కెంధూళి

మా చిన్నాన్న కొడుకు విష్ణు, బళ్ళారిలో ఒక కార్ఖానాలో పనిచేస్తాడు, ఉదయం ఎనిమిది గంటలకు చనిపోయాడని సాయంత్రం ఎనిమిది గంటలకు కానీ తెలియలేదు. అమెరికాలో ఉన్న మా పెదనాన్న కొడుకు ఈ విషయం తెలిసి నాకు ఇ-మెయిల్ పంపించాడు. ఉదయం ఆఫీసుకు వచ్చిన వెంటనే వాడి ఇ-మెయిల్ కంటికి కనిపించినా, వాడు సాధారణంగా జంక్ మెయిల్సును పంపిస్తుండటం వల్ల, ఇదీ అలాంటిదే అనుకుని తర్వాత చదివితే సరిపోతుందని నిర్లక్ష్యం చేసి చాలా ముఖ్యమైన మీటింగ్‌కు పరిగెత్తాను. మీటింగ్‌లో డిస్టర్బ్ అవకూడదని మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచాను. మా అక్క చాలాసార్లు నాతో మాట్లాడాలని ప్రయత్నించీ ఇంకేం చెయ్యలేక ఊరికే ఉండిపోయింది. నేరుగా బోర్డ్‌కు ఫోన్ చేస్తే వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడిస్తారని బెదురు ఆమెకు. ఆరోజు నా దురదృష్టంకొద్దీ ఒకటి తర్వాత ఒకటిగా ఉన్న మీటింగులతో నాకు కాస్త తీరుబాటు అయ్యేసరికి సాయంత్రం ఎనిమిది గంటలయింది. పెద్దగా ఎరుపు అక్షరాలతో ‘బాడ్ న్యూస్’ అని రాసిన మరొక ఇ-మెయిల్ వచ్చింది మా పెద్దనాన్న కొడుకు నుంచి. చదివి ‘అయ్యో!’ అని పెద్దగా అరిచాను.

హఠాత్తుగా ఏం చెయ్యాలో నాకు తోచలేదు. నిన్న రాత్రి నాకు ఫోన్ చేసి, “మా నాన్నకు చెప్పి పెళ్ళికి ఒప్పించు నీకు పుణ్యముంటుంది. ఆ ముస్లిం పిల్లను విడిచి వేరే ఎవరినయినా చేసుకో, అని హఠం సాగిస్తున్నాడు,” అని ఒక గంట సేపు నాతో మాట్లాడిన విష్ణు చచ్చిపోయాడంటే ఎలా నమ్మేది? ఏదో పిచ్చి ధైర్యంతో విష్ణు మొబైలుకు ఫోన్ చేసాను. నాలుగయిదుసార్లు ఫోన్ రింగయింది. `విష్ణు! ఫోన్ తీసుకో, విష్ణు! ఫోన్ తీసుకో’ అని నేను నా మనసులోనే చెప్పుకుంటుండగానే, వాడే ఫోన్‌లో మాట్లాడటం మొదలయింది. నాకు విచిత్రమయిన సంతోషం! “నువ్వు చచ్చిపోయావని ఊరికే వదంతి పుట్టించారు చూడ్రా! …” అని వాక్యం ముగించేలోపల, “ప్లీజ్ లీవ్ యువర్ మెసేజ్” అన్న మాటలు వినిపించాయి. బీప్ మని శబ్దమయి అంతా నిశ్శబ్దం. చనిపోయిన వ్యక్తి మొబైలు మీద ఏమని మెసేజ్ వదలను? రెండు క్షణాలు ఏం చెయ్యాలో తెలియక గుండెదడతో ఒణుకుతూ ఊరికే కూర్చుండిపోయాను. కొంచం సర్దుకున్న తర్వాత అక్కకు ఫోన్ చేశాను.

“రెండు గంటలకు ముందే దహనమయిపోయిందిరా. కార్ఖానాలో ఆక్సిడెంటు అయి చనిపోయాడు. ఇప్పుడు నువ్వొచ్చి ఏం ప్రయోజనం? ఒకేసారి హంపీకి వచ్చేసేయి. అస్తికలు అక్కడే వదలాలని నిర్ణయించారు”. నాకు తెలియకుండానే చెయ్యి మౌస్‌మీదికి వెళ్ళి కంప్యూటరులో క్యాలెండర్ స్క్రీన్‌మీదికి వచ్చింది. అక్క చెప్తున్న రోజు వీకెండ్ అయింది. “తప్పకుండా వస్తాను” అని నిశ్చయంగా చెప్పాను. తర్వాత గానీ నాకు క్యాలెండర్ చూశానని గుర్తు రాలేదు. ‘ఛ.. ఇదేం జీవితం దేవుడా!’ విసుక్కున్నాను.

విష్ణుది నా వయసే. ఇద్దరం చూడటానికి ఒకేలాగుంటాం కాని స్వభావాలు మాత్రం వ్యతిరేకం! నేను చదువులో చురుకు. వాడు కష్టం మీద పాస్ మార్కులు తెచ్చుకునేవాడు. వాడి అమ్మానాన్నా ఎప్పుడూ వాణ్ణి నాతో పోల్చి తనను తిడుతుండేవారు. అందుకని వాడికి నా మీద కోపం! దాన్ని వాడు విచిత్రమయిన రీతిలో చూపించేవాడు. నేను చాలా భయస్తుణ్ణి. చెప్పలేనంత సంకోచ స్వభావం. వాడికి ధైర్యమెక్కువ. నా బెదురు చూసి వాడికింకా ధైర్యమొచ్చేది. కామదహనం చేసినప్పుడు నోరు కొట్టుకుంటూ అందరిముందు అసభ్యమయిన మాటల్లో గట్టిగా అరవడం నాకు చాతనయేదికాదు. వాడు మాత్రం, నా ఎదురుగా, చాలా కరుకుగా, లబలబ మని నోరుకొట్టుకుని “… దొంగనాకొడుకులు …” అని గట్టిగా కేకలు పెట్టినప్పుడు నా మనసు సిగ్గుతో కుంచించుకుపోయేది. చింత తొక్కు చెయ్యాలని అమ్మ చెప్తే చాలు, వాడు చేలలో కోతిపిల్లలా చింత చెట్లెక్కి గోల చేస్తూ చింతకాయలు కోసి, పెద్ద గోనెసంచీని నింపుకుని వచ్చేవాడు. నాకు చెట్టెక్కడం అలా ఉంచి, పైనెక్కి రాళ్ళతో చింతకాయలను కొట్టి రాల్చడం కూడా రాదు. కోతలు అయి ధాన్యం ఇంటికొచ్చినప్పుడు, పనివాళ్ళతో కలిసి తనే జొన్నల బస్తాలను వీపుమీద వేసుకుని ఇంటికి తెచ్చేవాడు. వాణ్ణి చూస్తే నాకు ఒక రకమయిన భయమయేది.

ఇంటర్మీడియేట్‌లో మంచి మార్కులు తెచ్చుకుని నేను ఇంజనీరింగు చేరిపొయ్యాను. వాడు అక్కడే బి.ఏ.లో చేరాడు. నేను ఇంటినుంచీ, ఊరినుంచీ బయటికి వెళ్ళిపోయినందువల్లనేమో మా ఇద్దరి మధ్యా ద్వేషం కనిపించకుండా మాయమయింది. ఊరికి వెళ్తే చాలు “అన్నయ్య… అన్నయ్య…” అని వెంటే ఉండేవాడు. ఊరివాళ్ళముందు నాగురించి అభిమానంగా మాట్లాడుతూ తిరిగేవాడు. నేను సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో ఉద్యోగం చేస్తూ, బెంగుళూరికి వచ్చిన సంవత్సరం లోపలే కారు కొనుక్కునప్పుడు విష్ణు ఒకసారి వచ్చాడు. కార్లో ఊరంతా తిప్పి, షాపింగ్ మాల్‌కు తీసుకు వెళ్ళి, బెల్టు, వాలెట్, షూస్, ఇప్పించాను. ఫైవ్‌స్టార్ హోటల్లో భోంచేసి, వెయిటరుకు రెండు వందరూపాయలు టిప్ ఇవ్వటం చూసి, వాడు డంగయాడు. ఊరికి వెళ్ళే ముందు “ఎంత ధైర్యవంతుడివయ్యావురా!” అని సర్టిఫికెట్ ఇచ్చాడు.

నాకు ఆ రాత్రంతా నిద్ర రాలేదు. విష్ణు నా ప్రక్కనే కూర్చుని మాట్లాడుతున్నట్లు, అక్కడే గది తలుపులు తెరుచుకుని మాట్లాడుతున్నట్లు ఒకటే భ్రాంతి. ఏదో దుఃఖం తోడుకున్నట్లయి లేచి “తప్పయిపోయిందిరా విష్ణూ! నిన్ను బ్రతికించుకోలేకపోయాను” అని ఏడుస్తూ కూర్చున్నాను. వాడు నా ప్రక్కనే కూర్చుని నా వీపు మీద తట్టి సర్ది చెప్తున్నాడు.

హంపీలో అంతులేని ఆచారాలు, భోజనాల హడావిడి, ఎర్రగా కాలుస్తున్న ఎండ. ఈ గడిబిడిలో చిన్నాన్నను, పిన్నమ్మను సరిగా మాట్లాడించలేకపోయాను. నదిలో మునక వేసి, ఆచార్యులు ఇచ్చిన బియ్యం, నువ్వులు నదికి తర్పణం చేసి, పచ్చి శెనగబేళ్ళను పళ్ళకింద నమిలి నదిలో ఉమ్మి, ఇంకొక సారి నదిలో మునిగి విష్ణు ఋణం తీర్చుకున్నాను. గట్టుమీద అక్క ప్రక్కనే నిలుచుని, “అదిగో! అటు చూడు!” అని దూరానికి చెయ్యి చూపించాను. వేపచెట్టుకింద తన కైనెటిక్ హోండాను నిలిపి దానికి ఆనుకుని నిలబడి, మేము చేస్తున్న ఆచారాలన్ని చూస్తోందో యువతి. “ఎవరామె?” అని అడిగాను. “ఆమే! …” గుసగుసగా చెప్పింది అక్క. అర్థమయింది. తడి బట్టలతోనే ఆమె దగ్గరకి వెళ్ళి, “అయాం సారీ!” అన్నాను. దుపట్టాతో కన్నీళ్ళు తుడుచుకుంది. మాట్లాడకుండా తన స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయింది. ఆమె పసుపురంగు దుపట్టా గాలిలో ఎగురుతూ కనిపిస్తుంటే చాలా సేపు చూస్తూ ఉండిపొయ్యాను.

తిరిగి వెళ్ళేందుకు రాత్రి హంపీ ఎక్స్‌ప్రెస్‌లో కూర్చున్న తర్వాత, అక్క ప్లాట్‌ఫారం మీద నిలుచుని విష్ణు చావు వివరాలను తర్కించింది. “ఏదయినా దుస్సాహసం చేసి, స్నేహితులను ఆశ్చర్యపరిచి, `భలే, భలే’ అనిపించుకోవాలనే చెడ్డ బుద్ధి వాడిది. అదే వాడి తలమీదికి తెచ్చింది. పనిచేసే మిషన్‌లో ఏదో ఇరుక్కుని పోయిందంటే, మిషను ఆపి, పవరు ఆఫ్ చేసి, జాగ్రత్తగా బయటికి తియ్యాలి కదా? వీడు తన పౌరుషం చూపించాలని అలాగే చెయ్యి వేసి ప్రయత్నించాడు. చెయ్యి దాంట్లో ఇరుక్కుని పోయింది. దాన్ని విడిపించుకోవాలని తల లోపల పెట్టాడు. బరువయిన వస్తువేదో తలమీద గట్టిగా ఒరుసుకుందట. అక్కడే ప్రాణం పోయింది. జీపులో వేసుకుని ఇంటికి తెచ్చిన శవాన్ని చూసి, చిన్నాన్న, పిన్నమ్మ కూడా గుర్తు పట్టలేకపొయ్యారు”. ఎందుకో నాకు చచ్చిపోయిన తమ్ముడిలో తప్పులు వెతకడం అంతగా నచ్చలేదు. రైలు కదలటంతో అక్క మాటలు తప్పించుకున్నానని సంతోషమయింది.

హగరి బ్రిడ్జ్ దాటేలోపల పదిసార్లు విష్ణు మొబైలుకు ఫోన్ చేయ్యడం. వాడి మాటలు వినడం చేశాను. ఎందుకో ఇదొక వ్యసనంగా మారుతుందేమోననిపించింది. వాడి నంబరు డిలీట్ చేశాను. అప్పుడు సరిగ్గా వాడి ఋణాన్ని విడిపించుకున్నానిపించి రెండు కన్నీటి బొట్లు మొబైలు మీద పడ్డాయి.

* * * * *

సుమారు ఒక నెల తర్వాత చిన్నాన్న, పిన్నమ్మ బెంగుళూరుకి వచ్చారు. ఇంటికొచ్చి లగేజు పైగదిలో పెట్టిన తర్వాత పిన్నమ్మ నా చేతికొక ప్లాస్టిక్ కవరు ఇచ్చి, “రవలడ్డు. నిన్ననే విష్ణు మాసికం చేశాము,” అంది. చిన్నాన్న ఒక లెదర్ బెల్టు, వాలెట్, నైకీ షూస్ నాకిచ్చి, “నువ్వు కొని పెట్టినవి. వాడికి వీటిని వేసుకునే అదృష్టం లేకపోయింది. నువ్వయినా వాడుకో! మీఇద్దరిదీ ఒకే సైజు” అన్నారు.

చిన్నాన్న వకీలు దగ్గర పని మీద వచ్చారు. విష్ణు కార్ఖానాలో పనిచేస్తున్నప్పుడు ఆక్సిడెంటు అయి చనిపోయాడు కాబట్టి వాడిది కాంపెన్సేషన్ డబ్బు రావలసి ఉంది. మేనేజ్‌మెంటు కేవలం యాభయి రెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తామన్నారు. చిన్నాన్న స్నేహితుడు బళ్ళారిలో లాయరు. ఆయన ఎంత లేదన్నా కనీసం ఒకటిన్నర లక్ష రావాలని అన్నాడు. చిన్నాన్నకు తికమక అయింది. అందుకని బెంగుళూర్లో ఎవరయినా పెద్ద వకీలు దగ్గర విచారించుకొని పోవాలని వచ్చారు.

ఆఫీసులో విచారిస్తే ఒక మంచి లాయరు గుర్తు దొరికింది. ఆయన సెయింట్ మార్క్స్ రోడ్డులో ఉంటాడని తెలిసింది. అక్కడికి చిన్నాన్నను నేరుగా రమ్మని చెప్పాను. నేరు బస్సు ఏదని ఎవర్నయినా అడిగి ఎక్కి రమ్మని చెప్పాను. సరిగ్గా నాలుగ్గంటలకు నేను అక్కడికి వెళ్ళాను. చిన్నాయన ఆటోలో వచ్చారు “బస్సు ఎక్కడానికి నాకు చేతకాలేదు” అంటూ. చేతిలో ఫైలున్న ప్లాస్టిక్ కారీబ్యాగు.

వకీలు ముందు వణుకుతున్న చేతులతో ఫైల్లోని ఒక్కొక్క కాగితాన్నే తీసి చూపించి, ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. కార్ఖానాలోనే చచ్చిపోయాడా? లేక ఆస్పత్రికి వచ్చాక పోయాడా? ప్రాణం పోయేటప్పటికి అవయవాలేవయినా తెగిపోయాయా? పోస్టుమార్టం రిపోర్టు ఉందా? ఇలా ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగారు. చివరికి ఏవేవో పుస్తకాల్లో చూసి, క్యాల్క్యులేటర్లో ఏవో అంకెలు ఒత్తడం మొదలుపెట్టారు. చిన్నాన్న ఆయన నోట వచ్చే మాటలకోసం, ఒళ్ళంతా చెవులు చేసుకుని కూర్చుని ఉన్నారు. “తొంబయి వేల వరకూ రావాలి! కానీ అంత మొత్తమూ చేతికి రావాలంటే మీరు చాలా కష్టపడవలసుంటుంది. మీకు వయసయింది. ఎవరయినా మీతరఫున తిరిగేవాళ్ళున్నారా?” అని అడిగారు. చిన్నాన్న నావైపు చూశారు, నేను గుటక మింగి మరొక వైపు చూశాను. “ఎవరూ లేరు,” అని చిన్నాన్న జవాబిచ్చారు. “అయితే మేనేజ్‌మెంటుతో మాట్లాడి కాస్త ఎక్కువ డబ్బు ఇచ్చేలా చూసుకొండి. అనవసరంగా ఈ కోర్టు వ్యవహారమంతా ఒద్దు,” అని బుద్ధి చెప్పారు లాయరు. “మా ఊర్లో మా స్నేహితుడి కొడుకు లాయరు. అతడు కనీసం ఒకటిన్నర లక్ష అయినా వస్తుందని చెప్పాడే!” అని చిన్నాన్న నసిగారు. వకీలుకు కోపమొచ్చింది. “ఈ పల్లెల్లో ఉండే లాయర్లకు సరిగ్గా ఏం తెలీదు. మీతలలో ఏదేదో నింపి పంపిస్తారు. ఉన్న విషయంలో మాకు తెలిసింది మేం చెప్తే మీకు ఒంటబట్టదు,” అని విసురుగా నాముందే అన్నారు. చిన్నాన్న తగ్గిపొయి క్షమార్పణ కోరుకున్నారు.

దర్శినిలో కాఫీ తాగుతున్నప్పుడు అన్నారు చిన్నాన్న, “చచ్చిపోయిన కొడుకు డబ్బు కోసం ఇంతగా పడి చస్తున్నాడు. వీడెలాంటి తండ్రి అనుకోవద్దు”.

“ఛ! న్యాయంగా మీకు రావలసిన డబ్బది! దాన్ని అడగటంలో తప్పేముంది?” అన్నాను.

“నువ్వు లక్షలు లక్షలు సంపాదించేవాడివి. నీకు ఈ పది ఇరవయి వేల తేడాలు కళ్ళకు కనిపించవు. నాకు డయాబెటీసు. మీ పిన్నమ్మ ఆరోగ్యమూ అంతంత మాత్రమే! ముందుకు కావాలి కదా డబ్బు?”

కారులో తిరిగి వెనక్కు వెళ్ళేటప్పుడు, “పుణ్యానికి పెళ్ళి ఒకటి కాలేదు చూడు! అయుంటే ఆ అమ్మాయి గతి ఏమయుండేది చెప్పు? ఎంతో మంది అమ్మాయిలను చూపించాము. ఒప్పుకోలేదు. ముస్లిం అమ్మాయినే చేసుకుంటానని పట్టు పట్టి కూర్చున్నాడు. నరసింహ స్వామి, సాలిగ్రామం పూజ చేసిన ఇల్లు మనది! ఎలా ఒప్పుకునేది? ఇప్పుడు అనుకుంటే దేవుడు అంతా మన మంచికే చేశాడనిపిస్తుంది. వాడి పెళ్ళికి విఘ్నాలు అయి ఆమెకు అన్యాయం కాలేదు,” అన్నారు.

అపార్ట్‌మెంటు దగ్గర కారు నిలిపిన తర్వాత, “మగ పిల్లవాడు పుట్టగానే మేం చచ్చిపోతే శ్రాద్ధం చేసి భోజనాలు పెట్టిస్తాడని సంతోషించాము. నేనే వాడి శ్రాద్ధపు భోజనం చేయాల్సి వస్తుందని అనుకోలేదు చూడు,” అంటూ కణ్ణీళ్ళ పర్యంతమయారు చిన్నాన్న. ఆయన్నెలా సమాధానపరచాలో తెలియక, వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ ఓదార్చాను.

* * * * *

కాఫీకి పాలు లేవని పిన్నమ్మ చెప్పగానే చిన్నాన్న వెళ్ళి తేవడానికి తయారయారు. నేను వెళ్తానని అని ఆయన చేతిలోనుంచీ సంచీని లాక్కోవడానికి ప్రయత్నించాను. “ఆఫీసులో శ్రమ పడి వచ్చి అలిసిపోయుంటావు. వద్దు,” అని ఆయన పడనివ్వలేదు. చివరికి లోపల్నించీ పిన్నమ్మ మాటలు వినిపించాయి, “ఆయన ఆ మహమ్మారి బీడీ తాగాలి! వెళ్ళనీలే!” అని. నేను నవ్వి ఊర్కే ఉండిపోయాను.

నేను వంటగదిలో తిరుగుతూ అదీ ఇదీ డబ్బాలు తెరిచి చూసి ఏదయినా కనిపించింది నోట్లో వేసుకుంటూ పిన్నమ్మతో మాటలు మొదలుపెట్టాను. ఆమె వంటచేస్తూ అయిదునిముషాల కొకసారి చేతులు కడుక్కోవడం గమనించాను. చేతులు నెమ్ము తగిలి తగిలీ ఎర్రబారాయి. పాత్రలు, కూరగాయలూ కూడా కాస్త అధికంగా కడుగుతూ ఉంటుంది.

“పిన్నీ! అన్ని సార్లు చేతులు ఎందుకు కడుగుతావు? ముందు ఇలా ఉండేదానివి కాదు. ఎప్పట్నుంచీ మొదలయిందీ ఈ కొత్తలవాటు?” అని నవ్వుతూ అడిగాను. ఆవిడ మాత్రం నవ్వలేదు. “అదేమని చెప్పేదిరా!” అని కింద కూర్చునేసింది. నేను ఆమె ముందే కూర్చున్నాను.

“ఆ గనులవి లారీల రాకపోకలు ఎక్కువయినాయి చూడు. అప్పటినుంచీ మొదలయిందీ రోగం! ఇంట్లో ఎక్కడ చూసినా ఎర్రమట్టి దుమ్ము! మొదట్లో వంట చేయడం కన్నా ఎక్కువ సమయం దుమ్ము తుడవడానికే పట్టి చాలా కష్ట పడ్డాను. ఎంతని తుడిచేది చెప్పు? చెట్లుచేమలు, పూలుపళ్ళు, కుక్కలుపందులు ఏది చూసినా ఎర్ర దుమ్మే! అంతెందుకు, సాయంత్రాలు, రాఘవేంద్ర మఠానికి వెళ్తే బృందావనం కూడా ఎర్రమన్నుతో మూసుకొని ఉన్నది చూస్తే కడుపులో తిప్పేది! ఊర్లో ఉన్న దుమ్మునంతా తుడవడానికి వీలుకాదు అని అర్థమయింది. నా అంతట నేనే శుభ్రంగా ఉంటే చాలు అనిపించడం మొదలయింది. అప్పట్నుంచీరా ఈరోగం! ఒట్టి శరీరం పైనే కాదు, లోపలంతా కూడా ఎర్రమన్ను చేరిందేమో అనిపిస్తుంది,” అని నవ్వింది. ఆమె ఒళ్ళో తలపెట్టి పడుకుని, ఆమె రెండు చేతులను నాచేతుల్లోకి తీసుకుని నిమరటం మొదలుపెట్టాను.

“ఇది ఎంత చెడ్డ అలవాటో విష్ణు చనిపోయిన తర్వాత తెలిసింది. వాడి శరీరాన్ని తెచ్చి హాలులో పడుకోబెట్టారు. కొద్దిసేపు పక్కనే కూర్చుని ఏడ్చాను. తర్వాత మెల్లగా లేచి స్నానాల గదిలోకి వెళ్ళి చేతులు కడుక్కున్నాను చూడు,” అని కళ్ళలో నీళ్ళు పెట్టుకుంది. “ఎంత దురదృష్టవంతుడో చూడు! వాడికి ఒక స్త్రీసుఖం కూడా దొరకలేదు,” అని తన చేయి విడిపించుకుని కన్నీళ్ళు తుడుచుకుంది. నేనామె చీరె కొంగు కొసను తీసుకుని నా చూపుడువేలికి చుట్టడం ప్రారంభించాను. “చిన్నాన్న ఉదయం అన్నాడు. పెళ్ళి కాకపోవడమే మంచిదయిందని. ఆ అమ్మాయి జీవితం పాడయేది చూడు!” అన్నాను. ఆమె చర్రుమని కోపం తెచ్చుకుని, “ఎముకల్లేని నాలుక ఏదయినా అంటుంది! ఊరికే అన్నారా పెద్దవాళ్ళు? త్వరగా పెళ్ళి చెయ్యండని నెత్తినోరు కొట్టుకుని చెప్పాను. చెవిలో వేసుకోలేదు. చివరికెవరో సాయిబుల అమ్మాయితో తిరగడం మొదలుపెట్టాడు. వయసొచ్చిన పిల్లలు ఎన్నిరోజులని కాచుకుంటారు చెప్పు! నీముందు అబద్ధం చెప్పన్రా! ఆ ముస్లిం పిల్లను లేపుకుని పొయ్యి అయినా పెళ్ళి కానీ దేవుడా’ అని వేడుకున్నాను చూడు!” అంది. నేను లేచి కూర్చున్నాను.

“చిన్నాన్న ఎందుకు పెళ్ళి చెయ్యలేదు?” అని అడిగాను. పిన్నమ్మ మాట్లాడకుండా లేచి వాళ్ళ గదిలోకి వెళ్ళింది. నేను ఆమె వెనకాలే వెళ్ళాను. వైరు బ్యాగులోనుంచీ ఒక మూట బయటికి తీసింది. మూట విప్పి ఒక పేపరు తీసి నా చేతిలో పెట్టింది. ఆ పాత కాగితాన్ని విప్పి చూసాను. విష్ణు జాతకం అది. చదవాలని చూసాను కానీ ఆ భాష నాకర్థం కాలేదు. “ఇందులో ఏమని వ్రాశారు?” అని ఆమెనే అడిగాను. “మన వీధి చివర్లో గుండాచార్యులు అని ఉండేవాడు. పుణ్యాత్ముడు చనిపోయి రెండు సంవత్సరాలయింది. ఆయన రాసిందీ జాతకం! అతడు చెప్పింది వేదవాక్కు ఈయనకు. ముప్పయ్యారు సంవత్సరాలకు గండం అని చెప్పాడు. అదే ఈయన తలలో చేరుకుంది. ముప్పయ్యారు దాటితేనే వాడికి పెళ్ళి అని పట్టు పట్టారు. అంత చెడు భవిష్యత్తు చెప్పిన ఆ గుండాచార్యుని ఆత్మ నరకంలో పడి కొట్టుకోవాలి! నా కొడుకు ముప్పయిరెండేళ్ళకే పోయ్యాడు చూడు. వాడి దేహాన్ని హాల్లో పడుకోబెట్టినప్పుడు ఈయన `గుండాచారీ, నువ్వు చెప్పిన మాటే నిజమయింది,’ అనినెత్తి నోరు కొట్టుకున్నారు.” తర్వాత నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను.

“నువ్విప్పుడు పెద్దవాడివయావు. సంసారం విషయాలన్నీ తెలిసి ఉంటాయి. అందుకని ఎవరికీ చెప్పని విషయం ఒకటి నీకు చెప్తాను. విష్ణు అల్పాయుష్కుడు అని తెలిసిన వెంటనే ఈయనకు పిచ్చి పట్టినట్లే అయిపోయింది. రోజూ పదేపదే నన్ను పరుపు మీదికి లాగి సతాయించేవారు. `నాకు ఇంకొక కొడుక్కావాలి!’ అని నోరు తెరిచి అడిగేవారు. ఆ దేవుడి మనసులో ఏముందో నాకయితే తెలియదు. ఆయన ఎంత ఎగిరి పడినా నాకు కడుపు రాలేదు! నలభైఆరేళ్ళకు ముట్టు నిలిచిన తర్వాత ఈయన హింస తప్పింది కదా అని సంతోషమయిందిరా”. నేను వేరే ఏమీ మాట్లాడలేక జాతకాన్ని ఆమె చేతిలో ఉంచాను. ఆవిడకేమనిపించిందో దాన్ని పరపరా చింపి ముక్కలు చేసింది. “చచ్చిపోయిన వారి జాతకం ఇంట్లో ఉంచుకోకూడదని శాస్త్రం!” అని ఆ కాయితం ముక్కలను కసువు బుట్లో వేసి, హాల్లో ఉన్న వాష్‌బేసిన్ దగ్గరికి వెళ్ళి, చేతులకు సబ్బేసి గసగసమని రుద్ది కడుక్కుంది. “మొత్తంమీద మేము చివరిరోజుల్లో అనాథలయి బ్రతకాలని మా నుదుట రాసి వుంటే దాన్ని తప్పించడం ఎవరికి సాధ్యం!”

* * * * *

సుమారు ఐదు సంవత్సరాల తర్వాత, విష్ణు ప్రేమించిన ముస్లిం అమ్మాయిని నేను కలిసే సందర్భం కలిసి వచ్చింది. ముంతాజ్ అని ఆమె పేరు. మా కంపెనీలో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వచ్చింది. నేనా కంపెనీలో పనిచేస్తానని ఆమెకు తెలిసినట్లు లేదు.

ఇంటర్వ్యూ గదిలో ఆమెను చూడగానే ఎక్కడో చూసినట్లనిపించింది. ఆ అనిపించడాన్ని ప్రక్కకు తోసి ప్రశ్నలు అడగటం ప్రారంభించాను. అయితే ముంతాజ్ జవాబివ్వకుండా, “వద్దు. ప్రశ్నలు ఆపెయ్యండి. నాకీ ఇంటర్వ్యూ ఇష్టం లేదు,” అని లేచి నిలబడింది. నేను డంగయిపోయి, “మీరెవరు?” అని అడిగాను. “హంపి …” అని ఆపేసింది. నాకర్థం కాలేదు. “హంపీలో ఉంటారా?” అని అడిగాను. “విష్ణు …” అన్నది. అంతా అర్థమయింది. అయితే ఆమె ఇంటర్వ్యూ ఎందుకు వద్దంటోందో అర్థం కాలేదు.

“చూడండి. నాకు మీపరిచయం ఉన్నందుకు నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి మీకు సంకోచంగా ఉంది. వేరే నా సహోద్యోగులెవర్నయినా పిలిచి చెప్తాను మీతో మాట్లాడటానికి” అన్నాను. “ప్లీజ్, వద్దు. మీకంపెనీలో పనిచెయ్యటం నాకిష్టం లేదు,” అని నిర్దాక్షిణ్యంగా నిరాకరించింది. “అలా ఎందుకు నిరాకరిస్తారు? మా కంపెనీ బాగుంటుంది. చేతినిండా జీతం కూడా ఇస్తారు,” అని వివరించబోయాను.

“అలా కాదు” అంది. “మరయితే …” అన్నాను. కారణం తెలియకుండా నిరాకరణను స్వీకరించడానికి నా అహం ఒప్పుకోవడం లేదు.

“మీరు అంతగా అడుగుతున్నారని చెప్తున్నాను. మీరు చూసేందుకు విష్ణులానే ఉంటారు. ప్రతిరోజూ మిమ్మల్ని చూస్తూ నా పాత చేదు జ్ఞాపకాలను తవ్వుకోవడం నాకిష్టం లేదు. ఇప్పుడు నాకు పెళ్ళయింది. ఒక కొడుకున్నాడు.” అంది. నేనింకేం మాట్లాడలేదు.

ఇంటర్వ్యూ అక్కడికే ఆపేసి కాఫీ తాగుదామని ఆమెను మా కాంటీనుకు తీసుకెళ్ళాను. కాఫీ తాగుతూ మళ్ళీ మాటలు విష్ణు వైపే వెళ్ళాయి. “విష్ణు మిమ్మల్ని చాలా ప్రేమించాడు. చనిపోవడానికి ఒక రోజు ముందు కూడా వాడు నన్ను తన తల్లితండ్రులను ఒప్పించమని అడిగాడు. మా చిన్నాన్న పిన్నమ్మ పాత కాలం వాళ్ళు. ఒప్పుకోలేదు. మీరు చాలా బాధ పడి ఉంటారని నాకు తెలుసు. వాడు లేని ఈ సమయంలో ఆలోచిస్తే మిమ్మల్ని పెళ్ళి చేసుకోకపోవడమే మంచిదయిందేమో అనిపిస్తుంది.”

అందుకామె అంగీకరించలేదు. “ప్లీజ్! మీరూ అందరిలా మాటలాడకండి. మా పెళ్ళి అయి ఉంటే అతడు అసలు చనిపోయేవాడు కాదు. ఏదో మెషిన్‌లో ఇరుక్కున్న లోహపు ముక్కను బయటికి తీసే మొండి సాహసం చేసి చచ్చిపోయాడు. పెళ్ళి అయి నా కడుపులో అతని బిడ్డొకటి పెరుగుతుంటే అలాంటి పిచ్చి సాహసం చేసే వాడు కాదు. నా ప్రేమ అతన్ని అలాంటి వెర్రిపనులు చెయ్యకుండా ఆపి ఉండేది. చావును ఎదిరించి ఓడించగల శక్తి ఒక ప్రేమకే ఉంటుంది” అని కళ్ళను దుపట్టాతో తుడుచుకుంది. ఆ రోజు హంపిలో చూసింది గుర్తొచ్చి నాకూ కళ్ళు చెమర్చాయి.

(కన్నడ మాతృక: కెంపు ధూళి – రచయిత వసుధేంద్ర కన్నడ కథా సంకలనం ‘హంపి ఎక్స్‌ప్రెస్’ నుంచి. 2008 చంద పుస్తక వారి ప్రచురణ)