పుష్పవివేకము

పరిచయము

కృష్ణపక్షమునకుఁ బ్రతిగా శుక్లపక్షము వెలువడినట్లే పుష్పవిలాపమునకుఁ బ్రతిగా ఈ పుష్పవివేకము రచియింపఁబడి యున్నట్లు భావించుచున్నాను. ఈ రచన నాతి కఠినములు, సరళ సుందరములు, మాధుర్య ధుర్యములు నగు పద్య రత్నములతో నింపు నింపుచుఁ బాఠకలోకమున కమందానందమును గలిగించుచున్నది. ఒకరు అహింసా ప్రభోధకులగు కరుణశ్రీలు — వేరొకరు ప్రకృతి సౌందర్యోపాసకులు. రసజ్ఞ శేఖరులు. పుష్పవిలాపము స్వార్ధపరతను చాటుచుండ, నీ పుష్పవివేకము పరహితార్థమై బ్రతుకుటయే జీవిత సార్ధకత యను నుత్తమాశయమును ప్రబోధించుచున్నది. వారి వారి భావనాజలమును బట్టి కవితలలరారుచుండును గదా!

శృంగార చేత్కవిః కావ్యేజాతం రసమయం జగత్

ఘంటసాల గానమాధుర్యముచేఁ బుష్పవిలాపము వోలె నీ పుష్పవివేకము కూడ నే గాన ప్రవీణుని గాన మాధుర్యముతోనైన విశేష ప్రచారము నంది, బహు జనాదరణ నొందఁ దగియున్నది.

గ్రంథకర్త: – ఉభయ భాషాప్రవీణ, శతావధాని, కవిశేఖర, గరికపాటి మల్లావధాని గారు.

వీరు జాతీయోద్యమములో 1921 సం|| నుండి పాల్గోని కారాగార వాసాది క్లేషములనుభవించి యున్న దేశభక్తులు, జాతీయ కవులు. వీరి భారతాంబికా శతకము, అమరు కావ్యము మున్నగు గ్రంథములు వీరి పాండితీగరిమను, కవితా మాధుర్యమును వేనోళ్ళఁ జాటుచున్నవి. వీరు ఏలూరు సి. ఆర్. రెడ్డి కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగఁ బని చేసి ప్రస్తుతము విశ్రాంతి ననుభవించుచున్నారు.

ఇట్లు
శిలిగం జగన్నాధం
రుద్రంకోట

(వైజయంతి, జులై 1981.)


పూలతోటలోన పూవులొనర్చిన భగవన్నుతి

వివిధములైన వర్ణముల వేల విచిత్ర మనోజ్ఞవాసనల్
నవనవలాడు మార్దవము నవ్యశుభాకృతు లొప్ప శిల్పసౌ
ష్ఠవ మెసఁగన్ మమున్ సృజన సల్పిన ప్రోడను దేవదేవు సం
స్తవ మొనరింతు మూర్జిత కృతజ్ఞతకున్ గొమరైన భక్తితోన్

పూలకై వచ్చిన మానవులకు పూవులొసఁగిన స్వాగతము

నిరుప మానందకర కళానిలయమూర్తి!
సహజ సౌజన్య సామ్రాజ్య చక్రవర్తి!
ఆర్ద్రభావాత్త సుకృత పథానువర్తి!
రమ్ము కైకొమ్మిదే స్వాగతమ్ము నీకు

పూవుల ఉపన్యాసము – వివేక ప్రకటనము

రసమయ జీవితావసర రమ్యపదార్థ చయానుషక్తమా
నసులరు మీరు మానవులు నందితమౌ సుమనః కులంబుఁ గై
వస మొనరించుకున్న మృదుభావులు మాకొఱకై శ్రమించి సం
తసమునఁదేలఁ జాలిన యుదారులు మీకివె మా నమస్కృతుల్

నేల మెత్తగఁ ద్రవ్వి లీలమై మడిగట్టి
       మేలైన విత్తనాల్ చాలువోసి
ఉదయాస్తమయములం దొడికంబుగా నీరు
       చేతులపై నెత్తి చిలుకరించి
మొల్కలెత్తఁగఁ బుర్వుపుల్గుల కెడ మీక
       యాచ్ఛాదనమొకింత యలవరించి
మారాకులెత్త రెమ్మలు రాక పూర్వమె
       యెత్తి వేఱుగ నెడం బిచ్చి నాటి

పాదు లొనరించి బలమిచ్చి ప్రోదిసేసి
మొగ్గఁదొడిగిన లోలోనఁ బొంగిపోవు
మీరె మా దైవతములు మీ మేలునెట్లు
మఱవ వచ్చునె ఎన్ని జన్మములకైన

కన దినమాత్ర జీవిత వికాసముఁ గల్గిన మమ్ము దేవతా
ర్చన విధికో మహామహుల ప్రాజ్ఞుల సత్కృతి సేతకో వధూ
జనము ప్రసాధన క్రియకొ సద్వినియోగ మొనర్చి ధన్య జీ
వనత ఘటించు మానవులు భవ్యులు మా కనపాయ మిత్రముల్

అలఘతర ప్రజాహృదయ హారి గుణంబులు కొన్నిగల్గి యి
య్యిల జనియించి నందులకు నేరికి నేనొక మాత్రమోదమున్
గొలుపఁగలేక కొండలనొ కోనలనో యణఁగాఱిపోవ మా
కలుము లివెల్లఁ గాఱడవిఁ గాచిన వెన్నెల కాకపోవునే

బంగరు వంతదానిఁ బుటపాకములోఁ బడవైచి కాచి సు
త్తింగడు మొత్తకున్నఁ గలదే సదలంకృతి గౌరవంబు సూ
చింగొని గ్రుచ్చకున్న నొక చెండుగ నౌదల లెక్కు భాగ్య మె
బ్భంగి లభించు మాకు సుమపాళికి లబ్ధి కొలంది కష్టముల్

అండజయాన లూర్జిత కలానుభవజ్ఞులు పేర్మిమై మమున్
జెండులుగా ఘటించి తమ శీర్షకలాపములాచరింప మా
గుండెలలోన సూదులను గ్రుచ్చుట కేడ్తుమె సిగ్గు సిగ్గదే
పండువు మాకు యజ్ఞపశు బంధ మహత్వ మెఱుంగ లేని పా
షండుల మౌదుమే పుటుక చావుల సంగతి మాకు వింతయే

దివికిన్ దీటగు పూత భారత ధరిత్రిన్ ద్యాగభోగంబు లా
ర్జవ శౌర్యంబులు సాజమయ్యునిపుడే శాపంబొ యేకాంత మా
ర్దవ దోషోపహత స్వభావులగుచున్ ధర్మం బధర్మంబు నే
దొ వివేకింపఁగ లేని దీనజడ బుద్ధుల్ ప్రోదికానేటికో

ఇహము పరమ్ము రెండు తులకెత్తి సమమ్ముగఁ బూరుషార్థ ని
ర్వహణ మొనర్చు శ్రౌత మన వద్య సనాతన మీసడించి యే
ఇహమొ పరమ్మొ సుంత మెఱయించు నవైదిక దుష్పథమ్ము సం
స్పృహఁ బడనేల సంస్కృతి విహీనతమైఁ జెడనేల మానవుల్

పత్రమొ పుష్పమో ఫలమొ భక్తిమెయింబర మేశు నర్చకుం
బాత్ర మొనర్పఁగాఁ గలుగు ప్రాజ్ఞులు తాము తరించి మాకు నా
ముత్రఫలాప్తికై సుకృతమున్ ఘటియించినవారు గారె యీ
మాత్ర కృతజ్ఞతన్ గనని మందులమంచు మమున్ దలంతురో

ఉల్లములందు మాకొఱకు నువ్విళు లూరెడు మీరు మీ వధూ
తల్లజముల్ నితాంతము ముదంపడుటే పదివేలు మాకు ను
త్ఫుల్లతఁ గాంచినన్ దడవు పోలదు నిల్వఁగ విచ్చు మొగ్గలే
కొల్లలు గాఁగఁ గోసికొని కోమలులన్ దనియింపు మింపుగన్

నిక్కువ మింతకంటె నల నీరజ నేత్రలు వచ్చి తాముగా
నిక్కుచు నీటుగోటుల వనిం దిరుగాడుచు గుల్కు పల్కులం
జొక్కుచు సోలుచున్ దళుకుఁ జూపులఁ గప్పుచుఁ బూల కోఁతలోఁ
జక్కిలి గింతలన్ గొలుపు సౌఖ్యములే నిరవద్య హృద్యముల్

పుష్పవల్లి సరోజాక్షి పూవుఁబోణి
మొల్ల మల్లిక మొదలైన ముద్దు పేర్ల
గాటముగ మాపయింగూర్మిఁ జాటుకొనెడు
నమృత హృదయులు గారె మీయాడువారు.