అక్టోబర్ 31. మంగళవారం. ప్రయాణంలో తొమ్మిదో రోజు.
ఉదయం తొమ్మిది గంటలకు పోర్ట్ బ్లెయిర్ – హేవ్‌లాక్ ఫెర్రీ. గంటా గంటన్నర సముద్ర ప్రయాణం. రెండు రోజులు పూర్తిగా హేవ్‌లాక్ ద్వీపంలో గడిపి నవంబర్ రెండు మధ్యాహ్నానికల్లా తిరిగి పోర్ట్ బ్లెయిర్ చేరుకోవాలన్నది మా ప్లాన్. మూడవ తారీఖు ఉదయం హైదరాబాద్ విమానం.
పొద్దున్నే వాన మొదలయింది. చక్కని జల్లు. బాల్కనీలో నిలబడి సగం తడుస్తూ ఎదురుగా కాస్తంత దూరాన ఉన్న క్రూజ్ షిప్పునీ, మర పడవలనీ చూసి ఆనందించడానికి సహకరించే వాన. దూరంనుంచి కనిపిస్తోన్న చేపల పడవలు చిన్నప్పటి కాగితం పడవల్ని గుర్తు చేసాయి. ఆనందాన్ని పెంచడానికి నాకు నేనే నిరంతరం సరఫరా చేసుకునే కాఫీ కప్పులు ఉపకరించాయి. బాల్కనీకీ సముద్రానికీ మధ్య గాలికి తలలు ఊపుతూ ఓ క్షణం కళ్ళకు అడ్డు వచ్చి మరుక్షణం తొలిగి పోతున్న కొబ్బరాకులు సందర్భాన్ని రంజింపజెయ్యడంలో తమ వంతు పాత్ర పోషించాయి. వాటిమీది వాన చినుకులు ముత్యాలను గుర్తుచేసాయి. స్థూలంగా చెప్పాలంటే మనసు ప్రకృతితో శృతి కలిపిన వేళ అది. మరొక్క ఉదయమే ఆ బాల్కనీలో గడపగలనన్నది గుర్తొచ్చి అయ్యో అనిపించింది.
పోర్ట్ బ్లెయిర్ నుంచి హేవ్‌లాక్ చేర్చడానికి రెండు రకాల వాహనాలు ఉన్నాయి. కింద డెక్కూ, మధ్యలో కూర్చోడానికి అనువుగా ఉండే పాసింజర్ల కాబినూ కలిగిన గవర్నమెంటు ఫెర్రీలు ఒక బాణీ వాహనాలు. రెండున్నర గంటల ప్రయాణం. ఎక్కి స్థిమితపడ్డాక పాసింజర్ కాబిన్ లోంచి బయటపడి ‘మిద్దె మీది’ ఆరుబయలు స్థలంలో కాలం గడిపే వీలున్న వాహనాలివి. నాలాంటి వాళ్ళు టైమంతా అక్కడే గడపటం, హలోహలోలు చెప్పుకోడం, అలా చెప్పుకున్నవాళ్ళు హేవ్‌లాక్‌లో మళ్ళా మళ్ళా కనిపించినపుడు ఆ పరిచయాలు స్నేహం దిశగా పరుగులు తీయడం, నాకు అనుభవమే.
కానీ ఆ రోజు మాకు అందిన వాహనం ప్రైవేటు ఏజెన్సీలు నడిపే క్రూజ్. ‘మాక్రుజ్’ కంపెనీ వాళ్ళు కాస్తంత విలాసంగా నడిపే వాహనమది. విమానాల్లో ఉండేలాంటి సౌకర్యవంతమైన సీట్లు. సౌకర్యం సంగతి ఎలా ఉన్నా స్వేచ్ఛగా పైకీ కిందకీ తిరుగుతూ సముద్రంతో చెలిమి చేసే అవకాశం లేదే అని నా బాధ. సరళంగా చెప్పాలంటే సర్కారీ ఫెర్రీ గోదావరి ఎక్స్‌ప్రెస్ అయితే మాక్రుజ్ క్రూజ్ వందే భారత్. వేగంగా వెళుతుంది. గంటన్నరలో గమ్యం చేరుస్తుంది. సహజంగానే టికెట్టు ధర ఆకాశంలో ఉంటుంది. అన్నట్టు మాకు క్రూజ్ టికెట్ అందించిన రవి వాళ్ళ ఆఫీసు మనిషికి డబ్బులు ఇవ్వబోతే వద్దన్నాడు. తీసుకోవద్దని రవి గట్టిగా చెప్పాడట. ఆయన మధ్యప్రదేశ్‌లో ఉండి కూడా మాకు అందించిన కానుక ఈ క్రూజ్ ప్రయాణం అన్నమాట.
పదిన్నర ప్రాంతంలో హేవ్‌లాక్ చేరుకున్నాం.
నాకది నాలుగోసారి. జగన్‌కు రెండవది. అంచేత ఇద్దరికీ ద్వీపమంతా చిరపరిచితం.
కానీ హేవ్‌లాక్‌లో తీరని, తీర్చుకోవలసిన కోరిక ఒకటి ఉంది.
డాల్ఫిన్ రిసార్ట్.
ద్వీపానికి ఉత్తర కొసన జెట్టీ ఉంటే దక్షిణ దిశలో నాలుగయిదు కిలోమీటర్ల దూరాన ఈ డాల్ఫిన్ రిసార్ట్ ఉంది. 2012 లో మొదటిసారి వచ్చినపుడు నా దృష్టిని బాగా ఆకర్షించింది. అప్పటికి ఈ రిసార్ట్ నిర్వహణ ఇంకా టూరిజం డిపార్ట్మెంట్ చేతుల్లోనే ఉంది. అయినా డాల్ఫిన్ గురించి తెలిసేలోగానే జెట్టీ దగ్గర ఉన్న పీడబ్ల్యూడీ గెస్ట్‌హౌస్‌లో కుదురుకున్నాం. అంచేత హోటలు మారే పని పెట్టుకోలేదు. రెస్టారెంటులో ఓ కాఫీ మాత్రం తాగాం.
2000 జనవరిలో వచ్చినపుడు డాల్ఫిన్‌లో ఉందామని ప్రయత్నించాను. అప్పటికే ఆ రిసార్ట్ నిర్వహణ ప్రైవేటు సంస్థ చేతుల్లోకి వెళ్ళింది. గదులు ఖాళీ లేవన్నారు. ముందే బుక్ చేసుకోనందుకు విచారపడటం తప్ప మరో మార్గం లేకపోయింది. అక్కడి స్టాఫ్‌తో కాస్తంత కబుర్లాడి, ఓ గంటసేపు విహరించే అనుమతి సంపాదించి, రెస్టారెంట్లో లంచ్ చేసి సరిపుచ్చుకున్నాను.
2023 నికోబార్ యాత్రా ప్రణాళికలో హేవ్‌లాక్ కూడా చేరుతున్న వైనం గమనించాక, ‘నాకు అక్కడి డాల్ఫిన్ రిసార్ట్‌లో వసతి ఇప్పించగలరా?’ అని రవిని అడిగాను. ‘అదేం భాగ్యం… ఇప్పుడు దాన్ని ప్రైవేటు యాజమాన్యానికి అప్పచెప్పిన మాట నిజమేగానీ మాకు ఇంకా కాస్తంత పట్టు ఉంది. తప్పకుండా బుక్ చేస్తాను,’ అన్నాడాయన.
అలా ముచ్చటగా మూడో యాత్రలో నా డాల్ఫిన్ కోరిక నెరవేరింది.
జెట్టీనుంచి తిన్నగా డాల్ఫిన్ చేరాం. ‘రవీ సాబ్ బుక్ చేసిన…’ అన్న వాక్యం ముగించక ముందే, ఎస్ ఎస్ అంటూ రిసెప్షన్ వాళ్ళు ఫార్మాలిటీలు ముగించి తాళాలు ఇచ్చారు.
అన్నట్టు డాల్ఫిన్ మీద నేనెందుకు అంతగా మనసు పారేసుకున్నానూ? మంచి బీచ్ ఉందనా? శిఖరాగ్రాన చేరి సముద్రాన్ని కొస దాకా చూసే అవకాశం ఉందనా? పంచతారల సౌకర్యాలున్నాయనా?
కాదు. బీచ్ లేదు. ఈత కొలను లేదు. ఆకాశసౌధాలు లేవు.
కొబ్బరి చెట్లున్నాయి. చక్కని కాలిబాటలున్నాయి. సముద్రపు ఒడ్డున పిట్టగోడలా కట్టిన గట్టు ఉంది. ఆ గట్టు వారనే చుట్టిళ్ళు ఉన్నాయి. గట్టుకు ముప్ఫై గజాల దూరాన మాకు ఇచ్చిన కుటీరం ఉంది. తలుపు తెరిస్తే సముద్రం – అసలు మూస్తే గదా, తెరవడానికి.అంతా కలసి ఇరవై పాతిక కుటీరాలు. ఒక్కో కుటీరంలో రెండు రెండు విశాలమైన గదులు… కాస్తంత దూరాన రెస్టారెంటు. శబ్దకాలుష్యం అంటని చోటు. వాయుకాలుష్యం, జలకాలుష్యం, భూకాలుష్యం అంటారా – ఆ మాట ఎత్తితేనే పాపం వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నాలాంటి మనిషి కలలు కనే మునివాటిక అది!
డాల్ఫిన్‌లో చెకిన్ చేసింది ఆలస్యం – వెంటనే సముద్రం గట్టుకు చేరుకున్నాను. పావుగంటసేపు రిసార్ట్ మూలమూలలూ శోధించాను. తనివితీరా ఫోటోలు తీసాను. ఉన్నట్టుండి నాకూ ఒక ఫోటో ఉంటే బావుంటుందనిపించింది. అటూ ఇటూ చూస్తే ముప్ఫై ఏళ్ళకు అటూ ఇటూగా ఉన్న ఓ మహిళ కనిపించింది. అడగగానే ఫోటో తీసారామె. ఆ ప్రక్రియలో నా ధోరణి బోధపడింది కాబోలు – నేను అడగని పోటోలు కూడా తానే అడిగి, తన బాణీలో నన్ను నిలబెట్టి, చక్కని చిత్రాలు తీసారు. మాటల్లో ఆవిడ తెలుగు మనిషని తెలిసింది. ఆ పక్కనే ఉన్న భర్త, పిల్లాడు, అత్తమామలు వచ్చి కలిసారు. వాళ్ళందరికీ అది మొట్టమొదటి అండమాన్ యాత్ర అట. నాకు కాస్తంత వివరాలు తెలుసుగాబట్టి, పదిమందీ నడిచే బాటకు కాస్తంత అసింటగా వెళ్ళి హేవ్‌లాక్ సౌందర్యాన్ని మరింతగా ఎలా మనసులో నిలుపుకోవచ్చో వివరించాను. అంతా శ్రద్ధగా విన్నారు. వాళ్ళనుంచి విడివడ్డాక డాల్ఫిన్ పొలిమేరలు దాటి సముద్రం ఒడ్డునే నడిచాను. మరి నాలుగు చక్కని ఫోటోలు దొరికాయి.
ఎంత సముద్రమయినా, ఎంత ఫోటోల సంబరమయినా కడుపుకు తెలిసింది ఒక్కటే, ఆకలి. అప్పటికే ఒంటిగంట అవవస్తోంది. కడుపులో ఆకలి గంటలు మ్రోగడం మొదలైంది. నేను ఫోటోల హడావుడిలో ఉన్న సమయంలో జగన్ వెళ్ళి రిసార్ట్ బయటే ఉన్న ఏజెన్సీనుంచి స్కూటర్ అద్దెకు తీసుకువచ్చాడు.
‘మీరు హేవ్‌లాక్‌లో ‘సమ్‌థింగ్ డిఫరెంట్’ అన్న రెస్టారెంట్లో ఒక్క భోజనమైనా తప్పకుండా చెయ్యండి. మన కవి మిత్రులు దాట్ల దేవదానం రాజు వాళ్ళు ఆ మధ్య వచ్చి వెళ్లారు గదా – వాళ్ళు ఆ రెస్టారెంటును తెగ పొగిడేరు,’ అని రవి మొదటి రోజునే చెప్పాడు. అంచేత తిన్నగా ఆ బీచ్ సైడ్ రెస్టారెంటుకు దారి తీసాం. పది నిముషాల ప్రయాణం.
బీచ్ సైడ్ అన్నారు గదా – తాకితే సముద్రమే అనుకొని వెళ్ళాం. సముద్రానికి దాదాపు ఏభై గజాల దూరంలో ఉంది. రెస్టారెంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నా భోజనం సగటు బాణీలోనే ఉంది. బహుశా దాని గురించి పదేపదే విని ఉండటం వల్ల మా మీద థీరీ ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ పని చేసి ఉండాలి. ఏమీ తెలియకుండా వెళ్ళి ఉంటే మరి కాస్త సంతృప్తి కలిగి ఉండేదేమో! తిరిగి డాల్ఫిన్ చేరేసరికి దాదాపు వంద అడుగులు వెనక్కి వెళ్ళిపోయిన సముద్రం కనిపించి ఆశ్చర్యపరచింది. ఆటూపోటూ అంటే పదీ ఇరవై అడుగులే తగ్గటం పెరగటం చూస్తూ వచ్చాను. ఇక్కడ అదే ప్రక్రియ దాదాపు వంద అడుగుల సముద్రగర్భాన్ని బహిరంగపరుస్తోంది!! ‘ఇదేమన్నా వైపరీత్యమా?’ అని రిసెప్షన్లో అడిగాం. ‘అదేం కాదు, ఇక్కడ సర్వసాధారణం,’ అన్నారు.మధ్యాహ్నం. ఎక్కడికీ? ఇంకెక్కడికీ – రాధానగర్ బీచ్!
ఏ అండమాన్ యాత్రకయినా – అది మొదటిది కావచ్చు, మూడోది కావచ్చు, రాధానగర్ బీచ్‌లో గంటా రెండుగంటలు గడపడం అన్నది కలికితురాయి.
మొదట్లో అది ఆసియా ఖండంలోకెల్లా బెస్ట్ బీచ్ అన్నపుడు దాన్ని ప్రాంతీయాభిమానపు అతిశయోక్తి అనుకున్నాను. ఒక్కసారి వెళ్ళి చూశాక – కనీసం నేను చూసిన నాలుగు ఖండాలలోని అనేకానేక బీచ్‌లలో ఇదే ఉత్తమం అని బోధపడింది.
ఏమిటీ దాని ప్రత్యేకత?
స్నిగ్ధ సౌందర్యం.
అంతా కలసి మైలు దూరం ఉండే అర్థచంద్రాకారపు సాగరతీరం. మృదువైన తెల్లని ఇసుక. అల్లరి చెయ్యని అలలు. నీటికి అతి దగ్గరగా దట్టమైన పచ్చదనం నిండిన అడవి. అడవి అందాల్ని పెంపొందించే కొబ్బరి చెట్లు. ఏనాడూ వందా రెండువందలకు మించని సందర్శకులు. అల్లరీ హడావుడీ లేని ప్రశాంత వాతావరణం. బీచ్‌కు రెండు కొసలలోనూ కొండగుట్టలూ రాళ్ళూ నిండిన సముద్రజలాలు. పశ్చిమ కొసన ఆ రాళ్ళూ నీళ్లను ఆధారంగా చేసుకుని అద్భుతమైన సంధ్యవర్ణ చిత్రాలను సృష్టించే సూర్యుడు. నా వరకూ నాకు అది తొలిచూపు వలపు. ఎన్నిసార్లు వెళ్ళి గంటల కొద్దీ గడిపినా తనివితీరని తమకం. మళ్ళా మళ్ళా వెళ్లాలన్న తపన.
నాలుగు గంటల వేళ రాధానగర్ చేరుకున్నాం. డాల్ఫిన్ రిసార్ట్నుంచి దాదాపు అరగంట ప్రయాణం. మధ్య దారిలో ‘ఎలిఫెంట్ బీచ్, ట్రెకింగ్ రూట్’ అన్న సైన్ బోర్డ్ కనిపించిందిగానీ ‘ఈసారి కుదరదులే’ అని చెప్పి ముందుకు సాగాం.
మరో గంటలో సూర్యాస్తమయం జరగబోతున్నా బీచ్ మాత్రం తన సొగసుకు సరితూగే మెత్తని ఎండలో మిలమిలా మెరుస్తూ స్వాగతం పలికింది. ఎండ ఎలా ఉన్నా క్షణక్షణానికీ తమ పొడవు పెంచుకుంటూ వెళుతోన్న మా నీడలు, ‘ఈ ఎండ ఎంతో సమయం ఉండదోయ్’ అని హెచ్చరించసాగాయి. ఓ పావుగంట తూర్పు కొస వేపు నడిచాం. క్షణాల్లో మనుషుల ఉనికి తొలగిపోయి జగన్-సముద్రం-నేనూ అన్న ఏకాంతక్షణాల ఆస్వాదనకు వేదిక ఏర్పడింది. కానీ పెద్ద సందిగ్ధం – ముందున్న సముద్రాన్ని చూడాలా? వెనకనున్న అడవినా – కాసేపు అటు కాసేపు ఇటు – నడుమ నిర్విరామంగా క్లిక్కుమంటోన్న కెమెరా. ఆకాశంలో సూర్యాస్తమయ ఛాయలు కనిపించాయి. పూర్తి ఆస్వాదన కోసం తూర్పు కొసను వదిలి గబగబా పశ్చిమ కొస వేపు నడక సాగించాం. సాగే మా నడకకు అడుగడుగునా అడ్డంకులే. కెరటాలకు కాస్తంత ఎగువన, తడి ఆరిన ఇసుక మీద చక్కచక్కని డిజైన్లు – అవి జారిపోయే నీటి చారలో, చిరుజీవుల కాలిముద్రలో, నేల తొలచిన కీటకాల సృష్టో చెప్పడం సరైనది కాదు – కాస్తంత మేర నేలంతా కేన్వాసుగా మారిందన్న మాట నిజం. దాన్ని ఏకవర్ణపు చిత్రకళా వేదిక అనడం సబబు.సాయంసంధ్యను తానూ శ్రద్ధగా చూడాలనుకుందేమో – తీరప్రాంతపు సముద్రం తనకున్న కాసిన్ని అలలనూ కడుపులో దాచేసుకుని, ఇసుకనంతనూ నీటి తడితో అద్దంలా మార్చేసి, పక్కనున్న అడవిని ప్రతిబింబించే పనిలో నిమగ్నమై పోయింది. ఆ ప్రశాంతసమయాన్ని అలా మరింత సుందరంగా తీర్చిదిద్దుతోన్న సముద్రాన్ని చూస్తే ఎంతో ముచ్చట వేసింది.
సూర్యుడు దిగిపోవటానికి మహా అయితే పది నిముషాలు పట్టే సమయం. ఏవో గెలాక్సీలనుంచి తేలి వచ్చిన అంతరిక్ష ధూళి ఆ ప్రాంతమంతా పరచుకున్నట్టు, తాకితే చేతికి అంటుకుంటుందేమోనన్న భావన కలిగించే, పసుపు-బంగారు రంగులో లేత మందారపు ఎరుపు కలగలిసిన అపూర్వవర్ణం. అప్పటిదాకా, ఆ మైలు దూరపు తీరంలో అక్కడక్కడ చెదురుమదురుగా ఉన్న వందా రెండువందలమంది బీచ్ ప్రేమికులంతా పడమటి కొసన ఉన్న గుట్టవేపు ఉమ్మడిగా తరలి రాసాగారు. అది చూసి ‘ఏమిటో మనుషుల తాకిడి తేడాగా ఉందే,’ అనిపించింది. కాస్తంత ఆలోచిస్తే అంతకు ముందటి వారం రోజులూ సముద్రమంతా మాదే, బీచ్‌లన్నీ మావే అన్న బాణీలో కార్ నికోబార్ కచ్ఛల్ దీవుల సాగరతీరంలో ‘ఒంటరి’గా తిరిగిన మాకు, ఈ రాధానగర్‌లో కనిపిస్తోన్న రెండువందలమంది కూడా చాలా ఎక్కువ అనిపిస్తోందని స్ఫురించింది. నవ్వొచ్చింది. తండోపతండాలుగా నిండి ఉండే జనసందోహానికీ, ఎవరూ లేని ఏకాంతానికీ మనిషి ఎంత త్వరగా అలవాటు పడిపోతాడో అన్నదానికి నేనే నిదర్శనం కదా అనిపించింది. ఏదేమైనా మాతోపాటు ఉన్న రెండువందలమందీ కాలికి అందిన రాతిబండను ఆసరాగా చేసుకుని, చుట్టూ వచ్చి పోతూ పాదాలను తాకి పలకరించే నీళ్ళను మురిపెంగా మందలిస్తూ సూర్యుడికేసి తదేక దీక్షతో చూడటం – అరుదైన దృశ్యమది.సూర్యుణ్ణి లోకబాంధవుడు అంటాం – ఆ మాట నిజమని ఆయన మరోసారి నిరూపించాడు. మబ్బుల సాయంతో క్షణానికొకటి చొప్పున ఆకాశంలో వర్ణచిత్రాలను గుమ్మరించాడు. మళ్ళా ఆ చిత్రాలతో సున్నితమైన వర్ణవైవిధ్యం పొందుపరచడం మరచిపోలేదు. ఒక నిముషాన సూటిగా చూడలేనంత వెలుగు… మరికొన్ని నిముషాల్లో తదేకంగా చూసే అవకాశం… ఒక నిముషాన కొట్టొచ్చినట్టు కనిపించే రంగులు. మరికొన్ని నిముషాలకు ఆదరించి లాలించే లలితమైన మెరుపులు… ఆ సౌందర్యసృష్టిలో మేఘాలతోపాటు తమ వంతు పాత్ర కూడా పోషిస్తోన్న తడిసి మెరిసే బండరాళ్ళు… సమయసందర్భాలని ఎలివేట్ చేస్తూ నిశ్శబ్దంగా సూర్యాస్తమయాన్ని చూస్తోన్న సహపర్యాటకులు… మాంత్రిక క్షణాలవి… సూర్యుడు దిగిపోయినా అందాలు అంతరించలేదు. కొండలు తమ ఆకుపచ్చతనానికి చీకటిని అడిగి ముందస్తుగా తెచ్చుకున్న నలుపురంగు పులుముకోవడం ఆరంభించాయి. సముద్రం మాత్రం కొద్దిసేపయినా తన లేత నీలి రంగును తిరిగి సంపాదించుకునే పనిలో పడింది. సూర్యుడి వర్ణరథం మీద వీరవిహారం చేసిన మేఘాలు నాయకుడు నిష్క్రమించిన తర్వాత మిగిలిపోయిన సైనికుల్లా తమతమ ఉనికిని ఉపసంహరించుకోసాగాయి. చూస్తూ చూస్తూ ఉండగానే వెలుగంతా హరించుకుపోయి చీకటి కమ్ముకోవడం మొదలయింది. మేమున్న చోటునుంచి స్కూటర్ స్టాండుకు చేరుకోడానికి పది నిముషాలు పడుతుందనీ, అక్కణ్ణుంచి డాల్ఫిన్ మరో అరగంటనీ గుర్తొచ్చి కాళ్ళు చురుగ్గా అడుగులు వేయసాగాయి. ‘వెలుగైనా చీకటైనా నా ఉనికి నిరంతరం,’ అంటూ వరుణదేవుడు మేఘాల మాటునుంచి హెచ్చరించసాగాడు.
స్కూటరు కదిలీ కదలగానే వర్షం మొదలయింది. కాసేపు ఆగాం. మా ప్రమేయం లేకుండానే మా నాలుగు కళ్ళూ మాట్లాడేసుకుని ‘వర్షానికి భయపడటం అర్థం లేని పని,’ అని చాటి చెప్పాయి. తడిసి ముద్దలయిపోయి డాల్ఫిన్ రిసార్ట్ చేరాం.
మేము గదికి చేరడం, వర్షం వెలవడం, ఏదో మంత్రం వేసినట్టు ఒక్కసారే జరిగాయి. ఆశగా ఆకాశంకేసి చూసాను. మేఘాలే తప్ప చంద్రుడి జాడలేదు. ఇహ ఈ రోజుకు చందమామ అందడు అని నిర్ధారించుకుని స్నానాలు ముగించుకుని ఇద్దరం కాఫీ కప్పులతో ముందు వరండాలోకి చేరాం. యధాలాపంగా పైకి చూస్తే దొంగల్లో దొరలాగా మేఘాల కౌగిళ్ళలోంచి తప్పించుకుని వచ్చి మాకేసి చూసి నవ్వుతోన్న శశాంకుడు. ఆయనతో ఓ అరగంట ముచ్చట్లు.
ఆ రాత్రి – అనూహ్యమైన అనుభవం.
అర్థరాత్రి సమయంలో జడివాన జయజయధ్వానాలు వినిపించాయి.
ఆగలేక వరండాలోకి వెళ్ళాను.
సముద్రంకేసి చూస్తే నీళ్ళు లేనే లేవు!
తటపటాయిస్తూనే వానలోకి అడుగులు వేసాను. సముద్రం గట్టుకు చేరాను. దాదాపు నూట యాభై రెండు వందల అడుగుల మేర సముద్రం ఆటు తీసి ఉంది!
‘ఇది మాకు మామూలే’ అన్న రిసెప్షన్ మనిషి గుర్తొచ్చాడు.
దాదాపు చదునుగా ఉన్న సముద్రం. ఎక్కడా దిగుడుగానీ గుంటలుగానీ ఉన్న ఛాయలు కనిపించడం లేదు. చదునుగా ఉన్న నేల నిండా నున్నని లేతలేత రంగుల రాళ్ళు… మధ్యలో చిన్న చిన్న ఇసుకమేటలు…కంటికి కనిపించకుండా పోయినా వెనుకనుంచి మసక వెన్నెల చిందిస్తోన్న కృష్ణ తదియ చంద్రుడు – ఆ మసక వెలుగులో సముద్రగర్భమంతా వివరంగానే కనిపించడం, ఎన్నో యేళ్ళ తర్వాత జోరువానలో ఆరుబయటకు చేరడం, ఎదురుగా రారమ్మని పిలిచే నీరు తీసిన సముద్రగర్భం –
ఆగగలమా?
అడుగు పెట్టాను.
మొదటి నాలుగు అడుగులూ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ బాణీ… మరో పది అడుగులు ఆచి తూచి… తెలియకుండానే అది సముద్రగర్భమని మర్చిపోయి రాళ్ళూ ఇసుక మీదుగా నడక. మధ్యాహ్నం ఫోటో సెషన్లో దూరాన నీళ్ళమధ్య నిలబడి పలకరించిన ఒంటరి చెట్టు దాకా చేరి – దూరంనుంచి టార్చిలైటు – చౌకీదార్. అసంకల్పితంగా చెయ్యి ఊపాను. అతనూ చేయి ఊపి ముందుకు సాగిపోయాడు. ధోరణి చూస్తే ఇలా అర్థరాత్రి సముద్రానికి ఎగబడి లోపలికి నడిచే వాళ్ళు అతనికి మరీ కొత్త కాదని బోధపడింది.
సమయం ఎంతసేపు గడిచిందోనన్న స్పృహే లేకపోయింది. ఏ క్షణానయినా సముద్రం పోటులోకి వస్తుందేమోనన్న సంకోచం హుష్ కాకి అయింది. కాలస్పృహ లేకుండా కూర్చుండి పోయాను. కాలస్పృహ అనే ఏముంది – పరిసరస్పృహ కూడా కోల్పోయిన క్షణాలవి.
తిరిగి గదికి చేరి చూస్తే గడియారం రెండు చూపించింది. మర్నాటి ఉదయం ‘రాత్రి వానలో తిరిగింది నువ్వేనా?’ అని పక్క కాటేజీ వాళ్ళు కుశలమడిగారు. ముసిముసినవ్వులతో ఔనని చెప్పాను.
అక్టోబర్ గడిచిపోయింది. నవంబర్ నెలలో ప్రవేశించాం. పౌర్ణమి దాటి నాలుగో రోజు – కృష్ణ చతుర్థి. తెల్లవారే సంధ్యాసమయంలో చంద్రుడికీ సూర్యుడికీ పోటీ ఏర్పడే తిథి అది. అన్నిసార్లూ సూర్యుడే గెలుస్తాడన్నది వేరే చెప్పనక్కర్లేదు. ఉదయం ఆరింటికి బయటకు వచ్చేసరికి అది చంద్రుని మలి వెలుగో సూర్యుని తొలి వెలుగో తెలియని మెత్తనయిన కాంతి. వర్షపు ఛాయలు లేవు. రాత్రంతా గైర్హాజరైన సముద్రం ఏ పాపం తెలియని స్కూలు పిల్లాడిలా మళ్ళా గట్టు వరకూ వచ్చి సర్దుకుని కనిపించింది.
మరో అరగంట. సూర్యోదయం.
ఇంకో అరగంట. చురుక్కుమనే ఎండ.
“కాలా పత్థర్ బీచ్ చూసారా?” జగన్‌ను అడిగాను.
“చూసాను. కానీ హడావుడిగా చూసా.”
“పదండి. ఈసారి ఆ బీచే కాకుండా ఆ దగ్గర్లోని గ్రామాలను మీకు పరిచయం చేస్తాను.”
అతనిలో ఏదో వెలిగింది. “మీ ‘అండమాన్ డైరీ’ ముఖచిత్రం ఆ ఊళ్ళలోదే కదూ?”
“అవును. బంగ్లాదేశ్‌నుంచి వచ్చి 70 ల తొలి దినాలలో అండమాన్లలో పునరావాసం పొందిన బెంగాలీ మొండల్ కుటుంబపు కోడలు ఆమె.”
“కొంపదీసి ఈసారి వాళ్ళను వెతుకుతారా ఏమిటి?”
“కొంప తియ్యకుండానే వెతుకుతాను. మీకు తెలియకుండానే మీరూ క్షణాల్లో ఆ అన్వేషణలో భాగమవుతారని నమ్మకంగా చెప్పగలను.”
అంత నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ ఇలాంటివి సులువుగానే నమ్ముతాడు.
“అంతా బానే ఉందిగానీ నాకు ఈ హేవ్‌లాక్ ద్వీపం రూపురేఖలు బోధపడటం లేదు. మనం వెళ్ళే కాలాపత్థర్, మీరు చెప్పే మొండల్ వాళ్ళ ఊరు ఒకే వేపు ఉన్నాయా?” అడిగాడు జగన్.
నిజమే. హేవ్‌లాక్ ఒక పద్ధతైన దీవి కాదు.
స్థూలంగా ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉన్న ద్వీపమది. ద్వీపంలోని ఏడు గ్రామాలూ ఉత్తరభాగంలోనే ఉన్నాయి. ఆ ఏడింటికీ తమతమ నెంబర్లు ఉన్నాయి. జెట్టీ ఉన్నది ఉత్తరపు కొసన ఉన్న ఒకటో నెంబరు గ్రామంలో. దానికి పక్కనే తూర్పు తీరాన రెండో నెంబరు గ్రామం. ముందటి రోజున మేము భోజనం చేసిన ‘సమ్‌థింగ్ డిఫరెంట్’ రెస్టారెంట్ ఈ రెండో నెంబరు గ్రామంలో ఉంది. వీటికి నెంబర్లే తప్ప పేర్లు లేవు. ద్వీపపు ముఖ్యమైన బజారు ప్రాంతమూ, ఆఫీసులూ, మా డాల్ఫిన్ రిసార్టూ ఉన్న మూడో నెంబరు గ్రామం పేరు గోవింద్ నగర్. ద్వీపపు నడిబొడ్డున ఉన్న నాలుగో నెంబరూ ఆరో నెంబరు గ్రామాల పేర్లు శ్యామ్ నగర్, క్రిష్ణా నగర్. గోవింద్ నగర్‌కు దిగువున తూర్పు తీరాన ఐదో నెంబరుగల విజయ్ నగర్ గ్రామం – ఇంకాస్త దిగువకు వెళితే కాలాపత్థర్ బీచ్. ద్వీపం మొత్తానికి కలికితురాయి అనదగ్గ ఏడో నెంబర్ రాధానగర్ గ్రామం పడమటి తీరాన ఉంది. పైన చెప్పినట్టు ఈ ఏడు గ్రామాలూ ద్వీపపు ఉత్తర భాగంలోనే ఉన్నాయి. దక్షిణాన అంతా దట్టమైన అడవి అట. ఆ అడవిలో ఒకటి రెండు ఐదు నక్షత్రాల రిసార్ట్లు ఉన్నాయని విన్నానేగానీ వాటి జోలికి ఎప్పుడూ వెళ్లలేదు. ఏదేమైనా ఒక పూటో ఒక రోజో వచ్చి వెళ్ళే వారికి హేవ్‌లాక్ రూపురేఖలు ఒక పట్టాన అర్థం కావు. 2000 సంవత్సరంలో రెండోసారి అండమాన్ వచ్చినపుడు ఒక రోజంతా అదే పనిగా స్కూటరు వేసుకుని ఏడు గ్రామాలూ వరసాగ్గా తిరిగాను. ఊళ్ళ మీద కాస్తంత పట్టు వచ్చింది.
బుద్ధి పుట్టిన చోటల్లా ఆగుతూ ఆగుతూ గంట ప్రయాణించిన తర్వాత కాలాపత్థర్ చేరేసరికి ఎనిమిది అయింది. చేరీ చేరగానే కాఫీ ఎక్కడా అన్న వెతుకులాటలో పడ్డాను. వరసాగ్గా కాఫీ దుకాణాలు కనిపించాయి. అందులో ఒక దుకాణం కాస్తంత ప్రత్యేకంగా కనిపించింది. ఎందుకు అడగాలని అనిపించిందో మరి, “కాఫీ ఎంతా” అని అడిగాను. “అరవై,” అన్నాడు. ఆ ప్రాంతంలో అలాంటి దుకాణంలో అంత ధర ఉండటం విచిత్రంగా తోచింది. మరీ ‘కాఫీ డే’ రెట్లు పెట్టేసావా అని నోరు జారాను. అతనేమీ నొచ్చుకోకుండా “కాఫీ డేకన్నా మంచి కాఫీ అందిస్తున్నపుడు ఆ మాత్రం రేటు ఉంటుంది గదా,” అన్నాడు. ఆ అనడంలోని నిబ్బరం, నమ్మకం నన్ను ఆకర్షించాయి. అక్కడే స్థిరపడి అతను కాఫీ చేసే ప్రక్రియ పరిశీలించసాగాను. అన్నట్టు అన్నం వండటంలోనూ (రైస్ కుక్కర్లో), పెరుగు చెయ్యడంలోనూ (తోడు వెయ్యడం అన్నమాట), కాఫీ కాయడంలోనూ నాకు చెప్పుకోదగ్గ ప్రావీణ్యం ఉంది.
ఆ బెంగాలీ పెద్దమనిషి చిక్కని పాలతోనూ, ఫిల్టర్ వేసి దించిన డికాక్షన్తోనూ ఘుమఘుమలాడే కాఫీ చేసి ఇస్తాడనుకున్నాను. పాలపొడి డబ్బా మూత తీసాడు. నెస్కెఫే… కాఫీ పొడి కప్పులో వేసాడు. కాసిన్ని వేడిపాలు పోసి కాఫీ పొడినీ పాల పొడినీ ఓపిగ్గా గిలకొట్టాడు. మరగడానికి క్షణాల ముందే పాలను స్టౌ మీదనుంచి దించి ఓ నిముషంపాటు వాటిని స్థిమితపడనిచ్చి మెల్లగా కప్పులో పోసాడు. పరిమళం లేదు. నురగలు లేవు. కానీ రుచి? అమోఘం! ఇన్స్టెంట్ కాఫీని, పాలపొడి కాఫీని అంత రుచిగా మలచిన మనిషి నాకు అంతవరకూ తటస్థపడలేదు. ‘కాఫీ చెయ్యడం ఒక కళ,’ అని అతణ్ణి చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది. నా సంతోషాన్ని వ్యక్తపరచడానికి మరి కాస్త ఎక్కువ ఇవ్వబోయాను. మర్యాదగా వారించి అరవై మాత్రం తీసుకున్నాడు. కరచాలనానికి చెయ్యి చాపితే సంతోషంగా అందుకున్నాడు.
మరీ పెద్ద మాట అనిపించినా ఆ కాఫీ నా ఉదయాన్ని వెలిగించిన మాట నిజం.
కాలాపత్థర్ అందరూ కేరింతలు కొట్టే బాణీ బీచ్ కాదు. సామాన్యమైన అర్థంలో అది ఒక బీచ్ అని చెప్పడం కూడా కష్టం. టూరిస్టులు తప్పకుండా చూసి తీరాలి అని అనుకొనే ప్రదేశం కాదు. రాధానగర్‌కు వందమంది వెళితే కాలాపత్థర్లో ఇరవై పాతికమందే చేరడం గమనించాను. అయినా నేను రాధానగర్‌కు వెళ్ళినంత మక్కువతో కాలాపత్థర్కు కూడా ఎందుకు వెళుతున్నానూ?
రాధానగర్ ఒక రమణీయమైన గమ్యం అయితే కాలాపత్థర్కు వెళ్ళడమంటే అది మరింత రమణీయమైన గమనం.
మేమున్న డాల్ఫిన్ రిసార్ట్నుంచి నాలుగయిదు కిలోమీటర్ల దూరాన ఉంది కాలాపత్థర్ బీచ్. నడిచి వెళ్ళినా ముప్పావుగంటలో చేరుకోగల దూరం. కానీ నేను ఎప్పుడు స్కూటరు మీద వెళ్ళినా గంటా గంటన్నర పట్టడం నాకు క్రమం తప్పని అనుభవం. అందుకు కారణం ఆ నాలుగు కిలోమీటర్ల దారిలోనూ తటస్థపడి పదేపదే నిలువరించే అపారమైన దృశ్య వైవిధ్యం.
డాల్ఫిన్ దాటాక ఒక కిలోమీటర్వరకూ చదునుగా ఉన్న ప్రదేశం ఆ తర్వాత కొండబాటగా మారుతుంది. ఒక పక్క నిడుపాటి చెట్లు నిండిన కొండచరియ, మరో పక్క, దిగువన, పదీపదిహేను గజాల దూరంలో సముద్రం, రోడ్డుకీ సముద్రానికీ మధ్య దట్టంగా చెట్లు, ఆ చెట్ల నడుమనించి అడపాదడపా కనిపించే ఇసుక తిన్నెలు – వాటిల్ని మైక్రో బీచ్‌లు అనడం సబబు, వాటికన్నా ముఖ్యంగా యుగాల తరబడి సముద్రపు అలల తాకిడికి నునుపుదేరి, సొగసు సంతరించుకుని, కళారూపాలుగా పరిణమించిన కృష్ణవర్ణపు శిలలు – వాటిల్ని ఊరికే అలా చూసుకుంటూ వెళ్ళిపోవడం సర్వసంగపరిత్యాగులకు సాధ్యమేమోగానీ, ఆకును చూస్తే అడవి అని భ్రమించే నాలాంటి సామాన్యుడికి అసాధ్యం. అంచేత వందగజాలకొకసారి ఆగి, నిలబడి, ఫోటోలు తీసి, శిలలను పలకరించి, ఇసుకలో పాదాలు నిలిపి, కెరటాల స్పర్శను అనుభవించి – మరి గంటాగంటన్నర పడుతుందంటే పట్టదూ?!“పదండి, మీ మొండల్ గారిని వెతుకుదాం,” తనంతట తనే దారి తీసాడు జగన్. 2012 లో మొదటిసారి అండమాన్ వచ్చినపుడు అండమాన్ ద్వీపాలలో బంగ్లాదేశ్ మూలాల వాళ్ళు విరివిగా ఉన్నారన్న విషయం తెలిసింది. బంగ్లా విమోచన పోరాటం ముగిశాక 1970ల తొలి సంవత్సరాలలో వందలాది బెంగాలీ కాందిశీకులకు అండమాన్ ద్వీపాల్లో పునరావాసం కల్పించారు అన్న విషయం తెలిసాక, అలా వచ్చి స్థిరపడిన వాళ్ళను కలుసుకోవాలన్న ఆలోచనతో కాలాపత్థర్ దగ్గర సముద్రతీరం వదిలి పడమర దిక్కుగా ద్వీపపు నడుమ భాగానికి వెళ్ళాను. అదిగో అప్పుడు మొండల్ వాళ్ళ రైతు కుటుంబం పరిచయమయింది. తండ్రి, తల్లి, ఇద్దరు కొడుకులు, ఒక కోడలు, ఒకరిద్దరు మనుమలు – ఉమ్మడి కుటుంబమది. పెద్ద కొడుకు పోలీసు డిపార్టుమెంట్లో పోర్ట్ బ్లెయిర్‌లో ఉంటున్నాడనీ, కోడలూ మనవడూ తమతోనే ఉంటున్నారనీ చెప్పుకొచ్చారు మొండల్ దంపతులు. అప్పుడు తీసిన ఫోటో ఒకటి నేను రాసిన ‘అండమాన్ డైరీ’ పుస్తకానికి ముఖచిత్రమయింది. వాళ్ళను మళ్ళా కలవాలనీ, ఆ పుస్తకం కాపీ ఇవ్వాలనీ నా తాపత్రయం.
లోపలికి సాగిపోయాం. ఈ పదీ పన్నెండేళ్లలో పెద్దగా మార్పు కనిపించలేదు. అవే పొలాలు, అవే కుంటలు, అవే కొబ్బరి చెట్లు నిండిన చేల గట్లు, అదే మనుషులు.
ఒకటి రెండు చోట్ల ఆగి మొండల్ కుటుంబం గురించి వాకబు చేసాం. చివరికి మూడో మనిషి ముఖచిత్రాన్ని గుర్తు పట్టాడు… ‘ఓ వీళ్ళా, వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదు. వాళ్ళబ్బాయి పోలీసు కదా, పోర్ట్ బ్లెయిర్ పరిసరాల్లోని ఏదో గ్రామంలో అతని పోస్టింగు. చిన్న కొడుకూ అక్కడే ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. వీళ్ళంతా, పెద్దాళ్ళయి పోయారు గదా, ఈ ఊరు వదిలి పోర్ట్ బ్లెయిర్ వెళ్లిపోయారు.”
వివరాలు తెలిసాయి. మనుషులు దొరకలేదు. అడ్రసూ ఫోన్‌నెంబర్ల కోసం వెదుకులాట మొదలెట్టాం. ఆ వెతుకులాట మమ్మల్నో పెద్ద సైజు టీ దుకాణం దగ్గరకు చేర్చింది. పేరుకు టీ దుకాణమే అయినా గోడల నిండా వర్ణచిత్రాలు… విస్తుపోవడం మా వంతు.
ఆ టీ స్టాల్లో ఒకరికి నలుగురు బెంగాలీ కుర్రాళ్ళు. కుర్రాళ్ళు కదా మొండల్ వాళ్ళ చిన్నబ్బాయి వివరాలన్నా తెలుస్తాయని వాళ్ళని మాటల్లో పెట్టాం. అసలు మేమలా లోపల్లోపలి ఊళ్ళు పట్టుకుని తిరగడం, ఊళ్ళో వాళ్ళ వివరాలు అడగడం వాళ్ళకు కాస్తంత అనుమానం కలిగించింది. కాసేపటి తర్వాత వాళ్ళంతట వాళ్ళే సర్దుకుని గలగలా మాటలు మొదలెట్టారు. అందరికీ టీ ఆర్డరు చేసి తేనీరు సాక్షిగా స్వల్పకాలపు స్నేహం పండించుకున్నాం. అంతా బావుందిగానీ ఆ టీ చేసిన యువకుడు మహా మితభాషి. నోరు విప్పితే ఏ ముత్యాలు రాలుతాయనుకుంటున్నాడోగానీ ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. ఆట పట్టించే ధోరణిలో అతనితో అదే మాట అన్నాం. అర్థమయినట్లుగా ఓ చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఏదో తేడా అనిపించి మిగిలిన వాళ్ళ మొహాలకేసి చూసాను. అప్పుడు తెలిసింది – ఆ యువకుడు పుట్టుకతోనే మాటలు రాని మనిషి. వినికిడి శక్తి లేని మనిషి. అయినా మంచి చురుకైన మనిషి. చక్కని వంటవాడు. అన్నిటినీ మించి పిపాస నిండిన చిత్రకారుడు. ఆ దుకాణం గోడల మీద ఉన్న చిత్రాలన్నీ అతనివే!
ఒక్కసారి విషయం స్పష్టమయ్యాక అతనూ మాతో కలసిపోయాడు. ఊసులాడాడు – ఊసులాడటానికి మాటలే అవసరం లేదు కదా – తాను వేసిన బొమ్మలు తీసి చూపించాడు. మాతోపాటు ఫోటోలు దిగాడు. అతని పరిమితుల గురించిన స్పృహ అతనికి ఎలానూ లేదు – మేమూ ఆ సంగతి పూర్తిగా మరచిపోయాం. అరుదైన అనుభవమది.ఇంత చేసినా అడ్రసులూ టెలిఫోన్ నెంబర్లూ మాయలేడిగానే మిగిలాయి. ఇక ఆ సంగతి మరచిపోయి, పరిసర ప్రాంతాల సౌందర్యారాధనలో మునిగిపోయాం. పొలాల గట్ల మీద నడిచాం. కుంటల్లోని ఎర్ర కలువల్ని పలకరించాం. బెకబెక బాతుల కబుర్లు విన్నాం. పచ్చని పైర్లను మన వేపు పొలాలతో పోల్చి చూసాం. పొలం పనుల్లో మునిగి ఉన్న ఒకరిద్దర్నీ పలకరించి మాట కలిపాం. భలే – మన కోనసీమలో గడిపినట్టు ఉందికదూ, అంటూ మురిసిపోయాం. ఆ సమయం, ఆ ప్రదేశం, అవన్నీ మావే అనిపించింది. అవన్నీ మేమే అనీ అనిపించింది.
ఆ మధ్యాహ్నం మళ్ళా రాధానగర్ దారి పట్టుకున్నాం. కావాలనే మామూలుగా సందర్శకులు కూడుకునే సమయంకన్నా ముందుగా చేరుకున్నాం. కాస్తంత ఎండ తాకిడి తగిలినా అది పట్టించుకోవలసిన విషయం కాదని మా ఇద్దరికీ తెలుసు. ఈ మధ్యనే పెట్టినట్టున్నారు – బీచ్‌లోకి ప్రవేశించిన చోట ‘వెల్ కమ్ టు బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్’ అన్న బోర్డు కనిపించింది. నిన్న హడావుడిలో దాన్ని మేము గమనించలేదుగానీ ఈసారి జగన్ గమనించి ఆపాడు. ‘బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్’ అంటే తెలుసా? అని అడిగాడు. తెలియదన్నాను. వివరించాడు.
సుమారు నలభై ఏళ్ల క్రితం యునైటెడ్ నేషన్స్ వారి పిలుపు అందుకుని జనబాహుళ్యంలో పర్యావరణ అవగాహన కలిగించడం, ప్రకృతి పరిరక్షణ ధ్యేయంగా ‘ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్’ అన్న ఎన్జీవో యూరప్‌లో ఏర్పడిందట. క్రమక్రమంగా వాళ్ళు తమ కార్యకలాపాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించారట. వారి ముఖ్యకార్యక్రమాలలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఒకటి.
సముద్ర తీరాలనూ, ఇతర జలాశయాలనూ ప్రత్యేక శ్రద్ధతో పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచే ప్రభుత్వ-ప్రైవేటు వ్యవస్థలూ సంస్థలకు – అనేకానేక అంశాలను కూలంకషంగా తనిఖీ చేసి, ఆ మదింపులో నిలచిన వారికి ఈ ఫౌండేషన్ వాళ్ళు బ్లూ ఫ్లాగ్ హోదా అందిస్తారట. పర్యావరణాన్నీ, ప్రకృతినీ గౌరవించి రక్షించడం, ఆయా ప్రాంతాల వారికి పర్యావరణ అవగాహన కలిగించడం ఆ తనిఖీలో ముఖ్యాంశాలు. అలాంటి సర్టిఫికెట్ ఉన్న సాగరతీరాలకు వెళితే పరిశుభ్రమైన జలాలు, ప్రమాదరహితమైన అనుభవాలు సందర్శకులకు కలుగుతాయి. స్థూలంగా చెప్పాలంటే యునెస్కో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ‘సాంస్కృతిక వారసత్వ ప్రతీకలు’ అంటూ కట్టడాలనూ, ప్రదేశాలనూ గుర్తించి సర్టిఫికెట్ ఇస్తూ ఉంటారు గదా – ఈ మధ్య మన రామప్ప దేవాలయానికి అందినట్లు – అలాంటి గుర్తింపే ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్.
నాకు అదంతా కొత్త విషయం. తెలుసకున్నందుకు సంతోషం కలిగింది.
రాధానగర్ బీచ్ చేరడమంటే పెందరాళే చేరాంగానీ, ఈ బ్లూ ఫ్లాగ్ వివరాలు, ఆ వివరాలు అందించే పెద్ద పెద్ద బోర్డులు, కాఫీ తాగాలన్న కోరిక, మెల్లమెల్లగా బీచ్ చేరుకుంటున్న టూరిస్టుల్ని పలకరించి మాటల్లో పెట్టడం – వీటి మధ్య గంట నాలుగు కొట్టనే కొట్టింది. అంటే సూర్యాస్తమయం వేడుకకు ఫస్ట్ బెల్లు మోగిందన్నమాట. ఇద్దరం పశ్చిమాన ఉన్న బండలూ, గుట్టల వేపు కాలు సారించాం.
దారిలో ఒక యూరోపియన్ సీనియర్ జంట తటస్థపడింది. పాశ్చాత్యబాణీకి భిన్నంగా చిన్నపాటి స్థూల శరీరాలు, పెదాలపై చిరునవ్వు, నడకలో హుందాతనం, నడతలో నమ్రత, చేతిలో నిడుపాటి గొడుగులు – చూడగానే ఎవరికైనా పలకరించాలి అనిపించే జంట అది. ఇద్దరం చిరునవ్వుతో వాళ్ళని పలకరించాం. వాళ్ళూ స్పందించారు. వివరాలు పంచుకున్నాం. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వాసులట. ఆ పరిసర పర్వతాల్లో 2000 లో పఫింగ్ బిల్లి అన్న టూరిస్ట్ రైలు బండి ఎక్కిన జ్ఞాపకం పంచుకున్నాను. వాళ్ళ మొహాలు వెలిగాయి. ముగ్గురం మెల్బోర్న్ నగరాన్ని కీర్తించడంలో పడిపోయాం. జగన్ నవ్వుతూ వినసాగాడు. వారం రోజుల క్రితం అండమాన్స్ వచ్చారట. ప్రస్తుతం రాధానగర్ బీచ్ ఒడ్డున ఉన్న అరణ్యంలోని రిసార్ట్ లో ఉంటున్నారట. ఆ రిసార్ట్ వాళ్ళే ‘వర్షం వచ్చేలా ఉంది, ఇవిగో ఈ గొడుగులు తీసుకుని బీచ్ పశ్చిమ కొస అవతల ఉన్న లగూన్ దాకా వెళ్ళి రండి,’ అని జాగ్రత్తలు చెప్పి పంపారు.“లగూనా?! అదెక్కడా?!” నేను నిఝంగా ఎగిరి గంతేసాను.
పశ్చిమ కొసన రాళ్ళూ గుట్టలూ అనుకున్నాంగదా – అవి కాస్త ఓపిగ్గా దాటితే వెంటనే లగూన్ కనిపిస్తుందట. ఆ వార్త గొప్ప సంతోషం కలిగించింది. కాస్తంత సిగ్గూ కలిగింది. గత పదేళ్ళలో కనీసం అరడజనుమార్లు రాధానగర్ బీచ్‌కు వచ్చి ఉంటాను… గంటల తరబడి గడిపాను. ప్రతిసారీ ఆ పడమట కొస దగ్గర సముద్రం – ఆ మాటకొస్తే ప్రపంచమే – అంతమవుతుందని నమ్మాను. అక్కడి రాళ్ళూ గుట్టలూ దాటి వెళదామనే ఆలోచనే చెయ్యలేదు.
వాళ్ళిద్దరూ ఆ లగూన్ చూసిన సంతోషంలో ఉన్నారు. ఎలా వెళ్లాలో వివరాలు చెప్పారు. మాటల మధ్య వయసుల వివరాలు దొర్లాయి. ఆయన నాకన్నా రెండేళ్ళు చిన్న. ఆమె ఐదేళ్లు. ఆమె అవకాశం అంది పుచ్చుకుని, ‘ఏదో వయసయిపోయిందీ వయసయిపోయిందీ అంటూ ఉంటావు. ఈయన్ని చూడు ఎంత చురుగ్గా ఉన్నాడో,” అంటూ ఆయన్ని వేళాకోళం చేసింది.
కొత్తగా ఏర్పడ్డ స్నేహం పుణ్యమా అని వాళ్ళూ మళ్ళా లగూన్ దాకా మాతో వచ్చారు. చక్కని పరిపూర్ణ వృత్తాకారపు మడుగు అది. విశాలమైన తీరంలో ఒక చివరని సముద్రంతో జోడించే చిన్నపాటి సముద్రజలాల ప్రవేశ ద్వారం. గుచ్చుకోని రాళ్ళు నిండిన లోతులేని మడుగు అది. అడపాదడపా ప్రవేశద్వారంలోంచి వచ్చి పలకరించే చిన్న చిన్న కెరటాలు… చిన్నపిల్లలు కూడా ఏ సంకోచం లేకుండా నీళ్ళతో ఆడుకోగల, ప్రమాదం లేని మడుగు అది. అక్కడో అరగంట.సాయంత్రం అయిదవవస్తోందిగానీ ఆకాశంలో రంగులూ వెలుగులూ లేవు. దట్టంగా అలుముకుంటోన్న మేఘాల మహిమ అది. రంగులు లేకపోవడమే కాకుండా వర్షం వచ్చే సూచనలూ పుష్కలంగా కనిపించాయి. సూర్యాస్తమయం చూడాలి అన్న కోరిక వదులుకుని తిరుగు దారి పట్టాం.
అయినా దారిలో వర్షం రావడం, తడిసి డాల్ఫిన్ చేరడం తప్పలేదు.
నవంబర్ 2. గురువారం. మా ప్రయాణంలో పదకొండవ రోజు. ఉదయం నాలుగున్నరకే ఇద్దరం కుటీరం బయటకు వచ్చాం. పక్కనున్న లాన్లో వెలుగుతోన్న మికీ మౌస్ బొమ్మ పలకరించింది. గట్టుదాకా వెళ్ళి చూస్తే సముద్రం వెనక్కు తీసి కనిపించింది. చక్కని సూర్యోదయం సూచనలు కనిపించాయి. ‘నిన్నటి ఉదయం ఇక్కడే సూర్యోదయం చూసాం గదా, ఇవాళ కాలాపత్థర్ వెళ్ళి సూర్యోదయం చూస్తే బావుండదూ,’ అనిపించింది. ఐదు అవడానికి పది నిముషాలు ముందే అక్కడి బీచ్ చేరుకున్నాం.
మా కాఫీ మేకర్ మిత్రుడు కూడా అప్పుడే స్కూటర్ దిగుతూ కనిపించాడు. ‘సరిగ్గా అరగంటలో వస్తాం. రెండు కాఫీలు,’ అని చెప్పాను. కావాలనే ‘మంచి కాఫీలు,’ అనలేదు. చిరునవ్వుతో తల పంకించాడు.
డాల్ఫిన్లోలానే ఇక్కడా సముద్రం కాస్తంత వెనక్కు తీసి కనిపించింది. మాలాంటి ఎర్లీ బర్డ్స్ ఓ పదిమంది అప్పటికే ఆ నీరు తీసిన రాళ్ళమధ్య విహారాలు చేస్తూ కనిపించారు. మేమూ వాళ్ళతో చేరాం. ఆకాశం రంగులు సంతరించుకోవడం చూసి అందరితోబాటు కేరింతలు కొట్టాం. గత వారం పదిరోజులుగా సంధ్యాసమయాలను ప్రైవేటు వ్యవహారంలా ఆస్వాదించిన వాళ్ళం కాస్తా ఆ ఉదయాన అవి పదిమందికీ చెందిన ఉత్సవవేడుకలుగా భావించుకుని సంతోషాన్ని ఇచ్చి పుచ్చుకున్నాం. ‘ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనే లేదని,’ అని ఆరుద్ర ఎందుకు అన్నారో మరోసారి మననం చేసుకున్నాం.
మా చేష్టలేవీ పట్టించుకోకుండా సూర్యుడు తన మానాన తాను ఉదయాన్ని వెలిగించి, సముద్రానికి నీలిరంగు తిరిగి ఇచ్చి, మొక్కలకు పచ్చరంగు ప్రసాదించి తన పని తాను చేసుకోవడంలో మునిగిపోయాడు. తిరిగి చేరేసరికి డాల్ఫిన్ రిసార్ట్ తన స్వీయశోభతో మమ్మల్ని పలకరించింది.
ఉదయం తొమ్మిదింటికి మాకు హేవ్‌లాక్ ద్వీపంతో రుణం తీరింది.
ఈసారి మేము గవర్నమెంటు వారి ఫెర్రీ ఎక్కాం. జెట్టీ వదిలిన పావుగంటకల్లా అందరితోబాటు మిద్దె మీదకు చేరి ప్రయాణాన్ని ఆస్వాదించడం ఆరంభించాం. ఈలోగా మమ్మల్ని వెతుక్కుంటూ క్రూ మెంబరొకతను వచ్చాడు. ఫెర్రీ కెప్టెన్ పంపగా వచ్చిన మనిషి అతను. “ఈ ఫెర్రీలో ప్రైవేటు రూమ్ ఉంది. సేదదీరండి,” అంటూ ఆ గది తెరిపించాడు ఫెర్రీ కెప్టెన్. ఆ ప్రత్యేక మర్యాదకు కారణాలు ఊహించడం మాకు కష్టం కాలేదు. కాసేపు మర్యాదకోసం ఆ మర్యాదలు స్వీకరించి మళ్ళా మిద్దె మీదకు చేరాం.
పోర్ట్ బ్లెయిర్ గెస్ట్‌హౌస్ చేరేసరికి దాదాపు పన్నెండు.
గబగబా ఫ్రెషప్ అయి ఊళ్ళో హద్దూ అన్న చోట ఉన్న తెలుగు స్కూలుకు చేరుకున్నాం. 1966 లో స్థాపించబడిన గవర్నమెంట్ సీనియర్ సెకండరీ తెలుగు మీడియం స్కూల్ అది. 2000 సంవత్సరంలో రెండోసారి అండమాన్స్ వచ్చినప్పుడు ఊళ్ళో అగమ్యంగా తిరుగుతూ ఉండగా ‘తెలుగు మీడియం స్కూల్’ అన్న బోర్డు చూసి లోపలికి వెళ్ళి ఓ అరగంట గడిపాను. మా జగన్ పుణ్యమా అని ఈసారి అదే స్కూలును మరింత శ్రద్ధగా పద్ధతిగా చూసే అవకాశం లభించింది.
జగన్ పంచాయతీ రాజ్ ఉద్యోగి. ప్రవృత్తి రీత్యా పిల్లల చదువులు, సంక్షేమంకోసం తపన పడే మనిషి. దాదాపు ఇరవై ఏళ్లపాటు తనూ తన మిత్రులూ వ్యక్తిగత స్థాయిలో కాకినాడ పరిసరాల్లోని ప్రభుత్వ పాఠశాలలలోని ఆర్థికంగా వెసులుబాటు లేని పిల్లలకోసం ఎన్నో కార్యక్రమాలు నడిపారు. ఆ ప్రక్రియను క్రమబద్ధం చెయ్యడం కోసం ‘క్రియ సొసైటీ’ అన్న ఎన్జీవోకు రూపకల్పన చేసి రిజిస్టర్ చేసారు. సైన్స్ సెంటర్లు నెలకొల్పడం, పిల్లల పండుగలు నిర్వహించడం, స్కాలర్షిప్లు అందించడం అతనికి నిరంతర కార్యక్రమం. ఏదో మాటల్లో నేను పోర్ట్ బ్లెయిర్‌లో తెలుగు స్కూలు ఉంది అంటే, వెళ్ళి చూసి వద్దాం అని సంబరపడ్డాడు. రవి పుణ్యమా అని ఆ చూసి రావడం ఎంతో పద్ధతిగా కుదిరింది. అలా అని పెద్ద ప్రణాళిక ఏమీ పెట్టుకోలేదు.
సీబీయస్సీ సిలబస్ ప్రకారం పన్నెండవ క్లాసు దాకా బోధించే స్కూలు అది. అండమాన్ ద్వీపాలలో భాషా సమ్మేళనం అతి గాఢం. అంచేత బెంగాలీ, తమిళం, హిందీలాంటి మీడియంలలో బోధించే స్కూళ్ళు బాగానే ఉన్నాయి. ‘ఉన్నాయిగానీ ఇపుడు ప్రైవేటు స్కూళ్ల తాకిడి మాకూ బాగా తగిలింది. విద్యార్థుల సంఖ్య నానాటికీ పడిపోతోంది,’ అని చెప్పుకొచ్చారు ప్రిన్సిపాల్. అది అన్నిచోట్లా వ్యాపించిన సమస్యే. మా ఢిల్లీలో అయితే ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ నడిపే ఏడెనిమిది స్కూళ్ళలో తెలుగు పిల్లలకన్నా హిందీవాళ్ళే ఎక్కువమంది అవడం, ఎంతో కష్టం మీద తరగతికి ఒక సెక్షన్ లెక్కన తెలుగు మీడియం నడిపించడం జరుగుతోంది. ఇక ఆంధ్రరాష్ట్రంలో అసలు తెలుగు మీడియం అనవసరం అనే దొరతనాలు వచ్చేసాయి.
క్లాస్‌లోకి వెళ్ళి విద్యార్థుల్ని పలకరించాం. చిన్న చిన్న ప్రసంగాలు చేసాం. ప్రయోగశాలలు, లైబ్రరీ చూసాం. చక్కని వసతులు, కళకళలాడే పుస్తకాలూ కనిపించి సంతోషపరిచాయి. ముఖ్యంగా లైబ్రరీ పనులు చూస్తోన్న ముస్లిం మహిళ నిబద్ధత నన్ను ఆకట్టుకొంది. ఇరవై పాతికమంది ఉపాధ్యాయులూ ఇతర సిబ్బందితో అరగంట సమావేశం. క్రియ పిల్లలకోసం చేపట్టిన కార్యక్రమాలు, పిల్లల పండుగ వివరాలు జగన్ చెప్పాడు. మునిసిపల్ స్కూల్ చదువులు నాకు వేసిన పునాది గురించి నా జ్ఞాపకాలు పంచుకున్నాను. గంటాగంటన్నర తెలియకుండా, అర్థవంతంగా గడచిపోయాయి. సంతోషం సరేసరి.ఆ సాయంత్రమంతా గెస్ట్‌హౌస్‌కు దగ్గరలో సాగరతీరాన ఉన్న తిరంగా పాయింట్ దగ్గర గడిపాం. బ్రిటిష్ పాలననుండి అండమాన్ దీవులు అధికారపూర్వకంగా విముక్తి పొంది మొట్టమొదటిసారిగా త్రివర్ణ పతాకావిష్కరణ జరిగిన ప్రదేశం ఆ తిరంగా పాయింట్. 1942 ఆరంభంలో అండమాన్ నికోబార్ దీవులు జపాన్ వారి ఆధిపత్యం క్రిందకు వచ్చాయి. ఆ ఆక్రమణ 1945 చివరి దాకా సాగింది. కానీ 1943లో ఇండియన్ నేషనల్ ఆర్మీ అధినేతగా నేతాజీ బోస్ అండమాన్ ద్వీపాలకు వచ్చారు. జపాన్ అధినేతలు అండమాన్ ద్వీపాలను లాంఛనప్రాయంగా ఆజాద్ హింద్ ఫౌజ్‌కు బదిలీ చేసారు. 1943 డిసెంబర్ 30వ తారీఖున ఆ బ్రిటిష్ పాలననుంచి విముక్తి పొందిన భారతభూభాగంలో నేతాజీ బోస్ మువ్వన్నెల జెండా ఎగరవేసాడట. ఆ పతాకావిష్కరణ జరిగిన ప్రాంతంలో భారతప్రభుత్వం తిరంగా మెమోరియల్ నిర్మించింది.
చక్కని ప్రదేశం. ఆహ్లాదకరమైన వాతావరణం. పతాకావిష్కరణ వివరాలున్న శిలాఫలకాలు. నేతాజీ బొమ్మ. కూర్చోడానికి చక్కని అరుగులు. ముసిరిన చీకట్లు. వెలిగిన దీపాలు. నీటిలో వాటి నీడలు. తీరరేఖ వెంట దీపతోరణాలు. ఓ గంట చులాగ్గా, విశ్రాంతిగా గడిచిపోయింది. పదకొండు రోజులు పరుగుల పర్యటనకు అతి చక్కని ముగింపు అనిపించింది.
నవంబర్ 3. శుక్రవారం. పర్యటనలో చిట్టచివరి రోజు.
ఉదయం తొమ్మిదింటికే విమానం.
అయినా ప్రాణం నిలవక మాకు దగ్గరలో ఉన్న కార్బైన్స్ కోవ్ బీచ్‌కి ఒక అడుగు వేసి, ఉదయ భాస్కరుణ్ణి పలకరించి, పక్కనున్న గ్రామాలను పరామర్శించి, తిరిగి గెస్ట్‌హౌస్ చేరి, ఏదో స్వంత ఊరు వదిలి వెళుతున్నట్లుగా దిగులు పడుతూ ఎనిమిదింటిలోపే విమానాశ్రయం చేరుకున్నాం. ఎగిరిన విమానంలోంచి దిగువనున్న ఇళ్ల కేసి చూస్తే అవన్నీ చేతులూపి వీడ్కోలు చెపుతున్న భ్రమ. పక్కనున్న మేఘాలను చూస్తే, ‘మీరూ మేమూ ఒకటే బాణీ… మనకు స్థిరనివాసం అంటూ ఉండదు. ఈ రోజు ఇక్కడ, మర్నాడు మరెక్కడో,’ అని వేదాంతం చెపుతున్నట్లు అనిపించింది.విమానంలో కూర్చున్నంతసేపూ ఒకటే ఆలోచనలు.
“ఇది మూడవసారి కదా ఈ ద్వీపాలకు రావడం… మళ్ళీ వస్తావా?”
“తప్పకుండా వస్తాననే అనిపిస్తోంది.”
“మూడు యాత్రల్లోనూ ఏది నీకు బాగా నచ్చిందీ?”
“చెప్పడం కష్టం. అసలా ప్రశ్నే బాగోలేదు.”
మొదటిసారి 2012లో వచ్చి పద్ధెనిమిది రోజులు గడిపినపుడు ఆ యాత్రకు కుతూహలమే చోదకశక్తి. కానీ ఒకసారి వచ్చి వారం రోజులు గడిపాక, ‘ఇవి విస్మృత దీవులు కావు. విస్మరించరాని దీవులు’ అని అర్థమయింది. ప్రయాణాన్ని టూరిస్ట్ సర్క్యూట్కే పరిమితం చేయకుండా అండమాన్ ఉత్తర కొసదాకా నాలుగు వందల కిలోమీటర్లకు విస్తరించాను. భాషాపరంగా, పరమతసహనంపరంగా, సంస్కృతీసమ్మేళనాలపరంగా, మనుషుల మనస్తత్వాలు, జీవనసరళిపరంగా నేర్చుకోవలసిన విషయాలు అనేకం ఉన్నాయని బోధపడింది. నేను గ్రహించిన విషయాలను పుస్తకరూపంలోకి తీసుకు వచ్చాను.రెండవసారి 2020 లో లిటిల్ అండమాన్ వెళ్ళడం దానికదే వినూత్న అనుభవం. ఎవరూ లేని చోట, ఏ ఆందోళనలూ లేని ప్రదేశంలో, మైళ్ళ కొద్దీ విస్తరించి ఉన్న సాగరతీరాలలో, అడవులలో, గ్రామాలలో – అంతా నేనే అన్నట్టుగా తిరగడం అప్పటిదాకా నేనెరుగని అనుభవం. ఆ ప్రయాణంలో ఆ లిటిల్ అండమాన్ ద్వీపంలో ఒక కొసన ఉన్న నికోబారీ గ్రామంలో ఓ గంట గడపటం నికోబార్ ద్వీపాల మీద నా ఆసక్తిని పెంచింది. అయినా ఆ ద్వీపాలకు వెళ్ళడం సులభం కాదని తెలుసు.
అనుకోకుండా అవకాశం రవి రూపంలో వచ్చి తలుపు తట్టింది. క్షణాల్లో నిర్ణయం తీసుకున్నాను. అంతకన్నా వేగంగా జగన్ ముందుకొచ్చాడు. మాకోసమే ఎవరో చక్కని వ్యూహం పన్ని మమ్మల్ని గెలిపించినట్లు పది రోజులు తిరిగేలోగా నికోబార్ యాత్ర ఆరంభించాం.
“ఇప్పటికీ మనం నికోబార్ వచ్చామనీ పది పన్నెండు రోజులు గడిపామనీ తలచుకుంటే నమ్మశక్యంగా లేదు. రవి అంత చొరవ చేసి మన ప్రయాణం ఇంత వేగంగా, ఇంత పకడ్బందీగా ఏర్పాటు చేసిన విధానం ఆశ్చర్యంగా ఉంది,” జగన్‌తో అనలేకుండా ఉండలేకపోయాను.
“ఆశ్చర్యమేముందీ? నికోబార్ ద్వీపాలలో టూరిస్ట్‌లను ప్రోత్సహించకపోవడం వెనుక కారణం రవిగారికి స్పష్టమే. మనం ఆ కోవకు చెందమనీ బాద్యత కలిగిన యాత్రికులమనీ ఆయనకు నమ్మకం చిక్కబట్టే ఈ ఏర్పాట్లు చేసి ఉంటారు,” అన్నాడు జగన్.
నిజమేననిపించింది.
అరుదైన మనుషులకోసం, వారితో కలిసిపోవడంకోసం, ప్రకృతికోసం, అమూల్యమైన అనుభవాలకోసం నికోబార్ యాత్రకు నడుం కట్టామే కానీ అనుకోకుండా మా వెంట చందమామను తీసుకు వెళుతున్నామన్న స్పృహే లేకపోయింది… శుక్ల దశమినాడు ఆరంభమయిన మా ప్రయాణం కృష్ణపంచమి దాకా సాగింది. అన్ని రోజులూ చందమామా వెన్నెలా మాకు తోడుగా ఉన్నాయి. చిన్న చిన్న దీవులు, ఎటు చూసినా సాగరతీరం, ఆకాశంలో వెన్నెల – ఇంతకన్నా చక్కని సమయం సందర్భం ఊహించడం కష్టం.
బీచ్‌లంటే తెలియని మనుషులం కాకపోయినా కపంగ, పిల్ పిల్లోలాంటి సాగరతీరాలు, అవి మాకు అందించిన అనుభవాలు, కలిగించిన అనుభూతులూ మా ఊహలకు అందనివి. మరోసారీ మరోసారీ రారమ్మని పిలుస్తోన్న ఆ సాగరతీరాలకు ఇంకోసారి వెళ్ళకుండా ఉండగలమా? ‘నీది మరీ పక్షపాత దృష్టి, ఆమాత్రం దీవులు ప్రపంచంలో ఎన్నెన్ని ఉంటాయో,’ అంటారా – నిజమే. నేను బడుగు దీవుల పక్షపాతిని. లక్షల జనాభాతో విలసిల్లుతోన్న బ్రిస్బేన్ గోల్డ్ కోస్ట్కన్నా అలౌకిక అనుభూతిని మిగిల్చిన కపంగ సాగరతీరమే నాకు ప్రియమైనది. అక్కడి మనుషులే నాకు ముఖ్యం.
ఎన్నెన్ని అనుకోని అనుభవాలు! ఏమాత్రం పరిచయం లేని కమాండర్ నాదెళ్ళ అపురూప పరిచయం, ఎవరూ లేని చోట వినిపించిన బెంగాలీ హిందీ గీతాలు, నీరు తీసిన సముద్రగర్భంలో వానలో తడుస్తూ విహరించడం, అనుకోని చోట మాటలు రాని చిత్రకారునితో సంభాషణ, అరుదైన అందాల సూర్యోదయ-సూర్యాస్తమయాలు, వెళ్ళిన ప్రతిసారీ ఆప్యాయంగా పలకరించిన సముద్రం – అనుభవాల రాశి ఈ నికోబార్ యాత్ర.
ప్రయాణాలు మనిషి మనసును విస్తృతపరుస్తాయంటారు. అది నిజం. తన ఉనికి తనకు తెలియజేస్తాయంటారు. అదీ నిజం. ఆ అనుభవాలను దాచుకోవాలా పంచుకోవాలా? ‘ప్రయాణాలు చెయ్యి, కానీ ఎవరికీ చెప్పక’ అంటాడు ఖలీల్ జిబ్రాన్. ‘తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుం’దంటారు మన అనాది భాష్యకారులు. ‘ప్రయాణాలే జీవిత పరమార్థం’ అన్నట్టు తిరిగాడు రాహుల్ సాంకృత్యాయన్. ‘యాత్రానుభవాలను ఒకచోట రాసుకోవడం, అవి నలుగురికీ వినిపించడం యాత్రానుభవంలోని నిజమైన ఐశ్వర్యం’ అంటాడు పదిహేడో శతాబ్డపు జపాన్ దేశపు హైకూ కవి మత్సువొ బషో.
నాది బషో బాణీ.
అందుబాటులో లేని అవకాశం తలుపు తట్టినప్పుడు వెంటనే అందిపుచ్చుకున్నాను. అనుకున్నట్టుగానే అరుదైన అనుభవాలూ అనుభూతులూ మూటగట్టుకున్నాను. ఇలాంటి అవకాశం అందరికీ దొరకదని తెలుసు. కనీసం నా అనుభవాలను ఆ అందరికే పంచనైనా పంచాలిగదా…
అందుకే ఈ నికోబార్ యాత్రాగాథ.
















