నామాట

దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన మన తెలుగు సంస్థలు కానీయండి,స్థానికంగా ఊరూరా వెలిసిన సంస్థలు కానీయండి;– వీటి ఆదర్శాల జాబితాచూస్తే మనకు ఏవిధమైన తేడా కనిపించదు. కారణం? ఇవి అందరికీనచ్చిన,అందరూమెచ్చే,ఏ ఒక్కరికీ అభ్యంతరంలేని ఆదర్శాలు.

దేశంకాని దేశంలో మన తెలుగు సంస్స్కృతిని పరిరక్షించుకోవడం. ముఖ్యంగా,మన పిల్లలకి మన సంస్కృతి గురించి తెలియజెప్పడం!ఈ ఆదర్శాలని ఎవరు కాదనగలరు? ఆదర్శాలు అన్నీ మంచివే. అయితే కొన్ని ఆచరణ సాధ్యాలు; కొన్ని కేవలం “utopia”లు.

అసాధ్యంకాని ఆదర్శాలనికూడా ఆచరణలో పెట్టడాని కొచ్చేటప్పటికీ, మన సంస్థలు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెద్దయెత్తున ప్రతి ఏటా ఉత్సవాలు జరుపుకొనే స్థోమత ఉన్నసంస్థలు,– తానా,ఆటా లు రెండూ అడవిలో అబ్బా అంటున్నాయా అన్న సందేహం రాక మానదు.

ఇందుకు ఒక కారణం,మన సంస్కృతి యొక్క ప్రాచీనత,దాని విస్తృతీ కావచ్చు. మన భాష, మన వెయ్యేళ్ళ సాహిత్యం, మన చరిత్ర,మన లలిత కళలు,(బహుశా అలలితకళలుకూడా!) ఇవన్నీ మన సంస్కృతిలో అంశాలే!మన ఆదర్శాలని ఆచరణలో పెట్టడానికి అనువుగా ఏ అంశాలకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి,ఏ అంశానికి మద్దతు ఇవ్వాలీ అన్నవిషయంపై ఏకగ్రీవమైన అభిప్రాయం లేకపోవడం మరొక కారణం కావచ్చు.

ఏది ప్రధానం,ఏది కాదు అన్న విషయం గురించి (నా అనుభవం) ఒక ఉదాహరణ చెప్పుతా. ఏ మెగాస్టార్‌ని మన వార్షిక ఉత్సవాలకి ఆహ్వానించాలి అనే విషయం పై చర్చ తీసుకోండి. ఎంత ఖర్చుపెట్టి ఎవరిని తీసుకు రావచ్చు అన్న విషయమే ముఖ్యంగా చర్చిస్తారు కానీ, అసలు ఏ మెగాస్టారు నైనా ఎందుకు తీసుకోరావడం అన్న విషయం పై చర్చ జరగదు. కారణం? అది ఎజెండాలో ఉండదు కాబట్టి! అయినా ఆప్రశ్న లేవదీశారనుకోండి. మీకు వచ్చే “stock” సమాధానం: మెగాస్టారు రాకపోతే ఎనిమిది వేలమంది రారు. అంతమంది జనం రాకపోతే మన ఉత్సవాలు నిరిటికన్నా, ముందటేటి కన్నా నాసి అంటారు. ససి,పసీ లేని ఉత్సవాలు, అని వచ్చిన జనం అంటారు! ఇది నిజంకాదని, ఉత్సవాలకొచ్చే మనజనం ఉత్త మేకల మంద కాదని వాదించడం అనవసరమే! ఎందుకంటే,మనం ప్రయత్నిస్తేకదా,నిజమో కాదో రుజువయ్యేది?

సినిమా స్టారులన్నా,సినిమా సంగీతం స్టారు లన్నా నాకు ఏవిధమైన వ్యతిరేకతా లేదు. వాళ్ళని ఆహ్వానించి అందలానికెక్కించడం మన ఆదర్శాలకి అవసరమా అన్నది అసలు ప్రశ్న!

ఈ రకమైన చర్చ వచ్చినప్పుడల్లా, నాకు సినిమా ప్రొడ్యూసర్ల గురించి శ్రీశ్రీ (కృష్ణాపత్రిక, ఆగస్ట్ 25)రాసిన వాక్యాలు గుర్తుకొస్తాయి.

శ్రీశ్రీ రాస్తాడు:

అసలు ఉత్తమ చిత్రాలు నిర్మిస్తే మన ప్రజలు చూడరని చెప్పడం కూడ మన ప్రొడ్యూసర్లకు పరిపాటి అయింది. ఇది ఎంత అసందర్భంగా ఉన్నదో చెబుతా వినండి – ఆహారాన్ని విక్రయించడం ఒక వ్యాపారంగా నడపడం 20 వ శతాబ్దంలోనే ప్రారంభమయింది. ప్రతివాడూ తిండికోసం హోటలుకు వెళ్ళాలి. అతడికి ప్రతిసారీ ఆహారం (మంచిది) లభించక పోవచ్చు. అయినా రోజూ హోటలుకు వెళ్ళక తప్పదు.

ఆహారం వలెనే ఈ నాడు మానవునికి సినిమా కూడా ఒక అవసరం – అందువల్ల ఏ చిత్రం వచ్చినా ప్రేక్షకుడు చూస్తున్నాడు. కానీ కంపుకొట్టే వేరుశనగ నూనెతో చేసే వంటకాలను కాని ప్రజలు ముట్టరని, వాటికి అలవాటు పడ్డారని యజమాని చెబితే, ఎంత అసందర్భంగా ఉంటుందో, ఉత్తమ చిత్రాలను నిర్మిస్తే ప్రజలు చూడరని చెప్పడం కూడా అలాగే ఉన్నది.

ఈ సామ్యం ఇంతకన్నా విపులంగా వివరించక్కరలేదు.

మన సంస్కృతిని పరిరక్షించుకోడానికి,అమెరికన్లకీ,తెలుగు-అమెరికన్‌ భావి పౌరులకీ మన సంస్కృతి గురించి విపులంగా, సాధికారంగా విశదీకరించడానికీ,ఆచరణ సాధ్యం అని, అవసరం అనీ నేను నమ్మిన, ప్రయత్నిస్తున్న ఒక అంశం గురించి చెబుతాను.

రాబోయే అయిదారు సంవత్సరాలలో (లేదా పది సంవత్సాలు !) దక్షిణ ఆసియా విభాగాలున్న అమెరికన్‌ విశ్వవిద్యాలయాలలో (ముఖ్యంగా సంస్కృతం, హిందీ బోధించే చోట్ల ), తెలుగు సాహిత్యం చరిత్రలు పాఠ్యభాగాలుగాను, పరిశోధనాంశాలుగానూ చెయ్యవలసిన అవసరం ఉన్నది. ఇందుకు దేశవ్యాప్తంగా వెలిసిన తెలుగు సంస్థల మాటల మద్దతే కాదు, మూటల మద్దతూ అవసరం. స్థానిక సంస్థలు ఇప్పటికే, బర్క్‌లీ, ఎమరీ (అట్లాంటా) విశ్వవిద్యాలయాల్లో తెలుగు సాహిత్య బోధన. పరిశోధనలకు ఏర్పాటు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. అల్లాగే ఆస్టిన్‌లో కూడా! డెట్రాయట్లో తెలుగు వాళ్ళు ఈ పని మూడేళ్ళక్రితమే సాధించారు. అయితే, స్థానిక సంస్థలు మాత్రమే ఈ పని సాధించలేవు! దేశవ్యాప్త సంస్థలు పూనుకోవలసిన సమయం వచ్చింది. అది ఇప్పుడు సాధ్యం కూడాను!

ఒక అనవద్యమైన, నిరపాయకరమైన సూచన: తానా సభలకీ, ఆటా సభలకీ పెట్టే మొత్తం ఖర్చులో 10% (tithe)ఈ పనికై నిర్దేశించడం. అది ప్రారంభం. ఆ పని చెయ్యగలిగితే, ఒక దశాబ్దంలోపుగా, కనీసం అరడజను అమెరికన్‌ విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్య పదవి స్థాపించడం సాధ్యం.

భావితరాల పౌరులు — ఇది మాది, ఇది మా సాహిత్యం, మా సంస్కృతి — అని గర్వంగా చెప్పుకోడానికి ఇంతకన్నా ముఖ్యమయిన పని ఇంకొకటి ఉన్నదని నాకు తోచటల్లేదు.