ఐడ్స్ ఆఫ్ ఏప్రిల్

Not in A Lighter vein.

మార్చ్ పధ్నాలుగు సీజర్‌కు ప్రాణసంకటం. ఐడ్స్ ఆఫ్ మార్చ్ కథ అందరికీ తెలిసిందే! ఆ రోజున సెనేట్‌కి వెళ్ళద్దని సీజర్ భార్య పాంపియా మొత్తుకుంది. సీజర్ విన్నాడా? సెనేట్‌కి వెళ్ళాడు; వాడిని వాడి స్నేహితులే – సిన్నా, బ్రూటస్ వగైరాలు — బాకులతో డొక్కలో పొడిచి చంపేసేరు. అసలు కారణం తెలుసా? సీజర్ వేద్దామనుకున్న పన్నులంటే సెనేట్లో ఏ ఒక్కడికీ ఇష్టం లేదు!

అదేదో క్రీస్తుకి పూర్వం చెప్పిన కథ కావచ్చు. కానీ, అమెరికాలో నూటికి ఎనభైఐదుమందికి ఏప్రిల్ పదిహేను – ఐడ్స్ ఆఫ్ ఏప్రిల్ – మాటకు మాటగా (లిటరల్గా అని) ప్రాణాంతకం కాదు కానీ, ప్రాణం పోయేంత తలనెప్పి తెచ్చే రోజు. ఆదాయపు పన్ను చెల్లించినట్టు ప్రభుత్వానికి దాఖలా చేసుకోవలసిన ఆఖరి రోజు. ఒకవేళ ఆదాయపు పన్ను బాకీ ఉంటే, ఆ రోజున నోరు మూసుకొని ఐ.ఆర్.యస్.కి చెల్లించవలసిందే! మా చిన్నప్పుడు, బేతుపల్లి గంగారం యాసీన్ అనేవాడు; “అబ్బాయిగోరూ! ఇయాళ మన పీర్లు గుండానడతాయి,” అని! వాడి భాషలో చెప్పాలంటే ఏప్రిల్ పదిహేను పీర్లు గుండాన పడే రోజు అన్న మాట! బద్ధకించావో, నిన్ను ప్రభుత్వం డజను రకాలుగా బాధ పెట్టగలదు! చిత్రవధే! పన్నులు వసూలు చేసే వాడికన్నా, మన నోట్లో పన్నులు పీకేవాడే నయంరా బాబో! అనిపించక మానదు.

ఎనభైఐదు శాతం జనాభా అన్నాను కదూ? మరి ఆ మిగిలిన పదిహేను శాతం జనాభా ఎవరనే అనుమానం రాకపోదు. పధ్నాలుగు శాతం ఇల్లు, వాకిలి, ఎడ్రసూ లేని బీదజనం. వీళ్ళు బతికి ఉన్నట్టు ఎన్నికల ముందు నాయకులకి గుర్తొస్తారు. ఆ తరువాత వీళ్ళని అందరూ మరిచిపోతారు, వీళ్ళు బతికున్నారో లేదో కూడా ఎవడికీ పట్టదు. ఇక పోతే, మిగిలిన ఒక్క శాతం. మదించిన మోతుబరులు. వీళ్ళ ఆదాయం కేమన్ లంకల్లోనూ, స్విట్జర్లాండ్ బ్యాంకుల్లోనూ గుప్తంగా వుంటుంది. మూడో కంటి మహేశ్వరుడికి కూడా తెలియదు, వీళ్ళ ఆదాయం నిక్కచ్చిగా ఎంతో! పోతే, నువ్వు రామ్నీ అనూయాయివో, కోక్ సోదరుల చుట్టానివో ఐతే, నిన్ను ఐ.ఆర్.యస్. ముట్టుకోదు! నీ జోలికి రాదు! వాళ్ళంటే ఐ.ఆర్.యస్. ఆడిటర్లకి చచ్చే భయం.

ఒక సవరణ. అమెరికా ప్రభుత్వం క్రిమినల్ కేసులు తెస్తానని భయపెట్టగానే, స్విట్జర్లాండ్ బ్యాంకులు అమెరికా ప్రభుత్వంతో షరీకయ్యి సుమారు ఐదు వేలమంది ఖాతాలు బయట పెట్టిందట! దొంగతనంగా అక్కడ డబ్బులు దాచుకోవటం అమెరికన్లకి ఇక ముందు కుదరక పోవచ్చు. అది విని, ఇండియా ప్రభుత్వం కూడా మా దేశం దొంగల ఖాతాల వివరాలు బయటపెట్టమని అడిగితే, స్విస్ రాయబారి కిస్ మై… అన్నాడట!

నాకు తెలియక అడుగుతాను, నిక్కచ్చిగా, పెద్దమనిషి తరహాగా, నమ్మకంగా, చిరునవ్వు నవ్వుతూ, దేశభక్తి గీతం ఆలాపిస్తూ, “ఇదిగో! దైవసాక్షిగా చెపుతున్నా. నా ఆదాయం ఇన్ని డాలర్లు. నా భాగం ఆదాయపు పన్ను ఈ కాసిన్ని డాలర్లు. పుచ్చుకోండి,” అని స్వచ్చంద సేవకుడిగా ఆదాయపు పన్ను కట్టే వాడిని ఈ అమెరికా భూతల స్వర్గంలో భూతద్దం పెట్టి వెతికినా దొరకడు. పొరపాటున ఏ వారెన్ బఫెట్ లాంటి వాడో ఉన్నా, వాడు లెక్క లోకి రాడు. వాడు బిలియనీరు! వాడి ఆదాయపు పన్ను వాడి లీగల్ ఆదాయంలో పదిహేను శాతం. వాడి దగ్గిర చప్రాసీలు కూడా అంతకన్నా ఎక్కువ శాతం పన్నుగా కడతారని వాడేగా చెప్పాడూ!

ఇప్పటి వరకూ, ఐ.ఆర్.యస్., ఐ.ఆర్.యస్. అని తెగ రాస్తున్నా కదూ అదంటే అంటే ఏమిటో చెప్పకుండా! మియా కల్పః!

(పురుడు పోసి మీ బిడ్డను మొదటి ఏడాది పెంచటానికి అమెరికా కొచ్చి దేశం తిరిగెళ్ళిన అత్తా మామా అమ్మా నాన్నలకు తెలుసనుకోండి. కానీ ఈ వ్యాసం నేను వారి కోసం కాదు కదా రాస్త.) క్లుప్తంగా దీని పుట్టు పూర్వోత్తరాలు చెపుతా! ఐ. ఆర్.యస్. అంటే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (Internal Revenue Service.) ప్రభుత్వానికి, ఆదాయపు పన్ను వసూలు చేసిపెట్టే సర్వీసు సంస్థ. అమెరికా అంటే ఎంత ద్వేషం ఉన్నా, కాస్త చరిత్ర పాఠం తెలుసుకోవటం వామపక్షీయుల ఆరోగ్యానికి కూడా మంచిదే!

1913లో అమెరికన్ కాంగ్రెస్ ధర్మవాఁ అని, అమెరికా రాజ్యాంగానికి పదహారవ సవరణ (16th Amendment) శాసనంగా అమలు లోకి వచ్చింది. అందులో కాంగ్రెస్‌కి ఆదాయపు పన్ను విధించే అధికారం, దానితో పాటు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు స్థాపించడం జరిగాయి. పదహారవ సవరణకి నూరేళ్ళు నిండి రెండేళ్ళయ్యింది. అప్పటినుంచీ ప్రభుత్వం వరుస తప్పకుండా ఆదాయపు పన్ను వసూలు చేస్తూనే ఉన్నది. అంతకు ముందు, ఆదాయపు పన్ను అస్సలు లేదని కాదు. అమెరికా అంతర్యుద్ధం జరిగే రోజుల్లో (1862) యుద్ధం కోసం, ఆదాయపు పన్ను తాత్కాలికంగా వసూలు చేసేరు. యుద్ధం అయిపోయిన తరువాత ‘శాంతి’ స్థాపనకి ఆదాయపు పన్ను వసూలు చేసి, ఆ తరువాత విరమించారు. 1906లో శాన్‌ఫ్రాన్సిస్కో భూకంపం రావడంతో, యుద్ధానికే కాదు, ఇతర ప్రళయాలు – ప్రకృతి వైపరీత్యాలు – తట్టుకోడానికి ప్రభుత్వానికి సొమ్ము ఉండాలని నాయకులకి తట్టింది. ఎవడూ కాదనలేదు. 1913కల్లా పదహారవ సవరణ శాసనం అయ్యింది. అప్పుడు ఆదాయపు పన్ను శాసనం మొత్తం నాలుగు వందల పేజీలు. పన్ను కట్టడానికి అచ్చు వేసిన కాగితం (1040) మూడు పేజీలు. ఎలా పూర్తి చెయ్యాలో వివరించే కాగితం ఒక్క పేజీ. ఇప్పుడు ఆదాయపు పన్ను చట్టం వివరణలతో సహా సుమారు ఎనభైవేల పేజీలు. – నాలుగు మిలియన్ల మాటలు; హారీ పాటర్ నవలలన్నీంటిలో మాటలు మొత్తం ఒక మిలియన్. అదీ క్లుప్తంగా ఆదాయపు పన్నుల కథ.

అయితే, ఈ ఆదాయపు పన్ను ధనికులకి పెద్ద ఇబ్బంది కలిగించింది. ఒకప్పుడు మూడు శాతంతో మొదలయిన ఈ పన్ను తొంభై శాతానికి పెరిగింది. వటుడింతై ఇంతింతై అన్నట్టుగా! ఎక్కువ భాగం పన్ను ‘ధనికుల’ నెత్తి మీద పడింది. అప్పటి నుంచీ ఆదాయపు పన్ను పూర్తిగా ఎత్తేయాలనే కొంతమంది రాజకీయ నాయకులు రెండేళ్ళ కొకసారి ఎన్నికల ముందు గొడవ చెయ్యటం మొదలు పెట్టేరు. గత శతాబ్దంలో ఈ గొడవ తెచ్చిన వాళ్ళ సంగతి ఇప్పుడు అనవసరం. ఇప్ప్పుడు ఎవడూ ముప్ఫైఐదు శాతం దాటి ఆదాయపు పన్ను కట్టక్కరలేదు. అది కూడా చాలా ఎక్కువే! ఆదాయపు పన్ను 1913కి ముందు ఎంత ఉన్నదో (అంటే సున్న!) అంతకు తగ్గించాలని అరుస్తున్న వాళ్ళల్లో ముఖ్యుడు రాన్ పాల్ (Ron Paul.)

రష్యాతో శీతల యుద్ధం జరిగే రోజుల్లోనే, రిపబ్లికన్ నాయకుడొకడు ఆదాయపు పన్ను ఐడియా కార్ల్ మార్క్స్ ఐడియా అని గోల పెట్టాడట! ఇప్పటికీ ఎప్పుడన్నా ధనికులపై ఆదాయపు పెన్ను ఒక్క నాలుగు శాతం పెంచటం అవసరమని అమెరికా అధ్యక్షుడు అంటే, వాడిని ‘సోషలిస్టు’ అని కంఠశోష పెట్టే రిపబ్లికన్లు, కోకొల్లలు. అయితే, 1913లో ఒక శాతం ధనికవర్గమే అమెరికా కలిమిలో 33 శాతం పంచుకున్నారు. 2013లో కూడా సరిగ్గా అదే పరిస్థితి. ఈ విషయం గురించి ఏ రాజకీయ నాయకుడూ చస్తే నోరు విప్పడు.

ఆదాయపు పన్ను బదులు, అమ్మకం పన్ను పెడ్తే బీదా సాదా అందరూ ఒకే శాతం పన్ను కడతారని, ధనికవర్గానికి ఇబ్బంది తగ్గుతుందనీ మరొక వాదం. నువ్వు ఏ వస్తువు కొన్నా, ఉప్పు, మిరపకాయ, చింతపండు, అండర్ వేర్, బైసికిలు, కారు, మారువానా, అమృతాంజనం – ఏది కొన్నాసరే – పదిహేడు శాతం పన్ను కట్టాలి అని మరో వాదం. దీనిలో ఇబ్బంది సాధారణ సంపాదన ఉన్న ప్రజానీకానికే అని లెక్క కట్టి చెప్పక్కరలేదు. ఇది జరగనిపని అని అందరికీ తెలుసు. ఎవరికైనా సరే, ఆదాయపు పన్ను పాతిక శాతం కన్నా మించకూడదని మరొక వాదం.

ఏది ఆదాయం, ఏది కాదు? అన్న ప్రశ్న యక్షప్రశ్న కన్నా కష్టమైనది. అందుకని, నువ్వూ మరొకడికి ఇవ్వవలసిన బాకీ తప్ప, నీ చేతికి వచ్చిన ప్రతి చిల్లి గవ్వా ఆదాయమే అన్నారు. ఇక్కడే వచ్చింది పెద్ద ఇబ్బంది. ఏ ఆదాయానికి ఎంత శాతం పన్నుగా విధించాలి అన్న విషయంపై ఒకే ఒక్క అభిప్రాయం ఎప్పుడూ లేదు. ఎప్పుడయితే రకరాల ఆదాయాలకి రకరకాల శాతం పన్నుగా మొదలయ్యిందో, అప్పటి నుంచీ పన్ను ఎలా ఎగ్గొట్టాలా అని ప్రతివాడూ ప్రయత్నిస్తున్నాడు. దీనికి మద్దతుగా రకరకాల శాసనాలు – బాగా మదించిన వాళ్ళకి ఉపయోగపడే శాసనాలు తయారయ్యాయి. ఈ లొసుగులనే ‘టాక్స్ లూప్‌హోల్స్’ అని ముద్దుగా పిలుస్తారు. మనం ఎంత అరిచినా ఈ లొసుగులు పోవు, మన గొంతు పోవడమే తప్ప!

అమెరికా ఆదాయపు పన్ను గురించి ఈమాట పత్రికలో ఇంత వివరంగా చెప్పవలసిన అవసరం నిజంగా ఉన్నదా అన్నది (మీ) అసలు ప్రశ్న. ఎందుకంటే, ఈమాట శ్రద్ధగానో, అశ్రద్ధగానో చదివే పాఠకులు అమెరికాలో కన్నా తెలుగు భాష (ఏ యాస భాష అయితేనేం!) మాట్లాడే రాష్ట్రాలలోనే ఎక్కువమంది ఉన్నారు. వాళ్ళకెందుకీ గోల? ఒక రకంగా నిజమే! కానీ, అమెరికాలో యం.బి.బి.యస్.లు, యమ్.బి. యే.లు, ఇంజనీర్లు (ప్రత్యేకంగా సాఫ్ట్ ప్రత్యయం తగిలించుకున్న వాళ్ళు) – వీళ్ళందరికీ భాగ్యనగరంలో ఒక్కొక్కడికీ రెండో మూడో ప్లాట్లు, ఫ్లాట్లు ఉన్నాయన్నది సువిదితం. వాటి మీద భారీగా అద్దెలు వస్తున్నాయన్నది కూడా ఆబద్ధం కాదు. మరి, ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, అది ఆదాయపు పన్ను కింద జమ అవుతుందా? అవదా? ఆ ఆదాయం అమెరికన్ ఆదాయంగా పరిగణించాలా అక్కరలేదా? అని నేను ఒక రిటైర్డ్ డాక్టరు గారిని మా గుళ్ళో కలిసినప్పుడు అడిగేను! ఎందుకంటే హైదరాబాద్లో ఆయనకి అరడజనుకి అటుగా బంగళాలున్నాయి! ఆయన ముసిముసినవ్వులు నవ్వుతూ శివాలయం ముందు గడపలో చెప్పులు వెతుక్కోవాలని మెల్లిగా తప్పుకున్నాడు. నా ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. అక్కడి పాఠకులకి ఇక్కడి వ్యవహారాలు, ఇక్కడి వాళ్ళకన్నా బాగా తెలుసునని విన్నాను!

ప్రభుత్వానికి పన్ను కట్టడం ఎలా ఎగ్గొట్టాలా? అని చిన్నా పెద్దా అందరూ పన్నాగాలు పన్నుతారని ఇందాక చెప్పేను కదూ? ఇప్పుడు, ఒక స్నేహితుడి అనుభవం చెప్పాలి. నలభై ఏళ్ళ కిందటి మాట! వీడికి ఎవడో తలకు మాసిన వాడు చెప్పాడు: నీకు విశ్వవిద్యాలయం ఇస్తున్న డబ్బులు ఫెలోషిప్. నువ్వు ఆదాయపు పన్ను కట్టక్కరలేదు; సోషల్ సెక్యూరిటీ పన్ను అసలే కట్టక్కరలేదు, అని. వెంటనే నా స్నేహితుడు ఐ.ఆర్.యస్.కి ఉత్తరం రాశాడు: ‘గత రెండేళ్ళ నుంచీ నేను ఆదాయపు పన్ను కడుతున్నాను. అయితే నాకు విశ్వవిద్యాలయం ఇస్తున్నది జీతం కాదు. అది ఫెలోషిప్. పైగా నా దగ్గిర మీరు సోషల్ సెక్యూరిటీ పన్ను వసూలు చేస్తున్నారు. శాసనరీత్యా నేను ఈ రెండు పన్నులూ కట్టనక్కరలేదు. అందు మూలంగా ఈ సంవత్సరం నేను ఈ పన్నులు రెండూ కట్టదలచుకోలేదు. మీరు దయ చేసి నేను గత రెండు సంవత్సరాలలో కట్టిన సొమ్ము తిరిగి ఇప్పించగలరు. విధేయుడు, … అని. ఆరు వారాలలో వాడికి సమాధానం వచ్చింది. ‘నీవు అసలు కట్టవలసిన పన్ను కన్నా తక్కువ కట్టేవు. అంతే కాదు. ఈ సంవత్సరం పన్ను కట్టలేదు కాబట్టి జరిమానా వేస్తున్నాం, అని. వెంటనే, ఎందుకొచ్చిందిరా దేవుడా! అంటూ జరిమానా కట్టి లెంపలేసుకున్నాడు. చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పని అయ్యింది. ఐ.ఆర్.యస్. ఇలా చిన్న చిన్న వాళ్ళని భయపెడుతుంది కాని, సినిమా వాళ్ళని, టీ.వీ. వాళ్ళని, పాటకులనీ, సెలిబ్రిటీలనీ, రాజకీయ నాయకులనీ భయపెట్టలేదు. ఈ కథలో నీతి ఏమిటంటే, దెబ్బలాటకి సమ ఉజ్జీని ఎంచుకోవాలి, అని.

ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఈ ఆదాయపు పన్ను ఎలా ప్రారంభమయ్యింది? యుద్ధం కొసమే కదా? పాతకాలంలో రాజులకి పన్ను కట్టేవాళ్ళు; ఎందుకు? ముఖ్యంగా యుద్ధాల ఖర్చు కోసమే కదా? బ్రిటీషు వాడు క్రిమియా యుద్ధం కోసం యుద్ధం పన్ను వేసేడు. లింకన్ అమెరికా అంతర్యుద్ధం కోసం ఆదాయపు పన్ను విధించేడు. ఆధునిక కాలంలో పైకి ఎవడూ, ఏ ప్రభుత్వమూ చెప్పటల్లేదు కాని, ఆదాయపు పన్నులో దగ్గిర దగ్గిర మూడు వంతులు మిలిటరీకే పోతుంది.

ఉదాహరణకి ఒబామాగారి 2015 బడ్జెట్ పరిశీలిద్దాం. మొత్తం 3.9 ట్రిలియన్లు. అందులో 1.2 ట్రిలియన్లు, డిస్‌క్రిషనరీ స్పెండింగ్ (discretionary spending) అంటారు. అంటే, కావాలని, అధ్యక్షుడంటే కోపం కొద్దీ మూర్ఖత్వంగా కాంగ్రెస్ ఒక్క కానీ కూడా ఆ ‘ఇవ్వను’ అన్నదనుకోండి. అందులో 55 శాతం మిలిటరీ ఖర్చుకి పోవాలి. అది కాస్తా గుటుక్కుమంటుంది. కాబట్టి కాంగ్రెస్ మెంబరు ఎవడూ ‘ఇవ్వను’ అని చచ్చినా ఓటు వెయ్యడు. ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్‌లో అందరూ గూడుపుఠాణీ నాయకులే కదా! పోతే మిగిలిన 2.7 ట్రిలియన్లు ఎవడూ ముట్టుకోటానికి లేదు. ఇది మాండేటరీ స్పెండింగ్ (mandatory spending) అంటారు.

ఇంతకన్నా మంచి ఉదాహరణ ఇస్తాను. నువ్వు వంద డాలర్లు ఆదాయపు పన్ను కట్టావనుకో. అందులో 27 డాలర్లు మిలిటరీకి పోతుంది. 23 డాలర్లు ఆరోగ్య పథకం, మెడికేర్/మెడికెయిడ్ లకి పోతుంది. 14 డాలర్లు వడ్డీ కింద పోతుంది. 8 డాలర్లు లేబర్ ఖర్చుకి పోతుంది. ఇది కాకుల లెక్క కాదు. నిజం లెక్క. ప్రస్తుతం కాంగ్రెస్ మిలిటరీకి పెంచి, ఆరోగ్యపథకానికి సున్నా చుడదామని ప్రయత్నిస్తున్నారు.

సిరియాకి, ఇరాన్‌కి, ఇరాక్‌లో ఐసిస్‌ని చీల్చి చెండాడడానికీ యుద్ధం పన్ను వేయాలని అని అంటే, ఎంతమంది బడ్జెట్‌లో మిలిటరీకి డాలర్లు పెంచండి అంటే, ఏ దేశభక్తుడు, స్వదేశాభిమాని ఎదురు చెప్పగలడు? (ఒళ్ళు మండిపోయినా, నువ్వు ఎడమ పక్కన ఉన్నా, కుడి పక్కన ఉన్నా, మధ్యేమార్గం అంటూ గోడమీద పిల్లిలా కూచున్నా నోరు మూసుకొని కూర్చోవలిసిందే!) ఏది కావాలంటే అది రాసుకోటానికి స్వతంత్రం ఉన్న దేశం కాబట్టి వామపక్షీయులు అమెరికా ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ అంతర్జాలంలో రాసుకోవచ్చు. ‘థూ నా బొడ్డు! ఆటలో అరిటి పండు,’ లాంటి రాత. ఎందుకూ కొరగాని రాత.

వాషింగ్టన్‌లో ఐ.ఆర్.యస్. భవనం ముందు రాతి మీద చెక్కిన వాక్యాలు ఇవి, అని చదివేను: Taxes are what we pay for civil society అని! ఈసారి, వాషింగ్టన్ వెళ్ళినప్పుడు ఆ రాత మీద తారు పూద్దామని ఉన్నది.

ఒక్కొక్క సారి నాకు అనిపిస్తుంది; నీవు కట్టే పన్నులు నీకు ఇష్టం లేని పనులకి ప్రభుత్వం కర్చు పెడుతూన్నదన్న బాధ భరించడం కన్నా, పన్నులు పీకే డాక్టర్ దగ్గిర నోరు తెరిచి అమ్మా! అని అరుస్తూ బాధ పడటం తేలికైన పని తథాస్తు.

(ఈ వ్యాసానికి ముఖ్య ఆధారాలన్నీ ఇంద్రజాలం లాంటి అంతర్జాలం నుంచే సంపాదించేను. కాకుంటే ఈ రెండూ మీరు చదువుతారని…

1. Jill Lepore, Tax Time, The New Yorker, November 26, 2012.
2. Ian Frazier, All Mine, The New Yorker, November 12, 2012.
)