అస్తిత్వవాద సాహిత్యం: 4ఆ. లూయిజీ పిరాండెలో

[లూయిజీ పిరాండెలో రాసిన 15 కథా సంకలనాలలో ఒక సంకలనం పేరు Tales of Madness. ఆ పిచ్చికథలలో ఒకదాని గురించి మనం యిక్కడ చదవబోతున్నది — సం.]

“అత్త, అల్లుడు”

(Mrs.Frola and Mr. Ponza, her son-in-law)
“పిచ్చి కథలు” (Tales of Madness) లో ఒకటి

కథ (సంగ్రహానుసరణ):

దేవుడా! ఊహించగలవా? మనకు, మనందరికీ, నిజంగా పిచ్చి పట్టిస్తోంది.ఆ యిద్దరిలో ఎవరికి పిచ్చి? ఆమెకైనా పిచ్చి అవ్వాలి, అతడికైనా అవ్వాలి. మరో మాటకు అవకాశం లేదు. ఇద్దరిలో ఒకరికి తప్పకుండా పిచ్చి. కాని ఎవరికి? ఇక్కడే జరుగుతాయి యిటువంటివి, యిదొక దిక్కుమాలిన ఊరు, ఎక్కడెక్కడి పిచ్చివాళ్లకు యిదొక మక్కా.

అసలు విషయం మొదటినుండీ ఒక వరసలో చెప్పడం మేలు.

నమ్మండి, నా బాధ అత్త గురించి కాదు, అల్లుడు గురించి కాదు. మూడునెలలుగా యిక్కడి జనం ఆందోళనలో బతుకుతున్నారు. కాదనను, అత్తాఅల్లుళ్ళ జీవితంలో ఏదో తీవ్రవిషాదం జరిగింది. కాని ఆ యిద్దరిలో ఒకరికి అదృష్టవశాత్తు మతిపోయింది, మరొకరు శాయశక్తులా ఆ పిచ్చిని కాపాడుతున్నారు. ఎవరికి పిచ్చి, ఆ పిచ్చిని పోషిస్తున్నది ఎవరు అని మాత్రం చెప్పడం దుస్సాధ్యం. అంత చక్కగా తోడ్పడుతున్నారు వాళ్ళు ఒకరికొకరు, రెండవమనిషి పిచ్చిని కాపాడడంలో. ఊరంతా ఉడికిపోతోంది మూడునెలలుగా, నేనడుగుతాను, ఇది న్యాయమా, చెప్పండి?జనాలను యిలా నలపడం? ఊళ్ళో ప్రతి ఒక్కరు వాళ్ళను రోజూ చూస్తారు.ఇద్దరిలో ఒకరికి పిచ్చి అని తెలుసు. కాని, ఎవరికి? బుర్ర పగలకొట్టుకున్నా అర్థం కావడం లేదు. ఇది ఎప్పటికీ తేలదా? ఏది నిజం, ఏది భ్రమ?

ఇక్కడి జనాలను యిలా నెలల తరబడి అయోమయంలో ఉంచి పిచ్చబట్టించడం న్యాయమా? నిజమనుకునే ప్రతిదీ భ్రమ, భ్రమ అనుకునే ప్రతిదీ నిజం కాకూడదని ఏమిటి? భ్రమ కంటె నిజం ఏవిధంగా మెరుగు, అన్న అనుమానం కలగడం సహజమా కాదా? నేనే యిక్కడి కలెక్టర్ అయిఉంటే, అత్తను అల్లుణ్ణి యిద్దరిని శాంతిభద్రతలదృష్ట్యా ఊరు విడిచి వెళ్ళిపొమ్మని ఉత్తరువు చేసేవాణ్ణి.

అసలు ఏం జరిగిందంటే:
మూడు నెలల క్రితం యీ అల్లుడు. కలెక్టర్ కు పి.ఏ. గా యిక్కడికి వచ్చాడు. టౌన్ చివర ఒక చిన్న ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. చివరి అంతస్తులో, ఆ రెయిలింగ్ కు చిన్న చిన్న బుట్టలు తాళ్లకు కట్టి ఉన్నాయి. కావలసినపుడు ఆ బుట్టల్ని కిందికి జారవిడవవచ్చు.

అదే సమయంలో ఆయన సంపన్నులుండే ప్రాంతంలో ఖరీదైన మరో ఫ్లాట్ కూడా అద్దెకు తీసుకున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ? ఉండదా! అది అతడి అత్తగారికి అని చెప్పాడు. ఆరు రోజుల తరువాత ఆమె వచ్చింది అందులోకి. అల్లుడు ఒక్కడే స్టేషన్ కు వెళ్ళి ఆమెను తీసుకొచ్చి అపార్ట్ మెంటులో దించి వెళ్ళిపోయాడు.

చూడండి! ఒక కూతురు పెళ్ళి అయి, తల్లిని వదిలి మరో ఊర్లో భర్తతో ఉండడం ఎక్కడైనా జరుగుతుంది. కాని ఒక తల్లి, కూతురిని వదిలి ఉండలేక, ఊరు వాడ వదిలి, కూతురున్న ఊళ్ళోనే, ఆమెకు దూరంగా, మరో యింట్లో ఉండడమంటే? ఊళ్ళో అందరూ ఏమనుకుంటారు? సహజంగా, అత్తకు అల్లుడికి పడదు, ఒక యింట్లో ఉండడం అసంభవం. అల్లుడు ఎంత దుర్మార్గుడో, అనుకున్నారు మొదట్లో. అత్తగారు సర్దుకుపోయే మనిషి కాదనే అనుకుందాం. అయినా కూతురికోసం అన్నీ వదిలేసి, వెళ్ళిన చోటకూడా కూతురుతో కలిసి ఉండడం కుదరదని తెలిసికూడా. వచ్చేసిన ఆమె తల్లిప్రేమ గొప్పదై ఉండాలి, అనుకున్నారు. అత్తనుగురించి యీ సదభిప్రాయం ఏర్పడడానికి కారణం, అల్లుడు. రూపంలోను స్వభావంలోను క్రూరుడు అన్న అభిప్రాయం అక్కడివాళ్ళకు ఏర్పడడం. ఊళ్ళోకి వస్తూనే అత్త మృదు స్వభావం అందరినీ ఆకర్షించింది. అల్లుడు ఆమెను దూరంగా వేరే యింట్లో ఉంచడమే కాదు, కూతుర్ని కలవనీయడు కూడా.

కాని అత్త స్వయంగా అల్లుడిని ఎప్పుడూ బయటవేయలేదు. పైగా, అలా అల్లుడిగురించి జనం వ్యతిరేకంగా చెప్పుకోడమూ తనకు బాధాకరమన్నట్టు, “చాలా మంచివాడమ్మా! మా అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకుంటాడు. భార్యకు చిన్న కష్టం కలగనివ్వడు. భార్యకు కాదు, నాకు కూడా ఏది అవసరమైనా అడిగి అడిగి మరీ చేస్తాడు. క్రూరమా? కాదు కాదు. భార్య అంటే వల్లమాలిన ప్రేమ. ఆ ప్రేమంతా ఆమెకే. ఆమె తనకే సొంతం అంటాడు. అంతే, చూడడానికి క్రూరమనే అనిపిస్తుంది. కాని క్రూరుడేమీ కాడు. స్వార్థం కాదు. తనది సర్వమూ యివ్వడాన్ని కూడా స్వార్థమంటే, అనవచ్చు. కాని ఒక తల్లికి యింతకంటే ఏం కావాలి?”. అంటుంది అత్తగారు.

పైగా, కూతురిని కలవనీయడు చూడనీయడు అనడం కూడా నిజంకాదు. రోజుకు రెండుమూడుసార్లు చూస్తుంది కూతుర్ని. ఆమె కూతురున్న అపార్ట్మెంట్స్ కు వెళుతుంది. కూతురు పై అంతస్తులో బాల్కనీలోకి వస్తుంది.

“బాగున్నావామ్మా?”

“బాగున్నా మమ్మీ. నీవెట్లొ ఉన్నావ్?”

“దేవుడిదయ. ఆ బుట్ట కిందికి వదులు.”

బుట్టలో తల్లికి ఉత్తరం దిగుతుంది. ఆ రోజు క్షేమసమాచారంతో,

అత్త అల్లుడిని సమర్థించేకొద్దీ, జనానికి అల్లుడి పట్ల అసహ్యం ఎక్కువ అవుతోంది. ఆమె వచ్చివెళ్ళిన మర్నాడే అల్లుడు వాళ్ళ యిళ్ళకు వెళ్ళాడు. ” రెండు నిమిషాలు మాట్లాడొచ్చా?”, అంటూ, చెమటలు కారుతూ, చేతులు వణుకుతూ. “మా అత్తగారు కాని వచ్చారా నిన్న? ఆమె కూతురు గురించి ఏమైనా చెప్పిందా, నేను ఆమె కూతుర్ని తనను కలవనివ్వనని?”, అని అడిగాడు. అతడి వణుకు, చెమటలు చూసి యింటి ఆడవాళ్ళు, ” అవును చెప్పింది. మీ మంచితనం గురించికూడా చెప్పింది. కూతుర్ని కలవనీయనందుకు మిమ్మల్లి ఏమి తప్పపట్టలేదు”. అనే వారు. అల్లుడు హమ్మయ్య అనుకోక పోగా, మరింత వణుకు, చెమటలు, అతడు తెచ్చిన సందేశం అందించడానికి ఉన్న ధైర్యాన్నంతా కూడగట్టుకుంటాడు.

“అసలు విషయమేమిటంటే అలా కనిపించదు కాని, ఆమెకు పిచ్చి. అవును. ఆమెకు గత నాలుగేళ్ళగా మతిస్థిమితం లేదు. ఆమె కూతుర్ని నేను కలవనివ్వను అని ఆమె అనుకుంటుంది. ఎక్కడ కూతురు? ఆమె కూతురు చనిపోయి నాలుగేళ్ళు. కూతురు చనిపోయిందన్న దుఃఖంతోనే యిలా మతిచెడింది. మంచిదయింది. లేకుంటే దుఃఖం భరించగలిగేది కాదు. అల్లుడు ఆమె కూతుర్ని కలవనివ్వడంలేదు అన్న మతిభ్రమణమే ఆమెను కాపాడుతోంది.”

కేవలం ఆమె దయనీయస్థితిని చూసి, అల్లుడు ఆమె భ్రమను పోషిస్తున్నాడు. అతడికి వచ్చే జీతం ఎక్కువేమీ కాదు. ఆమెను వేరొక యింట్లో ఉంచి పోషించడానికి తాను ఎన్నో వదులుకొంటున్నాడు. కాని, అది అతడి ధర్మం. కాని జనం తనను గురించి వేరుగా అనుకుంటున్నారు. తాను ఎలా భరించగలడు?

విన్న ఆడవాళ్ళు విస్తుపోతుంటే. అతడు వస్తానన్నట్టు తల ఊపి వెళ్ళిపోతాడు. అతడు అట్లా వెళ్ళాడో లేదో. అత్త యిలా వస్తుంది. ముఖంలో మృదుదుఃఖం. ” క్షమించండి. మా అల్లుడుగారు వచ్చివెళ్ళినట్టున్నారు. అసలు విషయం ఏమిటంటే, చూడండి యింతవరకు యీ విషయం ఎక్కడా బయటపెట్టలేదు. ఎందుకంటే, అల్లుడుగారు బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగి. పనిచేసేచోట ఆయనకు పేరుంది మంచివాడని సమర్థుడని నిజాయితీపరుడని. ఈ విషయం పొక్కితే ఆయన ఉద్యోగానికి ప్రమాదం. అందుకే యింతవరకూ ఎక్కడా ఎవరితోనూ అనలేదు. ఆయనకు మతిస్థిమితం లేదు. నా కూతురు చనిపోయిందని, యిప్పుడున్న భార్య తన రెండవ భార్య అని అనుకుంటాడు, పాపం. పిచ్చంటే మరేం లేదు, యీఒక్క విషయంలోనే. లేదు లేదు, ఆయన క్రౌర్యం బయటపడకుండా ఉండడానికి యీ నాటకం ఆడుతున్నాడనుకోవవచ్చు. కాదు పాపం. అసలేం జరిగిందంటే, అల్లుడు అతి ప్రేమతో భార్యకు ఊపిరాడకుండా చేశాడు. ఆమె మానసికమైన వత్తిడికి లోనయింది. ఆమెను మేము కొంతకాలం అతడికి తెలియకుండా ఒక నర్సింగ్ హోమ్ లో ఉంచాం. అసలే భార్య అంటే అతిప్రేమ కదా! భార్య కనిపించక పోయేటప్పటికి, అసలే ప్రేమలో బలహీనమైన మతి పూర్తిగా చెడిపోయింది. భార్య నిజంగానే చనిపోయిందన్న భ్రమలోకి వెళ్ళిపోయాడు. ఏడాది తర్వాత నర్సింగ్ హోమ్ నుండి భార్య తిరిగి వస్తే. ఆమెను గుర్తించలేదు. ఆ స్థితిలో అతని భ్రమను, భ్రమలో అతన్ని, నిలపడానికి, ఆమెతో మళ్ళీ పెళ్ళి చేయవలసివచ్చింది.

అతడు కొంతకాలానికి మామూలు మనిషి అయ్యాడు. కాని ఆమె తన రెండవభార్య అన్న భ్రమను కొనసాగిస్తున్నాడు. ఆమెను తిరిగి తననుండి దూరంచేస్తారేమోనన్న భయంతో ఆమెను మరింత ప్రేమతో బంధించేశాడు. ప్రేమ కాకపోతే, అంత బాగా ఎలా చూసుకోగలడు భార్యను? ప్రస్తుతం ఆమె భార్య తన మొదటి భార్యేనని తెలుసు. అతడి మతి వెనుకటిలా కాక పోయిఉంటే. తన విషయంలో, చనిపోయిన భార్య తల్లి విషయంలో, యింత బాధ్యత ఎందుకు తీసుకుంటాడు?

పాపం. నా కూతురుకూడా యిదే నటన చెయ్యాలి, తను తాను కానని. నేనూ నటించాలి. నా కూతురు చనిపోయినా ఆమె బతికే ఉన్నదని నమ్ముతున్నట్టు. నాకంత పెద్ద బాధలేదు. ఎందుకంటే, నాకు తెలుసు నా కూతురు బతికే ఉందని. ఆమెతో ఉండలేకపోయినా. ఆమెను చూడగలను. ఆమెతో మాట్లాడగలను.

దూరంనుంచైనా. అయినా, మళ్ళీ చెబుతున్నా. ఏం కష్టం ? ఈ నటన వల్ల ఏం నష్టం? రెండు జీవితాలు నిలబడ్డాయి కదా?”

మేము ఊళ్ళో వాళ్ళమంతా నోరెళ్ళబెట్టుకుని తిరుగుతున్నాం. ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకుంటూ. ఇద్దరిలో ఎవరిమాట నమ్మాలి?

ఒక అవకాశం ఉంది. అతడి భార్యకు తెలియాలి. కాని ఆమె మాత్రం నిజం చెబుతుందా? తల్లి ఎదుట అడిగితే. అవును నేను మా ఆయన మొదటి భార్యనే. యీమె నా తల్లి”. అంటుంది. భర్త ఎదురుగా అడిగితే, నేనీయనకు రెండవభార్యను”. అంటుంది. నిజమే. ఎవరూ పక్కన లేనపుడు, లేక ఆమెను అవతలకు తీసుకెళ్లి, అడగొచ్చు కదా? ఆమె భర్త ఆమెను వేయి కళ్ళతో కాపాడుతుంటాడు.

ఈ విషయం కలెక్టర్ వరకూ వెళ్లింది. ఆయన విచారించి అల్లుడి వాదన సరి అయినదే అని నిర్ణయించాడు.అప్పటికీ, కూతురు తల్లికి రాసి బుట్టలో దించిన ఉత్తరాలు సాక్ష్యంగా చూపారు. అవి అత్తగారి భ్రమను నిలపడానికి రాసిన ఉత్తుత్తి ఉత్తరాలన్నాడు అల్లుడు.

ఒకటిమాత్రం నిజం. అత్త, అల్లుడు యిద్దరూ ఒకరి కోసం ఒకరు అసామాన్యమైన త్యాగం చేస్తున్నారు.ఒకరి పిచ్చిని ఒకరు అతి శ్రద్ధగా పోషిస్తున్నారు. ఇద్దరూ వారి వారి వాదాలను అతి సహేతుకంగా వివరిస్తున్నారు. ఆ ఊళ్ళో ఎవరుకూడా, యీ యిద్దరిలో ఎవరికీ కూడా పిచ్చి అని అనలేరు.

అత్త అవసరమైనపుడు అల్లుణ్ణి అతడి ఆఫీసులో కలుస్తుంది. అతడు బయటికి వచ్చే వేళకు గేటు వద్ద కాచుకుని, అతనితో కలిసి వెళ్ళి తనకు కావలసిన సరుకులు కొనుక్కుంటుంది. అతడికి తీరిక దొరికినపుడు, ఎపుడైనా ఆమె ఫ్లాట్ కు వెళ్ళి చూచి వస్తాడు. ఇద్దరూ వెళుతున్నపుడు ఆమె అలసిపోతే, అతడు చేయి అందిస్తాడు. జనాలకు వాళ్ళను చూస్తుంటే, కోపము ఆశ్చర్యము విస్మయము. వాళ్ళను అర్థం చేసుకోవాలన్న వారి ప్రయత్నాలన్నీ వ్యర్థం. ఎప్పటికీ తేల్చుకోలేరు, ఏది వాస్తవం? ఏది భ్రమ?