శ్రీ కారంబునులోగొను
నాకారము లోన శ్రుతులు అమలినశశిబిం
బాకారోద్యద్గండము
నాకారమె తనుమధ్యము నాచెలిసొగసుల్!
నాస్వప్నలోకరాజ్ఞివి
నాస్వాంతము దోచుకొన్న నారీమణివే
సుస్వర జీవన సుధవై
రా, స్వాగతమందు నీకు రాకేందుముఖీ!
ఊహల రెక్కలు దాలిచి
విహరింతము కలలు కలిపి వినువీధులలో
మహదానందప్రదమగు
ఇహపరముల సంధి చేయు ప్రేమలు పొంగన్!
రామానీయారామమె
ప్రేమసుధారసధామము ప్రియములనెలవౌ
లేమా నీ సాన్నిధ్యమె
అమర సుఖమ్మొసగు నాకు అన్నులమిన్నా!
నీవే నా సర్వస్వము
నీవే నా జీవితమున తీయని తలపుల్
నీవే నా మధుమాసము
నీవే నా హృదయరాజ్ఞి నిక్కము చెలియా !
లేరిల నీ సరిలేమలు
కోరివలచి వలపు గొన్న కోమలగాత్రల్
ఏరీ నీ సరి జాణ, ల
పారపు శృంగార శాస్త్ర పారగులెన్నన్?!
భయమన్నది బహు చెడ్డది
భయపడితే ప్రేమికులకు బ్రతుకే బరువౌ
భయపడని ప్రేమ గెలుచును
లయమున్నదె? ప్రేమకిలలొ? లలనా వినుమా!
ఏ నాడు నీదుప్రేమను
నేనే పొందితినొ నీకు నిడితినొ గానీ
ఆ నాటినుంచి మతిచెడి
నేనే నను మరచిపోతినే ప్రియవచనా!
చెలి మాటలకేరీతిన
అలవడెనో ఈ మధురిమ రమ్మని ప్రేమన్
పిలిచెడి మధురాధరముల
కలయిక చే వెడలుకతన కాబోలు సఖా!
చెలిమాట వినిన చెవులకు
చెలియందము గన్నకండ్లు చెలికౌగిలిలో
వాలిన తనువున కధర-
మ్ముల నానయధరములకును ఉత్సవ మొదవున్!
ఝరులో విరిసినయమవస
ఇరులో ఘనధూపధూమ తెరలో అరయన్
శరదంబుద దొంతరలో
మెరిసే నీలాలకురుల మిన్నగు సొగసుల్!
నిజమా నీ సాంగత్యము
నిజమా నీతోడి వలపు తీర ప్రయాణాల్
నిజమాయని తలపోయుదు
సౌజన్యవతీ త్వదీయ సౌజన్యంబుల్!
మదనుడు నీకనుబొమలను
మొదటే కనుగొన్న కలికి! ముచ్చటపడుచున్
వదలడె తన ఇక్షుదనువు
మదన కదనమందు గెల్వ మంచిదిదంచున్!
నీ కాటుకిడిన కన్నులు
చీకటి తెరలందెరల్చు శీతాంశు ప్రభల్
నా కన్నుల మణిదివ్వెలు
ఏ కన్నియలందు గాన నీ సరి సొగసుల్!
నా భావములకు ప్రేరణ
నా భాషకు లక్ష్య లక్షణంబులు నీవే
నా భావాంబర వీధీ
ప్రాభాత ప్రభవు, నాదు ప్రాభవమీవే!
ఏ జన్మము లోనైనను
నీజత నే కోరుకుందు నీరజగంధీ!
నాజత నీవై రా, వి-
భ్రాజిత సురలోక సౌఖ్య ప్రాప్తింగొనుచున్!
శారద రాత్రుల శశివో
మెరిసే మేఘాంతరస్థ మెరుపుల లతవో
విరిసిన అరవిందానివో
హారతివో! నాదు రతివొ! అనినిన్ దలతున్!
అతిలలితము నీ పలుకులు
అతిలలితము మనసు చూడ, అలరుల సరియౌ-
నతివా నీ మేని సొగసు
నుతికందవు శేషుకైన ఒంపులసొంపుల్!
నీనవ్వులు నా జయపథ-
మున జల్లుము ప్రేమతోడ ముదమున ముదితా
అనుమతి నీయవె వనితా
నిను ముద్దుల ముంచివేతు నిక్కము తమితో!
ముద్దుకు హద్దులు పెట్టుచు
వద్దనకే, ముద్దుదీర వలపున అధరా-
లద్దిన దీరవె కోర్కెలు
ఇద్ధరణిన్ మారుమ్రోగు నిద్దరి వలపుల్!
కోమలము నాదుహృదయము
కోమలి! నీకోపతాపమోర్చునె? కృపతో
నీ మధురాధర సుధలన్
ప్రేమనించి సాకవలదె ప్రేమలు పెరుగున్!
నీ మది దోచితి నేనని
నే మనమున సంతసపడి నేడు తలంపన్,
నా మది నే కోల్పోయితి
ఈ మహిలో లేమప్రేమ లింతియె మాయౌ!
అతిభోజన మతినిద్రయు
అతికోపంబతియలసత, అతికామంబున్,
అతి చేటు తెచ్చు నరులకు
అతివా! ప్రేమందు దక్క అన్నిట అవనిన్!
తొలిమావి చిగురు సౌరులు
చెలియధరపు కెంపులద్ద, చిలుకలపలుకుల్-
అలపూదేనెల మించును
అలివేణీ అంగరుచులు అనురాగములున్!
నీఅధరపు అరుణిమనై
ప్రియవచనపు భావమునై, పిడికెడు నడుమై,
నీయంగరుచుల రుచినై
ప్రేయసి! నేనణగియుందు వీడక నిన్నున్!
కలల అలలపై కోర్కెల
అలరుల పానుపు నమర్చి అనునిత్యంబున్
లలనా! నీ కలయికకై
అలుపెరుగక ఎదురుచూతు నక్కున జేర్పన్!
చిరుగాలుల విరితావులు
సరిగా నీతావుదెల్ప సారసనేత్రీ
విరహాగ్నిలొ దపియించెడి
పరువపుమది పులకరించి, పరవశమొందెన్!