[ దాశరథి శతజయంతి జులై 22. ఆ సందర్భంగా ఈ వ్యాసం. — సం. ]
ఒక కవి గానీ, రచయితగానీ పుట్టి నూరేండ్లు అయిన సందర్భాన్ని, సంబంధిత భాషా సమాజం ఎట్లా వేడుక చేసుకుంటుంది? కేవలం భాషా సమాజమే కాదు, ప్రాంతీయ, సామాజిక, ఇంకా వివిధ అస్తిత్వాల సమాజాలు అప్పుడు ఆ కవిరచయితల గురించి ఏమి చర్చించుకుంటాయి? ఏమి చర్చించుకోవాలి?
జూన్ ౩వ వారంలో ఖమ్మం లోని ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాశరథి-ఆరుద్రల శతజయంతి సందర్భంగా రెండురోజుల సదస్సు నిర్వహించారు. యాభైకి పైగా పత్రాల సమర్పణతో పాటు, అనేక ప్రసంగాలు జరిగాయి. ఇద్దరు రచయితల రచనలన్నిటి మీదా విస్తారంగా తెలుగు అధ్యాపకులు, విమర్శకులు మాట్లాడారు. ఇద్దరికీ న్యాయం చేయాలనే ఆలోచన ఖమ్మం లాంటి సరిహద్దు జిల్లాలోనే వచ్చే అవకాశం ఎక్కువ. అస్తిత్వ ఆధునికతా విలువలను అర్థం చేసుకున్న సీతారాం వంటి కవి అధ్యాపకులు మాత్రమే చేయగల చొరవ అది. ఇతర స్థలాల్లో అటువంటి ప్రయత్నం ఎందుకు జరగదు? దాశరథి శతజయంతి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా పూనుకుని ఘనంగా చేస్తారా? అట్లాగే, ఆరుద్రకు తెలంగాణలో?
అచ్చుయంత్రం, పత్రికలు, పుస్తకప్రచురణ, విద్యావ్యాప్తి వంటి మార్పులు మొదలయినప్పటి నుంచి, రచయితల ఆవరణ మునుపటి కాలం కంటె విస్తరించింది. ఒకే ఆసక్తి కలిగిన బృందాల మధ్య సంభాషణ పెరిగింది. అంతర్గతంగా ఎన్ని శ్రేణులున్నా, సాహిత్యసమాజం అంటూ ఒకటి ఏర్పడింది. ప్రభావశీలత హెచ్చింది. రాజకీయ, సామాజిక పరిణామాలతో సాహిత్యానికి స్పష్టంగా, బలంగా లంకె పడింది. వెంటవెంటనే అంచనాలు కట్టే శీఘ్ర చరిత్రరచన మొదలయింది. మైలురాళ్ల వంటి దోహదాలు చేసినవారిని జీవితకాలంలోనే వివిధసందర్భాలలో సత్కరించుకోవడం కూడా ఒక ఆనవాయితీ అయింది. ఒక్క వీరేశలింగం గారిని మినహాయిస్తే, ప్రసిద్ధ తెలుగు కవులు,రచయితల శతజయంతులు జరుపుకోవడం 1960 దశకం నుంచి పరంపరగా మొదలయిందనుకోవచ్చు. సామాజిక మార్పు కోరుకున్నవారిని, తొలినాటి ఆధునిక రాజకీయ భావాలను వ్యక్తం చేసినవారిని, సమకాల అవసరాల రీత్యా గౌరవించుకోవడం ఒక ఆచరణరూపంగా మారింది. సనాతన రచయితలను వారి ఇష్టులు గౌరవించుకోవడం కూడా విధానప్రకటన లాగా జరిగింది. సంప్రదాయ, ఆధునిక సాహిత్యచరిత్రలను పునర్దర్శించడానికి, సవరించుకోవడానికి, వర్తమాన సాహిత్యశిబిరాలు ఘర్షణ పడడానికి ఈ శతజయంతులు, ఇతర స్మారక సందర్భాలు అవకాశమిస్తూ వచ్చాయి. ఆ మధ్య పోతన అయిదువందలేళ్ల పండగ, ఈ మధ్య నన్నయ్య వెయ్యేళ్ల పండగ జరిగాయి. ఎవరు, ఏ రచయిత విషయంలో పూనుకుని ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, ఇటువంటి గౌరవం దక్కనివారెవరు, దక్కేవారెవరు అన్న చర్చ కూడా సాహిత్యచరిత్రావిమర్శలో ఒక ముఖ్యమైన భాగం.
సామాజిక, రాజకీయ వ్యక్తుల విషయంలో మాదిరిగానే, సాహిత్యవ్యక్తులను కూడా స్మరించుకోవడానికి ప్రాసంగికత ఒక ముఖ్యప్రాతిపదిక. జ్ఞాపకం అనేది మెదడు, నాడీమండలాల శరీర ధర్మంగా కనిపించవచ్చును కానీ, అది దాని వ్యక్తీకరణలో, వినిమయంలో- సామాజికమైనది కూడా. వర్తమానంలో సమాచారానికి ఉన్నట్టుగానే, గతానికి సంబంధించి జ్ఞాపకానికి రాజకీయ ప్రాధాన్యం ఉంటుంది. దాన్నినిర్వహించడం, నిర్మించడం, వ్యాఖ్యానించడం వర్తమాన కథనాలకు అవసరమవుతుంది. శిష్ట, బహుజన పురాణాలు ఆయా సమూహాల జ్ఞాపకాల నిర్మాణమే. ఆధునిక కాలంలో, ప్రయాణ, సమాచార సాధనాల వ్యాప్తి తరువాత, ప్రజాహిత రంగం రూపొందిన తరువాత, సాధికారతా ప్రయత్నాలకు జ్ఞాపకం, చరిత్ర – వాహికలు అయ్యాయి. వర్తమాన ప్రాసంగికత నుంచే గతాన్ని గుర్తుచేసుకుంటాము. వర్తమానంలో వేర్వేరు శక్తులు వేర్వేరు అభివృద్ధి దశలలో సమాంతరంగా ఉనికిలో ఉంటాయి కాబట్టి, వేర్వేరు జ్ఞాపకాలు ఘర్షణ పడుతూ, ఒకదానిని మరొకటి నిరాకరిస్తూ, రాజకీయ అవసరాల రీత్యా సమీకరణ చెందుతూ ఉంటాయి. భావాల సంవాదానికి జ్ఞాపకాలు కూడా ముడిదినుసులు.
ఈ జులై22 దాశరథి శతజయంతి. ఆరుద్ర నూరేళ్ల సందర్భం వచ్చే ఆగస్టు 31. ఈ ఇద్దరు కవిరచయితల వారసత్వానికి ఉన్న ప్రాసంగికత ఆధారంగా కార్యక్రమాల స్థాయి ఉండాలి. రాజకీయవాదుల సంస్కారానికి అనుగుణంగా ప్రభుత్వాల స్పందన ఉంటుంది. ‘సాహితీస్రవంతి’ ఒక పట్టింపుతో ఆరుద్ర శతజయంతి ఆరంభ కార్యక్రమాలను పోయిన సంవత్సరం ప్రారంభించింది. అటువంటి కృషి వేరు. అది కాక, చిన్న, స్థానిక సంస్థలు అక్కడక్కడ చేయకుండా ఉండవు కానీ, ఒక భారీస్థాయి వ్యవస్థాత్మక ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపించడం లేదు. దాశరథి కృష్ణమాచార్య శతజయంతి కార్యక్రమాలు తెలంగాణలో అక్కడక్కడ జరుగుతున్నాయి. దాశరథి పేరుతో ఏటేటా అవార్డు ఇచ్చే తెలంగాణ ప్రభుత్వం ఆయన శతజయంతిని తగినంతగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కవులన్నా కళలన్నా చుక్కెదురు కాబట్టి, దాని నుంచి ఎవరూ ఆశించడం కూడా లేదు.
పెద్దసభలు, కార్యక్రమాలు నిర్వహిస్తే, పెద్ద స్మారక వ్యవస్థల ఏర్పాటుకు నిర్ణయాలు జరిగితే, మాత్రమే, రచయితల స్మృతికి గౌరవం దక్కినట్టు కాదు. సమాజాలు వారిని ఎట్లా చూస్తున్నాయి లేదా చూడడం లేదు అన్నదే ముఖ్యం. ఆ రచయిత ఆవరణ ఆ సమాజంలో ఎంత విస్తరించింది, జ్ఞాపకంగా ఆయన/ఆమె ఎంతగా స్ఫురణలో ఉంటున్నారు అన్నది కూడా అందుకు ఒక ప్రమాణం. ఆయా సాహిత్యవ్యక్తుల కృషి గురించి, వైఖరుల గురించి, వాటిలోని సానుకూల అంశాలు, సమస్యాత్మకతల గురించి తగినంతగా చర్చ జరగడానికి స్మారక సందర్భాలు ఉపయోగపడాలి. తమ వంతు ఆచరణ చేసి, లోకం నుంచి నిష్క్రమించినవారు ఇంకా కొత్తగా చేయగలిగేది ఏమీ ఉండదు. చేసిన దానికి వారిపై నేరాభియోగం చేయడం కానీ, విచారణ చేయడం కానీ చేయలేము. శిక్షించలేము కూడా. అట్లాగే, చరిత్రలో అందలం ఎక్కిస్తే, వారికి ఆ లబ్ధి వ్యక్తిగతంగా అనుభవంలోకి రాదు. విమర్శ అయినా, ప్రశంస అయినా, గుణదోషాల నుంచి లాభపడడం అయినా, వర్తమాన సమాజం కోసమే, భవిష్యత్తు కోసమే. కీర్తి, అపకీర్తి శిఖరాలు రెండూ కూడా గతరచయిత విషయంలో భావనాత్మకమైనవే. ఆ రచయితను ప్రతినిధిగా భావించే శ్రేణులకు గురిపెట్టినవే.
సమాజం శకలీకరణ చెందిందనుకుంటున్నాము. ఆ ధోరణి, సాహిత్యవ్యక్తుల పరిగణన మీద కూడా ప్రభావం వేసింది. వాస్తవానికి సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాలు తెలుగు సాహిత్యచరిత్రను, అందులోని వ్యక్తుల ధోరణులను, ఆచరణను, పరిగణనను పరీక్షకు పెట్టాయి. దాశరథి, ఆరుద్ర ఇద్దరూ అగ్రకులాల వారు. దాశరథి తెలంగాణ వారు. ఆరుద్ర ఆంధ్ర వారు. దాశరథి స్థూల వామపక్ష భావాల నుంచి జాతీయకాంగ్రెస్ వైపు ప్రయాణించినవారు. స్వయంగా నిజాం వ్యతిరేక రాజకీయపోరాటంలో పాలుపంచుకున్నవారు. ఆరుద్ర చివరిదాకా తాను మార్క్సిస్టుగానే పరిగణించుకున్నవారు. తొలినాడు కవిగా, తరువాత పరిశోధకుడిగా, విమర్శకుడిగా ఖ్యాతి పొందినవారు. ఇద్దరూ సినిమాలకు కూడా రచన చేశారు. ఆంధ్ర ప్రాంతం వారు అయినప్పటికీ, ఆరుద్ర నాటి తెలంగాణలో రజాకార్ బీభత్సాన్ని కవిత్వీకరించారు.
రాష్ట్ర విభజన జరిగింది కానీ, సాహిత్యచరిత్ర విభజన లో చాలా సమస్యలున్నాయి. విడివిడి సాహిత్య ప్రయాణం ఉన్నది నిజమే కానీ, ఆ దారులు అనేక కూడళ్లలో ఒకదానినొకటి కలవకుండా లేవు. కొంత దూరం కలసి నడవకుండానూ లేవు. ఒకే సమీకరణలోకి రెండు సాహిత్యాలను బలవంతంగా చేర్చడం అనవసరం. అట్లాగని, ఒకరి సాహిత్యం మరొకరికి పూర్తి పరాయిది కూడా కాదు. నన్నయ, శ్రీనాథుడు తెలంగాణకు అవసరం లేనివారు కాదు, సోమన, పోతన లేకుండా ఆంధ్రవారికి గడుస్తుందనీ లేదు.
నిజానికి, ఎడం ఎక్కువగా ఉన్నది ఆధునిక సాహిత్యచరిత్రలోనే. సంఘసంస్కరణోద్యమం, వ్యావహారిక భాషోద్యమం దగ్గర నుంచి భావ, నవ్య కవిత్వాలు, వాటి వాటి అర్థాలలో తెలంగాణలో లేవు. అభ్యుదయ కవిత్వం దగ్గరే దారులు రేఖామాత్రంగా కలుస్తాయి. ఆ తరువాత, తెలంగాణ మలిదశ సాహిత్యోద్యమం వచ్చేదాకా, రెండు ప్రాంతాల ప్రధాన సాహిత్యమార్గాలు ఉమ్మడిగానే కనిపిస్తాయి. బ్రిటిషాంధ్ర నుంచి వచ్చిన అభ్యుదయ కవిత్వం వేరు, తెలంగాణలో అదే సమయంలో వచ్చిన ప్రజాకవిత్వం వేరు. ఆదర్శాలు స్థూలంగా కలుస్తాయి కానీ, సందర్భాలు వేరు, రూపాలు వేరు. నాటి బ్రిటిషాంధ్రలో అభ్యుదయం ఒక సుదూర, నైరూప్య ఆదర్శాన్ని స్వప్నించేది. ఆ అభ్యుదయంలో తెలంగాణలో జరిగిన పోరాటం ఒకానొక కావ్య, బాహ్య వస్తువు. తెలంగాణ సాహిత్యానికి ఆ పోరాటం సహజ, ఆంతరిక అంశం. దాశరథి, ఆరుద్రలు ఆ రెండు కోవలకు ఉదాహరణలు. ఆంధ్రలో వచ్చిన అభ్యుదయ వచన కవిత్వాన్ని, మాత్రాగేయ రూపాన్ని అనుకరించడానికి దాశరథి కూడా ప్రయత్నించారు. కానీ, ఆయన కవిత్వంలో కాలపరీక్షకు నిలిచింది పద్యమే. నాటి తెలంగాణ అంతరంగం- కవిత్వంలో పద్యంలో, పాటలో ప్రధానంగా పలికింది. ఆ నాటి వ్యక్తీకరణ దశ కు మించిన కవిత్వం ‘త్వమేవాహం’, అందులో తెలంగాణ ఒక ఇతివృత్తం మాత్రమే, అతినవ్య కళారూపానికి, ఒక సమసమాజ ఆదర్శానికి ఉదాహరణ ప్రాయమైన వస్తువు మాత్రమే.
ప్రాదేశిక, సామాజిక నేపథ్యాలే కాదు, వైఖరులు కూడా ప్రాసంగికతను, స్మరణ యోగ్యతలను నిర్ణయిస్తున్నాయి. జ్ఞాపకం చేసుకుంటున్నాము నిజమే, కానీ, తప్పొప్పులను గుర్తించి చేసుకుంటున్నామా? అన్నది ప్రశ్న. దాశరథి ప్రత్యేక తెలంగాణ వాదానికి వ్యతిరేకి. విశాలాంధ్రను ఆహ్వానిస్తూ ‘మహాంధ్రోదయం’ అన్న కవిత్వసంకలనమే ప్రచురించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన జలగం వెంగళరావును కీర్తించారు. ఒక పుస్తకాన్ని అంకితం ఇచ్చారు. అటువంటి కవిని తెలంగాణ సమాజం బేషరతుగా స్మరించుకోవాలా? అప్పుడు మరో ప్రశ్న ఎదురవుతుంది. దాశరథి నాటి వైఖరితో సంబంధం లేకుండా, మలిదశ తెలంగాణ ఉద్యమం ఆయన పద్యపాదం ‘ నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ ను నినాదంగా స్వీకరించింది కదా? ఆయన రాసిన పాట ‘ ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో’ ను ఉద్యమవేదికలన్నిటి మీదా పాడుకున్నది కదా? ఎందుకు మలిదశ తెలంగాణ ఉద్యమం, తొలిదశ ఉద్యమాన్ని వ్యతిరేకించిన కవి నుంచి అన్ని చిహ్నాలను, నినాదాలను ఎందుకు తీసుకున్నది?
ఎందుకంటే, మలిదశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అస్తిత్వ స్పృహతో ఒక జాతి నిర్మాణం వంటి సమీకరణ చేసింది. తెలంగాణ తన గత చరిత్రను ఘనంగా ఆవిష్కరించుకోవడం, వర్తమానంలోని వివక్షను గొంతెత్తి చెప్పడం అనే రెండు అంచుల ఉద్యమమార్గాన్ని అనుసరించింది. 1969 నాటి తొలి ఉద్యమంలో త్యాగాలున్నాయి, తీవ్రత ఉన్నది, నిజమే కానీ, అది ఓడిపోయిన, రాజీపడిన ఉద్యమం. ఆ త్యాగాలను, పోరాటాన్ని అవసరమైన ప్రస్తావిస్తూనే, దాన్ని ఒక స్ఫూర్తి అంశంగా, సగర్వత చిహ్నంగా మలిదశ ఉద్యమం తీసుకోలేదు. తన ఆత్మగౌరవ వ్యక్తీకరణలో, తెలంగాణ సాయుధపోరాట వారసత్వాన్ని మాత్రం ఘనంగా స్వీకరించింది. ప్రపంచ చరిత్రలోనే గొప్ప స్థానం పొందిన తెలంగాణ రైతాంగ పోరాటం వర్తమానానికి ప్రేరణ ఇచ్చే జ్ఞాపకం. దాశరథి ఆ పోరాటంలో రాసి, జైలు శిక్ష అనుభవించిన కవి. తరువాత కాలంలో ఆయన రాజకీయ, సాహిత్య ఆచరణ భిన్నంగా ఉన్నంత మాత్రాన, గతఘనత ఎట్లా రద్దయిపోతుంది? తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఉద్యమాన్ని వ్యతిరేకించారు కానీ, తెలంగాణ ప్రత్యేకతను, విశిష్టతను ఆయన కవిత్వంలో వ్యక్తం చేశారు. 1950 నాటికే ‘తెలంగాణ తల్లి’ అన్న భావనను ఆయన ప్రతిపాదించారు. సాంస్కృతిక వైఖరిలో ఆయన తెలంగాణతనానికి ప్రాతినిధ్యం వహించారు. 1969 లో ఎవరి వైఖరులు ఏమిటి అన్న చర్చకే 1995 ఉద్యమంలో పెద్ద ప్రాముఖ్యం లేకపోయింది.
అట్లాగని, దాశరథి అనంతర జీవితాన్ని మొత్తంగా తలకెత్తుకుంటామని కాదు. మొదట ప్రజాకవులుగా, స్వతంత్ర రచయితలుగా ఉండి అనంతరం ప్రభుత్వకవులుగా మారినవారందరికీ ప్రతిష్ఠానష్టం తప్పదు. పైగా, ప్రజా ఉద్యమాల విషయంలో కర్కశంగా వ్యవహరించిన పాలకుల పక్షాన నిలిచినప్పుడు, చరిత్ర వారి విషయంలో దాక్షిణ్యంతో ఉండనక్కరలేదు. అయితే, సంపూర్ణ మానవులెవరూ లేరు కాబట్టి, మనుషులలోని వెలుగునీడలను బేరీజు వేసుకుని, తీసుకోవలసినంత తీసుకుని, తక్కినది వదిలివేయడమే మార్గం. ‘వెంగళప్పి’గా అని సంబోధిస్తూ కవిత్వం రాసిన శ్రీశ్రీ కూడా ఎమర్జెన్సీకాలంలోనే వెంగళరావును ‘సమర్థుడైన పాలకుడి’గా ప్రశంసించారట. ఆయన ఎమర్జెన్సీ ఇందిరను ‘జయేందిర’ అని కీర్తించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక తెలంగాణను గట్టిగ వ్యతిరేకించారు కూడా. అనంతర పతనాల వల్ల తొలినాటి దోహదాలను తిరస్కరించనక్కరలేదు. ‘సారా జహాసే అచ్ఛా’ రాసిన మహాకవి తరువాత ఇక్బాల్ ద్విజాతి సిద్ధాంతానికి సమర్ధకులై పాకిస్థాన్ కోరుకున్నారు. అయినా, 1980ల తరువాతి జాతీయ సమగ్రత, సమైక్యత ఆదర్శాల నేపథ్యంలో, రాకేశ్ శర్మ అంతరిక్ష వ్యాఖ్య తరువాత ఇక్బాల్ పాట మరోసారి భారతదేశంమంతా పాడుకున్నది.
వివిధ అస్తిత్వాల నుంచి అంచనాలు వేస్తున్నప్పుడు, ‘తమ’ వారిలోని, ‘ఇతరుల’ లోని లోపాలను మదింపు వేయడమే కాకుండా, సానుకూల అంశాల వివేచన కూడా జరుగుతుంది. అస్తిత్వమే ప్రధాన ప్రాతిపదిక అయినప్పుడు, వైఖరుల పరిగణన ద్వితీయ స్థానానికి పరిమితం కావచ్చు. దాశరథి స్థానం తెలంగాణ సాహిత్యంలో లెక్కించడం సరే, మొత్తం ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆయనకు సరైన స్థానమే దొరికిందా? తెలంగాణ నేపథ్యం ఆయన గౌరవాన్ని కుదించలేదా? బ్రిటిషాంధ్రలో వెల్లివెరిసిన ఆధునిక సాహిత్యాన్ని ప్రాతిపదికగా చేసుకుని నిర్మించిన ఆధునిక తెలుగు సాహిత్యచరిత్రలో, దాశరథి ఏ కోవకు చెందుతారు? ఏ కొలమానాలకు లొంగుతారు? అన్ని తెలుగుప్రాంతాల సాహిత్యవికాసాన్ని దృష్టిలో పెట్టుకుని సాహిత్యచరిత్రను నిర్మించే ప్రయత్నం చేస్తే, దాశరథి ఇప్పుడున్నదాని కంటె ఆయన ఎక్కువ గుర్తింపునకు అర్హుడు కాదా? బ్రిటిషాంధ్రలోని జాతీయోద్యమకవులకైనా, తెలంగాణ ప్రజాఉద్యమకవులకైనా, తక్కిన నైరూప్య ఆదర్శకవులకు దొరికినంత కీర్తి దక్కిందా? ఈ లోటుపాట్లను సవరించవలసిన బాధ్యత ఆయా అస్తిత్వ ఉద్యమాలకు, సమానత్వ భావుకులకు లేదా?
అట్లాగే, సామాజిక అస్తిత్వాల నుంచి కానీ, జెండర్ అస్తిత్వం నుంచి కానీ, దాశరథికి, ఆరుద్రకు వేరే పరిగణన దొరకవచ్చు. ఆయా దృష్టికోణాలు సాహిత్యంలో ఇప్పటివరకు చూడని పార్శ్వాలను చూడవచ్చు. ఈ నిశిత పరిశీలనలన్నీ, చరిత్రను సమగ్రం చేయడానికి, వర్తమాన అవగాహనను సమ్మిశ్రితం చేసుకోవడానికి పనికివచ్చే చర్యలే. అందుకోసమే, గత చరిత్రలో ప్రసిద్ధి పొందినవారందరి సందర్భాలన్నిటిలోనూ సాహిత్యసమాజం చురుకుగా చర్చించి, అవగాహనలను ఆ నాటి చైతన్యం మేరకు సవరించుకోవాలి. గతం మీద వచ్చే ప్రశ్నలేవీ కేవలం పండితకుతూహలానికి చెందినవి కావు. సామాజిక క్రియాశీలతకు అవి దోహదకారులు.
సాహిత్యాన్ని చదువుకోవడం, ఆనందించడం, వివేచించడం అనే అభిరుచులకు ఇవ్వవలసిన ప్రాధాన్యం ఇస్తే, చాలా మంది రచయితల విషయంలో పాలూనీళ్లను వేరుచేసి చూసే పాఠకశ్రేణి రూపొందుతారు. రచయితలను తూకం వేయడం వేరు. వాళ్ల నుంచి తీసుకోవడం వేరు. దాశరథి నుంచి, ఆరుద్ర నుంచి తీసుకోవలసింది చాలా ఉంది, ఒకరి ఉర్దూ సాహిత్యనేపథ్యం, మరొకరి పరిశోధకశక్తి తరువాతి తరాలకు అందవలసిందే. ఒకరి పదలాలిత్యం, మరొకరి శబ్ద విన్యాసం గమనించవలసిందే.
సాహిత్యరంగానికి ఈ సాహిత్యేతర ప్రాతిపదికలు ఎందుకు? రాజకీయకారణాలకు రచయితలను తప్పుపట్టడమో, మెచ్చుకోవడం ఎందుకు అని ప్రశ్నించేవారుంటారు. ఎవరి గురించి అంచనాలు వేస్తున్నామో వాళ్లూ రాజకీయ అభిప్రాయాలే ప్రకటించారు కాబట్టి. అయినా, రాష్ట్రంలోకానీ, దేశంలో కానీ ఏ ప్రముఖ సాహిత్యకారుని జయంతి, వర్ధంతి, వార్షిక, శతవార్షిక ఉత్సవాలైనా ఏ సాహిత్యేతర ప్రేరణలు లేకుండానే జరుగుతున్నాయా? అంటే కాదనే చెప్పాలి. అయితే, ఆ నిర్వాహకులకు, కార్యకర్తలకు ఆ ప్రేరణల తెలివిడి లేకపోవచ్చు. కానీ, వారి అంతశ్చేతనల్లో అంతస్సూత్రాలు — ఏదో రకంగా ‘తమ’ వారిని గుర్తుచేసుకోవడమే, ఆ జ్ఞాపకం నుంచి స్ఫూర్తినో, సారూప్యుల సమీకరణనో సాధించడమే.