చిన్నప్పుడు మా నాన్న పుస్తకాల బీరువాలోనుండి తీసుకుని తరచుగా చదివిన పుస్తకాల్లో దీపాల పిచ్చయ్య శాస్త్రిగారి చాటుపద్యరత్నాకరము (1917) ఒకటి. దానిలోని చాటుపద్యాలని కంఠతా పట్టడం ఒక సరదాగా వుండేది. ఆ తరవాత కొంత కాలానికి చేమకూరి వెంకటకవి సారంగధర చరిత్రము కావ్యానికి ‘జితకాశి టీకా సహితము’గా రాసిన వ్యాఖ్య (1942), అంత కంటే, సాహిత్య సమీక్ష అన్న వ్యాస సంపుటి (1955) చదివిన తరువాత ఆయనెంత గొప్ప పండితుడో అర్థమయ్యింది. మరో పది, పదిహేనేళ్ళ తరవాత డి.ఎల్.ఐ మొదలైన రోజుల్లో ఆయన పుస్తకాలు, ఇంతకు ముందు చెప్పిన మూడు కాక, ఇంకొక ఆరు దొరికాయి. వాటినుండి తెలుసుకున్నదేమంటే ఆయన కాలిదాస (మేఘదూత, రఘువంశం), భాస (పంచరాత్రము, దూతఘటోత్కచము, దూతకావ్యము, ఊరుభంగము, కర్ణభారము, మధ్యమ వ్యాయోగము), దండి (కుమార కథామంజరి – దశకుమార చరిత్రము లోని కథలు) రచనలని తెనిగించారని. ఆయన రచనల గురించి, ఆయన సాహిత్య వ్యాసంగం గురించి ఆయనే ఒక రేడియో ప్రసంగంలో చెప్పిన వివరాలు ఇప్పుడు విందాం.
పిచ్చయ్య శాస్త్రిగారు, గుర్రం జాషువాగారు ఇద్దరూ వినుకొండలో స్నేహితులు, కలిసి చదువుకున్నారు. ఇద్దరూ కలసి జంట కవులుగా రచనలు చేయాలనుకున్నారని అయితే వీళ్ళిద్దరి పేర్లు కలవక (పిచ్చి జాషువా, జాషువా పిచ్చి, దీపాల జాషువా, … అనో పెట్టుకోడం ఇష్టం లేక) విరమించుకొన్నారనే కథ ఒకటి ఉంది. ఈ మధ్యనే ఆయన వారసులు ఆయన రచనల్ని కొన్నింటిని తిరిగి ప్రచురించారు.