Indian groceries

ఇయ్యాల ఫ్రెస్షు వెజిటబుల్స్ వస్తయ్యమ్మా ఇండియన్ గ్రోసరీస్లో.

ప​దా​.​ పదా. ​

బండి తోసుకుంటా కూతురో, కోడలో మరి.

పక్కన అత్తగారో, అమ్మ గారో-

యీ అమెరికాలో యీ మాదిరి ఉంటయ్యా వెజిటబుల్సు అని బెరుగ్గా చూసుకుంటా, అంట్లు తోమీ తోమీ బండబారి అరిగిపోయిన చేతుల్తో ఒక్కో కాయా ఏరతా మళ్ళా లాలిపాపమ్మాయి వంక సూస్తా… బెండకాయల కొసలు ఇరగదీస్తా…

పక్కన ముసిలాయన అజీర్తి మొహంతో పాపం ఎన్ని సంచ్చరాల్నించీ సూస్తన్నాడో ఇయ్యే కూరానారా. యాసురుకొచ్చుంటాది.

ఆలుపిల్లలు నీకు – కాలకింకరులనుచు – గేలి జేసిరి బుధులు మనసా
ఫాలలోచను సేవ – మేలుగా జేసియు – కీలు దెలుసుక యుండు మనసా

​దేఖాహై పెహలీ బార్ సాజన్‌కీ ఆంఖోం మే ప్యార్ అంట.

ఏందిమే ఆంఖుల్లో జూసేది? అరిగిపోయిన ఇందీ పాటోటి పెట్టి సచ్చాడు. అసలకే ఈ చలికి డిప్రెషనొచ్చి సస్తా ఉంటే.

అమిరికాకొచ్చి ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ హరీ అయిపోయింది జనాల పరిస్తితి.

కడుపు సించుకుంటే కాళ్ళ మీన పడతాదని.

వంకాయ పైత్తికం.
దొండకాయి కఫం.
బంగాళాదుంపలరగవు.
ఇంకేందిమే నువు దినేది? మన్నా?

కఫవాత పైత్యముల్ – కప్పి గాబర చేత – తిప్పలనుబడుచుంటె మనసా
కప్పి పెట్టిన ధనము – చెప్పమని బాంధవుల్ – చేరి నిన్నడిగేరు మనసా

ఇంతకీ నీకు కరేపాకు, కొత్తిమీరీ కావాల్నా వద్దా?

డైరెక్టరైనా, మ్యానేజరైనా ఈడకొచ్చి కరేపాకు కొనాలసిందేనప్పా.

ఆ సంగద్దెల్సుకో ముందు.

ఆయినెవరో డైరెక్టరునని షే​కాం​డ్ ఇ​త్తా​డా, అంతలో శ్రీశ్రీ నీ చెవి పక్కక్కొచ్చి బానిసకొక బానిసకొక బానిసకొక బానిస అంటాడు. ఇంకో​ ​ఆయన​ నేనే ​మ్యానేజరునని షే​కాం​డ్ ఇత్తాడా, మళ్ళా శ్రీశ్రీ ఎనకమాలగా వచ్చి బానిసకొక బానిసకొక బానిసకొక బానిస అంటాడు. ఇంకప్పుడు శ్రీశ్రీ మీన గయ్యిమని లేత్తావ్. నీ సాగిత్యాలన్నీ చెత్త బుట్టలో బెట్టి కిలోల్లెక్కన అమ్మిపార్నూకి, యాపారంలో ఇజయాలకి అరవై సూత్తరాలు, ఈడదాకా వచ్చినారు ఆడదాకా బోవాలంటే ఏం జెయ్యాల? లాంటి బొక్కులు చదువుతా ఉంటే, మళ్ళా శ్రీశ్రీ వచ్చి నువ్వూ బానిసకొక బానిసకొక బానిసకొక బానిసవే నంటాడు. ​మేయ్, ​లగెత్తు!

కంది బేడలు, శనగ బేడలు, బుడ్డలు, బియ్యం, రాగులు, జొన్నలు ఒకటని జెప్పబళ్ళే అంతా విషమేనప్పా.

పురుగు మందు కొట్టి కొట్టి కొట్టి, హైబ్రీడని, అదని ఇదని ఇత్తనాల తీరువా మార్చి పారేశినారు పో.

ఆ ఇషానికి ఇరుగుడు లేదప్పో. కాన్సర్లొత్తన్నాయంట.

ఆ ఇషవంతా నరాల్లోకి, ఎముకల్లోకి, గుండెల్లోకి, రకతంలోకి పాకి పాకి… పాకి పాకి పరదేశీ, అని.

ఆశలన్నియు రోసి – మోసగాండ్లను బాసి – కేశవుని నుతి జేయు మనసా
నాసికాగ్రము మీద – వాసిగా జేరుకొని – కాశిలోనుండవే మనసా

ఏందిమే నీ ఎగస్ట్రాలు? ఎన్ని లచ్చలమంది తిండంలా?

నీలాంటోళ్ళే ఆర్గానిక్కని నా మొకమని పెచ్చు రేట్లు బెట్టి కొంటా ఉండ్లా?

సాల్లే ఎచ్చులు. ఇంకేస్కో నాలుగు ఎర్రెర్ర టమాటాలు, బెండకాయలు, దొండకాయలు, సొరకాయలు, పచ్చిమిరగాయలు.

కాకరకాయల కమలాక్షి నీ చేదుకు బెల్లం యమ రుచిలే, అని.

టీవీల్లో వంటల ప్రోగ్రాం చూసినా? ఒగ్గిన్నిలో అంత నూనె బోసి పచ్చి మిరపకాయలు ఏపి పక్కన పెట్టుకొని, మళ్ళా ఇంకో గిన్ని స్టౌ మీద పెట్టి, నూనె బోసి, ఉల్లిపాయలు టొమోటోలు ఏపి, మళ్ళా ఇంకో గిన్నిలో ఇంత నెయ్యి బోసి జీడి పప్పులు ఏపి, అన్ని గలిపి మిక్సీలో ఏసి గ్రేవీ చేసి, పక్కన బెట్టుకోని, మళ్ళా ఇంకో గిన్ని పొయ్యి మీన బెట్టి కూరగాయలు ఏపి, ఈ గ్రేవీ అంతులో బోసి, మళ్ళా గానిషింగుకి కొతిమీరీ కారెట్ నా తలకాయ అన్నీ పైన చల్లుకోని, నా మొగం. నీ మొగం. అదీ గంట ​పో​గ్రాం. అంతా అయిపోయినాక ఆ గిన్నిలన్నీ ఎవడు తోంతాడో మరి? ఆళ్ళు మాత్రం పట్టు చీరెలు గట్టుకోని వంటలు జేస్తా ఉంటారు.

పళ్ళు బాగాతినాలమ్మా. జాంకాయలు, పుచ్చకాయలు, యాపిల్సు, ​ద్రా​క్ష.

రాగవేంద్రావు సూసినా? పళ్ళతో ఈరోయిన్ బొడ్డు మీన, ఈడ ఆడ కొడతా ఉంటాడు.

మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుషలం అడిగే. మా తోట చిలకమ్మ నీకోసం ఎదురే చూసే అనుకుంటా.

ఇంకా పాలు, పెరుగు. భీమవరం బుల్లోడా పాలు కావాల్న? మురిపాలు కావాల్న?

జనం తిండి లేక సస్తా ఉంటే ఈ బూటీ పోగ్రాములు సూసినా?

యాప్లీస్ కాయల గుజ్జు, బాదాం పప్పుల పేస్టు, జీడి పప్పు పొడుం అంతా మొగానికి, మోచేతులకి పూసి​ పూసి ​ఆనేక సింకులో కడిగేస్కోమని జెప్తా​ ఉండారు. ఇంకప్పుడు మిస్ వరల్డులాగా అయిపోతారంత.

తొక్కేం గాదు!

పళ్ళు పరుఫెక్టు షేపులో లేకుంటే అసలకి స్టోరులనే పెట్టరంట ఈ అమిరికావోళ్ళు.

ముందే ఏరేసి పారేస్తారంట​. అంతేమే. దుడ్లు గల్లావోళ్ళు కిండల్ బడతా ఉంటరు.

పండు! పండు! పండు!

ఎర్ర పండు! యాపిల్ దాని పేరు!

కిండల్ గాదమ్మా. షేప్ ఇంపార్టెంటు మనకి. అదీ సంగతి.

ఆటికే మనోళ్ళు పేర్లు బెట్టినారు. సూసినా?

పద్మిని, చిత్రిణి, శంకిణి, హస్తిణి? అయ్యన్నీ షేపులమ్మా. నీకేటీ తెల్దు. ​శ్రీ శ్రీ చెప్పనేదా?

గరం గరంగా అనంగరంగ.

రంగ! రంగ!

ఎంతుకు చెలీ, మట్టిలో కల్సిపోయే అశాశ్వితమైన ఈ శరీరానికి ఇన్ని పేర్లు?

కుండలీ మార్గమును – మెండుగా దెలిసికొని – నిండి పరమందవే మనసా
ఎండవానలచలికి – నుండి యుజమకని – దండి బయలును గాంచు మనసా

ఇంక సాల్లే ఏదాంతం.

దివాలీ ధమాకా అంట. అశాశ్వితమైన నీ శరీరాన్ని కూత్తంత అటు నడిపీ.

Moong dal 2LB $4.99
Besan 8LB $9.99