ముగ్గురి చెప్పులూ ఇప్పి ఒద్దికగా గుమ్మం వారకి పెట్టి ఎత్తైన కప్పుకేసీ గుండ్రంగా వలయాలు తిరిగే మేడ మెట్లు, సింహాసనాల్లాటి కుర్చీలు, నున్నగా మెరిసే అద్దాల కిటికీలు పరదాలు చూస్తూ గుమ్మంలోనే నిలబడ్డారు. మెత్తటి తివాచీ మాసిపోతుందేమోనని ఒదిగిపోయి నిలబడుతూ “ఇల్లు చానా బాగుందమ్మ!” అంది అన్నమ్మ గారు. నవ్వులు వెనక్కి తీసుకోకుండా మేక్ పీస్ ని తన వెనక చెయ్యి నొక్కి పట్టుకుని జోజి గారూ “అహ్హ …వెరీ నైస్ ! వే…రీ నైస్ !!” అని ఒప్పుకోలుగా నిలబడ్డాడు. లూబా Can I go now? అని జవాబు కోసం చూడకుండానే వెళిపోయింది. రోహణ్ సోఫాలోంచి గెంతి అరుచుకుంటూ అక్కని ‘షూట్’ చెయ్యడానికొచ్చి, కొత్త మనుషుల్ని చూసి సిగ్గుపడిపోయి వెనక్కి తగ్గిపోయేడు. వాళ్ళ గదిలోన తోవకి అడ్డంగా రఘూవి దిబ్బ దిబ్బ పుస్తకాలు యుద్ధంలో నేలకొరిగిన సైనికుల్లాగ ఎన్నాళ్ళనుంచో చెల్లా చెదురుగా పడున్నాయి. వాటిని ఎప్పట్లా కాళ్ళతో వారకి తన్నబోయి వాళ్ళు చూస్తున్నారని వంగి చేతుల్తోనే దొంతు పెట్టి ఒక వారకి తోసింది. ఆ బెడ్రూం మిగతా ఇల్లులాగే ఇంకా కొత్త వాసన వేస్తున్నాది. మెత్తటి పరుపుల మీద పక్కబట్టలు ఇంకా ఎవరూ వాడనివి. వీళ్ళే ఇంటికి మొదటి అతిధులు. వాళ్ళ పెట్టెలు పెట్టడానికి క్లాసెట్లో జాగా చూపించి ‘స్నానాలు చేస్తారాంటీ?’ అని యధాలాపంగా అడిగిన ప్రశ్నకే ఆవిడ కళ్ళు సంబరంగా వెలిగిపోతూ “అమ్మయ్యా! స్నానం చేసి రెండ్రోజులయ్యిందమ్మ! స్నానాలు….!” అని వెంటనే బట్టలు తెచ్చుకుంది. మేక్ పీస్ బెరుకుగానే ఆసక్తిగా మంచం వార కూర్చోబెట్టిన పెద్ద టెడ్డీబేర్ని చూస్తూ పరుపుని నొక్కి మళ్ళీ చెయ్యి వెనక్కి తీసుకుంటున్నాడు. కిటికీలోకి వంగిన పువ్వుల చెట్టు మీద పిట్ట అద్దాన్ని ముక్కుతో టక్ టక్ మని కొడుతుంటే అది వాళ్ళమ్మకి చూపించాలని ఆవిడ చెయ్యి తడుతున్నాడు. గదిలోంచి రాబోయి మళ్ళీ వెనక్కెళ్ళి ఆవిడకి తువ్వాళ్ళు సబ్బులూ చూపించి వేణ్ణీళ్ళు చురికిపోకుండా చన్నీళ్ళు ఎలా కలుపుకోవాలో చూపించింది. జోజి గారు మొహమాటంగా మర్యాదగా “నైస్ …. ఇహ్హిఁ! తేంక్యూ వెరీమచ్ …” అంటూనే ఉంటే.
భోజనాల దగ్గర ఏం మాట్లాడకుండా ఆతృతగా గబ గబా అన్నాలు తింటుంటే వాళ్ళకి రెండు రోజులుగా సరైన తిండి దొరకలేదనే సంగతి తెలిసిపోతోంది. ఒక్క జోజి గారే ఆకలిని పైకి కనపడనియ్యకుండా మర్యాదగా తింటున్నాడు. ఆవకాయ, అన్నం మళ్ళీ మళ్ళీ అడిగి వడ్డించుకున్నారు.
మేక్ పీస్ కుర్చీలోంచి వాళ్ళమ్మ చెవిలోకి ఎత్తుగా తలెత్తి ఏదో రహస్యం చెప్పేడు, నోట్లో అన్నం నమిలితింటూనే. జోజి గారు వాడ్ని కూర్చోమని “No Talking…! Eat! Eat!!” గద్దించేడు. అన్నమ్మ గారు తినటం ఆపి “కూర చానా బాగుందంటమ్మ! రెండ్రోజులయ్యింది ఏఁవి సమింగ తిన్లేదు పాపము! బస్సులోన పాష్ట్ర గారు ఏదో…. ఏంటమ్మది? బన్నుల్లాటివి కొన్నారుగాని అవి తింటఁవే వాడికి వోంతయిపోయింది! మీ ఇంట్లో అన్ని చానా బాగున్నాయి!” అంది మళ్ళీ. అది ఆవిడ కృతజ్ఞతలు చెప్పే పద్ధతి. దట్టంగా కాటుక దిద్దిన చిన్న కళ్ళు మరీ గీతల్లా చిన్నవి చేసుకుని నవ్వుతూనే ఇష్టంగా ఆకలిగా. అఖిల కంచంలో అన్నం కెలుకుతోంది. తినవే తినవే అంటే I am full mommy! అని. సగం మిగిలిన కేక్ తెచ్చి టేబిల్ మీద పెడితే మేక్ పీస్ అడగక్కర్లేకుండానే ఒక పెద్ద ముక్క తీసుకుని చప్పుడుచేసుకుంటూ తింటున్నాడు. ఆ అబ్బాయి ప్రవర్తన ఏదీ ‘టేబిల్ మేనర్స్ ‘ కాదు. తన పిల్లలే కనక పార్టీల్లో అలా తింటే విసురుగా పక్కకి లాగి ‘Mind your manners! ఏంటది అసయంగా ఎప్పుడూ కేక్ మొహం చూణ్ణట్టూ?’ అని కసురుకుంటుంది. అది శనివారం నాడు రఘు వాళ్ళ మేనేజర్ వైస్ ప్రెసిడెంట్ అయినందుకు పార్టీలో కట్ చేసిన కేకు. కట్ చేసిన ముక్కలే ఎవరూ తినలేదు. మొహమాటానికి కొద్దిగా కొరికి వదిలెస్తారు. అంత ఖరీదైన కేక్ పారెయ్యటం ఎందుకు? అని రఘు ఆ మిగిలిన సగం ఇంటికి తెచ్చీసేడు మళ్ళీ, ఎవరూ చూడకుండా ఉన్నప్పుడు. ” ఫుడ్ వేష్ట్ చెయ్యొద్దు, గదుల్లో లైట్లు ఆర్పకుండా వచ్చెస్తావేం?” అని విసుక్కున్నాడు ఆ రోజు కూడా. “Who do you think you are? దిగొచ్చీసేడండి పెద్ద గాంధీ తాతియ్య..!” అంటే ‘ఎహె..!’ అని తలతిప్పుకుని చిరాగ్గా స్టీరింగ్ ని, రోడ్డునే చూసుకుంటూ ఏమీ మాట్లాడకుండా.
ఒచ్చిన కొత్తల్లో తను కూడా అలాగే అనుకొనేది. అన్నం వేష్ట్ చెయ్యకూడదు, కూర వేష్ట్ చెయ్యకూడదు అని. ఇప్పుడు అదంతా సిల్లీగా ఉంటుంది. చెత్త కుండీల దగ్గర ఇంకా రంగైనా పోని సోఫాలు, మంచి టీవీలూ టేబిళ్ళూ పడీసుంటాయి. బట్టలు చెప్పులు తనకెన్నున్నాయో తనకే గుర్తుండదు. పిల్లలూ ఒక నాలుగు సార్లు తొడుక్కుని చెప్పులూ బట్టలూ ‘Yuk!’ అని పడెస్తారు. వాళ్ళ బొమ్మలు తను కొన్నవీ పుట్టిన రోజులని క్రిస్మస్ అనీ ఎవరెవరో తెచ్చినవీ ఏటిక్ లలోనూ, గదుల్లో క్లాసెట్ల మూలల్లోనూ క్షతగాత్రుల్లా కుప్పలుగా పడుంటాయి కాళ్ళలో కుఁయ్ కుఁయ్యిమని అడ్డం పడుతూ. కిందటేడాది క్రిస్మస్ కి వచ్చిన గుడ్డలు, బొమ్మలు, గిఫ్ట్ పెట్టెల్లో కొన్ని ఇంకా విప్పకుండా గరాజ్ లో అలాగే పడున్నాయి. పెన్నులు కాయితాలు పుస్తకాలు గిన్నెలు మిక్సీలు రక రకాల పటాలు ప్లాస్టిక్ పువ్వుల గుత్తులు రంగుల బొమ్మలు పళ్ళు పేట్టుకునేవీ పువ్వులు పెట్టుకునేవీ వంటలు పెట్టుకునేవీ రక రకాల రక రకాల గిన్నెలూ బేసిన్లూ బుట్టలూ అన్నీ ఎలా వదిలించుకోవాలో తెలీక ఒక శనివారం రోజు దిగులుగా కూర్చుంటే మధూ వచ్చి సాయం చేసింది. రఘు లేకుండా చూసి, పిల్లలు పడుకొని ఉన్నప్పుడు అవన్నీ గబ గబా ఏది ఏదో చూడకుండా గార్బేజ్ బేగుల్లో కుక్కి ఇంటి ముండు పెడితే సాల్వేషన్ ఆర్మీ వాళ్ళొచ్చి తీసుకుపోయేరు. రెస్టరెంట్లలో తెప్పించుకున్నవి పిల్లలు, తనూ కెలికి వదిలెస్తే గిజ గిజ గింజుకుంటాడు. ‘ఇక్కడ పద్ధతి ఇలాగేరా పిచ్చెదవా!’ అని ఒకరోజు అనునయించి చెప్పబోయింది. ‘ఎవరో పెట్టేవేంటే పద్ధతులు మనం పెట్టుకున్నివే మన పద్ధతులు!’ అని అసహనంగా చెయ్యి తీసి పక్కన పెట్టీసేడు.
జోజి గారు, అన్నమ్మ గారు చెయ్యి కడుక్కోటానికి కిచెన్ సింక్ కేసి వెళిపోబోతే వాళ్ళని వారించి వాష్ బేసిన్ ఎటుందో చూపించింది. తన పిట్ట తిండి ఎప్పుడో అయిపోయింది. మర్యాదకి కూర్చుంది అఖిలనీ రొహణ్ నీ అదిలిస్తూ. తన పక్క కుర్చీలో ఆయనది ఎర్రటి అట్ట వేసిన పుస్తకం ఉంటే కుతూహలం చంపుకోలేక దాని పేజీలు తిప్పింది. దాన్లోన కొన్ని కర పత్రాలున్నాయి. ’28వ క్రైస్తవ ఉజ్జీవ కూటములు, సువార్త మరియు స్వస్థత సభలు, కల్వరి చాపెల్ , పాలకొండ రోడ్డు, M. R. నగరం, విజయ నగరం జిల్లా’ అనున్నాది. లోపల ఖాళీగా రూళ్ళ కాయితాలు. ఒక చోట తేదీ వేసి కిందన ‘తండ్రీ! ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. | అవును తండ్రీ, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను.|’ అని ఆకుపచ్చ సిరాతో దస్తూరిగా రాసున్నాది. ఇంకొన్ని పేజీలు తిప్పితే ఫొటోలు అంటించిన పేజీలలో Valley of Love అని తెల్లక్షరాలు నల్లటి బోర్డు మీద అర్ధచంద్రాకారంగా రాయించిన గేటు, అక్కడ జోజి గారు, అన్నమ్మ గారి చుట్టూ …. కుష్టు రోగులు మూగి ఉన్నవి. ఆ గేటు, ఆ వెనక మామిడి తోపుల మధ్య పెంకుటిల్లు డాబా….. తనెప్పుడో చూసిందా అని జ్ఞాపకం! ఆ ఫొటోనే పట్టి పట్టి చూస్తుంటే ఆయన లుంగీ పంచెనే ఎత్తి మూతి తుడుచుకుంటూ “ఏటమ్మా ఏటి నా కూటాల నోట్సు చూస్తనారా……? ” అంటూ నమ్రతగా వచ్చి నిల్చున్నాడు. చప్పున సద్దుకుని ‘ఏం లేదంకుల్ ! ఏదో ఫొటోస్ లాగుంటేని…’ అని ఇబ్బంది పడితే “అయ్యొ పర్లేదమ్మ….. చూడమ్మ పర్లేదు యిటీజ్ వోకె!” అన్నాడు. కేకు ముక్క కోసిస్తే అన్నమ్మ గారు దాన్ని అపురూపమైన వస్తువులాగ సున్నితంగా పట్టుకుని ఆస్వాదిస్తున్నాది. కాలేజీ డౌన్లో ఒక నాయర్ బేకరీ ఉండేది. బెష్ట్ బేకరీ అని. అక్కడివరకూ ఇష్టంగా నడుచుకెళ్ళి చేతిలో చెమటకి తడిసిన ఒక రూపాయి నోటిస్తే ఆయన అద్దాల వెనకనుండి రెండు నలుపలకల కేకు ముక్కలు తీసిచ్చేవాడు; తిరిగి ఇరవై పైసల చిల్లరా. తనూ, కే. అనూరాధా దుమ్ములు రేపుతున్న బస్సుల్ని ఖాతరు చెయ్యకుండా ఆ ముక్కల్ని జీవిత మాధుర్యం అంతా వాటి తియ్యని స్పాంజి రుచుల్లోనే ఉన్నట్టు ఇలాగే ఆస్వాదించిన సాయంత్రాలు గుర్తుకొచ్చేయి.
పిల్లలు ఆటల్లో పడిపోయేరు. స్లింకీ బుర్రనీ తోకనీ అటూ ఇటూ తిప్పుకుంటూ నడుస్తుంటే మేక్ పీస్ “అమ్మా…అమ్మామ్మా…! కుక్క చూడు…..! కుక్క సూడవే వోర్నాయిన నడిసొచ్చెస్తంది యెలాగోనీ…?” అని సంబరం పట్టుకోలేక అరుస్తుంటే రోహణ్ గాడు ‘See my Power Ranger Toy?! Power Ranger … SPD! Dyno Thunder!!’ అని వాడి చొక్కా పట్టి లాగుతున్నాడు. “రండి ఇల్లు చూద్దురు గాని!” అంటే వాళ్ళు వెనకే వలయాల మెట్లెక్కుతూ ‘కొత్తిల్లు కదమ్మ?’, ‘అబ్బో…చానా పెద్దదే అన్నమేరీ! ఇప్పుడు మన దివాకరాల్ది ఇంతకంటా కొద్దిగ బాగా చిన్నదే!’ అని అబ్బురంగా మెచ్చికోలుగా కలయజూస్తున్నారు. మెట్ల ఎత్తునుండి వాళ్ళ కోసం ఆగి “2960 SFT అంకుల్ ! గరాజ్ తో కలిపి ఇంకా 3000 కీ ఎక్కువే ఉంటుంది!” అంటే వాళ్ళు ‘అలాగమ్మ?!’ అన్నట్టు తలలూపేరు గాని, వాళ్ళకి ‘SFT’ అంటే ఏంటో తెలియదనిపించింది. వాళ్ళు ప్రశంసల చూపులతో బెరుగ్గా ఒక్కో గదిలోకీ బయట్నుండే తొంగి చూస్తున్నారు. సీతాకోక చిలకలు కుందేళ్ళు ఎలుగుబంట్ల బొమ్మల్తోటి పిల్లల గదులు. తన ఆఫీస్ . తంజావూరు వీణ, బొబ్బిలి వీణ ఇటూ అటూ తలగడల మీద ఆంచి, మధ్యలో మనిషి ఎత్తు నటరాజ విగ్రహం గంధం పూల దండా ఉన్నదీ. రఘు లైబ్రరీ. తమ ఇద్దరి పడకగది. వాళ్ళ డాడీ వస్తే, తన అమ్మానాన్నా వస్తే ఉండటానికని గదులు. లూబా తుడిచీ కడిగీ కొత్తిల్లే సరి కొత్త ఇంటి లాగ తళ తళ మెరుస్తుంటే వాళ్ళు మౌనంగా ఒప్పుకోలుగా చూస్తూ కిందికి దిగేరు. అన్నమ్మ గారు టేబిల్ మీద మేక్ పీస్ వదిలేసిన కంచాన్ని, అఖిలది, తనదీ ఎంగిలి కంచాల్నీ తీసుకుని “ఇవి నేను కడిగెస్తానమ్మా?!” అంది. “అయ్యొ మీకెందుకాంటీ శ్రమ రేపు లూబా కడుగుతుంది వదిలెయ్యండి!” అని చెప్తున్నంతలోనే కంచాలు తీసుకుని సింక్ వైపు వెళ్ళబోతూ బాధగా “అమ్మా..హ్ …!” అని కాలు పైకెత్తి అలాగే ఉండిపోయింది. మధ్య వేలు మడమతో కలిసే చోట ఏదో గుచ్చుకొని బొట బొటా రక్తం కారిపోతోంది. ఆవిడ చేతిలో ప్లేట్లందుకుని సింక్ లో పడీసి, పేపర్ టవళ్ళతో అద్ది చూస్తే రక్తం ఆగలేదు. ఒక బేసిన్ తెచ్చి ఆవిడ్ని కాలు కడుక్కోమని చెప్పి బేండేజ్ కట్టింది. ‘లూడా డింట్ క్లీనిట్ ప్రోపర్లీ!’ అని ఆ సూది గాజు పెంకుని చూస్తూ తనలోనే విసుక్కుంటుంటే చూసి అన్నమ్మ గారు “ఫర్వాలేదమ్మా! చిన్న పిల్లలున్న ఇల్లు కదా..! ఏదో వొకటీ మామూలే..!” అని సర్దిచెప్తోంది. “ఆదే ఆంటీ!” అని మర్యాదకి అంది కాని, అది చిన్న పిల్లల పని కాదని తనకి తెలుసు. పొద్దున్న రఘు మీద కోపంతో ఊగిపోతూ ఉక్రోషంగా తనే చేతిలోని క్రిష్టల్ బౌల్ విసిరికొట్టింది. అది ముక్కలు ముక్కలై వంటిల్లంతా చిందరవందరగా పడితే రఘు అది ఒక విషయమే కానట్టే షూస్ తొడుక్కుని గరాజ్ లోకి వెళిపొయేడు. రోహణ్ వంటింట్లోకి రాకుండా వాడికి అఖిలని కాపలా పెట్టి ఆ ముక్కలన్నీ ఊడ్చి పారీసింది తనే. గాజు పెంకు గుచ్చుకున్నా సోఫాలో కూర్చొని అలాగే విశాలంగా కృతజ్ఞతగా నవ్వుతూనే ఉంది అన్నమ్మ గారు. రెండున్నర రోజులు దేశం కాని దేశంలో ఉక్కగా అలసటగా ఆకలిగా నిద్దర లేకుండా వస్తే అన్నం పెట్టి స్నానాలు చెయ్యనిచ్చినందుకు ‘చానా బాగుందమ్మ!’ అని మళ్ళీ మళ్ళీ.
జోజి గారు భూషణం చిన్నాన్న గురించి చెప్తున్నారు. చిన్నాన్న ఎపెల్లేట్ కోర్టు జడ్జీ అయిన రోజు లయన్స్ క్లబ్ మెంబర్సందరూ చిన్నాన్నకీ పిన్నికీ సన్మానం చేసి టాపు లేని జీపులో ఊరేగింపుగా తీసుకెళ్ళటం ఆయన చర్చిలోంచి చూసిన సంగతి. చిన్నాన్నకి కౌన్సిలర్ టిక్కట్టు ఇస్తారనీసి, ఆగష్ట్ నాటికి ఏ విషయం తేలిపోతుందని. కిరణ్ కి B. Tech. (I.T.)లో సీటు ‘ఎలాగైనాసరే ఇప్పించే పూచీ మీదేని, మదర్ సుపీరియర్ కి ఒక్కసుట్టు ఎలాగైనా ఫోన్ చేసి చెప్పాలి పాష్ట్ర గారూ!’ అని పిన్ని చిన్నాన్న అడిగిన సంగతులు. ఆయన మరిపి వలస ఊసెత్తితే అప్పుడు జ్ఞాపకం వచ్చింది. తను మెడిసిన్ చదివేటప్పుడు ఒక వేసవిలో చిన్నాన్నా వాళ్ళూరు వెళ్ళినప్పుడు తను, తమ్ముడు, కిరణ్ మామిడి తోటకెళ్ళేరు స్కూటర్ మీద. ‘ఎప్పటికైనా పడుంటాయి, వైజాగ్ రోడ్డు పోయింటు మంచి ఇన్వెష్ట్ మెంట్ ‘ అనీసి చిన్నాన్నే తన పేరు మీద, తమ్ముడి పేరు మీద రెండేసెకరాలు తోట జాగాలు కొనిపించేరు డాడీ చేత. అక్కడ తోట కాపు రెల్లోలు మామిడి కాయలు కోసిస్తే ఆ బస్తా స్కూటర్ మీద పెట్టుకొస్తుంటే సగం తోవ ఉందనగా టైరు పంక్చరైపోయింది. ఎర్రటెండలో ఆ బస్తా ముగ్గురూ మూడు కొసలు పట్టుకొని నడుస్తుంటే చాలా దాహం వేసింది. వేలీ ఆఫ్ లవ్ అని చూసి తమ్ముడు గబ గబా లోనికెళిపోయి ‘ఏండీ? ఏండీ…వాటర్!’ అని అడిగేసేడు తను వారించేలోగానే. లోపల్నుండి సన్నంగా పొడుగ్గా ఒకావిడ, తోట పని చేసుకుంటున్నది, పనాపి, కూజాతో నీళ్ళు తీసుకొచ్చింది. ఆ చల్లటి నీళ్ళకి సేదదీరి అక్కడే మామిడి చెట్టు కింద కూర్చుని ‘ఏంట్రా ఇక్కడా..? వేలీ ఆఫ్ లవ్వంటేనీ..?’ అని అనుమానంగా కిరణ్ ని అడిగితే వాడు అల్లరిగా గేటుకేసి నడుస్తూ ‘లెప్పర్సీ వొల్దక్కా ఇదీ! లెప్పర్సీ వోల నీళ్ళు తాగీసేరు!’ అని ఉడికించేడు. కుష్టు వ్యాధి అంటు వ్యాధి కాదు! అని చదువుకున్నవి గుర్తుంది కానీ తనూ, తమ్ముడూ ‘థూ థూ…!’ అని ఉమ్మి, ఇంటికెళ్ళేక గబ గబా వేణ్ణీళ్ళతో నోరు కడుక్కున్నారు.
” వేలీ ఆఫ్ లవ్ కి నీనొచ్చేనంకుల్ ఒక సారి! నాకు గుర్తున్నాది…!”
“ఆఁ హాఁ…? ఎప్పుడమ్మా? ఎప్పుడూ…?”
“ఒకావిడ…. ఒకావిడ సన్నంగా పొడుగ్గా ఉంటది….? తోట తుడుస్తుంటారు?”
“ఆరోగ్య మేరీ! ఆయమ్మాయి పేరు ఆరోగ్య మేరీ…!” అన్నాది అన్నమ్మ గారు సంబరంగా కలగజేసుకుని. వేసవుల్లో దాహం వేసి ఎలా వచ్చిందీ చెప్పింది. “అయ్యో తిన్నగా ఆ క్వోర్టర్స్ వెనగ్గొచ్చెస్తే అక్కడే మా ఇల్లు, పాష్ట్ర గారి చర్చి!” అన్నాది. అక్కడుంటారా వీళ్ళు?! ఇలాగే నవ్వు మొహాలు విప్పార్చి ఉంచుకునే. అక్కడా?!
టీవీ దగ్గర మేక్ పీస్ చెయ్యి నడుమ్మీద వేసుకుని, ఇంకో చేతిలో జామకాయ పట్టుకున్నట్టు ఇటూ అటూ తిప్పుతూ, కాలు లయబద్ధంగా తొక్కుతూ
“ఇత్తనం ఇత్తనం మొలిసిందంటా
ఏం ఇత్తనం మొలిసిందంటా?
రాజు గారీ దొడ్డీ లోనా
జాం ఇత్తనం మొలిసిందంటా!
అవునాటా అక్కల్లారా?!
చంద్రాగీరీ భామల్లారా…?!”
అని గుడ్లు తిప్పుకుంటూ పాడుతుంటే అఖిల, రోహణ్ సోఫాల్లోని దిళ్ళు నేలమీద వేసి పొర్లి పొర్లి నవ్వుకుంటూ “ఇత్థనం? What does ఇత్థనం mean?” అని వాడ్ని కిర్రెక్కిస్తున్నారు. “Can Peace sleep with us mom? Please Please,,,,? Pretty please?” అని ముచ్చటగా బతిమాలుకున్నారు. రోహణ్ ని అఖిల గదిలోనే పడుకోబెట్టి మేక్ పీస్ కి అక్కడే పక్క వేసింది. రోహణ్ గాడు ఉద్రేకంగా “I put బాణం in your బొజ్జా and you have to die!” అని ఆజ్ఞాపిస్తుంటే మేక్ పీస్ “అమ్మా బాణం! బాణం!! సచ్చిపోయేన్రా నాయినా!!” అని కేకలేస్తుంటే పది నిమిషాల్లోనే వాళ్ళ కేరింతలు ఆగిపోయేయి.
బయట గాలి బాగుంటుంది రండని ఇంటి పక్క నడవలోకి తీసుకెళ్ళింది. తన దగ్గరకొచ్చే పేషంట్ వాళ్ళాయన ఒకతన్ని బతిమాలి దొంగతనంగా సంపాదించిన జున్ను పాలు జున్ను విరిచింది నిన్న. రఘు తినలేదు అలిగేడని. అది కప్పుల్లో వేసి తెచ్చి తను ఉయ్యాల బల్ల మీద కూర్చుంటే వాళ్ళిద్దరూ వెదురు కుర్చీల్లో కూర్చొని వేలాడే గంటలు గాలికి చేస్తున్న చప్పుడు వింటున్నారు. లోపల గడియారం పది కొడితే జోజి గారు “వారింకా రాలేదమ్మ?” అనడిగేడు సందేహంగా. “ఆయనకి వర్కుందంటంకుల్..! టోక్యో సర్వర్ డౌనైపోయిందంటా! ఆయనుంటే గానీ అవ్వదూ….!” అని చెప్పింది. రఘుని ‘ఆయన’ అంటుంటే తనకే కొత్తగా వింతగా ఉన్నాది. ‘ఒరేయ్!’ అనే అలవాటయిపోయింది. అమ్మ విని విసుక్కొనేది ‘అదేంటే అతన్ని పట్టుకుని సంగంకి పిల్చినట్టుగ వొరే అంటాది?!’ అని. ‘అవన్నీ కాకినాడ్లో మీ ఆయనకి చేసుకోవే ఆ మర్యాదలు! మా ఆయన్ని నేను ఒరే అనే పిలుస్తాను!’ అని ఎదురు కసురుకుంటే అపనమ్మకంగా చూస్తూ. జున్నంటే పడి చస్తాడు. అక్కడ బ్రెడ్డు ముక్కలేనా తిన్నాడో లేదో అనిపించింది. పార్టీలకి వెళ్ళేటప్పుడు నారింజ రంగుల చీర తెచ్చిచ్చి అది కట్టుకొనే వరుకూ వేచి చూసి ‘బొట్టు పెట్టుకోవే ఎదవనంజా! బొట్టుకుంటే బాగుంటావు బొట్టు పెట్టుకొవే ప్లీజ్…!’ అని బతిమాల్తే “నువ్వు పంచె కట్టుకోరా ఎదవనంజడా నేను బొట్టు పెట్టుకుంటాను!’ అని పొగరు సమాధానాలు చెప్పి ఉడికించి నోరు మూయిస్తుంది. ‘నాకు డైమండ్ సెట్ కొనమంటే కొన్నావురా? నువ్వు పంచె కట్టుకుని, పిలక పెట్టుకుని విష్ణూ సహస్రనామం చదువ్ బే నీయబా! అప్పుడు చూద్దాంలే బొట్టు సంగతి!’ అని పనికట్టుకుని రెచ్చగొడితే ‘పోవే ఎదవనంజింగా! నీతోటి నాకేంటే ఫ్రెండ్షిప్పు?’ అని తోక ముడుచుకుని పోతాడు. హల్దీ కుంకుం పేరంటాల రోజు తప్పనిసరిగా బొట్టు పెట్టుకుంటుందని గోతికాడ నక్కలాగ ఆశగా కాసుక్కూచుంటాడు. వాడ్ని ‘ఆయన గారు’ అని వీళ్ళతో అంటుంటే నవ్వుగా ఉంది.
“మళ్ళి పొద్దున్నే లెగాలమ్మ! పొద్దున్న ఏడూ నలపైకి మా బస్సు!” అన్నాడు జోజి గారు. “మీరు రోజూ పొద్దున్నే ఎన్ని గంటలకి లేస్తారంకుల్ ?” అని అడిగింది. సందర్భం లేని ప్రశ్న.
“రేపా.. ఇక్కడమిరికా లోనా….?” అన్నాడు ఆయన తడబడి.
“కాదసలు ఇన్ జెన్రల్ ….?”
“పొద్దున్నె నాలుగ్గంట్లకి లేస్తాను. నాలుక్కి లేచి ప్రభాత గీతాలకి రడీ అవుతాము….!”
రఘు ఎనిమిదింపావుకి లేస్తాడు. తనకీ నిద్రగానే ఉంటుంది కాని రోహణ్ పరుగెట్టుకుంటూ వచ్చి లేపెస్తాడు. ఐదున్నరకే. ‘I am hungry mom!’ అని జుత్తు పీకి మరీ. ‘Go ask your dad!’ అని ఉసిగొల్పినా పిల్లలు అరిచినా పట్టనట్లు పడుక్కుంటాడు అటు తిరిగి మూడంకె వేసుకుని. తనకేనా ఈ పిల్లలు, సంసారం. ఎన్నో సార్లు నెమ్మదిగా చెప్పి చూసింది. కనీసం ఏడుకైనా లెమ్మని. రాత్రి అంత ఆలస్యంగా పడుక్కొనేకంటే కొంచెం తగ్గించుకోకూడదా? అని. వాళ్ళ స్నానాలు తనే. తయారవకుండా బ్రేక్ ఫాష్ట్ తినకుండా వాళ్ళు మొరాయిస్తున్నా ఇద్దరూ కొట్టుకుని చస్తున్నా దుప్పటి తలమీంచి లాక్కుని అలాగే. ఇవాళ రోహణ్ మందు తీసుకోకుండా ఏడిపిస్తుంటే ప్రాణం విసిగిపోయి బౌల్ విసిరికొట్టింది. పెద్ద జీసస్ లా ఫోజు కొట్టుకుంటూ పల్లెత్తు మాటనకుండా పోయేడు. పదకొండు దాటుతుంటే లేచి వాళ్ళని గదివరకూ సాగనంపింది. తను రోహణ్ గదిలో పడుక్కుంది. వాడి గది కప్పుకి అంటించినవి చీకట్లో మెరిసే చంద్రుడూ నక్షత్రాలు చూస్తూ వాళ్ళని గురించే ఆలోచిస్తూ. అన్నమ్మ గారు, జోజి గారు ఎప్పుడైనా తగువులాడుకుంటారా? మేక్ పీస్ కి బ్రేక్ ఫాస్ట్ తినిపించటం ఎవరి ‘టర్న్ ‘? ఆ ఊహకే పకాల్మని నవ్వొంచిది. ఒంటి గంట కొట్టేక గరాజ్ చప్పుడయ్యింది. కిచెన్లో ఫ్రిజ్ తీసిన చప్పుడు. కుక్కరు, గిన్నెలు ఆబగా వెతుక్కుంటున్న చప్పుడు. మేడ మీదికి అడుగుల చప్పుడు. టాయిలెట్ ఫ్లష్ చేసిన చప్పుడు. తన కోసం ఇటూ అటూ వెదుక్కున్న అడుగుల చప్పుడు. నవ్వు మొహంతో టక్కు పెట్టి అవన్నీ వింటూనే ఎప్పుడో నిద్దట్లోకి జారిపోయింది. అయిదున్నరకి రోహణ్ మెట్లన్నీ దిగి తన దగ్గరికొచ్చి “Why are you sleeping in MY bed? Bad mommy…!” అని ఏడుస్తుంటే ఉలిక్కిపడి లేచింది. వాళ్ళు ముగ్గురూ తయారైపోయి రడీగా కూర్చున్నారు. కాఫీలు పెట్టిచ్చి, తన క్లాజెట్లోకెళ్ళి గబ గబా తను వాడని చీరలూ, పెద్ద వాళ్ళకి నప్పే డ్రస్సులూ, రఘువీ తనవీ పాత చలి కోట్లూ ఒక బేగ్ లో కుక్కి “కెనడాలో చలిగా ఉంటుందాంటీ! మీకు చలి బట్టల్లేవు!” అనిచ్చింది. జోజి గారు నిన్నటి కోటూ, టై యే వేసుకున్నాడు. మేక్ పీస్ ఓవల్టీన్ గట గటా తాగీసి తనిచ్చిన కోటు వెంటనే తొడిగేసుకుని, కాలర్ని ‘హూ.. హూ’ అని ఇష్టంగా వాసన పీలుస్తున్నాడు.
జోజి గారు తన ఎర్ర పుస్తకం చేతిలో పట్టుకొనొచ్చి “అమ్మా? కొత్తిల్లు కదమ్మ? కెన్ ఐ బ్లెస్ దిస్ హౌస్ ….?” అని అభ్యర్ధించేడు. అఖిల, తను, రోహణ్ నిద్ర కళ్ళతో చూస్తుంటే ఆయన సాంబ్రాణి అడిగి, తన పెట్టెల్లోంచి చిన్న ఉట్టి లాంటి పిడత పైకి తీసి దాన్లో ధూపం వెలిగించి తనలో తనే ప్రార్ధనలు చెప్పుకుంటూ ఇల్లంతా కలయదిరిగేడు. “వార్ని చూడటం అవ్వలేదు! వారికి చెప్పియ్యండమ్మ!” అన్నాడు పెట్టెలన్నీ వేన్లో సర్దుకుని. రోహణ్ కి, అఖిలకీ మధ్యన మేక్ పీస్ కోటు తొడుక్కుని రాకుమారుళ్ళా నవ్వుతున్నాడు. అన్నమ్మ గారు కాలు మెడ్డుకుంటూ వేన్ దాకా వెళ్ళి రెండు చేతులూ జోడించి దండం పెట్టింది. వేన్ బయటికి తియ్యబోయి సెల్ ఫోన్ మరచిపోయిన సంగతి గుర్తొచ్చి ఇంట్లోకొస్తే కిటికీ తెర వెనక పిల్లిలాగ నక్కి ఇదంతా సంభ్రమంగా చూస్తున్నాడు. రఘు రాం చిటికెలా! ఆరుంపావుకే! విసురుగా తప్పించుకుని సెల్ ఫోన్ అందుకోబోతే “అబ్బా…Nice సాంబ్రాణీ smell! ఎవరే రాజాతల్లీ?” అని చెవి తమ్ముల మీద చెయ్యి వేస్తున్నాడు. “Shut up!” అంది గాని చెయ్యి తోసెయ్యలేదు.
“దేవుని బిడ్డలా?” అన్నాడు. ఉలిక్కి పడింది. చిన్నప్పుడు తను చదువుకునే రోజుల్నుంచీ. అలాగని వెనగ్గా వెక్కిరించుకుంటారు.
‘మనామాందారామూ…..దేవూనీ…బిడ్డాలమూ…!” అని బొంగురు గొంతుకలు పెట్టి. జోజి గారి దీవెనల ధూపం గుండెల్నిండా పీల్చుకుని “మూస్కోరా పాచిపళ్ళెదవా!” అంది. చెయ్యి విడిపించుకుని ఛాతీ మీద చెయ్యేసి వెనక్కి నెట్టి “అవును దేవుని బిడ్డలే బే నీయబా!” అని ధడాల్న తలుపేసింది.
00000
(ఇలాంటి కధలు, ఇంకొన్ని నిజాలూ చెప్పేతల్లి స్వర్ణగారికి కృతజ్ఞతలతో ఈ కధ.)