ఓ చందమామ

ఏడుస్తోందని ఎత్తుకుని
చందమామను చూపించాను
రెట్టింపు ఏడుపుతో ఆ చందమామ కావాలంది
అమ్మకిచ్చేసాను
అమ్మ ఒడిలో ఓ చందమామ!

పాలు తాగుతూ పడుకుంటోందని
ఎత్తుకుని లాలించాను
మత్తు నిద్రతో గురక పెడుతోంది
వెచ్చగా పడుకోబెట్టాను
ఉయ్యాలలో ఓ చందమామ

తప్పటడుగుల్తో బోర్లాపడితే
చేయి పట్టుకుని నడిపించాను
అలుపెరగని నడకతో ఇల్లంతా తిరుగుతోంది
నీరసంగా కూలబడ్డాను
నట్టింట్లో ఓ చందమామ

ప్రక్కింట్లో చూసి సైకిలు కావాలంది
చిన్న సైకిలు కొనిచ్చా
రెట్టించిన ఉత్సాహంతో తొక్కేస్తోంది
వీధిలో చూస్తున్నాను
వీధి వీధంతా ఓ చందమామ

స్కూల్లో పాఠాలు అర్ధం కాలేదంది
దగ్గిర కూర్చుని నేర్పిస్తే
సరే రోజూ ఇలాగే హోం వర్క్ చేయించమంది
ఓపిగ్గా చేయించాను
రాత్రంతా ఓ చందమామ

కాలేజీలో జేరాక మాట విననంది
ఎందుకని అడిగితే
తిండి తినకుండా తలుపేసుకుపడుకుంది
బయటనుంచే బ్రతిమాలాను
ఒంటరిగా ఓ చందమామ

పెళ్ళికని సంబంధాలు చూస్తే
నాకొద్దు పొమ్మని
అల్లుడ్ని తనే తీసుకొచ్చింది
పెళ్ళయ్యాక
అత్తవారింట్లో ఓ చందమామ

ఏడాది తిరిగాక
పుట్టింటికి తీసుకొస్తే
పుల్ల మామిడికాయ కావాలంది
ఇంకో ఆర్నెల్లకి
చందమామ ఒడిలో ఓ బుల్లి చందమామ

[థాంక్స్ – వింజమూరి పెద్దబాబు]


రచయిత ఆర్. శర్మ దంతుర్తి గురించి:

ఇప్పటివరకూ రెండు వందలకి పైగా కధలూ, కవితలు, వ్యాసాలు కౌముది, ఈమాట, సుజనరంజని, మధురవాణి, సారంగ, సిరిమల్లె అనే పత్రికల్లో అచ్చయ్యాయి. సైబర్ సెక్యూరిటీ పరీక్ష మీద, డాటాబేస్, అప్లికేషన్ సెక్యూరిటీ మీద, వామనావతారం మీద పుస్తకాలు రాసారు. వంగూరి ఫౌండేషన్ నుంచీ, కాలిఫోర్నియా తెలుగు సంఘంనుంచీ అనేకసార్లు బహుమతులు, ప్రోత్సాహక పత్రాలూ అందుకున్నారు. ప్రస్తుతం ‘పోతన భాగవతంలో రసగుళికలు’ అనేది పదకొండేళ్ల నుంచీ, అమెరికా దేశీయ కథలు ఐదేళ్లనుంచీ కౌముది పత్రికలో, తెలుగు పద్యరత్నాలు అనేది’సిరిమల్లె’లో మూడేళ్ళనుంచీ ధారావాహికంగా వస్తున్నాయి.

 ...