సంక్రాంతి లక్ష్మికి స్వాగతం (పాట )

(శ్రీ ఎ. వి. మురళి పాటలు, నృత్య నాటకాలు రాసిన వారు. హ్యూస్టన్‌లో ఉంటారు. ఆంధ్ర సాహిత్యంలో మంచి ప్రతిభ ఉన్న వారు. శ్రీమతి చంద్రకాంత కోర్న్టీ హిందుస్తానీ గాత్రసంగీతంలో ప్రసిద్ధులు. వీరు కూడ హ్యూస్టన్‌ వాస్తవ్యులు.)

ముద్దుగుమ్మా! వయ్యారి భామా!
సంక్రాంతి లక్ష్మీ రావమ్మా!
మా సంక్రాంతి లక్ష్మీ రావమ్మా! ||ముద్దుగుమ్మా||

రంగవల్లులు దీర్చిన ముంగిలి
సస్యలక్ష్మీ శోభల దీప్తీ
కొత్తకోడలు అందెల రవళీ
స్వాగతాలే నీకు తల్లీ
ఆహ్వానాలే అమృతవల్లీ ||ముద్దుగుమ్మా||

ముద్దబంతీ పూవుల బరచీ
గొబ్బెమ్మల తమ ముంగిట నిలిపీ
పరికిణి ఓణీ కృష్ణవేణులతొ
కలువ కన్నులా మధురోహలతో ఓ ఓ ఓ
ఒప్పులకుప్పలు తెలుగుపడుచులూ
సంక్రాంతి లక్ష్మీ! రావమ్మా! యని
స్వాగతగీతిక లాలపించగా ||ముద్దుగుమ్మా||

వీధివాడల హరికీర్తనలూ కృష్ణార్పణం
గంగిరెద్దుల బసవన్నల సడి
పాడిపంటల, సిరిసంపదలా
తెలుగునాడు, నీ పుట్టినిల్లు కదె ||ముద్దుగుమ్మా||