పునరావృతమ్

‘రెడీ ఫర్ ట్రాన్స్‌పోర్ట్’ అని సిగ్నల్ ట్రాన్స్‌మిట్ చేశాను. వెహికల్ ఆన్ ది వే ఫర్ హ్యూమన్ ట్రాన్స్‌పోర్ట్ – రోబో కన్ఫర్మ్ చేసింది. ఎలివేటర్ లోకి వెళ్ళి ల్యాండింగ్ డాక్ బటన్ నొక్కాను. ఇంతలో బీప్ అంటూ సిగ్నల్, దానితోపాటే ఎదురుగా హెచ్-804 హాలోగ్రామ్ వచ్చింది.

“ఇంకొక్కసారి ఆలోచించుకో. ఇదంతా ఎప్పుడో శతాబ్దం నాటి పద్దతి. ఇప్పుడు అవసరమా! ఇట్ ఈజ్ వెరీ హార్డ్ అండ్ ఇనెఫిషియెంట్ ప్రాసెస్. సింపుల్‌గా ఎగ్ డొనేట్ చేసేసి, ఒక్కసారి సక్సెస్ అవగానే మెన్‌స్ట్రువల్ సైకిల్ టర్మినేట్ చేయించుకో. నువ్వు ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. అవన్నీ రిస్క్ చేయకు…”

ఇలా ఈ విషయం మాట్లాడటమే కొత్తగా ఉంది. ఏం చెప్పాలో కూడా తెలియలేదు. ఇంతలో ఎదురుగా హాలోగ్రామ్ మాయం అయిపోయింది. నిజానికి మేం హ్యూమన్స్ పెద్దగా కబుర్లాడుకోవడం ఉండదు. నేరుగా కలిసి మాట్లాడుకోడం చాలా అరుదు. ఉండే వందల మంది భూమి అంతటా ఒక్కో సెక్షన్‌లో రోబోలతో పనిచేస్తూ బిజీ.

వెహికల్‌ పాడ్‌లో కూర్చున్నాను. డెస్టినేషన్ దానికి తెలుసు. టేకాఫ్ తీసుకున్న పాడ్‌తో పాటే నా ఆలోచనలూ. ఇలా నా గురించి నేను ఆలోచించడం కొత్తగా ఉంది. ఎర్త్ సస్టెనాన్స్ ఇంప్రూవ్‌మెంట్స్ నా పని. పని తప్ప వేరే ధ్యాస లేదు ఇప్పటిదాకా. ఇదంతా తొమ్మిదిరోజుల క్రితం వచ్చిన ఆ రెండు మెసేజెస్ వల్లనే.


స్లీపింగ్ పాడ్ నుంచి బైటకు రాగానే బర్త్ డే విషెస్ చెప్తూ కొత్త వరల్డ్ ప్రెసిడెంట్ నుంచి ఒక మెసేజ్. ఉయ్ నీడ్ టు రీక్రియేట్ హ్యుమానిటీ, ఇంప్రూవ్ హ్యూమన్ రిలేషన్స్ అని ప్రోత్సహిస్తుంటారు. నిజమే మరి. ఉన్న ఈ కొద్ది మంది హ్యూమన్స్ పోతే ఇక రోబోలు తప్ప భూమి మీద ఇంకా ఎవ్వరూ ఉండరు. అందుకోసమే సాటి హ్యూమన్స్‌తో మాట్లాడాలి అంటే కనీసం హాలోగ్రామ్ అయినా తప్పనిసరిగా వాడండి, అని ఆయన ఆదేశం.

ఇంకో మెసేజ్. వెలుగుతూ ఆరుతూ, ఇంపార్టెంట్ అని సూచిస్తోంది. యు హేవ్ టు డొనేట్ యువర్ ఎగ్ దిస్ యియర్ టు ప్రొడక్షన్ బాంక్. మాన్‌డేటరీ ట్రయినింగ్ అండ్ ప్రి-ఎవాల్యుయేషన్ స్కెడ్యూల్‌డ్. దానితో పాటే స్కెడ్యూలింగ్ డిటెయిల్స్ మొత్తం ఉన్నాయి. ఏమిటిది? ఓ! ఈ రోజుతో నాకు సరిపోయిన వయసు వచ్చినట్టుంది. ఏ ఓరియెంటేషన్ కయినా హాలోగ్రామ్ పంపితే సరిపోతుంది. బయోమెడిక్స్ వింగ్‌కి కూడా స్వయంగా వెళ్ళక్కర్లేదు. ఎంబెడెడ్ చిప్ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పంపుతూ ఉంటుంది. ట్రీట్‌మెంట్ అంతా హ్యూమనాయిడ్ రోబోలే మా వర్క్ ఏరియాకో, రెస్ట్ మాడ్యూల్ లోకో వచ్చి చేస్తాయి. పదో యేడు నుంచీ ప్రతి ఏడాది పుట్టినరోజునాడు ఆ ఏడాది మా శరీరాలలో ఎలాంటి మార్పులు వస్తాయో వివరించే ట్రెయినింగ్ కూడా అలాగే ఉంటుంది. కాని, ఈ ఒక్క దానికి మాత్రం మేమే స్వయంగా వెళ్ళాలి, ఇదేమిటో! ఇదీ ప్రెసిడెంట్ ఆదేశాల వల్లేనేమో.

అటెండింగ్ రోబో బయోమెట్రిక్స్ స్కాన్ చేసి ఐ. డి. నిర్ధారించుకున్నాక ఒక రూమ్ లోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి వెళ్ళింది. అక్కడ కనిపించింది తను. బహుశా తన పుట్టినరోజు కూడా ఈ రోజే అయుండాలి.

ఎలా పలకరించుకోవాలో మాయిద్దరికీ తెలియలేదు.

“అయామ్ హెచ్-804. ఎబయాటిక్ ఆపరేషన్స్ వింగ్.”

“అయామ్ హెచ్-805. ఎర్త్ సస్టెనాన్స్ ఇంప్రూవ్‌మెంట్స్.”

ఇంకో హ్యూమన్ రాగానే ఇద్దరం తల తిప్పి చూశాం. “అయామ్ హెచ్-304. ఐ రిమెంబర్ ఉయ్ హేవ్ మెట్ బిఫోర్,” డాక్టర్ లోపలికొస్తూనే మాట్లాడింది. హ్యూమన్స్‌ని ఎన్ని సార్లు హాలోగ్రామ్‌గా చూసినా ఎదురుగా చూడటం కొత్తగానే ఉంటుంది.

నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. దేనికైనా రోబో అటెండెంట్స్. గ్రోత్ ఛాంబర్స్‌లో పెరుగుతాం. అప్పుడప్పుడు ప్రెసిడెంట్, ఆయన కేబినెట్ మెంబర్స్ – హాలోగ్రామ్స్ వచ్చి పలకరించి వెళ్ళేవి. మొదటి పదహారేళ్ళు బిహేవియరల్ అబ్సర్వేషన్, మాకు చదువు, ఇతర విషయాలు నేర్పించడం, అన్నీ రోబోలే చూస్తాయి. తరువాత ఎఫిషియెన్సీ ఏ పనిలో ఉందో పరీక్ష చేయడం, ఆ పనికి సంబంధించిన సెక్షన్‌లో రోబోలతో కలిసి పనిచేస్తూ, చేయిస్తూ కొత్త పరిశోధనలు కూడా చేయడం. ఎవరి వింగ్ వారిదే. ఎక్కడి వాళ్ళు అక్కడే. అలాంటిది మేమే ఇక్కడకు రావడం, మాకోసం ఇంకో హ్యూమన్ రావడం కొత్తగా ఉంది.

ఎవరి కుర్చీల్లో వాళ్ళం కూర్చున్నాక డాక్టర్ సర్కమ్‌ఆక్యులార్ ప్రొజెక్షన్ మొదలుపెట్టమని రోబోను ఆదేశించింది.

ది ప్లానెట్ ఎర్త్ ఫార్మ్‌డ్ 4.6 బిలియన్ యియర్స్ ఎగో… రోబో కామెంటరీ మొదలు కావడంతో పాటుగా మెల్లిగా మాచుట్టూ పరిసరాలు మారిపోయాయి. మండుతున్న భూగోళం క్రమేణా చల్లబడింది. చుట్టూ వాతావరణం, మబ్బులు, నీటిబిందువులు, నీలంగా సముద్రం. యూకేరియాటిక్ సెల్స్, సయనోబ్యాక్టీరియా. అమీబా, పారమీసియమ్… పరచుకుంటున్న ఆల్జీ, మొలకెత్తిన పచ్చదనం. జలచరాలు, ఉభయ చరాలు, అకశేరుకాలు, సకశేరుకాలు, సరీసృపాలు, క్షీరదాలు. అర్థం కాకపోయినా కొత్తగా తెలుస్తున్న పేర్లు.

నీటిలో తిమింగిలాలు. దిస్ ఈజ్ కాల్డ్ మేల్. దిస్ ఈజ్ ఫిమేల్. మూల్గుతున్నట్టుగా అరుపులు. ఆవ్యులేషన్, స్పెర్మటోజోవా. రిప్రొడక్టివ్ ఆర్గన్స్… దీజ్ ఆనిమల్స్ మేట్ టుగెదర్ టు ప్రొడ్యూస్ న్యూ సిమిలర్ లైఫ్‌ఫార్మ్స్ అన్డ్ దజ్ ఎక్స్‌టెండ్… ఆనుకుని రుద్దుకుంటున్నట్టుగా రెండు తిమింగలాలు. ది ఫిమేల్ కేరీస్ ది ఛైల్డ్ ఇన్ హర్… అంటిల్ ది జెస్టేషన్… ఆ ఆడతిమింగలం నుండి బయటకు వచ్చిన చిన్న తిమింగలం. ది ఫిమేల్, నౌ కాల్డ్ ఎ మదర్, ఫీడ్స్ హర్ ఛైల్డ్. పుట్టిన వెంటనే అమ్మ పొట్టకిందకి వెళ్ళి మెల్లిగా ఒక ప్రొట్రూషన్ నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ… దాని నోటిలోకి ధారగా వస్తూ తెల్లగా… ఏమిటో అది? ఇట్ ఈజ్ కాల్డ్ మిల్క్… పాలు, అవి ఆ బిడ్డకు ఆహారం. నాకు అనుమానం రాగానే మెదడులోని న్యూరల్ ఆక్టివిటీని గమనించి వెంటనే జవాబిస్తున్న రోబో. ఆహారం పౌచెస్‌లో కదా ఉంటుంది! అది ఇప్పుడు. ఒకానొకప్పుడు బిడ్డ కొంత పెరిగేదాకా తల్లి తన శరీరం లోంచి పాలు ఆహారంగా ఇచ్చేది.

మారిపోతున్న జంతువులు. వాటి ఆకారాలు, వాటి ప్రవర్తన. కొత్తగా పుడుతున్న బిడ్డలు, వాటిని నాలుకతో నాకుతున్న తల్లులు, పొంగుతున్న వాటి పాలిండ్లు, పాలు పీల్చుతూ బిడ్డలు. నాలో ఏదో తెలియని ఆసక్తి. ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తోంది. చింప్స్, ఒరాంగుటాన్స్, బానబాస్… మెల్లిగా వాటి వెంట్రుకలు రాలిపోతూ ఉన్నాయి. శరీరంలో మార్పులు వస్తున్నాయి. శ్రద్ధగా చూస్తున్నాను. …అండ్ దస్ ఎవాల్వ్‌డ్ హోమో సెపియన్. ద మోడర్న్ హ్యూమన్ బీయింగ్. కొనసాగుతున్న వివరణ. చాలా చిన్నగా ఒకేలా ఉన్న రెండు హ్యూమన్ బిడ్డలు. ఒకేలా ఉన్నా పెరిగేకొద్దీ ఒకేలా లేని రెండు శరీరాలు. అందులో ఒకటి బాగా తెలిసినట్టుగా… ‘అరె, అది నా బాడీలాగే ఉంది!’ అనుకున్నాను. అవును, ఎందుకంటే నువ్వూ ఫిమేల్ కాబట్టి. పొడూగ్గా జుట్టు, తల మీద, ముఖం మీద, ఒంటి మీద. మాట్లాడుతూ అటూ ఇటూ కదుపుతున్న చేతులు, ముఖాలలో ఎన్నో వేరీడ్ ఎక్స్‌ప్రెషన్స్. ఎన్నో రకరకాల బట్టలు వాళ్ళ ఒంటిని కప్పుతూ. ఏవీ కూడా నేను వేసుకునే రేడియేషన్ సూట్‌లా లేవు. ఎన్నో రంగుల్లో, ఎంతో నాజూగ్గా ఉన్నాయి. వారు తినేవీ తాగేవీ కూడా ఎంతో ప్రత్యేకంగా రంగులురంగులుగా ఉన్నాయి.

ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న మేల్, ఫిమేల్ హ్యూమన్స్. పెదవులు విడతీసి పళ్ళు చూపిస్తూ… దానిని నవ్వు అంటారు. హ్యూమన్ బ్రెయిన్‌లో కెమికల్ ఇంటరాక్షన్స్ జరుగుతాయి. వాటిని ఫీలింగ్స్ లేదా ఎమోషన్స్ అంటారు. అవి కలిగినప్పుడు వారి ముఖంలోని భావాలు మారతాయి. ఆనందం అనే ఒక భావన కలిగినప్పుడు అలా ప్రకటిస్తారు. అది ఒక ప్లెజంట్ రియాక్షన్. …ఒకరిచేతులొకరు పట్టుకుని, దగ్గరగా ఎదురెదురుగా నిలబడి కళ్ళలోకి చూసుకుంటూ… ఒకరి శరీరం చుట్టూ ఇంకొకరు చేతులు చుట్టుకుని, శరీరాలు తాకుతూ… ఏ హ్యూమన్ ఎంబ్రేస్, ఆల్సో కాల్డ్ ఎ హగ్, ఈజ్ ఎన్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటిమసీ. ఇంటిమసీ? ఎన్ ఆక్ట్ ఆఫ్ కమింగ్ టుగెదర్ ఫర్ రిప్రొడక్టరీ ప్రొసీజర్స్.. నాలో పెరుగుతున్న ఆసక్తి.

ఫిమేల్ మెల్లిగా కళ్ళు మూసుకొని మేల్ చెంపకు చెంప ఆనించింది. మేల్ తనను చుట్టుకున్న ఫిమేల్ చేతులను అల్లాగే ఉంచి మెల్లిగా ఫిమేల్ పెదవుల మీద పెదవులు ఆనిస్తూ… ఇంకేదో ఎక్స్‌ప్రెషన్ మేల్ మొహంలో. ఇంటిమసీతో వారి ముఖాల్లో శరీరాల్లో మార్పులు, వారి ముఖాల్లో ఏవో ఫీలింగ్స్ కొత్తకొత్తగా. హ్యూమన్స్‌లో ఇన్ని అనుభూతులు ఉంటాయా? ఇప్పుడెవరూ అలా లేరే. హ్యూమన్ బాడీ ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ కెమికల్ స్ట్రక్చర్… నాలోనూ ఏదో తెలియని ‘ఎమోషన్?’. యువర్ బాడీ టెంపరేచర్ ఈజ్ ఎలివేటెడ్ స్లైట్‌లీ. ఇట్ ఈజ్ ఎ నార్మల్ రియాక్షన్. నార్మల్ అయితే నాకు ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? ఇన్నేళ్ళలో నాకు తెలిసిందల్లా ప్లెజంట్ రియాక్షన్స్, అన్‌ప్లెజంట్ రియాక్షన్స్. అవి కూడానూ పూర్తిగా రెగ్యులేట్ చేయబడ్డాయి. ఏదైనా రియాక్షన్ కొంత తీవ్రంగా ఉంటే అటెండర్ రోబో వచ్చి డ్రగ్ ఒకటి అడ్మినిస్టర్ చేస్తుంది. ఇప్పుడు నాలో ఉన్నది ఏ ఎమోషన్? నాకు సరిగ్గా అర్థంకావడం లేదు. తీవ్రమైన అనుభూతి ఇలా ఉంటుందా?

ఇన్సెమినేషన్. ఫర్టిలైజేషన్. తొమ్మిది నెలల ప్రోగ్రెషన్‌లో హ్యూమన్ బాడీగా మార్పు. మదర్ నుంచి ఛైల్డ్‌కు ఉంబిలికల్ కార్డ్. తలకిందులుగా తిరిగిన బేబీ బాడీ. బైటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా. మదర్ ముఖంలో ఏవో ఎక్స్‌ప్రెషన్స్. పెద్దగా అరుస్తోంది. ఇట్ ఈజ్ కాల్డ్ పెయిన్, ఏన్ అన్‌ప్లెజంట్ ఫీలింగ్… నాచురల్ డెలివరీ ఈజ్ ఎ వెరీ పెయిన్‌ఫుల్ ప్రాసెస్. మదర్ మే లూజ్ హర్ లైఫ్ సమ్‌టైమ్స్…

ఫిమేల్ మదర్ ఆ చిన్న బేబీని చేతిల్లోకి సుతారంగా తీసుకుంది. మెల్లిగా ఆ బేబీ వీపును, చేతులను నిమిరింది. మెల్లిగా గుండె వద్దకు తీసుకెళ్ళి ఆ చిన్ని పెదాలను ఒక ప్రొట్రూషన్ పైన (దానిని నిపుల్ అంటారు.) ఉంచింది.

నాకు తెలుసు, ఇప్పుడు పాలు వస్తాయి ధారగా! మదర్ ముఖంలో ఏదో ప్లెజంట్ ఎక్స్‌ప్రెషన్. కన్నార్పకుండా తన బిడ్డనే చూస్తోంది. పెదాలు కొంచెం సాగి సన్నగా నవ్వు లాంటి భావం ఏదో. ఇంతలో మేల్ వచ్చింది. ఆ ముఖంలో కూడా నవ్వు. చూస్తూ ఉంటే చాలా బాగుంది. అనుకోకుండా నా పెదవులు తడుముకున్నాను. ఆశ్చర్యంగా నా పెదవులూ అలా సాగి పైకి తిరిగివున్నాయి.

బిడ్డ పెరిగి పెద్ద అవుతోంది. తల్లి బిడ్డకు నోట్లో ఆహారం పెడుతోంది. ఆజ్ దే గ్రో, ది బేబీ ఈజ్ ఫెడ్ సాలిడ్ ఫుడ్… ది మదర్, ఫాదర్ అండ్ ఛైల్డ్ లివ్ ఇన్ ది సేమ్ రెసిడెన్స్. టుగెదర్ దే ఆర్ కాల్డ్ ఎ ఫ్యామిలీ.

అన్డ్ ఆజ్ ది సివిలైజేషన్ ప్రోగ్రెస్‌డ్ హ్యూమన్స్ బిగాన్ టు డిస్క్రిమినేట్ ఎగైన్‌స్ట్ ఈచ్ అదర్ అన్డ్ ఈవెన్చువల్లీ డిస్ట్రాయ్‌డ్ దెమ్‌సెల్వ్‌స్ లీడింగ్ టూ ది కరంట్…

ఎదురుగా ఇప్పటి ప్రొసీజర్ వస్తూ ఉంది. ఓవమ్‌నీ, స్పెర్మ్‌నీ విడివిడిగా ఎక్స్‌ట్రాక్ట్ చేసి ఉంచుతున్నారు. వాటి డిఎన్‌ఏ మ్యాచ్ చేసి, సక్సెస్ రేషియో ఆల్గారిదమ్స్ వాడి ఏ ఎగ్ ఏ స్పెర్మ్‌తో మ్యాచ్ అవుతుందో చూస్తున్నారు. అ తర్వాత ఆర్టిఫిషియల్ ఊంబ్‌లో ఇంక్యుబేట్ చేస్తున్నారు. బేబీ కంప్లీట్‌గా ఫార్మ్ అయినాక గ్రోత్ ఛాంబర్స్‌లోకి. పదిహేనేళ్ళు వచ్చేదాకా అటెండర్ రోబోలు పిల్లలను పెంచి పెద్దచేస్తాయి. వచ్చే హ్యూమన్ బేబీ? మేల్ అయినా ఫిమేల్ అయినా ఒకటే. మరి చాలామంది బేబీస్ ఇలా ఇప్పటికే పుట్టి… ఇంతకు ముందే చెప్పినట్టు హ్యూమన్స్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ క్రీచర్స్.

“నీనుంచి మూడుసార్లు ఓవమ్ ఎక్స్‌ట్రాక్ట్ చేస్తాం. ఆ తరువాత నీ మెన్‌స్ట్రుయేషన్ టెర్మినేట్ చేశాకనే నీ హార్మోనల్ ప్రొడక్షన్, నీమీద వాటి ఎఫెక్ట్ ఎలిమినేట్ చేస్తాం…” డాక్టర్ గొంతు వినిపించింది.

“నా ఎగ్ ఏ స్పెర్మ్‌తో కలుపుతారో నాకు చెప్తారా?”

“లేదు. యూ విల్‌హావ్ నో ఫర్దర్ రోల్ టు ప్లే.”

“నా ఎగ్‌తో పుట్టే హ్యూమన్ బేబీ మేల్ ఆర్ ఫిమేల్…”

“ఇట్ డజ్‌నాట్ మ్యాటర్ టు అజ్. ఆజ్ లాంగ్ ఆజ్ ది ప్రొడక్షన్ ఈజ్ ఎ సక్సెస్…”

“బట్, నేను ఇక్కడ మేల్ హ్యూమన్స్‌ను చూడలేదు…”

“ఓ! ఒక ఏజ్ వచ్చాక వారిని వేరే డివిజన్‌లో ట్రెయిన్ చేస్తాం. దెయిర్ బాడీస్ బిహేవ్ డిఫరెంట్లీ దేన్ యువర్స్. దటీజ్ వై ఉయ్ అవాయిడ్ ఇంటరాక్షన్స్.”

“డాక్టర్, వన్ లాస్ట్ క్వశ్చన్. పుట్టిన బేబీని నేను చూడచ్చా?”

“హెచ్-508, ఎందుకు ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నావ్? యూ నో యువర్ రెస్పాన్సిబిలిటీస్, యెస్? హ్యూమన్స్ చాలా తక్కువగా ఉన్నాం. మనందరం మరింత ఎఫిషియెంట్‌గా ఉండకపోతే ఏమవుతుందో నీకు తెలుసు కదా. అందువల్లనే కదా చాలా అన్‌నెసెసరీ ఎమోషన్స్ రెగ్యులేట్ చేస్తున్నాం గ్రోత్ ఛాంబర్స్‌లో పెరిగేప్పుడే. ఐ నో, అందరు హ్యూమన్స్ ఒకేలా రెస్పాండ్ కారు వాటికి. ఇఫ్ యూ నీడ్, ఐ కెన్ సెండ్ యూ టు…”

“నో నీడ్ డాక్టర్. అయామ్ ఫైన్.”

నా కళ్ళముందు ఆ తల్లి, బిడ్డ కనిపిస్తూనే ఉన్నారు. ఆమె ముఖంలోని అన్ని భావాలు ఇంకా అలానే ఉన్నాయి నా ఆలోచనల్లో.

నన్నూ హెచ్-804నూ కొంతసేపు అక్కడే ఒంటరిగా వొదిలిపెట్టారు. చాలా చిన్నగా ఇబ్బందిగా మొదలైనా నేనూ తనూ మా వర్క్ వివరాలు పంచుకున్నాం. ఇంతలో డయాగ్నాస్టిక్స్ రోబోలు వచ్చి తమ పని తాము మొదలుపెట్టాయి. చివరిగా వాటి స్క్రీన్స్ మీద కొన్ని ప్రశ్నలు, వాటికిందే మేము ఎంచుకోడానికి కొన్ని సమాధానాలు వచ్చాయి.

పక్కనే ఉన్న హెచ్-804 చకచక ఆప్షన్స్ క్లిక్ చేసింది. ఆర్టిఫిషియల్? యెస్. అటెంఫ్ట్స్? మాక్సిమమ్ త్రీ. టెర్మినేట్ మెన్‌స్ట్రువల్ సైకిల్? యెస్. ఆఫ్టర్ థర్డ్ అటెంప్ట్. పూర్తి చేసి నావైపు చూసింది. నాకు ఇదంతా ఇంకా కొత్తగానే ఉంది. ఎందుకు నేను తనలా చకచకా సమాధానాలు ఎంచుకోలేకపోతున్నాను? కళ్ళు మూసుకున్నాను. అలా పెదవులు ఒంపు తిరగడం నవ్వు కదూ. అది ఒక ప్లెజంట్ సెన్సెషన్ కదూ. ఎంత ఇంటెన్స్‌గా ఉంటుందో కదా, అలా బేబీని పట్టుకున్నప్పుడు. మెల్లిగా నా ఆప్షన్స్ సెలక్ట్ చేసుకున్నాను.

ఆర్టిఫిషియల్? నో. కన్‌ఫర్మ్ నాచురల్? యెస్. అటెంప్ట్స్? ఆజ్ మెనీ ఆజ్ నీడెడ్. సైకిల్? స్టాప్ ఓన్లీ ఆఫ్టర్ మినిమమ్ టూ సక్సెసెస్.

రూమ్‌లోకి డాక్టర్ వచ్చింది, రోబో పంపిన సిగ్నల్ అందుకుని. ఆమెకూ ఇది కొత్తగా అనిపించినట్టుంది. నా వైపు చూసింది.

“ఆర్ యూ ఓకే? యూ నో యూ డోన్ట్ హేవ్ టు డూ దిస్. ఈ నాచురల్ ఆప్షన్ కేవలం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల ఉంది తప్ప…”

“యెస్. దిస్ ఈజ్ హౌ ఐ వాంట్ టూ డూ ఇట్.”

“ఇంకోసారి ఆలోచించుకో!” డాక్టర్‌కి ఎప్పుడూ ఎదురు అయినట్టు లేదు ఇలాటి పరిస్థితి. అసలు ఆ ఆప్షన్ ఉందని కూడా తనకు గుర్తు ఉన్నట్టు లేదు.

“అక్కర్లేదు డాక్టర్. నాకు ఇలానే కావాలి. అయామ్ సర్టన్ ఆఫ్ ఇట్.”

“లెట్ మీ సీ. అసలు ఇది ఎలా జరుగుతుందో నాకూ తెలీదు. ముందు ప్రెసిడెంట్‌కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆయన అప్రూవల్‌ వచ్చినాక నాచురల్‌కి ఒప్పుకునే మేల్‌ని వెతకాలి. దొరికినాక ప్రొసీజర్స్ ఏంటో, ఎలా హ్యాండిల్ చేస్తారో నాకు తెలియదు. నీకూ చాలా డ్యూటీస్ ఉన్నాయి. అలాగే దే హేవ్ దెయిర్ ఓన్ డ్యూటీస్. నాచురల్‌కి ఒప్పుకోవడం అంటే ఇద్దరు హ్యూమన్స్ వర్క్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఎనీ వే, నేను చేయాల్సింది నేను చేస్తాను. వితిన్ త్రీ మంత్స్ మ్యాచ్ దొరకకుంటే ఆర్టిఫిషియల్ కంపల్సరీ అవుతుంది నీకు. ఓకే? నౌ, యూ కెన్ గో బ్యాక్ టూ యువర్ సెక్షన్స్.”

ట్రాన్స్‌పోర్టేషన్ డాక్ దగ్గర హెచ్-804 చెప్పింది నెమ్మదిగా. నేను నీతో మాట్లాడతాను ప్రతిరోజూ అని. నా శరీరంలో ఒక ప్లెజంట్ రియాక్షన్ మైల్డ్‌గా.


అసలు మేల్ హ్యూమన్ ఎలా ఉంటుందో! దగ్గరగా చూడాలి. హాలోగ్రామ్స్ ఎక్కడికైనా వెళ్ళడం సులభం కాని, ఇలా నా వర్క్ మాడ్యూల్ నుంచి నిజంగా బైటకు రావడం అలసటగా ఉంది. ఎక్సోమాడ్యులార్ అట్మాస్ఫియర్ ప్రభావం అది. వెహికల్ ఇండికేటర్ పోవాల్సిన ప్లేస్ దగ్గరకు వచ్చిందని సూచించింది. ఇక దిగి వెళ్ళడమే. డోర్స్ తెరుచోకోగానే రిసీవింగ్ రోబో నన్ను మెల్లిగా అక్కడ ఉండే మానిటరింగ్ హ్యూమన్ దగ్గరకు తీసుకుని వెళ్ళింది.

“వెల్‌కమ్. అయామ్ హెచ్-109. మిమ్మల్ని మేల్ హ్యూమన్‌ని ఇక్కడ హోస్ట్ చేయమని ప్రెసిడెంట్ చెప్పారు. మీరు ఎన్ని రోజులు అయినా ఇక్కడ ఉండొచ్చు. మీకు కావాల్సినవి ప్రోగ్రామ్ చేశాం. మీరు కావాలంటే మారుస్తాం. ఈ రోజు ప్రోగ్రామ్ బీచ్ వద్ద.”

“బీచ్?”

“యెస్. సీ కోస్ట్.”

హెచ్-109కు కూడా కొత్తగా ఉన్నట్టుంది ఇలా హ్యూమన్స్‌ని చూడటం. అందులోనూ మాలాంటివాళ్ళను. స్పెషల్ కాబట్టే సెగ్రిగేటెడ్ ఎన్‌క్లోజర్‌లో డీకంటామినేట్ చేసి కాపాడుకున్న కొంత సీ కోస్ట్ ఏరియాని మా మీటింగ్ కోసం అరేంజ్ చేశారుట ప్రెసిడెంట్. ఇంకా ఎర్త్ మీద అలా డోమ్స్ వాడి కాపాడుకున్న అడవులు, జలపాతాల వంటి సీనిక్ ఏరియాస్ కూడా ప్లాన్ చేసి ఉంచారు మాకోసం.

నాకు అవేమంత ఆసక్తిగా అనిపించలేదు. అవన్నీ ఎలా ఉంటాయో జూవనైల్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్‌లో వర్చువల్‌గా చూసినవే.

“మేల్ హ్యూమన్ ఎప్పుడు వస్తుంది?”

“అదిగో.”

చటుక్కున అటు వైపు చూశాను.

తల తిప్పి చూడగానే దూరంగా ముందు రోబోతో పాటుగా వస్తున్న ఆకారం. దగ్గరకు వచ్చేసరికి ఇంకా స్పష్టంగా, రేడియేషన్ సూట్, మాస్క్‌లలో ఉంది అందరి లాగే! తనేమి ఇటు చూడలేదు. రిసీవింగ్ హ్యూమన్ వద్ద ప్రోగ్రామ్ తెలుసుకుంటోంది. రిసీవింగ్ హ్యూమన్ ఇద్దరినీ చూసి చెప్పింది.

“యూ బోత్ కెన్ నౌ గో అండ్ రిలాక్స్ ఇన్ యువర్ రూమ్స్. ఉయ్ విల్ అరేంజ్ యువర్ మీటింగ్ అండ్ ఇన్ఫార్మ్ యూ.”

అటెండెంట్ రోబో దారి చూపుతుంటే మా రూమ్స్‌కి వెళ్ళాం. డెస్క్ దగ్గర పెట్టిన ఫుడ్. మీల్స్ పౌచ్, ఫ్లూయిడ్ కాప్స్యూల్స్. చూడటానికీ తేడాగా ఉన్నాయి రోజూ వేసుకునే వాటికంటే. వేసుకుని పడుకున్నాను. చిన్నగా మ్యూజిక్ ఎక్కడి నుండో, ఏదో వాసన, ప్లెజంట్‌గా. అలిసిపోయానని మానిటర్ చెప్పినపుడు మ్యూజిక్ వినడం మామూలే కాని ఇదేమిటో మరి ఏదోగా, ఆలోచనలు అన్నీ పోయి హాయిగా, వళ్ళు తూలుతూ ఉంది. గంట ఎలా గడిచిందో తెలీదు. రోబో లేపే వరకు.

“హెచ్-805, యు హేవ్ అన్ అపాయింట్‌మెంట్ విత్ మేల్.”

గబుక్కున లేచి సూట్ వేసుకోబోయాను.

“నో, దిస్ ఈజ్ ఫర్ యు. యూ డునాట్ నీడ్ రేడియేషన్ సూట్స్ హియర్.”

వైట్ స్లాక్స్, వైట్ షర్ట్. చాలా మెత్తగా, సుకుమారంగా ఉన్నాయి. రోబో ఒక రిస్ట్‌డివైస్ అందించింది. “దిస్ విల్ హెల్ప్ యూ.”

సముద్రపు ఒడ్డున కుర్చీలో కూర్చున్నాను. మేల్ కూడా ఇలాగేనా! నేను వీడియోలో చూసినట్లే ఉంటుందా!

మొట్టమొదటిసారి వర్క్ గురించి కాక ఇంకో విషయం ఆలోచిస్తున్నానని ఉన్నట్టుండి గుర్తొచ్చింది. అనుకోకుండా ‘నవ్వు’ వచ్చింది.

తల తిప్పి చుట్టూ చూశాను. సముద్రం నీలి రంగులో తెల్లని అలలతో ఇసుకను తాకుతూ ఉంది. ఇదంతా ముందే చూసినా ఏదో కొత్తగా ఉంది. ముందు మేల్ హ్యుమన్‌ని చూడాలి. అప్పటి ఫాదర్ మేల్ లాగా ఉంటుందా?

ఇంతలో మేల్ మెల్లిగా వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. నాలాగే తెల్లటి దుస్తులు, చేతికి రిస్ట్‌డివైస్. గబుక్కున మొహం చూశాను. ముఖం నున్నగా ఉంది. నో ఫేషియల్ హెయిర్. ఆ దుస్తుల వెనక శరీరం నేను వీడియోలో చూసినట్టు ఆ పాతకాలం మేల్స్‌లా ఉంటుందా? ఇంతలో మేల్ కూడా నావైపు చూసింది. అప్రయత్నంగా వెంటనే తల తిప్పుకొని సముద్రం వైపు చూశాను. చెవులు వెచ్చబడ్డాయి. ఇప్పుడేం చేయాలి? వాట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్? హూ షల్ ఇనీషియేట్ ది ఇంటిమసీ ప్రొసీజర్స్? ఎంతసేపలా ఉన్నామో!

రిస్ట్‌డివైస్ ఆక్టివేట్ అయింది. ప్రెసిడెంట్ ఫేస్ అందులో. “థాంక్యూ ఫర్ టేకింగ్ దిస్ రిస్క్. ఉయ్ ఆల్ ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. దిస్ విల్ బి ఎ న్యూ బిగినింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అజ్. యూ ఆర్ కంప్లీట్‌లీ ఫ్రీ టు డూ వాటెవర్. నో ప్రోటోకాల్స్ ఎట్ ఆల్. మీకు మొదట మొదట బెరుకు ఉంటుంది. ఇన్‌హిబిషన్స్ ఉంటాయి. అవి పోగొట్టేందుకు మీ రిస్ట్ డివైసెస్ సహాయం చేస్తాయి. బెస్ట్.”

ఇద్దరం మళ్ళీ ఒకరినొకరు చూసుకున్నాం. మేల్ తన రిస్ట్‌డివైస్ వైపు చూసుకుంది. ఇంకేదో మెసేజ్ వచ్చుండాలి.

“అయాం హెచ్-800. ఇన్టర్‌స్టెల్లార్ వర్క్.”

“హెచ్-805, సస్టెనాన్స్ ఇంప్రూవ్‌మెంట్స్.”

“ఓహ్, వాడ్డూయూడూ?”

“ఫుడ్ పౌచ్ వారానికి ఒకటి సరిపోయేట్టుగా ప్రయత్నిస్తున్నాం.”

“మరి వాటర్?”

“ఉయ్ స్టిల్ నీడ్ ఇట్. బాడీ కన్సంప్షన్ చాలా తగ్గించాం కాని మెయింటెనన్స్ కోసం రోజూ రెండు కేప్స్యూల్స్ తప్పటంలేదు.”

మామూలుగా ఎపుడూ హ్యూమన్స్ ఇలా మాట్లాడుకోరు. ప్రెసిడెంట్‌కి, కౌన్సిల్‌కి మాత్రం ప్రోగ్రస్ రిపోర్ట్ చేస్తూ ఉంటారు. మేల్ ఇలా అడగడం, నేను చెప్పడం కొత్తగా ఉంది. వర్క్ ఎలా జరుగుతోందో నా మాడ్యూల్‌లో! మానిటరింగ్ రోబోలు అన్ని నిర్ణయాలూ తీసుకోలేవు. నేనక్కడ ఉండటం తప్పనిసరి.

“న్యూ ప్లానెట్స్ వెతుకుతుంటాం హ్యూమన్ లైఫ్ కోసం. సో ఫార్ నన్ ఫౌండ్. నాన్ కార్బన్ లైఫ్‌తో రిలేషన్స్ మెయిన్‌టెయిన్ చేస్తుంటాం. చాలా వర్క్ హ్యూమనాయిడ్ రోబోస్ చేస్తున్నాయి ఇప్పటికే. కాని హ్యూమన్స్ అవసరం ఇంకా చాలా ఉంది. ఉయ్ నీడ్ మోర్ హ్యూమన్స్ ఫర్ ఎర్త్. ఒకవేళ వేరే ప్లానెట్ దొరికినా హ్యూమన్స్ కోసం రీబిల్డ్ చేయడానికి టైమ్ పడుతుంది చాలా.” నేను అడగకుండానే చెప్పింది మేల్.

మౌనంగా మళ్ళీ కూర్చుండిపోయాం. సముద్రపు అలల చప్పుడు తప్ప ఇంకేమీ లేదు. అలవాటుగానే వర్క్ గురించిన ఆలోచనల్లోకి పడిపోయాను. సూట్స్ లేకుండా రిమోట్ కమ్యూనికేషన్స్ చేయలేం. ఇక్కడ ఏం చేయాలో తెలీటల్లేదు. వెళ్ళిపోదామా? ఇంతలో కళ్ళ ముందు ఏదో కదిలేసరికి ఉలిక్కిపడ్డాం ఇద్దరమూ. రిక్రియేషనల్ డ్రోన్ గాలిలో తేలుతూ ఎదురుగ్గా కనిపించింది, సంగీతం పాడుతూ. దాని చేతుల్లో ఒక చిన్న ట్రే. అందులో ఒక ఫ్లవర్, రెండు చిన్న చిన్న గ్లాసెస్. అందులో ఏదో లిక్విడ్ ఉంది. మేల్ తన రిస్ట్‌డివైస్ వైపు మళ్ళీ చూసుకుంది.

కుర్చీలోంచి లేచి ఆ పూవు తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకుని పీల్చింది. మేల్ ముఖంలో ప్లెజంట్ ఎక్స్‌ప్రెషన్. నాకు అందించింది.

వేర్ ఇట్ ఆన్ యువర్ హార్ట్– నా రిస్ట్‌డివైస్ చెప్పింది. ఛాతీ మీద ఎడమ వైపుగా ఆ పూవుని క్లిప్ చేసుకున్నాను. పూవునుండి సన్నగా వస్తున్న సువాసన ఇందాక రూమ్‌లో వాసన లాగా.

మేల్ లేచి ఆ గ్లాసెస్ తీసుకుని ఒకటి నాకు ఇచ్చింది. రిస్ట్‌డివైస్ ఎలా తాగాలో చూపించింది. సందేహిస్తూ ఇద్దరం సిప్ చేశాం. వెరీ యునీక్ టేస్ట్. వెరీ ప్లెజంట్ రియాక్షన్ ఫ్రమ్ ది బాడీ. గాలిలో తేలుతున్నట్టుగా ఉంది. మేల్ ముఖంలో కూడా అదే ప్లెజంట్‌నెస్.

గో అండ్ డిప్ యువర్ లెగ్స్ ఇన్ వాటర్ – రిస్ట్‌డివైస్.

మెల్లిగా సముద్రం వైపు నడిచాం. ఉత్తకాళ్ళతో ఇసుకలో నడవడం ఇంకో కొత్త అనుభవం. నీళ్ళల్లో కాళ్ళు పెట్టి నిలబడ్డాం. పెద్ద అల వచ్చి కాళ్ళని తడుపుతూ మళ్ళీ సముద్రంలోకి వెళ్ళింది మెల్లిగా పాదం క్రింద ఇసుకను లాక్కుంటూ… ప్రతీ చిన్న విషయమూ ఎంతో ఆహ్లాదానిస్తోంది. ఆ వీడియోలో నేను గమనించినదీ ఇదే!

మెల్లిగా తల తిప్పి చూశాను. మేల్ ముఖంలో నవ్వు. నన్ను అప్పుడే చూసిన మేల్ ముఖంలో వేరే ఎక్స్‌ప్రెషన్. నాకు అర్థమయింది, అది ఆశ్చర్యం! నా ముఖంలో నవ్వు చూసి అని. ఇంకోసారి ఇంకో అల పాదం కింద నుంచి జారిపోతూ, ఇసుక కరిగిపోతూ. మా ముఖాల్లో నవ్వు పెరిగింది. మేల్ పెదవులు విచ్చుకున్నాయి. పళ్ళు కనిపించాయి, పెద్దగా నవ్వుతుంటే, అచ్చు ఆ వీడియోలో ఫాదర్ మేల్ లాగే. మేల్ కళ్ళల్లో కూడా అదే హ్యూమన్ ఎక్స్‌ప్రెషన్! తెలీకుండానే నేనూ నవ్వాను నోరు తెరిచి. మేల్ నన్ను చూసి తనూ ఇంకా నవ్వింది.

ఇంతలో ఒక్క పెద్ద అల లాగేసరికి ముందుకు పడిపోబోయాను. మేల్ చాలా చురుకుగా కదిలింది. నా నడుము చుట్టూ చేయి వేసి నన్ను పడిపోకుండా పట్టుకుంది. ఇంకో అల, తనకెదురుగా నేను. మరింత దగ్గరగా. మేల్ కళ్ళలో ఒక కొత్త ఎక్స్‌ప్రెషన్. నేను నిలదొక్కుకున్నా నన్ను చుట్టిన చేయి వదలడం లేదు. మేల్ కళ్ళల్లోకి చూశాను. మెరుస్తున్నాయి అవి. నాకు తెలీకుండానే కళ్ళు మూసుకున్నాను. తెరుద్దామంటే చేతకావటంలేదు. మేల్‌ని హగ్ చేసుకున్నాను. నా చేతులు మేల్ నడుము చుట్టూ. మేల్ ఊపిరి నా మెడ మీద వెచ్చగా. నా శరీరంలో రానురానూ పెరుగుతున్న ప్లెజంట్ సెన్సేషన్. పెయిన్‌ఫుల్ బట్ ప్లెజంట్. హద్దులు దాటిన అనుభూతి ఇంత తీవ్రంగా ఉంటుందా? ఏమైపోతున్నానో తెలియని భయం. కాని ఆగలేకపోతున్నాను. కష్టం మీద కళ్ళు తెరిచి చూశాను. మేల్ కళ్ళు నన్నే చూస్తున్నాయి. తల వంచి తన పెదవులు నా పెదవులకు తాకిస్తుండగానే మా కళ్ళు మళ్ళీ మూసుకున్నాయి. తెలీకుండానే ఒకరినొకరం మరింత గట్టిగా హగ్ చేసుకున్నాము.

ఉన్నట్లుండి ధడేల్‌మని శబ్దం భూమి కంపించినట్లు, సంకెళ్ళు ఏవో బిగుసుకున్నట్టుగా భూమి తిరగడం ఆగిపోయింది.


సహజమైన బంధాన్ని సంకెళ్ళతో బంధించిన సమాజపు కట్టుబాట్లతో విసిగిపోయిన స్త్రీ ఏ సృష్టినైతే నిరాకరించిందో, తిరిగి ఆ స్త్రీ కోరుకోవడంతో అదే సృష్టి మళ్ళీ మొదలయింది. భూకంపంతో కదిలిపోయిన భూమి వెనకకు తిరగసాగింది నెమ్మదిగా ఎలా ఉండబోతోందో తెలియని భవిష్యత్తు లోకి.