[కీర్తిశేషులు దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి వచనరచనలలో పేరెన్నికగన్న ఈ కథను ఓరియంట్ లాంగ్మన్వారు ప్రచురించిన పుష్పలావికలు సంపుటం నుంచి మళ్ళీ మీ ముందుంచుతున్నాం. — సం.]
ఈ నడుమ మా ఊరికి వెళ్ళి ఉండాలని నాకు అదే పనిగా అనిపిస్తుంది.
మా గ్రామం ఎన్నడో వదిలేశాను. మహానగర వాసానికి మరిగాను కూడా. అయినా, అలాగ అనిపిస్తుంది నాకిప్పుడు అక్కడికి వెళ్ళి ఉండిపోవాలని!
ఈ మధ్య నా తల్లి మీదికి కూడా నా మనస్సు ఊరికే పోతుంది; మా అమ్మ ఎప్పుడో పోయింది.
పదిమందిని కూడగట్టుకుని ఎప్పటికప్పుడు కాలక్షేపం చేయడం అలవాటు నాకు. నాకెప్పుడూ చుట్టూ జనం ఉండాలి. మనిషంటే మహాఇష్టం నాకు.
నా ఆప్తమిత్రులొకరున్నారు, బహు భాషావేత్త, బోలెడు చదివారు, ఆయనంటారూ, “ప్రపంచంలో దొరికే గ్రంథాలన్నీ ఒక నిర్జనస్థలంలో పెట్టి, అక్కడికొక్క నరమానవుడు రాకుండా కట్టుదిట్టం చేసి, నన్ను వదిలివేయండీ; నేను హాయిగా ఉంటాను,” అని. నాకాయన్ని చూస్తే భయమూ, జాలిన్నీ! అలాంటి చోటికే నన్ను విసిరివేయవలసి వస్తే, “ఏ మొరకునో మొరటునో ఒక మనిషిని మాత్రం కూడా ఇయ్యండి” అని మొరపెట్టుకుంటాను.
అలాంటి నాకు పట్టణవాసం మరీ బాగుంటుంది కదా, సావాసాలతో సందడులతో.
ఎన్నేళ్ళనుంచో నగరంలో ఉండిపోయాను నేను. అలా ఉండగా ఆప్తులు ఒక్కొక్కరే ఈ లోకం నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు అమ్మా, అక్కాచెల్లెళ్ళూ, అనుగు నేస్తాలూనూ! అయినా ఒంటరితనం అనేది, అంటే, “నా కెవ్వరూ లేరు” అనేభావం, నా మనస్సులోనికి ఎన్నడూ రాలేదు. ఒక ఉత్సవంలాగ జరిగిపోయాయి అరవైఏళ్ళు, కొత్త మొగాలతోనూ, కొత్తవేడుకలతోను, తిరునాళ్ళలాగా.
అసలు నాకు నెమరువేత డోకు. అంటే, వెనక్కి తిరిగి చిన్ననాడో, ఎన్నడో జరిగినవి జ్ఞాపకం చేసుకోడం. అది అసహ్యం.
ముసలితనానికి ముందుకు చూసుకోడం భయం. దానికి వెన్నుమీద ఉంటాయి కన్నులు.
ముసలితనం, పాపం, ఏకాకి. పదిమందిలో ప్రవాసం అది. నాకది కిట్టదు. “నా చిన్నప్పుడేం, ఒకసారేం” అని ఎవరన్నా మొదలెడితే నాకు మంటేసుకొస్తుంది.
ఇలాగ ఉండగా, పడింది పిడుగు నామీద. అలాగ బతుకుకుంటూ వచ్చిన నాకు తగిలింది అఘాతం, అదివరకెన్నడూ ఎరగనిది.
అప్పుడయిపోయాను ముసలిని, ఒంటరిని.
అన్ని ఏళ్ళూ గడిచీ, అంతదవ్వూ నడిచీ, ఆఖరున హఠాత్తుగా ఆగిపోయినట్టనిపించింది యాత్ర, కాళ్ళు రెండూ లేక, కళ్ళు రెండూ ఆరిపోయి, కడపలకూడా లేక, తెరువుకూడా చచ్చిపోయి జరగనట్టు.
అమ్మయ్యో! అంతకన్నా దుస్థితి మరొకటుండదు.
అప్పుడు కనిపించింది నాకు ఒంటరితనం.
ధారాళంగా ఇటూ అటూ పోయే రహదారిమీద అనునిమిషం అటూ ఇటూ పోయేజనాన్నీ, బళ్ళనీ, సందళ్ళనీ చూస్తూ, కదలలేకండా నిలిచిపోయింది బ్రతుకు, మైలురాయిలాగ.
అప్పుడెందుకో అన్నాను, ‘అమ్మా’ అని. ఎన్నాళ్ళకో అమ్మఒడిలో తల పెట్టుకొని పడుకోవాలనిపించింది. అప్పుడు అమ్మ నా ఒళ్ళు నిమిరితే, మళ్ళీ అడుగు వెయ్యగలననిపించింది. అప్పుడే మనస్సుకూడా వెనక్కి చూడడం ప్రారంభించింది, చిన్ననాటిదాకా.
అప్పుడే మా ఊరిమీదికి కూడా పోయింది మనస్సు. అప్పటినుంచీ నా ఊహలు ఈ ముసలితనంలో అక్కడికే పరుగెత్తుతున్నాయి, సాయంకాలం గూటిలోకి పక్షుల్లా. ఏవో జ్ఞాపకం వస్తాయి ఎల్లవేళలా, మా అమ్మలాంటి మా గ్రామమూ, పరిసరాలూ, అక్కడి ప్రజలూనూ.
ఈ మధ్య ఒక ప్రియమిత్రుడు, “నీవిప్పుడు ఏమి మాట్లాడినా, ఏమి వ్రాసినా, మీ పల్లెటూరూ, ఊరుపక్క ఏరూ, ఏటి ఒడ్డున వెదురుపొదా, పొదచెంత పుంతా, పుంతకి వెనక మావితోటా, తోట కవతల వరిచేలూ, గట్లూ, పంటకాలువలూ, కోతలూ, నూర్పులు రామమందిరాలూ, రచ్చ చావళ్ళూ, రావయ్య కాపూ, హరిశాస్త్రులూ, పాలేరూ, ఊరిబావి దగ్గర సూరమ్మా పేరమ్మా, నారయ్య పెళ్ళీ, ఇదే గొడవ! చాదస్తుడవైపోయావు! ఇంత పట్టణం, ఇందరు జనం, ఇన్ని సందళ్ళూ, నిన్ను పలికించడం లేదా?” అంటూ ఎత్తిపొడిచాడు.
ఊహుఁ! ఏం చెయ్యను?
పట్టణం ప్రవాసమైపోయింది నాకు. ఇది ఆప్యాయంగా నాతో మాట్లాడదు. స్వార్థం ఇది. పట్టణంలో ఉన్నన్ని గోడలు మా పల్లెలో లేవు. ఏమో ఏమైతేనేం ? నేను మాత్రం ఇక్కడ ప్రవాసినైపోయాను. విజనస్థలం అనిపించేటంత జనాభా ఉంది ఇక్కడ. అక్కడ మనిషికీ మనిషికీ, మనిషికీ చెట్టుకీ పిట్టకీ చేనుకీ గట్టిచుట్టరికం ఉంది.” అని మా ఊరును వర్ణించడం మొదలుపెట్టాను ఇలాగ-
మా ఊరు వెళ్ళిపోతాను, వెంటనే వెడతా.
వెళ్ళి అక్కడ చక్కని, చల్లని, ఇల్లు కడతా. పూరిల్లు. ఇంటి చూరులంట శాంతి, చల్లదనమూ ఎప్పుడూ నా మీదకి జారుతూ ఉంటాయి.
మా ఊరికి ఉత్తరాన ఒక చెరువుంది. దక్షిణాన కూడా ఒక చెరువుంది. గాలి ఊదినప్పుడూ, మీలు ఎగిరినప్పుడూ, నీళ్ళు గలగలమంటాయి. అప్పుడు చెరువు నిద్దరలో నుంచి ఒళ్ళు విరుచుకున్నట్టనిపిస్తుంది.
ఆ చెరువు గట్టున ఉంటుంది మా ఇల్లు.
మా యింటి వెనకాలే వెలమదొరల దివాణం ఉంటుంది, నల్లని ఎత్తైన పేద్ద రాతిగోడలతో. ఒక గోడ బీటవేసి దానిలో నుంచి రావిమొలక లేచి నిలబడి ఉంటుంది. ఆ రావి మొలకను చూస్తే దిగులు వేస్తుంది, పెరిగి పెరిగి గోడను బద్దలుచేసి పడగొడుతుందేమో అని.
ఇందుమతి చనిపోయాక అజమహారాజు హృదయాన్ని ఛేదించే శోకశంకువును సౌధతలాన్ని భేదించే రావి మొలకతోనే పోలుస్తాడు కాళిదాసు.
ఆ దివాణపు గోడలలోనుంచి ఒక్కొక్క వేళ రాణివాసపు నిట్టూర్పులు విన్నట్టూ, వేరొక్కసారి వెలమవీరుల హుంకారాలు విన్నట్టూ అనిపిస్తుంది.
ఎప్పుడైనా హజారం దగ్గర దొరగారు కనబడతారు. ఆయన ఆరడుగుల ఎత్తు. విరిచి వెనక్కు కట్టిన జరీ అంచుపంచ, డక్కిణీ తరహా పాగా, బుగ్గ మీసమూ, అంగరఖా, “కట్టెర్ర సెరల దీర్ఘవిలోచనములూ,” నుదిటిపై పెద్దనామాలూ, వీటితో ఏ బొబ్బిలి యుద్ధవీరులో అనిపిస్తారు ఆయన.
దివాణానికి ఎదురుగా రావిచెట్టు ఉంటుంది. ఆ పక్కనే రామకోవెల. రావిచెట్టు క్రింద పెద్ద అరుగు ఉంటుంది. ఆ అరుగు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఎవరో నలుగురు దానిమీద కూర్చుని, ఊసులాడుకుంటూనే ఉంటారు. ఇద్దరు కన్నుమూసుకుని ఉంటారు.
ఆ రోజులలో మా ఊరే అరమోడ్పు కన్నులాగా ఉండేది, మహాశాంతంగా, మేలుకుని కలలు కంటున్నట్టు.
మా ఊరిని గురించీ మా ఊరిలో జనాన్ని గురించీ రావి చెట్టుకి తెలియని సంగతే లేదు. ఊళ్ళో అందరి ఊసులూ వింటుంది. కలహాల కబుర్లు వింటుంది. పంచాయితీ తీర్పులు వింటుంది. రాత్రిళ్ళు రామాయణం పురాణం వింటుంది. అందుకనే మా ఊళ్ళో ఒక సహజకవి అన్నాడు,
“రామశాస్త్రి భారతం పురాణం చెపుతుంటే, రావిచెట్టు ఊ కొట్టు, రంగయ గురుపెట్టు.” అని.
పురాణం అంటే జ్ఞాపకం వచ్చింది. రాత్రి తొమ్మిది గంటలు అయాక మా ఊళ్ళో పురాణపఠనం ప్రారంభం, మా ఇంటిముందు ఖాళీ స్థలంలో. ఇటు రామశాస్త్రిగారు కూర్చుంటారు, ముందు వ్యాసపీఠంతో దానిమీద పెద్ద పంచాంగం సాటి పాతకాలపు భారతం. పక్కన ఆముదం పోసిన ప్రమిదతో సెమ్మా.
నిజానికి శాస్త్రిగారికి పుస్తకం అక్కరలేదు. భారతం కంఠస్థం. ఎదురుగా చీకటిలో ముదుక దుప్పటులు కప్పుకునీ, ముసుగులు వేసుకునీ, నీడలలాగ గ్రామవాసులు. పైన విశాలాకాశంలో ధగధగ మెరిసే నక్షత్రాలు, చచ్చి స్వర్గాన ఉన్న భారత వీరుల్లాగ, ఈ లోకాన్ని కనిపెట్టేవాళ్ళ చూపుల్లాగ. ఎదురుగా కూర్చున్న శ్రోతలనుంచి కూడా అక్కడా అక్కడా చుక్క వంటి చుట్టనిప్పు కనబడుతుంటుంది. ఆ చీకట్లో శాస్త్రిగారి గొంతు ద్వాపరయుగంనుంచి వస్తుంది. ఆయన కంఠరవ పక్షాల మీద శ్రోతల మనస్సులు ఆదికాలాలదాకా ప్రయాణం చేస్తాయి.
పగలు మన కళ్ళు కనబడినంత మేరే చూస్తాయి. రాత్రి రామాయణం దాకా చూస్తాయి.
ఆముదం దీపం కూడా పురాణం ఆలకించడం నేనెరుగుదును. ఆలకించి అటూ ఇటూ తల ఊపుతుంది.
మా గ్రామవాసుల్లో రామాయణ భారత కథలు తెలియనివాళ్ళు లేరు. ఎందరికో భారతంలోనివి వందల కొలది పద్యాలు వచ్చు. అయితే, వాళ్ళు అక్షరాస్యులు మాత్రం కారు.
అయినా మహర్షులు వ్రాసిన గాథలు వినివిని, మా గ్రామవాసులు భూలోకంనుంచి పరమపదం దాకా నిత్యమూ రాకపోకలకై నిచ్చెన కట్టుకున్నారు. ఆ సంస్కృతి ఆవరణలో వాళ్ళది ఒకే ఒక సంసారం. కనుక జాతి అంటూ, ధనమంటూ, చదువంటూ తేడాలు లేకుండా, “మాఁవా అన్నా పిన్నీ వొదినా” అయిపోయి అందరూ కలిసి ఉండేవాళ్ళం. రామశాస్త్రి పురాణం చెపుతుంటే నిద్రపోయే రంగయ్యకాపు నాకు బావ. ఎంత నిద్రపోయినా, అతనికీ వచ్చును భారతంలో పద్యాలు.
మా ఇంటి పక్కనున్న మాదన్న పద్మసాలి. చెంతనే ఉన్న మామిడిగుబురులోని కోయిల కన్నా, మలయానిలం కన్నా, ముందుగా రాట్నాన్ని లేపేవాడు అది జుమ్మని తిరుగుతూంటే, వీధి కొకపక్కన, వీధినిలువున పడుగుపేకలు పన్నేది అతని పెండ్లాం.
కొంతదూరాన మా కావయ్యమేస్టారుగారి బడి.
మా గురువుగారిని గూర్చీ, బడిని గూర్చీ మరొకసారి బాగా జ్ఞాపకం తెచ్చుకుని చెపుతాను. ఇవి మాత్రం కొట్టవచ్చినట్లు ముందుకు తోసుకుని వస్తున్నాయి. కనుక చెపుతాను ముక్కు కొసదాకా జారిన కళ్ళజోడూ, ఏడాది పొడుగునా తొడుగుకునే కోటున్నూ.
కొందరు పిల్లలు “రావిచెట్టుమీద చిలకోయ్, కాఁవయ్యమేస్టరు పిలకోయ్” అని పాడేవారు. వాళ్ళకి కూడా ఆయనంటే భయమూ, ఇష్టమూను. నాకు మానాన్నగారి మీద ఉన్నంత ఇష్టమూ, భయమూ ఆయన అంటే.
ఆ బడి పక్కనే శ్రీరాములు అంగడి. అంగడిని మా వైపు కొట్టు అంటారు. నల్లగా, పెద్దనామాలూ అతనూ వెంకటేశ్వరస్వామిలాగ ఉండేవాడు కొమ్ములతోటి ఉన్న చెట్టు సెమ్మా చుట్టూ రామభజన నడపడంలో శ్రీరాములు దిట్ట.
జియ్యన్న మరీని; జియ్యన్న భక్తుడు. నిజంగా భక్తుడు. అతనికి పూర్వగాథలలో పూర్తిగా నమ్మకం. అతనివంటివాడే నయం అనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. నమ్మకపోతే పూర్తిగా నమ్మగూడదు. నమ్మితే సందేహించకుండా, పదితలల రావణాసురుణ్ణో వేయిచేతుల కార్తవీర్యుణ్ణో పడగొట్టడానికి అవతరించిన పరమాత్ముని గాథలన్నీ నమ్మాలి. అలాగ పట్టుకుని నమ్మేవాళ్ళకి గట్టిగా పడతాయి అడుగులు యాత్రామార్గం మీద.
మాది కవిపండిత కుటుంబం, ఎన్నితరాలనుంచో.
మా ఊళ్ళో కూచిమంచి తిమ్మకవి సార్వభౌములు కూడా కాపురం ఉండేవారు, వారి కడపటి రోజుల్లో. గ్రామానికి తూర్పున పెద్దమట్టిగోడలతో ఆవరణ కనబడుతుంది. దానిలో ఉండేదేమో వారి వీడు. ఆ పడిపోతున్న గోడల సందులలోనుంచి జిల్లేడు పొదలూ అవీ కనబడుతూ ఉంటాయి. నా కటువైపు వెళ్ళడం కొంచెం బెదురు.
అవి దాటగానే వరి పొలాలు. ఒకచోట పొలానికీ పొలానికి నడుమ, సరిహద్దుగట్టుమీద, పెద్ద తాటిచెట్ల వరస తీర్చివేసినట్లు!
గాలిలో తాటాకుల మర్మరం ఎంత బాగుంటుంది! గాలి వేళ్ళు తగిలి పరవశమై తాటిచెట్టు తలూపుతూ ఎంత రక్తిగా కథ చెపుతుంది! నేననుకునేవాణ్ణి, ఆ తాళవనం మా ఊరి వెలమ దివాణంవారి పాతకథలు చెపుతుందని. తరువాత తెలుసుకున్నాను, మరొక కవిగూడా విన్నాడని, “పాటలాధరి చెట్ల చేమలకై పాడుతుంటే, తాళవనమున ఆగి చంద్రుడు తాను చెవి ఒగ్గడం.”
ఆ తాటితోట చెప్పినట్టే, ఎత్తుగా ఉన్న దివాణపు స్తంభాలమీది విటంకాలనుంచి పావురాలూ చెప్తాయి.
పావురపు కువకువను అరమోడ్పు కన్నులతో వినాలి. అది చల్లగానూ ఉంటుంది. అంతరంగాన్ని ఆవంత కదుపుతూనూ ఉంటుంది.
అక్కడ, ఆ తాటి తెరువు పక్కన, గట్టున కూర్చుంటే ఆకుల రవళీ, దూరాన ఓ చెట్టు కింద రెండు మూడు దూడల్ని కాస్తూ పుట్టగోచీ పాగాతో గొల్లపిల్లవాడూ, నడుమనడుమ వాని పాటా, ఆవుదో దూడదో అంబారవమూ, చిటుక్కున చెట్టుకొమ్మమీదినుంచి వడ్రంగిపిట్ట టక్కు టక్కుమని కొట్టే చప్పుడూ, తుర్రున ఎందుకో ఎగిరే పాలపిట్ట రెక్క నీలిచాలూ, హఠాత్తుగా దూకిదూకి అడ్డుగా పరుగెత్తే లేగదూడా, అప్పుడూ ఇప్పుడూ దూరంనుంచీ దగ్గరనుంచీ ఒక పొలికేకా, నూర్పులదో కోతలదో సందడీ, గాలి రెక్కల మీద అడపా తడపా వచ్చే గ్రామకలకలమూ, గట్లనూ పుట్లనూ దాటి గంతులేస్తూ పోయే గూడులేని బండీయెడ్ల మెడగంటల సవ్వడి, చక్రపుటిరుసుల కిరకిరా, ఆరుకాలాలూ కాలాలకనుకూలంగా వీటి అన్నిటిలోనూ మార్పులు, చేనూ తోటా చెరువూ పల్లే ప్రజా కలిసి, ఒకరినొకరు తెలిసీ, బతకడమూ, ఎంత బాగుండేది, ఎలా ఉండేది మా ఊరు!
మా ఊరు పక్కనే మరీ పెద్ద ఊరు ఉండేది – దానిని పట్టణం అనవచ్చేమో! అది మా రాజుగారిది.
అక్కడికి రోజూ వెళ్ళేవాణ్ణి నా తండ్రితో పెత్తండ్రితో. ఎలాగ? ఒక్కొక్కప్పుడు చెరువు ఒడ్డునా, పొలంగట్లా, పుంతలా, మలుపులా, బడికి నడిచివెళ్ళేవాళ్ళం.
రెండు మైళ్ళ దవ్వు కాశీ అంత దూరంగా అప్పుడు ఉండేది. అయినా బాగుండేది.
ఒక్కొక్కప్పుడు నేను రంగయ్య కాపుమూపుమీద కూర్చుండేవాణ్ణి. నేనంటే అతనికి గారాం. చెప్పానుగా, అతన్ని బావ అనేవాణ్ణని. అలా నడిచి వెడుతుంటే, మా నాన్నగారో బాబయ్యా నాకు అమరం చెప్పేవారు, రఘు వంశమున్నూ.
ఇంతలో, దూరాన్నుంచి, దక్షిణకాశీ అయిన ఆ పట్టణం పరిసరాల ఉద్యానవనాల్లోనుంచి, ‘మేము ఉన్నాం నీ కేమి భయం లే’ దన్నట్టు పరమశివునిదిన్నీ, మాధవ దేవునిదిన్నీ, ఆలయ గోపుర విమానాలు ఠీవిగా ఆకాశంలోకి పొడుచుకుని కనబడేవి.
అప్పుడు నా కనిపించేదీ, ఆ పట్టణం యావత్తూ ఉభయ సంధ్యాసమయాల్లో కోవెలవైపు తిరిగేదనిన్నీ, పగలల్లా మహారాజ మందిరంవైపు తిరిగిఉండేదనిన్నీ.
ఎవరో అన్నారీమధ్య. ‘ఇప్పుడాపట్టణం కోటవైపుగాని కోవెల వైపు గాని మొగం తిప్పడం లేదు. వాటివైపు వీపు తిప్పి పంచదార ఫేక్టరీ వైపు తిరిగి చూస్తుం’దని; నేను వినిపించుకోలేదు ఆ మాటలు!
ఇలాగ మా ఊరిని గురించి నా నేస్తంతో చెప్పుకుంటూ పోతుంటే, ఎన్నో స్మృతులు దొంతరలు దొంతరులుగా మనస్సు లోనికి తోసుకుంటూ వచ్చాయి.
కొన్ని స్మృతులు దిగులు కలిగిస్తాయి. మనస్సులోకి వచ్చి, మునిమాపు చీకట్లో మందిరంలోనికి వచ్చే గబ్బిలాల్లాగ. మరికొన్ని ఉదయాన్నే ఇంటి కిటికీలోనుంచి లోనికి చొరబడి గిలిగింతలు పెట్టో, ఒళ్ళు నిమిరో, లేపే సూర్యకిరణంలాగ, గాలి కెరటంలాగ ఉంటాయి. కొన్ని అడపా తడపా పెళ్ళి పందిట్లో అత్తరు వాసనలాగ తగుల్తాయి. వేరొక కొన్ని క్రేవనే ఉన్న ఇల్లాలి కుంతలాలనుంచి తటాలున సాంబ్రాణి వాసనలాగ స్ఫురిస్తాయి. కొన్ని వేసంగి సందెలో మల్లె తావి లాగ పులుగు కూతలాగ హాయి అనిపిస్తాయి.
నా మిత్రునితో నా గ్రామ విశేషాలను గురించి చెపుతుంటే ఇన్ని రకాల స్మృతులు ఎన్నెన్నో నా లోపల అలముకొన్నాయి.
మరి ఆ హాయిలో, ఆ ఆవేశంలో మా గ్రామానికి బయలుదేరి వెళ్ళాను.
“చంద్రంపాలేనికి త్రోవ ఇదేనా?”
“అవును ఈ రోడ్డక్కడికే పోతుంది. ఈ బస్సుకూడా అక్కడికే. అదుగో దూరాన ఆ టూరింగు సినిమా డేరా!”
త్వరగా ఊళ్ళోకి నడిచి వెళ్ళాను. అక్కడ నా చంద్రంపాలెం లేదు.
మా ఊరు పోయింది!