కనిపించడం లేదు

(మహె జబీన్‌ కవయిత్రిగా విఖ్యాతి పొందిన వారు. “ఆకురాలు కాలం” వీరి కొన్ని కవితల సంకలనం. ఎన్నో విలక్షణమైన కవితలున్నాయీ సంకలనంలో. కేవలం కలంతోనే కాకుండా స్త్రీ సంక్షేమ కార్యక్రమాల్లో అంకితభావంతో పనిచేస్తున్న మహెజబీన్‌ కొత్త భావాల్ని తనదైన సరికొత్త భాషలో వినిపిస్తున్నారు. )

మనసు కనిపించడం లేదు
నువ్వేమైనా పట్టుకెళ్ళావా

మమకారంతో నేను పెంచిన మొక్కలున్నాయి
కొమ్మకొమ్మకు పూచిన చిరునవ్వుల సుమాలున్నాయి
చిరుగాలికి కదలాడే పరదాలున్నాయి
పరదాలకు కుట్టిన మువ్వలున్నాయి
మువ్వలు చేసే సవ్వడి మిగిల్చిన భావాత్మక క్షణాలున్నాయి
మనసు పడి కొనుక్కున్న ethnic  అలంకరణలున్నాయి
కుంచె అంచులు జార్చిన రంగులున్నాయి
రంగుల మధ్య రూపుదిద్దుకున్న వర్ణచిత్రాలున్నాయి
విప్లవాలు రగిల్చి ఉద్యమాలు తెచ్చిన పుస్తకాలున్నాయి
పుస్తకాల మధ్య దాచుకున్న నెమలి ఈకల జ్ఞాపకాలున్నాయి
ఇల్లంతా పర్చుకున్న కవిత్వముంది
కవిత్వం మధ్య కదలాడే నా జీవితం ఉంది
అశ్రద్ధగా పడేసుకున్న నేతచీరలున్నాయి
చీరమడతల్లో ఒదిగిపోయిన ప్రేమకథలున్నాయి
కొంగున ముడివేసిన ప్రేమకావ్యాలున్నాయి
రవిక మాటున దాచుకునే ప్రేమలేఖల రహస్యస్థావరాలున్నాయి
అస్తమించే సూర్యుడితో పాటు
ఎరుపెక్కే సాయంకాలాల మధ్య
చెప్పుకునే third world కబుర్లున్నాయి

అన్నీ అలాగే ఉన్నాయి
మనసు మాత్రం లేదు
స్నేహితుడా, నీమీద అనుమానంగా ఉంది
ఈ మధ్య నువ్వొచ్చావు కదా
నా మనసేమైనా పట్టుకెళ్ళావా