ఒంటరి మేఘంలా
అటూ ఇటూ
ఎంతసేపు తచ్చాడగలను?!
కాసేపట్లో వెయ్యిగా విడిపోతా.
చివరికి చినుకులన్నిటినీ చేరదీసుకుని
పెద్ద సమూహమై దండెత్తుతా.
యుద్ధం వెలిసాక
ఏ ఏట్లోనో మళ్ళీ ఏకాకై పారుతా.
ఒంటరిగా బతకలేనితనానికి
సమూహంతో నడవలేనితనానికి మధ్య
ఎన్నో కాలాలు అలా ఓరకంట చూస్తూ వెళ్ళిపోతుంటాయి
మరెన్నో క్షణాలు ఆగకుండా జాలిగా మళ్ళిపోతుంటాయి.
ఏ చెయ్యీ నను చేరదీయదనీ
ఏ మొగ్గా నాకోసం బుగ్గరించదని తెలిసాక
నా కాళ్ళ మోడుపై నేనే ఎదిగి
నా వేళ్ళ చివర్లు నేనే చిగురించుకుని
నాలో నేను మోయలేనంత పువ్వునై విచ్చుకుంటాను.
ఏదో ఒక రోజు
నన్ను నేనే తుంచుకుని
విత్తనాల్ని పొదివిపట్టుకుని తేలిపోయే పత్తిపువ్వులా
ఏ గాలి పడవలోనో ఊగుతూ
ఏ నీటి అలపైనో తేలుతూ
కదిలే కాలాల తలుపులు ఒక్కొక్కటే తడుతూ వెళ్తుంటాను
కలిసొచ్చే కాలమేదో పెరటి గుమ్మం తెరిచి
నన్ను ఇష్టంగా పాతుకునే వరకు.
ఎప్పటికైనా
ఆ మెత్తటి మట్టి కౌగిట్లో
సరికొత్త కలొకటి మళ్ళీ పొరలు విప్పుకుని
మొలకెత్తుతుంది
ఒంటరిగానే.