(పెమ్మరాజు వేణుగోపాలరావు గారు అట్లాంటా లోని ఎమరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అనేక కవితలు, కథలు, అనువాదాలు రాశారు. )
తెరుచుకోని ద్వారం ఒకటి ఒకవీధిలో
ఇంటినెంబరు కాలింగ్ బెల్తో సహా
గతించిన స్వర్గం గుర్తు తెస్తుంది.
సాయంత్రపు సూర్యుని కాంతి
సోకగానే నాకోసం తెరుచుకోదింక.
పగలు పగిలి ముక్కలవుతూంటే
రాత్రి తన కౌగిలితో కూర్చే భద్రతలో
చెయ్యవలసిన పని పూర్తిచేసుకుని
మక్కువతో నాకోసం నిరీక్షించే కంఠం
వినపడదింక నాకు.
నా రాతే వేరు.
పనిలేని బద్ధకపు ఘడియలు,
అస్పష్టమైన జ్ఞాపకశక్తి,
సాహిత్యాన్ని పాడుచేస్తూ పరిశ్రమ
చివరిలో ఊహలకందని చావు
ఇక నాకు కావలసింది
సమాధిపై రాయి మాత్రమే
దాని మీద రెండే రెండు తారీఖులు
ఇంకేఁవక్కర్లేదు
నిరీక్షణ
డోర్బెల్ మ్రోగి
వాళ్ళు తలుపు తీసి
నువ్వు లోపలికడుగెట్టే లోపల
ఆతృతతో నిండిన ఆ క్షణంలో
ఒకదాని తర్వాత మరొకటి వరుసగా
లెక్కలేనన్ని, రకరకాల పనులు
చేసుకుంటుంది ప్రపంచం.
ఎన్నో అద్దాల మధ్య
పరావర్తించే ప్రతిబింబాలు
ఎదిగే తరిగే నీడలు
వెళ్ళిపోయి తిరిగి కలుసుకునే అడుగులు
తల తిరుగుతుంది తలుచుకుంటే
ఎవరు లెక్కపెట్టగలరు?
అవి లెక్క పెట్టడానికి
సరిపడ ఇసుకరేణువులు కూడా
లేవీ లోకంలో!
(నా రొమ్మెముకల గూటి మధ్య
రక్తప్రవాహ గడియారం
కొలుస్తోంది, నిరీక్షణతో
బిగిసి కలవరపడుతున్న
కాలప్రవాహాన్ని.)
నీ రాకకు ముందు క్షణాన్నే
సర్వసంగపరిత్యాగొకడు
తన జీవితాధరువు గురించి
కలగన వలసి వచ్చింది.
సుమత్రాలో పెద్దపులొకటి
మరణించవలసి వచ్చింది.
బోర్నియాలో తొమ్మండుగురు
చచ్చిపోవలసి వచ్చింది.
చిక్కు
దానికి ద్వారం ఉండదసలు
లోపలున్నావు నువ్వు
చుట్టూ ఉన్నదే ప్రపంచం
వెనక ప్రక్క, ముందు ప్రక్క అంటూ లేదు
చుట్టూ ప్రహరీ కాని, రహస్యకేంద్రం కాని లేవు.
తిన్నగా పోయే నీ దారి
ఖచ్చితంగా రెండుగా చీలుతుంది
మరొకసారి చీలుతుంది
ఇంకొకసారి, ఇంకొకసారి,..
అంతులేని చీలిక
నీకు రానున్నది నిశ్చయం ఇనపరాయిలా
నిన్ను విచారించి శిక్షించే జడ్జి కూడా.
అంతులేని రాయిలా అల్లుకుపోయిన
చిక్కుని చీల్చడానికి
వివిధ రూపాలతో విజృంభించి వచ్చే
వృషభం లాంటి మనిషొకడున్నాడని మరచిపో
అలాంటి వాడు లేడసలు
ఈ నల్లటి చీకటిలో
క్రూరమృగాన్ని కూడా ఆశించకు.
Jorge Luis Borges (1899 – 1986) is an Argentine poet, essayist, and short-story writer, whose centenary is being celebrated this year all over by the literary world. He was born in Buenous Aires and educated in Europe. He settled in Buenous Aires to become one of the most influential literary figures of this century.. His tales of fantasy and dream worlds have become classics of the twentieth century. With eye problems, he became totally blind in the last decades of his life. His greatest contribution is his rediscovery of the Spanish language. He took the Spanish language towards regions that had not before been visited using words with the greatest of clarity and precision than any Spanish writer of this century.