వాన!

ఫెళ ఫెళ ఉరుముల్తో టప టప చినుకుల్తో వాన
ఊరంతా ముంచేసే వాన కాలవలన్నీ పొంగించే వాన
పైర్లన్నింటినీ కళకళలాడించే వాన
నాలుగు నెలలుగా చూసినా రాని వాన

విత్తనాలు మొలకలెత్తినప్పుడూ
ఎండుతూన్న చేలు అల్లాడుతున్నప్పుడూ
వాగులెండి పోతున్నప్పుడు రాని వాన
తాగడానికి నీటి చుక్కలు లేనప్పుడూ
ఆకాశంలోకి ఆశగా చూసినప్పుడూ
కనుచూపు మేరలో లేని వాన

ఎండిపోయి రాలిపోయిన జొన్న చేలు
ఒకే ఒక అగ్గిపుల్లతో సర్వనాశనం ఐనప్పుడు
నీటి చుక్కకీ నీటి చుక్కకీ మైలు దూరం
నదులెన్నీ ఎండిపోయినప్పుడు
ఇసుకతిప్పకీ ఇసుకతిప్పకీ ఎంతెంత దూరం?

ఫెళ ఫెళ ఝళిపించే మేఘాలచాటునుంచి
నోటికి చేయి అడ్డం పెట్టుకుని కులుకుతూ
నాలుగు నెలలు ప్రతాపం చూపించిన
సూరీడు కులాసాగా నవ్వుతూ పోతున్నాడు.