ఉద్యోగపర్వము – రాయబారాలు

మహాకవికి తన ప్రతిభా వ్యుత్పత్తులను సమగ్రంగా ప్రదర్శించటానికి తగిన వస్తువు లభించడం అతని అదృష్టం. కవి గొప్పతనం అతడు స్వీకరించిన వస్తువు మీద, తన్నిర్వహణ విధానం మీద ఆధారపడి ఉంటుంది. సవ్యసాచి అస్త్రకళాకౌశలానికి, భుజబలోద్రేక విలాసోన్నతికి గాండీవం లభించినట్లు తిక్కన ప్రతిభా వ్యుత్పత్తులకు, కావ్యశిల్ప కళాపారగత్వానికి తగిన భారతం కథావస్తువుగా లభించటం అతని భాగ్యవిశేషం.

భారత రచనలో కవిబ్రహ్మ తనకు గల రాజనీతివేతృత్వాన్ని, యుద్ధకళా పరిచయాన్ని, వేదాంత విద్యావైశారద్యాన్ని, కూలంకషమైన సర్వశాస్త్ర పాండిత్యాన్ని, అసాధారణమైన లౌకిక జ్ఞానసంపదను ప్రదర్శించటానికి తగిన అవకాశం దొరికింది. ముఖ్యంగా విరాటోద్యోగ పర్వాలలో అతడు చూపించిన కావ్యశిల్ప వైభవం, రాజనీతి శాస్త్ర వైదుష్యం అద్వితీయము, అనితరసాధ్యము. హృదయాహ్లాదకరము, ఊర్జితము, నానారసాభ్యుదయోల్లాసి అయిన కథ విరాట పర్వంలో ఉంది. కావ్యకళాజనిభూమి యైన కవిబ్రహ్మ తనకున్న కావ్యశిల్ప కళాపారగత్వాన్ని సమగ్రంగా ప్రదర్శించటానికి ఆ కథలో అవకాశం దొరికింది. మఱి ఉద్యోగ పర్వంలో అట్టి మనోహరమైన కథ లేదు. అసలీ పర్వంలో కథకు ప్రాధాన్యం మిక్కిలి తక్కువ. ఉపాఖ్యానాలను తొలగించి చూస్తే దీనిలోని ప్రధాన కథావస్తువు ద్రుపద పురోహితుని, సంజయుని, కృష్ణుని రాయబారాలే. ఈ మూడు రాయబారాల్లో ఉన్న కథను మూడు ముక్కలలో తేల్చి చెప్పవచ్చని విమర్శకుల అభిప్రాయం. “చిన్న నాటి నుంచీ కౌరవులు పాండవుల మీద పగబూని వారినెన్నో కష్టాల పాలు చేశారు. వాటినన్నింటిని సహించి శాంతాత్ములైన పాండవులు తమ రాజ్యభాగం తమ కిచ్చినట్లయితే సంధి కాగలదని సందేశ మంపుతున్నారు. అలా ఇచ్చి సంధి చేసుకోవడం కంటే న్యాయమేమున్నది? ” ద్రుపద పురోహితుడు చెప్పినా, సంజయుడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, చివరకు భీష్మ ద్రోణ విదుర ధృతరాష్ట్రాదులు చెప్పినా విషయమిదే. ఇంతమంది ఒకే విషయాన్ని చెప్పితే అది పునరుక్తి అవుతుంది. అలా పునరుక్తి కాకుండా, ఉత్కంఠ కలిగిస్తూ విషయ వివరణ చేయటం లోనే కవిబ్రహ్మ ప్రతిభ, అనన్య సామాన్యమైన వస్తు సంవిధాన నైపుణ్యం మనకు గోచరిస్తాయి.

‘ఉద్యోగ’ శబ్దానికి ప్రయత్నమని అర్థం. ప్రయత్నము సంధికా? సమరానికా? అన్నది ప్రశ్న. ఈ రెంటికీ అనియే చెప్పవలసి ఉంటుంది. సంధి సమర ప్రయత్నాలు ఎప్పుడూ ఏకకాలం లోనే జరగటం సహజం. సమర ప్రయత్నాలు సంపూర్ణంగా చేసుకొని, తమ స్థితిని బలపర్చుకున్న తరువాతనే సంధి ప్రయత్నాలు ప్రారంభించటం నేడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. Speak from strength అన్నది నేటికీ రాజనీతి శాస్త్రంలో ప్రధాన విషయం గానే ఉంది. అదే విధంగా ఉద్యోగ పర్వంలో కూడా సమర ప్రయత్నాలు పూర్తి అయిన తరువాతనే సంధి ప్రయత్నాలు ప్రారంభ మైనాయి. అయితే సమర ప్రయత్నాలు బయటికి కనపడకుండా నిగూఢంగా, సమర్థంగా సాగుతూ ఉండగా, సంధి ప్రయత్నాలు మాత్రం లోకంలో బహుళ ప్రచారం పొందుతాయి. అదే విధంగా, భారతంలో కూడా సమర ప్రయత్నాల ప్రాధాన్యం బయటికి కనపడకుండా, సంధి ప్రయత్నాలే విస్తృతంగా వర్ణింప బడటం గమనింప దగిన విశేషం. సంధి ప్రయత్నాలు విరివిగా జరిగినా, ఆ ప్రయత్నాలు చేసిన వారెవ్వరూ సంధి కాగలదన్న విశ్వాసంతో చేసిన వారు కారు. అందరూ అధర్మాన్ని ఎదుటివారిపై నెట్టి తాము ధర్మమార్గ వర్తులమని నిరూపించుకోవటానికి మాత్రమే ప్రయత్నం చేశారు. ఉద్యోగ పర్వం లోని రాయబారాలని పరిశీలించి చూస్తే ఈ విషయం విశదమవుతుంది. అందుచేత సంధి ప్రయత్నాలు సమర ప్రయత్నాలకి బలాన్ని చేకూర్చేవి మాత్రమే కావడం చేత ఉద్యోగ శబ్దానికి సమరోద్యోగం గానే విమర్శకులు అర్థం చెప్పారు. తిక్కన కూడా ఈ పర్వాన్ని సమరోద్యోగ పర్వం గానే భావించాడనటానికి అంతరంగ సాక్ష్యాధారాలు తరువాతి పర్వాలలో లభిస్తాయి.

అభిమన్యుని వివాహానికి వచ్చిన రాజులందరితో నిండిన సభలో శ్రీకృష్ణుడు చేసిన ఉపన్యాసంతో ఉద్యోగ పర్వం ప్రారంభమవుతుంది. ఈ ఉపన్యాసం ఉద్యోగ పర్వ కథావిధానానికి బీజప్రాయమైనదని చెప్పవచ్చు. ఈ పర్వ పరమార్థమైన సంధి సమర ప్రయత్నాల ప్రాధాన్యం సూచన ప్రాయంగా ఇందులో ప్రతిపాదించటం జరిగింది. ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ, “అలఘు బల విక్రమోదాత్తులకైనా బలము లేక అనంతములగు శత్రు సైన్యములను గెలువ వశమా?” అని ప్రశ్నించుతూనే దానికి సమాధానంగా, “భూవల్లభకోటి యిచట ప్రోవగు,” అంటాడు శ్రీకృష్ణుడు. పాండవులకు తోడుపడే రాజులనందరిని పిలిపించాలని, సమర సన్నాహాలు చురుకుగా సాగించాలని ఇందులో ధ్వనిరూపంగా సూచించడం జరిగింది. పిదప సంధి ప్రయత్నాల విషయం ప్రస్తావిస్తూ, “ఎదిరి మత మెఱుగక యెట్టి కార్య నిశ్చయము సేయ వెరవు గాదు; కావున నియ్యవవసరమున తగిన మానిసి నందులకు పుచ్చవలయు” నని కార్యవిధానాన్ని నిర్ణయించాడు. ఉద్యోగ పర్వం లోని పరమార్థమని చెప్పదగిన సంధి, సమర ప్రయత్నాలను సూచ్యంగా, సూత్రప్రాయంగా శ్రీకృష్ణుడు తన ఉపన్యాసంలో ప్రతిపాదించాడు. ఆ సూత్రాన్ని గ్రహించి వయోజ్ఞాన వృద్ధుడైన ద్రుపదుడు తమకు తోడ్పడే రాజులందరి దగ్గరకు దూతల నంపే విషయాలను నిర్ధారణ చేసి, కౌరవసభకు వెళ్ళే రాయబారిగా తన పురోహితుడిని నిర్ణయించాడు. ఈ కార్య విధానాన్ని ఆమోదించి అచ్చటి రాజులందరూ సమర సన్నాహాలు చేయటానికి తమ తమ పట్టణాలకు ప్రయాణమయ్యారు. పాండవుల సమర ప్రయత్నాల చందం విన్న దుర్యోధనుడు కూడా బంధుమిత్రులయిన రాజులతో సమర సన్నాహాలు చురుకుగా సాగించాడు. ఈ విధంగా ఉభయ కటకాల్లోను సమరోద్యోగం ముమ్మురంగా సాగుతున్న సమయంలో ధర్మరాజు అనుమతితో పాంచాలపతి తన పురోహితుని కౌరవుల దగ్గరకు రాయబారిగా పంపటానికి సభకు రప్పించాడు.

వయోజ్ఞాన వృద్ధుడైన తన పురోహితునిలో దూతకు కావలసిన లక్షణాలన్నీ ఉన్నవని ద్రుపదుని భావం. పురోహితుడు అతనికి హితుడు. ముఖ్యంగా రాయబారి తనను పంపేవాని హితం త్రికరణ శుద్ధిగా కోరాలి. అంతే కాక రాయబార కార్యం మిక్కిలి క్లిష్టమైనది. ఆ కార్య నిర్వహణ కెంతో చాకచక్యం, ప్రజ్ఞాప్రాభవం కావాలి. ఎట్టి విషయాన్నయినా ఎదుటి వారి మనస్సు నొచ్చుకోకుండా చెప్పే నేర్పు అవసరం. ఎంత మతిమంతుడైనా చతురవచన కోవిదుడైనా, సమయజ్ఞత, పరేంగిత జ్ఞానం దూతకు కావలసిన ముఖ్య గుణాలు. వీటికి ఆభిజాత్య గౌరవం మరింత వన్నె పెడుతుంది. ఈ లక్షణాలన్నీ తన పురోహితునిలో ఉన్నవని ద్రుపదుడు సభ లోనే చెప్పటం జరిగింది. అయితే, ద్రుపదుడు సంధి కాగలదనే ఆశాభావం తోనే ఈ రాయబారిని పంపుతున్నాడా? ఈ పురోహితుడు కౌరవ సభలో ఏ కార్యాన్ని, ఏ పద్ధతిలో సాధించాలని పాంచాలపతి ఆశించాడు? ఈ రాయబారి ద్వారా పంపిన సందేశ మేమిటి? అనే ప్రశ్నలను పరిశీలిస్తే ఈ పురోహితుని రాయబారం లోని ఆంతర్యం మనకు చక్కగా అర్థమవుతుంది. కౌరవులతో సంధి కాగలదన్న విశ్వాసం ద్రుపదునకు లేదు. “ఎల్లభంగుల సంగరంబు కాగల యది,” అని అతని నిశ్చితాభిప్రాయములు. “న కస్యాంచి దవస్థాయాం దాస్యంతి వైరాజ్యం,” కౌరవులెట్టి స్థితి లోను రాజ్యభాగ మీయరు అని అతని తలంపు. ఏ విధం గానూ రాజ్యభాగ మీయని కౌరవుల దగ్గరకు రాయబారం పంపడం దేనికి? ఒకవేళ రాయబారి వెళ్ళినా అతడు సాధించుకొని రావలసిన పనులేమిటి? అనే ప్రశ్నలు కలగటం సహజం. వీటికి సమాధానంగా ద్రుపదుడు తన పురోహితుడు రాయబారిగా వెళ్ళి సాధించుకుని రావలసిన కార్యాలను రెండుగా నిర్దేశించాడు. అందు మొదటిది కౌరవ పక్షం లోని వీరుల మనస్సులు పాండవ పక్షం వైపుకు మరలేటట్లు చేయటం. రెండవది అవతలి పక్షం లోని వారి చిత్తవృత్తులు తెలిసికొని రావటం. వ్యాస భారతంలో ద్రుపదు డాశించిన ప్రయోజనాలు వీటికి ఇంచుక భిన్నంగా ఉంటాయి. కౌరవ పక్షం లోని అమాత్యుల్లో, యోధుల్లో బేధం పుట్టించటం, వారి సమర సన్నాహాలను ఛిన్నాభిన్నం చేయటం, కొంత కాల మక్కడే ఉండి వారి సమర ప్రయత్నాలు సాగకుండా చేసి, ఆ సమయంలో పాండవులకు సైన్య సమీకరణకు, ద్రవ్య సంచయానికి అవకాశం కలిగించటం, ద్రుపదుడీ రాయబారం నుంచి ఆశించిన ప్రయోజనాలుగా మూలంలో చెప్పబడ్డాయి. ఈ విషయాలు గోప్యంగా ఉంచదగ్గవే కానీ వాచ్యం చేయటం ఉచితం గాను ఉదాత్తం గాను ఉండకపోగా ఆ కృత్యం కుటిల రాజతంత్ర మవుతుంది. అందుచేత, కవిబ్రహ్మ ఈ రాయబార సందర్భాన్ని కొంత వరకు మార్చి తన అనువాదానికి మెరుగులు దిద్దుకున్నాడు.

ద్రుపదుడు తన కప్పగించిన రాయబార కార్యాన్ని పురోహితుడు ఏ విధంగా నిర్వహించాడో పరిశీలించవలసి ఉంది. ఇతడు హస్తినాపురికి చేరే సమయానికి ఉభయ పక్షాలలోను సమర సన్నాహాలు పూర్తి అయినవి. అంటే సమర ప్రయత్నాలు సంపూర్ణంగా చేసికొన్న తరువాతనే సంధి ప్రయత్నాలు ప్రారంభించబడడం గమనింపదగిన విశేషం. పురోహితుడు ధృతరాష్ట్ర, ధార్తరాష్ట్ర, భీష్మ, ద్రోణ, కృపాది ప్రధాన పురుషుల నందరినీ వారి వారి మందిరాలలోనే దర్శించి వారి వారి చిత్తవృత్తులను చక్కగా ఆకళింపు చేసికొన్న తరువాతనే కౌరవసభలో రాయబార కార్యాన్ని నడపటానికి పూనుకున్నాడు. మొదట కౌరవుల వలన పాండవులు పడిన కష్టాలను సభ్యుల మనస్సుల కెక్కేటట్లు చెప్పి, ధృతరాష్ట్రుని ఉద్దేశించి, “దీనికెల్ల నియ్యకొనియె నీ పెద్దరాజు నేమనఁగ నేర్తు,” అని కొసమెరుపుగా పలుకుతాడు. దుష్కృతాల కన్నింటికి వృద్ధరాజు సమ్మతి కలదని ముఖం మీదే కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పడం జరిగింది. తరువాత ద్రౌపదీ పరాభవాన్ని, అరణ్య, అజ్ఞాతవాస క్లేశాలను స్మరిస్తూ ఇన్ని కష్టాల ననుభవించ గలిగిన పాండవులు కౌరవులతో సంధి గావించుకుని జీవించే కష్టాన్ని భరించలేరా? అని చెప్పటంలో పాండవుల కష్టసహిష్ణుత, సమయపాలన బుద్ధి, వంశగౌరవం, హృదయౌన్నత్యం – ఇత్యాది సద్గుణాలను కౌరవుల దుర్గుణాలతో తులనాత్మకంగా చూపిస్తూ సభ్యుల మనస్సులు పాండవుల వైపు మరలేటట్లు మాట్లాడతాడు. చివరకు, “కౌరవుల వృత్తము, పాండవుల వర్తనము తెఱగు మాత్సర్యం లేకుండా పరిశీలించి ధృతరాష్ట్రునకు గారవమున బుద్ధి చెప్పగా దగును మీకు,” అని చెప్పడంతో పురోహితుని రాయబార నిర్వహణ చాతుర్యం పరాకోటి కెక్కింది. కురుసభలో ధృతరాష్ట్రుని ఇలా కాదు అలా అని దిద్ది చెప్పగలవాడు భీష్ము డొక్కడే. పితృ ధనమైన రాజ్యభాగాన్ని పాండవుల కిచ్చి ధృతరాష్ట్రుడు వారిని తన కొడుకుల వలెనే చూచుకోవలనని కర్తవ్యాన్ని ఉపదేశిస్తూనే గాంగేయుడు, అలా చేయకపోతే కవ్వడి కోపాని కీలోకంలో ఎవ్వరూ ఆగలేరని పలుకుతాడు. అర్జునుని త్రిభువనైకధన్విగా పొగడిన భీష్ముని మాటలకు కోపించిన కర్ణుడు పాండవులు సమయాన్ని అతిక్రమించి రాజ్యభాగాన్ని అడగడమే తప్పని, రాజులను కూర్చుకొని ఎత్తివచ్చినంత మాత్రాన కురురాజు భయపడి రాజ్యభాగమిస్తాడా? అంటూ సంధి ప్రయత్నాలను భగ్నం చేయటానికి పూనుకుంటాడు. ఈ మాటలకు కటకటపడ్డ గంగానందనుడు కర్ణుని తీవ్రంగా మందలించుతాడు. కురుసభలో వాతావరణం మారిపోసాగింది. ద్రుపద పురోహితుని రాయబార ప్రయోజనానికి అనుగుణంగానే సభలోని కార్య విధానం పరిణమిస్తున్నది. కర్ణ గాంగేయులు వివాదం లోనికి దిగినారు. క్రమ క్రమంగా గురుకృపాదులు, దుర్యోధనాదులు ఆ వాగ్వాదం లోనికి దిగే అవకాశం లేకపోలేదు. ఆ కొలువుకూటం కలహకూటంగా మారే స్థితి ఎంతో దూరంలో లేదు. ప్రజ్ఞా చక్షువైన ధృతరాష్ట్రుడు పురోహితుని రాయబారం లోని ఆంతర్యాన్ని ఇట్టే పసిగట్టి పరిస్థితి విషమించక ముందే అతనిని హస్తినాపురి నుండి సాదరంగా సాగనంపాలని తలంచినాడు. గాంగేయుని భక్తితో అనునయించి, కర్ణుని మందలించి, పురోహితునితో, “నేను, బంధువులు, మంత్రులు, పెద్దలు ఆలోచించి ప్రజలందరకు ప్రీతి కలిగేటట్లు సౌమ్యుడైన వానిని బిడ్డలైన పాండవుల దగ్గరకు పంపుతాను,” అని అతనికి వీడ్కోలు చెప్పినాడు. ఈ విధంగా ఉద్యోగ పర్వంలో పురోహితుని రాయబారం ముగిసింది. ఈ రాయబారాన్ని పంపేటప్పుడు ద్రుపదు డాశించిన ప్రయోజనాలన్నీ పూర్తిగా చేకూరినవని చెప్పడంలో సందేహం లేదు. కౌరవ పక్షం లోని ప్రధాన పురుషుల చిత్త వృత్తులను పురోహితుడు చక్కగా అర్థం చేసుకున్నాడు. భీష్మాదుల మనస్సులు పాండవుల వైపుకు వ్రాలే విధంగా కౌరవుల సభలో రాయబార కార్యాన్ని నడిపించాడు. కర్ణ గాంగేయుల వాగ్వివాదం వలన ప్రధాన యోధులలో ఎలా భేదం కలిగించినాడో కూడా స్పష్టమవుతూనే ఉంది. ఈ రాయబారం వలన ద్రుపదుడు ఏయే ప్రయోజనాలు సాధించవలెనని ఆశించినాడో ఆవి అన్నీ కూడా నూటికి నూరుపాళ్ళు సాధింపబడినవని ఈ రాయబారాన్ని పరిశీలిస్తే విదిత మవుతుంది.

సౌమ్యునొక్కని పాండవుల దగ్గరకు పంపగలనని ధృతరాష్ట్రుడు పురోహితునితో చెప్పటం జరిగింది. ఆ సౌమ్యుడే తరువాత సంజయు డయ్యాడు. ధృతరాష్ట్రుడు సంజయుని ఏ స్థితిలో ఎందుకు రాయబారిగా పంపినాడో పరిశీలిస్తే గాని సంజయ రాయబారం లోని ఆంతర్యం సరిగ్గా అర్థం కాదు. విప్రుని రాయబారం తరువాత ధృతరాష్ట్రుడు క్లిష్ట పరిస్థితి నెదురుకొనవలసి వచ్చింది. తమ రాజ్యభాగం లేకుండా పాండవులు సంధి కంగీకరించరనే విషయం స్పష్టమయింది. వారికి పాలు పంచి ఇవ్వటంలో తన మాట ఎట్లున్నా దానికి దుర్యోధను డంగీకరించడు. కొడుకు మాట కెదురాడే సామర్థ్యం వృద్ధరాజుకు లేదు. ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహ పీడితుడు. అతిలోభ దూషితుడు. అట్టివాడు పాండవులకు రాజ్యభాగమిస్తాడా? పాలు పంచి ఇవ్వకపోతే యుద్ధము జరుగక తప్పదు. యుద్ధమే సంభవిస్తే గురు భీష్మాదుల వలన తమకే విజయము చేకూరగలదన్న ఆశ యొకవైపు, భీమార్జునుల కెదురు నిలుచు ప్రతివీరులు లేరన్న భయం ఒక వైపు, అతన్ని సందేహాందోళిత మనస్కునిగా చేశాయి. అందుచేత పాండవులకు భాగ మీయకుండా, యుద్ధము రాకుండా ఉండే మార్గాన్ని ఆలోచించడం మొదలు పెట్టాడు. తమ భాగాన్ని పొందకుండా పాండవు లూరుకోరు. ఏడక్షౌహిణుల సైన్యాన్ని కూర్చుకొని ఎత్తిరావటానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్టి స్థితిలో పాండవులు రాజ్యభాగం లేకుండా యుద్ధం మానివేసే పద్ధతిలో కార్యాన్ని సాధించుకుని రాగలిగిన సమర్థుని రాయబారిగా పంపవలెనని ధృతరాష్ట్రుడు యోచించినాడు. అట్టివాడు ఎవ్వరన్నది ప్రశ్న. గురుభీష్మాదులు యుద్ధ తంత్ర ప్రవీణులే గాని సంధికార్య నిర్వహణ చతురులు గారు. అంతేకాక తన కౌటిల్యాని కంగీకరించేవారు కారు. అతనికి తోడు నీడల లాగా బహిః ప్రాణాలవలె సంచరించే వారిద్దరున్నారు; విదురుడు, సంజయుడు. విదురుడు సమస్త కౌరవ సామ్రాజ్యానికి సచివుడు. ఇంక సంజయుడా ధృతరాష్ట్రునకు ఆంతరంగిక సచివుడు. వీరిద్దరూ మహారాజు మనోగతిని పూర్తిగా అర్థం చేసుకున్నవారు. సమస్త శాస్త్ర పారంగతులు. రాజనీతి దురంధరులు. చరర వచో నిపుణులు. ప్రజ్ఞావంతులు. రాజకార్య నిర్వహణ దక్షులు. వీరిద్దరూ రాయబార కార్య నిర్వహణ సమర్థులే. ఈ విషయాన్నే సంజయ రాయబారం తరువాత ధర్మరాజు సంజయునితో, “నీవు, విదురుడు గాక ఈ రాయబారాన్ని నడపగల సమర్థు డింకొకడున్నాడా?” అంటాడు. అయితే విదురుని వదలి సంజయునే ఎందుకు రాయబారిగా ఎన్నుకోవటం జరిగింది? రాజ్యభాగం లేకుండా పాండవులను యుద్ధము మానిపించే సంధి పద్ధతి కౌటిల్యంతో కూడింది. ధర్మ పక్షపాతి అయిన విదురుడే రాయబారి అయితే ఆ సంధి సందేశం లోని కౌటిల్యాన్ని సభ లోనే బయటపెట్టి ఉండేవాడు. విదురుడు ధృతరాష్ట్రునకు తమ్ముడు – ఆప్తుడు, సచివుడు. అన్నకు ఈ తమ్మునిపై ఎంతో ప్రత్యయం. ఈ తమ్మునికి అన్నపై ఎంతో గౌరవము, అంతకు మించిన చనువు. అన్న ఆలోచన అధర్మ మార్గంలో సాగితే వెంటనే సరిదిద్దే చనువు విదురునికి ఉంది. అందుచేత ధృతరాష్ట్రుడు కపటంతో కూడిని ఈ రాయబార కార్యనిర్వహణ భారాన్ని తనను చక్కగా అర్థం చేసుకొని, మారు మాటాడకుండా త్రికరణ శుద్ధిగా ప్రభుకార్య సాఫల్యానికి ప్రయత్నించే చతురతానిధియైన సంజయునకు అప్పగించడానికే నిశ్చయించుకున్నాడు.

ద్రుపద పురోహితుడు తిరిగి వచ్చి తన రాయబార విశేషాలను పాండవులకు నివేదించాడు. ఆ తరువాత ధృతరాష్ట్రుడు సంజయుని రాయబారిగా పంపటానికి నిండు కొలువుకు రప్పించాడు. సంస్కృత భారతంలో ధృతరాష్ట్రుడు తన సంభాషణ మంతా సంజయు నుద్దేశించి చేయగా తెలుగు భారతంలో అధిక భాగం సభ నుద్దేశించి చేయటం గమనింప దగిన విశేషం. సభకు వచ్చిన సంజయునితో ఇలా అంటాడు కురురాజు:

పాండు నరపాల సుతు లుపప్లావ్యమునకు
వచ్చి యున్నారు నీవేగి వాసుదేవ
సహితముగ వారిఁ గని తద్వివాద మేమి
భంగి మాను నమ్మెయి దగఁ బలుక వలయు.