(గట్టు వినీల్ కుమార్ తొలికథ ఇది. శిల్పంలో కొంత కరుకుదనం ఉన్నా చిత్తశుద్ధి, వాస్తవికత, విశ్లేషణ ఈ కథను చదివిస్తాయి, ప్రచురణయోగ్యం చేశాయి.)
అప్పుడే రాత్రి తొమ్మిదిన్నర అవుతోంది. ఇప్పటికైనా ఈ పని కాస్త కట్టేసి ఇంటికి వెళ్ళాలి. ప్రొద్దున తొమ్మిదింటికి తీరిగ్గా లేవడం, ఆదరబాదరగ పదింటివరకల్లా పనులు కానిచ్చి ఈ వెధవ ఆఫీసుకు కు రావడం, ఎనిమిది తొమ్మిది వరకు వొళ్ళు వంచి పనిచేయడం, కాసేపు టివి గట్రా చూసి, నాలాంటి బేవార్సు మిత్రులతో ఫోన్ లో ఇంకో గంట కబుర్లు చెప్పి ముసుగుతన్నేయడం. స్థూలంగా ఇదీ నా దినచర్య.
మరమనుషులకైనా అప్పుడప్పుడు హార్డువేరు దోషాలు వచ్చి తేడాలొస్తాయేమో కాని, నా దినచర్య లో మాత్రం వారానికి ఐదు రోజులు ఠంచనుగా ఇలానే గడుస్తాయి.
ఉద్యోగంలో చేరి ఏడాది కాలేదు అప్పుడే ఆఫీసు పేరెత్తితే చాలు అదోరకం నిరాసక్తత ఆవహిస్తుంది. మాస్టర్స్ చదువుతూ స్కూల్లో ఉన్నప్పుడు అసలు తీరికే ఉండేది కాదు. ఎప్పుడు చూసినా ఏవో ప్రాజెక్టులు, హోంవర్కులూ, మిడ్ టర్మ్ లూ ఉండేవి. ఇవన్నీ కాక నక్షత్రకుడి లాంటి ప్రొఫెసరు కింద రీసెర్చు వర్కు. ఇంటికి వస్తే, గలగల మంటూ రూమ్మేట్సు సందడి, ఫ్రెండ్సు, పుట్టిన రోజంటూ ఒకడు, జాబ్ వచ్చిందని ఒకడు.. పార్టీల మీద పార్టీలతో క్షణం తీరీక చిక్కేది కాదు. ఇప్పుడూ..? వేరే పనులేమున్నాయిలే.. ఇటొచ్చెయ్ అంటూ వెధవ ఆఫీసు ఒకటి ఉంది.
కనీసం ఆఫీసు ఉన్నప్పుడే నయంలెండి. ఏదో పనిలో పడి, అసలు సమయమే తెలీదు. శని, ఆది వారాల్లో ఐతే చచ్చేంత బోరు. మొదట్లో ఐతే ఒక నెల తెగ టివి చూసేవాణ్ణి. డిస్కవరీ, హిస్టరీ చానెల్సు మొదలుకొని జేలెనొ, హు వాంట్స్ టు బీ మిలియనీరు వరకు. చివరకు పన్నెండింటికి అమెరికా అంతా సద్దుమణిగాక “నిక్ ఎట్ నైట్ ” కూడా వదలకుండా చూసి చూసి విసుగొచ్చింది. టివి బోరు కొట్టింతరువాత బ్లాకుబస్టరు వాణ్ణి మహారాజాలా పోషించాననుకోండి. వాడైనా, ఎన్నని కాస్సెట్లు తేగలడు చెప్పండి. సంఖ్య ఎక్కువ కాబట్టి, ఈ మురిపెం రెణ్ణెల్ల దాకా సాగింది. తర్వాత ఎంత మంచి సినిమా ఐనా సరే, ఇక టివి లో చూడను గాక చూడను అని నిర్ణయించుకొన్నా. హాలీవుడ్ ప్రొడక్షన్ రేటు మన కన్సంప్షన్ రేటుకు తట్టుకోలేక పోయింది. కాబట్టి ఈ తెరపై సినిమాలు నాకు ఒక టైంపాసు కిందకు రానే రావు. ఇక ఈ ముచ్చటలు ముగిసిన మూడు నెల్లల్లో, నాకో మిత్ర బృందం తయారయ్యింది . కొత్త మురిపెం పొద్దెరుగదన్న చందాన, ఒక మూణ్ణెల్లు అందరం అంటుకుపోయి తిరిగాం. మా మహానగరం దాపుల్లో ఇక మేము చూడటానికి కొత్త ప్రదేశం, తినటానికి కొత్త హోటలు లేకుండా పోయింది. మళ్ళీ షరా మామూలే. అందరికీ బయటికివెళ్ళటమంటేనే బోరు కొట్టింది. ఇక ఇంటర్నెట్ బ్రౌజింగూ, చాట్లు ఇవన్నీ వేరేగా చెప్పక్కర్లేదు కదా..నాకొక్కడికే ఇలా విసుగు పుడుతోందా అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు మరో ముగ్గురు తగిలారు.
నా సోది కబుర్లు చెబుతూ అప్పుడే పదవుతోంది. ఈ వేళ ఫోన్లో బదులు మీకు వేసేలా ఉన్నాను సుత్తి. సరే, దొరికారుగా వినక ఏం చేస్తారు లెండి. అలా కార్లో వెళ్తూ చెప్తాను రండి.
మ్ మ్ మ్ మ్…పదింటికి ఇంటికి వెళ్ళి వండుకుంటావా? అని ఒక చచ్చు ప్రశ్న అడిగేరు. అలా దార్లో వెళ్తూ ఓ సబ్వే సాండ్విచ్ కొనుక్కొని వెళ్తాను.
ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం
మనిషన్నాక ఆలోచించకుండా ఉండడు కదండి. అలానే మేమంతా ఓ రోజు తీవ్రమైన చర్చ మొదలెట్టాం. ఎందుకు ఇలా మాలాంటి జనాలు విసుగెత్తి పోతున్నారు? ఏం చేద్దామన్నా ఆసక్తి లేకుండాపోతుందేం? అని.
ఈ అమెరికన్లు ఎలా ఉండగలుగుతున్నారీ దేశంలో? పిల్లలెక్కడా సాయంత్రం కాగానే బయటకు వచ్చి ఆడుకుంటున్నట్లు కనిపించరు. ఎవ్వడికీ పక్క ఇంట్లో వాడి పేరు కూడా తెలీదు. ఎవరికి వారే ఒక రాబిన్సను క్రూసో టైపులో బతికేస్తుంటారు. ఈ అమెరికా మహానగరాలన్నీ ఇండియాలో లక్షద్వీపం లాగ ద్వీపాల్లాంటి మనుషుల సముదాయాలు. ఈనాటికీ అర్ధరాత్రి నిద్ర లేపి నా చిన్నప్పటి మిత్రుడు మురళీ గాడి బామ్మ పేరు అడిగినా చెప్పగలను నేను. అంతలా పెనవేసుకు పోయి ఉంటాయి మన స్నేహాలు. ఇక్కడ మచ్చుకైనా కానరావే? అసలు వీళ్ళంతా శని, ఆది వారాల్లో ఏం చేస్తారు?
ఈ ప్రశ్నే మదిలో పెనుతుఫానై మా కొలీగ్ జిమ్ నడిగా. “అసలు ఆరు ఏడు కాగానే వెళ్ళిపోతావు. ఒక్క ఆదివారమైనా నిన్ను ఆఫీసులో చూళ్ళేదు. నీకు ఎలా టైంపాసవుతుంది?” అని. క్షణక్షణం సినిమాలో పరేష్ రావల్, యాదగిరి గుట్ట బస్సు ఆరా తీసినవాణ్ణి చూసినట్టు నాకేసి ఒక చూపు చూసి, అడిగిందే తడవు వాడు చెప్పిన సమాధానం విని కాస్త అవాక్కయ్యా. జిమ్ చాలా బాగ పియానో వాయిస్తాడంట. వాళ్ళ మిత్ర బృందమంతా కలిసి ఒక బ్యాండు లాంటిది ఉందంట. సంవత్సరానికి పది పదిహేను సార్లు, పండగలకీ, పబ్బాలకీ క్లబ్బుల్లో, స్కూళ్ళలో షోలు ఇస్తారట. వారానికి మూడు రాత్రులు ప్రాక్టీసుకే సరిపోతుందంట. వారానికి ఒక సాయంత్రం ఇంకొంతమందితో కలిసి, మానసిక వికలాంగుల సంస్థలో పిల్లలకు రాయడం, చదవడం వంటివి నేర్పిస్తారంట. శనివారం కనీసం ఒక రోజు, సోషల్ వర్కులో పాల్గొంటాడంట. ఆదివారం సీజన్ను బట్టి, ఔట్డోర్ హైకింగూ, స్కీయింగు లాంటి పనులు చేస్తాడంట.
అవును మరి. ఇన్ని పనులు ఉంటే బోరు ఎలా కొడుతుంది? ఇలాగే ఇంకో ఇద్దరు కొలీగ్సుని కదిపి చూసా. ఒకడికి ఆటలంటే తెగపిచ్చి. మరొకడికి, డాన్సులో ప్రవేశం. స్కూల్లో ఉండేటప్పుడే వాడికి కంప్యూటర్స్ తో పాటు, డాన్సులో డిగ్రీ ఉందంట. ప్రతీవాడికి ఏదో ఒక వ్యాపకం. మనకిమల్లే కాకుండా వీళ్ళకు ఆయా వ్యాపకాల్లో తెగ ఆసక్తి. వాళ్ళ భాషలో చెప్పాలంటే పాషన్ ( passion ). మట్టి బుర్రకు మరొకరు చెబితేగాని తట్టింది కాదు. సంగీతం, సాహిత్యం లాంటి కళల్లో అభిరుచి ఉంటే ఇంక బోరు కొట్టేందుకు ఆస్కారమేది?
* * * * * * *
మర్నాడు, ఇదే విషయం మా మిత్రులతో చెప్పా. మాలో ఒక్కడికి ఇలాంటి అలవాట్లు లేవంటే నమ్మండి. అందరి గురించి చెప్తే నేను మొదలు చెప్పిన విషయానికి నాలుగు నకళ్ళు తయారవుతాయి. ఇలా సామూహికంగా నా బోటి కుర్రాళ్ళందరిలోనూ ఒక తప్పు ఉందంటే ఎక్కడో వ్యవస్థ లోనే తప్పు ఉండాలి కదండి.
నాకయితే నా చిన్నతనం మొదలుకొని ఇప్పటివరకు ఇంట్లో ఏం చెప్పారు అంటే మొదట గుర్తు వచ్చేది చదువే. చదువుకుంటే చాలు, మరేమీ చెయ్యక్కర్లేదన్నట్టు ఉండేవారు మా ఇంట్లో. చదువుకోండి, చదువుకోండి అని ప్రొద్దుటే బండెడు పుస్తకాలు మోసి కాన్వెంటుకు వెళ్ళడం, సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ అవే పుస్తకాలు ముందేసుకుని కూర్చొని చూచివ్రాతలు, ఇతర పనులు పూర్తి చేసుకొని అలసి సొలసి తిని పడుకోవడం. మా అమ్మకైతే చిన్నప్పుడు వాళ్ళ నాన్న గారు చదివించకుండా పదోతరగతిలోనే పెళ్ళి చేసారని కాబోలు, తన బదులు కూడా నన్నే చదివించేది. కాస్త ఇంట్లో అల్లరి చేస్తే చాలు, గోడకుర్చీ వేయించి ఇరవై ఎక్కాలు వ్రాయించేది. క్లాసులో ఫస్టు రాంకు ఎక్కడ మిస్సవుతుందో అని తెగ బాధ పడిపోయేది మా అమ్మ. నేనైతె, ఈ చదువు పేరు చెప్పి ఎన్ని క్రికెట్టు మ్యాచులు, పెళ్ళిళ్ళు, వడుగులు మిస్సయ్యానో. దానికి తోడు, చుట్టు పక్కల ఆంటీలు అంకుళ్ళూ “ఆ అబ్బాయిని చూడు, చక్కగా ఎప్పుడూ ఫస్టు రాంకు వస్తాడు” అని, ప్రెష్షరు పెట్టేవారు. ఏడో తరగతిలో ఉన్నప్పుడనుకుంటా, “అమ్మా,నే సంగీతం నేర్చుకుంటానె” అని అంటే పెద్ద తరగతిలోకి వెళ్ళేకొద్దీ ఎంత ఎక్కువ చదవాల్సి ఉంటుందో, సంగీతం అంటే రోజుకు ఎంత సమయం నష్ట పోవాలో ఒక పెద్ద ఉపన్యాసం ఇచ్చారు మా ఇంట్లో. కష్టపడి చదువుకుంటే పెద్దయ్యాక అదే నేర్చుకోవచ్చు అని బోడి సలహా ఒకటి. ఇక ఇంటరుమీడియటు చదువులు ఈ రోజుల్లో ఎలా ఉన్నయో వేరే చెప్పాలా? మేము పుట్టటమే ఆ ఎంట్రన్సు పరీక్షకై పుట్టినట్టు ఉండేది. నాకింకా గుర్తే. నేను ఇంటరుమీడియటులో ఉన్నప్పుడు, మా ఇంట్లో తొమ్మిదిన్నర ఐతే చాలు, ఒక శ్మశాన నిశ్శబ్దం ఆవరించేది. టీవిలు, సినిమాలు బంద్. ఆ రెండేళ్ళ వ్యవధిలో ఎన్ని మంచి సినిమాలు మిస్సయ్యానో. నా చదువు గురించి నా కంటే ఎక్కువ మా అమ్మే ఆరాటపడిపోయేది. నాలుగింటికి అలారం పెట్టుకొని లేచి, నేను మళ్ళీ నిద్ర పోకుండా పాలు గట్రా ఇచ్చి, ఎంతైనా కష్టపడేది. ఎనిమిదైతేగాని ముసుగు తీయని మా నాన్నగారు, నన్ను కోచింగులో దిగబెట్టేందుకు పొద్దుటే నాలుగున్నరకు లేచేవారు. మీరే చెప్పండి, ఎలా ఉన్నాయి మన పెంపకాలు? చదువుంటే చాలు మరేమి అఖ్ఖర్లేదు అన్నట్టులేవూ? వ్యక్తిత్వం ఎలా పెంపొందించుకోవాలి అని ఒక్కరైనా ఆలోచిస్తారా? ఏదైనా స్కూలుకు వెళ్ళి, నలభై మంది కుర్రాళ్ళను పట్టుకొని, మీలో సంగీతం ఎంత మందికి వచ్చు? అంటే ఏం సమాధానం వస్తుంది? ఒక్కరికైనా, పుస్తకాలు చదవడం అనే హాబీ ఉంటుందా? టివి చూడ్డం, చదువుకోవడం కాక మీకేమి పనులు చేతనవును అంటే ఏమని చెప్తారనుకుంటున్నారు? అందుకే ఇలా చదువులన్నీ ఏకబిగిన చదివేసి, ఇప్పుడు బోరు కొట్టి చస్తున్నాం. ఇరవై ఐదేళ్ళకు హాబీలు పుట్టుకరమ్మంటే ఎక్కడ నుంచి వస్తాయి
హా..బీ.లు.
బాబోయ్ ఈ సుత్తంతా వేస్తూ నా ఆకలి రెండు రెట్లయ్యింది. సిక్సించు బదులు ఫుట్లాంగ్ సాండ్విచ్చు తింటాలెండి. ఇదిగో.. సబ్వే వచ్చేసింది. మీకు చిన్న బ్రేకు ఇస్తానుమరి.
* * * * * * *
సబ్వే షాపు ముందర ఇద్దరు కుర్రాళ్ళు చిరిగిపోయిన పొడుగాటి నిక్కర్లతో నిలబడి ఉన్నారు. ఈ అమెరికా కుర్రాళ్ళకు ఇదేం సరదానో? ఐనా రాత్రి పదింటికి ఇంటికి వెళ్ళక ఈ దుకాణం ముందర ఏం చేస్తున్నట్టూ? వయసు దాదాపుగ పధ్నాలుగు పదిహేను ఉంటుందేమో. ఇద్దర్లో ఒకడు కడుపు మీద చెయ్యి వేసి ఆకలికి తాళలేక నిలబడ్డట్టు ఉన్నాడు. నేను నెమ్మదిగా కారు పార్కు చేసి షాపు వైపు వెళ్తుండగా ఒక నలభై ఏళ్ళ పెద్దమనిషి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సబ్వే షాపులో లైను చాల పెద్దదిగా ఉంది. తలుపు తెరచి క్యూ కాస్తా బయటికి వస్తోంది.
ఎందుకింత లైను ఉందా అని చిరాకుపడి చూస్తే పాపం ఒక ముసలమ్మ కష్టపడుకుంటూ నడుస్తూ గొణుక్కుంటూ ఆర్డరు ఇస్తున్నది. కౌంటరు కుర్రాడికి బొత్తిగా ఓపిక లేనట్టుంది, చిరాగ్గా మొహం పెట్టి ఆర్డరు వింటున్నాడు. లైనులో మిగిలిన వాళ్ళు కూడా ఈవిడ ఆర్డరు ఎప్పటికయ్యేనా అని విసుగ్గా నిలబడ్డారు. ఎనభై ఏళ్ళ వయసులో ఆ ముసలావిడకి ఎందుకొచ్చిన కష్టం చెప్పండి? హాయిగా ఇండియాలో ఐతే పిల్లా జెల్లా వండిపెడుతుంటే క్రిష్ణా రామా అంటూ తిని కూర్చుండేది కదా. సరే ఇక ఎంతసేపు ఆవిడకేసి చూస్తాను. చెప్పానుగా తలుపు దగ్గర నిలబడ్డానని, ఆ పెద్దమనిషి కుర్రాళ్ళను ఏదో అడుగుతున్నాడు. “You guys wanna come for a ride tonight? I will drop you by tommorow”.
కుర్రాళ్ళు దురుసుగా “No. We are not interested. Just get off from here” అన్నారు. ఐనా ఆ పెద్దమనిషి వినకుండా Come..on guys, I can pay for your dinner. Eat as much as you want. I have some of these. అని జేబులో ఏమో చూపెడుతున్నాడు. నాకైతే ఒక సిగరెట్టు పెట్టెలా కనిపించింది. తిండి తినిపిస్తా అని అనగానే, ఆ ఆకలిగా ఉన్నట్టున్న కుర్రాడి కళ్ళల్లో ఒక ఆశ కనిపిస్తోంది. కుర్రాళ్ళిద్దరూ ఆలోచనలో పడ్డారు. ఆ పెద్దమనిషి ఇంకా ఏవేవో కారు కూతలు కూస్తున్నాడు. we will have fun,guys.. dont think much about it.
అయ్యో వాడితో వెళ్ళకండి. మీ తిండికి నేను కూడా డబ్బులు ఇవ్వగలను అని వాళ్ళకు చెప్పాలనిపిస్తోంది. కాని, బళ్ళో పిల్లల దగ్గర తుపాకులుండే దేశం ఇది. ఈ పెద్దమనిషి దగ్గర ఉండదా చెప్పండి. అందునా చేసే వెధవవేషాలకు తప్పనిసరిగా తెచ్చుకొనిఉంటాడు. వాళ్ళు ఎక్కడ ఒప్పేసుకుంటారో అని మనసు ఘోషిస్తోంది. కాసేపయ్యక లైనులో నా వంతు వచ్చింది. నా సాండ్విచు తీసుకొని వచ్చేసరికి కుర్రాళ్ళిద్దరూ వ్యానులో ఆ పెద్దమనిషి వెంట వెళ్ళడం కంటబడింది. అయ్యో, వెళ్ళిపోతున్నారు. ఏం చెయ్యాలి? కాప్సుని పిలవనా అంటే వాళ్ళెవరో? ఒకరికొకరు ఏమవుతారో?
ఛ! నాకు పరమచిరాగ్గా ఉంది.
* * * * * * *
తెల్లవారు జామున నాలుగున్నరవుతోంది. దిగ్గున లేచాను. ఛ! ఎంత పీడకల వచ్చింది. సబ్వే కుర్రాళ్ళిద్దరూ నా ఎదురుగా నిలబడి ఉన్నారు.
వాళ్ళ పొడుగాటి చెడ్డీల నిండా రక్తం కారుతోంది. షర్ట్‌లు కూడా చిరిగిపోయి ఉన్నయ్. తూలిపోతున్నారు.
ఏం మాట్టాడాలా అని గజిగిజిగా ఆలోచించుకునేంతలో సబ్వేలో కనిపించిన ముసలావిడ నెత్తి మీద చెయ్యి వేసి, “ఒక చిన్న సహాయం చేస్తే నీ సొమ్మేంపోయింది. అంత మందిలో అభాసు పాలయ్యాను.” అంటున్నట్టు నావంక చూస్తోంది.
గావుకేక పెట్టి లేద్దును కదా, పీడకల అని తేలింది. అర్ధరాత్రి ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. వెళ్ళి నా ఫిష్ పాట్లో ఉన్న రెండు గోల్డ్ ఫిష్ లను పలకరించాను. కాసింత ఫిష్ ఫుడ్ వేసి, హాల్లో వచ్చి కూర్చున్నాను. గాలికి, పేటియోలో చెట్టు ఊగిపోతుంది. జగ్గులో కాసిన్ని నీళ్ళు తీసుకెళ్ళి చెట్టుకి పోసాను. ఆకులన్నీ థాంక్యూ అన్నట్టు రెపరెపలాడాయి. కష్టపడి మళ్ళీ నిద్ర పోవడానికి ప్రయత్నించాను.
కలత నిద్రతో ఏడున్నరకే తెలివి వచ్చింది. మనసు కీడు శంకిస్తుండగా మార్నింగ్ న్యూస్ పెట్టాను. అన్నీ రోజువారీ కబుర్లే. దేముడా అనుకొని, గబ గబా పనులు కానిచ్చి, ఆఫీసుకు చేరుకున్నాను.
* * * * * * *
టైం ఆరున్నరవుతోంది. ఇవ్వాల్టికి కష్టపడింది చాలు. అసలు ఏపనైనా సరిగ్గా చేస్తే కదా? పొద్దటినుండీ ఏవో ఆలోచనలు మనసులో మబ్బుల్లా ముసురుకుంటున్నయి. నిన్న రాత్రి జరిగిన సంఘటన చూసాక మీకేమనిపిస్తోంది? భాధ్యులెవరంటారు? ఆ కుర్రాళ్ళిద్దరికి తల్లిదండ్రులు లేరా? టీనేజ్ కుర్రాళ్ళను ఎలా అదుపులో ఉంచాలో తెలీదా? ఏమో? ఇంట్లో గొడవపడుతున్నారేమో? లేక విడిపోయారో? పదిహేనేళ్ళ వయసులో ఇలాంటివి ఎదుర్కొంటే పిల్లలు రోడ్లెమ్మట తిరక్క ఏం చేస్తారు? ఐనా, ఆ నలభయ్యేళ్ళ పెద్దమనిషికి అదేం వక్రబుద్ధి? పాపం ఆ ముసలమ్మను చూడండి. ఎనభై ఏళ్ళ వయసులో ఒక తోడు లేక ఎంత కష్టపడుతోంది? ఇరవయ్యేళ్ళకే పిల్లల్ని ఇంట్లోంచి పంపించి, మీ బ్రతుకులు మీవి అంటే.. అరవయ్యేళ్ళకు తోడు ఎక్కడినుండి వస్తూంది?
ఇవన్నీ చూసాక, నాకు కాస్తో, కూస్తో మనమే నయమనిపిస్తోంది.