[ విశ్వనాథ వారి ఈ వ్యాసాన్ని ఓపిగ్గా టైపు చేసి మాకు అందజేసిన వైదేహి శశిధర్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు – సం.]
వాడుకభాషనే కొందరు “గ్రామ్యభాష” అంటున్నారు. గ్రామ్యభాష అనడం ఎంత వరకు సమంజసమో చూద్దాము.
విశ్వనాథ సత్యనారాయణ
గ్రామీణులైన జనులు వాడుకునేది గ్రామ్యము. గ్రామ్యమనగా అసభ్యమని అర్ధము. గ్రామీణులు మోటువారు, నాగరికత లేని వారు. అందుచేత వారు నగరస్థులు సభలలో వాడే అంత భావగౌరవం కల భాష వాడరు. దానివలన గ్రామ్యం అపరిగ్రాహ్యం కావచ్చును. మేము మా పత్రికలలో వాడే భాష గ్రామ్య భాష అని ఈ మధ్య ఎవరో హైదరాబాదు సుజాత లో వ్రాసారు. సజీవమైన భాషా,ఆ భాష పొందే మార్పులు ఆ భాష మాట్లాడేందుకు నడిబొడ్డు అయిన ప్రదేశాల్లో సువ్యక్తంగా కనబడతవి. అక్కడ దానిగురించి సానుభూతి ఉంటుంది. అట్లాగే ఇంగ్లీషు భాష నేటికాలంలో అసలయిన వాడుక భాష కావాలి అంటే, లండన్ లో కనబడుతుంది. తెనుగు భాష కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలలో మాట్లాడేది అట్లాంటిది. ఇతర భాషలతో కలిసి ఉండే ప్రదేశాల్లో ఈ భాష మార్పునందు అంత సానుభూతి ఉండదు. బరంపురం, హైదరాబాదు, చిత్తూరు ఇటువంటి భాషా సంపర్కం కలచోట్ల వాళ్ళకి గ్రాంధిక భాష నిలబెట్టుకోవటమే కష్టం. అందుచేత భాష పొందే మార్పులని కూడా యెక్కడ సంబాళించుకుంటారు? దాని మూలంగా వాళ్ళకు దీనియందు సానుభూతి తక్కువగా ఉంటుంది. అయితే మీ చోట్లనే వాడుకభాషని నిరసించే వాళ్ళు ఉన్నారు గదయ్యా అంటే వున్నారూ! మేము చెప్పింది సామాన్య విషయం ఉత్సర్గం కాదు అంటాము.
గ్రామ్యశబ్దం విచారిస్తే ఈ గ్రామ్యశబ్దం వాడుకభాషయందు ఎందుకు ప్రయోగింపబడుతోంది అంటే “యస్త్వపభ్రంశో గ్రామ్యః” అన్న నన్నయ్య గారి సూత్రం వల్ల. తెలుగుకి సంస్కృతం మాతృకగా చేసిన నన్నయ్యగారు తెలుగు వ్యాకరణం వ్రాసేటప్పుడు సంస్కృత మర్యాదలు పాటించారా? లేదు. తెలుగు భాషా స్వభావం వారికి బాగా తెలిసి ఆ మర్యాదలన్నా చేశారా? “శాస్త్రమపౌరుషమాద్యం” అన్న నన్నయ్యగారికి తమయందు ఋషిత్వం సిద్ధించిందేమో చూశారా? అట్లాగయితే మనం ఆంధ్రశబ్దచింతామణి తెరుస్తూనే “ఓం నమో నన్నయాధర్వణ చిన్నసూరిభ్యో మహాఋషిభ్య” అనటం లేదేమి?
సంస్కృత లాక్షణికులు “కటిగల్లాది” శబ్దాలు గ్రామ్యములన్నారు. కాని గచ్చతి అన్నదానికి ఏ అపభ్రంశరూపమో “గచ్చేతై” వంటిది తీసుకుని అది గ్రామ్యమనలేదేమిటి? ఆ కటిగల్లాది శబ్దాలు మన గ్రంధాల్లో బహుగా ప్రయోగించారే మరి? అందాకా యెందుకు? నరసభూపాలీయంలో “కన్నులు”, “చన్నులూ” గ్రామ్యాలు అన్నాడు. మరి అవ్వి లేకుండా మనకు కావ్యం నడవదే ,ఎట్లా?
అసలు గ్రామ్యం అంటే మన పూర్వుల ఉద్దేశ్యం ఏమిటి?మనమేమనుకుంటున్నాము? పూర్వుల ఉద్దేశ్యం అసభ్యమైన భాష అని. కొన్ని బజారు మాటలు నలుగురు పెద్ద మనుష్యులలో సభలలో మాట్లాడరానివి ఉంటాయి. అవీ. పూర్వం సంస్కృతంలో కటిగల్లాదులలాంటివి. చన్నులు ఇప్పుడు అట్లాంటిది. సభలలో మాట్లాడేది సభ్యం. ఈ వాడుక భాష, సభలలో,అది గ్రామ్యం అనే వారు కూడా మాట్లాడుతున్నారు. బ్రహ్మశ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారి ఉపన్యాసం రక్తిగా ఉంటుంది అంటే యెందుకని? వారు వాడుక భాష ప్రయోగిస్తారు. కాకు ధ్వని వాడుక భాష లోనే ఉన్నది. గ్రాంధిక భాషలో కాకువు సాధించుకోవాలి. గ్రాంధిక భాషావాది అన్నకొద్దీ రమ్యత తెలియని వాడని అర్ధం. ఈ కాకువు గ్రాంధిక భాష లో ఇమిడ్చేందుకు తిక్కన పడ్డ కష్టం భగవంతుడికి తెలుసు. అందుకనే భాగవతం అర్ధం చెప్పటం కష్టం, భారతం చదవటం కష్టం అనీ అంటారు. భాగవతం లో వేదాంతార్ధం పెగలదు. భారతం లో కాకుస్వరం తెలియదు. అది తెలియకనే భారతం లో ఏమున్నదీ అంటారు కొందరు.
కాకువు అంటే భావద్యోతకానికి ఉచ్చారణ లో చూపే ఒడుపు. ఒక భాషా సామర్ధ్యం ఆ భాషలో కాకుధ్వనిని బట్టి తెలుస్తుంది. ఆ కాకుధ్వనిని గ్రాంధికభాష కన్నా వాడుక భాష మిక్కిలిగా ప్రయోగిస్తుంది. వాడుకభాష అంటే ప్రత్యయాల మార్పు మాత్రమే అనుకోవచ్చు. నేటికొందరు కవుల భాష ప్రత్యాయాలు మారిస్తే,వాడుక కన్నా అమిత కనాకష్టం అవుతుంది. ఏ శ్రీనాధుడి కవిత్వమో ప్రత్యయాలు మారిస్తే దానికి గ్రామ్యత్వం సిద్ధించదు. సంస్కారం పొందిన హృదయం, వాక్కూ కలవాడు వ్రాసినా, మాట్లాడినా భాషకు కొంత గౌరవం ఉంటుంది. గౌరవం కల శబ్దాలు వాడతాడు. సంస్కార రహితమైన హృదయమూ, వాక్కూ కలవాళ్ళు గ్రాంధిక భాషలో ఉండే ప్రత్యయాలు చివర కలిపినా అది అట్లాగే ఉంటుంది.
ఈ వాడుక భాష యెందుకు వద్దూ! అని అడిగితే పండితులు చెప్పే కారణాలు ఏమిటంటే శబ్దాలు ఇష్టం వచ్చినట్లుగా మారుతున్నవి, ఆ మార్పుకు హద్దు లేదు, అందువల్లగ్రాంధికభాష మారిపోతుంది, అని. మార్పుకు హద్దు లేదూ అంటే హద్దు వున్నది. గోడ ని ఎవరూ “గేడ” అనరు. చూడటం “చూట్టం” అవుతుంది. “ఒక్కరిత”కు యాభై రూపాలు వ్రాసిన వ్యాకరణం ఈ మాత్రం చెయ్యలేదూ?
కొందరు నన్ను అడిగారు, పద్యాలు వ్రాస్తావు నువ్వు. వాడుకభాషా వ్రాస్తున్నావు. నీకది ఇష్టమా? ఇది యిష్టమా? అని. రెండూ ఇష్టమేనన్నా! దానికి వారు ఒప్పుకోరు. ఒప్పుకోక “ఆ! అది ఎట్లా!” అంటారు. వారన్నది నాకు తెలియటం లేదు.
బ్రహ్మశ్రీ ఆచంట సాంఖ్యాయన శర్మ గారు మనదేశానికి భీష్ముల వంటి వారు. వారు అన్నారు కదా, “ఈ క్రొత్త భాష వల్ల భారత భాగవతాలు మూలపడతవి” అని. ఈ భాష వల్లనే అట్లా జరిగేటట్టయితే అది ఇదివరకె జరగాలి. బొబ్బిలిపాటలు, కావమ్మ కధలు, రామదాసు కీర్తనలు, కొంతదాకా త్యాగయ్య కృతులు ఇవన్నీ వాడుక భాషలోనే వ్రాయబడ్డవి. అవ్వీ అచ్చు బడ్డవి. దాని వల్ల భారత భాగవతాలకు వచ్చిన నష్టం లేదు, అన్నా.
భారత భాగవతాలు ఈ భాషలో వ్రాయవచ్చునా? అని అడిగారు. నేను కాదు అన్నాను. వాడుక భాషకి అంత సామర్ధ్యం లేదు. నేడు రామాయణం ఈ భాషలో వ్రాయాలని కాదు. ఈ భాషలో వ్రాసినా, ఆ భాషలో వ్రాస్తే,ఏ అందం వచ్చిందో, ఆ అందం రాదు. ఆ రెంటి తారతమ్యానికి బొబ్బిలి కధని రంగరాజవిజయం తో పోల్చి చూస్తే తెలుస్తుంది. ఈ భాష చదివితే పిల్లలు పాడైపోతారూ అన్నారు. ఈ యూనివర్సిటి వారూ, గవర్నమెంటు వారూ పెట్టే గ్రాంధిక నామక గ్రంధాల వల్ల పాడవుతారే గానీ, శక్తి గల జీవం గల నుడికారం ప్రయోగించిన వాడుక భాషా గ్రంధాలు చదివితే చెడిపోరు అంటాను.
భాష స్వభావం తెలుసుకోకుండా గ్రంధస్థ భాష లో వున్న ప్రత్యయాలకి మాత్రమే ఆ గౌరవం కలిపిస్తే, దానివలన భాషకి చాలా నష్టం ఉంది. పిల్లలకి అటువంటి భాష నేర్పరాదు. ఆ భాష తగినంత జీవం గల భాష అయి ఉండాలి. నిర్జీవమైతే గ్రాంధిక భాష అయినా పిల్లలకు నేర్పకూడదు. గ్రాంధికభాష అన్న పేరుతో తప్పు రూపాలు కోటానుకోట్లుగా ఉన్న భాష (ఇప్పటి స్కూళ్ళలో పెట్టు పుస్తకాల భాష) వాళ్ళకి నేర్పరాదు. సామాన్యంగా పిల్లల చేత నేడు స్కూళ్ళలో చదివించే నవలలూఅవ్వీని, కుర్రవాడికి భాషలో ఉండే శక్తిని తెలియనియ్యటం లేదు. భాష శక్తి కారకం లోనూ, కాకువు లోనూ, హృదయోద్వేగం కలిగించే మాటల్లోనూ ఉంది. ఆ శక్తి తిక్కన రచనలలో సమృద్ధిగా ఉంది.కొందరి కవుల్లో అది కనబడనే కనబడదు.
“వచ్చుచున్నది”, “వస్తున్నది”,”వస్తోంది” అన్న రూపాల దగ్గర కాదు తగాదా, బాహుళ్యం మీద,భాషా స్వభావం మీద. ఈ రూపాలన్నీ కూడా వాడికి తెలియవలసిందే. అవి వాడే చోట్లు వేరుగా ఉంటవి. పసిపిల్లలకు చెప్పే చిన్ని చిన్ని కధలలో “వస్తోంది” అని వాడవచ్చు. ఇంకేదైనా అయితే “వస్తున్నది” అనవచ్చు.”వచ్చుచున్నది” గ్రాంధిక రూపం తెలిశేటందుకు. మన భాష లోకి యితర దేశ్యాలు యధేష్టంగా ప్రయోగించవచ్చు. “ఫీలు” కూడా భాష లోకి వచ్చింది.”సప్లయి” మొదలైనవి శబ్ద రత్నాకరము లోనే ఉన్నవి. “వస్తాడు” అన్నది నింద గ్రామ్యం! ఇది యెట్లా ఉందంటే, దొరగారితో కలసి టీ తాగవచ్చు కాని పంచముణ్ణి దగ్గరకు రానీయరాదు. మహమ్మదీయుడికి శూద్ర మర్యాద వచ్చింది. దొరకి దొర మర్యాదే సిద్ధించింది. మాలవాడికి?
అనింద్య గ్రామ్యమైనది “కఱకంఠుడు”,ఎందుచేత? అనుశాసకుడికి పూర్వం వ్రాశాడు ఏ కవో ఆ మాట. కవులందరూ వ్రాశే వరకూ ఆ అనుశాసకుడు ఆగరాదూ! అనింద్య గ్రామ్యాలు అన్నీ తెలిశేవిగా! ఎవరో కొందరు పండితులు “ఇది గ్రామ్యం ,వద్దు” అంటే ప్రవాదున్నూ “ఛీ ఇది గ్రామ్యం”. అనే వారికన్నా పదిరెట్లు ఎక్కువగా! “అన్నాడు ధర్మరాజు” అన్న వాక్యం వుంటే “అది గ్రామ్యంలే” అనటం. బాబూ అది చాలా గ్రాంధికం! “ఏక వాక్యంబునందొకానొక్కండుదక్క సర్వపదంబులు క్రమ నిరపేక్షంబుగం బ్రయోగింపం జను” అన్నాడయ్యా చిన్నయ్య అంటే,దానికర్ధం తెలియదు మళ్ళీ .
భాష ప్రవాహిని. మారుతూ వుంటుంది.కనుక మారే భాషని పట్టుకోవటానికి వీలులేదు, అని భాషా వాదుల తర్కం. దీని కొక పండితులు చక్కని అభ్యంతరం చెప్పారు. ఏమని అంటే, “అవును.మారటం స్వభావం. ప్రకృతిలో ఆ దోషం వున్నది. ఆ దోషం తీసివేసేందుకే దాన్ని ఇట్లా వుండాలని నిశ్చయించాము. దాన్ని సూత్రబద్ధం చేశాము” అని. ఇది బావుంది. కాని సూత్రబద్ధం చేయక మునుపు ఆ భాష యొక్క పరిణామానికి, దాని వైశాల్యానికి ఎడమిచ్చి చేయాలా? వద్దా? కుర్రవాణ్ణి అల్లరి చిల్లరిగా తిరగనీవద్దు. అయిదయింతరవాత వాడు ఆడుకోవద్దూ? ఇంట్లో అదేపనిగా కూర్చుంటే గుద్దులెత్తి బోదకాళ్ళు వస్తవి. మన భాష కిదివరకే బోదకాళ్ళు వచ్చినై. కొంచెం కాలు సాగనివ్వాలి.
కొందరన్నారూ! మార్పు మార్పు అంటావు. మార్పే ప్రధానమా? ఇంకేం కారణాలు అక్కర లేదా? మార్పు కోసమే మార్పా? అని. మార్పు కాదు. వాడుక భాషలో చెప్పే కొన్ని భావాలు సరిగ్గా తెలియచెయ్యటానికి గ్రాంధిక భాషకి సామర్ధ్యం చాలదు, అని. పూర్వం నన్నయ్య గారు నిబంధించిన నిబంధన చాలకనే భాష ఇంతగా మారిపోయిందని, కనక ఆ సామర్ధ్యం ఎంతవరకుందో అంతవరకు వదలిపెట్టవలెనని, అప్పుడు దానికి సూత్రాలు నిర్మించు, నీ సూత్రాలు దాటడెవ్వడూనూ. అట్లా అయితే వాడుక భాషకే సామర్ధ్యం చాలదు. వాడుక భాష వాడుకలో ఉన్న భావాలను మాత్రమే చెపుతుంది. గ్రాంధిక భాషలో మనకు వాడుకలో లేని భావాలు చెప్పవలసి వస్తుంది. పైగా గ్రాంధిక భాషకి అటువంటి భావాలతోనే ఎక్కువ పని ఉంటుంది, అని అన్నారు. అవును, ఆ భాష సామర్ధ్యం ఆ భాషది. ఈ భాష సామర్ధ్యం ఈ భాషది. రెండునూ కావలయుననే నా ఊహ.
నిజమైన మాటకి పద్యమూ, గద్యమూ రెండే మార్గాలు. మూడవది పాట. పాట ఏ భాష లో నయినా ఉండవచ్చును.పద్యం గ్రాంధిక భాషలో ఉండాలి. పద్యం ఎందుకు గ్రాంధిక భాషలో ఉండాలి అంటే, ఛందోబద్ధమైన భాషకు పద్యమూ, పద్యానికి ఛందోబద్ధమైన భాషా సరిపోయినవి. ఇదివరకు మన వాళ్ళు సృష్టించి యేర్పరచిన వృత్తభేధాలు గ్రాంధికభాషా స్వరూపానికి సరిపోతవి. వాడుకభాషలోనే పద్యాలు వ్రాయాలి అంటే, ఆ వృత్తాలు మారాలి. కాదు, వృత్తాలే ఆ వాడుక భాషలో వ్రాస్తాము అంటే ఆ వృత్తాలకు ఆ భాష తిరిగిపోయింది. మళ్ళీ అంత ప్రయత్నం చేసిన కవులు ఆ వృత్తాల్లో ఈ భాషని వంచితే కాని అంత సాఫీ తిరగదు. అది కాలగర్భం లో ఉన్న పని.
వచనంలో వాడుకభావాలు చెప్పటానికి వాడుక భాష కుదిరినట్లుగా గ్రాంధిక భాష కుదరదు. వాడుకలో లేని భావాలకు గ్రాంధికభాష కుదర వచ్చు. మిక్కిలి వాడుకలో ఉండే భావాలు ఆ భాషలో చెప్పటం పరమ అసహ్యం. వాడుక భాష వ్రాస్తే కొందరు, ‘మా కర్ధం కావటం లేదు.చదవటం యెట్లాగో తెలియటం లేదూ’ అంటారు. వారు మాట్లాడటం లో ఉన్న ఒడుపు తెలియక అట్లా అనటం. ఆ ఒడుపే భారతం నిండా ఉన్నది. వారు భారతం చదివి కూడా అట్లాగే అంటారు.
‘కొందరు “దుయ్యబట్టటం” మొదలైనవి ప్రాంతీయాలు,అవి వాడితే ఎట్లాగబ్బా’ అంటారు. ప్రాంతీయాలు గ్రాంధిక భాషలో కొల్లలుగా వాడతారుగా మరి. ప్రాంతీయశబ్దాలు అని తోసివేయటం గ్రాంధిక భాష చెయ్యదు. ఆ విషయం లో గ్రాంధిక భాష భాషావైశాల్యం పరిగణించిందన్నమాట. అట్లా తప్పు పట్టుకుంటే వాడుకభాష తన వైశాల్యం సంకుచిత పరచుకుంటోంది అని అర్ధం. ప్రాంతీయ శబ్దాలు భాషాదేవి విస్తారమైన తనువు. అవి తీసేస్తె ఆవిడ గుజ్జు అయిపోతుంది. కావలిస్తే ప్రాంతీయ శబ్దాలు పట్టికలు ఇవ్వవచ్చును.
వస్తోంది,వెళుతోంది-ఇటువంటి మాటలు వికారంగా ఉన్నవనీ, అవి కుంటి నడక వ్యత్యస్తపు మాటలనీ అంటారు. “వస్తోంది” అన్న మాట “వస్తున్నది” అని ఉండాలని వీరి ఊహ. వాడుక భాషకు కూడా కొన్ని నిబంధనలేర్పరచి, దాన్ని సంస్కరిద్దామని వారి ఉద్దేశం. ఇదివరకు నన్నయాదుల సంస్కారం వీరు ఒప్పుకోలేదు. ఎందుకనీ? దానికి సామర్ధ్యం లేదని. అది వికృతంగా ఉన్నదనీ. మరి తాము చేయబోయే సంస్కారానికి ఆ దశ పట్టదూ,కొంత వరకే నాయెను.
కొందరు కవులకు అదొకమోస్తరు ఒత్తు అక్షరాలు రాకుండా నీళ్ళవలే సాఫీగా నడుస్తున్న కవిత్వమే కవిత్వమనిపించినట్లు, కొందరికి అందరికీ అర్ధమవుతున్న శబ్దాలే యేరి అదొక మోస్తరు సాఫీగా ఉండాలని వాడుక భాష. ఎవడు వాడే భాష వాడు వ్రాస్తాడు. నేను మా నందమూరులో చిన్నతనంలో నాకు వచ్చిన భాషా, నేను చదువుకోగా నాకు వచ్చిన భాషా రెండూ నాలో కలిసి ఏ పరిణామం పొంది నా నోటివెంట వస్తుందో అది మాట్లాడుతాను. అదే వ్రాస్తాను.
ఎవరు ఎట్లా వ్రాసినా, ఎట్లా మాట్లాడినా వారి వ్రాతకి వారి మాటకి భిన్నత్వం వుంటుంది. ఆ వ్రాసే వారూ, ఆ మాట్లాడే వారూ వ్యక్తిత్వం కలవారైతే అది కనబడుతూ వుంటుంది. తను వ్రాస్తుంటే తన ఆత్మ అందులో కనబడుతూ ఉంటుంది. ఆ ఆత్మను బట్టి అతను వాడే శబ్దాలూ ఉంటవి. మనకు నచ్చితే అందం, కాకపోతే బాగులేదు అంటాం. ఒకడికి పుల్లకూర ఇష్టమైతే ఒకడికి ఇగురుకూర ఇష్టం. ఇది నా చెవికి మహా అసహ్యం గా వినబడుతోంది అంటే, నా చెవికి చాలా శ్రావ్యంగా వున్నది.
అనేక మారుమూల శబ్దాల్లో క్రొత్త క్రొత్త రకంగ కూర్చిన సమాసాల్లో తెనాలి రామలింగకవికి సౌందర్యం కనబడ్డది. అతని ఆత్మ లోంచి ఆ కవిత్వం వచ్చింది. అటువంటి మార్గం పోయిన కవి లేడు భాషలో మళ్ళీ. అతన్ని కాదనటానికి మనకా వాక్కు చాలదు.
ఒక కవి అన్నాడు, ‘నా ఆత్మ యిది రమ్యం అని నిర్ణయించిన దానికి నువ్వెవరు కాదనేందుకు?’ అని. ఒక్కొక్కని స్వభావం వేరయిన కొద్దీ అతని శబ్దసముదాయం, అవి చెప్పే రీతీ భేదిస్తూ వుంటుంది. అతని స్వభావం వల్ల ఆ శబ్దాలే ఒక కొత్త వంపు తిరుగుతవి. ఇతరులకు అంతా అది కొత్తగా ఉంటుంది. అతని భావం తెలుసుకోవాలీ అంటే, ఆ అతని మాటల వంపు, వాని స్వభావం వల్ల ఆ మాటలకు చెప్పే మార్పూ ఓపిక గా తెలుసుకొంటేనే కానీ తెలియదు. అది అందరికీ తెలిసేటట్టుగా ఉండాలి కానీ అందరూ అతన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారా? అని అంటే అందరూ అతన్ని తెలుసుకునేందుకే ప్రయత్నించాలి. కవి, వ్రాయసకాడు ప్రభువు వంటి వాడు. వాడి భాష మనము చదువుకోవాలి. ఆసేతుశీతాచలం ఇంగ్లీషు చదవటంలే! ఎందుకు? దొర కాదూ! కాని వాడి భావం మనకు తెలిసేటందుకు వాడూ ప్రయత్నం చేస్తాడు.
రమ్యతా విషయమే చెవి వల్ల నిర్ణయించాలి అంటే దానికి చివర దొరకదు. “సహృదయ” శబ్దానికి లక్ష్యం నిర్ణయించాలిసినట్లు. నీ చెవికి అందం తెలియదూ అంటే నీ చెవికి తెలియదు. చివరకు పదిమంది అన్న మాటకు పై చేయి ఇస్తే అది ఒక బోర్డు లో ఉన్న మెంబర్లచేత చేతులెత్తించినట్లే. భాషకి కూడా ప్రజాస్వామ్య పద్ధతి సూత్రాలు పట్టించి పాడు చెయ్యటం అవుతుంది.
మారుమూల శబ్దాలు అని యింకో తగాదా. ఇది ఇంగ్లీషులోంచి “అబ్సొలీటు” మాటలు అన్న దానిలోంచి తెచ్చుకున్న కొత్త విషయం.ఒక పండితుడు అన్నాడు కదా, ‘ఒక కవి తానొక శబ్దం వాడుక లో ఉండగా విననంతసేపు ప్రాత శబ్దమనీ, వాడుకలో వినటంతోనే క్రొత్తగా నవనవలాడు శబ్దమవుతుందనీ’ అన్నారు. ఆ వాడటం ఒక్కడు వాడినా అవుతుంది.అయితే ఒక చక్కని వాడుకలో ఉన్న మాట కాలకర్మదోషం చేత తను వినకపోతే అంత చక్కని మాట తన భాషలో నుంచి “ప్రాతమాట” అని మినహాయించుకోటమేనా? అందుకనే శబ్దానికి వాడుతున్నారా లేదా అని కాదు. అది సుందరమైన దవునా కాదా అని. ఈ బహుధా విచారాలన్నీ కట్టిపెడితే-
ఏ కవికి, ఏ వ్రాతగాడికి, ఎప్పుడు ఏది రమ్యంగా వుందని తోస్తే అది వ్రాస్తాడు. అది రమ్యం కాదూ అని తోస్తే కాలం తోసేస్తుంది. ఒకప్పుడు రమ్యమైనదానిని రమ్యంగ లేదని కాలం అనుకుని వదిలివేస్తే అదే మళ్ళీ కొన్నాళ్ళకు దాన్ని పునరుద్ధరిస్తుంది. అట్లు జరుగదూ! ఈ అనంత కాలంలో,అనంత భాషల్లో, అనంత మార్గాల్లో కొన్ని మంచివి పోకా, కొన్ని చెడ్డవి నిలవకా ఎట్లా వుంటుందో యెవ్వరు చెపుతారు?
కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ
జయంతి సం.1, సం.2. 1927