ఓ పగలును మింగిన రాత్రిలోకి
వేల రూపాయల జీతం అతనిని
నెట్టివేసింది
ఆరుబయట
ఒంటరితనాన్ని పూసుకుని
చీకటిలో నానిపోతున్నాడు
అతను నవ్వుతున్నాడు
మనసులో కోరికలు
కళ్ళ చివర్ల నుంచి
నిరాశ వాసనకొడుతూ
జారి పడిపోతున్నా
పట్టుకోకుండా కూర్చున్నాడు
అతను నవ్వుతున్నాడు
నిస్సహాయత చెట్టు నీడలో
మిగిలిపోయిన ఆలోచనలను
దులుపుకుంటున్నాడు
ఓడిపోయిన కవితగా
లోకువతో మిగిలిపోతున్నాడు
అతను నవ్వుతున్నాడు
దూది కొండల ఊపిరితిత్తుల్లో
వేడిగాలి ఓటమికి ఇంకా మరిగిపోతోంది
అతడు నవ్వుతున్నాడు… ఇంకా.