పాట-మాట: 1

జనం మెచ్చిన జాంపండు – మన వంగపండు

వంగపండు ప్రసాదరావు- ఈ పేరు తెలుగు ప్రజానీకానికి పరిచయం అక్కరలేని పేరు. పాటలు రాసే, పాడే ప్రసాదరావు అంటే కొందరికి వెంటనే గుర్తు రాకపోవచ్చు. కానీ తన ఇంటి పేరు అయిన వంగపండు అనగానే తెలియని వారుండరు. వంగపండుగా ప్రసిద్ధులైన వంగపండు ప్రసాదరావు నిజానికి జాంపండులాంటి వ్యక్తి.

జామపండు అంటే తెలియనివారెవరు! పిల్లలనుంచి పెద్దలవరకు అందరూ ఇష్టపడే పండు. ఆరోగ్యరీత్యా కూడా చాలా ఉన్నతమైన పోషక విలువలు కలిగి ఉన్నపండు. ధర (విలువ)లోగానీ, నిలవ ఉంచడంలో కానీ, ఏ రకమైన భేషజమూ చూపని పండు. విరివిగా దొరుకుతుంది. అందరికీ అందుబాటులో ఉంటుంది.

సాహిత్య ప్రపంచంలో వంగపండు కూడా సరిగ్గా అలాంటి కవి. అతడు పండ్లలో జామపండు, పూలలో మందారపూవు.
వంగపండు గురించి గతంలో ఎవరు రాసారో పేరు గుర్తులేదుగానీ, ‘అమాయకపు జానపద ఎర్రజెండా’ అన్నారు (ఆంధ్రజ్యోతి వీక్లీ 80 వ దశాబ్దములో చదివిన జ్ఞాపకం).

అది అక్షరాలా నిజం. వ్యక్తిగా వంగపండు ‘అమాయకుడు’ అని చాలామంది అంటారు. అతని పలుకు మెత్తనిది, మృదువైనదే కాదు సొగసైనది కూడా. ఆ సొగసు ఉత్తరాంధ్ర మాండలికంలో ఉంది. దాన్ని పట్టుకున్నాడు. అతని శైలి, చలి కాలంలో తగిలే ఉదయకాలపు లేత ఎండలాంటిది. అతని ఉత్సాహం నిరంతరం ఎగిసిపడే అల. ఆతని సంకల్పం శిల్పంగా చెక్కిన శిల. భావజాలం మాత్రం మండే అగ్నిజ్వాల.

జలపాతంవంటి స్వచ్ఛమైన గ్రామీణ భాషలో, ఐదు దశాబ్దాలకు పైగా పాటల ప్రవాహంగా సాగాడు. కేవలం పాడటమే కాదు. పాటకు తగ్గ ఆటను ప్రదర్శించి ఆటపాటల మేలు కలయికై ఒక ప్రభంజనం సృష్టించాడు. 300కు పైగా పాటలు రాసి పాడిన ప్రజావాగ్గేయ కారుడు. తను ఎన్ని పాటలు రాసినా ఏ పాటకు ఆ పాట దేనికదే ప్రత్యేకమై, జనబాహుళ్యంలోకి చొచ్చుకు పోయింది. వేలాదిమందిచే పదేపదే పాడబడ్డాయి. అనేక భాషలలోకి అనువాదం చేయబడ్డాయి. భారతీయ భాషల్లోకే కాక ఇంగ్లీష్, ఫ్రెంచ్ లాంటి విదేశీ భాషల్లోకి కూడా అనువాదమై ఇంగ్లండ్, అమెరికావంటి దేశాలలో కూడా ప్రాచుర్యం పొందాయి.

వంగపండు కేవలం పాటలకే పరిమితం కాలేదు. పాటలు రాయడం, పాడడమే కాక ‘భూమి బాగోతం’,’ సిక్కోలు యుద్ధం’ వంటి కళారూపాలను సృష్టించాడు. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ కళారూపాలలో 70వ దశాబ్దం నాటి సమాజంలోని సామాజిక ఆర్ధిక రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకొని జనజీవనానికి అద్దం పడుతూ, వివిధ వర్గాల శ్రామికులు ఏ విధంగా దోపిడీ చేయబడుతున్నారో చెప్పాడు. ఆ దోపిడీకి వ్యతిరేకంగా తన రచన ద్వారా ప్రజలలో చైతన్యాన్ని పెంపొందింపచేశాడు.

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి బాగోతం ప్రదర్శన జరగని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా ప్రజల్లోకి వెళ్లిన కళారూపం ఇటీవల కాలంలో మరొకటి లేదు. ఒక కన్యాశుల్కం నాటకంలా, భూమి బాగోతం కూడా సమస్య తీరిపోయినా నేటికీ సజీవంగా అక్కడక్కడా ప్రదర్శింపబడుతోందంటే కారణం దానిలోని కళాత్మకత, జీవన వాస్తవికత, ప్రజానురంజకత్వమే. డెబ్భయ్యవ దశాబ్దంలో మొదలై, తెలుగునాట ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో సైతం తెలుగు వారున్న చోట్లల్లా ప్రదర్శింపబడిన గొప్ప కళారూపం.

వంగపండు ఒక నాటకం కూడా రాశాడు. అతడు రాసిన నాటకం పేరు ‘అడవి దివిటీలు’. ఆ నాటకానికి కూడా ఒక చరిత్ర ఉంది. సహజంగా ఒక రచయిత రాసిన నాటిక/నాటకం ప్రదర్శింపబడటమే గొప్ప విషయం. అలాంటిది టిక్కెట్టుపై ప్రదర్శింపబడితే అదో చరిత్ర. అట్లాంటిదే కాదు, అంతకుమించిన చరిత్ర ఈ నాటకానికి వుంది. ఈ నాటకం టిక్కెట్టుపై ప్రదర్శింపబడడమే కాకుండా రోజుకు రెండు ప్రదర్శనలు వేస్తూ, సెలవు రోజుల్లో మూడు ప్రదర్శనలు కూడా వేస్తూ 50 రోజులకు పైగా నిరాటంకంగా ప్రదర్శింపబడిన ఘనమైన చరిత్ర అది. బహుశా ప్రపంచ నాటకరంగ చరిత్రలో ఇలాంటి ఘనత అతికొద్ది నాటకాలకే దక్కి ఉంటుంది.

విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ దరి ఎన్జీవో హోమ్‌లో ప్రముఖ దర్శకులు సత్యానందగారి దర్శకత్వంలో ఈ నాటక ప్రదర్శనలు జరిగాయి. (ఒకరోజు ఆ ప్రదర్శన చూడటం ఈ వ్యాసకర్త వ్యక్తిగత అనుభవం కూడా) ఇలా వంగపండు గురించి ఎంత చెప్పినా తక్కువే. తాను ఏదిరాసినా అది ప్రజల్లోకి వెళ్ళింది. సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ఉండాలన్న ఆకాంక్ష నెరవేరిన సందర్భమూ లేకపోలేదు. ఎన్.టి రామారావుగారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, గ్రామాల్లోని మునసబు, కరణాల వ్యవస్థను రద్దు చేయటంలో వంగపండు భూమిబాగోతం యొక్క ప్రభావమూ ఉందని చెప్పడములో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు. ఒక రచనకు అంతకన్న గొప్ప సామాజిక ప్రయోజనం ఏముంటుంది?

వంగపండు పాటంటే వెంటనే గుర్తొచ్చేది “ఏం పిల్లడో ఎల్దుమొస్తవా”పాట.

ఈ పాటలో “ఏం పిల్లడో ఎల్దుమొస్తవా!” అని అడుగుతాడు కవి. ఎక్కడికీ !? అంటే “శ్రీకాకుళంలో సీమకొండకి” అంటాడు. అపుడు ఎందుకూ!? అనే ప్రశ్న వస్తుంది. “సిలకలు కత్తులు దులపరిస్తయట” అని అక్కడ జరుతున్న పోరాటాలను సింబాలిక్‌గా చెపుతాడు. శ్రీకాకుళ గిరిజన రైతుల పోరాట నేపధ్యంలో మంచి నిర్వహణ దక్షతతో రాసిన ఈ పాట తెలుగు ప్రజలను ఉత్తేజితులను చేసింది, ఉర్రుతలూగించింది.

ఈ పాటను గురించి ఆలోచించినపుడు అనివార్యంగా శ్రీశ్రీ మహాప్రస్థానంలోని అవతారిక కవిత గుర్తొస్తుంది. “యముని మహిషపు లోహ గంటలు మబ్బు చాటున ఖణేల్మన్నాయి…” అంటూ మొదలైన ఈ కవితలో, దేవుళ్ళపై తమ కింద పనిచేసే తమ వాహనాలు తిరుగుబాటు చేస్తున్నాయని సింబాలిక్‌గా చెప్తాడు. “కనకదుర్గ చండ సింహం జూలు దులిపి ఆవలించింది/ ఇంద్రదేవుని మదపుటేనుగు ఘీంకరిస్తూ సవాల్ చేసింది/నందికేశుడు రంకె వేస్తూ గంగడోలును కదిపి గెంతాడు…” అనడంలో శ్రామికజనం యొక్క తిరుగుబాటును చెప్పాడు. ఎందుకు ఈ తిరుగుబాటు!? దీనివలన ఏమొస్తుంది? అంటే చివరగా “పుడమి తల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి” అన్నాడు.

శ్రీశ్రీ సమాజంలో రావాల్సిన సరికొత్త మార్పుని ఆశించాడు. వంగపండు అదే విషయాన్ని “ఏం పిల్లడో ఎల్దుమొస్తవా…” అంటూ పాట ద్వారా చెప్పాడు. అయితే శ్రీశ్రీకి వంగపండుకి మధ్య వ్యత్యాసం ఏమిటంటే శ్రీశ్రీ వ్యక్తుల తిరుగుబాటుగా చూపించిన దాన్ని వంగపండు సామూహిక తిరుగుబాటుగా చెప్పడం. చిలకలు, సెమరపిల్లులు, మిడతలు, గేతులు, చీమలు అంటూ అతి చిన్న జీవులు ఆయుధాలు పట్టి తిరగబడ్డాయని సాయుధ విప్లవాన్ని చెప్పాడు. అయితే శ్రీశ్రీ అవతారిక కవిత రాసే కాలానికి, వంగపండు పాట రాసే కాలానికి మధ్య దేశంలో జరిగిన ఉద్యమాలున్నాయన్న సంగతి మనం మరచిపోకూడదు.

వంగపండు విశాఖపట్నంలో పాట పాడితే ఆ పాట తెలుగు ప్రాంతాలు అన్నింటా ప్రతిధ్వనించింది. శ్రీకాకుళం యాస, బాస (మాండలికం)లకి విశేషమైన గౌరవాన్ని తీసుకువచ్చిన రచయితల్లో వంగపండు ఒకరు. ఉత్తరాంధ్ర ప్రజల జీవితాన్ని, భాషని ఆకళింపు చేసుకున్నాడు. ప్రాంతీయ సామెతలు, పలుకుబళ్ళు వంటబట్టించుకున్నాడు. జానపద బాణీలను పోరాటగేయాలుగా మలిచే శక్తిని సంపాదించుకున్నాడు. సాధికారంగా తాను అనుకున్న పనిని చేసాడు.

వ్యక్తిగా సాంస్కృతికరంగంలో ఒక పోరాటయోధుడిగా నిరంతరం పని చేశాడు. వివిధ ప్రజాస్వామిక ఉద్యమాలతో పోరాటాలతో మమేకమయ్యాడు. ఆ లక్ష్యసాధనకు ఒక సాంస్కృతికోద్యమ కార్యకర్తగా తన వంతు పాత్రను గొప్పగా నిర్వహించాడు.
వంగపండు పాటల పుస్తకం ‘జజ్జనకరి జనారే’కి రాసిన ముందుమాటలో చలసాని ప్రసాద్‌గారు ఇలా అన్నారు.
“పాణిగ్రహి పోరాటపాటల బాటలో నడిచిన తెలుగు కవులలో వంగపండు ప్రసాదరావు ఒకడు. శ్రీకాకుళం ప్రజల పలుకుబళ్ళు, బాణీలు వంగపండు బాగా ఆకళింపుచేసుకున్నాడు. శ్రీకాకుళ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పోరాట మార్గం పట్ల మొగ్గు వుంది. పోరాటలక్ష్యంతో ఆమోదముంది. విప్లవ రాజకీయాలతో ఏకీభావం వుంది. విరసంలో సభ్యత్వం వుంది,” అన్నారు.

తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వోద్యమంతో వర్గ విభజన సాహిత్యం వచ్చింది. తర్వాత సాహిత్యకారులలో కూడా వర్గ విభజన జరిగింది. అట్టడుగు శ్రామికవర్గం గురించి ఆలోచించిన వారు ఆ శ్రమజీవులకు సంబంధించిన సాహిత్యాన్ని సృష్టించారు. రాజ్యం తుపాకి రాజ్యమని గుర్తించారు. ఎంత ప్రజాస్వామిక దేశంలోనైనా రాజ్యానికి నియంతృత్వ ధోరణి, హింసాత్మక స్వభావమూ ఉంటుందని గ్రహించారు. రాజ్యమెప్పుడూ దోపిడీ వర్గానికే వత్తాసు పలుకుతుందన్నది జగమెరిగిన సత్యమే. వంగపండు రాజ్యస్వభావాన్ని బాగా ఆకళింపు చేసుకున్నాడు. కనుకనే “తుపాకి రాజ్యంలో అన్న… నువ్వు తుఫాన్ వై లేవరన్నా” అన్నాడు.

వంగపండు ప్రసాద్ – తను పెద్దగా చదువుకోలేదని చెప్పాడు. కానీ జీవితాన్ని, మరీ ముఖ్యంగా గ్రామాన్ని, పట్టణ శ్రామికవర్గ జీవితాన్ని బాగా చదువుకున్నాడు. గ్రామాల వెంట తిరిగి జనం పాటను పట్టుకొని తన హృదయపంజరంలో దాచుకున్నాడు. అందువల్లనే పాట తన గొంతులోంచి ఏ సందర్భానికైనా అలవోకగా, గోడమీదనుంచి నీరు జారిన చందంగా జాలువారింది. తన పాట కేవలం రాగంతోనో, లయతోనో, భావవాహికగా మాత్రమే సాగలేదు. నిండా కవిత్వమయంగా ఉంటుంది. దాని వల్లనే మనం ఆ పాటలు విన్నా, చదివినా మనలో ఉత్తేజం కలుగుతుంది. ఆ తేడా మనకు స్పష్టంగా తెలుస్తుంది కూడా. ప్రజల బాధలు, ఆశలు, ఆవేశాలను అక్షరాలలో పొదిగి ఆలోచనాత్మకంగా తిరిగి అదే ప్రజలకు అందించాడు. అతని భాష చాలా సరళమైంది. సుందరమైంది. ఆ పాటల తేట నీటిలో తన హృదయపు ప్రతిబింబం కనిపిస్తుంది. పూల రెక్కలకున్న మృదుత్వం ఉంటుంది. పూలనుంచి సేకరించిన మకరందం తిరిగి తుమ్మెద నోటినుంచి వచ్చి తేనె అయినట్టు జనంనుంచి గ్రహించిన దానినే తిరిగి జనానికి అందించే క్రమంలో అతని పాట మాధుర్యాన్ని సంతరించుకుంది.

మార్క్సిస్టు భావజాలమే తాత్వికతగా వంగపండు పాటలు రాసాడు. మార్క్సు కమ్యూనిజం గురించి తన జర్మన్ ఐడియాలజీలో ఇలా అంటాడు.

“కమ్యూనిజం వ్యవహారశైలి కాదు, అలవాటు చేయటానికి. నిర్ధిష్ట పరిణామం కాదు, ఆచరణ సాధ్యం చేయటానికి. ఓ ఆదర్శం కాదు, వాస్తవం దానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవటానికి. కమ్యూనిజం వర్తమానాన్ని కూలదోసే ఓ వాస్తవిక ఉద్యమం”.

వంగపండులో ఈ మార్క్సిస్టు తాత్వికత ఉంది. అది తన ప్రతి పాటలోనూ కనపడుతుంది.

“ఎహే.. ఓహో.. ఎయ్యరా!
ఎదురు కర్ర తీయరా!
తిరగబడి తీరందే
జరుగుబడి లేదురా” అని ఇంచుమించు అన్ని పాటల్లోనూ అదే చెప్పాడు. ప్రతి పాట ముగింపులోనూ ఈ భావజాలాన్నే అందించాడు.

మొత్తంగా చూసినపుడు వంగపండు తన పాటలతో ప్రజల బాధలని పల్లవిగా చేసి వారి వేదనని పాడాడు. ప్రజల కన్నీరు తుడిచాడు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించాడు, ఆలోచనను పెంపొందించాడు, ఆవేశం రగిలించాడు. సమసమాజం కావాలన్న ఆశయాన్ని అందించాడు. ఆశయసాధనకు సంఘటితం కావాలన్నాడు. ఆన్యాయంపై తిరుగుబాటుకు పురికొల్పాడు.

వంగపండు పాటలను తొమ్మిది విభాగాలుగా చూడొచ్చు. అవి:

1. గ్రామీణ రైతు/రైతు కూలీల గురించిన పాటలు
2. కార్మికుల సమస్యలు/హక్కుల గురించిన పాటలు
3. ఉద్యమ ప్రబోధగీతాలు
4. స్త్రీలను గురించిన పాటలు
5. బహుజన కులాల/కులవృత్తులపై పాటలు
6. దళిత గేయాలు
7. గిరిజన గీతాలు
8. సామాజిక సమస్యలపై పాటలు
9. ఇతర పాటలు

ఒక్కో విభాగంలోనూ ఎన్నో పాటలున్నాయి.

గ్రామీణ పేదరైతు/రైతుకూలీల పాటలు: ప్రారంభంలో ఎక్కువగా తాను పుట్టి పెరిగిన గ్రామంలో చూసిన సమస్యలపై రాశాడు. ఒక ఇంటర్వ్యూలో తన మొదటి పాటగా తను చెప్పిన ‘కొడవలి కక్కులు’ పాటను చూద్దాం. ఈ పాట ఇలా ప్రారంభమవుతుంది.

“కూడు గుడ్డాలేని
కూలి నాలోలు
కొట్టాలి కొడవలికి కక్కులు
కొయ్యాలి వరిసేని దుబ్బులు…” అని చేయాల్సిన పనిని గురించి చెపుతాడు. అలా పని చేస్తున్న క్రమంలో

“మడిలో బెడ్డలన్ని
మన నెత్తురు గడ్డలు
పండిన పంటలల్ల
మన చెమట చుక్కలు…” అని వారికి తత్వబోధ చేస్తాడు.

ఏమిటా తత్వం!? అంటే శ్రమ లేకుండా సంపద లేదు. శ్రమే సంపద, అన్నదే ఆ తత్వం. మన చెమట, మన రక్తమే ఈ పంట కనుక ఇది మనకే చెందాలని బోధిస్తాడు. అయితే అందరూ అంత వేగం నమ్మలేరు. ఎందుకంటే శ్రామికులలో సైతం పెత్తందారులు ప్రచారం చేసే భావజాలమే ఉంటుంది. కనుక వారిని నమ్మించటానికి ఇలా చెపుతాడు.

“దుక్కులు దున్నేది
నీవే రైతన్నా
మొక్కలు నాటేది
నీవే కూలన్నా..”

అని పంటకు సంబంధించిన సమస్తమైన పనులు చేసింది మీరే కదా! అని వారి శ్రమని గుర్తు చేసి ఆలోచింపజేస్తాడు. చివరగా

‘మధ్యంలో ఈడెవడు
భూసామట బుగతోడట…” అని ప్రశ్నిస్తూ

“పట్టా పట్టుకొని
మన పొట్ట కొట్టాలని…’ వస్తుంటే చూస్తూ వూరుకుంటావా!…
“ఎదురొచ్చే దొరబాబుని
దుబ్బు తీసి దుల్లగొట్ట”మని తిరుగుబాటుకు పురికొల్పుతాడు.

“పొలికేక” లాంటి పాటల్లో వ్యవసాయ పనుల క్రమాన్ని, పంటలు పండించటంలో వారు పడే శ్రమను చెపుతాడు.

“ఏరుపూసి ఎల్లారు రైతోలు/సాలుబూసి సాగారు సవరోలు/సామలు సోలు నూలు/ఇత్తనాలు పట్టుకోని” అని విత్తనాలు వేసింది మొదలు పంట కోతకొచ్చేవరకు వున్న పనులను శ్రమలను చెపుతాడు.

మరొక పాట ‘కూలి పోరాటం’. ఇందులో యజమానుల/భూస్వాముల ధాష్టీకాలను, వాళ్ళు ఎంతగా శ్రమ పెట్టి ఎన్నెన్ని బాధలు పెట్టి పనులు చేయిస్తారో, తీరా చేసేక కూలి చాలదంటే ఎలా హింసిస్తారో చెపుతాడు.

“ఏటీ కూలి మాకు/పూటకైన సాలదంటే నోటి మీద తన్నాడు/నాయుడు బాబు…” అని చెప్పి “ఆడి బుర్ర బుగ్గి సెయ్యాలి/రండిర బాబు…” అని పిలుపునిస్తాడు.

ఇలా డెబ్భైయవ ఎనభైయవ దశాబ్దాలలోని గ్రామీణ పేదల బాధలూ గాధలూ పాటలుగా రాసి వారిని చైతన్యపరచాడు.

(ఇంకా వుంది)