కాలాయ వర్ష్మణ్యథ కంధరాయాం
పాదేఽథ మూర్ధ్న్యభ్రనదీవతే చ ।
శయ్యావతే నాగవరేణ భూషా–
వతే నమో మే మహసేఽపి కస్మై ॥(సుమనోఽఞ్జలిః నమోమహసే-1)
రూపమందేకాని, కంఠమందేకాని, నీలవర్ణము కలవాడు, పాదమందేకాని, తలయందేకాని గంగానదిని కల్గియున్నవాడును, శయ్యగాగాని, భూషణముగాగాని నాగవర్యుడు కలిగినవాడును, అట్టి మహనీయ తేజోమూర్తియగు దైవమును గూర్చి నమస్కరించుచున్నాను.
అని హరిహరులకు అభేదము కల్పించి ఈశ్వరుని తత్త్వాన్ని నిరూపించిన కవులు డా॥ కొరిడె రాజన్న శాస్త్రిగారు. ‘పుంభావసరస్వతిగా విద్వద్గణముచే కొనియాడబడుచున్నట్టి వారికి పుత్రునిగా పుట్టడము నా పూర్వజన్మకృత పుణ్యవిశేషమే! యని చెప్పుటలో నతిశయోక్తి లేదు. సంస్కృతాంధ్రములలో విద్వత్కవివరేణ్యులేగాక అనేక గ్రంథకర్తగా వ్యాఖ్యాతగా పీఠికాకర్తగా, సద్విమర్శకుడిగా, అధ్యాపకుడిగా, పౌరాణికుడిగా, నటుడిగా, అవార్డు గ్రహీతగా తెలంగాణాకే తలమానికమని పండితవరేణ్యులు ఎరిగినదే!
జన్మస్థలము – జీవిత విశేషాలు
దక్షిణవాహినియగు గోదావరీ నదీవీచికలతో పావనముచేయు ధర్మపురీ పుణ్యక్షేత్రము శ్రీ నృసింహ, రామలింగేశ్వరులకు ఆలవాలమై హరిహర క్షేత్రముగా ప్రసిద్ధినొందినది. సనాతన ధర్మానికి పట్టుకొమ్మయగు ఈ క్షేత్రము వేద సంస్కృతులకు కాణాచి. ఇట్టి పుణ్యక్షేత్రమున శ్రీముఖ నామ సం॥ జ్యేష్ట శుక్ల నవమి తేది. 2.6.1933 భృగువాసరమున నిరంతర శివార్చనా తత్పరులగు భారద్వాజస గోత్రీయులు బ్రహ్మశ్రీ కొరిడె కిష్టయ్య, గంగూబాయమ్మ దంపతులకు మా నాన్నగారు జన్మించిరి. అప్పటికే జ్యేష్ఠపుత్రశోకముతోనున్న మా తాతగారికి, అట్టి దుఃఖాన్ని పోగొట్టి ఆనందాన్ని కలిగించిరి. చిన్ననాటనే వేదసంస్కృతములను ప్రాచీన విద్యాపద్ధతిని అభ్యసించిరి. స్థానిక సంస్కృత పండితులు కీ॥శే॥ బ్రహ్మశ్రీ తాడూరి బాలకృష్ణశాస్త్రిగారి వద్ద ఆనాటి కాలముననే అనేకులు శిష్యులుగా చేరి కావ్యశాస్త్రపురాణాదులు సభ్యసించుచుండిరి. అట్టి శాస్త్రిగారి వద్ద నాన్నగారు శిష్యుడిగా చేరి “పువ్వు పుట్టగానే పరిమళించును” అన్న తీరులో కావ్యారంభమునుండే తన సూక్ష్మగ్రాహిత్వమును ప్రకటించుకొని గురువుగారి మన్ననలను పొందియున్నారు. ప్రతిరోజు మహాన్యాసముతో శ్రీరామలింగేశ్వరుని ఆర్చించుటయేగాక, నృసింహాలయములో పంచోపనిషత్తులు సస్వరముగా చెప్పుటలో వైదిక పండితులు మెప్పునొందినారు. ఇట్లు శివకేశవులయందు భక్తిప్రపత్తుల చిన్ననాటనే పెంపొందించుకొని యున్నారు.
శ్రీహర్ష నైషధీయముతో సహ పంచకావ్యములను, ప్రతాపరుద్రీయాది సాహిత్యశాస్త్రగ్రంథములను వ్యాకరణ, న్యాయ, వేదాంతశాస్త్రములను సవ్యాఖ్యానముగా కంఠస్థము చేసి, పరీక్షించువారిని ఆశ్చర్యచకితులను చేసెడివారు. విద్యార్థిదశయందే, ప్రసిద్ధులైన శాస్త్రిగారొకరు తన పురాణ ప్రవచనమునందు శ్లోకభావము తప్పుగా చెప్పుట గుర్తించి తెలుపగా సహృదయుడు, పండితోత్తముడు అగు ఆ శాస్త్రిగారు తన దోషమును గుర్తించిన బాలుడైన మా నాన్నగారిని చూచి ఆశ్చర్యపడి దోషము దిద్దుకొని ఆశీర్వదించిరి. చిన్ననాటినుండి పురాణశ్రవణమునందు ఆసక్తుడై ప్రసిద్ధ పౌరాణికుల పురాణములను వినుచుండెడివారు. వారి పెద్దనాన్నగారగు బ్రహ్మశ్రీ గుండి రాజన్నశాస్త్రిగారి వద్ద అనేకమార్లు శ్రీమద్భాగవత సప్తాహ పురాణములను విని పౌరాణిక విశేషాంశములను గ్రహించెను. బ్రహ్మశ్రీ పాలెపు వెంకటరాజ శాస్త్రిగారు పురాణప్రవచనము చేయగా సంస్కృతభారతం మొదటినుండి శాంతిపర్వమువరకు శ్రవణము చేసిరి. వారు పురాణ ప్రవచనమున నీలకంఠవ్యాఖ్యా విశేషాంశములను గూడ విశదీకరించెడివారు.
“వివాహెూ విద్యానాశాయ” అని లోకోక్తి కేవలం అల్పుల విషయములో మాత్రమే అని నిరూపించునట్లుగా పదకొండు, పండ్రెండు సంవత్సరముల ప్రాయములోనే బ్రహ్మశ్రీ తాడూరి శివరామయ్యగారి కుమారుడైన తాడూరి లక్ష్మీనర్సింల గారి కన్యకయైన ల॥సౌ॥ సులోచనాదేవితో పెండ్లియయ్యెను. పెండ్లినాటికి మా అమ్మ వయస్సు 5-6 వత్సరములు మాత్రమే.
చిన్ననాటినుండి తాను నేర్చుకున్న విద్యను తన తోటివారికే కాక తమ్ముడైన శ్రీ నర్సయ్యగారికి (ప్రస్తుతం అడ్వకేటుగా పనిచేయుచున్నారు. హిందీలో ఎమ్.ఎ.పి.హెచ్.డి. కూడ చేసియున్నారు) మా మేనత్త (తనకు చెల్లెలు) ల॥సౌ॥ అన్నపూర్ణగారికి, నేర్పుతుండెడివారు. ఇంకెందరో శిష్యులు కావ్యపాఠమునకై వచ్చెడివారు. వారికి రఘువంశ-నైషధ- ఉత్తరరామచరితాభిజ్ఞానశాకుంతల కావ్యనాటకములను బోధించేడివారు. గ్రామములో అప్పటికి ఇంగ్లీషు విద్యాభ్యాసము లేకుండెను. మా తాతగారు (విద్యాకమిటీ సభ్యుడు) తన స్నేహితబృందం, గ్రామపెద్దలతో కలిసి ఆర్థికభారమును కూడ భరించి పాఠశాల స్థాయిని పెంచి 8-10 తరగతులు ఏర్పాటుకు సిద్ధపరిచిరి. “ఐతే ఉపాధ్యాయుడిని ఒకరిని మాత్రము మీరు నియమించుకొనవలె”నన్న ప్రభుత్వము వారి నిబంధనకు కట్టుబడి, పాఠశాలావిద్యాకమిటీ వారు కోరగా ఐచ్చిక విషయమగు సంస్కృతమును మూడు సంవత్సరములు ఉచితముగా బోధించుటకు నాన్నగారు సిద్ధపడిరి. ఆ కాలముననే తాను చదివిన చదువునకు విశ్వవిద్యాలయము గుర్తింపునకై పరీక్షలు అవసరమని గమనించిరి. సుమారు 24సం॥ల వయస్సులో పరీక్షలు ఇచ్చుటకు సిద్ధపడిరి. తెనాలి వాస్తవ్యుడైన శ్రీ సుబ్బరామశాస్త్రిగారు ఇక్కడికి తెలుగుపండితులుగా వచ్చినారు. వారి ప్రోత్సాహముతో గవర్నమెంట్ ఎంట్రన్స్ పరీక్ష తెనాలిలో వ్రాశారు. గ్రంథములన్ని ఆమూలాగ్రముగా కంఠస్థంగల వీరిని చూచి అక్కడి ఇంటివారు ఆశ్చర్యపోయిరి. 1957లో, నాన్నగారు పరీక్షావిధానములో ధర్మపురి నగరమునుండి ప్రథమశ్రేణిని తేలికగా సాధించిన మొదటి వ్యక్తియైనారు. 1959లో విద్యాప్రవీణ (ప్రీవియస్) పూర్తిచేసి 1960లో జిల్లాపరిషత్ కరీంనగర్ వారిచే సంస్కృతపండితునిగా నియమితులై, సుల్తానాబాద్ హైస్కూల్లో చేరిరి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మా చిన్ననాన్నగారు కూడా అదే ఆర్డర్లో హిందీ పండితులుగా సుల్తానాబాద్ స్కూల్లోనే నియమితులైరి. అన్నదమ్ములు ఇద్దరు కొత్తప్రదేశమునందు ఒకరికినింకొకరు తోడైయుండిరి. నిజమునకు ప్రభుత్వ ఉద్యోగములన్న ఆసక్తి లేకున్నను సాధించవలెనన్న తలంపుతో చేరిరి. సాహిత్యవిద్యాప్రవీణ ప్రీవియస్ పరీక్షతోనే ఉద్యోగములో చేరిన మా నాన్నగారు క్రమముగా విద్యాప్రమాణములను పెంచుకొనుటకై ఎమ్.ఎ. తో సమానమైన సాహిత్యవిద్యాప్రవీణ (ఆంధ్రా యూనివర్సిటీ) ఫైనల్ పరీక్ష పూర్తిచేసిరి. నిరంతర కృషిచే క్రమముగా బి.ఓ.ఎల్., ఎమ్.ఒ.ఎల్., ఎమ్.ఎ., పిహెచ్.డి. డిగ్రీలు సాధించినారు.
ఏ విశ్వవిద్యాలయ పట్టము లేనికాలముననే వివిధ సంస్కృత పత్రికలలో ప్రచురింపబడిన కవితలు, సాహిత్యవిమర్శవ్యాసములు దృష్టియందుంచుకొని ‘సంస్కృతమ్’ (సాప్తాహికం- అయోధ్యా) వార్షికోత్సవ సందర్భమున 1956 సంవత్సరమున, పూరీ గోవర్ధన పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారిచే ‘సాహిత్యరత్న (సంస్కృతం)’ బిరుదు ప్రదానము చేయబడి సత్కృతులైరి. 1964 సం॥లో కేంద్రప్రభుత్వము వారి స్కీము. ‘Research scholarship to the products of Traditional Sanskrit Pathashalas’ ప్రకారం కేంద్రప్రభుత్వంవారిచే పరిశోధనకై నియమించబడి, ఉస్మానియా విశ్వవిద్యాలయము వారి సంస్కృత అకాడమీయందు ధర్మసూరి రచించిన ‘సాహిత్యరత్నాకరము’ను ‘నౌకా’, ‘మందర’ వ్యాఖ్యానములతోపాటుగా పరిశోధనమునకై గ్రహించి, అవసరానుగుణముగా స్వ-లఘువ్యాఖ్యను కూడ చేర్చి సమగ్రముగా, సవిమర్శనాత్మకముగా పరిష్కరించియున్నారు.
నాన్నగారి గురించి డా॥ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు “అలంకారశాస్త్రములో సరియైన అవగాహన ఉన్న అంగుళీపరిగణనీయులైన ఆంధ్రులలో డా॥ శ్రీ రాజన్నశాస్త్రిగారు ఒకరు. ధర్మసూరి రచించిన సాహిత్యరత్నాకరాన్ని నౌకామందర వ్యాఖ్యానములతో పరిష్కరించి, ఆవశ్యకస్థానములలో పాండితీ సమంచితాలైన టిప్పణులే కాక, ఆయా విషయాలపై పరిశోధకపత్రాలను కూడ ప్రచురించిన డా॥ శ్రీ శాస్త్రిగారి అలంకారశాస్త్రవైదుష్యం విద్వల్లోక విదితమే!” అని ధ్వని-మనుచరిత్ర పీఠికలోని తన ‘ప్రరోచన’లో పేర్కొన్నారు. ఆ గ్రంథము సంస్కృత అకాడమీ (ఉస్మానియా) వారిచే 3 భాగములుగా ముద్రితమైనది. నిజమునకు ఆనాడే పిహెచ్.డి., పొందవలసిన పరిశోధన అది; కాని ఉస్మానియా విశ్వవిద్యాలయ నియమానుసారము Ph.D డిగ్రీకై రిజిస్ట్రేషన్ చేయనందున డాక్టరేట్ అప్పుడు పొందలేక పోయిరి. 1964-1966 వరకు ఈ పరిశోధన గావించి, తిరిగి కరీంనగర్ జిల్లాపరిషత్తునందు ప్రథమశ్రేణి తెలుగుపండితులుగా ప్రమోషన్ పొంది రాయకల్, చొప్పదండి, ధర్మపురి, బండలింగాపురములలోని ఉన్నతపాఠశాలలో విద్యాబోధనలతో విద్యార్థులను కృతార్థులను గావించిరి.
1972 సెప్టెంబరులో సికింద్రాబాదుని సర్దార్ పటేల్ డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా చేరిది. డా॥ దివాకర్ల వేంకటావధానిగారి మార్గదర్శకత్వమున ఉస్మానియా విశ్వవిద్యాలయమునందు “ధ్వని- మనుచరిత్రమున దాని సమన్వయము – అను అంశమున పరిశోధన గావించిరి. పలువురు అలంకారికులు చెప్పిన కావ్యశాస్త్రమంతయు ఈ గ్రంథమున పిండీకృతమైనది. ధ్వని సిద్ధాంతగ్రహణ విషయములో సంస్కృతాంధ్ర విద్యార్థులకు తోడ్పడు గ్రంథమును వ్రాసిరి. 1980 సెప్టెంబరులో డాక్టరేట్ అవార్డు గ్రహించిరి.
అటు పిమ్మట 1981లో ఉస్మానియా విశ్వవిద్యాలయము వారిచే నిజాం కళాశాల ఉపన్యాసకుడిగా నియమించబడిరి. 1986లో విశ్వవిద్యాలయము వారిచే రీడర్‌గా నియమితులైరి. 1993 జూన్ 30 న 60సం॥ నిండి యున్నందున విశ్వవిద్యాలయ నియమానుసారముగా “రిటైర్” అయియున్నారు. బహుపురాణ ప్రవచన సంతుష్టులైన శ్రీ శృంగేరీజగద్గురువులచే ఆస్థానపండిత పురస్కారము గైకొనిరి.
1. ప్రాచీన పద్ధతిచే సంప్రదాయబద్ధముగా సంస్కృత సాహిత్యాది శాస్త్రములనభ్యసించి పాండిత్యశిఖరమును అధిరోహించుటయే కాక ‘మధురవాణీ’, ‘సంస్కృతమ్’ మొదలైన ప్రముఖ సంస్కృత పత్రికలలో కవితలు విమర్శనాత్మక వ్యాస ప్రకటించియున్నందుకుగాను నాన్నగారి ప్రతిభను గుర్తించి అయోధ్యయందలి ‘సంస్కృతమ్’ (సాప్తాహిక సంస్కృతపత్రిక) వార్షికోత్సవ సందర్భముగా పూరీ గోవర్ధన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్యులవారు “సాహిత్యరత్నమ్” (విక్రమ సం. 2014; 1956 A.D) అను బిరుదమును ప్రదానము గావించియున్నారు.
గాంధీశతజయంతి సందర్భముగా ‘సంస్కృతకవిత, తారావళి:’కి కరీంనగర్ జిల్లాపరిషత్తు అవార్డును, ఆనాటి విద్యామంత్రి శ్రీ పి.వి. నరసింహారావుగారి చేతుల మీదుగా స్వీకరించియున్నారు.
ఇంకను అధ్యాపక వృత్తిని స్వీకరించి తమ వాక్చాతుర్యముతో, పాండిత్యప్రకర్షతో పలు శిష్యబృందములను కృతకృత్యులను గావించినందుకుగాను హైద్రాబాద్‌లోని ‘సారస్వత జ్యోతి మిత్రమండలి’ వారు 1992 లో “ఉత్తమ అధ్యాపక” పురస్కారము గావించి సత్కరించిరి.
సంస్కృతభాషాసాహిత్యసేవలకు గుర్తింపుగా ‘ఉత్తమ సంస్కృత హిందూపురము స్వర్ణభారతీపురస్కారము’ లభించినది (తేది. 12-04-1998). ఉత్తమ సంస్కృతపండితుడిగా తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాద్ వారిచే ‘ప్రతిభా పురస్కారం’ గావించబడినది (1999).
హైదరాబాద్‌నందలి దివాకర్ల సాహితీ ట్రస్టు వారిచే నాన్నగారి ఉభయభాషల సేవలను గుర్తించి ‘దివాకర్ల సాహితీ పురస్కారము’ గావించబడినది.
రచనలు
- ‘సుమనోఽంజలిః’ అను సంస్కృతకవితల సంపుటి ముద్రితము. ఇందు 1972 వరకు విభిన్నపత్రికల ద్వారా, రేడియో స్వీయకవితాగానముల ద్వారా, కవి సమ్మేళనము ద్వారా ప్రకటించబడిన కవితలు గలవు. ఇందు ప్రధానమైనది: శ్రీ ధర్మపురీ పుణ్యక్షేత్రమునందు వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము, మంగళాశాసనము. ఇది ఆనాటినుండి నేటికీ దేవస్థానమునందు ప్రభాతవేళ గానము చేయబడుచున్నది. 1973 లో ఈ సంపుటి ముద్రితము.
- ‘కవితా విపంచీ’ 1972 తరువాత వెలువరించబడిన సంస్కృత కవితల సంకలనము 1999 లో ముద్రితము.
- ‘వసుమతీ సుధాకరమ్’ (సంస్కృత నాటకము). రేడియో ద్వారా 1973లో ప్రసారితమైనది. సంస్కృత భారతి పత్రికద్వారా ధారావాహికముగా ముద్రితము. (1990)
- ‘సంస్కృతపథప్రదర్శిని’ తెలుగు వారికి సంస్కృతవ్యాకరణము నేర్చుకొనుటకు అనుకూలముగ వ్రాయబడిన గ్రంథము; సురభారతిసమితి (హైద్రాబాద్) ద్వారా ముద్రితము – (1993).
- ‘బాల ప్రౌఢవ్యాకరణ వ్యాఖ్యానము’ ఉస్మానియా విశ్వవిద్యాలయమువారి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎమ్.ఎ. తెలుగు విద్యార్థులకై వ్రాయబడినది. అది ఆ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ వారిచే 1992 లో ముద్రించబడినది.
- ‘దేవీభాగవతము’ (మూడు స్కంధములు) తెలుగునందు అనువదించబడినది. శ్రీ విద్యా సేవాసమితి, సికింద్రాబాద్ వారిచే ముద్రించబడినది. రెండుసార్లు 1975 మరియు 1984).
- ఆనందరామాయణము (సారకాండము) తెలుగువ్యాఖ్య (తాత్పర్య విశేషాంశములు). ఆరాధన పత్రిక యందు అనుస్యూతముగా (సీరియల్) వెలువరించబడినది. సెప్టెంబర్ 2001 నుండి డిశంబర్ 2003 వరకు,
- ఆంధ్ర మహాభారతము ద్రోణపర్వము పంచమాశ్వాసమునకు తెలుగు వ్యాఖ్య (ప్రతిపదార్థతాత్పర్య విశేషాంశములు) గ్రంథరచన 1995, (తి.తి. దేవస్థానం వారిచే ముద్రించబడినది .)
- “సంస్కృతసాహిత్యరత్నాకరః” (ధర్మసూరి విరచిత – అలంకారశాస్త్ర గ్రంధము) పరిశోధించి స్వవిరచిత టిప్పణితో వెలువరించబడినది. ఇది మూడు భాగములుగా ఉస్మానియా విశ్వవిద్యాలయమువారి సంస్కృత అకాడమీ వారిచే ముద్రితమైనది.
- ‘మనుచరిత్రము’ (1988) Ph.D. సిద్ధాంత గ్రంథము. 9 ప్రకరణముల ఈ గ్రంథమునందు ఎనిమిది ప్రకరణములు ధ్వనిని గురించియే కాక, అలంకార శాస్త్రానికి సంబంధించిన అనేక విషయములు విశదీకరించినవి. ఒక (ఎనిమిదవ) ప్రకరణమునందు మనుచరిత్రమునందలి ధ్వనిభేదములు సోదాహరణముగా నిరూపించబడినవి. అందుకే డా॥ పుల్లెల రామచంద్రుడు గారు “ఈ గ్రంథము తెలుగు విద్యార్థులకే కాకుండా సంస్కృత విద్యార్థులకు, ఆంధ్ర సంస్కృతోపాధ్యాయులకు కూడా ధ్వనిసిద్ధాంతగ్రహణవిషయములో తోడ్పడగలదని నా దృఢ విశ్వాసము,” అని తమ అభిప్రాయమును పేర్కొనినారు. “ఇన్నాళ్ళకు మనుచరిత్రలోని వృత్తి అలంకార రసధ్వని వ్యంగ్యాది సాహిత్యశాస్త్రమర్యాదలన్నింటికీ లక్ష్యలక్షణ సమన్వయము చెప్పే వ్యాఖ్యానప్రాయమైన సిద్ధాంతగ్రంథము వెలువడింద”ని డా॥ బిరుదురాజు రామరాజుగారు ప్రశంసించియున్నారు.
- ‘నిబంధ రత్న సముచ్చయః’ (సంస్కృత వ్యాససంకలనము) గత 2003 సంవత్సరం అక్టోబర్ మాసంలో ముద్రితమైన గ్రంథము. గత 45, 50 సంవత్సరములుగా వివిధ ప్రసిద్ధ సంస్కృతసంచికలలో ప్రచురించినవి, ఆలిండియా రేడియో, హైద్రాబాద్ ద్వారా ప్రసారితమైనవియగు సంస్కృత నిబంధములను (వ్యాసములను) ఒక చోట క్రోడీకరించినట్టి వ్యాస సంపుటి. 2003.
- “నలచరితమ్” సంస్కృత నాటకం. సురభారతీ సమితి, ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్, హైదరాబాద్ వారిచే 2007 అక్టోబర్‌లో ముద్రితము. ఈ నాటకము శ్రీ ఏ.సీ పీ శాస్త్రిగారి తెలుగు నాటకమునకు సంస్కృతానువాదము. శాతవాహన విశ్వవిద్యాలయంవారి ప్రీ-డిగ్రీ కోర్సు (తెలుగు) కోర్సు సిలబస్ పాఠ్యాంశ పుస్తకంగా నిర్ణయించబడినది.
సారస్వత సేవ
ఒక అధ్యాపకుడిగా శిష్యబృందమునకు విద్యాదానముగావించుటయే ప్రధానవృత్తిగా స్వీకరించిననూ చిరకాల పఠన, పాఠన, పరిశోధనా ప్రావీణ్యం, సంస్కృతాంధ్ర భాషా లక్షణ లక్ష్యసారఙ్ఞత, వ్యాకరణాభిజ్ఞత, విజ్ఞత, రసజ్ఞత నాన్నగారిని ఊరకనే కూర్చొనివ్వలేకుండినవి.
అందుకే కవిగా, రచయితగా, సద్విమర్శకుడిగా పీఠికాకర్తగా, వ్యాఖ్యాతగా, సముద్ధండపండితుడిగా, అనేకానేక ముద్రితాముద్రిత సుమనోఽంజలులను (రచనలను) సారస్వత సేవకు వినియోగించుచునేయున్నారు. అచార్య దివాకర్ల వేంకటావధాని నాయకత్వమున అనేక సాహితీ ప్రముఖ పండితగణముతో కలిసి 1974. సం॥ నుండి భువనవిజయము, నన్నపార్యుని భారతావతరణము, శ్రీనాథుని కనకాభిషేకము. మొ॥ సాహిత్య రూపకములందు నటులుగా సాహితీసేవను చేసియున్నారు.
మాన్యులచే పురస్కార గ్రహీత:
ఆనాటి ముఖ్యమంత్రులైన జలగం వెంగళరావు, చెన్నారెడ్డి, ఎన్.టి.రామారావు మొదలుకొని స్వర్ణాంధ్రనిర్మాతయైన శ్రీ నారాచంద్రబాబు నాయుడువరకు గల ముఖ్యమంత్రులనుండి మరియు ఆనాటి విద్యాశాఖామంత్రి, మాజీ ప్రధానమంత్రియైన శ్రీ పి.వి. నరసింహరావుగారినుండి కూడ ఉత్తమకవిగా, పండితునిగా పురస్కారములు గ్రహించియున్నారు.
తాను ధర్మసూరియొక్క సాహిత్యరత్నాకరాన్ని, నౌకామందర వ్యాఖ్యానాలతోపాటుగా పరిష్కరించినపుడు మూలములోని శాస్త్రవిషయములతో తానేకీభవించని విషయాలను, అవి ఎందుకు విరుద్ధములుగా చెప్పదగియున్నవో ఎత్తిచూపి సద్విమర్శక లాక్షణికులుగా పండితుల మన్ననలను పొందియున్నారు. సాహిత్యరత్నాకరమునందు ఒకచోట ‘తస్మాత్ పర్వత నాథసూరి‘ 1/28 శ్లోకమునందు మూలమున తెలుపబడినట్లు ‘యల్లమాంబా వియద్గంగా, లసద్గుణమణేః‘ అనుచోట్ల రూపకాలంకార మనుదానిని సశాస్త్రీయముగా ఖండించి, సావయవ ఆర్థీ ఉపమాలంకారముగా నిరూపించుట పలువురు విద్వాంసులను ఆశ్చర్యచకితులుగాను, పునరాలోచనాపరులుగాను చేసియున్నది. అదే ప్రకారం, మూలమును సమర్థించి దోషాపవాదమును తొలగించుటకు తనవంతు కృషి కూడా కావించినాడు.
మనుచరిత్రలోని ప్రవరుని హిమవన్నగ ప్రయాణకాలము గురించి బహుకాలమునుండి విమర్శకలోకమున చర్చ సాగినది. వైదిక సంప్రదాయమునకు దర్పణమువంటి జీవితానుభవము గలవాడైనందున పై విషయము గురించి క్షుణ్ణముగా చర్చించి పెద్దనార్యుని సమర్ధించినారు. (చూ. ధ్వని-మనుచరిత్రము అనుబంధము) ఇది 1987 లో ఎ.పి. ఓరియంటల్ కాన్ఫరెన్స్‌లో చదివి, పండితుల హర్షామోదమునందుకున్నారు.
ఇదియే కాక భర్తృహరేః విజ్ఞానశతకం నామ చతుర్ధం శతకం అని, త్రిశతికర్తగా ప్రసిద్ధినొందిన భర్తృహరి చతుర్థశతకమును అదే కాన్ఫరెన్స్‌లో ప్రకటించి సభ్యులను ఆశ్చర్యపరిచియున్నారు.
ఇట్లే హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వారి కాన్ఫరెన్స్‌లో తిక్కన – అనుసృజన కౌశలమును గురించి, మరియు ఉస్మానియా యూరివర్సిటీ వారి “హైద్రాబాద్ నాలుగు శతాబ్దాల తెలుగు సాహిత్యవికాసం” జాతీయసదస్సులో తెలంగాణాలో అచ్చ తెలుగు కవుల గురించి ప్రసంగించియున్నారు.
పుట్టపర్తి సాయిబాబా వారి రామాయణ కాన్ఫరెన్స్ (1977) లో ఉత్తరకాండముపై ప్రసంగించి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శుభాశీస్సుల నందుకొన్నారు.
‘వసుమతీసుధాకరమ్’ అను సంస్కృత నాటకమును వ్రాసి భూసంస్కరణలను కొనియాడుచు సాంఘిక దురాచారమైన వరదక్షిణను నిరసించియున్నారు. ఈ నాటకము హైద్రాబాద్ ఆల్ ఇండియా రేడియో ద్వారా 30-10-1975, 9.30 బ్రాడ్కాస్ట్ కాగా, ‘సంస్కృతభారతి’ లో సంస్కృతభాషా ప్రచారసమితివారు ముద్రించియున్నారు. (1989).
ఉత్తమకవిగా ప్రశస్తి
ఇరువది సంవత్సరముల ప్రాయమునాటికే వ్రాసిన అనేక కవితలు పలు సంస్కృతపత్రికలలో ప్రచురించబడినవి. సాధారణముగా నాన్నగారి కవిత్వము ధ్వని ప్రధానమైనది. అన్యాపదేశముగా ఉంటుంది. వర్ణనాంశము చమత్కార ప్రధానముగా ఉంటుంది. (తార్కాణముగా చూడండి (1) సుమనోంజలి (1973) (2) కవితా విపంచీ (1999).
అందుకే వారి కవిత్వము గురించి ప్రముఖ పండితులు కీ॥శే॥ డా॥ బి. ఆర్ శాస్త్రిగారు, ప్రొఫెసర్, డిపార్టుమెంట్ ఆఫ్ సంస్కృత్ ఉస్మానియా యూనివర్సిటీ హైద్రాబాద్, తమ అభిప్రాయములో
‘అస్య కవేర్భణితయో భారవిమాఘాదీనాం పూర్వసూరీణాం కావ్యవిలసితాని స్మారయన్తి |
అస్య వాణీ శ్లేషయమకోపమోత్రేక్షా సమాసోక్త్యాదిఖిరలంకృతా ప్రకాశతే’
అని ప్రశంసించియున్నారు.
శ్లేషప్రధానమైనదిగా వ్రాయబడిన ‘హరిహరస్తుతిః’ 1954 సంవత్సరమున (తన 21 సంవ. ప్రాయమునందే అయోధ్యనుండి వెలువడే సంస్కృతసాప్తాహికమైన సంస్కృతమ్ అను పత్రికయందు వెలువడినది. ఈ కృతియే ‘నమో మహసే’ పేరిట ‘సుమనోఽంజలి’ యందు ప్రకాశింపజేయబడినది. (దీనినుండే వ్యాసారంభ శ్లోకము ఉదహరించబడినది).
ఇందు హరిహరులకు నభేదము తెలియజేయుచూ, భక్తిని ప్రదర్శించుటయే కాక, శివకేశవులు భిన్నులని తలంచి పరస్పరము కలహించుకొనువారి నోటికి తాళము వేసియున్నారు. చిన్ననాటినుండి హరిహర క్షేత్రమైన ధర్మపురి యందుండుటవలననూ, హరిహరులను భక్తితో పూజించుటవలననూ ఈ ఖండిక ఉద్భవిల్లుటకు కారణమయ్యెను.
ఇంకను ‘కాళేశ్వర ప్రస్తుతిః (కవితా విపంచీ) యందు శివస్తవమును, ‘శ్రీ చక్రరాజనిలయాం కలయే హృదబ్జే’యందు శ్రీదేవీస్తుతిని, ‘గణ నాయకతత్త్వ’మందు గణేశుని తత్త్వమును తెలుపుచూ భక్తి కవితా ఖండికలు, అట్టి కవితలు ఇంకెన్నో వెలువరించియున్నారు. ‘హరిహరస్తుతిః’ (నమో మహసే) కవితయే ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ సుప్రభాతమునకు పూర్వరంగమైనదిగా తలంచవచ్చు.
దైవభక్తియైనా, దేశభక్తియైనా నాన్నగారి కవిత్వమునందు ఒక విశిష్ట స్థానము గలదైయుండును. అందునా సహజముగానే ధ్వని అన్యాపదేశము ప్రధానమైనట్టిదే కదా! అందుకే ‘గణనాయకప్రస్తుతి’యందు ఒక వంక గణేశ్వరుని స్తుతించుచునే అన్యాపదేశముగా రాజకీయ నాయకుల పద్ధతిని తెలిపియున్నారు. మచ్చునకు ఒక శ్లోకము పరిశీలించండి.
శ్లో. అధితిష్ఠన్నుచ్చపదం
రూపకళా ఖర్వగర్వ యుక్తశ్చ |
పరిభూయ త్వాం ద్విజపతి–
రాప్తశ్చాదర్శనీయతాం సద్యః॥(కవితా విపంచీ)
ఉన్నత పదమునందు ఉండి రూపకళా గర్వితుడైన చంద్రుడు వినాయకుని చూసి అవమానము గావించుచూ నవ్వి ప్రజాదరణము కోల్పోయెను, అని వినాయక స్తుతి రూప ప్రస్తుతార్ధమును వర్ణించుచూ, అతి గర్వితుడైన వాడు ఉన్నత పదవియందున్ననూ, నిమ్నశ్రేణి (రాజకీయ) నాయకులను అవమానించిన అధఃపతనము పొందగలడని హెచ్చరిక అన్యాపదేశము ద్వారా చేసియున్నాడు.
దేశభక్తి గలవాడై ‘సమైక్యం’, ‘స్వతంత్రభారతమ్ అనుకృతిః’వంటి ఖండికలు వ్రాసియున్నారు. దేశ నాయకులైన ‘మహాత్మగాంధీ’, ‘జవహర్ లాల్ నెహ్రూ’, ‘డా. సర్వేపల్లి రాధాకృష్ణన్’లను ప్రశంసించుచూ ‘తారావళిః’, ‘ప్రశస్తి నవరత్నాని’ వంటి లఘుకావ్యములను వ్రాసి ఆయా సందర్భాలలో కవిసమ్మేళనములందు చదివి ప్రశంసలను అందుకొన్నారు.
వివిధ విషయములపై వ్యంగ్యరచనలు గావించి, సామాజిక రుగ్మతలపై ధ్వజమెత్తియున్నారు. 1971లో ‘శర్వరీ’ యను కవితలో చలికాలపు రాత్రిని ప్రసూతమైన స్త్రీతో పోలుస్తూ కుటుంబనియంత్రణను సమర్ధించియున్నారు. 1981లో ‘మధుపవిగీతిః’ యను కవితయందు తుమ్మెదను వర్ణిస్తూ అన్యాపదేశముగా మద్యపానాసక్తుడి దుఃస్థితిని తెలిపి, మద్యపాన నిషేధావశ్యకతను తెలిపియున్నారు. కాలాన్ని సంబోధిస్తూ ‘కాలవిలసితం’ అను కవితలో వరకట్న సమస్యను వర్ణించియున్నారు. ‘పరపుష్టదశకం’ అనుకవితలో కోకిలను వర్ణిస్తూ అన్యాపదేశముగా నేటి రాజకీయనాయకుల నయవంచనను తెలిపియున్నారు. ‘బలిపుష్టవిలసితమ్’ లో వాయసమును (కాకిని) వర్ణిస్తూ అవినీతిపరుల ఆగడాలను అన్యాపదేశముగా ఎత్తిచూపి యున్నారు.
ఇట్లనేక విషయాలపై అన్యాపదేశముగా ధ్వజమెత్తియున్నారు. అందుకే వీరి కవితలను ప్రశంసించుతూ కీ॥శే॥ విద్వచ్చిరోమణి బ్రహ్మశ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రిగారు (ఆనాటి హైద్రాబాద్ ఆకాశవాణి కార్యనిర్వహణాధికారి) ‘బహుషు సర్వేషు వర్తమానకాలికాః విషయాః శ్లేషోక్తిభిః వ్యంగ్యమర్యాదయా, అన్యాపదేశేన, క్వచిత్ సాక్షాచ్ఛ నిపుణముపవర్ణితాః కవేరస్య వాగతీవార్థగాంభీర్యవిలసితా. వక్రోక్తిసుందరా హాస్యరసభూయిషా చ సతీ సచేతసాం చేతసి చమత్కారమాదధాతి । …. కింబహునా నిపుణోఽయం కవిః, నిర్గలద్రసపిచ్చిలార్థం చేదం కావ్యమ్’ అని పేర్కొన్నారు. (సుమనోఽంజలిః, పీఠికలో) కవితలన్నియు పలు పత్రికలలో ముద్రితములైనవి. అట్టివాటినన్నిటిని ఏకత్రీకరణ చేయుటకై 1973లో కొన్నింటిని సుమనోజంజలిః పేరిట ముద్రించబడగా 1999లో మరికొన్ని ‘కవితావిపంచీ’ పేరిట స్వయముగా ముద్రించి యున్నారు. సుమనోంజలిని ప్రశంసించుతూ డా॥ బి. ఆర్. శాస్త్రిగారు –
అకల్పితం స్నిగ్ధదృశా కవిరాజన్నశాస్త్రిణా!.
కల్పతాం విబుధప్రీత్యై స ఏష సుమనోఽఞ్జలిః.
అని పేర్కొన్నారు.
డా. పుల్లెల శ్రీరామచంద్రుడుగారు కూడా నాన్నగారి కవిత్వమును- ‘నిస్సంశయమియం కవితా ప్రాచీనకవితాభ్రాన్తిమేవ జనయేత్ సహృదయానామ్’ అని ప్రాచీనకవులు కావ్యరచనను స్ఫురింపజేయునని ప్రశంసించియున్నారు.
డా. రాజేంద్ర మిశ్ర (Professor and Head, Sanskrit Dept, H.P. University, Shimla) గారిచే ‘భవన్తః కవిరాజరాజముకుట కల్పా అర్వాచీనసంస్కృతకవితాఽలంకారభూతాః’ (7.7.2001 లో వ్రాసినలేఖ) అని ప్రశంసింపబడిన మా నాన్నగారి కవితల పరిచయం, వారి సంపాదకత్వముననే వెలువడిన వింశతి శతాబ్దియ సంస్కృత కావ్యామృతం (ప్రథమో భాగః) అను గ్రంథమున చేయబడినది. ఈ గ్రంథము దిల్లీ ప్రభుత్వము వారి ఢిల్లీ సంస్కృత అకాడెమీ (న్యూదిల్లీ) వారిచే ప్రచురింపబడినది (2000).
సాగర్ విశ్వవిద్యాలయ సంస్కృతవిభాగాధ్యక్షులు ఆచార్య రాధావల్లభ త్రిపాఠి సంపాదకత్వమున వెలువరించిన షోడశీ (1992) (భారతదేశమునందలి 16 మంది సుప్రసిద్ధ సంస్కృతకవుల కవితాసంకలనము) యందు నాన్నగారి మూడు కవితలు (‘పరపుష్టదశకమ్’, ‘బలిపుష్టవిలసితమ్’, ‘సాయం’) సాహిత్యఅకాడెమీ న్యూదిల్లీ వారిచే ప్రచురింపబడి అఖిల భారత కవితాఖ్యాతిని తెచ్చినవి అనుటలో సందియము లేదు.
ధర్మపురీ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సుప్రభాతము
అతిపురాతన పుణ్యక్షేత్రమైన ధర్మపురీ పట్టణము నవ నరసింహక్షేత్రములలో నొకటిగా ప్రసిద్ధినొందినది. అట్టి క్షేత్రాధిపతియైన శ్రీ లక్ష్మీనరసింహస్వామికి భక్తులైన కవులెందరో కలరు. ధర్మపురీ లక్ష్మీనారాయణ శతకకర్తయైన శ్రీమదాంధ్రభాగవతరచయిత పోతన, నృసింహ, నరహరి, నృకేసరియను శతకత్రయకర్తయైన శేషాచలం (శేషప్ప కవి), ప్రయోగపారిజాత కర్తయైన నృసింహ సూరివంటి (లక్ష్మీనృసింహ స్వామిని స్తుతించిన) కవులెందరో వారున్నారు.
ఈ ధర్మపురీ లక్ష్మీనృసింహ సుప్రభాతము వ్రాయుటకు నాన్నగారు సిద్ధపడినారు. బహుశః 1969, 70 ప్రాంతములో మా గురువుగారు కీ॥శే॥ మధ్వాచారి శ్యామసుందరశాస్త్రిగారు తాను ముద్రించబోవు ధర్మపురీక్షేత్ర వైభవమును తెలియజేయు ‘నాడు-నేడు’ గ్రంథమునందు నాన్నగారి సుప్రభాతము ముద్రించుటకై ఉత్సాహపడి నాన్నగారిని సుప్రభాతము వ్రాయుటకు ప్రోత్సాహపరిచిరి.
తన కవిత్వమేదైనను, అది విశేషాంశములతో కూడియుండవలెనను నాన్నగారి దీక్ష ఈ సుప్రభాతములోనూ కనబడుతుంది. ఇందు ప్రాతఃకాలవర్ణన సహృదయునిని గోదావరి ఇసుకతిన్నెలపై విహరింపజేయును.
శ్లో॥ గోదావరీ విమలవీచి మృదఙ్గ వాద్యే
సంవాద్యమాన ఇహ గన్ధవహేన హృద్యమ్ ॥
బాలా పికాఽఽలపతి రమ్యరవేణ గీతం
లక్ష్మీనృసింహ! భగవంస్తవ సుప్రభాతమ్॥ (సు.ప్ర.6)
నిర్మల గోదావరీ తరంగాల మృదంగధ్వనిని వాయువు హృద్యముగా అందించుతుండగా పిల్లకోయిల రమ్యముగా గానము చేయుచున్నది. ఎంత చక్కని భావన!!
మరొక సూర్యోదయవర్ణన —
శ్లో॥ ప్రాచీ విభావసుశిశుం ఖలు మన్దమన్ద–
మాలమ్బ్య చామ్బరమరం మృదులై: కరాగ్రైః ॥
ఉద్యన్తమఙ్కగతమాతనుతే సురక్తా
లక్ష్మీనృసింహ ! భగవంస్తవ సుప్రభాతమ్॥ (సుప్ర. 10 శ్లో)
తూరుపు అను తన తల్లి చీర కట్టుకొనునప్పుడు బాలసూర్యుడు అను బాలుడు ఆమె చీరను తన చిన్నారి కరములతో (కిరణములతో) పట్టుకొని లేచి నిలబడుటకు ప్రయత్నించుచున్నాడు. అనురాగవతియగు ఆ తల్లి ఆ బాలుని తన అంకమున జేర్చుకొన్నది.
ఇందు అంబరమంటే వస్త్రము, ఆకాశము – అను రెండు అర్ధములు కాగా, కరములనగా చేతులు, కిరణములు అను రెండు అర్థములు. అదే విధంగా సురక్తా యనగా ప్రేమతో కూడినది, ఎరుపు వర్ణము కలదియను అర్థములు కలవు. ఇట్లు రూపకాలంకారముతో చెప్పిన ఈ శ్లోకము నందు శిశుమాతృవాత్సల్యము కడు రమ్యముగా స్ఫురించుచున్నది.
ప్రభాతవర్ణన యే కాక ఇందు ధర్మపురి వర్ణన, ఇక్కడి సంప్రదాయములు, చరిత్ర కూడ గలవు.
శ్రీ శేషయార్య రచితం శతకం త్వదీయం
గాయంత్య ఏవ తవ సద్మని పద్యజాతమ్
త్వాం సేవితుం స్త్రియ ఇమాః సముపస్థితాశ్చ
లక్ష్మీనృసింహ ! భగవంస్తవ సుప్రభాతమ్॥
(సుప్ర. 13 శ్లో)
తెలుగునాట ప్రసిద్ధినొందిన శేషప్ప నరసింహశతకము ఈ ధర్మపురీశ్వరుడైన నృసింహస్వామిదేయనుట నిస్సందేహమే కదా! అట్టి విషయమును గుర్తు చేయుచూ ఆ శతకాన్ని ఇక్కడి పురవనితలు ప్రతినిత్యము ప్రాతఃసాయం సమయములందు గానముచేయుచూ ఆ భగవంతుని దర్శింతురని తెలిపినారు. ఇది ఈ పురమునందు ఇప్పటికిని అనుస్యూతముగా వచ్చుచున్నయాచారము. కవి ధర్మపురీయుడే కావున ఈ సంప్రదాయమును వర్ణించగలిగినారు.
“యద్ధర్మవర్మనృపతిర్ …” అన్న (14వ) శ్లోకమునుండి ఈ క్షేత్ర చారిత్రిక ప్రాముఖ్యములనుగ్గడించినారు. ఇక్కడ జరుగు బ్రహ్మోత్సవాలలో (జాతరలో) పాల్గుణ శుక్ల చతుర్దశినాటి డోలోత్సవము, (19వ శ్లోకములో) ఫాల్గుణ బ. పంచమి నాటి రథోత్సవము, నిత్యోత్సవమందలి వేదఘోష (20వ శ్లోకము) అను రసగుళికలను సుప్రభాతము పేర సహృదయులకు అందించియున్నారు.
ముందుగా సుప్రభాత, మంగళాశాసనములను మాత్రమే వ్రాసి (సుమనోంజలిలో ముద్రించి) యున్ననూ, సుప్రభాతమునకు అనుగుణముగా స్తోత్రము, ప్రపత్తి కూడ ఉండవలెనను నియమానికి బద్ధుడై ధర్మపురి దేవస్థానపు ఆనాటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గారి కోరికతో ప్రోత్సాహితుడై మిగిలిన స్తోత్రప్రపత్తులను కూడ వ్రాసి సంపూర్తి నొనరించినారు. అట్టి సాంగములైన సుప్రభాతము ‘ధర్మపురీ లక్ష్మీనరసింహ సుప్రభాతమ్’ దేవస్థానం వారిచే తెలుగు లిపిలో 1979లో ముద్రితమైయున్నది. అంతే కాక అటు తర్వాత ముద్రించిన తన “కవితా విపంచీ” (సంస్కృత కవితల సంపుటి) లో కూడా దేవనాగరి లిపియందు ముద్రించినారు. ఇందువలన తెలుగువారు కాని వారు కూడ చదువుకొనుటకు వీలుకలిగింది.
ఈ స్తోత్ర, ప్రపత్తులు కూడ అనేక ప్రత్యేకతలతో కూడుకొన్నవి. స్తోత్రమునందు భగవత్స్తుతియే కాక దశావతారముల ప్రాశస్త్యమును కూడ తెలిపియున్నారు. స్వామి వారి మూలవిరాట్ స్వరూపానికి చుట్టూ దశావతారాలు చెక్కబడియున్నాయన్న సంగతి స్థానికులకు కూడ అనేకులకు తెలియకపోవచ్చు. అట్టి విషయము తెలియజేయుటకే కాబోలు దశావతార తత్త్వములను హృద్యముగా వర్ణించియున్నారు. అదే కాక ప్రపత్తి యందు అనేక పురాణాంశములను పేర్కొన్నారు. వాటిలో గజేంద్రమోక్షము, మోహినీ అవతారము, అంబరీష వృత్తాంతము మొదలైనవి కలవు.
శస్త్రాభిఘాతపరిపూరతయా ద్విషంతో
యాన్తూత్తమాం గతిమితి ప్రహిణోషి చక్రమ్ ।
సంకల్ప ఏవ తవ హంతు మలం న కిం తాన్
లక్ష్మీనృసింహ! చరణా శరణం ప్రపద్యే ॥ (ప్రపత్తి. 6)
“హిరణ్యాక్ష, హిరణ్యకశిపులవంటి రక్కసులను సంహరింప నీ సంకల్పబలము చాలు కదా! ఈ లోకమంతయును నీ సంకల్పము చేతనే కదా నడుచుచున్నది. మరి వారిని సంకల్పమాత్రము చేతనే సంహరించక శస్త్రాభిఘాతులను చేసి వధించుచున్నావెందులకు? బహుశః పవిత్రమైన నీ శస్త్రస్పర్శచే వారికి ఉత్తమగతిని కలిగించవలెనను నీ అభిలాష కావచ్చును’ అని అవతారముల తత్త్వమును పేర్కొన్నారు. ఇంకను “తత్త్వత్ కథాభిరిహ పావయితుం స్వభక్తాన్…” (ప్రపత్తి. 5) అను శ్లోకమున నీ అవతారకథల శ్రవణ, స్మరణ, కీర్తనాదుల ద్వారా భక్తులను పునీతులుగా కావించుటకే అని ఆ దశావతార తత్త్వమును స్పష్టపరిచినారు.
వీటిలో హృద్యమైన కవిభావనయే కాక వినూత్నములైన వ్యాకరణశాస్త్రాది ప్రయోగములు కూడ నున్నవి. ‘నయనీకృత శయనీకృత, అయనీకృత’ మొదలైన పదజాలము అనయనే నయనే కృతౌ – నయనీకృతౌ, నయనీకృతౌ భాస్కరశతరుచీ (సూర్యచంద్రౌ) యేన సః అను విధమున ప్రయోగించినారు. కమఠన్ (కమఠ ఇవ ఆచరన్) లలనన్ (‘లలనా+ఇవ ఆచరన్) అను విధములుగా ఉపమార్థక శత్రంతములు కూడ వ్యాకరణ విశేషాంశ ప్రయోగములే!
నాఽఽస్థా గేహే న వసునిచయే నైవ కామోపభోగే
యద్యద్ భవ్యం భవతు భగవన్! పూర్వకర్మానురూపమ్ |
యాచే తు త్వామఖిల భువనం సేవయా తేఽస్త్వవన్ధ్యం
భక్తాఘౌఘప్రశమన విభో ! ధర్మపూర్ నారసింహ! ॥
అని భగవంతునితో ‘తనకు ఎట్టి వైభవము వలదని వాటిని కోరుకోవటం లేదని తెలియజేస్తూ పూర్వకర్మానురూపమైన ఫలితమేది కలదో, దానినే జరుగనిమ్మనెను. మరి ఏదియునూ కోరవా? అనుదానికి ఈ భువనమంతయును నీ సేవాతత్పరతతో నిండియుండవలెనని కోరి తన నిస్స్వార్థ భక్తిని ప్రకటించియున్నారు.
నిబంధరత్నసముచ్చయః
2003 సంవత్సరమునందే ‘నిబంధరత్నసముచ్చయః’ అను వ్యాససంపుటిని ముద్రించినారు. ఇందు 27 సంస్కృతవ్యాసములు కలవు. ఇవి గత కొన్నిమాసములుగా ‘సారస్వతీసుషమా, సూర్యోదయః, సాగరికా, సంవిద్, అమృతలతా సంస్కృత శోధనపత్రికా, సంస్కృతభారతి వంటి ప్రసిద్ధ సంస్కృతపత్రికలయందు ప్రకటించబడి, విద్వాంసుల మన్ననలనుపొంది యున్నవి.
అంతేగాక ఆలిండియా రేడియో హైదరాబాద్ కేంద్రముద్వారా అమరవాణి, అమరభారతివంటి సంస్కృత సాహిత్య కార్యక్రమములందు ప్రసారితములైన ప్రసంగపాఠములు కూడ చేర్చబడినవి. ప్రసిద్ధ సంస్కృతాలంకారికుడైన ధర్మసూరియొక్క సాహిత్యరత్నాకరమును తాను పరిశోధించు(1964-66) సమయమునందు తత్తద్ విశేషాంశములను పద్య, అలంకార, రసాది విశేషములయందు విమర్శనాత్మకములైన చోట తన అభిప్రాయములను స్పష్టపరుస్తూ చేసిన విమర్శనావిషయములు ఇందు సమకూర్చబడినవి. అలంకార శాస్త్రమందు అమోఘమైన పాండిత్యానికి అవి మచ్చుతునకలుగా పేర్కొనవచ్చును. అటులే సాహిత్యరత్నాకరస్థ విషయములే కాక, ‘అలంకార శాస్త్రే ప్రతాపరుద్రీయస్య స్థానమ్’ ‘మనుచరిత్ర వైభవమ్’, ‘వేణీసంహారే రసచర్చా’, ‘మాలవికాగ్నిమిత్ర నాటకే వస్తు సౌందర్యమ్’, ‘రత్నావళీనాటికా వైశిష్ట్యమ్’, ‘నైషధకావ్యే శాస్త్రీయప్రస్తావః’, ‘రఘువంశ రామాశ్వమేధం సారూప్యమ్’ అను వ్యాసములు వారి కావ్యపఠనాసక్తిని, విమర్శనాదృష్టిని కూడ పేర్కొంటున్నాయి. పాఠకులకు అనేక విషయములను అందించిన ఈ గ్రంథము ‘రత్నసముచ్చయ” మనుట అతిశయోక్తి కానేరదు.
మంజూష
నిబంధరత్న సముచ్చయమును ప్రకటించి, సంస్కృతమునందు నిబంధీ కృతములైన వాటిని సంస్కృత పండితుల హస్త భూషణముగా మలిచిరి. తెలుగు వారికి తెలుగు, సంస్కృత విషయములను తెలుగులో అందించవలెనను తలంపుతో మంజూష యను ఈ గ్రంథమును ముద్రించుటకు సంసిద్ధులైరి. ఇందు ఆధ్యాత్మిక వ్యాసములు, సాహిత్యవ్యాసములు క్రోడీకరించబడినవి. ఇవి నాన్నగారి ఉభయభాషా పాండిత్యానికి మచ్చుతునకలు.
ఇందలి తెలుగు వ్యాసములు అనేక సాహిత్యపత్రికల ద్వారా వెలువరించబడినవి. కొన్ని ప్రసంగపాఠములుగా పలు సాహిత్యసభలలో, ఆలిండియా రేడియో, హైదరాబాద్ కేంద్రము ద్వారా, హైదరాబాద్ దూరదర్శన్ ద్వారా సాహిత్య కార్యక్రమములలో ప్రసంగించినట్టివి. ఇది తెలుగు సాహిత్యలోకానికి అందించు కానుకగా చెప్పుకొనవచ్చును. ఈ సంపుటియందు ఆధ్యాత్మిక సాహిత్యముల వ్యాసములున్నవి కావున ఇది నిబంధరత్నములకు మంజూషయే (రత్న పేటికయే) కదా!
చిన్ననాటినుండి శివభక్తి పరాయణుడై స్థానిక రామలింగేశ్వరాలయమున మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములను కావించుటలో తత్పరుడైయుండెను. కావుననే అట్టి భక్తిచే ప్రేరేపితుడై ‘రుద్రాభిషేక మహిమ’, ‘శివభక్తి మహిమ’, ‘భక్తి యోగము – దాని ప్రాధాన్యము’లు వ్రాసియున్నారు. ఇవి పామరులను భక్తిమార్గము ననుసరించుటకై ప్రేరేపించునట్టివి.
పలుచోట్ల దేవీభాగవత ప్రవచనము అనేక మారులు చేసియున్నారు. అందువలనే అందు తాను గ్రహించిన ‘దేవీభాగవతము – శ్రీదేవీ తత్త్వమును”, భగవదాదిశంకారాచార్యులవారి ‘సౌందర్యలహరి – పరదేవతాతత్త్వము’ను విశదీకరించియున్నారు. ఇట్టి నిబంధములు (వ్యాసములు) పండితులకు కూడ మార్గదర్శకములు కాగలవనుటలో సందేహము లేదు.
కాలమందు వచ్చిన మార్పులవలన నేటి తరములకు మన సంస్కృతి పట్ల అవగాహన కాని, అట్టి దానికి మూలములైన వేద, శాస్త్రాదుల పట్ల అవగాహనకాని లేదు అను విషయము తెలిసినదే!
కావుననే ‘భారతీయ సంస్కృతి -వేదప్రాధాన్యము’, ‘గీతా సుగీతా కర్తవ్యా ‘అహింసా పరమోధర్మః’ అనునవి మన సంస్కృతిప్రాశస్త్యములను తెలియజేయుచున్న వ్యాసములు, శ్రీమద్రామయణమునందలి భరతుని పాత్ర ప్రాముఖ్యమును తెలిసి సోదర సౌభ్రాత్రము ఎట్లుండునో విశదీకరించబడినది.
దుష్టచతుష్టయములో నొకడుగా అపకీర్తినొందిన కర్ణుడి పాత్ర నిజమునకు మహాభారతము చదివిన కాని స్పష్టముకాదు. పాండవుల ధర్మబుద్ధి తెలిసి వారిపట్ల గౌరవము కలవాడైనసూ, దుర్యోధనుని పక్షమున చేరినందున తన సర్వము దుర్యోధనుని కొఱకే అంకితముచేసి విశ్వాసమును తెలిపినవాడు కర్ణుడు. అట్టి పాత్రను వ్యాసమహర్షి మలచిన తీరుతెన్నులు ప్రశంసించతగినట్టివి. అట్టి పాత్ర వైశిష్ట్యమును తెలుపు వ్యాసము “వ్యాసమహాభారతము-కర్ణుడు”.
పంచమవేదమైన వ్యాసమహాభారతము ఎంత విశిష్టమైనదో ఎంతటి విశాలమైనదో ఆంధ్రమహాభారతము కూడ అంతే విశిష్టత్వము, విశాలత్వమును ఆపాదించుకొన్నది. అట్టిదానిని ఆంధ్రీకరించడానికి ఉద్దండ పండితులైన మువ్వురు కవులు పాటుపడవలసి వచ్చినదంటే ఆ గ్రంథవైశిష్ట్యము ఏమని చెప్పవచ్చును ? అది ఒక స్వతంత్రగ్రంథమగునట్లు కవిత్రయము పాటుపడిరి. అందు అత్యధిక భాగమునకు నిర్మాతయైన వాడు తిక్కన సోమయాజి ఉభయ కవిమిత్రుడైన అట్టి కవియొక్క అనూదిత భాగమునందలి కౌశలాన్ని గ్రహించి చెప్పవలెనన్న ఉభయ భాషాపండితులైన వారే సమర్థులగుదురు కదా! కావుననే ఈ ‘ఆంధ్రమహాభారతము-తిక్కన అనుసృజిక కౌశలం” అనువదించడములో తిక్కన గావించిన సృజనాత్మక తత్త్వమును వెలికి తీసి చూపించుటలో కృతకృత్యులయ్యారు.
కవులు కీర్త్యాదులను తెల్లనిదిగా వర్ణించుట, చాతకపక్షులు జలదజలమునే గ్రోలుట, అశోకవృక్షము పద్మినీ జాతి స్త్రీల పాదఘాతములచే పుష్పించుట, హంస నీరక్షీరములను వేరు చేయుటవంటి వానిని ఎన్నింటినో వర్ణింతురు. ఇట్టి సంప్రదాయము ‘కవిసమయము’లని పేరొందినవి. ఇవి కవుల వర్ణనలో మాత్రమే యుండునని తెలుపు సమీక్ష ‘కవిసమయములు’.
రసంగంగాధరకర్తగా ఎనలేని కీర్తి గడించిన లాక్షణికుడు జగన్నాథ పండితరాయలు మంచికవిగా కూడ ప్రసిద్ధి నొందినాడు. రసగంగాధరమునందలి ఉదాహరణ లనన్నింటిని తన కృతుల ద్వారానే గ్రహించినట్లు పండితరాయలు పేర్కొన్నారు. అట్టి ‘జగన్నాథ పండితరాయల కావ్యమాధురి’ రసాస్వాదనయందు అభిరుచిని కలుగించు వ్యాసము పండితరాయలలోని కవిరాజత్వాన్ని ప్రదర్శించునట్టిది.
మరొక ప్రసిద్ధ లాక్షణికుడైన క్షేమేంద్రుడు ఔచిత్య విచారచర్చా, ‘కవి కంఠాభరణము’ల ద్వారా పండితలోకానికి సుపరిచితుడే! అట్టి సాహితీమణియైన క్షేమేంద్రుని కృతులెన్నో కలవు. ‘క్షేమేంద్రుని రచనలు – లోకజ్ఞానానికి నీరాజనాలు’ అనే వ్యాసము ద్వారా కావ్యరసాస్వాదనా పిపాసులైన సహృదయులకు మార్గోపదేశము చేసినారు.
శ్లిష్టకావ్యమన్నా నాన్నగారికి మక్కువెక్కువే! కవిత్వమునందు శ్లేషకో పెద్దపీట వేయుచుందురు. ఐనను శ్లిష్టకావ్యముగా పేరొందిన, పండితులకు నికషాయమాణమైన ‘వసుచరిత్రము, క్లిష్టకావ్యమా?’యని ప్రశ్నించుచూ శ్లేషకు ధ్వనికి గల భేదము తెలియజేయుచూ ధ్వనికావ్యముగా సిద్ధాంతీకరించి యున్నారు. ఇట్టి వ్యాసమే కాక ‘రామరాజభూషణుని ద్రవ్య – జాతి- హేతూత్ప్రేక్షోదాహరణములు – ఒక పరిశీలనము’ సాహితీస్రవంతీ ప్రియులకు ఒక చర్చావేదిక. ఇవి విద్వాంసులను పునరాలోచించుకొనునట్లు చేయును.
ధ్వనిని గురించి ప్రధానముగా పరిశోధనగావించి, తన నైపుణ్యము ‘ధ్వని – మనుచరిత్ర’ ద్వారా విద్యార్థి లోకానికి మార్గదర్శకము గావించిన యట్టి పరిశోధనకు రంగమైన ‘మనుచరిత్రము – ధ్వని వైశిష్ట్యము’. పెద్దనార్యుని కవితాప్రశస్తిని తెలియజేయు వ్యాసమిది.
ఉత్తమకావ్యప్రధాన లక్ష్యమగు ధ్వని అలౌకికానందదాయకమగును. కావుననే ఉత్తమ కవులు ధ్వని ప్రధానముగా తమ కావ్యములను మలచుదురు, ఆంధ్రభాషయందు ఆదికవిగా పేరొందిన నన్నయ తన భారతరచనను ధ్వనియుక్తముగా మలచినాడనుటలో ఆశ్చర్యమేమున్నది. అట్టి ధ్వని వెలికి చూపించు కరదీపికాతుల్యమైన వ్యాసము ‘నన్నయ భారతము – ధ్వని’.
గత కొంతకాలముగా మనుచరిత్రలోని కుతపకాలము గురించిన ప్రసక్తి చర్చనీయాంశమైనది. ప్రవరుడు-అతిథి సపర్యలు చేసి సిద్ధుడు పూసిన దివ్య పాదలేపనముతో హిమవన్నగము చేరి, చూసి, మాధ్యాహ్నిక విధి నిర్వహణకై వెనుతిరిగివచ్చుటకు ప్రయత్నించెను. పెద్దనగారి ఈ కథనమున కాలము నిర్దేశించుటలో అనౌచిత్యముగానున్నదని పలువురు విమర్శలకు దిగిరి. వాదోపవాదములు అనేకములు బయల్దేరినవి. కవిని సమర్థించుటకై పలువురు చేసిన ప్రయత్నములు సఫలములు కాకున్నవి. కాని ఆచారవ్యవహారములు, జ్యోతిషపరిజ్ఞానములు ఎరిగి యున్నందున నాన్నగారు దీనిని చక్కగా పరిష్కరించిరి. అట్టి వివరణ ‘కుతపకాల ప్రసక్తి’లో చూడవచ్చు.
ఇట్లు సంస్కృతాంధ్రకవుల కావ్యసాహిత్య విషయములనే కాక ‘తెలంగాణా అచ్చతెనుగు కవుల’ను, ‘తంజావూరు, మహారాష్ట్ర రాజుల తెలుగు భాషా సేవ’ను తెలిపి, నూతన విషయములను అందించియున్నారు. వ్యాకరణమెందుకొరకు చదువవలెనో సహేతుకంగా నిరూపించినది – ‘వ్యాకరణము – దాని ప్రయోజనము’ అను వ్యాసం.
విభిన్నకోణములనుండి సంస్కృత సాగరమును ఎందరో ప్రశంసించియున్ననూ అది సంపూర్తి నొందజాలదు కదా! కొత్త తరములకు కొత్త కోణములతో ‘సంస్కృతము దాని ప్రాధాన్యము’ను అందించుట పఠితలకు సంస్కృతాధ్యయనాసక్తిని పంచుతుందనుటలో అతిశయోక్తి కానేరదు.
ఇట్లు చెప్పిన వ్యాసములన్నియు దాదాపుగా 30 సంవత్సరములుగా తెలుగులో పలుచోట్ల ప్రసంగించినవి. రేడియోద్వారా ప్రసారితములు, విభిన్నపత్రికల ద్వారా ప్రకాశితములైనవి. అనేకాధ్యాత్మిక సాహిత్య విషయములు గల ఈ వ్యాసములు సంస్కృత తెనుగు భాషా సారస్వతముల ప్రాశస్త్యములను తెలుపుచున్నట్టివి.
పుంభావ సరస్వతులుగా పేరొందిన వారి కలమునుండి జారిన ఈ అక్షరమణిమాలను ప్రస్తుతించుట నాబోటి అల్పజ్ఞులకు ఒక సాహసమే! వారి పుత్రుడిగా జన్మించి ధన్యుడైననూ చిన్ననాటినుండి వారికి ఉద్యోగరీత్యా, నాకు చదువుల రీత్యా వారి సమీపమందున్న కాలము స్వల్పమే! నేనెరిగిన వారి జీవనవిధానాలు కూడా స్వల్పమే ! నేనెరుగని విషయాలెన్నియో!
కావున 1966 లో కీ॥శే॥॥ కప్పగంతుల లక్ష్మణశాస్త్రిగారు ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక సంపాదకుడిగానుండగా, వారు నాన్నగారి గురించి ప్రశంసించిన ఈ శ్లోకము సత్యదూరమేమి కాదు కదా! పరికించండి.
వైదుష్యం లేఖకత్వం సుగమఫణితిభిః సంస్కృతాధ్యాపకత్వం
విద్వద్ గోష్ఠీషు చర్చానికషణచణతా శాస్త్రవాదే పటుత్వమ్ ।
శక్తిర్గైర్వాణవాణ్యాం విబుధజనసదోభాషణేఽనర్గలా చ
విద్వద్రాజన్న శాస్త్రిన్ ! భవతి విజయతే భారతీసుప్రసాదాత్ ॥