[ఈ వ్యాసం ఆగస్ట్ 1, 1962 లో ‘ఆంధ్ర ప్రభ’ దిన పత్రిక లో తొలిసారిగా ప్రచురితమైనది. — సం.]
ఒకానొక రేడియో ఉద్యోగి “మీకెంతమంది రిసీవర్లు? ఎంత మంది ట్రాన్స్మిటర్లు?” అని మరొక వ్యక్తిని ప్రశ్నించాడు. ఆయనగారి ఉద్దేశంలో ఆ వాక్యానికర్థం: “మీకెంత మంది మగ పిల్లలు? ఎంత మంది ఆడ పిల్లలు?”
లోగడ ఒక ఫోటోగ్రాఫరు సిగరెట్టు కాలుస్తున్నాడు. మాటల సందడిలో పడిపోయి, పరధ్యానంగా పెదవుల మధ్యనున్న సిగరెట్టుని వేళ్ళతో పట్టుకొని లాగితే దానితోపాటు పెదవిమీదుండే చర్మ పొర వూడి వచ్చింది. అతను “అబ్బ! ఎమల్షన్ వూడి పోయింది” అని బాధగా అన్నాడు.
ఈ వ్యక్తులు వాడినవి ఆధునిక వృత్తి పదాలు. ఒక్కొక్క వృత్తివారికి ఒక్కొక్క పరి భాష ఉంటుంది. ప్రజా జీవితానికి సన్నిహితమైన వ్యక్తుల సంభాషణలలో పారిభాషిక పదాలు విరివిగా వినబడుతూ ఉంటాయి. అయితే, అన్నీ అందరికి అర్థం కావు. వాటిని తెలుసుకోవలసిన అవసరం అందరికీ ఉండదు. కానీ, భాషతో సంబంధమున్న వాళ్ళకి ప్రతీ మాట ముఖ్యమైనదే.
వివిధ వృత్తులలో నున్న వాళ్ళ పరిభాషనీ, పదాలనీ సేకరించడానికి లోగడ యత్కించిత్తు ప్రయత్నాలు జరిగాయి. డాక్టరు చిలుకూరి నారాయణరావుగారు కొన్ని కొన్ని వృత్తులలో నున్న పదాలను సేకరించి తమ ఉద్గ్రంథంలో క్రోడీకరించారు. వారు నావికుల వద్ద కూర్చొని వ్రాసుకున్న పదాలను “మాలీము శాస్త్రమ”నే పేర అందులోనే ప్రకటించారు. ఈనాడు తెలుగు రాని తెలుగు వాళ్ళం “కెప్టెను”, లేక “కెప్టాను”, “పైలెట్” అనే పదాలను వాడుకొంటాము గాని ఇంగ్లీషు సంపర్కం లేని నావికులు ఆయా మాటలకి ‘తండేలు’ ‘మాలీము’ అనే పదాలనే ప్రయోగిస్తారు. నౌకలోని వివిధ భాగాలకు వేరు వేరు పేర్లుంటాయి. వాటిని ఇంగ్లీషుగ్రంథాలలో విరివిగా ఉపయోగిస్తారు. అటువంటి పుస్తకాలను అనువాదం చేసేటపుడు తెలుగువాడు ఏ పదాలను వాడడమో తెలియక ఇబ్బంది పడతాడు. మన తెలుగు నావికులు వాడే పదాలు సైతం మనకు అర్ధం కావు. మన నిఘంటువులలో అటువంటి పదాలు సమగ్రంగా ఉండవు. చిలుకూరి నారాయణరావుగారి తర్వాత నాకు జ్ఞాపకమున్నంతవరకు వృత్తి పదాలను సేకరించిన వారెవరూ లేరు.నా మిత్రుడు జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి వైదికుల పారిభాషిక పదాలను కొన్ని సేకరించి వివరిస్తూ ఆంధ్ర పత్రిక ఉగాది సంచికలో చాలా కాలం క్రిందట ప్రకటించాడు. ఆ తర్వాత ఇదే ఆంధ్రప్రభ ఆదివారపు సంచికలలో పన్నేండేళ్ళ కిందట మాండలిక పదాల ప్రచురణ కొంత జరిగింది.
అయినా వృత్తి పదాల సేకరణకి ఈ విధానాలేమీ పనికిరావు. శాస్త్రీయ పద్ధతులతో వాటిని ప్రోగు చేయాలి. ఇటువంటి పని వ్యక్తుల వలన అయేది కాదు. సంస్థలు పూనుకొని చేయవలసినదే. అయితే, మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదాకా, చీల్చబడిన పరగణాలను చేర్చి ఒకటిగా చేసే దాకా భాషా విషయంలో గట్టిగా పనిచేసే సాహిత్య సంస్థ ఏర్పడనేలేదు.
‘ఆంధ్రప్రదేశ్’ అవతరించింది. దానికొక సాహిత్య అకాడమీ ఏర్పడింది. దానిలో ఉద్ధండులు, పండితులు, కేవలం కవులు, పండీత కవులు, పనిచేసే వాళ్ళు, చేయనివాళ్ళు, ప్రాంతీయ ప్రతినిధులూ అన్ని రకాలవాళ్ళు సభ్యులుగా నియమితులయ్యారు. అదృష్టవశాత్తూ అందులో శాస్త్రీయ పద్ధతులపైన ఆలోచించేవాళ్ళు కొందరుండి “అకాడమీ అనాథ శరణాలయం కాదు. పదవులూ, బహుమతులూ పంచిపెట్టే పక్షపాతా భూయిష్టమైన సంస్థ కాదు” అని నిర్మొహమాటంగా తేల్చుకున్నట్టు కనబడుతుంది. వివిధ కమిటీలను ఏర్పరిచారు. విద్యుక్త ప్రణాళికలను రూపొందించారు. కొంత మందికి కొన్ని బాధ్యతలను అప్పగించారు. భాష యొక్క సమగ్ర స్వరూప సాక్షాత్కారానికి అనువైన గ్రంథాల ప్రచురణకు ఏర్పాటు చేశారు. కొన్ని చెప్పుకోదగ్గ పుస్తకాలు వెలువడ్డాయి. కొన్ని చప్పగా నున్నవి బైటపడ్డాయి.
తెలుగు భాష ఎంత విస్తృతమయిందో తెలుసుకోటానికి జానపదుల వాడుకలో ఉన్న పదజాలాన్నంతటినీ కోశస్థం చేయాలి. ఇంతవరకు వచ్చిన తెలుగు నిఘంటువులు ప్రధానంగా కావ్య భాష ఆధారంగా ఏర్పడ్డవి కాబట్టి వాడుకలో వున్న పదాలు కొన్ని వేలు వాటిల్లోకీ ఎక్కలేదు. తెలుగులో వాడుకలో ఉన్న పదాలన్నిటీనీ కోశస్థంచేసే దృష్టితో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు మాండలిక పద సంకలానికి పూనుకున్నారు. ఈ పదాల్లో ఎక్కువ భాగం వృత్తులను ఆశ్రయించినవి కాబట్టి మొట్ట మొదట దేశమంతటా ఆయా వృత్తులలో వాడుతున్నా మాటలను సేకరించి ‘మాండలిక వృత్తి పదకోశం’ అనే పేరుతో కొన్ని సంపుటాలుగా ప్రకటించాలనే నిర్ణయం జరిగింది.
మన దేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తి కాబట్టి ఆ వృత్తిలో దేశమంతటా వాడుకలో వున్న పదాలను సేకరించాలనీ, వాటిని మొదటి సంపుటిగా ప్రకటించాలని 1958 జూన్ నెలలో అకాడమీ వారు నిర్ణయించారు. శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తిగారిని ఆ పదాలకి సంకలన కర్తగా, సంపాదకునిగా నియమించారు.
శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తిగారు ప్రస్తుతం తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో రీడరుగా ఉంటున్నారు. వారు భాషా శాస్త్ర నిష్ణాతులు. శాస్త్రీయ పద్ధతులలో శిక్షణ పొంది విదేశాలలో పరిశోధనలు చేసినవారు. అయితే వారు ఈ వృత్తి పదకోశాన్ని సంకలనం చేసే బాధ్యతని స్వీకరించినపుడు వారిని రకరకాల సమస్యలు ఎదుర్కొన్నాయి. అప్పటికి, తెలుగులోనే కాక ఏ యితర భారతీయ భాషలలోనూ యిటువంటి గ్రంథం వెలువడ లేదు. వరవడిగా పెట్టుకొందికి ఏదీ దొరకలేదు. అయినా కృష్ణమూర్తిగారు ఒక ప్రణాళికను వేసుకుని పని మొదలుపెట్టారు. ప్రాథమిక సన్నాహాలు పూర్తి చేసుకున్నాక శ్రీ చేకూరి రామరావు, శ్రీ లింగుట్ల కోనేటప్ప అనే ఇద్దరు పర్యటన పరిశోధకులను నియమించారు.
ఈ భాషా సేవకులకు శ్రీ కృష్ణమూర్తిగారు పదిహేను రోజులపాటు వాల్తేరులో పద సంగ్రహణ పద్ధతులలోనూ, ధ్వని శాస్త్రంలోనూ శిక్షణ ఇచ్చారు. పట్టణాలతో ఏ విధమైన సంపర్కము లేని వ్యక్తులను ఏభై సంవత్సరాలకు పైబడ్డవారినే కలుసుకొని పదాలని సేకరించమని సూచించారు. వీలైనంతవరకూ, పదాలను ఒక వ్యవహర్తనుంచే తెలుసుకొని వాటిని ఉచ్చారణ విధేయంగా రాసుకోవాలని హెచ్చరించారు.
ఏ వూళ్ళో సేకరించిన పదాలను ఆ వూరినుంచే సంపాదకునికి పంపించాలని విధించారు. ఈ సూచనల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది, సంపాదించదలిచిన మాటని గ్రామీణునికి అందివ్వకుండా ఆ పదం అతడే చెప్పేటట్లు ప్రశ్నించాలనడం.
ఈ విధమైన సూచనలతో, శాస్త్రీయ శిక్షణతో ఆ పరిశోధకులిద్దరూ కోస్తా జిల్లాలలో ఒక ఇరవై ఎనిమిది గ్రామాలూ, రాయలసీమలో ఇరవై గ్రామాలూ పర్యటించి పదాలు సేకరించారు. వీటిని సంపాదకుడూ, పరిశోధకులూ వర్గీకరించి ఇరవై విభాగాల క్రింద వేరు పరిచారు. సేద్యంలో రకాలు, పంచుకొనే పద్ధతిని బట్టి వ్యవసాయరీతులు, పనిముట్లు, వాహన సాధనాలు, వ్యవసాయ వృత్తికి సంబంధించిన పండుగలూ, దేవుళ్ళు, పూజలు, ఆచారాలూ ఒకటేమిటి రమారమీ సమస్తం ఆ విభాగాలలోనికి వచ్చాయి.
మాండలిక పద సేకరణకు దేశమంతా తిరగక్కరలేదు. అందుకని సగటున జిల్లాకు ఆరు గ్రామాల చొప్పున ఇరవై జిల్లాలకు నూట ఇరవై ఒక్క గ్రామాలను ఎంచుకొని ఇంకా కొంత మంది పర్యటన పరిశోధకులను నియమించి నిర్ణయించుకున్న శాస్త్రీయ పద్ధతిలో పదాలు సేకరించారు.
ఆ పర్యటన పరిశోధకులు పడ్డ పాట్లు పగవాడికైనా వద్దు. ప్రయాణ సౌకర్యాలు సరిగ్గా ఉండవు. బస్సులు సకాలానికి నడవవు. వెళ్ళవలసిన గ్రామం దాకా కొన్ని బస్సులు వెళ్ళవు. కాలినడకను వెళ్ళాలన్నా రోడ్డూ బాగుండదు. తీరా గ్రామం చేరుకున్నాక వ్యవహర్తలు సహకరించకపోవచ్చు. మోకాలిబంటి నీళ్ళలో కొన్ని చోట్ల నడవాలి. ఈదాలి. జేబులో వున్న డబ్బులు గంగపాలు కావచ్చు. పొలం పనులు ముమ్మరంగా ఉండే కాలంలో వెళితే ఏ రైతుకూ తీరుబాటు ఉండదు. అమాయకులైన గ్రామీణులు, ఈ మాటల సర్వేని చూసి సర్కారు మళ్ళీ ఏ కొత్త పన్నులు వేయడానికి ఈ ప్లాను వేసిందో అని అనుమానించవచ్చు.
“ఎన్ని ఇక్కట్లు పడ్డా వేతనమే లక్ష్యంగా కాక పనిలో ఉన్న అభిలాష వల్లను, భాషా సేవా దృష్టితోనూ పూనుకొన్నవారు కాబట్టి పర్యటన పరిశోధకులు వారికిచ్చిన సూచనల మేరకు సంకలనం విజయవంతంగానే కొనసాగించారు.” అని కృష్ణమూర్తిగారు వ్రాశారు.
వెనకటికో బాలింతరాలు “నన్ను కన్నప్పుడు మా అమ్మ పడ్డ బాధ ఇప్పుడు బోధపడింది.” అన్నదట. మెకంజీ రికార్డులను సేకరించడంలో కావలి బొర్రయ్యగారు ఎన్ని కష్టాలకు లోనయ్యారో, ఈ పర్యటన పరిశోధకుల పాట్లు తెలుసుకున్నాక మనం వూహించుకో వచ్చును. వీళ్ళు నిజంగా ఆభినందించ తగిన వాళ్ళు.
తనతో పాటు పనిచేసిన ఈ భాషా సేవకులకు కృష్ణమూర్తిగారు పేరుపేరునా కృతజ్ఞత చెప్పారు. ప్రతి ఆంధ్రుడూ వాళ్ళకి ఋణపడ్డవాడే. ఆ ఉత్సాహవంతులు శ్రీయుతులు లింగుట్ల కోనేటప్ప, చేకూరి రామరావు, బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి, వి.రత్తయ్య, జి.భానుగార్లు. మొదటి ముగ్గురూ, అందులోనూ ప్రధానంగా చేకూరి రామారావుగారు పద వర్గీకరణంలో కూడా పాల్గొన్నారట.
పద సంగ్రహణానికి ఒక ఏడాది పట్టింది. సేకరించిన పదాలను జల్లెడపట్టి క్రమపట్టికలు తయారు చేసి, భాషా ప్రామాణ్య దృష్టితో వర్గీకరించడానికి మరొక ఏడాది పట్టింది. ఏయే పదాలని ఏయే ప్రాంతాలవారు ఏమని పిలుస్తారో వివరిస్తూ అవి దేశ పటంలో సూచిస్తూ ముప్పయి మూడు పటాలు వేయించారు. మొదటి ఇరవై ఎనిమిది పటాలలో ఒక్కొక్కటి సమానార్థంలో వాడుతున్న భిన్న పదాల ప్రాంత పరిమితిని సూచించారు. మిగతా పటాలు ప్రధాన భాషా మండలాలను సూచిస్తాయి. వివిధ వస్తువులకు అర్థాలు ఎంత వివరంగా ఇచ్చినా వాటి స్వరూపం కన్నులకు కట్టక పోవచ్చును. కాబట్టి, అరవైయొక్క ప్రధాన రేఖా చిత్రాలను వేయించారు. ఈ చిత్రాలకు ఉపచిత్రాలు కూడా చాలా ఉన్నాయి.
ఉచ్చారణ విధేయంగా పదాలను సేకరించడం వల్ల ఎన్నెన్నో లభించాయి. ఉదాహరణకి ‘ఇసక’ అన్నమాటకే ఉచ్చారణ భేదాలుగా “ఇసికె, ఇసెక, ఇస్క, ఉసికె, ఉసెక, ఉస్కె” అనే మాటలు సేకరణలో దొరికాయి.
“ధ్వనుల మార్పు ఫలితంగా ఏర్పడ్డ రూప భేదాలన్నీ – ప్రాచీనాలయినా, అర్వాచీనాలయినా, ప్రాంతీయాలయినా, వైయక్తికాలయినా, విస్తృతాలైనా, పరిమితాలయినా భాషా పరిణామాన్ని అర్థం చేసుకోవటానికి సమానర్హతగల శాస్త్ర విషయాలు అవుతాయి కాబట్టి వాటిల్లో యే ఒక్క రూపాన్ని నిరాకరించడానికి వీలు లేదు” అనే ఉత్తమ దృక్పథంతో శ్రీ కృష్ణమూర్తిగారు ఈ రూపబేధాలలో ఏది ప్రధానమైనదో నిర్ణయించి, దానిని ఆరోప పదంగా ఇచ్చి మిగతా వాటిని ఉచ్చారణ భేదాలుగా సూచిస్తూ పట్టికలు తయారు చేశారు.
వారు సేకరించిన వాటిలో సుమారు తొమ్మిది వేల ఆరోప పదాలున్నవట. వాటినన్నిటినీ వివిధ విభాగాల క్రింద ప్రకటించారు. ఆరోప పదాలకు అర్థ నిర్ణయం చేశారు. మిగిలిన తెలుగు కోశాలలోలాగ “ఇదొక వృక్ష విశేషము” అనే రకంగా అర్థమివ్వకుండా సాధ్యమైనంత వివరించారు.
వారి మహత్తర కృషియొక్క ఫలప్రదమైన స్వరూపమే “మాండలిక వృత్తి పదకోశం, ప్రథమ సంపుటం” అనే బృహత్కోశం. ఈ భాషా యజ్ఞంలో, పద సంగ్రహణ ప్రణాళిక తయారు చేయడం, ప్రూఫులు దిద్దడం, రేఖాచిత్రాలు, పటాలు వేయించే పని పర్యవేక్షించడం కొన్ని కొన్ని భాగాలకు పూర్తిగా సంపాదకత్వం వహించడం మొదలైన బాధ్యతలను శ్రీ తూమాటి దోణప్పగారు వహించారు. ఇటువంటి గ్రంథాన్ని ప్రకటించినందుకు ఏ అకాడమీ వారైనా గర్వించవచ్చును. మన అకాడమీ ఇంతటి మంచిపని చేసినందుకు మనమందరం వారిని అభినందించాలి.
ఈ విధమైన వృత్తి పదకోశాలను ప్రతివృత్తికి సంబంధించినవీ, ఇంకా శాస్త్రీయంగా ప్రకటించిననాడే మన భాష సమగ్ర స్వరూపం మనకు బోధపడుతుంది. అప్పుడే ప్రధాన కావ్యాల పదకోశాలతో వాటిని జత చేసి పరిశీలిస్తే తెలుగుభాషకు చారిత్రక సూత్రాలపై సమగ్రమైన భాషాకోశం వెలువడుతుంది.
ఈ వృత్తి పదకోశానికి శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తిగారు విపులమైన గ్రంథ పరిచయాన్ని వ్రాశారు. దానిలో ఎన్నో విషయాలను శాస్త్రీయంగా చర్చించారు. కొన్ని కొన్ని సూత్రప్రాయమైన అభిప్రాయాలను ప్రకటించారు. వాటిలోని కొన్ని భాగాలను యదాతథంగా ఉదహరించడం మంచిదని భావిస్తున్నాను.
విద్యావంతులైన తెలుగువారిలో నూతన భావ నివేదనకు శబ్ద సామగ్రి సమకూర్చేది సంస్కృతమై నపుడు, జాను తెనుగు పామరులైన గ్రామ ప్రజల వాడుకలోనే వర్దిల్లుతూ వచ్చింది. వీరి భాషా వ్యవహారం సంకుచితమైనదైనా ఆ కొద్ది పరిధిలోనే తెలుగు నుడికారం వూహకందనంత విశాలంగా పెరిగింది. తెలుగు పలుకుబళ్ళలోనే కొత్త తలపులకు మాటలు కల్పించే శక్తి జానపదుల సొమ్ము.
ఈ మాటలు అక్షరాలా నిజం. ఉదాహరణకి ఈనాడు “కోపరేటివ్ ఫార్మింగ్” అనే పదానికి విద్యావంతులం సమిష్టి వ్యవసాయం, ఉమ్మడి వ్యవసాయం అనే మాటలను సృష్టించాం. అయినా గ్రామీణుల పదజాలంలోనే “పొత్తుల వ్యవసాయం” అనేదొకటుంది. అది ఎంత అర్ధవంతమైనది !
“కావ్య భాషలో మనకింతవరకు అర్థం తెలియని దేశ్య శబ్దాల స్పష్టార్థ నిరూపణకు ఇటువంటి కోశాలు తోడ్పడతాయి.” అని కృష్ణమూర్తి గారన్నారు. సత్యం, సత్యం, పునస్సత్యం. ఉదాహరణకు శుకసప్తతి రెండో ఆశ్వాసంలోని నూట పదమూడవ పద్యంలో “బాసలట, బండికండ్లట” అనే ప్రయోగముంది. బండికన్ను అనే ఏకవచనానికిది బహువచనం అనుకుంటాము. అయితే ‘కల్లు’ అన్నది ఏకవచనం, కండ్లు అన్నది బహువచనం. దీని కర్ధమేమిటి? అని నిఘంటువులు తీసి చూస్తే రకరకాల అర్థాలుంటాయి. కాని అసలు విషయం తెలియదు. శబ్దరత్నాకరంలో ‘కల్లు’ అనే ఆరోపం క్రింద “బండికన్ను, వ. దాపటి కల్లు క్రుంగినం దేరు ఘూర్ణిల్లె” భార. కర్ణ-3ఆ3″ అనికనబడుతుంది ఆ బండికన్ను ఎక్కడుందో చెప్పదు. సూర్యరాయాంధ్ర నిఘంటువులో “(బండి)కన్ను, (బండి) చక్రము ‘శకటము హరిదన్నిన దివి బ్రకటంబై యెగసి యిరుసు భరమున్ గండ్లున్ వికటంబుగ నేలంబడె’ భాగ-10-పూర్వ250″ అనే వివరణ కన్పించినా ‘కండ్లు’ ఎలా ఉంటాయో కళ్ళకు కనిపించవు. ఆంధ్ర వాచస్పత్యంలో “బండి కన్ను, వా.దే.వి. రూ:బండికలు, బండికల్లు, చాయమేకు, చిలుక చీల జంజడ, మొల వగైరా మాటలు కనబడతాయి. ఈ వృత్తి పదకోశంలో ఇప్పుడు దాని అర్థం కచ్చితంగా తెలుస్తుంది. “కల్లు: (బహు.కండ్లు) పర్యా.చూ: ఆకు బండి కుండను పూటీ (వంపు)ని కలిపే కొయ్య.చూ.చిత్రం 28.త (తెలంగాణా మాట)” అని స్పష్టంగా తెలుస్తుంది. ఆంధ్ర వాచస్పత్యంలో రూపాంతరాలుగా యిచ్చిన మాటలలో చాయమేకు మొదలైనవి కల్లుకి పర్యాయపదాలు కానే కావు అన్న సంగతి తెలుస్తుంది. అవన్నీ వేరే భాగాలు. ఈ వృత్తి పద కోసం వల్లనే ‘కల్లు’ని తెలుగువాళ్ళు ఎప్పుడూ కన్నుగా వాడలేదని తెలుస్తోంది. నూట ఇరవై యొక్క గ్రామాలలొ ఏ జానపదుడూ బండి ఆకును “బండి కన్ను ” అని పేర్కొనలేదు. మన నిఘంటు కర్తలు ‘కండ్ల’ కు ఏకవచనం కన్ను కాబట్టి ఆ విధంగా ఊహించి వ్రాశారు.
ఇలాగ ఒక్కొక్క పదాన్ని పట్టుకొని చర్చించుకుంటూ పోతే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈ వృత్తి పద కోశాన్ని పెట్టుకొని భాషా పరిశోధకులు ప్రస్తుతం మనకున్న నిఘంటువులన్నింటితో తైపారు వేసి మాటలకు అర్థ నిర్ణయం అప్పటినుంచే మొదలెడితే సమగ్ర భాషకోశం వెలువరించడానికి ఎంతో తోడ్పడుతారు.
ఇంతటి మహత్తర కోశాన్ని సంకలనం చేసిన శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తిగారినీ, ఆ పని వారికే అప్ప చెప్పి ఓపికతో చేయించుకొని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారినీ మరొకమారు అభినందిస్తున్నాను. మరొకమారు చాలదు. పిదప వేరొక మారు, ఆ తరువాత ఇంకొకమారు అభినందించాలి.
అన్నట్టు, ఈ వృత్తి పదకోశానికి అకాడమీవారు నిర్ణయించిన వెల పాతిక రూపాయలు. నిజానికి లోనున్న విషయం అమూల్యం. దానికి ఖరీదు కట్టే షరాబు లేదు.