“నాయినా, నాయినా మీ గూనోడి కత జెప్పవా….” మాయమ్మ ముగ్గేసి మజ్జలో బెట్టిన దాసాని పూలు జూస్తా నిల్చుకోని వుండే నన్ను రొండు చేతులు పట్టుకోని ఊపేసినారు పిలకాయలు.
మేము ఎదురుగా వుండే ఇంట్లోనే పాలు పొయ్యించుకొనేది. ఆయావులు ఏసిన ప్యాడ పదడుగుల దూరంలో పచ్చగా మెరస్తా వుండాది. మా వాకిట్లో జూస్తే, బోగి ఎయ్యడానికి ఒక్క కట్టిపుల్ల గూడా ల్యా.
“హూ…” ముక్కలగుండా పొడుగ్గా గాలి వొదిలినాను.
“నాయినా ఇంటా వుండావా, నీకే జెప్పేది. గూనోడి కత అడగతా వుంటే ఆ మాదిర్తో గాలి వొదలతా వుండావేంది?” ఇదేందో పెద్ద యవ్వారమే ఉండాదనుకోని వాకిలి మెట్ల మింద కుచ్చున్నారు పిలకాయిలు.
పొద్దు ఎనిమిద్దాటినా పొగమంచు కురస్తానే ఉండాదింకా. సగించినట్టు నీరెండ కాస్తా వుండాది.
వొగసారి రొండు అరచేతులూ పరపరా రుద్దుకోని, చెంపలకు ఆనించుకొన్నాను.
“మీ నాయనమ్మ జూడరా వాకిట్లోనే ప్యాడ కళ్ళుకళ్ళుగా పడి వుండాదా. అయినా గొబ్బెమ్మలు పెట్టడం ల్యా. కనాకష్టం మీయమ్మన్నా పట్టిచ్చుకుంటాదా అంటే అదీలేదు. బోగి ఏసేదానికి ఒక్క కట్టి పుల్లన్నా లేదే, రేపు ఏంజేసేది? దేంతో బోగి ఎయ్యాల… మనం యాడికి బోవాల?” నేను ఒదిలిన గాలికి కారణాలు జెప్పినా.
“సిన్నప్పుడు మా ఊళ్ళో ఈ మాదిరిగా ఉండేదా? కోడి కూతేసేది లేటు, ఆడంగులు లేచిపొయ్యేది. ఇల్లూవాకిళ్ళు ఊడ్చి, కళ్లాపులు జల్లి, రంగురంగుల ముగ్గులేసి, ప్యాడతో గొబ్బెమ్మలు పెట్టి, వోటి తలల్లో తంగేడు, గుమ్మడి, గునుగు, బంతులు, చామంతులు పువ్వులు గుచ్చేది. ఇంగ మా పిలకాయలం బోగికోసరం అడివికి పొయ్యి కంప మండలు కొట్టుకోని రావడం… అదో వైబోగం. మా గూనోడుండాడే, వోడి తైతక్కలు జూడాల అటుమంటప్పుడు…” గూనోడు లేకండా మా ఊరి ముచ్చట్లు ఉండవు, నేనెప్పుడు జెప్పినా.
“అవునా నాయినా, మీ గూనోడు ఏం జేసేటోడు చెప్పు, చెప్పు…” చెడ్డీ ఎగలాక్కుంటా మా తిమ్మసంద్రం ఈదుల్లో తిరగతా పెద్దపండగ సంబరాల్లోకి జారిపోయిన నన్ను ఇవతలికి లాక్కొచ్చినారు పిలకాయలు.
గూనోడి పేరు యినంగానే ఆకాశానికి లేసే బోగి మంటలు, ఆ మంటల్లో కాసుకుని వొల్లికి పోసుకున్న ఉడుకుడుకు నీల్లు తియ్యితియ్యిగా గెవణానికి వొచ్చినాయి. అంతలోనే మొనుసంతా చేదుగా అయిపొయ్యింది.
“గబాన రాండ్రా,” గూనోడు అరస్తా ఉండాడు.
యాడ తీరతాది నాకు. మాయమ్మ అప్పుడే సద్దికూడు గిన్నిలో పోసింది. నంజుకోను మారేడుగొమ్ము ఊరగాయ అడిగితే లేదంటా ఉండాది.
“నాకా నాసినం మిరక్కాయి లొద్దు. మారేడు గొమ్ము ఊరగాయే గావాల,” నేను గూడా ఇనడం ల్యా.
“చెప్తావుండాను గదరా, లేని గొమ్ములు యాడనించి తేవాల?”
“మ్మో, నువ్వు బలేటి దానివి మో. నిన్నగాక మొన్ననే గదా నాగబూసన పావడా నిండా శేరు గొమ్ములు తీసకనొచ్చి మాయవ్వ ఒళ్ళో పోసిండేది. ఊరికేనే నాతో ఎకసెక్కాలు పడబాక. నేను మొదులే మొండోణ్ణి. ఇప్పుడు మారేడు గొమ్ము నంజుకొనేదానికి పెట్టకపొయ్యినావో..” పళ్ళు కొరకతా ఆమి ముగానికి ఎగజూసి, కారిపోతా వుండే ముక్కు చీమిడి చొక్కా రెట్టకు తుడుసుకున్నాను.
“ఆ… ఏంజేస్తావురా? తలగొట్టి మొలేస్తావా ఏంది?” తన మానాన తాను పొయ్యిలో నిప్పు రగలేసి, ఎండు మిరపకాయలు ఆ యేడి బూడిదిలో పొల్లిస్తా ఎదురు తిరిగింది మాయమ్మ.
“రేయ్ బక్కోడా… ఇంగా కాలేదారా సద్ది తాగేది? అక్కడ గూనోడు గుండం తొక్కతా ఉండాడు,” నా బెస్టు సావాసగాడు తెల్లోడు తలాకిట్లో నిలబడి కేకేసినాడు.
వోణ్ణి పట్టించుకోలా నేను. మాయమ్మ మాటలకు పిచ్చ రేగిపోతా వుండాది ఇక్కడ.
“ఏం జేస్తానా…” చప్పడం గాళ్ళు ఏసుకోని పందిటి గుంజకు ఆనుకోని గదా కుచ్చోనుండాను. అమాన లేచి సద్ది గిన్నిని నీలిగి ఎడం కాలితో ఒక్క తన్ను తన్నినాను.
“మారేడుగొమ్ము లేని ఈ నాసినం సద్ది నేను తాగబొయ్యేది లేదు. అంతేకాదు మో, ఈ రోజంతా నీ చేత్తో పెట్టే కూడు దింటే అప్పుడు నన్ను నీ కాలిమెట్టితో గొట్టు,” కసిగా పెతిజ్ఞ జేసి జారిపొయ్యే చెడ్డీ ఎగేసుకొంటా ఈదిలోకి లగెట్టినాను.
ఇంగా ఆమి ముందే వుండామనుకో, నా వొంట్లో పులుసులోకి ఎంక మిగలదని తెలుసు గదా.
“ముండమోపి నాయాళ్ళారా పొద్దు యాడికొచ్చిందో జూసినారా. మిమ్మల్ని నమ్ముకొంటే ఇంగీ సమ్మత్సరం బోగిమంటలు ఏసినట్టే,” గూనోడు మా ఇద్దర్నీ ఉరిమిజూస్తా గెట్టిగా కేకలు ఏసినాడు.
తలెత్తి జూస్తే నిజిమే, పొద్దు గంగిరేణి చెట్టు మొదులు దాటి పైకి ఎక్కేసింది. అప్పుటికే గుడ్డోడు, కుంటోడుగూడా వొచ్చేసి ఉండారు.
“వొరే జగ్గా, కత్తి త్యాలేదు రా. ఆ కత్తి ఎత్తుకోని మా నాయిన పొయ్యిలో కట్లు కొట్టుకోని రావడానికి అడివికి ఎల్లబారి పొయ్యినాడు.” గుడ్డోడు నసిగినాడు.
“ఎగిసి తన్నినానంటే ఆమడ దూరంలో ఎల్లి పడతావ్ నాకొడకా. నంగినంగిగా ఎప్పుడు కూస్తా వుండాడో జూడు నాకొడుకు…” గూనోడు ఎగిరి పడినాడు.
“జగ్గా, ఇదిగో నేను దెచ్చినాను కత్తి. తెల్లోడి దెగ్గిర గూడా ఉండాది లే.” మాయమ్మకు తెలీకుండా ఈపు ఎనకాల చడ్డీలో దోపుకున్న కత్తిని చొక్కా కిందనించి తీసి వోడి కళ్ల ముందర పెట్టి పొడుగ్గా జూసినాను. తెల్లోడు గూడా ఆ మాదిరిగా జేస్తానే గూనోడి మొగంలో సిగ్గుమాలిన నవ్వు కనిపిచ్చింది.
“సర్లే పదండి, పదండి. ఇప్పుడే శానా ఆలీసం అయిపొయ్యింది.” ఆకాశాన్ని తాకతా వుండే ముక్కును ఎడంచేతి చూపుడు ఏలితో రుద్దుకుంటా, మూడు కాళ్లతో ముందు కదిలినాడు.
కుంటోడి పేరు జనార్దన. వోడికి కుడికాలు సొట్ట. అంటే మోకాలి దెగ్గిరనుంచి సన్నగా ఏలాడతా వుంటాది. అందుకే మేమేగాదు ఊలోళ్ళంతా వోణ్ణి కుంటోడనే పిలిచేది. ఇంగ ఎంగటేస్పర్లుగోడికి వుండే రొండు కళ్ళల్లో ఒకటి మెల్ల కన్ను. ఈడు గుడ్డోడన్న మాట. సుబ్బారావుకు సోబి రోగం. మొగమంతా తెల్లగా మచ్చలతో పాలిపొయ్యినట్టు ఉంటాడు. వోడి ముద్దు పేరు తెల్లోడు.
ఇంగ నాపేరేదైతే ఏంది గానీ, గాలి తోలితే పడిపొయ్యే మాదిరి సన్నగా ఉంటాను. ఎప్పుడూ నన్ను ఎవురూ పేరుతో పిలిసిన పాపాన పోలా. తప్పీదారీ పిలిసినా రొండోమారు బక్కోడా అని కేకేస్తే దప్ప నేను బొదులిచ్చేది ల్యా.
చెప్పనేలేదు కదా. అవును, మా గూనోడికి మూడు కాళ్లే.
అంటే వోడి సొంతానికి ఉండే కాళ్ళు రొండే. ఒక కాలు సొట్టది. రొండో కాలు పొట్టిది. నడవడానికి యాడ పనికొస్తాయి.
అందుకే… మా గూనోడు ఎదురు కట్టితో మూడో కాలు మొలిపిచ్చుకుండాడు.
అసలు గూనోడి అవతారమే బలే తమాసాగా ఉంటాది. ఎప్పుడూ గుండు కొట్టుకోని ఉంటాడు. కూసిగా వుండే మొగం. పెద్దగా పొడుగ్గా మనల్ని పొడస్తా వుంటాది ముక్కు. ఎదురొమ్ము ముందుకు పొడుచుకోని, పొట్ట లోతుకు పొయ్యి, తిరగేసిన ఇంగిలిపీసు అచ్చరం “ఎల్” మాదిరి నడుంకాడ వొంగిపొయ్యి, వొంకరటింకర కాల్లతో…
“బక్కోడా మల్లికిలిస్తూ గానీ, బిరీన నడవరా ఎదవనాయాలా” ఊతకర్రతో గూనోడు ముడ్డి మీద పొడిసే కాడికి కతక్కన నోరు మూసేసి, బయటపడ్డ పొల్లు లోపలికి తోసేసినాను.
గూనోడితో సావాసం జేసేదానికి మల్లుకొని రొండు పెద్ద పండగలు గడస్తా వుండాయిగానీ, ఆ గూనిగాడిని జూసినప్పుడంతా నాకుమాత్రం నవ్వు తన్నుకోనొస్తాదబ్బా.
“కంప సెట్లు ఈ మాదిరి నరికితే అయినట్టే. బిరీన కానీండ్రా. వొరే బక్కోడా, వొంటూపిరితో నువ్వు నరకలేవు గానీ, వోల్లు కొట్టిన కంపను ఒక వోరకు ఈడ్చి పక్కన పెట్టరా.”
“ఏందిరా ఆ నరికే వాటం? జిల్లేడు గొమ్మతో బొంగరాలు యేవన్నా చెక్కతా వుండావారా గుడ్డోడా. పద్దన్నే రొండు ముద్దల సద్ది తాగతావు గదరా నాయాలా. బలంగా ఎయ్యిరా. ఒకే ఏటుకు తెగి పడాల.” మూడు కాల్లతోనే అట్టా ఇట్టా తిరగతా ఆర్డర్లు ఏస్తా వుండాడు గూనోడు.
గూనోడి వొగిసు ఎంతో తెలీదు నాకు. బడికి రాడు. అచ్చరాలు తెలీదు. కైల్లో పనికి గూడా ఎల్లడు. కానీ ఊళ్ళో వుండే ఎలిమెంటరీ ఇస్కూల్లో సదువులు ఎలగబెట్టే మా పిలకాయిలకంతా వోడే బడి బయట లీడరు.
ఎండాకాలం సెలవల్లో అయితే, అదిగూడా ఎన్నెల రేతిర్లలో అయితే ఇంగ మా సంబరం మొబ్బుల్ని ముట్టేది.
సముద్రంపాల్ చెట్ల కొమ్మలు ఇరుసుకొని వొచ్చి కిష్టావోల్ల కళ్ళాము కాడ నాలుగు పచ్చాలుగా నాటేది. ఇంట్లోవోళ్ళు అమ్మనాబూతులు తిడతా వున్నా ఇనేవోల్లమా. చినిగిపొయ్యిన, ఒక్కోసారి మంచియే – పంచిలు, చీరలు ఎత్తకొచ్చి, వోటిల్ని చింపి గుడ్డదారాలు చేసి, ఒకదానికొకటి ముడేసి నాలుగు పచ్చాలుగా నాటిన సముద్రంపాల్ కట్లను కలపతా కట్టేవోళ్ళం. ఇప్పుడు నాలుగు పక్కలా గుడ్డ దారాలు కట్టిన గోడ. మజ్జలో ఖాళీ. ఈ మాదిరితో డేరా యేసినాక, మొదులుపెట్టేది నాటకాలు.
“బావా ఎప్పుడు వొచ్చితీవు…”
“సెల్లియో సెల్లకో..”
కిట్ట పరమాత్మ, దుర్యోదనుడు… అందరం మేమే అయిపొయ్యి ఆరున్నొక్క రాగాలు తీస్తా వుంటే, ఊళ్ళోని గజ్జి కుక్కలన్నీ మా ముందర చేరిపొయ్యి, నోళ్ళతో వొంటిని సమ్మగా పెరుకులాడుకొంటా కుయ్యోమొర్రో అంటా మాతో కలిసిపొయ్యేవి.
ఆ డేరా డ్రామాలకు గూని జగ్గడే పనులు చెయ్యిపిచ్చే కాంట్రాక్టరు, గురువు. అసలు వోడు లేకుండా సెలవలు లేవు. వోడు లేకుండా ఆటలు లేవు. వోడు లేకుండా ఎన్నెల రేతిర్లు లేవు.
“నాగుబాము … నాగుబాము… రేయ్ బక్కోడా, పామురా…” జీరపొయ్యిన గొంతు ఇనిపిచ్చి అదిరిపడి జూస్తినా, నేను మట్టసంగా పేర్చిపెడతా వుండే కంప మండ్లకు చుట్టుకోని పడగెత్తి ఆడిస్తా వుండాది బారడు పొడుగు నాగుబాము.
నాకు కాళ్ళూచేతులూ ఆడలా. దారాపాతంగా సెమట్లు కారిపోతా వుండాయి. గూనోడి వొంక జూసినాను. అప్పుటికే కుంటోడు, గుడ్డోడు దూరంగా లగెత్తిపొయ్యి ఆమడ దూరంలో నిల్సుకోని గసపోసుకుంటా జూస్తావుండారు. తెల్లోడు దెగ్గిరే ఉండాడు గానీ, వోడి కాళ్ళూసేతులూ గడగడా వొణకతా వుండాయి.
గూనోడు మాత్రం ఎక్కడున్నోడు అక్కడే, చెయ్యికందే దూరంలో వుండాడు. ఎడమచెయ్యి చూపుడేలు పెదాల మింద పెట్టుకోని తల అడ్డంగా ఊపినాడు. అంటే మాట్లాడొద్దని చెప్తా వుండాడు. నాకు ఉచ్చ పడతా వుండాదిక్కడ.
గూనోడు సైగ్గా అడుగులేస్తా రొండు జానల దూరం ముందుకొచ్చినాడు. చేతల్లో ఉండే ఊతకర్రను మెల్లిగా పైకెత్తి, పాము చుట్టుకోని వుండే కంప మండలను కదిలిస్తా వుండాడు.
గభాలుమని వోడిపక్కకు తిరిగింది పాము. పడగను ముందుకు ఇసిరి బుస్ మనింది. సరసరామంటా కంప మండలమిందనుంచి కిందికి దిగేసి, కొంచేపు నిలిసి పడగెత్తి నేలకు కొట్టింది కోపంగా.
గూనోడి పని అయిపొయ్యిందనే అనుకొన్నాం మేమైతే.
“అబ్బా బిడ్డలు టిఫిన్లు తినరా?” లోపలినుంచి మా ఆడది ఏసిన కేక, పాముకంటే ఎక్కవగా జడిపించేసింది నన్ను. “పదండి, పదండి అమ్మ పిలస్తా వుండాది.” పిల్లకాయల్ని లేవగొట్టడానికి జూసినాను. వోళ్ళు యిన్లా. “వుండు మా నీదొకటి, గూనోడి కత బలే సస్పెన్సులో ఉండాది. వొస్తాముండు ప్లీస్, ఫైవ్ మినిట్స్,” అడుక్కొన్నారు.
“నువ్వు జెప్పు నాయినా…” ఉబద్దర పెట్టేస్తా వుండారు.
“ఉండండ్రా, అమ్మ పిలస్తా వుండాది గదా, పొయ్యి ముందు తినేసి రాబోండి.” కిందకి లాగతా వుండే వోల్ల సేతులు ఇదిలించుకోని పైకి లేసినా.
“నువ్వెప్పుడూ ఇంతే. ఈడదాకే కత జెప్పి ఆపేస్తావు. నీతో కటీఫ్…” పచ్చి కొట్టి లేచి ఇంట్లోకి పొయ్యినారు పిలకాయలు.
రొండేళ్లగా నా బుర్రలో తిరగతా వుండాడు గూనోడు. వోణ్ణి కతగా మార్చాలని ఆరేడు నెల్లగా తపన పడతా వుండా. కుదరడం ల్యా.
ఇప్పుడు వోడు ఎదురుగా లేడు గాబట్టి, ‘వోడు… ఈడు… గూనోడు…’ అంటా మాట మీరతా వుండాను గానీ, అప్పట్లో ఆ దైర్నం ఎవురికుండేది?
“మళ్ళీ ఆ పెట్టి ముందు కుచ్చున్నారా? ఇంగ మీకు మేము చచ్చామో, బతికామో గూడా తెలీదు…” నా పెళ్ళాం పాట అందుకునింది.
ఆమి దిక్కు జూసి నా మామూలు ఎదవ నవ్వు వొగటి నవ్వేసి, కీబోర్డు మింద వేళ్ళతో ఇనాయకుడి గుడికాడ మలుపు తిరిగి పాడుబడ్డ నేలబాయిని బయింగా దాటుకోని మా ఊళ్ళోకి మాయమై పొయ్యినాను.
దూరంగా కైలాసమ్మ ఇంటికాడ ఆకాశాన్ని తాకతా వుండాయి బోగి మంటలు. ఇదిగో మా పక్కనే కిష్టా వాళ్ళ కళ్ళాములో భగభగా రగలతా వుండాయి. పాడైపొయ్యిన మడకలు, కాడిలు, బండి నొగలు అన్నిటినీ మింగతా చిటపటా చటచిటా అంటా మెలికలు తిరగతా వుండాయి.
మా ఇంటి ముందు గూడా ఏం తక్కవ కాలేదు. గూనోడి పున్నెమా అని, నెల్లాళ్ళు అందరం గలిసి అడివిలో కొట్టుకోని వొచ్చిన కంప చెట్లు బోగి మంటల్లో కాలతా వుండాయి.
“వోడు బక్కోడు రా. రొవంత ఎక్కువ కంప ఇద్దారి పాపం.” చెప్పిన గూనోడి భయానికి సావాసగాళ్లు ఒకట్రెండు కంప మండలు ఎక్కవే పంచినారు నాకు.
కానీ ఈ బోగి మింద లేదు నా చూపు.
కిష్టా వాళ్ళ కళ్ళాము దాటి, సర్పంచి జయరామయ్య కల్లకవతల వంకర తిరిగిన దారిమింద వుండాది. ఆ దారిలోనే గూనోడి ఇల్లు ఉండేది.
పాము కాటు నిండి నన్ను తప్పిచ్చి పేణాలు కాపాడిన గూనోడికి వోరం దినాలుగా వొళ్ళు బాగలేదంట. వోడికి ఏమయ్యిందో చూసేదానికి లేదు, పట్టేదానికి లేదు. ఒగసారి ఆ దార్లో కనిపిస్తే వొంగోబెట్టి గుభీగుభీమని పిడి గుద్దుళ్ళు గుద్దినాడు మా నాయిన. ఈ దినం ఇంట్లో లేడు. కోడికోసరం కాపోళ్ళ ఇళ్లకు ఎల్లబారినాడు తెల్లారుజామనే. ఎట్టాగైనా సందు జూసుకోని గూనోడి ఇంటికి ఎల్లి వోడిని జూడాల.
ఆ పొద్దు పాము కనిపిచ్చిన దినం, ఆ దినం వోడి పానాలు అడ్డాం బెట్టి నా పానాలు కాపాడినాడు. కట్టితో కంప మండలను కదిలించినాక వోడి దిక్కు దిరిగిన పాము, ఆవేశంగా పడగ ఇప్పి నేలకు కొట్టింది.
గూనోడు జడవలా. అది వోడి జాతకంలోనే లేదు. చేతల్లోని ఊతకర్రను పైకి లేపేసి, బలంగా దాని పడగ మింద కొట్టినాడు. ఎన్నిసార్లు ఆ మాదిరి జేసినాడో నాకా బయంలో తెలీలా. వొణికిపోతా నిలబడ్డ నామీద గూనోడి చెయ్యి పడినాక చూస్తే, పడగ చితచితా నలిగిపొయ్యి చచ్చి పడి వుండాది నాగుబాము.
ఏమీ కాలేదు ఎవురికీ. సిద్దలయ్య సోమి దయవల్ల అందురం బతికి బయటపడినాం.
“బక్కోడు బయపడి పొయ్యినాడ్రా. కంప గొట్టింది ఇంగ జాలుగానీ ఈడిని ఇంటికి దీసుకెళ్దారి పదండ్రా. బయపడబాకరా బక్కోడా, నేనుండా గదా,” నా ఈపు మింద అరిచేత్తో గెట్టిగా తట్టి, పక్కనే మూడు కాళ్లతో నడస్తా గులకరాళ్ళ దార్లో కదలబారినాడు గూనోడు.
“ఆ ఊలోళ్ల పీతి గుడ్డలు ఉతుక్కోని అడక్కతినే జాతి నాకొడుకుతో కలవద్దని ఎన్నితూర్లు జెప్పాల్రా గాడిద కొడకా. ఇప్పుడు జూడు ప్రాణాల మిందకే తెచ్చినాడు,” ఇంటికొస్తానే ఎగిరి పడినాడు నాయిన. కుంటోడు, గుడ్డోడితో నన్ను ఇంట్లోకి పంపినాక, పాము కత ఇని నిప్పు తొక్కిన కోతిలా ఎగరతా వుండే నాయిన మాటలు దూరంగా గెడ్డివామి ఎనకాల ఆయనకు కనిపిచ్చకండా నిలబడిన గూనోడికి ఇనిపిస్తానే ఉండాయని తెలుసు నాకు. నాయన కొడతా వుండే దెబ్బలకన్నా, గూనోడు ఆయన నాశినం మాటలు యినేస్తా ఉండాడన్న దుక్కంతో ఎక్కిళ్ళు పెట్టి ఏడస్తా వుండాను.
“నాయినా జగ్గా. నన్ను వొంటిదాన్ని జేసి ఎళ్లిపొయ్యినావా నాయినా…” గుండిల్లో దేవులాడినట్లు ఇకారంగా ఏడుపు ఇనిపిచ్చింది ఉన్నట్టుండి. గూనోడి గుడిసున్న దిక్కు జూస్తే, తెల్లోడు లగెత్తుకోని వొస్తా వుండాడు నా దెగ్గిరికి.
“రేయ్ బక్కోడా, గూనోడు చచ్చిపొయ్యినాడంటరా.” మా తలాకిట్లో బోగి మంట ముందు గుచ్చోని గూనిగాడి గురిచ్చే యాతన పడతా వుండే నాకు, గస పోసుకుంటా తెల్లోడు అరిసిన అరుపు నీళ్ళ బాన పగిలినట్టు ఇనిపిచ్చింది.
“మా ఇంట్లో గెంజి కాసి రొండు దినాలు అయిందిరా బక్కోడా…” నీరసంగా నవ్వతా గూనోడు అప్పుడప్పుడూ జెప్పే మాట గుర్తుకొచ్చి ఏడుపు తన్నుకోనొచ్చింది.
“నేను మొందులు బాగా మింగి, పాలు గుడ్డు తినాలంటరా. ల్యాకపోతే చెప్పాపెట్టకండా గుటక్కమని చచ్చిపోతానంట.” అప్పుడప్పుడూ ఊపిరి అందకుండా, కళ్ళు తేలేసి ఇచిత్రంగా చూసే వోడి చూపులు గుండిల్ని గుచ్చతా వుండాయి.
“నాయనా, ఏందే కళ్ళల్లో నీళ్ళు? మ్మోవ్, నాయన యాడస్తా వుండాడు మ్మో…” పిలకాయల అరుపులకు చటుక్కున ఈ లోకంలోకి వచ్చి తడుముకుంటే, నిజమే. కనుకొలుకుల్లో తడి తగిలింది.
వాళ్ళమ్మ వొచ్చే లోగానే, లుంగీతో కళ్ళు తుడుచుకోని ల్యాప్టాప్ షట్ డౌన్ చేసినాను. గూనోడి కత ఇంక రాయలేనేమో. అది రాస్తా ఈ యాతన నేను పడలేను.
అయినా నా పిచ్చిగానీ, వోడి బతుకులో కై గట్టాల్సినంత కతేడ వుండాది… దోసిడు కన్నీళ్ళు దప్ప!
