మహాభారతం ఏం చెప్తుంది? ఒక కొత్త కోణం

(వాడవల్లి చక్రపాణిరావు గారు అమలాపురం S.K.B.R.  కళాశాలలో తెలుగు ఉపన్యాసకులు. “మహాభారతంలో ద్రౌపది” అన్న అంశం మీద పి. ఎచ్‌. డి. చేశారు.)

“పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా” అన్నట్టు మనమూ పుడుతున్నాం, ఏదోలా బ్రతికేస్తున్నాం, చచ్చిపోతున్నాం. అంతకు మించి ఆలోచించలేకపోతున్నాం.

ఎప్పుడేనా తీరిక దొరికి, “ఏమిటీ జీవితం? దీని ప్రయోజనం ఏమిటి? దీని గమ్యం ఏమిటి?” అనే ప్రశ్నలు వస్తే, సమాధానాలు సిద్ధంగా ఉంచారు మన మహర్షులు.
రామాయణం, మహాభారతం అనే రెండు మహేతిహాసాలను కూడ వారు మనకు ప్రసాదించారు. వీటిలో రామాయణం వ్యక్తిని కుటుంబానికి తగిన వ్యక్తిగా తీర్చిదిద్ది, ఆదర్శవంతమైన కుటుంబజీవనానికి మార్గదర్శకమవుతోంది. మహాభారతం మానవుణ్ణి సమాజానికి తగిన వ్యక్తిగా తీర్చిదిద్ది, సాంఘికజీవనానికి
మార్గదర్శకమవుతోంది. మహాభారతం మనకు ఇస్తున్న సందేశాన్ని, ఆ వెలుగులో మనం మన జీవితాల్ని ఎలా నడుపుకోవాలి అనే అంశాల్ని ప్రస్తుత వ్యాసంలో ముచ్చటించుకొందాం.

ఏ కాలంలో ఐనా, ఏ సమాజంలో ఐనా ఎక్కువమంది మానవుల జీవిత లక్ష్యం సంపాదించుకోవడం, అనుభవించడం ( to earn and enjoy ) అనేది ఒక్కటే అనిపిస్తుంది.

సంపాదించే వాటిని సంపదలు (అర్థము) అనీ, అనుభవించేవాటిని కోరికలు (కామము) అనీ మన పెద్దలు వ్యవహరించారు.

అయితే, ఏవి సంపదలు? కోరికలు ఎలా ఉండాలి? వాటిని ఏ విధంగా తీర్చుకోవాలి? అనే విషయాలకు సంబంధించి భారతీయులకూ తక్కిన ప్రపంచానికీ ఎంతో తేడా ఉంది.

డబ్బు ( money) ఒక్కటి ఉంటే చాలు దానిని ఎలా సంపాయించినా సరే; మనస్సు ముచ్చటపడేవి తీర్చుకోగలగడం దాని ప్రయోజనం; అలా తీర్చుకోవడం వల్ల  కలిగే అనుభవమే సుఖం ఇది అభారతీయమైన భావన. దీనినే మన పెద్దలు “మ్లేఛ్ఛభావన” అన్నారు. ఇప్పటివారు దీనిని పాశ్చాత్యభావన ( western concept) అంటున్నారు. భారతీయ భావన ఎంత సనాతనమో బహుశ ఇదీ అంత పురాతనమే.

I am the master of my SELF  సర్వ జీవుల హృదయాధిపతిగా వెలుగొందుతున్న ఈశ్వరస్వరూపమే “నేను”; నాకంటూ ప్రత్యేకించి కోరికలు ఉండటం, ఉందకపోవడం అనేది లేదు; శరీరం కూడ కావాలని నా ఇష్ట ప్రకారం నేను తెచ్చుకున్నదీ కాదు, నేను వద్దనుకుంటే పోయేదీ కాదు; అది నాకు ప్రసాదింపబడింది కాబట్టి దానిని నిలుపుకోవడం, నిర్వహించుకోవడం నా కర్తవ్యాలు. అందుకోసమే శరీరధర్మాన్ని ( biological needs) మన్నిస్తాను గాని, శరీరధర్మమే నా పరమార్థం కాదు; నాకంటూ ఒక ప్రవృత్తి (స్వభావం innate nature ) ఉంది; ఆ ప్రవృత్తికి తగిన పనిని ఎంచుకుని సమాజరూపంగా ఉన్న వాసుదేవుణ్ణి (the all-pervading consciousness ) సేవించినట్లయితే, నా శరీరపోషణ వేరే ప్రయత్నం అక్కరలేకుండా దానంతటదే సాగిపోతుంది; ప్రకృతిలోని సర్వ శక్తులతో ఒక విధమైన అనుసంధానం సిద్ధిస్తుంది; అప్పుడు “నేను” ఒక  వ్యక్తిగా కాక సమష్టిగా జీవించడం మొదలౌతుంది; అందువల్ల కలిగే తృప్తి అలౌకికమైన ఒక సుఖానుభూతిని ఇస్తుంది; ఆ అలౌకికానుభూతినే “ఆనందం” అంటారు; ఈ ఆనందం డబ్బుతో దొరికేది కాదు హృదయగతమైన ఈశ్వరభావన (ఐశ్వర్యం)తో మాత్రమే అందుకోగలిగేది; ఇందుకు స్వఛ్ఛమైన ప్రేమ ఒక్కటే సాధన, సాధనమూను! ఇదీ సనాతనమైన భారతీయ భావన.

ఇంక మహాభారతం విషయానికి వస్తే, స్థూలంగా కథ ఇది

ధృతరాష్ట్రుని కుమారులు నూరుగురు వారే దుర్యోధనాదులు. వారిని కౌరవులని కూడ అంటారు. పాండురాజు కుమారులు అయిదుగురు ధర్మజ భీమార్జున నకుల సహదేవులు వీరిని పాండవులు అంటారు. పాండురాజు వేటకు వెడుతూ రాజ్యభారాన్ని ధృతరాష్ట్రుడికి అప్పగించిపోయాడు. దురదృష్టవశాన తిరిగిరాలేదు. పాండవులను వెంటబెట్టుకుని కుంతీదేవి మాత్రం తిరిగివచ్చింది. ధృతరాష్ట్రుని కొడుకులు వాళ్ళని నానా హింసల పాలు చేశారు. ఎలాగైనా వాళ్ళని వదిలించుకుని రాజ్యం మొత్తం దక్కించుకొందామని చూశారు. ఆఖరియత్నంగా లక్క యిల్లు ఏర్పాటుచేసి, అందులో వాళ్ళని బూడిద చేద్దామని చూశారు. పాండవులు ఎలాగో ప్రాణాలతో బయటపడ్డారు. ద్రుపదుని కుమార్తెను పరిణయమాడి, ఆ వియ్యం వల్ల మరింత బలపడ్డారు. ధృతరాష్ట్రుడు పాండవులు అక్కడే ఉంటే తనకు, తన బిడ్డలకు ప్రమాదమని గుర్తించి, వాళ్ళను హస్తినకు రప్పించి, ధర్మజుని యువరాజుగా చేశాడు. అంతేకాదు, ఖాండవప్రస్థానికి రాజుగా కూడా చేశాడు. అంతటితో పాండవులు విజృంభించి, తమ బలపరాక్రమాలు ప్రదర్శించి, నాలుగు దిక్కులూ జయిమ్చి, మహావైభవంగా రాజసూయం నిర్వహించి, సార్వభౌములుగా సుప్రతిష్టితులయ్యారు. పాండవుల వైభవం దుర్యోధనుడికి సహింపరానిదయ్యింది. వాళ్ళని ఎలాగైనా సరే ప్రాభవశూన్యులుగా చేయాలని సంకల్పించాడు. శకుని సహాయంతో మాయద్యూతంలో ఓడించి, నిండుసభలో ద్రౌపదినీ, పాండవులనూ అవమానించాడు. మళ్ళీ అనుద్యూతంలో ఓడించి, వాళ్ళను పన్నెండేళ్ళూ అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యండని పంపేశాడు. కిమ్మనకుండా నియమపాలన చేసి, మా రాజ్యం మాకివ్వండని పాండవులు ధృతరాష్ట్రుడికి కబురంపారు. కనీసం అయిదుగురికీ అయిదూళ్ళిచ్చినా సరిపెట్టుకొంటామన్నారు. దుర్యోధనుడు ససేమిరా ఇయ్యనన్నాడు. వాడిసూదిమొన మోపినంత మేరనయినా తనంత తానుగా ఇవ్వననీ, కావాలంటే యుద్ధం చేసి గెలుచుకోండనీ తేల్చి చెప్పాడు. మరింక గత్యంతరం లేకపోయింది. పద్ధెనిమిది అక్షౌహిణుల సేనతో పద్ధెనిమిది దినాలు మహాఘోరంగా కురుక్షేత్ర సంగ్రామం నడిచింది. రక్తం వరదలై పారింది. రాజ్యం పీనుగుపెంటలయింది. స్త్రీబాలవృద్ధులు మినహా మహాజనసంక్షయం జరిగిపోయింది. పునఃప్రతిష్ఠితుడై ధర్మరాజు మరో ముఫ్ఫై ఆరేళ్ళు పృధ్వీపాలనం చేసి, పరీక్షిత్తుకు పట్టం కట్టి, మహాప్రస్థానానికి తరలివెళ్ళిపోయాడు.

పైకి చూడటానికి మహాభారత యుద్ధం దాయాదుల మధ్య రాజ్యం కోసం జరిగిన పోరాటంగా కనబడుతుంది. సూక్ష్మదృష్టితో పరికిస్తే, వారి మధ్య అలాటి వైరం లేదని తెలుస్తుంది. నిజానికి  ఇక్కడున్నది ఏకపక్ష వైరం. పాండవులు కౌరవుల్ని ద్వేషించారనటానికి ఆధారాలు లేవు. అంతేకాదు, ఘోషయాత్ర మిషతో పాండవుల్ని అవమానించటానికి వచ్చి, ఆపదలో చిక్కుకున్నప్పుడు ధర్మరాజు వారిని రక్షింపజేశాడు. అలాగే, గోగ్రహణ సమయంలో అర్జునుడు సమ్మోహనాస్త్రం వేసి కౌరవుల్ని మూర్ఛ పొందించినప్పుడు వారందర్నీ వరుసపెట్టి నరికివేసే అవకాశం వచ్చినా, ఆ మాటే తలపెట్టక గోవుల్ని మాత్రం విడిపించుకుని వచ్చాడు. శ్రీకృష్ణుని కౌరవసభకు రాయబారిగా పంపేటప్పుడు కూడా సహదేవుడూ, ద్రౌపదీ తప్ప తక్కిన నలుగురు సోదరులూ కౌరవుల పట్ల తమకు ద్వేషం లేదనీ, ఏదో విధంగా వారితో రాజీ చేసుకుని సఖ్యంగా ఉండటానికే సిద్ధంగా ఉన్నామనీ తెలిపారు. సహదేవుడు కూడా సంధి కుదర్చవద్దనలేదు అన్యాయం చేసిన వాడు దుర్యోధనుడైతే వాడిని మనం బ్రతిమాలడం ఏమిటి? సంధి అవసరం వాడికి గాని మనకేమిటి? అన్నదే అతని ఎదిరింపు. ద్రౌపది విషయానికి వస్తే, ఆమె తనకు కురుసభలో జరిగిన పరాభవాన్ని గుర్తు చేసి, తన భర్తలు ప్రతీకారం మాట తలపెట్టకుండా, రాజ్యం గురించే రాజీ మాటలు ఆడితే ఉపయోగం ఏముంటుంది? కౌరవులు మర్యాదగా రాజ్యం ఇస్తారా బతికిపోతారు, లేదూ, తనకు చేసిన అవమానానికి తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించింది అంతే!

మరయితే, యుద్ధానికి మూలకారణం ద్రౌపదికి కురుసభలో జరిగిన పరాభవం అనుకుందామా? సంప్రదాయజ్ఞుడైన విశ్వనాథ వంటి విమర్శకునితో సహా ఎందరో పరిశోధకులు అలానే భావించారు “ద్రౌపది లేనిచో వారి వైరమింత తీవ్రరూపము దాల్చెడిది కాదు. ద్రౌపదీ వస్త్రాపహరణమే కౌరవపాండవ వైరభావమునకు శిఖరము వంటిది. విరోధములుండవచ్చును. ఒకరికొకరపకారములు చేసికొనవచ్చును. ఈ విరోధము స్త్రీమానభంగ హేతుక మైనప్పుడు దాని వెట్టదనము తట్టరానిదిగా నుండును. ఈ సర్వ వైర వృక్షమునకు ద్రౌపది మూలకందముగా గన్పించుచున్నది. ఆమెను బలాత్కారముగా దుశ్శాసనుడు చీరలొలుచుట, నామెను తన తొడ మీద గూర్చుండు మని దుర్యోధనుడు సన్న చేయుట చేత, భీముడు ప్రతిజ్ఞలు చేసెను. అందుచేత ద్రౌపదియే యీ మహావైర వ్యూహమునకు నడిబొడ్డుగా గన్పించుచున్నది…”          (నన్నయగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి, ప్రథాన కథ విశ్వనాథ సత్యనారాయణ)

కానీ, మహాభారత కథను జాగ్రత్తగా గమనిస్తే, ద్రౌపదికి కురుసభలో జరిగిన పరాభవానికి ప్రతీకారంగా భారతయుద్ధం జరగలేదు. దుర్యోధనుడు పాండవులు అడిగిన రాజ్యభాగం గానీ, కనీసం అయిదూళ్ళు గానీ ఇచ్చి ఉన్నట్లయితే యుద్ధప్రసక్తే ఉండేది కాదు. యుద్ధం వరకూ వ్యవహారాన్ని లాగిందీ, ” .. ఎవరైన సంగ్రామమునన్‌ జయంబు గొని రాజ్యము సేయుట నిశ్చయించితిన్‌…” అని ముందుగా యుద్ధం ప్రకటించిందీ దుర్యోధనుడే. యుద్ధం అనివార్యం అని తేలిన తర్వాత, పాండవుల పౌరుషాగ్నిని ప్రజ్వరిల్లజేయడానికి మాత్రమే ద్రౌపది పరాభవం పనికొచ్చింది.

మరయితే, మహాభారత యుద్ధానికి అసలు కారణం ఏమిటి?

నా దృష్టిలో, మంచీ చెడూ, పెద్దంతరం చిన్నంతరం ఎరుగరానీయనంతటి దుర్యోధనాదుల మిడిసిపాటు!
ఆ మిడిసిపాటుకు మూలం వారి భౌతికసంపత్తీ (అర్థం), సుఖభోగేఛ్ఛా (కామం)!

భౌతికసంపదలు సంపాదించిన కొద్దీ సంపాదించాలనిపిస్తాయి. ఎంతగా సంపాదించినా తృప్తినియ్యవు. పైగా తమకు మాత్రమే అవి సొంతం కావాలనీ, ఇతరులకు ఎవ్వరికీ అంతటి సంపదలు ఉండరాదనీ అనిపిస్తుంది కూడా. వీటి గురించే, “.. ఆశాపాశము తా కడున్‌ నిడుపు, లేదంతంబు రాజేంద్ర..” అని భాగవతంలో వామనుడు బలిచక్రవర్తితో చెప్పాడు. దుర్యోధనుడు కూడా “ధర్మజుని సంపదలు, వైభవం చూసి నీవు అసూయ పడకు, నీకు వాని కంటె అయిదురెట్లు ధనసంపద ఉంది. అతడు చేసిన యజ్ఞం కంటె పెద్ద యజ్ఞం చెయ్యి” అని చెప్పిన తండ్రితో

“పరమ సుఖోపాయంబున
పర సంపద సేకొనంగ బడునేని నరే
శ్వర! యంతకంటె మిక్కిలి
పురుషార్థం బెద్దియుండు భూనాథులకున్‌ ” (ఆం.మ.భా. సభా2142)

“.. కాన పాండవశ్రీ యుపేక్ష్యంబు కాదు… దాని నెవ్విధంబున నైన నపహరింప వలయు నట్లు గాని నాడు నా హృదయతాపంబున కుపశమంబు గా” దన్నాడు.

అంటే, దుర్యోధనుడి ఏడుపు తనకు సంపద లేదని కాదు, ధర్మజునికి ఉందని మాత్రమే అని స్పష్టపడుతోంది. అంతే కాదు, దాన్ని ఏ విధంగానైనా సరే సొంతం చేసుకోవడమే పురుషార్థం అని కూడా సిద్ధాంతీకరించాడు.

ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు. అర్థకామాలు ధర్మబద్ధమైనట్లయితే మోక్షానికి అర్హత వస్తుందని పెద్దలు చెబుతారు.

కానీ, దుర్యోధనుడు భారతీయమైన అలాంటి భావనకి భిన్నంగా ఎలాగైనా సరే పరధనాపహరణం చెయ్యడమే తన జీవితాశయంగా భావించాడు. అదీ అతని పతనానికి కారణం. జూదమూ, యుద్ధమూ ఒక్క లాంటివే దుర్యోధనుడు జూదంలో జయమే ముఖ్యం గాని ఎలా జయించామన్నది కాదని పలికించాడు శకుని చేత. కానీ కురుక్షేత్ర యుద్ధంలో తాను ఓడిపోతున్నప్పుడు మాత్రం న్యాయాన్యాయాలు గుర్తుకు వచ్చాయి అతనికి. తనకొక నీతీ, ఎదుటివాడికొక నీతీ అంటే ఎలా కుదురుతుంది? తాను ధర్మమనీ, న్యాయమనీ నమ్మినదానికి తానైనా కట్టుబడి ఉండాలి కదా! ధర్మజుని పంతం అదే “నీ నియమానుసారం ఎలా ఆడమంటే అలా ఆడాను జూదం; నీవు గెల్చానన్నావు, నేను ఓడానన్నావు, ఒప్పుకున్నాను పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒక యేడాది పాటు అజ్ఞాతవాసం చెయ్యాలన్నావు సరేనన్నాను సక్రమంగా నిర్వర్తించాను; మరి నీ మాట ప్రకారమే ఆ తర్వాత నా రాజ్యం నాకు ఇవ్వాలి గదా! ఎందుకివ్వవు? మాటకోసమైనా నీ చేతుల మీదుగా నువ్వు ఎంతో కొంత కనీసం అయిదూళ్ళయినా మా అయిదుగురికీ యియ్యి సరిపెట్టుకుంటాం నీ జోలికి రాము” అన్నాడు. ధర్మం అన్న పదానికి విస్తృతమైన మహార్థాలు ఎన్నో ఉన్నాయి. ధర్మరాజు వాటి ప్రసక్తి లేకుండా “నువ్వు ధర్మం అనుకున్న దాన్నే నేను అంగీకరిస్తాను, కనీసం దాన్నైనా నువ్వు పాటించు, నీ మాట నిలబెట్టుకో!” అని అడిగాడు దుర్యోధనుణ్ణి. సంపదల్ని పూజించే దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు గాని మాట నిలుపుకోవాలనుకోలేదు. అదీ అతను చేసిన ధర్మభంగం.

పరమ వైరాగ్య సంపన్నుడైన ధర్మరాజుకు రాజ్యం దేనికసలు? క్షాత్రధర్మం ప్రకారం కావాలనుకున్నాడే అనుకుందాం, మహా పరాక్రమవంతులైన నలుగురు సోదరులు గల అతను దుర్యోధనుణ్ణి ప్రాధేయపడవలసిన అవసరం ఏముంది? అతను ఎక్కడ ఉంటే అక్కడే మహావైభవం కదా! సామ్రాజ్యమూ, సంపదలకు అతను ఎలా అంటుకోలేదో (అంటుకుంటే జూదానికే రాడు; వచ్చినా పోగొట్టుకోడు కదా!) అవమానాలకూ, లేమికీ కూడా అలాగే అంటుకోలేదు. అన్నిటా, అందర్లోనూ అతను చూసింది తనలో ఉన్న దైవాన్నే! కనుకనే, దుర్యోధనుడి పట్ల ప్రేమా, జాలీ తప్ప ద్వేషం లేదు ధర్మరాజుకి. సంధికోసం ప్రాకులాడాడంటే, యుద్ధం చెయ్యటం చేతకాకనా? జయించలేమనే భయం వల్లనా? స్వజన హననానికి మనస్సు రాక! అంతే!

మంచితనాన్ని చేతకాని తనంగా భావించి, కయ్యానికి కాలుదువ్వితే సిద్ధపడక తప్పదు గదా క్షత్రియప్రవృత్తి గలవాడికి? ఆనాడు జూదానికి రమ్మన్నప్పుడు కిమ్మనకుండా ఎలా వచ్చాడో ఈనాడూ అలానే  యుద్ధానికి వచ్చాడు ధర్మరాజు.

హతశేషులైన ధృతరాష్ట్రుడు గానీ, గాంధారి గానీ ఏమనగలరు? ఎవరిని నిందించగలరు? ఆనాడు విదురుడు చెబితే విన్నాడా? భీష్మాదులు చెబితే చెవికెక్కిందా? ఆకరుగా పరమదయాళుడైన పరమేశ్వరుడు రాయబారిగా వచ్చి చెబితే తలకెక్కిందా? తన లోభం, తన మోహం తనను కట్టికుడిపాయని సరిపెట్టుకోవలసి వచ్చింది ఆ గుడ్డిరాజుకి. పాపచింతనా, అధర్మభీతీ గల గాంధారి మాత్రం కృష్ణుడి మీద నెపం వేసి ఏడ్చుకోగలిగింది.

కాబట్టి, “అర్థకామాలు కాదు జీవిత పరమార్థం; ధర్మం అని ఒకటుంది దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తే అర్థకామాలు వాటంతటవే సిద్ధిస్తాయి; నా మాట వినండి; భౌతికమైన అర్థకామాల కేసి పరుగులు తీస్తే కౌరవులకు పట్టిన గతే పడుతుంది ఎవరికైనా” అని ఘోషిస్తూ వ్యాసభగవానుడు మహాభారతేతిహాసాన్ని లోకానికి ప్రసాదించాడు. ఆయన మాటలివి

“ఊర్వ్ధ బాహోర్విరౌమ్యేష న కశ్చిదపి శృణోతిమే
ధర్మాదర్థశ్చ కామశ్చ స కిమర్థం న సేవ్యతే (సంస్కృత భారతం స్వర్గా 575)

(ధర్మం వల్లనే అర్థకామాలు సిద్ధిస్తున్నాయే, ఆ ధర్మాన్ని సేవించండని చేతులెత్తి ఆక్రోశిస్తున్నా నా మాట ఎవరూ పట్టించుకోరేం?)

జనమేజయ మహారాజుకు భారతగాథను వినిపించిన వైశంపాయన మహర్షి కూడా ఆ కథను కేవలం ఒక చరిత్రగా కాక పురుషార్థసర్వస్వంగా పేర్కొన్నాడు.

“ధర్మేచార్థేచ కామేచ భరతర్షభ!
యది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్‌ క్వచిత్‌ ” (ఆది 6253)

(ధర్మార్థ కామ మోక్షాల విషయంలో ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉంది. ఇక్కడ లేనిది మరెక్కడా లేదు అని నిష్కర్ష.)

ఆధార గ్రంథాలు.

1. సంస్కృత మహాభారతం.
2. కవిత్రయ మహాభారతం.
3. భారతం ధర్మాద్వైతం డా. మోపిదేవి కృష్ణస్వామి.
4. నన్నయ గారి ప్రసన్న కథా కలితార్థయుక్తి విశ్వనాథ.
5. ఆంధ్ర మహా భారతమూ ద్రౌపది  డా. వాడవల్లి చక్రపాణిరావు.