జాతీయ వాది. ప్రధానంగా ద్వేషాన్ని రెచ్చగొట్టడం (Hate-mongering), చరిత్రను మతతత్త్వకోణంలో (Communalizing history) మార్చడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.
  4. అరుణ్ శౌరి. లెఫ్ట్-లీనింగ్ చరిత్రకారులు భారతదేశ చరిత్రను వక్రీకరించారని, ఇస్లామిక్ పాలన యొక్క క్రూరత్వాన్ని తగ్గించి చూపారని ఆరోపించారు. Right-Leaning/Anti-Establishment ఆయన రచనలు ప్రతిపక్షతత్త్వాన్ని (పొలెమికల్) కలిగి ఉంటాయని, అధికారిక చరిత్రకారులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటాయని లెఫ్ట్-లీనింగ్ చరిత్రకారులు ఆరోపించారు.
  5. సర్ హెచ్.ఎం. ఇలియట్ మరియు జాన్ డౌసన్. వలసవాద చరిత్ర ధోరణి వారిది (Colonial School). ముస్లిం పాలన ఎంత దారుణంగా ఉండేదో చూపించడం ద్వారా బ్రిటీష్ పాలన శ్రేష్ఠతను నిరూపించడం వీరి ఉద్దేశం. Colonial/Pro-Imperial “విభజించి పాలించు” (Divide and Rule) సిద్ధాంతానికి చరిత్రను ఉపయోగించడం, ముస్లిం రాజుల దారుణాలను మాత్రమే ఎత్తిచూపారని విమర్శిస్తారు.

‘ఆవరణ’ నవలలోని నరసింహ గౌడ గ్రంథాలయంలోని పుస్తకాలు స్థూలంగా మూడు వర్గాలనుండి ఉన్నాయి:
* వలసరాజ్యాల దృక్పథం (Colonial): ఇలియట్ & డౌసన్ వంటివారు.
* హిందూ జాతీయవాద దృక్పథం (Hindu Nationalist/Revisionist): సీతారాం గోయెల్, అరుణ్ శౌరి, ఆర్.సి. మజుందార్ వంటివారు. జదునాథ్ సర్కార్‌ వంటి చరిత్రకారుల నుంచి కూడా కేవలం తన వాదానికి అనుకూలమైన ముస్లిం వ్యతిరేక సమాచారాన్ని మాత్రమే స్వీకరించారు. ఈ పుస్తకంలో డేవిడ్ ప్రాలేలాంటి ఫక్తు హిందూ రైటిస్టుల పేర్లు ఎన్నో కనబడతాయి.

నరసింహ గౌడ పరిశోధన యొక్క ముఖ్యోద్దేశం, ఇస్లామిక్ రాజుల మతపరమైన ఉగ్రవాదాన్ని నిరూపించడం; లెఫ్ట్-లీనింగ్ (సాధారణంగా మార్క్సిస్ట్) చరిత్రకారుల సిద్ధాంతాలను తిరస్కరించడం. అందువల్ల, ఆయన సేకరించిన గ్రంథాలలో కుడికి-దగ్గరి (Right-Leaning) దృక్పథాన్ని సమర్థించే చరిత్రకారుల రచనలు అధికంగా ఉన్నాయి. అలాగే బ్రిటిష్ సామ్రాజ్య వాదాన్ని బలపరచటం కోసం వారికంటే పూర్వం ఉన్న ముస్లింలని దుర్మార్గంగా చూపే సామ్రాజ్యవాద చరిత్రకారుల రచనలు కూడా ఆ లిస్టులో ఉన్నాయి. దీనివల్ల హిందూ జాతీయవాద చరిత్ర దృక్పథం క్రైస్తవ వలసవాదం యొక్క కొనసాగింపు అని తెలుస్తుంది. బ్రిటిష్ కాలపు శృంగేరి పీఠాధిపతి చంద్రశేఖర భారతీ స్వామి చెప్పింది కూడా ఇదే.

‘ఆవరణ’ నవలలో నరసింహ గౌడ ‘విస్మృత సామ్రాజ్యం’ (‘ఏ ఫర్గాటెన్‌ ఎంపైర్’) పుస్తకానికి చాలా ప్రాధాన్యం ఇస్తాడు నోట్స్ కూడా రాసుకుంటాడు. అయితే ఆ పుస్తకంలోని కొన్ని అంశాలు ఒకే మతాన్ని ఒకే జాతిని ఏకపక్షంగా సమర్ధించడానికి పనికిరావు అన్న సంగతిని భైరప్ప విస్మరించారు. ముస్లిం రాజులు స్త్రీలు పిల్లల పట్ల కనికరం కలిగి ఉండరని, కానీ హిందూ రాజులు కరుణ కలిగి ఉంటారని ఆయన వాదిస్తాడు. కానీ ఈ వాదనకి భిన్నమైన విషయాలు సంఘటనలు కూడా యీ పుస్తకంలో ఉన్నాయి. నిజానికి హిందూమతం సద్గుణాల నిలయం అని భైరప్ప వాదన. హిందూమతం స్త్రీల పట్ల గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ వాక్స్వాతంత్ర్యంలాంటి మంచి విలువల్ని కలిగి ఉంటుందని భైరప్ప వాదిస్తాడు. ఇస్లాం ఇటువంటి విలువలను ఏమాత్రం కలిగి ఉండదని ఆయన అభిప్రాయం. అందువల్ల ఆ రెండు సంస్కృతులను, మతాలని పరస్పర విరుద్ధమైనవిగా ‘ఆవరణ’ నవలలో చిత్రిస్తాడు. అయితే హిందూ పురాణాలలో, ఇతిహాసాలలో ఉన్న అసమానత్వం, స్త్రీలపట్ల వివక్షవంటి వాటి గురించి నవలలు రాయడం ద్వారానే ఆయన ప్రసిద్ధుడయ్యాడు. అలాగే ఆయన నవలలలో కులవివక్ష గురించిన ప్రసక్తి కూడా ఉంది. అయితే హిందూమతం మార్పుకు గురవుతూ రాగల మతం అని ఆయన భావించాడు. ఇస్లాంలో అలాంటి స్వభావం లేదని ఆయన అభిప్రాయం.

ఎదురు తిరిగిన చరిత్ర

‘ఏ ఫర్గాటెన్ ఎంపైర్’ అనే చరిత్ర గ్రంథం ప్రకారం విజయనగర సామ్రాజ్యం, దాని చుట్టూ ఉన్న ముస్లిం రాజ్యాల చరిత్రలో దౌర్జన్యం, కరుణ రెండూ స్పష్టంగా కనిపిస్తాయి. యుద్దాలలో లేదా వారసత్వ వివాదాల్లో జరిగే ఈ సంఘటనలను మూడు ప్రధానాంశాలలో ఇక్కడ సంక్షిప్తంగా పొందుపరచడం జరిగింది.

1. స్త్రీలను బలవంతంగా బందీలుగా బానిసలుగా మార్చడం, అంతఃపురంలోకి తీసుకోవటం.

ముస్లిం పాలకుల దండయాత్రలో స్త్రీలను పెద్ద ఎత్తున బందీలుగా పట్టుకున్నారు. ఉదాహరణకు, మహమ్మద్ షా బహమని క్రీశ 1366 యుద్ధం తర్వాత 70 వేలమంది ఖైదీలతో తిరిగి వెళ్ళాడు. వీరిలో ఎక్కువమంది స్త్రీలే. గోల్కొండ పాలకుడైన సుల్తాన్‌ కులీ కుతుబ్ షా కామంపేటను స్వాధీనం చేసుకున్నప్పుడు, సీతాపతి కుటుంబానికి చెందిన స్త్రీలను తన అంతఃపురంలోకి తీసుకున్నాడు. హిందూరాజులు కూడా ఈ పద్ధతి పాటించారు. విజయనగర రాజు దేవరాయ క్రీ. శ. 1406 లో ముద్కల్ (ముద్గల్) పట్టణంలో ఉన్న ఒక రైతు యొక్క అందమైన కూతురు పెర్తాళ్ ను బలవంతంగా తన అధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించాడు. అలాగే శ్రీకృష్ణదేవరాయలు ఒరిస్సా రాజుపై యుద్ధం చేసినప్పుడు, ఆ రాజు యొక్క మేనత్తను, భార్యను రాజకీయ బందీలుగా చేసుకున్నారు. 16వ శతాబ్దంలోని కొన్ని యుద్ధ సందర్భాలలో హిందూ సైనికులు ముస్లిం స్త్రీలను అవమానించడం మసీదులను ధ్వంసం చేయడంలాంటి దారుణచర్యలకు పాల్పడ్డారు.

దీనికి విరుద్ధంగా శ్రీకృష్ణదేవరాయలు రాయచూరు యుద్ధం తర్వాత పారిపోతున్న పౌరులు అందరినీ (మతాలతో సంబంధం లేకుండా) పారిపోవద్దని వారి ఆస్తులకు రక్షణ ఉంటుందని, లేని వారికి కూడా సౌకర్యాలు కల్పించబడతాయని హామీ ఇస్తూ, దోపిడీ సొమ్మును కూడా వెనక్కి ఇప్పిస్తూ దయ చూపిన సందర్భం కూడా ఉంది. అలాగే 1535 ప్రాంతంలో బీజాపూర్ సుల్తాన్ ఇబ్రహీం అదిల్షా తరపున అతని ముఖ్యమంత్రి అసద్ ఖాన్ ఆదోని ముట్టడి సమయంలో విజయనగర నాయకుడి కుటుంబానికి రక్షణ కల్పించి, వారి భార్యాపిల్లలను సురక్షితంగా విడుదల చేయడానికి సహాయం చేశారు.

2. సామూహిక ఆత్మహత్యలు, కుటుంబ కుట్రలు. శత్రువులకు చిక్కకుండా గౌరవాన్ని కాపాడుకోవడానికి హిందూ రాజులు తమ కుటుంబాలను తామే హత్య చేసుకోవడం లేదా సామూహిక ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది. క్రీ.శ. 1334 ప్రాంతంలో మహమ్మద్ తుగ్లక్ దండయాత్ర సమయంలో దేహోరావ్ (దేవరాయలు) తన 50 మందికి పైగా భార్యలు, కొడుకులు, కూతుళ్ళను తానే స్వయంగా చంపి చివరికి పోరాటానికి వెళ్ళాడు.

1330లో కంబిల (కంపిలి) రాజు తాను ఓడిపోవడం ఖాయమని తెలిసిన యుద్ధంలో వీరమరణాన్ని పొందే ముందు తన భార్యలను, మంత్రుల భార్యలతో సహా అగ్నిప్రవేశం చేయించాడు. ఆ స్త్రీలు శత్రువుల చేతికి చిక్కకుండా అగ్నిలో ఆహుతి అయిన తర్వాత, రాజు తన అనుచరులతో కలిసి యుద్ధానికి వెళ్లి, వీరమరణం పొందాడు. ఇలాంటి సంఘటనే ఆవరణలోని ‘అంతర్నవల’లో కనబడుతుంది.

విజయనగర సామ్రాజ్యం పతనమయ్యే సమయంలో క్రీ.శ. 1614లో వారసత్వ వివాదాలలో ఖైదీగా ఉన్న ఖైదీగా ఉన్న రాజు రంగ రాయలు/ చిక్క రాయలు తన భార్యను, ఇద్దరు కొడుకులను తానే చంపి తరువాత తన ఛాతీలో కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

3. నరబలులు. శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఒక పెద్ద నీటి చెరువు నిర్మాణం కోసం బ్రాహ్మణుల సలహా మేరకు విగ్రహాలను శాంతింప చేయడానికి 60 మంది తలలను బలిగా ఇచ్చారు. అంతేకాక, మతపరమైన ఉత్సవాల సమయంలో ప్రజలు భక్తి పారవశ్యంతో తమంతట తామే రథచక్రాల కింద పడి చనిపోయేవారు. హింసాత్మక మత ఆచారాలు ఉండేవి.

అలాగే ‘ఇతర మతంపట్ల అవమానకరంగా ప్రవర్తించటం, దాడులు చేయడం ముస్లింలూ చేశారు; హిందువులు కూడా చేశారు’ అని రాస్తాడు. 1565లో రామరాయలు అనే రాజు కొంతమంది ముస్లిం పాలకులకి మద్దతుగా జరిపిన దాడిలో ముస్లిం ప్రార్థనా స్థలాల పైన కూడా దాడులు జరిగాయి.

ఈ సంఘటనలు ఇంకా చరిత్ర పరిశోధన ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడే హిందూ-ముస్లిం రాజుల పరిపాలనలో ఉన్న విపరీతమైన క్రూరత్వం, మరోవైపు మానవత్వం, దయ కలగలిసిన రాజకీయ సంక్లిష్టమైన అంశాలను కూడా చరిత్రలో నమోదు చేశాయి. అందువల్ల గత సంఘటనలను ఏకపక్షంగా నిర్ణయించడం చాలా కష్టం. ఇది భైరప్ప తర్కానికి పెద్ద ఉపయోగకరం కాదు కదా?

భైరప్ప రచనలలో చారిత్రక వాస్తవికత

ఆయన అన్ని నవలలకూ చారిత్రక వాస్తవికతే ప్రధానం. మితిమీరిన వాస్తవికత, చారిత్రకత అనేవి భైరప్పలో ప్రధానంగా కనబడే లక్షణాలు.

పురాణాల భౌతిక వాస్తవీకరణ

ఆయన ఊహల్ని, మహిమల్ని, కథల్లోని పురాణ కథలను కూడా పూర్తిగా పరిహరిస్తాడు. పురాణాలను కూడా నేలమీదికి దించుతాడు. హనుమంతుడి సముద్రలంఘనాన్ని నాటుపడవలో ప్రయాణంగా మార్చి చిత్రిస్తాడు. రామాయణంపై ఆధారపడి ఆనంద నీలకంఠన్ రాసిన ‘అసుర’ నవలలో విమాన సాంకేతికత ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు చూపిస్తే, భైరప్ప పుష్పకవిమానం అనే ఆలోచననే పక్కన పెడతాడు. రామసేతు అనేదాన్ని ఒక సహజంగా ఉన్న రాళ్ల నిర్మాణంగానే నవలలో చూపిస్తాడు. స్థలకాల వాస్తవికత భైరప్పకు చాలా ప్రధానం. ఊహలు, కల్పనలు వాస్తవికతకు ఊడిగం చేసేటట్లు చేస్తాడు.

విశ్వనాథతో వైరుద్ధ్యం

తెలుగు రచయిత విశ్వనాథ సత్యనారాయణ శైలికి ఇది రూపపరంగా కూడా పూర్తి విరుద్ధమైన శైలి. విశ్వనాథ వాస్తవాన్ని కూడా పురాణంగా మారుస్తాడు; భైరప్ప పురాణాన్ని కూడా వాస్తవంగా మారుస్తాడు. విశ్వనాథ ‘వేయి పడగలు’ నవలలో పసిరిక అనే పాత్రను (మానవ-సర్ప లక్షణాల కలయిక, ప్రకృతితో మమేకమయ్యే జీవి) సృష్టిస్తాడు. ఇటువంటి అసాధారణ కల్పనలకు, ఊహలకు పురాణకథల్లో కూడా భైరప్ప స్థానం ఇవ్వడు.

బహుశా ఈ వాస్తవికత దృష్టికి వామపక్ష ప్రభావితులైన ప్రాగ్మాటిస్టు తెలుగువాళ్ళు ఎక్కువ ఆకర్షితులయ్యారు.

చారిత్రక వాస్తవికత తెలుగువాళ్ళ నేపథ్యం.

తెలుగువారు వైతాళికుడుగా గౌరవించే గురజాడ పురాణగాథలనే పిచ్చివిగా, హేతువిరుద్ధమైనవిగా అభివర్ణించారు.

కవుల కల్పన కలిమిలెన్నో
వన్నెచిన్నెలుగాంచు వస్తువు
లందు వెర్రి పురాణ గాథలు,
నమ్మజెల్లునె పండితుల్

అన్నారు గురజాడ. కొద్దిమంది మేధావులు ఈ వైఖరి పట్ల ఆందోళన చెందారు. అట్టివారిలో విమర్శకులు శెట్టి ఈశ్వరరావు ఒకరు.

‘కన్యాశుల్కం’ నాటకంలో కరటకశాస్త్రి శిష్యుడు శివపురాణ గాథపై ఆధారపడిన కుమారసంభవం కావ్యంపై చేసిన వ్యాఖ్యలను ఆయన విమర్శించారు. తన మిడిమిడి జ్ఞానంతో కాళిదాసు కవిత్వాన్ని తోసిపారేసి, పనికివచ్చేదొక్కటి మన పుస్తకాల్లో లేదని గురజాడ తీర్పు చెప్పినట్లుగా శెట్టి ఈశ్వరరావు పేర్కొన్నారు. ‘ఇంగ్లీషు విద్య మూలంగా జరిగిన భావమథనంలో, అమృతంతోపాటుగా హాలాహలమూ పుట్టింది; అంధవిశ్వాసాలతోపాటు మంచినీ తిరస్కరించడం జరిగింది’ అంటారు ఈశ్వరరావు. ఈ హాలాహలమే తెలుగువాళ్ళలో పెరిగిన కాల్పనికతా రాహిత్యం.

భైరప్పకు ఆధ్యాత్మికత ఎప్పుడూ ప్రధానం కాదు; చారిత్రకత దృష్టి, దానిపై ఆధారపడిన మానసిక విశ్లేషణ మాత్రమే ప్రధానమైనవి. స్థలకాలాలే ప్రధానమైనవి. ఆయన హిందుత్వవాద ప్రధానమైన రచనలలో కూడా ఇవే ప్రధానమైనవి. స్థలకాలాతీతం, అనంతంవంటి సంక్లిష్టమైన ఊహల మీద ఆధారపడిన విషయాల జోలికి, తాత్త్వికచర్చల జోలికి ఆయన వెళ్లడు. పైగా ఉపనిషత్తులు, వేదాలు చెప్పిన విషయాలను కూడా ఆయా పాత్రల మానసిక, భౌతికపరిస్థితుల విశ్లేషణకు పరిమితం చేస్తాడు భైరప్ప.
ఉపనిషత్ తత్త్వాన్ని కూడా భైరప్ప చారిత్రకమైనదిగా, స్థలకాలబద్ధమైనదిగా, మనస్తత్వ విశ్లేషణగా మారుస్తాడు. అంతేకానీ ఒక విశాలవిశ్వస్థాయిలో అన్వయించడు. అందుకే తర్వాత కాలంలో పూర్తి హిందుత్వవాదిగా మారగలిగాడు. దీనికి యు ఆర్ అనంతమూర్తి వైఖరి పూర్తిగా భిన్నమైనది. అనంతమూర్తి పాత్రల మనస్తత్త్వాలకి కాక మొత్తంగా విశ్వచలనానికి ఆధ్యాత్మికతని అన్వయిస్తాడు.

భైరప్ప రాసిన ఉత్తరకాండ నవలలో ఈ ప్రస్తావనలు చూడండి, అర్థమవుతుంది:

సీత జీవితంలో తాత్త్విక వారసత్వం, ఉపనిషత్తుల ప్రస్తావన నేపథ్యం

సీత తండ్రి, జనక మహారాజు, తత్త్వశాస్త్రం, చరిత్ర, పురాణాలపై లోతైన జ్ఞానం కలవారు. ఆయన వంశం మేధోపరమైన, ఆధ్యాత్మిక అన్వేషణలకు చాలా ప్రసిద్ధి చెందింది. పూర్వకాలంలో జనక మహారాజు ఆస్థానాన్ని గొప్ప ఋషి అయిన యాజ్ఞవల్క్యుడు సందర్శించిన సందర్భంలో జరిగిన సుదీర్ఘ ఆధ్యాత్మిక సభకు గుర్తుగా, సీత తండ్రి ప్రతి సంవత్సరం ఒక ఆధ్యాత్మిక సభను నిర్వహించేవారు.

ఈ సభల్లో తరచుగా బృహదారణ్యకోపనిషత్తు గురించి పదినుండి పదిహేనురోజులపాటు చర్చలు జరిగేవి. ఈ ఉపనిషత్తు, మహర్షి యాజ్ఞవల్క్యుడి లోతైన ఆలోచనలు, ధ్యానం యొక్క సారాంశం. సీత చిన్నతనంలో, ఈ తాత్త్విక చర్చలను ఒక మూలన కూర్చుని వినేది, అయితే వాటిలో చాలావరకు ఆమెకు అర్థమయ్యేవి కావు.

బృహదారణ్యకోపనిషత్తునుండి ముఖ్యమైన అంశాలు:

సీత తన జీవితంలో ఎదురైన ముఖ్యమైన సందర్భాల్లో, ముఖ్యంగా ఒంటరితనం, దుఃఖంలో ఉన్నప్పుడు, ఈ ఉపనిషత్తులోని అంశాలను గుర్తు చేసుకునేది. ఇది ఆమెకు జ్ఞానపు వనరుగా ఉపయోగపడింది.

* భయం యొక్క మూలం (Origin of Fear): రావణుడు బంధించినప్పుడు, సీత ఆత్మహత్యగురించి తీవ్రంగా ఆలోచించింది. ఆ సందర్భంలో, ఆమెకు భయం గురించి చెప్పే ఉపనిషద్వాక్యం గుర్తుకు వచ్చింది.  ఆ వాక్యం: “సోఽబిభేత్తస్మాదేకాకీ బిభేతి…”
భయం అనేది రెండవ అస్తిత్వం (other) నుండి పుడుతుంది. అంటే, ఆత్మ (నేను) ఒక్కటే ఉన్నప్పుడు భయం ఉండదు, మరొకటి ఉన్నప్పుడే పోల్చుకోవడం, నష్టపోతామనే భావన వచ్చి భయం మొదలవుతుంది. ఈ వాక్యాలు జనక మహారాజు-యాజ్ఞవల్క్య మహర్షిల మధ్య జరిగిన తాత్త్విక సంభాషణల సంకలనం.

* ప్రేమ స్వభావం (Nature of Love). తన భర్త రామచంద్రుడు తనను అనుమానించి విడిచిపెట్టిన తర్వాత, సీత మానవసంబంధాలు, ప్రేమ యొక్క నిజమైన స్వభావం గురించి తీవ్రంగా ఆలోచించింది. ఆ సమయంలో యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య మైత్రేయికి బోధించిన తత్త్వం ఆమెకు గుర్తుకు వచ్చింది. ఆ వాక్యం: “న వా అరే పత్యుః కామాయ పతిః ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతిః ప్రియో భవతి
న వా అరే జాయాయై కామాయ జాయా ప్రియా భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి…”
* భర్త భార్యకు, భార్య భర్తకు ప్రియమైనవారు కాదు, ఆత్మ (Self) కోసమే ఒకరికొకరు ప్రియమైనవారు అవుతారు.
ప్రేమ అనేది ఒకరి సొంత ఆత్మ – ఈగో యొక్క ప్రతిబింబం; అన్ని రకాల ప్రేమ, లోతుగా చూస్తే, స్వీయ-కేంద్రీకృతమైనది (self-centered).
* సంతోషానికి నిజమైన మూలం ఆత్మ ( నేను) మాత్రమే అని, వైవాహికబంధం లేదా పిల్లల ద్వారా లభించేది కాదని యాజ్ఞవల్క్యుడి బోధగా సీత అర్థం చేసుకుంది.
ఇక్కడ ఉపనిషత్ తత్త్వాన్ని భైరప్ప ఒక మనస్తత్త్వ విశ్లేషణగా మార్చాడు. అంతేకానీ నిర్గుణ పరబ్రహ్మ తత్త్వంగా కాదు. అంటే ఉపనిషత్ తత్త్వాన్ని స్థలకాలబద్దంగా, చారిత్రకంగా మార్చాడు. ఇది ఆయన మొత్తం చారిత్రక భౌతికవాద దృష్టిలో భాగం.
ఆశ్చర్యం ఏమిటంటే, ఆయనతో తీవ్రంగా ఘర్షణ పడిన యు.ఆర్. అనంతమూర్తి లెఫ్టిస్ట్‌గా ముద్రపడ్డాడు కానీ, అనంతమూర్తిలో భారతీయ ఆధ్యాత్మికత సారం దర్శనమిస్తుంది. భైరప్ప రాసిన ‘ఆవరణ’ అనే హిందుత్వ నవలలో సమకాలీన హిందూ ఆధ్యాత్మికత ప్రసక్తి కనపడదు. పైగా ఎక్కువమంది పాశ్చాత్య చరిత్రకారులు, కొద్దిమంది భారతీయ చరిత్రకారుల లిస్టు కనపడుతుంది. దానికి భిన్నంగా యు.ఆర్. అనంతమూర్తి ‘హిందుత్వ ఆర్ హింద్ స్వరాజ్’లో రమణ మహర్షి, వివేకానందస్వామివంటివారి ఆధ్యాత్మికానుభవాల ప్రసక్తి కనబడుతుంది.

భైరప్ప ఈ చారిత్రక దృష్టివల్లనే అటు లెఫ్టిస్టులు, ఇటు రైటిస్టుల ఆదరణ పొందారు. ఎందుకంటే లెఫ్టిస్టులు, రైటిస్టులు ఇద్దరూ చారిత్రక దృక్పథంపైనే ఆధారపడతారు. ఇద్దరూ చరిత్ర పురోగమనం, ఆధునికత, వాస్తవికతలను ఆరాధిస్తారు. ఇద్దరూ ఆధ్యాత్మికత, మతాలకంటే మతచరిత్ర, మతం యొక్క లౌకికపాత్ర గురించి ఆలోచిస్తారు.
చలం రమణ మహర్షిని ఆశ్రయించినట్లు, భైరప్ప ఎప్పుడూ శాంత రసాన్ని ఆశ్రయించలేదు. విశ్వనాథ సత్యనారాయణ కులవ్యవస్థని, పాత విశ్వాసాలని సమర్థించినా, భైరప్ప ఎప్పుడూ వాటిని సమర్థించలేదు. భైరప్ప హిందుత్వ దృక్పథం ఆధునికత, ప్రగతిశీలత అనే పునాదులపై నిలబడింది.

‘ఆవరణ’ నవలలో నరసింహ గౌడ అనే కులనిర్మూలన వాది పాత్ర ఉంటుంది. అయితే ఆయన ముస్లిం మతాంతరీకరణ ప్రమాదకరం అని భావిస్తాడు; కూతురు ముస్లింని పెళ్లి చేసుకోవడానికి వ్యతిరేకిస్తాడు. కారణం ఆధ్యాత్మికం కాదు, చారిత్రకం. చరిత్ర ప్రకారం ముస్లింలు విగ్రహ విధ్వంసకులు, స్త్రీ వ్యతిరేకులు, ప్రగతి వ్యతిరేకులు అని ఆయన దృఢ అభిప్రాయం.

పర్వ, ఉత్తరకాండ నవలలు పురాణ కథనాలని చరిత్రగా మారుస్తాయి. భైరప్ప ఆవరణ నవలలో వర్తమానాన్ని, ముస్లిం ఆక్రమణ చరిత్రను కలిపి కథ నిర్మిస్తాడు.

భైరప్ప హిందుత్వవాదిగా ఎలా మారారు?

ప్రగతిశీల మేధావుల ప్రశ్న ఏమిటంటే, భైరప్ప పూర్తిగా వ్యతిరేక దిశలోకి ఎలా ప్రయాణించాడు? ప్రగతిశీల రచయిత,పూర్తి ప్రగతి వ్యతిరేకిగా ఎలా పరిణమించాడు? అంతకు ముందులేని స్వార్థం, కీర్తికాంక్ష ఆయనలో ప్రవేశించాయా? కాదు. హిందుత్వవాదానికి బీజాలు ఆయన రచనలలో మొదటినుంచే ఉన్నాయి. వాస్తవికత, హేతువాదం, చారిత్రకత, ప్రగతిశీలత అనే పునాదులపైనే హిందుత్వం నిర్మించబడింది. వలస ఆధునికతనుంచే లెఫ్ట్, రైట్ భావాలు వృద్ధి చెందాయి.

చరిత్ర భావన పరిమితులు

రామ్ మనోహర్ లోహియా ‘చారిత్రక పురుషులకంటే పురాణ పురుషులు ప్రభావశీలులు’ అంటారు. భైరప్ప పురాణపురుషులను కూడా చారిత్రక పురుషులుగా దిగజార్చాడు, ఫలితంగా హిందుత్వంలో ముగిశాడు. చారిత్రక వాస్తవికతను ఆరాధించి, చారిత్రక ఉన్మాదంలోకి ప్రవేశించాడు.

చరిత్ర అనే కాన్సెప్ట్ నిరపేక్షమైనది కాదు. అది తృతీయ ప్రపంచదేశాల స్వతంత్ర ఊహలకి, కల్పనలకి సమాధి. దాని అనివార్య పర్యవసానం హిందుత్వం. స్థల-కాలాల గురించి భారతీయుల విశాల దృక్పథానికి ముగింపు; పాశ్చాత్య చారిత్రక దృక్పథం.

పురాణం వర్సెస్ చరిత్ర

గ్రీకు పురాణాలు చరిత్ర గర్భంలో కలిసిపోయాయి. కానీ భారతీయ పురాణాలు ప్రజల స్మృతిలో (Collective Memory) భద్రంగా ఉన్నాయి. ఎందుకంటే భారతీయ పురాణాలు మౌఖికంగా నిరంతరం వైవిధ్యభరితంగా నిర్వచించబడుతూ వస్తున్నాయి. ఆధునికత, దానిలో ప్రధాన భాగమైన చారిత్రక దృక్పథం సాధారణీకరణను, ఏకీకరణను కోరుకుంటుంది. కానీ పురాణం మూస ధోరణిని వ్యతిరేకిస్తుంది.

నిజానికి చరిత్ర అనే కాన్సెప్ట్ పాశ్చాత్య దృక్పథం. కమ్యూనిస్టులు మాత్రమే కాదు, హిందుత్వవాదులు కూడా చరిత్ర దృక్పథానికి బానిసలు. దాని విషమపర్యవసానాలనే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో లోహియా, ఆశీష్ నంది అభిప్రాయాలు పరిశీలించదగినవి.

స్మృతి, విస్మృతి, హిందుత్వం

లోహియా భయపడినట్లుగానే, పురాణపురుషులను చరిత్ర పురుషులుగా వక్రీకరిస్తున్నారు హిందుత్వవాదులు. పురాణం అనేది ఒక అవిచ్ఛిన్న స్మృతి ప్రవాహం. పురాణం ప్రాచీనమైనదైనప్పటికీ పూర్తి ఆధునికమైనది. కానీ పురాణాలలోని ప్రాచీనస్మృతిని హిందుత్వం వ్యతిరేకిస్తుంది. విస్మృతికి ప్రాధాన్యం ఇస్తుంది. దీనికోసం చరిత్రని ఆశ్రయిస్తుంది.

సావర్కర్ అభిప్రాయంలో: హిందూమతాన్ని, హిందూజాతిని భారతఖండంపై ఏర్పరిచిన ఆర్యులు వలసదారులు, విదేశీయులు మాత్రమే. ఆర్యులు గత చరిత్రని, తమ మూలప్రాంతపు ప్రజలతో తమకు గల సంబంధాన్ని పూర్తిగా విస్మరించారు. అంటే, వారి విస్మృతియే హిందుత్వానికి మూలం. సావర్కర్ హిందుత్వంలో భారతఖండాన్ని పుణ్యభూమిగా ఆరాధించేవారే హిందువులు. ముస్లింలు విదేశీయులు; ఎందుకంటే వారు తమకుగల విదేశీ సంబంధాలను విస్మరించలేదు. భారతీయ సంస్కృతి స్మృతిపై ఆధారపడి ఉంటే, హిందుత్వం పూర్తి విస్మృతి – కల్చరల్ ఆమ్నేషియా – పై ఆధారపడి ఉంది. అందుకే భైరప్ప విదేశీ చరిత్రకారులను, వాళ్ళని అనుకరించిన చరిత్రకారులను తప్ప, స్థానిక శంకరాచార్యులలాంటి గురువుల మాటలని ఏమాత్రం – సందర్భం వచ్చినా – స్మరించరు.

భైరప్ప పౌరాణిక పాత్రల విశ్లేషణ

భారతీయులకు స్మృతి ప్రధానం. అది పురాణకథనాల ద్వారా కొనసాగుతుంది. పురాణం బహుళం. దానిలో హీరోలు, విలన్లు ఉండరు. దేవుడు, సైతాను అనే భావన ఉండదు. రాక్షసులూ శాపవశాత్తూ జన్మించిన దేవతలే, విష్ణుభక్తులే. వైరభక్తి అనే కాన్సెప్ట్ ఉంది. స్నేహం, ప్రేమ, భక్తి ద్వారా మాత్రమే కాదు, ద్వేషం ద్వారా కూడా భగవంతునిలో లీనం కావచ్చు. రావణుడు అటువంటివాడే. ఆధ్యాత్మిక రామాయణం ప్రకారం రామ-రావణులు జీవాత్మ, పరమాత్మలు మాత్రమే. జీవాత్మ పరమాత్మనుంచి విడివడిన అంశం మాత్రమే. అందుకే భారతదేశంలో కొన్నిచోట్ల రావణుడిని కూడా ఆరాధిస్తారు. రావణుడికి గుడులు ఉన్నాయి.

రాక్షసుడు అనే భావన: భైరప్ప దృష్టి చారిత్రక వాస్తవ దృష్టి; అనంతమూర్తి దృష్టి పౌరాణిక-కాల్పనిక దృష్టి. భైరప్ప దృష్టి సంకుచితం, స్థలకాలబద్ధం. అనంతమూర్తి దృష్టి అనంతం, బహుళం.

భైరప్ప ‘ఉత్తరకాండ’ నవలలో రావణుడిని దుర్మార్గుడిగా, మోసగాడిగా చిత్రిస్తాడు. అతని కొడుకు ఇంద్రజిత్తుని తండ్రిని మించిన దుర్మార్గుడిగా వర్ణిస్తాడు. రావణుడు శివభక్తుడు, బ్రహ్మకోసం ఘోరతపస్సు చేసినవాడు, వేద పండితుడు అనే విషయాలను కూడా ప్రస్తావించడు. విచక్షణరహితులైనవారే రాక్షసులు అన్నట్లుగా వర్ణన ఉంటుంది. నిజానికి పురాణపాత్రలు ప్రజలలో బహుళ కథనాలను కలిగి ఉంటాయి. రామకథను విశ్వాంతరాళంలో తిరిగి తిరిగి సంభవించే కథగా భావిస్తారే కానీ, చరిత్రలో జరిగిన సంఘటనగా చూడరు.

భైరప్ప, రావణుడిలో కేవలం రాక్షసుని మాత్రమే చూశాడు. దానికి పరాకాష్ట కొడుకుతో రావణుడి విచక్షణలేని సంభాషణ. ఇది మూల రామాయణంలో లేదు.

శూద్రులు తపస్సు చేయడం ధర్మం కాదనే దృష్టితో రాముడు శూద్ర తపస్వి శంబూకుడిని చంపడం గురించి కూడా భైరప్ప రాశాడు. కానీ రాముడిలోని హీరోయిజాన్నే హైలైట్ చేశాడు. రావణుడిని పూర్తి దుష్టుడిగా మాత్రమే చిత్రించాడు.

భైరప్ప రావణుడి పాత్ర చిత్రణ

భైరప్ప ఉత్తరకాండ నవలలో రావణుడి పాండిత్యం గురించి కానీ శివభక్తి గురించి కానీ తపస్సు గురించికానీ ఏ మాత్రం ప్రస్తావించడు. అతడిని బలానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చే ఒక రౌడీలా చిత్రిస్తాడు. అతడు నిర్వహించిన ఒకే ఒక పూజ, ఒక క్షుద్రదేవతకి బలులు ఇవ్వడం ద్వారా జరుగుతుంది. అంటే రావణుడిని సంప్రదాయహీనుడుగా చూపిస్తాడు. ముఖ్యంగా భైరప్ప ‘ఆవరణ’ నవల చూసినా ఇతర నవలలు చూసినా ఆయన బ్రాహ్మణాచారాలకి, దానిలో భాగంగా శాకాహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనపడుతుంది. అందువల్ల ఏమాత్రం ప్రసిద్ధిలేని ఈ దేవత యొక్క చిత్రణ, ఆ దేవతకు బలి ఇవ్వడం – ఇదంతా రావణుడిని ఒక హిందువు కానివాడుగా చిత్రించినట్లుగా ఉంటుంది. దేవుడిని రాక్షసుడిని పూర్తిగా వేరుపరిచే ప్రచ్ఛన్న క్రైస్తవం, ఆధునిక హిందుత్వానికి ఇది మార్గం.

రావణుడి దేవతారాధన ఆచారాలు

ఒక జ్యోతిష్యుడు ఇచ్చిన సలహా మేరకు, రావణుడు మారి దేవికి (Goddess Maari) పూజ నిర్వహించాడు. ఈ పూజలో భాగంగా, దేవిని శాంతింపజేయడానికి రెండు మగ గుర్రపు పిల్లలు, రెండు మేకలు, ఐదు కోళ్లు బలి ఇవ్వబడ్డాయి.

రావణుడు తన చర్యల ద్వారా బలమే న్యాయం, ధర్మం అని నమ్మాడు. రాజుగా, ప్రభువుగా తాను చేసేదే న్యాయమని భావించాడు.

రావణుడి వ్యక్తిత్వం, చర్యలు (Personality and Actions)
  • రావణుడు లంకకు రాజు, చాలామంది స్త్రీలను బలవంతంగా అపహరించి బందీలుగా ఉంచాడు.
  • రావణుడు తన శక్తులు, బలానికి అడ్డులేకుండా ఉండటానికై ధర్మాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు.
  • తానే అత్యంత పరాక్రమవంతుడినని, మిగతా పురుషులంతా శక్తిహీనులని అతను నమ్మాడు.
  • అతను బలవంతంగా పట్టుకున్న స్త్రీలను విలాసవంతమైన భవనాలలో ఉంచేవాడు. వారికి ఆభరణాలు ఇచ్చి మౌనంగా ఉండేలా చేసేవాడు.
ఇంద్రజిత్తుతో సంభాషణ, యుద్ధ ప్రణాళిక

రాముడి సైన్యం లంక సరిహద్దుల్లోకి ప్రవేశించిన తరువాత, రావణుడు అత్యవసరంగా యుద్ధమండలిని ఏర్పాటు చేశాడు. ఇంద్రజిత్తు (మేఘనాదుడు) రావణుడి కుమారుడు, గొప్ప యోధుడు. ఈ సమావేశంలో ఇంద్రజిత్తు ఇచ్చిన సలహా ముఖ్యమైనది:
“తండ్రీ!, శత్రువు యుద్ధం చేయకుండానే వెనక్కి తగ్గేందుకు నా దగ్గర ఒక ఆలోచన ఉంది. మీరు బందీగా ఉంచిన స్త్రీ తన పతివ్రత ధర్మానికి చాలా ప్రాధాన్యత ఇస్తుందని నేను విన్నాను. మీరు ఇన్ని నెలలుగా ఆమెను తాకకుండా వదిలేయడం పొరపాటు. ఇప్పుడే వెళ్లి ఆమెను అనుభవించి, ఆ విషయం లంక వీధుల్లో, శత్రువుల శిబిరంలో ప్రకటించాలి. దాంతో ఆమె భర్త (రాముడు) ఆమె శీలభ్రష్టత్వం గురించి విని ఆమెను వదిలేస్తాడు. అప్పుడు, ఆమె కోసం పోరాడటానికి అతను ఎందుకు కష్టపడతాడు?”అని ఇంద్రజిత్తు ప్రశ్నించాడు.

రావణుడు ఈ ఆలోచనను అద్భుతంగా ప్రశంసించాడు, కానీ సీతను అనుభవించడానికి తాను ఇష్టపడటం లేదని, ఆమె ప్రేమను గెలవాలని కోరుకుంటున్నానని చెప్పాడు.
అప్పుడు ఇంద్రజిత్తు, మీరు చేయలేకపోతే, ఆ పనిని నాకు అప్పగించండి. నేను ఆమె పతివ్రత ధర్మాన్ని నాశనం చేసి, లంక వీధుల్లో బహిరంగంగా ప్రకటిస్తాను. ఇది రాముడిని అభిమానాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది, అతను పారిపోతాడు” అని అన్నాడు.
ఇతడికి ఇంద్రజిత్తు అని కాక ఇంద్రియ జిత్తు అని పేరు పెడితే బాగుండేది. అప్పుడు ఇంద్రియాల్ని జయించాలని కోరిక కలిగేదేమో అని విభీషణుడు భావిస్తాడు.
ఈ సంఘటనలు ఈ మాటల చిత్రీకరణ రావణుడిని, అతని కుటుంబాన్ని మొత్తంగా దుర్మార్గమైనదిగా అత్యంత నీచమైనదిగా చిత్రించేవిగా ఉన్నాయి. రావణుడిని ఈ విధంగా సైతానులా మార్చేస్తాడు భైరప్ప. తర్వాతి కాలంలో ముస్లింల గురించి ఆయన రాసిన వాటితో ఇది సరిపోలడం విశేషం.

రావణుడి మరణం అంత్యక్రియలు

రాముడు రావణుడిని యుద్ధంలో ఓడించి చంపాడు. రావణుడి మరణం తరువాత, అతని భార్య మండోదరి రావణుడిని ‘ఆడవారిపై నీకున్న వ్యామోహమే నిన్ను నాశనం చేసింది’ అని నిందించింది. ‘అతడు చేసిన పాపాలకి అతని శవం సరైన అంతిమసంస్కారాలు లేకుండా కుళ్ళిపోయినా నష్టంలేదు’ అని తీవ్రంగా నిందిస్తుంది మండోదరి. దీని ద్వారా రావణుడిని సొంత భార్య కూడా అతినీచంగా ఏవగించుకునే టెర్రరిస్టులా చూపుతాడు భైరప్ప.

విభీషణుడు (రావణుడి సోదరుడు) రావణుడి అంత్యక్రియలు చేయడానికి నిరాకరించాడు, ఎందుకంటే అతను చేసిన పాపాలవల్ల అతను నరకానికి పోవడం ఖాయమని భావించాడు. అప్పుడు రాముడు జోక్యం చేసుకుని, ‘శత్రుత్వం మరణంతో ముగియాలి’ అని చెప్పి, రావణుడి అంత్యక్రియలు విభీషణుడు నిర్వహించాలని ఆజ్ఞాపించాడు. రాముడుకూడా యుద్ధంలో మరణించిన వారందరికీ తర్పణం ఇచ్చాడు.
మొత్తం మీద చూస్తే భైరప్ప ఎన్ని లోపాలున్నప్పటికీ రాముడిని దైవంగా, రావణుడిని కేవలం సైతానుగా చూపాలని భావించినట్లు కనిపిస్తుంది. ఇటువంటి దృక్పథం భారతీయం కాదు; ప్రచ్ఛన్న క్రైస్తవం.

పురాణపాత్రలు ప్రజల స్మృతిలో నలుపు తెలుపులుగా, హీరో విలన్లుగా ఉండరు. బైనరీ ఆపోజిట్‌గా ఉండరు. కానీ భైరప్ప అలాగే చిత్రీకరించాడు. అతని చారిత్రక వాస్తవిక దృష్టి సంకుచితమైనది. అతని ప్రగతిశీలత హిందుత్వానికి రహదారి.

శాకాహారం, జంతుబలి, బ్రాహ్మణీక ఆదర్శం

రావణుడు శివునిపై స్తోత్రాలు రచించినట్లు కూడా ప్రసిద్ధి ఉంది. బ్రహ్మ కోసం సుదీర్ఘతపస్సు చేసిన తపశ్శాలి, వేద పండితుడు అని కథనాలు ఉన్నాయి. కానీ ఉత్తరకాండ నవలలో రావణుడు ఒక స్థానిక దేవతకు జంతుబలిని ఇచ్చే ఆచారాన్ని మాత్రమే పాటించినట్లు వర్ణించబడింది.

భైరప్ప యజ్ఞోపవీత ధారణ, మంత్రాలలాంటి బ్రాహ్మణాచారాలతోపాటు, శాకాహారాన్ని కూడా ఆకాశానికి ఎత్తుతూ రాశాడు. ‘దాటు’, ‘ఆవరణ’ నవలలను పరిశీలిస్తే తెలుస్తుంది.
ఒక బ్రాహ్మణీయ ఆదర్శాన్ని ప్రగతిశీలత పేరుతో, తర్వాత రోజుల్లో హిందుత్వం పేరుతో ప్రచారం చేశాడు భైరప్ప. ఈ ప్రాజెక్టు కోసం రామాయణాన్ని కూడా ఉపయోగించుకున్నాడు.

అనంతమూర్తి పౌరాణిక దృష్టి

అనంతమూర్తి దృష్టిలో రాక్షసులు దేవుడికి ఆపోజిట్ కాదు. రాక్షసుడు అంటే సైతాను కాదు. బైనరీ ఆపోజిట్స్ భారతీయ ధర్మంలో లేవు. ఇవి ద్వంద్వాలు మాత్రమే. పరస్పరాశ్రితాలు, అంతేకానీ ఎదురుబొదురుగా నిలబడే వ్యతిరేకతలు కావు. ఈ విషయం అనంతమూర్తి రాసిన ‘హిందుత్వ ఆర్ హింద్ స్వరాజ్’ చూస్తే స్పష్టమవుతుంది.

దేవతలు రాక్షసులు – యు ఆర్ అనంతమూర్తి దృష్టి – హిందూమతంలో (Hinduism) మంచి చెడు భావనలు:

హిందూమతంలో రాక్షసులు, దేవతల మధ్య ఘర్షణలను మంచి-చెడుల మధ్య పోరాటంగా చూస్తారు. అయితే, ఈ దృక్పథం క్రైస్తవమతంవంటి ఇతర మతాలకన్నా భిన్నంగా ఉంటుంది.

మంచి-చెడు యొక్క భావన: క్రైస్తవ మతంలో మంచి, చెడు (పాపం) పూర్తిగా విరుద్ధమైనవి. కానీ హిందూమతంలో, మంచి చెడు (పాపపుణ్యాలు) రెండూ ఒక జీవనచక్రంలో భాగం. క్రైస్తవంలో పాపం అనే భావన కేంద్రం. హిందూమతంలో విడిగా పాపం లేదు. పాపపుణ్యాలు కలిసి ఉంటాయి. అవి ద్వంద్వాలు. అన్నిటిని ద్వంద్వాలుగా చూస్తారు భారతీయులు. క్రైస్తవమతంలో ఉండే ‘సాతాను’ (Satan) వంటి శాశ్వతమైన శత్రువు హిందూపురాణాల్లో లేడు. పైగా హిందూసంస్కృతిలో, చెడునుకూడా దైవత్వం యొక్క మరొక రూపంగా లేదా కోణంగా పరిగణించడం జరుగుతుంది.

* దైవిక శత్రుత్వం: పురాణ కథల ప్రకారం, విష్ణువు ద్వారపాలకులు అయిన జయ, విజయులు శత్రువులుగా మూడు జన్మలు ఎంచుకున్నారు. అధ్యాత్మ రామాయణం ఈ దృక్పథాన్నే ప్రతిపాదిస్తుంది. దేవుడిని చేరుకోవడానికి శత్రుత్వం కూడా ఒక మార్గం అని ఈ కథ సూచిస్తుంది.

మొత్తంగా, హిందూమతంలో దేవతల శత్రువులు కూడా దైవత్వంలో ఒక భాగమే లేదా దేవుడిని చేరుకునే మార్గంగా పరిగణించబడతారు. ఈ దృష్టి హిందూమతంలో మంచి-చెడుల మధ్య ఒక సంక్లిష్టమైన సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది.

రావణుడు: హింస, నైతికత పురాణాల సంక్లిష్టత

గాంధీని హత్య చేసిన నాథురామ్ గాడ్సే, దేశరక్షణకోసం బలాన్ని ఉపయోగించడాన్ని సమర్థించడానికి రాముడు రావణుడిని చంపడాన్ని ఉదాహరించాడు. దురాక్రమణకు వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటన ఒక మతపరమైన నైతికకర్తవ్యం అని గాడ్సే వాదించాడు. రాముడు, కృష్ణుడివంటి నాయకులు అవసరమైన విధిని నెరవేర్చారని అతను పేర్కొన్నాడు.

తాత్త్విక చర్చలలో, శిక్షయొక్క నిష్ఫలతను వివరించడానికి రావణుడిని ఉపయోగిస్తారు. కన్నడ కవి అడిగ అభిప్రాయం ప్రకారం, “రావణుడి తలలు నరికినంత వేగంగా మళ్లీ మొలుస్తాయి”. అంటే కేవలం శిక్ష, బలవంతంగా క్రమబద్ధతని ఏర్పరచటం అనే చర్యలు లోతైన సమస్యలను పరిష్కరించలేవని ఇది సూచిస్తుంది. అన్నిటినీ లా అండ్ ఆర్డర్ సమస్యలుగా చూసే నేటి ఆధిపత్య దృక్పథంపై ఇది విమర్శ.

సావర్కర్‌వంటి జాతీయవాదులు హిందూ జాతీయత, హిందూ దేశనిర్మాణం దృష్టితో, రావణుడి సోదరుడైన విభీషణుడివంటివారు రాముడిలాంటి ఆర్యుల (ఆర్య నాయకుల) కి విధేయులయ్యారని వివరించారు. రాముడిని హిందూ వీరుడిగా హిందుత్వ ప్రతీకగా చూపారు. రామాయణాన్ని హిందూ జాతీయతావాద దృష్టితో వ్యాఖ్యానించారు.

అందుకే ఆర్ఎస్ఎస్‌కి చెందిన గురూజీ గోల్వాల్కర్, ‘రాముడిని పరమాత్మగా వర్ణించే ఆధ్యాత్మరామాయణాన్ని పారాయణ చేస్తూ వైరాగ్యంతో నిర్లిప్తంగా జీవించటం వ్యర్థం’ అన్నారు. రాముడిని పురుషత్వానికి – మేన్లీనెస్‌కి, యుద్ధశూరత్వానికి సింబల్‌గా చూడాలి అన్నారు.

హింస vs అహింస

‘రామాయణంవంటి పురాణాలు హింసను ప్రేరేపిస్తాయా లేక అహింసను ప్రేరేపిస్తాయా అనే విషయంలో గాంధీ, సావర్కర్ వంటి నాయకులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు అంటారు’ అనంతమూర్తి

కుల నిర్మూలనవాదం – హిందుత్వం

ఆధునికకాలంలో హిందూయిజాన్ని సమర్థించేవాళ్లు, వ్యతిరేకించేవాళ్లు కూడా దానిని బ్రాహ్మణిజంగానే వ్యాఖ్యానించారు. బ్రాహ్మణేతర సంస్కృతులను పట్టించుకోలేదు లేదా వాటిని బ్రాహ్మణిజం యొక్క అధమానుకరణలుగా చూశారు. అదే సమయంలో, కులనిర్మూలన వాదం కూడా బ్రాహ్మణీకరణకు కొనసాగింపుగానే ఉంది.

“మంచి అన్నది మాల అయితే మాల నేనవుతాను” అని ప్రకటించిన లవణ రాజు కల కవితలో గురజాడ, ఒక ఆదర్శ దళిత పాత్రను చిత్రిస్తారు. ఆ దళితుడు చర్మకార వృత్తిని విడిచిపెట్టడమే కాదు, జంతువధను కూడా వ్యతిరేకిస్తాడు, భూత దయని బోధిస్తాడు.
కులనిర్మూలనవాది, దళితుడు, భాగ్యరెడ్డి వర్మ గోవధ నిషేధం కోసం కృషి చేశాడు. ఇంకా కులనిర్మూలనవాది సాహు మహారాజు బ్రాహ్మణేతరుల కోసం వేద పాఠశాల స్థాపించాడు. ఈ ప్రగతిశీలత యొక్క తీవ్ర హిందూవాద వ్యక్తీకరణ భైరప్ప.

శాకాహారం vs. మాంసాహారం

ఆహారానికి సంబంధించిన నమ్మకాలు, ఆచారవ్యవహారాలు, విధి నిషేధాలు గురించి చాలా ఆసక్తికరంగా రాస్తారు భైరప్ప. ఈ విషయమై ‘దాటు’నుంచి ‘ఆవరణ’వరకు జరిగిన పరిణామాన్ని పరిశీలించాలి.

‘దాటు’ నవలలో ఆహారం విషయంలో అస్పృశ్యత పాటించటం, అలాగే శాకాహారాన్ని గొప్పదిగా స్వచ్ఛమైనదిగా భావించటం, మాంసాహారాన్ని నీచకులాలకు సంబంధించిందిగా ఈసడించుకోవడంవంటి సామాజిక వైఖరులని భైరప్ప ప్రస్తావిస్తారు.

అత్యంత కఠినమైన ఆహారనియమాలు పాటించే పూజారి వెంకటరమణయ్య, దళిత ఎమ్మెల్యే బెట్టయ్య చేతినుండి పండిన అరటి పండ్లను కలుషితం అవుతుందనే భయంతో నేరుగా తీసుకోడానికి నిరాకరించాడు. అవే పళ్ళను, బెట్టయ్య సూచన మేరకు తన చేతికందించిన ముస్లిం వ్యాపారినుండి సంకోచం లేకుండా అందుకున్నాడు. ఇక్కడ దళితులను అంటరానివారుగా చూడడం, ముస్లింలని అలా చూడకపోవడం కనబడుతుంది.

అయితే ఆవరణ నవలలో తీవ్రమైన మాంసాహార వ్యతిరేకత, అదే సమయంలో ముస్లిం వ్యతిరేకత కనబడుతుంది. ముస్లింలని తీవ్ర మాంసాహారప్రియులుగా చూపుతూ అటువంటి మాంసాహార ప్రియత్వం అనాగరికం, అమానుషం అని వ్యాఖ్యానిస్తారు. ముస్లింలపట్ల మతపరమైన అస్పృశ్యతను కఠినంగా పాటించటం గురించి దీనిలో వర్ణనలు ఉన్నాయి. పట్టణాల్లోనే కాదు గ్రామాల్లో కూడా ఇటువంటి ముస్లిం అస్పృశ్యత అనేది ఉన్నట్లు వర్ణిస్తారు భైరప్ప. దానిని సమర్థిస్తారు కూడా. ఇది సమాజంలో కొత్తగా వచ్చిన పరిణామంలా కనపడుతుంది. రజియా/లక్ష్మి తన స్వగ్రామానికి వచ్చినప్పుడు ఎదుర్కొన్న అనుభవాలు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది

తెలుగు కవి ఇక్బాల్ చంద్ ‘ఆరో వర్ణం’ అనే కవిత రాశాడు. ‘దళితులతోపాటు ఇప్పుడు ముస్లింలను కూడా అంటరానివారుగా మారుస్తున్నారు’ అనేది ఆ కవితలోని ఆరోపణ.
‘ఆవరణ’ నవలలో ప్రధానపాత్ర నరసింహ గౌడ శాకాహారి, మాంసాహార వ్యతిరేకి. అందుకే గ్రామదేవత గుడిలో బలిని కూడా నిషేధింపచేస్తాడు. కులపరంగా వాళ్లు మాంసాహారులు. అయినప్పటికీ పరిమితంగా మాంసాహారం తీసుకోవడం, వంటింట్లో మాంసాహారం వండకపోవడంవంటి ఆచారాన్ని పాటిస్తారు. ఈ మాంసాహార వ్యతిరేకత గోవధ విషయంలో మరింత తీవ్రంగా భావించబడుతుంది. అది ముస్లిం వ్యతిరేకతగా వ్యక్తం అవుతుంది.

అయితే సనాతన ధార్మికులు మాంసాహార వ్యతిరేకులేమీ కాదు. కంచి పరమాచార్య అభిప్రాయాలు చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.

కంచి శంకరాచార్య చంద్రశేఖర సరస్వతీ స్వామి అభిప్రాయం ప్రకారం, హిందూధర్మంలోని సాంఘికవ్యవస్థలో శాకాహారం (Vegetarianism) అనేది కొన్ని వర్గాలకు మాత్రమే అధికారికంగా విధించబడిన నియమం. శారీరక శ్రమ చేసేవారికి తగిన దేహబలం కోసం మాంసాహారం అవసరం. కాబట్టి, ‘కర్మ విభాగం (శ్రమ విభజన) సూత్రం ఆధారంగా, మాంసాహారం స్వీకరించినప్పటికీ దోషం లేదు’ అంటారు స్వామి. కొన్నిచోట్ల కొన్ని రాష్ట్రాలలో బ్రాహ్మణులుకూడా మాంసాహారం భుజించడం గురించి మాట్లాడడానికి స్వామి వెనకాడరు. అందరికీ ఒకే ఆచారం అనేది వర్ణాశ్రమ ధర్మవిరుద్ధం కావడంవల్ల స్వామి ఇలా మాట్లాడారు.

అసలు మనుస్మృతికూడా మాంసాహారాన్ని అంత తీవ్రంగా వ్యతిరేకించలేదు. అందరికీ శాకాహారం, అందరికీ ఒకే ఆచారం అనేది ఆధునిక కులనిర్మూలన, మోడరన్ బ్రాహ్మణిజం, హిందుత్వాల సమ్మేళన ఫలితం.

భైరప్ప రాసిన ‘తబ్బలియు నీనాదె మగనె’ నవల ప్రధానంగా గోవధ నిషేధం గురించి చర్చించినప్పటికీ మొత్తంగా మాంసాహారాన్ని చెడ్డదిగా చూపిస్తాడు రచయిత. ఆధునిక వ్యవసాయ విద్య చదువుకున్న కళింగ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న హిల్డా అనే అమెరికన్ యువతి, ఆధునిక పద్ధతిలో వ్యాపార పద్ధతిలో వ్యవసాయం చేయటానికి గ్రామానికి భర్తతోపాటు వస్తుంది.

భారతీయులు మేక, గొర్రె, కోడి, చేపలను తింటారు కానీ ఆవు మాంసాన్ని మాత్రమే నిషేధిస్తారు. ‘ఇది తర్కరహితమైన నమ్మకం కాదా’ అని ప్రశ్నిస్తుంది హిల్డా. ‘అసలు మాంసాహారం చెడ్డది అని ప్రజలందరూ అంగీకరిస్తారని, దేవతలకి జంతువులను బలి ఇవ్వడం అనేది తక్కువ స్థాయి ప్రజల ఆరాధన పద్ధతి’ అని వాదిస్తాడు స్థానికుడు వెంకటరమణ. నిజానికి మాంసాహారాన్ని వంటగదిలో కాకుండా బయట వండటం అనే ఆచారం ఉన్నట్లు ‘తబ్బలియు నీనాదె మగనె’, ‘ఆవరణ’ నవలల్లో కూడా వర్ణన ఉంటుంది. మాంసాహారంపట్లనే కాదు, బలులను స్వీకరించే అమ్మ దేవతలపట్ల కూడా చిన్నచూపు చూపుతాడు భైరప్ప. ఇదే సనాతనానికి విరుద్ధమైన హిందుత్వ ఆహారవైఖరి.

భైరప్ప ‘ఉత్తరకాండ’ నవల రావణుడిని జంతుబలులతో నీచదేవతని పూజించే వాడిగా చిత్రించింది. పురాణాలలోలా బ్రహ్మ, శివుడికోసం ఘోర తపస్సు చేసేవాడిగా, వేదం చదివినవాడిగా, శివస్తోత్రం రాసినవాడిగా కాదు. ఇలా ఫక్తు మాంసాహార దేవతని పూజించినట్లు చిత్రించడం ద్వారా, రావణుడిని పూర్తి విలన్‌గా నిలుపుతాడు. వైట్‌హెడ్‌లాంటి క్రైస్తవ మిషనరీలు జంతుబలులని స్వీకరించే అమ్మదేవతలని నిర్మూలించవలసినవిగా భావించారు. హిందుత్వం ప్రచ్ఛన్న క్రైస్తవం. నిజానికి సనాతన వర్ణధర్మంలో మాంసం అమ్ముకొని జీవించే ధర్మవ్యాధుడు కూడా గౌరవించబడ్డాడు.
హిందువులు అందరూ మాంసాహారం హింసాత్మకం కనుక పాపం అనే భావన కలిగి ఉంటారని, తిన్నప్పటికీ అది విడవదగిన ఆహారపు అలవాటుగా భావిస్తారు అని కానీ, ముస్లిములు మాంసాహారాన్ని గొప్ప మతాచారంగా భావిస్తారు అని భైరప్ప హృదయం.

కులగణన – హిందుత్వం

‘దాటు’ నవలలో జనాభాగణనలో భాగంగా కులగణన చేసినప్పుడు, అన్ని కులాల వాళ్ళూ తమను తాము అగ్రవర్ణాలవారుగా నమోదు చేయించుకోవాలని చూస్తారు. కథానాయక సత్య అందరిని యజ్ఞోపవీతధారణ, బ్రాహ్మణాచారాలు పాటింపచేయడం ద్వారా, కులనిర్మూలన కోసం కృషి చేస్తుంది. ఈ బ్రాహ్మణీకరించడం (Sanskritization) గురించి సామాజిక శాస్త్రవేత్త ఎం.ఎన్. శ్రీనివాస్ స్పష్టం చేశారు.

‘దాటు’ నవలలో పూజారి వెంకటరమణయ్య ప్రారంభంలో కులవ్యవస్థ పవిత్రత పట్ల దృఢమైన విశ్వాసం కలిగి ఉండేవారు. అయితే, దళిత స్త్రీ మాతంగితో సంబంధం, కుమార్తె సత్య కులాంతర వివాహం చేసుకోవడానికి ప్రయత్నించడంవంటి తీవ్రమైన సంఘటనల పరంపర కారణంగా ఆయన మానసిక విచ్ఛిన్నం (Mental Breakdown) చెందారు.

ఈ అస్థిరమైన మానసికస్థితిలో ఆయన పౌరోహిత్యాన్ని, బ్రాహ్మణత్వాన్ని తిరస్కరించి, కులధర్మాన్ని పూర్తిగా వదిలివేశారు. తనను తాను బ్రహ్మర్షిగా భావించుకుని, ఆశ్రమధర్మంలో భాగంగా కులంతో సంబంధం లేకుండా తన కుమార్తె సత్యకు యజ్ఞోపవీత ధారణ చేయించి, గాయత్రీమంత్రాన్ని ఉపదేశించారు. ఈ చర్య ఆయన సాంప్రదాయిక కులనిబంధనలనుంచి దూరంగా జరిగినట్లు సూచిస్తుంది. సత్య కూడా శూద్రులకు యజ్ఞోపవీతధారణ చేయిస్తుంది. దీనిలో రెండు విషయాలు కనిపిస్తాయి; ఒకటి కులనిర్మూలన, రెండు బ్రాహ్మణీకరణ. హిందుత్వానికి రహదారి ఇదే.

హిందూమతంలో వివక్ష

అన్ని కులాలని బ్రాహ్మణీకరించి, కులనిర్మూలన చేసి, తద్వారా కులబహుళత్వం స్థానంలో మత ఐక్యతని స్థాపించాలి అన్నదే భైరప్ప లక్ష్యం. అదే హిందుత్వం. ‘ఆవరణ’ నవల ఆయన దృక్పథాన్ని పూర్తిగా స్పష్టం చేస్తుంది.

ఇస్లాం శత్రువు: ద్విజాతి సిద్ధాంతం

బైనరీ దృక్పథంలో భాగంగా హిందుత్వానికి విరుద్ధమైనదిగా, శత్రువుగా ఇస్లాంని, ముస్లింలని నిలుపుతాడు.

‘ఇస్లాంలో, ముస్లింలలో ఉన్నవన్నీ అవలక్షణాలే’ అని అంటాడు. స్త్రీ వివక్ష, మతతత్త్వం, ఆధిపత్య స్వభావం, హింస… యిలా వారిలో లేని దుర్గుణాలు లేవు అన్నట్లుగా రాస్తాడు.

అయితే మరి రామాయణంలోనూ, భారతంలోనూ హింస లేదా వివక్ష లేదా? ముఖ్యంగా నేటి హిందుత్వానికి ప్రమాణం రాముడు, రామాయణం. రామాయణాన్ని (ఉత్తరకాండ) నవలగా రాశాడు భైరప్ప. ఆ నవలను సీత, ఊర్మిళవంటి స్త్రీ పాత్రల కోణంనుంచి రాశాడు. అది పరిశీలిస్తే ఉత్తరకాండ నవలలో స్త్రీలపట్ల వివక్షపై విమర్శ స్పష్టంగా కనబడుతుంది.

దేవాలయాలపై దాడులు

‘ఆవరణ’ నవలలో, దేవాలయాలపై ముస్లింల దాడులగురించి ప్రధానంగా ప్రస్తావిస్తాడు. అయితే హిందూ సంస్కృతిలో అంతర్గతంగా ఈ దాడులు లేవా? ఉన్నాయి. శైవ-వైష్ణవ ఘర్షణలు, శివాలయాలను వైష్ణవులు ఆక్రమించడం ఇటువంటివే. ఈ వాస్తవాన్ని కూడా ‘దాటు’ నవలలో చిత్రిస్తాడు భైరప్ప. అన్ని వివక్షలు, హింస, దాడులు భారతఖండంలో హిందూసంస్కృతిలో భాగంగా ఉన్నాయని ఎప్పుడో రాశాడు భైరప్ప.

శైవ-వైష్ణవ ఘర్షణలు, కుల వివక్ష

ఎస్.ఎల్. భైరప్ప రచించిన ‘దాటు’ నవల, శివాలయాన్ని వైష్ణవులు ఆక్రమించడం అనే అంశం గురించి, గుడిలోకి దళితులను రానివ్వని అస్పృశ్యత (Untouchability) గురించి సూటిగా చర్చించింది.

వైష్ణవ నేపథ్యం (ప్రస్తుత స్థితి)

ప్రధాన దేవాలయం: తిరుమలపురం గ్రామంలోని ప్రధాన దేవాలయం విష్ణు దేవాలయం.
దేవుని నివాసం: విష్ణువును సాంప్రదాయకంగా స్థితిపాలకుడుగా భావిస్తారు, కాబట్టి ఆయన ప్రజల మధ్య నివసించాలి. అయినప్పటికీ, ఈ ఆలయం గ్రామానికి వెలుపల, నది/ఆనకట్ట దగ్గర ఉండడం విశేషం. నిజానికి అది శివాలయం అని ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటారు. శివాలయాలే ఊరి బయట ఉంటాయని తర్కం.

ఆరాధకులు: ఆలయపు అర్చకుడు కూడా వైష్ణవుడు కాదు. పూజారి వేంకటరమణయ్య స్మార్త బ్రాహ్మణుడు.

శైవ సంబంధాలు (చారిత్రక మూలాలు)

చారిత్రక మూలం: చారిత్రక ఆధారాల ప్రకారం, ఈ నిర్మాణం వాస్తవానికి ఒక శివాలయం.
శైవశిల్పాలు, ఆచారాలు: ఆలయం వెలుపలి గోడపై ఇప్పటికీ శివపార్వతుల శిల్పాలు ఉన్నాయి. అర్చకుడు ఈ శైవ విగ్రహాలకు కూడా మంగళారతి యిస్తాడు.
సమన్వయం/ఆక్రమణ: ఈ ప్రముఖ శైవశిల్పాలు, ఆచారాల ఉనికిని బట్టి చూస్తే, ఈ ఆలయం ప్రస్తుతం విష్ణువుకు అంకితం చేయబడినప్పటికీ, శివాలయాన్ని వైష్ణవాలయంగా మార్చి ఉండవచ్చని, దురాక్రమణ జరిగి ఉండొచ్చని తెలుస్తోంది.

ఆలయ నిర్వహణ – కులవివక్ష (ఆధునిక సందర్భం)

నిర్వహణ: ఆలయ నిర్వహణ సాంప్రదాయకంగా స్థానిక పాలెగాళ్ళ వంశం చేతిలో ఉండేది, దీనికి పెద్ద పటేల్ తిరుమలేగౌడ కుటుంబం ప్రాతినిధ్యం వహించింది.
దళిత దేవాలయప్రవేశం ఉద్రిక్తత: రాష్ట్రప్రభుత్వం బలవంతం చేయడంతో ఆలయంలోకి హరిజనుల ప్రవేశాన్ని అనుమతించాల్సి వచ్చింది. ఈ సంఘటన తర్వాత ఆలయం మొత్తాన్ని ఆవు పేడ, గంగాజలంతో కడిగి శుద్ధి చేసే ఆచారాలు నిర్వహించారు.
అర్చకుని భయం: శ్రీ వైష్ణవులు ఆలయంపై తమ హక్కులకోసం పోటీ పడుతుండగా, దళితుల ప్రవేశాన్ని అనుమతించడం వలన తమ వంశపారంపర్య పూజారి హక్కులు, ఇనాము (సేవ కోసం మంజూరు చేయబడిన పన్ను లేని భూమి) కోల్పోవాల్సి వస్తుందని అర్చకుడు వేంకటరమణయ్య భయపడ్డాడు.

మరి హిందూ సంస్కృతిలో కూడా దేవాలయ దురాక్రమణ, ఇతర దురాచారాలు, దురాగతాలు ఉండగా, ‘ఆవరణ’ నవలలో ప్రత్యేకంగా ఇస్లాంను దోషిగా ఎందుకు నిలిపాడు? ఇస్లాంను, ముస్లింలను స్త్రీ వివక్ష, మతోన్మాదం, జంతుహింసలాంటి సకల దుర్గుణాలకి నిలయంగా ఎందుకు నిలిపాడు?

భైరప్ప దృష్టిలో హిందూమతం చారిత్రకమైనది, నిరంతరం మార్పుకు గురయ్యే లక్షణం కలది, సంస్కరణ దృక్పథం కలది. ఇస్లాం నిలవ నీరులాంటిది, దానిలో మారే లక్షణం శూన్యం. సంస్కరణ దృష్టి అసాధ్యం. సాధారణంగా హిందూమతాన్ని, హిందూసంస్కృతిని చరిత్ర హీనమైనదిగా, మార్పు లేనిదిగా, స్తంభించినదిగా పాశ్చాత్య చరిత్రకారులు, ప్రగతిశీల చరిత్రకారులు, కమ్యూనిస్టులనుంచి దళితవాదులవరకు విమర్శిస్తూ వచ్చారు. దాన్ని కాదంటూ అసలు హిందూమతమే మార్పుకు సంకేతం, ఇస్లాం – మొత్తంగా అబ్రహామిక్ మతాలు మార్పుకు వ్యతిరేకం అని నిరూపించాలని చూస్తాడు భైరప్ప.

దానిలో భాగంగా ప్రగతిశీలులను ముస్లింలను సమర్థించేవాళ్లుగా నిందిస్తాడు. కులనిర్మూలన విషయంలో ప్రగతిశీలులతో గొంతు కలుపుతూ, మొత్తంగా ఇస్లాంకు వ్యతిరేకంగా హిందుత్వాన్ని నిలుపుతాడు. పురాణాలపై, గతంపై విమర్శ ఆయన హిందూ ప్రాజెక్టుకి అడ్డంకి కాదు. పురాణాలపై గత చరిత్రపై ఆర్యసమాజ్‌లాంటి సంస్థలు ఇంతకన్నా తీవ్రవిమర్శలు ఎప్పుడో చేశాయి. ఆ సంస్థలు ముస్లిం వ్యతిరేకతను కూడా పెంచాయి.

భైరప్ప పూర్తిగా ఆధునికవాది, కులనిర్మూలనకు పూర్తి సమర్థకుడు. నిజానికి సావర్కర్, గాడ్సేలాంటి హిందుత్వవాదులు కులనిర్మూలనను బోధించినవారే. దాని స్థానంలో మత అస్తిత్వాన్ని, జాతుల ఏర్పాటును, ద్విజాతి సిద్ధాంతాన్ని నిలిపారు. భైరప్ప చేసింది అదే. అందువల్ల ప్రత్యక్షంగా హిందుత్వాన్ని సమర్థించే ‘ఆవరణ’ నవల, ప్రగతిశీలంగా కనిపించే పౌరాణిక నవలలు, సాంస్కృతిక నవలలు ఐన ‘పర్వ’, ‘ఉత్తరకాండ’, ‘దాటు’లాంటి నవలలకు కొనసాగింపే.

ఆధ్యాత్మిక శూన్యత – హిందుత్వ లక్షణం

చారిత్రక వాస్తవదృష్టి హిందుత్వం: హిందుత్వవాదులు ఎప్పుడూ పురాణపురుషులను కూడా చారిత్రకపురుషులుగా చూశారు. హిందుత్వవాది గురూజీ గోల్వాల్కర్ శక్తి, విజయం, బలాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అటువంటి లక్షణాలను రాముడిలో చూశారు. రాముడిని కేవలం పరమాత్మగా చిత్రించి, వైరాగ్యాన్ని బోధించే ఆధ్యాత్మిక రామాయణాన్ని, దాన్ని పారాయణ చేసే వాళ్లను వెటకారం చేశారు గురూజీ గోల్వాల్కర్.
సావర్కర్ రాముడిని ఆర్య విజేతగా, హిందూ ఐడెంటిటీ మూలంగా చూశారు. మరోవైపు బహుళత్వాన్ని బోధించే సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ, ఏకత్వాన్ని (uniformity) బోధించారు.

హిందుత్వంలో ప్రధానమైనది ఆధ్యాత్మిక శూన్యత, చారిత్రక దృష్టి. ఈ లక్షణాలు భైరప్పలో మొదటి నుంచి ఉన్నాయి.

భగవద్గీత

భగవద్గీతను యుద్ధరంగంలో సంశయగ్రస్తుడైన అర్జునుడికి కృష్ణుడు బోధించిన తత్త్వంగా కాకుండా, యుద్ధ గుడారంలో బోధించినదిగా, యుద్ధ సన్నద్ధతని బోధించే ప్రవచనంగా మారుస్తాడు భైరప్ప. ఈ విధంగా ఆధ్యాత్మికతను పరిహరిస్తాడు.
నిజానికి యుద్ధభూమిలో అర్జునుడికి కలిగే సంశయగ్రస్తతనుంచి భగవద్గీత పుట్టింది. హామ్లెట్ సంశయగ్రస్తత కర్మ పూర్వం. అర్జునుడి సంశయం కర్మ జరిగే తక్షణ సమయంలోనిది. దోస్తవిస్కీ ‘నేరము-శిక్ష’ నవలలో రాస్కెల్నికోవ్ సంశయగ్రస్తత కర్మ తర్వాతిది అని తెలుగు కవి బైరాగి చెప్తాడు. యుద్ధరంగంలో అంతసేపు ఆ సుదీర్ఘమైన భగవద్గీతని కృష్ణుడు అర్జునునికి బోధించడం హేతువిరుద్ధం, టెక్నికల్‌గా అసాధ్యం అని కొందరు ఎప్పటినుంచో విమర్శిస్తున్నారు. ఇది మితిమీరి స్థలకాలబద్ధత, వాస్తవికతలపై ఆధారపడిన వారి తర్కం. తాత్త్వికంగా ఆలోచించకపోవడంవల్ల వచ్చిన లోపం. నిజానికి జీవితమే నిరంతర యుద్ధరంగం. సంఘర్షణలకు నిలయం. భగవద్గీత గాంధీనుంచి టీఎస్ ఇలియట్ దాకా ఎంతమందినో ప్రభావితం చేసింది. గాంధీ భగవద్గీతలోని నిష్కామ్యకర్మ సిద్ధాంతానికి కొత్త ఆచరణాత్మక తాత్త్వికభాష్యం చెప్పాడు. ఆవరణ నవలలో ప్రధానపాత్ర నరసింహ గౌడ గాంధేయవాదిగా పేర్కొనబడ్డాడు. నిజానికి అతడు సావర్కరులా తీవ్ర హిందుత్వవాదిలా కనపడతాడు. తాత్త్వికదృష్టిపట్ల ఈ నిర్లక్ష్యంవల్లనే భైరప్ప భగవద్గీత బోధనీ, అసలు భగవద్గీత తత్త్వాన్నీ నేలబారుగా మారుస్తాడు. యుద్ధానికి ముందు రోజు ఒక గుడారంలో చేసిన నైతిక-లౌకిక-ప్రాగ్మాటిస్ట్ బోధగా మార్చేస్తాడు. ‘దుర్యోధనుడు పాండవులను సంకరజన్మగలవారు అని విమర్శించాడు. దానికి సమాధానంగా యుద్ధం చేయక తప్పదు’ అని కృష్ణుడు చెప్తాడు. భాసుడు రాసిన ‘దూతవాక్యం’ నాటకంలో దుర్యోధనుడు పాండవుల జన్మ గురించి ప్రశ్నిస్తాడు. వారు అసలు కౌరవులకే పుట్టారా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు కృష్ణుడు, ‘జన్మరహస్యాలని తవ్వితే నువ్వు కూడా కౌరవుడివి కాదు’ అని సమాధానం చెప్తాడు. అందరి వంశాలు సాంకర్యంతో కూడినవే అంటాడు. భైరప్ప ఈ పాయింట్ తీసుకుని, ‘పాండవులు కౌరవుల మీద యుద్ధం చేయకపోతే దుర్యోధనుడి ఆరోపణకి సమాజంలో చెల్లుబాటు ఉంటుంది’ అన్నట్లు చిత్రిస్తాడు. అలాగే ‘యుద్ధం చేయకపోతే లోకం పిరికివాడు అంటుంది’ అంటాడు. దానిలోని తాత్త్వికసారాన్ని పక్కన పెడతాడు.

శ్రీకృష్ణుడు

ఇంతటితో ఆగక, శ్రీకృష్ణుడిని లీలామానుష విగ్రహుడిగా, శృంగార రసనాయకుడిగా, ఒక మార్మిక జ్ఞానానికి సంబంధించిన పురాణపురుషుడిగా చేసిన వర్ణనల్ని పరిహరిస్తూ, కేవలం చారిత్రక వీరుడుగా, సంస్కర్తగా మారుస్తాడు. తద్వారా పాశ్చాత్య క్రైస్తవుల విమర్శపట్ల ఆత్మరక్షణ (Defense Mechanism) ప్రదర్శిస్తాడు.

భైరప్ప శ్రీకృష్ణుడిని చారిత్రక పురుషుడిగా మార్చి, అతని బహుభార్యత్వాన్ని కేవలం శ్రీకృష్ణుడిలోని కరుణగా, సంస్కరణగా చూపడం ద్వారా, ఆయన శృంగారప్రియత్వాన్ని మరుగుపరచడం ద్వారా విమర్శలనుంచి ఆత్మరక్షణకు దిగుతాడు. నిజానికి శృంగారం పాపమనే క్రైస్తవ దృక్పథంవంటిది భారతీయులకు లేదు. అందుకే గుడులపైకూడా శృంగారశిల్పాలు ఉంటాయి. దేవతలు కూడా శృంగారంలో పాల్గొంటారు. ఇటువంటి రసికత నుంచి శ్రీకృష్ణుడిని భైరప్ప దూరం పెడతాడు. పాశ్చాత్య క్రైస్తవ విమర్శకు ప్రాధాన్యం ఇస్తాడు. క్రైస్తవ పాశ్చాత్యులు శ్రీకృష్ణుడి రాసలీలలు బోధించే ‘గీతగోవిందం’, అలాగే ‘శాకుంతలం’లాంటి పుస్తకాలని శృంగారం సెన్సార్ చేసి ప్రచురించారు. ముద్దుపళని రచించిన ‘రాధికాసాంత్వనం’ వంటి పుస్తకాల్ని నిషేధించారు. కందుకూరివంటి సంస్కర్తలు ఇదంతా సంస్కరణలో భాగంగా చూసారు. భైరప్ప ఈ క్రైస్తవసంస్కరణవాదంనుంచి ప్రభావితం అయ్యాడు. హిందుత్వవాదులు ప్రచ్ఛన్న క్రైస్తవులు.

చారిత్రక దృక్పథం – అయోధ్య ఉద్యమం

రామ, కృష్ణ పాత్రలను చారిత్రక పాత్రలుగా మార్చడం హిందుత్వంలో భాగమే. అయోధ్య ఉద్యమం పురాణాలపై కాదు, చరిత్రపై ఆధారపడింది. చారిత్రక శిథిలాలపై ఆధారపడింది. రాముడిని యుద్ధవీరుడుగా, ఆర్యవిజేతగా, హిందూనాయకుడిగా స్థల కాలాలలో నిలపడం ద్వారా హిందుత్వం బలం పెంచుకుంది. అయోధ్య ఆధునిక జెరూసలేముగా అవతరించింది. క్రీస్తుని చరిత్ర పురుషుడిగా చూసినట్లే రాముడిని కూడా చరిత్ర పురుషుడుగా చూడడం మొదలుపెట్టారు.

పౌరాణిక దృష్టితో చూస్తే రాముడు సర్వాంతర్యామి. అందుకే భద్రాచలానికి అంత ప్రశస్తి. నిజానికి భద్రాచల ప్రశస్తి రామ భక్తునివల్ల వచ్చింది. కేవలం రాముని వల్ల కాదు. చరిత్రగా రాముడు అక్కడ పుట్టాడా, సంచరించాడా లేదా అనేది పౌరాణిక దృష్టిలో ప్రధానంగా అసలు విషయమే కాదు. పౌరాణిక పురుషులను చారిత్రక పురుషులుగా మార్చడం ద్వారా రాముడిని అయోధ్యకి కుదించగలిగారు. స్థలకాల బద్దం చేశారు.
భైరప్ప పురాణ పురుషులను చారిత్రక పురుషులుగా నిలిపారు. నిజానికి భారత, రామాయణాలకు పురావస్తు ఆధారాలు లేవు. కానీ ఆ కథలు ప్రజల స్మృతులలో వివిధ రూపాలలో కొనసాగుతూ వచ్చాయి. ఆ కథలు మానవుల ఊహల సరిహద్దులను దాటాయి. కానీ భైరప్ప ఆ కథలను పూర్తిగా నేలబారుగా మార్చాడు, తద్వారా చారిత్రకం చేశాడు.

హిందుత్వం – ద్విజాతి సిద్ధాంతం

ఈ చారిత్రకదృష్టినుంచే హిందుత్వం బలపడింది, ద్విజాతి సిద్ధాంతం బలపడింది. తదనంతర దశలో ఈ ద్విజాతి సిద్ధాంతానికి నవలారూపం ఇచ్చాడు భైరప్ప; ‘ఆవరణ’ నవల అదే. వర్తమానాన్ని, మధ్యయుగపు ముస్లిం పాలనాకాలాన్ని కలుపుతూ రాసిన నవల.

‘ఆవరణ’లో హిందుత్వాన్ని మూడు తర్కాలపై నిలబెడతాడు: 1) కులనిర్మూలన, 2) మత స్థాపన, 3) ఇతరుల నుంచి (ముస్లింల నుంచి) హిందుత్వాన్ని పూర్తిగా వేరుపరచడం, పరస్పర శత్రువులుగా చూపటం.

కులనిర్మూలన: భైరప్ప రచనలలో కులనిర్మూలన ప్రధానమైనది. కుల-జాతి సాంకర్యం గురించి ప్రధానంగా మాట్లాడుతూ వచ్చాడు. పౌరాణికమైన ‘పర్వ’ నవల, అలాగే ‘దాటు’లో ఈ కుల సాంకర్యం, కులనిర్మూలనే ప్రధాన ఇతివృత్తాలు. ‘ఆవరణ’ నవల కులనిర్మూలనవాది నరసింహ గౌడపై ఆధారపడుతుంది. అయితే అతడు హిందుత్వవాది, ముస్లిం వ్యతిరేకి. చివరికి కులనిర్మూలన వాదం ఈ నవలలో హిందుత్వంలో, ముస్లిం వ్యతిరేకతలో ముగుస్తుంది.

మత అస్పృశ్యత: ఆశ్చర్యకరంగా ఈ నవలలో కుల అస్పృశ్యత స్థానంలో మత అస్పృశ్యతను ప్రతిపాదిస్తాడు భైరప్ప. మత అస్పృశ్యతను సమర్థిస్తాడు.

కులనిర్మూలనలో హిందుత్వం

‘ఆవరణ’ నవలలో నరసింహ గౌడ గాంధీ సిద్ధాంతాలను పాటించేవాడిగా వర్ణించబడ్డాడు. ఆయనను గాంధేయవాది అనడం ఒక వక్రీకరణ. సావర్కర్ వాది అంటే బాగుండేది. ఆయన సమాజంలో ఉన్న కులవివక్షను, అంటరానితనాన్ని పూర్తిగా తొలగించడానికి చాలా కష్టపడ్డారు. ఆయన కృషివల్లనే దళితులకు (హరిజనులకు) రెస్టారెంట్లు, దేవాలయాలు, పబ్లిక్ బావుల్లోకి వెళ్లే అవకాశం దొరికింది.

కులవివక్షను పోగొట్టడానికి నరసింహ గౌడ ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన తన కూతురు (రజియా/లక్ష్మి) ఒక ముస్లిం వ్యక్తిని (అమీర్‌) పెళ్లి చేసుకోవడాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ఎందుకంటే ఆమె ఇస్లాం మతం స్వీకరించింది, అందుకే ఆమె ఇక తన కూతురు కాదని, తనతో ఆమెకు ఏ సంబంధం లేదని నరసింహ గౌడ ప్రకటించారు. అంతేకాకుండా, ఆమెను తన జీవితంనుండి, ఆస్తి వారసత్వంనుండి శాశ్వతంగా దూరం చేశారు.

విశ్వనాథ భిన్నవాదం

ఈ వాదానికి పూర్తి భిన్నంగా విశ్వనాథ సత్యనారాయణ (‘మ్రోయు తుమ్మెద’ నవలలో) కులాలు పాటించే అస్పృశ్యత ముస్లిం ప్రభువులతో అగ్రవర్ణాల స్నేహానికి కారణమైంది అంటాడు. హిందువులలో ఉండే ఈ వేర్పాటుతత్త్వం ముస్లిం ప్రభువులకు నచ్చింది. వారు కూడా సాధారణ ప్రజలలో కలిసిపోకుండా విడిగా ఉండడాన్ని ఇష్టపడేవారు అంటారు.

కానీ భైరప్ప ‘ఇస్లాం మతమే జాతిపరమైన వేర్పాటును భేదభావాన్ని పాటిస్తుంది; పైగా తన ఆచారాలను హిందువులపై రుద్దుతుంది’ అని వాదిస్తాడు. మరోవైపు గ్రామాలలో ముస్లింలని అస్పృశ్యులుగా చూడడం గురించి రాస్తాడు కానీ, అటువంటి వైఖరిని ముస్లిం ప్రమాదాన్ని తప్పించుకోవడానికి హిందువులు అవలంబించే ఆత్మరక్షణ చర్యగా చూపుతాడు.

‘ఆవరణ’ నవలను పరిశీలిస్తే ముస్లింలపై వివక్ష గ్రామాలు, నగరాలు అనే తేడా లేకుండా కొనసాగుతుందని అర్థం అవుతుంది. దాన్ని నిశ్శబ్దబహిష్కరణగా, అస్పృశ్యతతో సమానమైన సామాజిక మినహాయింపుగా పరిగణించవచ్చు. స్వగ్రామమైన నరసపురంలో రజియా/ లక్ష్మి తన ఇంట్లో కూడా అస్పృశ్యతని ఎదుర్కోవటం, ఆమెపట్ల సాధారణ జనం కూడా అంటరానితనాన్ని పాటించటం, అలాగే ముస్లిం అయిన ఆమె కొడుకు నీటిని తాకడంవలన అది మైల పడిపోయిందని అక్కడివారు ఆందోళన చెందడంవంటి ఉదాహరణల ద్వారా సామాజికదూరం, మతపరమైన కాలుష్యభయంవంటి సామాజిక వైఖరులు స్పష్టం అవుతాయి. నగరాలలో కూడా ఇదే కనబడుతుంది. బెంగళూరు నగరంలో, ముస్లింలకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరించడం, అపార్ట్‌మెంట్లలో మతం ఆధారంగా విభజన, పొరుగువారు అనుసరించిన నిశ్శబ్ద బహిష్కరణ రూపంలో వివక్ష కనిపించింది. ఇది కేవలం మతపరమైన భేదం కాదని, రజియాలాంటి వాళ్ళ మతాంతర వివాహం, మతాంతరీకరణ, విప్లవాత్మక విధానాలకు ఇతరులు భయపడటం, ఆమెను తమ పిల్లలకు ఆదర్శంగా ఉండకూడదని భావించడం వలన వచ్చిందని భైరప్ప ఈ నవలలో సమర్ధిస్తాడు. ఈ తర్కం ద్వారా ‘లవ్ జిహాద్’ పేరుతో, ఇంకా ఇస్లామిక్ ఫోబియా ఆలోచనలతో రైటిస్టులు చేసే తర్కానికి బలాన్ని చేకూరుస్తాడు. ఈ నవలలో చరిత్రలోనూ, వర్తమానంలోనూ ద్విజాతి సిద్ధాంతానికి హేత్వాభాస – హేతువులా కనపడే అహేతుకతను కూరుస్తాడు భైరప్ప.

సంకుచితత్వం (Reductionism)

భైరప్పలో రెండు రకాల సంకుచిత తత్త్వాలు కనపడతాయి:

* హిందూ మతాన్ని కేవలం బ్రాహ్మణ సంస్కృతి దృష్టినుంచి చూసే ప్రచ్ఛన్న క్రైస్తవం.
* ఇస్లాంని, ముస్లింలని ఏకశిలా సదృశంగా చూడడం.  దీనివల్ల ముస్లింలకు మాత్రమే కాదు, హిందువులకు కూడా తమ సంస్కృతిని తాము అర్థం చేసుకోవడం అసాధ్యంగా మారుతుంది. బహుళత్వం, సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి అడ్డంకిగా మారుతుంది.

సనాతనుల దృష్టి

భైరప్ప చరిత్ర పుస్తకాల మీద ఆధారపడ్డాడు కానీ సమకాలీన పీఠాలు, సాధు-సన్యాసులు, ప్రజల విశ్వాసాన్ని పట్టించుకోలేదు. ఆయన ఆధారపడిన చరిత్ర పుస్తకాలుకూడా ఎక్కువగా ఇంగ్లీష్ దొరలవి, వారిని అనుకరిస్తూ చరిత్ర రాసిన వారివి.
*శంకర పీఠాల ఆచార్యుల అభిప్రాయాలు: ప్రధానంగా శంకరపీఠాల ఆచార్యుల అభిప్రాయాలు భైరప్ప ఆలోచనలకి పూర్తి భిన్నంగా ఉన్నాయి. శృంగేరి పీఠాధిపతి చంద్రశేఖర భారతి గురించి కూడా భైరప్ప ప్రస్తావించడు. ‘గృహభంగ’ నవలలో బ్రాహ్మణ కుటుంబం శృంగేరి యాత్ర చేయడం గురించి వర్ణిస్తాడు. కానీ శృంగేరి పీఠాధిపతి టిప్పు సుల్తాన్ గురించి, ముస్లింల గురించి వ్యక్తం చేసిన అభిప్రాయాలు భైరప్ప అభిప్రాయాలకి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.

చరిత్ర రచనలో వలసవాద దృక్పథాన్ని చంద్రశేఖర భారతి స్వామి విమర్శించారు. ‘టిప్పుసుల్తాన్‌ను కేవలం మతమౌఢ్యం కలిగినవాడుగా చిత్రించటం, బ్రిటిష్ క్రైస్తవ ప్రభువులు తమకంటే ముందు పరిపాలించిన ముస్లింలను దుర్మార్గంగా చిత్రించి తమని గొప్పవాడుగా చూపుకోవడం కోసమే చేసిన కుహనా చరిత్ర. అని ఆయన విమర్శించారు. మరాఠా దొరలు దాడి చేసినప్పుడు టిప్పు సుల్తాన్ శృంగేరి పీఠానికి మద్దతు తెలపడం, శృంగేరి పీఠానికి ఎన్నో విలువైన బహుమతులు ఇవ్వటం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే ఎందరో ముస్లిం ప్రభువులు శంకరమఠానికి చేసిన సేవ గురించి శంకరమఠ చరిత్రలోనే కాదు స్వామివారి భాషణల్లో కూడా ఆధారాలు దొరుకుతాయి. టిప్పుసుల్తాన్‌ను పూర్తి మతమూఢునిగా చిత్రించాడు భైరప్ప.

*కంచి శంకరాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామి మతాలకి ప్రత్యేక హక్కులు కావాలని రాజ్యాంగ సభకు సలహా ఇచ్చిన మేధావి. ఆయన పంపిన ప్రతినిధివర్గం అంబేద్కర్‌ను కలిసి చర్చించింది. మతాల హక్కుల గురించి మాట్లాడారు కానీ హిందూమతం అని ఒక ప్రత్యేక మతం గురించి నొక్కి చెప్పలేదు. ‘హిందూమతం అనే పేరు శైవ, వైష్ణవ, స్మార్త, లింగాయత్‌లాంటి బహుళ అస్తిత్వాన్ని యిముడ్చుకోలేదు’ అని ఆయన వాదించారు. అంతేకాదు, ‘హిందువు అనే పదం పరాయిది’ అన్నారు. ఇదే మాట శృంగేరి పీఠాధిపతి చంద్రశేఖర భారతి స్వామి కూడా చెప్పారు.

కంచి పరమాచార్య (జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి) రాజ్యాంగ నిర్మాణదశలో ‘హిందూ మతం’ అనే పదాన్ని ప్రత్యేకంగా కాకుండా, ‘మతాలు’ (లేదా మత సంస్థలు) యొక్క హక్కుల రక్షణ కోసం నిబంధనలు చేర్చాలని సూచించడానికి గల కారణాలు, ముఖ్యంగా సనాతనధర్మాన్ని, దాని సారాన్ని రక్షించాలనే సంకల్పంనుంచే వచ్చాయి.

* ‘హిందూమతం’ యొక్క విస్తృత స్వభావం : ‘హిందూమతం’ అనేది వాస్తవానికి ఒకే ఒక్క నిర్దిష్ట సంస్థాపరమైన పేరు కాదు. ఇది వైష్ణవం, శైవం, స్మార్తం వంటి అనేక శాఖలు, సిద్ధాంతాలకు చెందిన వివిధ మతసంస్థల సముదాయం.

* హిందూమతానికి చెందిన ఏ వ్యక్తి అయినా, తాను వైష్ణవుడైనా, శైవుడైనా, మొదట తాను హిందువుగా పరిగణించుకోడు. అదే విధంగా, మన దేశంలోని ఏ మతసంస్థ అయినా ‘హిందూమతం’ అనే పేరుతో వ్యవహరించదు. అవి వైష్ణవ, స్మార్త, శైవ సిద్ధాంతాలకు సంబంధించిన సంస్థలుగానే ఉంటాయి.

* రాజ్యాంగ నిబంధనలో మార్పు సూచన (Constitutional Clause Modification): ఈ సమస్యను అధిగమించడానికి, స్వామివారు కీలకమైన న్యాయశాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక సూచన చేశారు. రాజ్యాంగంలో మత స్వాతంత్ర్యం గురించి చర్చించే నిబంధన (Clause) లో “ప్రతి మతము, ఆ మతాలకు చెందిన అన్ని శాఖలు ఈ క్రింది హక్కులను కలిగి ఉంటాయి” అనే మాటలను చేర్చాలని ఆయన సూచించారు.

ఈ విధంగా స్వామివారు ‘మతాలు’ (మరియు వాటి శాఖలు) అనే విస్తృతపదాన్ని రాజ్యాంగంలో చేర్చమని కోరారు. తద్వారా హిందూమతంలోని వివిధ శాఖలకు చెందిన సంస్థలన్నింటికీ రాజ్యాంగ రక్షణ లభించింది. ఈ సూచనల ప్రకారం ఆ నిబంధన రాజ్యాంగసభచే ఆమోదం పొందింది. స్వామివారు మతాలు అనే పదం ప్రత్యేకంగా వాడారు. ఆ పదంలో అన్ని మతాలు – అబ్రహామిక్ మతాలతో సహా ఇమిడిపోవడం విశేషం.

* ఇప్పుడు ఏకశిలా సదృశ హిందూ అస్తిత్వంపై రాజకీయాలు నడుస్తున్నాయి. భైరప్ప కూడా ఆ కోవలోనివాడే. కుల వ్యవస్థను, వర్ణవ్యవస్థను సమర్థించిన సనాతనులు బహుళత్వం కొనసాగాలని కోరుకున్నారు. చంద్రశేఖర సరస్వతి స్వామి ‘హిందూ మతహక్కు’ అనే కాకుండా ‘మతాల’ హక్కుల గురించి మాట్లాడారు. తద్వారా అబ్రహామిక్ మతాలతో సహా అన్ని మతాల హక్కుల గురించి కూడా పరోక్షంగా ప్రస్తావించినట్లు అయింది.

* ఈ బహుళత్వ దృష్టి వల్లనే స్వామి ముస్లింలకి కూడా దైవంగా, ఆరాధనీయుడిగా మిగిలారు. ఆయన క్రైస్తవానికి అద్వైతానికి గల పోలికలను గురించి మాట్లాడేవారు. అలాగే ఒక ముస్లింకి నమాజ్ ఎలా చేయాలో ఆయన శాస్త్రబద్ధంగా బోధించారు. కర్ణాటకకు చెందిన ద్వైతమఠం పెజావర్ స్వామి ఇఫ్తార్ విందు జరపడం విశేషం.

శృంగేరి శంకరాచార్య అభిప్రాయాలు

ముస్లింల మత దాడులను స్వామి కప్పిపుచ్చలేదు. అదే సమయంలో అందరు ముస్లిం రాజులనూ ఒకే గాటన కట్టి ద్వేషించడం వెనుక ఉన్న వలసవాద రాజకీయాలని ఆనాడే పసిగట్టారు. ఇంత ప్రముఖులైన స్వాములగురించి తన నవలలో ప్రస్తావించడు భైరప్ప. ధర్మాన్ని గురించి మతాచార్యులు కాక చరిత్రకారులు మాత్రమే నిర్ణయించాలి అనే ఆయన ఉద్దేశం.

* విశ్వనాథ అభిప్రాయాలు: తెలుగు రచయిత విశ్వనాథ సత్యనారాయణ ‘మ్రోయు తుమ్మెద’ నవలలో ముస్లింల ప్రసక్తి చాలా ఎక్కువ. హిందూస్థానీ సంగీతాన్ని ఆరాధించి, ముస్లిం గురువుల శుశ్రూష చేసి సంగీత పండితుడిగా మారిన నారాయణరావు వాస్తవ కథ ఇది. హిందూస్థానీ సంగీతంలో గొప్ప విద్వాంసులు ముస్లింలే. అయితే వారు చూపులకు మాత్రమే ముస్లిములు కానీ దేవీ దేవతల ఆరాధకులు అంటారు విశ్వనాథ.

అంతమాత్రాన ఆయన ‘ఘర్ వాపసీ’కి పిలుపు ఇవ్వరు. హిందూస్థానీ సంగీతం తురుష్క కారాగారంలో బందీ అయిందనే భావన నవలలో కొన్నిచోట్ల ఉంది కానీ ‘నిజమైన విముక్తి, మోక్షమార్గం ఆత్మాన్వేషణ మాత్రమే, జాతి ద్వేషం కాదు’ అని ధ్వన్యాత్మకంగా వ్యక్తం చేస్తారు విశ్వనాథ. వట్టి సంగీత చరిత్రగా కాక ఆధ్యాత్మిక అన్వేషణగా ముగుస్తుంది నవల. ఈ నవలలో విశ్వనాథ అభిప్రాయాలపై పరిశీలన చేస్తే సనాతన దృక్పథం స్పష్టం అవుతుంది.

మ్రోయు తుమ్మెద: విశ్వనాథ, గానదేవత, తల్లిదండ్రుల సంభాషణ

విశ్వనాథ సత్యనారాయణగారి నవల ‘మ్రోయు తుమ్మెద’ చివరలో విశ్వనాథ (రచయిత), గాన రసాధిదేవత, కథానాయకుడు నారాయణరావు తల్లిదండ్రుల ఆత్మలతో సంభాషించినట్లు ఒక కల్పన చేస్తారు. గాన రసాధిదేవత పేరుతో సంగీతానికి ఒక వ్యక్తి రూపాన్ని కల్పిస్తాడు విశ్వనాథ.

* తల్లి వాదన: కొడుకు లౌకికంగా బాగుపడాలని ఆమె కోరుకుంది. ‘అస్పష్టమైన కొత్త మార్గంలో కష్టపడటం కంటే, అందరికీ తెలిసిన విస్పష్టమైన మార్గాన్ని ఎంచుకోవడం సులభం కదా’ అంది. ఈ విస్పష్టమార్గం ముస్లిం ప్రభావంగల హిందుస్థానీ సంగీతం. గొప్ప విద్వాంసుల వద్దకు తీసుకెళ్లి ప్రోత్సహించినట్లు చెప్పింది. విశ్వనాథతో, ‘మీరు రాసిన గ్రంథాలు కాలంపై నిలుస్తాయి, కానీ సంగీతం అలా కాదు. ఏ సభలో పాడితే ఆ సభతోనే అది పూర్తి అవుతుంది,’ అని వాదించింది.

* తండ్రి వాదన: కొడుకు విద్యావంతుడు కావాలని, ముఖ్యంగా సంగీతంలో అనన్య సామాన్యమైన వ్యక్తిత్వం (Individualism) సాధించాలని ఆశించాడు. సొంత మార్గంలో నడిస్తే అభినవ నారదుడు అయ్యేవాడని, హిందుస్తానీ సంగీతంలోకూడా కొత్త ఆంధ్రీమార్గం వచ్చేదని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తల్లి జోక్యంవల్లనే కొడుకు నేటి – ప్రచారంలో ఉన్న మార్గానికే పరిమితమయ్యాడని ఆవేదన చెందాడు.

* విశ్వనాథ వివరణ: “ఈమె (తల్లి) తప్పు కాదు. తల్లికి పిల్లవాడు లౌకికంగా బాగుపడాలని, తండ్రికి విద్యావంతుడు కావాలని అనిపిస్తుంది. కష్టమైన, కొత్త పనిని లోకం మెచ్చుకోదని, అందరూ చేసే పనిని రమ్యంగా చేస్తేనే మెచ్చుకుంటుంది,” అని విశ్వనాథ ఎడిసన్ జీవిత చరిత్రను ఉదాహరణగా చెప్పాడు. విశ్వనాథ రాసిన కవిత్వం కూడా లోకానికి నచ్చక ఇబ్బందులు పడుతోందని, కానీ కాలక్రమేణా తెనాలి రామకృష్ణుని కవిత్వానికి అంగీకారం దొరికినట్లే తన మార్గానికీ లభిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తాడు.
గాన రసాధిదేవతతో సంభాషణ (సంగీతం, నిద్రావస్థ గురించి)

* సభలోని సంగీతం vs ఇంటివద్ద సంగీతం: గానదేవత, సభలో పాడే సంగీతం (ముసల్మానుల వైఖరిని పోలి) ఒకలా, ఇంటివద్ద వినిపించే సంగీతం (సంపూర్ణంగా భారతీయ, రసభావసహితమై) మరొకలా ఉంటుందని విమర్శిస్తుంది.

* విశ్వనాథ సమన్వయ దృష్టి: సభలో పాడినప్పుడు కీర్తనకు అవయవాలు ఉండాలి. గాయకుడు ఖ్యాలీ గాయకుడు కాబట్టి స్వేచ్ఛగా విస్తరించి పాడతాడు. ఇంటివద్దైతే రాగ స్వరూపాలు, వాటి మార్పులు, స్వరోచ్చారణ రమణీయతలను చూపిస్తాడని విశ్వనాథ వివరించాడు. ఏకాంతసాధనకు, బహిరంగ ప్రదర్శనకు కళ వ్యక్తీకరణలో తేడాలు ఉంటాయని, ఇవి అనివార్యమని విశ్వనాథ భావించాడు. అంతేకానీ ఈ రెండు పద్ధతులలో దేన్నీ నిరాకరించలేదు; జాతి భేదం చూపలేదు.

* నిద్ర, జాగ్రదవస్థ, సంగీతానందం: గానదేవత ఒక పాత సంఘటనను గుర్తు చేస్తుంది: విశ్వనాథ అలసిపోయి పడక కుర్చీలో నిద్రిస్తుండగా, నారాయణరావు పాడిన సంగీతం ఆ నిద్రలోనూ వినిపించింది. అప్పుడు అనుభవించిన ఆనందం ‘నిద్రలోని జాగ్రదవస్థ’ వంటిదని, అది సమాధికి దగ్గరగా ఉండే తన్మయత్వం అని ఆమె వాదిస్తుంది.

* విశ్వనాథ అంగీకరించకపోవడం: విశ్వనాథ ఆ మాటను ఖండిస్తాడు. అది సమాధికి సన్నిధిలో ఉన్నా సమాధి కాదని, ‘నిద్రలోని జాగ్రత్’ అసలే కాదని అంటాడు. నిద్రావస్థ, జాగ్రదవస్థ రెండూ ఒకటయ్యాయని చెప్పడం పొరపాటని, అవి జ్ఞాన-కర్మలవంటి పరస్పర విరుద్ధపదార్థాల సంయోగం మాత్రమే, సమైక్యం కాదని అంటాడు. ఈ సంభాషణలో ఆ గానదేవతకి అంటే సంగీతానికి విముక్తి జాతిపరమైనది కాదని, ఆధ్యాత్మికమైనదని, ఆత్మ-పరమాత్మల సంయోగానికి సంబంధించిందని విశ్వనాథ స్పష్టం చేస్తారు. నారాయణరావు ఆ మార్గంలోనే ప్రయాణిస్తున్నారని విశదం చేస్తారు. ‘మతం పేరుతో, సంగీతం పేరుతో, భాష పేరుతో చలామణిలో ఉన్న వివిధ వైఖరులు, సంప్రదాయాలు-ఆచారాలకన్నా ఆత్మజ్ఞానం గొప్పది’ అని విశ్వనాథ దీనిలో స్పష్టం చేస్తారు. మరోచోట మతాధిపత్యాన్ని, ఆచారాధిపత్యాన్ని విమర్శిస్తూ మాట్లాడతారు.

* గాయకుని సన్యాసం: చివరకు విశ్వనాథ ఒక రహస్యం బయటపెడతారు: నారాయణరావు సన్యాసాశ్రమం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడని.

* తల్లి ఆశ్చర్యం: తల్లి ఆశ్చర్యపోయి, ‘నువ్వు పెద్దవాడవై ఉండి సన్యసించవద్దని కొడుకును ఎందుకు వారించలేద’ని విశ్వనాథను నిందిస్తుంది.

* కర్మ సిద్ధాంతం: తల్లిదండ్రుల వాదనలను విన్న విశ్వనాథ ‘చనిపోయిన తర్వాత కూడా వారి మనస్సులలో కొడుకుపై మమకారం, వ్యామోహం పోలేద’ని అంటాడు. ‘అంతా వాని కర్మ అని, దానికనురూపంగానే వారూ ప్రవర్తించార’ని చెప్పి, ఆ గొడవను ఆపుతాడు.

* గాయకుని చరిత్ర: చివరగా, గాయకుని తండ్రి, విశ్వనాథ రాసిన గ్రంథం (మ్రోయు తుమ్మెద నవల) గురించి అడుగుతాడు. అది తన ప్రయత్నం యొక్క వైఫల్యం మరియు గాన రసాధిదేవత యొక్క బంధవిముక్తి గురించిన చరిత్ర అని విశ్వనాథ చెబుతాడు. ఈ బంధ విముక్తిని క్రమక్రమంగా కింది స్థాయినుంచి ఉన్నత స్థాయికి ఆవిష్కరిస్తూ వెళతారు విశ్వనాథ.

గానదేవత బంధవిముక్తి

1. తురుష్క సంప్రదాయ బంధనం నుంచి విముక్తి.

2. నిజమైన విముక్తి అసలు సంగీతంలో కానీ ఏ సంప్రదాయంలో కానీ ఆచారంలో కానీ లేదు. సంగీతానుభవం బ్రహ్మజ్ఞానాన్ని పోలి ఉండొచ్చు కానీ అది బ్రహ్మజ్ఞానం కాదు. అంతిమంగా ఆత్మజ్ఞానమే ప్రధానం, అదే గమ్యం.

3. చివరికి సంగీతాన్ని అప్పటికి ఉన్న ముస్లిం ప్రభావంనుంచి విముక్తం చేయడం అనేదాన్ని పక్కన పెడతాడు. అలాగే సంగీతానికి కానీ కళలకు కానీ ఉన్న అగ్రస్థానాన్ని ప్రశ్నిస్తాడు విశ్వనాథ. చివరికి ‘ఆత్మజ్ఞానం మాత్రమే ప్రధానం’ అని నిరూపిస్తాడు. ‘సంగీతాన్ని కాదు విముక్తం చేయాల్సింది. మనని మనం అన్ని భేదభావనలనుంచి, ద్వైతభావననుంచి విముక్తం చేసుకోవాలి, అదే నిజమైన అభయస్థితి’ అనే ఉపనిషత్ తత్త్వాన్ని విశ్వనాథ ఇక్కడ స్పష్టం చేస్తారు. అందుకే సంగీతదేవత అహంకారాన్ని కూడా నిలదీస్తాడు.

తల్లి చివరకు విశ్వనాథ, సంగీత విద్వాంసుడైన నారాయణరావు, జీవితచరిత్ర రాయడానికి కారణం అతను లోకోత్తరమైన సంగీతం పాడడం కాదని, అతని జీవితం విలక్షణమైంది, అసామాన్యమైన పరిస్థితులు కలదని, అసామాన్య విషయాలను తీసుకుని కవి రసభావాలు సంయోజనం చేసి కావ్యం రాస్తాడని వివరించి సంభాషణ ముగిస్తుంది. ఇక్కడ విశ్వనాథ సంగీతం కన్నా జీవితం ప్రధానమైనదని, జీవితపు పరమలక్ష్యం ప్రధానమైనదని స్పష్టం చేస్తాడు. ఈ నవల జాతి సమస్యనుంచి ఆధ్యాత్మికత వైపు దృష్టిని మళ్ళిస్తుంది. ఇలా కళలు, భాషలు, జాతులు, వాటి వైరుధ్యాలనుంచి అద్వైతస్థితి వైపు ప్రయాణిస్తాడు.

* మనిషి సాధించవలసింది అంతరంగంలో విముక్తి. సంగీతంతో, సంగీతసాధనతో మొదలైన నవల ఆధ్యాత్మికతలో ముగిసింది. మధ్యలో ఒక ముస్లిం ఫకీరు సంగీత కళాకారుడు నారాయణరావును తన కొడుకుగా భ్రమపడతాడు. విశ్వనాథ కూడా తన తండ్రిని స్మరించుకుంటాడు. ఇది విశ్వనాథ హృదయ వైశాల్యాన్ని సూచిస్తుంది. ఆయన ఉర్దూభాష ఆధిపత్యం గురించి కూడా కొన్నిచోట్ల ఈ నవలలో మాట్లాడారు కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. నిజాం పరిపాలనాకాలంలో ఉద్యమకారులందరూ తెలుగుభాష వ్యాప్తికోసం పోరాడారు. అంతమాత్రాన విశ్వనాథ ఉర్దూను ద్వేషించలేదు. ‘సామల సదాశివ ఉర్దూభాషలో తనపై రాసిన వ్యాసం అంతవరకు వచ్చిన అన్ని విమర్శలకంటే గొప్పది’ అని ఆయన అన్నారు. ఆ వ్యాసం నిష్పాక్షికంగా వ్రాయబడిందని విశ్వనాథ అన్నారు. మితిమీరి పొగడడంకానీ తెగడడంకానీ దానిలో చేయలేదని, వ్యాసంలో సమతుల్యత ఉంటుందని ఆయన ప్రశంసించారు.

యథాస్థితి వాదులుగా కనబడవచ్చు కానీ సనాతనులలో ఆధునికులలో కనపడినంతగా భాషల పట్ల, జాతులపట్ల భేదభావం కనబడదు. స్వతంత్ర భారతంలో కొంతకాలంవరకు ఇంగ్లీష్‌నే అనుసంధాన భాషగా కొనసాగించాలని కంచి పరమాచార్య చెప్పటం విశేషం. ఒకచోట హిందువులే తమ ఆలయాల్ని కూల్చుకొని ఉండవచ్చునని, వాళ్ళ నిర్లక్ష్యమే ఒక ఆలయం శిథిలావస్థలో మిగిలిపోవడానికి, పూజా పునస్కారాలకు దూరం కావడానికి కారణం అయి ఉండవచ్చునని విశ్వనాథ రాశారు. అలాగే నిజాం ప్రభువు మతకలహాలు పెచ్చరిల్లకుండా జాగ్రత్త తీసుకున్నారని కూడా ఆయన రాశారు.

విశ్వనాథ జీవించి ఉంటే ఈనాడు బహిరంగంగా హిందుత్వవాదిగా ప్రకటించుకునేవారని విమర్శకులు కల్లూరి భాస్కరం అంటారు. అయితే కులనిర్మూలనవాది, ఒకప్పుడు లెఫ్టిస్టులు తీవ్రంగా మెచ్చుకున్న చారిత్రక రచయిత భైరప్ప, బహిరంగంగా తనని హిందుత్వవాదిగా ఎందుకు ప్రకటించుకున్నారు? దీనికి విరుద్ధంగా శంకరాచార్యులు, విశ్వనాథ సత్యనారాయణవంటి వారిలో హిందుత్వానికి విరుగుడు అయిన వ్యాఖ్యానాలు ఎందుకు లభిస్తున్నాయి? ఇది ఒక ప్రహేళిక. ఆధునికతలో దాగిన సంకుచితత్వాన్ని, మతతత్త్వాన్ని గుర్తించడంలో మనం విఫలం అయ్యాం.

చరిత్ర vs. ఆధ్యాత్మికత

ప్రధానంగా భైరప్ప దృక్పథంలో లోపించింది ఆధ్యాత్మికత. అందుకే ఆయన ఆధునికవాదానికి, అస్తిత్వవాదరాజకీయాలకు బందీగా మారాడు. దేశాన్ని పుణ్యభూమిగా నిర్వచిస్తూ, కొన్ని జాతులను పరాయిగా మార్చే దృక్పథానికి రమణ మహర్షి నిర్వచనం చెంపపెట్టు. పురాణపురుషులను, పురాణ దేవతలను చారిత్రక పురుషులుగా మార్చి, వారిని కాపాడతామంటూ రాజకీయం చేసే వారికి వివేకానందుడి చివర రోజులలోని స్వప్నం సరైన సమాధానం.

వివేకానందుడి కల

వివేకానందుడు ఒకసారి క్షీరభవాని దేవాలయం శిథిలాలను చూసి తీవ్రంగా కలత చెందారు. ఆ దేవాలయాన్ని ముస్లిం ఆక్రమణదారులు చాలా కాలం క్రితం ధ్వంసం చేశారు. వివేకానందుడు తనలో తాను ఇలా అనుకున్నారు: “ప్రజలు ఇంతటి అపవిత్రతను ఎలా సహించారు? నేను ఇక్కడ ఉండి ఉంటే, నేను దేవిని రక్షించడానికి నా ప్రాణాలను అర్పించి ఉండేవాడిని.”

అప్పుడు ఆయనకు అమ్మవారి దివ్యస్వరం వినిపించింది:  “నా గుడిలోకి అన్యమతస్థులు వచ్చి నా విగ్రహాన్ని అపవిత్రం చేస్తే నీకేంటి? నువ్వు నన్ను రక్షిస్తావా, లేక నేను నిన్ను రక్షిస్తానా?”

ఈ అనుభవం తర్వాత, వివేకానందుడు తన శిష్యులతో ఇలా అన్నారు: “ఇప్పుడు కేవలం మాత మాత్రమే మిగిలింది. నేను చాలా తప్పుగా ఆలోచించాను, నేను కేవలం ఒక చిన్న పిల్లవాడిని.”

మరొకసారి, వివేకానందుడు ఆ శిథిలమైన చోట ఒక కొత్త ఆలయాన్ని నిర్మించాలని ఆలోచించారు. వెంటనే అమ్మవారి స్వరం వినిపించింది: “బిడ్డా! నాకు కావాలంటే, నేను అసంఖ్యాక దేవాలయాలు, మఠాలను నిర్మించుకోగలను.”

పుణ్యభూమి, దేశభక్తి గురించి రమణ మహర్షి అభిప్రాయం

​రమణ మహర్షి వద్దకు ఒక విదేశీయుడు వచ్చి, ‘తాను హిందూమతంలోకి మారాలని, భారత్ తన పుణ్యభూమి’ అని చెప్పాడు. దానికి రమణ మహర్షి: “ఈ ప్రపంచమంతా దేవుడి సృష్టే అయినప్పుడు, ఇందులో కొన్ని మాత్రమే పుణ్యభూములు అని చెప్పడం సరియైనదేనా?” అని ప్రశ్నించారు.

‘ఈశావాస్యమిదం సర్వం’ – ఈ విశ్వమంతా ఈశ్వరుడి స్వరూపమే అనే ఉపనిషత్ తత్త్వానికి చరిత్ర దృష్టితో ఎదురీదుతాడు భైరప్ప. ఆవరణ అనే అద్వైత భావనని చరిత్రకి అన్వయించి, దాని అర్ధాన్ని కుదిస్తాడు.

వేదాంతసిద్ధాంతం ప్రకారం, నిజమైన సత్యాన్ని దాచిపెట్టే చర్యను ‘ఆవరణ’ అని, అబద్ధాన్ని లేదా అసత్యాన్ని చూపించే (ప్రొజెక్ట్ చేసే) చర్యను ‘విక్షేపం’ అని అంటారు. ఈ రెండు భావనలు – ఆవరణ మరియు విక్షేపం – ఒక వ్యక్తి స్థాయిలో జరిగినప్పుడు దానిని ‘అవిద్య’ అని పిలుస్తారు. అదే విధంగా, అవి ఒక సమూహం స్థాయిలో లేదా మొత్తం ప్రపంచ స్థాయిలో సంభవించినప్పుడు దానిని ‘మాయ’ అని పిలుస్తారు. ఈ వేదాంతభావనలతో బౌద్ధ తత్త్వవేత్తలు కూడా ఏకీభవించారు. ఈ అద్వైత దృక్పథాన్ని చరిత్ర రచనకి అన్వయిస్తాడు భైరప్ప. చరిత్రకారులు చెప్పే అబద్ధాలని నిరాకరించి, తాను చారిత్రక సత్యాన్ని ప్రకటిస్తున్నానని అంటాడు. స్థలకాలాతీతమైన, అనంతమైన అద్వైతాన్ని మితిమీరి స్థలకాలబద్ధమైన, పాశ్చాత్యప్రభావితమైన చారిత్రక దృష్టిలోకి కుదిస్తాడు. నిజానికి ఈ చరిత్ర పేరుతో జాతి విభేదాలను శాశ్వతమైనవిగా ప్రకటిస్తాడు. అద్వైతం అహాన్ని విడిచిపెట్టమని చెబితే, ‘హిందుత్వం మాత్రమే అన్నిటికంటే గొప్పది’ అని చాటటం ద్వారా అహంభావాన్ని ప్రకటిస్తాడు. ‘అదర్‌/ఇతరం అనే భావన బలపడడమే భయానికి మూలం’ అనే అద్వైతసత్యాన్ని సీత మానసిక విశ్లేషణకి ఉపయోగించిన భైరప్ప, తాను మాత్రం ఇతర మతద్వేషం అనే ఊబిలోకి కూరుకుపోతాడు. దీనికి విరుగుడు రామకృష్ణ పరమహంస తత్త్వం. రామకృష్ణ పరమహంస ‘అద్వైతం అన్ని వేదాంతాలకన్నా గొప్పది’ అనే అహంభావాన్ని కూడా వ్యతిరేకించారు. మతాలు, సిద్ధాంతాలలో ‘హైరార్కీ’ని కాదు అన్నారు.

రామకృష్ణ పరమహంస బోధనల ద్వారా సర్వమత సమానత్వం

రామకృష్ణ పరమహంస బోధించిన విజ్ఞాన వేదాంతంలో సర్వమత సమానత్వం (సార్వజనీన దృక్పథం) అనే భావన బలంగా ఇమిడి ఉంది. ఈ సిద్ధాంతం యొక్క తాత్త్విక పునాదులు అన్ని మతాలు ఒకే సత్యాన్ని చేరుకునే వివిధ మార్గాలుగా అంగీకరిస్తాయి.

తాత్త్విక పునాది: దైవిక చైతన్యంలో ఏకత్వం

రామకృష్ణ బోధనలు ప్రపంచమంతా దైవిక చైతన్యమే (Divine Consciousness) అనే దృక్పథాన్ని కలిగి ఉన్నాయి.

* దేవుడే అంతా: ఈ తాత్త్విక దృక్పథం ప్రకారం, ప్రపంచమంతా దైవమే. మనం చూసే, అనుభవించే ప్రతిదీ ఆ దైవిక చైతన్యం యొక్క అభివ్యక్తే. సూర్యుడు, నక్షత్రాలు, మనుషులు — ఇదంతా ఆ పరమాత్మయే.

* సర్వమతాల ఏకత్వం: అన్ని మతాలు లేదా విశ్వాసాలు ఆ ఒకే అనంతమైన విశ్వచేతన యొక్క వివిధ రూపాలను మాత్రమే తెలియజేస్తున్నాయి. ఆ ఒకే పరమాత్మను కొందరు ‘బ్రహ్మము’ అనీ, కొందరు ‘ప్రభువు’ అనీ, మరికొందరు ‘క్రీస్తు’ అనీ, ఇంకొందరు ‘బుద్ధుడు’ అనీ పిలుస్తారు. ఈ అంతర్లీన ఏకత్వమే అన్ని మతాలు, జీవుల మధ్య సమానత్వానికి ప్రాతిపదిక.

ఉపసంహారం

భైరప్ప దృక్పథంలో లోపించింది ఆధ్యాత్మికత. అందుకే ఆయన ఆధునికవాదం, హిందూ అస్తిత్వవాదరాజకీయాలకు బందీగా మారి, చరిత్ర అనే కాన్సెప్టుకి బానిసయ్యారు. వేదాంత సిద్ధాంతం ప్రకారం, నిజమైన సత్యాన్ని దాచిపెట్టే చర్యను ‘ఆవరణ’ అని అంటారు. భైరప్ప ఈ వేదాంత భావనను చరిత్ర రచనకి అన్వయిస్తూ, తన చారిత్రకదృష్టి ద్వారా స్థలకాలాతీతమైన అద్వైతాన్ని మితిమీరి స్థలకాలబద్ధం చేశారు. నిజానికి చరిత్ర పేరుతో జాతివిభేదాలను శాశ్వతమైనవిగా ప్రకటించారు. అద్వైతం అహాన్ని విడిచిపెట్టమని చెబితే, హిందుత్వం మాత్రమే గొప్పది అని చాటడం ద్వారా అహంభావాన్ని ప్రకటిస్తాడు. ఆయన చారిత్రక వాస్తవిక దృష్టి, ప్రగతిశీలత అనేవి చివరికి హిందుత్వ ఫాసిజానికి రహదారిగా మారాయి.

మూలాలు

1. ఎస్ ఎల్ భైరప్ప నవలలు: 1) గృహభంగ 2) దాటు 3) పర్వ 4) ఉత్తరకాండ 5) ఆవరణ 6) Orphaned. (తబ్బలియు నీనాదె మగనె)
2. A Forgotten Empire: Vijayanagar: A Contribution to the History of India (Robert Sewell).
3. Swami Vivekananda’s Vedan̄tic Cosmopolitanism, Swami Medhananda, Oxford University Press, 2022
4. కంచి పరమాచార్య లీలలు. కానూరు నాగేష్, కంచి కామకోటి పీఠం, 2019
5. నడిచే దేవుడు. నీలంరాజు వెంకటశేషయ్య, కంచి కామకోటి పీఠం
6. ‘మ్రోయు తుమ్మెద’ విశ్వనాథ సత్యనారాయణ
7. పురాణపాత్రలపై కొత్త వెలుగు – లోహియా ఇతిహాస వ్యాసాలు, Southern Springs Publishers Pvt.Ltd, Hyderabad
8. Conversations with Sri Chandrashekhara Bharati- R. Krishnaswamy Iyyer, Sringeri Sarada Order publication, 1977
9. “Bunch of Thoughts” (a compilation of his speeches and writings), are as follows: Author: M.S. Golwalkar (Guruji), ​First Edition Year: February 1966
10. Essentials of Hindutva, Author: Vinayak Damodar Savarkar, First Published: 1923
11. ఆరో వర్ణం, ఇక్బాల్ చంద్
12. Hindutva: Exploring the Idea of Hindu Nationalism. Jyotirmaya Sharma, Penguin/Viking, 2003
13. Shahu Vedic School faces a shortage of students (Times of India, Sep 28, 2016
14. HINDUTVA OR HIND SWARAJ. U.R. ANANTHAMURTHY
15. ‘వేయి పడగలు నేడు చదివితే’. కల్లూరి భాస్కరం
16. The Village Gods of South India (Henry Whitehead)
17. యాది వ్యాసాలు. సామల సదాశివ
18. భాస నాటక చక్రం
19. అసుర. ఆనంద నీలకంఠన్‌


రాణి శివశంకర శర్మ

రచయిత రాణి శివశంకర శర్మ గురించి:

రాణి శివశంకరశర్మ \’ది లాస్ట్ బ్రాహ్మిణ్\’ ద్వారా తెలుగు సాహిత్య రంగంలో సంచలనం సృష్టించిన రచయిత. ఆధునిక నాగరికత, సమాజం, రాజకీయాలను భారతీయ తాత్విక దృక్కోణంతో సునిశితంగా విశ్లేషించిన ‘ది లాస్ట్ బ్రాహ్మిణ్\’ ఇంగ్లీషు, కన్నడ, సంస్కృతాది పలు భాషల్లోకి అనువాదమై దేశవిదేశాల్లో ఆదరణకు నోచుకుంది. \’ది లాస్ట్ బ్రాహ్మిణ్\’ వెలువడ్డ ఆరేళ్ల అనంతరం దానికి కొనసాగింపుగా వచ్చిన \’గ్రహాంతరవాసి\’ నవల ప్రచురితమైంది. రాజకీయాలు, మతం, తత్వశాస్త్రం, సాహిత్యాల గురించి మౌలికప్రశ్నలను రేకెత్తించిన \’గ్రహాంతరవాసి\’ కూడా ఇప్పటికే ఇంగ్లీషులోకి అనువాదమైంది. వారి మరో రచన \’అమెరికనిజం\’ ఆ మధ్య కన్నడంలో విడుదలై ప్రశంసలు అందుకుంది. ఆయన కథల తొలిసంపుటి ‘రోబోబుద్ధ\’గా, మలిసంపుటి \’పూజారి 2040\’గా ప్రచురితమయ్యాయి. ఈయన రచించిన నృత్యరూపకాలు \’హిందుత్వ\’, \’ధర్మోరక్షతి రక్షితః\’ను కూచిపూడి కళాకారిణి స్వాతి సోమనాథ్ ప్రదర్శించడమే కాక సీడీలుగా తీసుకొచ్చారు. కాళిదాసు నాటకాన్ని నవలగా మలచిన రచన \’శకుంతల\’ అందరి మన్ననలు పొందింది.

 ...