కన్నీరు భద్రం!

‘అమ్మా! నీకు ఏడుపు రావట్లేదా?’ అంది ఎనిమిదేళ్ళ కూతురు లాప్టాప్ మీద పనిచేస్తున్న తల్లిని. స్క్రీన్ మీద పూర్తి దృష్టి పెట్టివున్న ఆమె తలతిప్పి కూతురు వైపు చూసి మూగదానిలా స్తబ్ధుగా చూస్తూ వుండిపోయింది.

ముందు రోజే ఆమె తల్లి చనిపోయిన వార్త ఫోన్ ద్వారా తెలిసింది. ఆ విషయం తెలిసి ఆమె ఎనిమిదేళ్ళ కూతురు ఏడ్చింది. తల్లి ఆ పాపను సముదాయించి నిద్రపుచ్చింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి కూతురు పాలు తాగలేదు, బ్రేక్ఫాస్ట్ తినలేదు, ఇల్లంతా తిరుగుతూనే ఉంది ఒక చోట కూర్చోకుండా. అలా తిరుగుతూ తల్లి దగ్గరికి వచ్చి లాప్టాప్‍లో పనిచేస్తున్న తల్లిని, నీకు ఏడుపు రావట్లేదా అని అడిగింది దీనంగా.

తల్లి కూతుర్లు ఇద్దరు ఒకే శిల నుంచి చెక్కబడ్డ శిల్పాలలా ఉన్నారు. చికాగో చలిని ఎదిరించి పోరాడుతూ ఆ ఇంట్లో వేడి అందించడానికి ప్రయత్నిస్తున్న ఎయిర్ కండిషనర్‌ సున్నితమైన శబ్దం తప్పించి ఆ ఇంట్లో ఇంకే విధమైన శబ్దం లేదు. కానీ కూతురి ప్రశ్నతో తల్లి మనసులో ఎన్నో ఏళ్ళుగా రాని రకరకాల ఆలోచనలు ఎగిసిపడుతూ అలజడి కలిగిస్తున్నాయి. ఈ ఆలోచనల అలజడి సాయంత్రానికి పెద్ద వరదలా హృదయం అంతా పరచుకుని, సముద్రంలో అలలు పోటెత్తినట్టు ఆమె మెదడులో వెనక్కి ముందుకి వచ్చి పోతున్నాయి. తనను తాను లోపలికి చూసుకుంటే తనలో ఇటువంటి మనసు వుందని, ఆ మనసుకి ఎన్నో ఆలోచనలు వుంటాయని అవి తన గుండెని బాధపెడతాయని ఆమె ఎప్పుడూ ఊహించలేదు.

తల్లి ఒడి నుంచి బడికి, బడి నుంచి కాలేజీకి, కాలేజీ నుంచి అమెరికాకి వచ్చింది. అమెరికా ఉద్యోగంలో సుడిగుండానికి వ్యతిరేకంగా గాలిలో చక్రాకారంగా తిరిగే అత్యంత శక్తివంతమైన టోర్నడోలా, వేగంగా పైపైకి మోసుకుపోయే గాలి తుఫాను కౌగిలిలో చిక్కుకొని ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది ఆమె. అందుకున్న అమెరికా కల – పెద్ద ఇల్లు, కార్లు, తన స్థాయికి సరిపోయే భర్త, తన ఎదుగుదలకి అడ్డం కాని ఒకే ఒక కూతురు, ఇటువంటి ప్రవాస భూతల స్వర్గంలాంటి తన జీవితంలో తనను తాను మరిచిపోయి వేగంగా పరుగెత్తే జడపదార్థం ఆమె. పని, పని, ఆపలేని పని… ఆ పనిలో అదే గొప్ప జీవితం అని నమ్ముతున్న సమాజంలో బ్రతుకుతున్నది. నీళ్ళల్లో నిండా మునిగిన వాళ్ళకి చలి తెలియదు అన్నట్టు ఆమెకి ఏ విధమైన భావాలు, అనుభూతులు లేవు. చాలా ప్లానింగ్ చేసుకుని సెలవు పెట్టి, ఎక్కడెక్కడకో వెకేషన్‌కి వెళ్ళి, ఎంజాయ్ చేసాం ఎంజాయ్ చేసాం అని అందరికీ చెప్పడం, ఆ ఫోటోలు చూడడం, ఆ వీడియోలు చూడడం, మళ్ళీ పని పని పని ఇది ఆమె జీవితం.

అటువంటి జీవితంలో వున్నట్టుండి ఆమె తల్లి చనిపోయిందని వార్త వచ్చినప్పుడు ఆమెలో ‘అయ్యో!’ అన్న పదం, ‘అమ్మా!’ అన్న పదం కొద్దిసార్లే వచ్చాయి. ఆ తర్వాత తన బాధ్యతలు తన ఆఫీసు డెడ్లైన్స్‌లో, గత 24 గంటల్లో తల్లి మరణం గురించి ఆమె మనస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు.ఈ స్థితిని సహజంగా భావించి తన పని తాను చేసుకుని పోతోంది. సరిగ్గా అలాంటప్పుడే ‘అమ్మా! నీకు ఏడుపు రావట్లేదా?’ అని కూతురు అడిగిన ప్రశ్న పదే పదే చెవుల్లో గింగిరాలు కొడుతున్నది. ఆ రాత్రంతా ఆమెకు నిద్ర రాలేదు, ఏడుపూ రాలేదు. ఉదయం లేచేసరికి నిద్ర రాలేదన్న బాధ కంటే, ఏడుపు రాలేదన్న బాధ ఆమెను ఆవరించింది.

‘నాకెందుకు ఏడుపు రావట్లేదు? నాకెందుకు కన్నీళ్ళు రావడం లేదు?’ అన్న ప్రశ్నలు తన కూతురి ప్రశ్నకి సమాధానంగా వచ్చాయి ఆమెకి. రోజంతా ఏ పని చేయకుండా మౌనంగా ఉండిపోయింది. ఆఫీసు పనికి సెలవు పెట్టింది. కూతుర్ని స్కూల్ కి డ్రాప్ చేస్తున్న భర్త, ‘నువ్వు అప్సెట్ అయితే రెస్ట్ తీసుకో. సాయంత్రం వస్తా’ అని వెళ్ళిపోయాడు.

సాయంత్రం భర్త వచ్చేటప్పటికి, భార్య ఉదయం సోఫాలో ఎక్కడ కూర్చుందో అక్కడే, అలాగే ముడుచుకుని ఏ భావం లేకుండా కూర్చునే ఉంది. కదలిక లేని నూతిలో నీటిలా ఉంది. కానీ ఆమె అంతరంగం సునామీ వచ్చిన సముద్రంలాగా వుంది. ఆలోచనలు ఎగిసిపడుతూ పదేపదే తీరం పై పడి కొట్టుకుంటున్న అలల్లా వున్నాయి. అలా వచ్చి పోతున్న ఆ అలలని శబ్దంగా అనువదించగలిగితే వచ్చే హోరు ఆ ఇంటిని పూర్తిగా నింపేస్తుంది. ఆమె బాధపడుతున్నదని భర్తకు తెలుస్తోంది. భర్త ఆమెను సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లాడు.

సైకియాట్రిస్ట్ ఆమెని పరీక్షించి, వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు. ‘కన్నీరు హృదయపు నిశ్శబ్ద భాష. మాటలు చెప్పలేని భావాలను అది వ్యక్తీకరిస్తుంది. అందరం ఏవేవో సంపాదించడానికి అమెరికా వచ్చి, దానికోసం ఎన్నెన్నో కోల్పోతూ ఉంటాం. ఆ కోల్పోయిన వాటిలో మనకున్న సంబంధ బాంధవ్యాలు, ఆ బాంధవ్యాలతో పాటు పెనవేసుకుపోయిన ఎమోషన్స్ ని కూడా కోల్పోతాము. ఆ ఎమోషన్స్ తోటి సంబంధం వున్న కన్నీరు రాను రాను ఇంకిపోతుంది. కన్నీరు ఇంకిపోయిన మనిషి అంతరంగం ఒక ఎడారిలా తయారవుతుంది.

అది సహజం అనుకుంటాం కానీ, మనమే సముద్రమంత విశాలం, లోతు వున్న మన అంతరంగాన్ని ఎడారిగా మార్చేశామని తెలుసుకోము. కన్నీరు మనసులోని భావోద్వేగాలను విడుదల చేయడంలో సహాయపడుతుంది.అది ఒత్తిడి తగ్గించి, శరీరంకి మనస్సుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. భావప్రకటనలో కన్నీరు, ఇతరులతో సహానుభూతిని పంచుకోవడానికి మార్గం. రావలసినప్పుడు కన్నీరు రాలేదు అంటే ఆ మనిషి అసంపూర్ణమైన మనిషి.

జీవం సముద్రం నుంచి ఆవిర్భవించి, పరిణామం చెంది మనిషిగా మారింది. మనిషి ప్రతి కణంలో తన మూలాలు అయిన సముద్రం నీరు వుంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాల అనుబంధం ఉన్న ఆ నీరు, శరీరంలో ఎంతో ఎక్కువ శాతం వుండడం వల్లనే జీవన ప్రక్రియలు సజావుగా జరుగుతున్నాయి. మిగతా జంతువులకి మనిషికి వున్న అతి ముఖ్యమైన బేధం భావాలు, అనుభవాలు. అవి వున్న మనిషికి ఆనందం వచ్చినా, బాధ వచ్చినా ఆ నీరు బయటకి వస్తుంది. కన్నీరు మనిషికి మానవత్వం ఉందని చూపించడానికి ఒక అతి ముఖ్యమైన గుర్తు. కానీ నేటి మనుషులు ఎన్నో రకాల ప్రలోభాలకు లోబడి అత్యుత్తమమైన ఆ శక్తిని కోల్పోతున్నారు. అందువల్లే కన్నీరూ రాదు, ఆనంద భాష్పాలూ రావు చాలామందికి.

ఈమెకి కావాల్సింది ఆమె గుండె ఎడారికి కొంత తడిని కల్పించడం. ఆ తడి మెల్లగా ఆ ఎడారిని తడిపితే ఆమె కోలుకుంటుంది. కన్నీటిని సహజంగా రప్పించడానికి మందులు లేవు. కానీ అనుభవంతో ఇస్తున్న సలహా తల్లితో ఆమె కలిసి ఉన్న ఊరికి తీసుకుని వెళ్ళి రండి, ఆమె పుట్టిన పరిసరాలు, ప్రాంతాల్లో కొద్దిరోజులు గడిపి రండి. అంతకుమించి ఒక మాత్ర కానీ, ఒక ఇంజక్షన్ కానీ ఇవ్వలేను’ అని చెప్పాడు.

ఆమెని, పిల్లని తీసుకుని భర్త ఇండియా వెళ్ళాడు. వాళ్ళందరూ ఆమె నివసించిన ఊరి పరిసర ప్రాంతానికి వెళ్ళారు. ఆ ఊరు ఒక నదిని ఆనుకుని వున్న అతి చిన్న పల్లెటూరు. డాక్టర్ సలహా ప్రకారం అక్కడే వుండడానికి ఏర్పాటు చేసుకొని వున్నారు. రోజూ ఆమెకి అక్కడి తన బాల్యం, తల్లితో గడిపిన రోజులు, పరిసర ప్రాంతాలలో ఆడుకున్న స్నేహితుల జ్ఞాపకాలు, ఆటలు, మెల్లగా గుర్తుకు వస్తున్నాయి. అవి కళ్ళముందు ఇప్పుడే జరుగుతున్నట్టు ఆమె అనుభూతి చెందింది.

అలా వారం రోజులు గడిచాయి.

ఒకరోజు ఉదయం భోరుమని ఏడుస్తున్న తల్లి ఏడుపుకి మెలకువ వచ్చిన తండ్రి కూతుర్లు, తల్లి మళ్ళీ మామూలు మనిషి అయ్యిందని సంతోషించారు.

సముద్రం నుంచి వచ్చిన మన జీవం, ఈ కన్నీటి సముద్రం ఆమెను తిరిగి మనిషిని చేసింది.

కన్నీరు మనిషిని మనిషిగా గుర్తించడానికి అతి ముఖ్యమైన చిహ్నం.

కన్నీరు భద్రం!

* * * * *


కలశపూడి శ్రీనివాసరావు

రచయిత కలశపూడి శ్రీనివాసరావు గురించి:

జననం బొబ్బిలిలో, చదువు రాజా కాలేజి బొబ్బిలి, ఎ వి న్ కాలేజి , విశాఖపట్నం, ఆంద్రా యునివర్సిటీ వాల్తేరు, బయోటెక్నాలజిలో పిహెచ్.డి పేరిస్ యునివర్సిటీ , పేరిస్, ఫ్రాన్స్స్ లో. నివాసం ఫ్లోరల్ పార్క్, న్యూ యార్క్ లో, పనిచేస్తున్నది ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ బయో టెక్నాలజీ లో. ఎందులో ఏముందో తెలుసుకోవడంలో వృత్తి పరంగా, ప్రవృత్తి పరంగా ఉత్సాహంలో భాగమే జీవశాస్త్ర పరిశోధన, జీవితాన్ని అనువదించే రచన.

 ...