హనుమంతుకి దైవభక్తి మెండు. ప్రపంచకంలో అనర్ధాలన్నీ మన పాపకార్యాలవల్లే వచ్చాయని వాడి దృఢనమ్మకం. ఒరేయి! పాపం చెయ్యని వాడుండడురా!ఆమాటకొస్తే, సామూహికంగా పెద్ద ఎత్తున పాపం చెయ్యని ప్రభుత్వం కూడా ఉండదురా అని అంటే వాడు గయ్యిమంటాడు.మీరంతా రాడికల్స్ అని ఈసడించుకునేవాడు.
దైవభక్తి ఉంటే దేశసేవ చేద్దామన్న కుతూహలం ఆటోమేటిక్ గా వస్తుందని వాదించే వాడు. పొద్దున్నేలేచి, కాల కృత్యాలు తీర్చుకొని, కాలవొడ్డు దగ్గిర ఆంజనేయస్వామి వారి విగ్రహాన్ని దర్శించుకొని, ఆ విగ్రహంకాలిమీద నూనెలోనాని జిగురుగా కారుతూన్న ఎర్ర సిందూరం నుదిటిమీద, గొంతుకమీదా రాసుకోందే మంచినీళ్ళుకూడా తాగడు. ఆ పని పూర్తి అయ్యింతరువాతే అయ్యరుగారి హోటల్కెళ్ళి సాంబారిడ్లీ లాగిస్తాడు. తీరిగ్గా అరకప్పు కాఫీ అరగంట సేపు తాగుతాడు.
అయ్యరు హోటలు ముందు ఆదెయ్య రిక్షా ఎక్కి తమ్మిలేరు వంతెన దాటి కాలవొడ్డున బొంబాయి జెంట్స్ టైలరింగ్ హోమ్ కెడతాడు.పొరపాటున ఆదెయ్య ఇంకో బేరానికిపోతే,వాడు తిరిగి వచ్చేవరకూ అయ్యరు హోటల్లోనే ఉంటాడు. అసలు విషయం ఏమిటంటే,హనుమంతు ఆదెయ్య రిక్షా తప్ప ఇంకో రిక్షా ఎక్కడు. పగలంతా ఆ టైలర్ షాపులో ఒకమూల సీతారామయ్య పెట్టుకున్న వాచీ రెపేరు షాపులో కూచొని,వచ్చే పోయే జనాలని చూడటం, టైలరు షాపులో బొత్తాలు కుట్టే కుర్రాళ్ళతోటి,సీతారామమ్య్యతోటీ బాతాఖానీ. సీతారామయ్య ఎడమకంటికి బుల్లి భూతద్దం తగిలించుకొని మూడు్వైపులా పైనా ప్లాస్టిక్ అద్దాలతోకట్టిన చిన్న గూటిలో తలదూర్చి వాచీలు కెలుకుతూఉంటాడు,తలయెత్తకండానే ఊ కొడుతూ ఉంటాడు. సీతారామయ్య హనుమంతు చిన్ననాటి దోస్తు. ఇద్దరూ ఒకటోతరగతి మొదలు స్కూలు ఫైనల్ దాకా కలిసి చదువుకున్నారు. ఇద్దరూ స్కూలు ఫైనలు తప్పారు. ఇద్దరికీ మెయిన్ రోడ్డు మీద ఉన్న మోహనరావు కొట్లో గుడ్డ సంచీతో కొట్టిన ఉడుకుడుకు టీ,డాల్డా తో వండిన చల్లారిపోయిన మెత్తని పకోడీలంటే చచ్చే ఇష్టం.మూడు కొట్టంగానే,ఒక పావు కిలో మెత్తని పకోడీలూ తెప్పించుకొని ఇద్దరూ తింటారు.ఒక కప్పు టీ చెరి సగం జుర్రుతారు.
అదృష్టవంతుడెవడయ్యాఅని అడిగితే హనుమంతు అని చెప్పక తప్పదు. చిన్నప్పుడే మేనత్త కూతురిని పెళ్ళాడాడు. తను ఒక్కడే కొడుకు; ఆ అమ్మాయి ఒక్కతే కూతురు. రెండు వైపులా ఆస్తి కలిసివచ్చింది. ఊడిగమో ఉద్యోగమో చేసి బతకాల్సిన అవసరం లేదు. అల్లాగని, కోటీశ్వరుడేమీ కాదు. సుఖంగా,కడుపులో చల్లకదలకండా కాపరం చెయ్యొచ్చు.
వాడి కి ఏ వ్యసనాలేమీ లేవు; పొద్దున్నే ఆంజనేయస్వామి గుడి,తరువాత అయ్యరు హోటలు,సాయంత్రం పకోడీలు, టీ కార్యక్రమం ముగిసింతర్వాత సీతారామయ్య ని వదిలిపెట్టి ఊళ్ళోఉన్న ఒక్క పెద్ద పార్కూ పడగొట్టి కట్టిన బాలాజీ గుడిలో పురాణం వినడం తప్ప. శాస్తుర్లగారి పురాణం మాత్రం అతి శ్రద్ధ గా వింటాడు. శాస్తుర్లగారి పురాణం తెలుగు లోనే చెప్తారు ; కానీ, ఆయనగారు మధ్యమధ్యలో సంస్కృత శ్లోకాలు వల్లించి లోకోక్తులు చెపుతారు. హనుమంతుకి సంస్కృతంలో ఏది ఎవరుచెప్పినా బాగా బుర్రకి పట్టేస్తుంది.అలా సంస్కృతంలో ఏదన్నా రాగయుక్తంగా వల్లించి,తెలుగులో వ్యాఖ్యానించినప్పుడు, హనుమంతు శాస్తుర్లు గారిలో ఎవరో గొప్ప మహాఋషిని చూసినట్టే సంబర పడిపోతాడు. పురాణం అయింతర్వాత,గుళ్ళో గోడలచుట్టూఉన్నదేవుళ్ళందరికీ వరసగా దణ్ణాలు పెట్టి,పూజారిగారిచేత శడగోపం పెట్టించుకొని,ఆయన పెట్టిన ప్రసాదం భక్తిగా కళ్ళకద్దుకొని తిని,రాత్రి ఎనిమిది కొట్టంగానే ఇంటికి చేరతాడు. ఇది హనుమంతు దినచర్య.
ఆ రోజు సోమవారం. భాద్రపదమాసం. శని ఆదివారాలు బాగా జోరుగా వర్షాలు పడ్డాయి. ఊర్లో కంకర రోడ్డులన్ని బురద బురదగా ఉన్నాయి. యధావిధిగా హనుమంతు రోజూలాగే ఆదెయ్య రిక్షా ఎక్కి సీతారామయ్య దగ్గిరకి బయల్దేరాడు. తమ్మిలేరు వంతెన దాటాడోలేదో, వంతెన పక్క జనం గుమిగూడి ఉన్నారు. ఆదెయ్యని అడిగాడు, “ఎందుకంతమంది జనం గుమిగూడారు? రిక్షా ఆపు ఆదెయ్యా!” అని తనూ జనాన్ని తోసుకొని ఏమిటా అని చూడబోయాడు. రిక్షా ఆపి ఆదెయ్య బీడీ ముట్టించి తొట్టిలో కూలబడ్డాడు. గట్టుకింద చూస్తూ నిలబడ్డ జనం ఏమిటో గుసగుసలాడుకుంటున్నారు. చూసి పోతూన్న జనం రామ రామ,పాపం ఎవరో ఆయన అని అనుకుంటూ ముక్కుమీద గుడ్డ కప్పుకొని వెళ్ళి పోతున్నారు.
“ఏమిటయిందండీ,” అని పోతూన్న పెద్దమనిషిని అడిగాడు హనుమంతు.
“శవం బాబూ! శవం! ఏట్లోంచి కొట్టుకొచ్చుంటుంది. వాననీరు ముంపు తగ్గంగానే ఏటి గట్టుపైకొచ్చింది.ఎవరో పాపం, అర్థాయుష్షు వాడు.”
ఇంకో పెద్దాయన అడక్కండానే, “ఎవరో పెద్దకులం మనిషిలానే ఉన్నాడు.మెళ్ళో జంఝం కూడా వుంది. ఏట్లో కాలుజారి పడ్డాడో,కావాలనే పడ్డాడో,” అని అంటూ పంచెపైకి సర్దుకొని కండువా ముక్కుకి అడ్డంగా పెట్టుకొని వెళ్ళిపోయాడు.
హనుమంతు జనాని తోసుకొని మరీ వెళ్ళాడు,బురదతొక్కుకుంటూ గట్టు కిందకి. ఆ శవాన్ని చూడంగానే, హనుమంతుకి గుండె ఆగినంత పనయ్యింది. ఎవరూ అడక్కండానే, “అయ్యయ్యో! అతను హయగ్రీవ శాస్త్రి. మా స్నేహితుడి తమ్ముడు,” అని పైకి గట్టిగా అన్నాడు. అన్నాడో లేదో,” పక్కనే ఉన్న కుర్రాడు, మీరు ఇక్కడే ఉండండి సార్! పోలీసులొచ్చేవరకూ,” అని అంటూ వాడు సైకిలెక్కి తుర్రుమన్నాడు. మూగిన జనం అందరూ “అవునవును! శవాన్ని గుర్తుపట్టడానికి ఎవరన్నా వుంటే పని తొందరగా అవుతుంది సుమా!,” అని సలహా పారేస్తూ ఎవరి మటుకు వాళ్ళు సర్దుకోవడం మొదలెట్టారు.
అంతవరకూ, రిక్షా సీటుమీదే కూచొని బీడీ కాలుస్తున్న ఆదెయ్యని, “ఆదెయ్యా! ఆదెయ్యా,ఇట్టా రా” అని అరిచాడు. ఆదెయ్య కిందకొచ్చి శవాన్ని చూసి, వాడి మెళ్ళోనించి అల్ల్యూమినం క్రాసు రెండుకళ్ళకీ అద్దుకొని, “ఏటి బాబూ! మీకుగాని ఈయన తెలుసా?” అని అడిగాడు.
“తెలియడమేమిటిరా, నీ బొంద! ఇతను మన వాచీ మెకానిక్ సీతారామయ్యగారి సొంత తమ్ముడు!”
“మరయితే ఆ సీతయ్య గారికి యెంటనే కబుర చేస్తేసరి!”
“అందుకేరా నిన్ను పిలిచింది. నువ్వు ఇక్కడున్న పళంగా పోయి,ఆ సీతారామయ్యని ఇక్కడికి వెంటనే తోలు కో రా!పద పద! వెధవ బీడీ కంపూ నువ్వూనూ!ఎప్పుడో గుండె ఆగి చస్తావు. నేను ఇక్కడే ఉంటా,నువ్వొచ్చేవరకూ! పో పో!” అని తొందర పెట్టాడు.
ఎప్పుడయితే శవాన్ని ఆనవాలుపట్టిన మనిషి ఇక్కడే ఉన్నాడని తెలిసిందో, మూగిన జనం అందరూ మెల్లిమెల్లిగా సర్దుకున్నారు, ముగ్గురో నలుగురో కాలేజీ కుర్రాళ్ళు మినహా!
హనుమంతు గట్టు దగ్గిరకి చేరిన ఒక గంటన్నర తరువాత ఒక పోలీసు కానిస్టేబుల్ వచ్చాడు, ఏమిటో హడావిడిగా “తప్పుకోండి! తప్పుకోండి,” అంటూ, అక్కడేదో వందమంది జనం ఉన్నట్టు. వెంటనే ఒక కుర్రాడినిపురమాయించి రోడ్డుపక్కన టీ షాపునుంచి ఒక కుర్చీ తెప్పించుకొని, శవానికి యాభై గజాల దూరాన కూచున్నాడు. హనుమంతు పోలీసుతో,
“ఈ శవాన్ని హాస్పటల్కి తీసికెళ్ళే ఏర్పాటు చేయించండి,” అని అనంగానే, అతను , అయ్యా! అదేమన్నా అంత తేలిక పని అనుకున్నారా? ఇనస్పెక్టర్ గారు రావాలి. హాస్పట్ల్ కి కబురు పంపించాలి.అప్పుడు ఆంబులెంస్ కారులో … అయినా, చచ్చిన వాడిని అంత తొర తొరగా హాస్పటల్ కి ఎందుకు తీసికెళ్ళాలి సార్! పోస్ట్ మార్టుకేగా,” అన్నాడు, పెద్ద జోక్ వేసినట్టు మొహం పెట్టి!
” ఇతను నాకు తెలుసు సార్! ఇతని అన్నయ్యకి కబురు చేసా! ఆ హాస్పటల్ తతంగం పూర్తయితే … దహన కర్మలు చేయించొచ్చని చెప్పా!”
” అయితే ఇనస్పెక్టర్ గారొచ్చేదాక ఇక్కడే ఉండండి. ఆయనతో ఆ విషయం చెప్పితే బాగుంటుంది. నేను కానిస్టేబుల్ ని. ఇది నా చేతిలో పని కాదు సార్,” అన్నాడు.
” ఇనస్పెక్టర్ గారు ఎప్పుడొస్తారు?”
” క్యాంపునుంచి పొద్దున్నే వచ్చారు. గంటా గంటన్నరలో స్టేషన్కి వస్తారు. అక్కడనుంచి జీపు లో పదినిమిషాల్లో వచ్చెయ్యచ్చు.” హనుమంతుకి కొంచెం చిరాకు వేసింది. గోళ్ళు గిల్లుకుంటూ అటూ ఇటూ పిల్లిలా తిరుగుతున్నాడు, సీతారామయ్య కోసం చూస్తూ.
అనుకుంటూ ఉండంగా ఆదెయ్య రానే వచ్చాడు, కానీ రిక్షాలో సీతారామయ్య లేడు. హనుమంతు అడక్క ముందే, ” సీతయ్య గారు రానంటే రానన్నాడు బాబూ!ఆళ్ళ ఫామిలీకీ ఈళ్ళ ఫామిలీకీ సంబంధాలే లేవట బాబూ! నే ఎంత బతిమాలినా? ఆయన సచ్చినా ఈ సచ్చినాయన్ని సూడటానికి రాడట బాబూ! మరదేటో నాకు తెలవదు,” అన్నాడు, ఆదెయ్య. హనుమంతుకి సీతారామయ్య రాడేమోనన్న అనుమానం లేకపోలేదు. అది ఇప్పుడు ఖచ్చితంగ దృధపడింది, అంతే. సీటారామయ్య మీద విపరీతమైన కోపం వచ్చింది. మనసులో వాడిని నానా తిట్టులూ తిట్టుకున్నాడు.
హయగ్రీవశాస్త్రి ఇప్పుడు అనాధశవం. హనుమంతుకి పురాణం శాస్తుర్లు గారు ఎప్పుడో పురాణంలో పిట్ట కథలా చెప్పింది గుర్తుకొచ్చింది. అనాధ ప్రేత సంస్కారాత్ కోటియజ్ఞ ఫలం లభేత్, అని.
సీతారామయ్య నాన్నగారు జంఝాలు వడికే వారు. ఉపనయనాలకీ, పెళ్ళిల్లకీ ఆయనసంభావనలకి వెళ్ళడం తనకి తెలుసు. వైదీక వృత్తి. ఆయన అన్నదమ్ములందరూ వైదీక వృత్తిలోనే ఉండేవాళ్ళు. సీతారామయ్యే వాళ్ళ ఇంట్లో మొట్టమొదటిగా హైస్కూలు కెళ్ళినవాడు. వైదీకవృత్తి చెయ్యనంటే చెయ్యనన్నాడు. హయగ్రీవ శాస్త్రి సీతారామయ్య కన్నా పదేళ్ళు చిన్నవాడు. చిన్నప్పుడు నాన్న దగ్గిరే కూచొని తనుకూడా సరదాగా జంఝాలు వడకడం నేర్చు కున్నాడు. బడికీ వెళ్ళాడు.వాడికి కాస్తో కూస్తో బాగానే చదువంటింది.స్కూల్ ఫైనల్ పరీక్ష ప్యాస్ అయ్యాడు కూడాను! వాళ్ళ నాన్నా మురిసిపోయాడు. కాలేజీకెళ్ళాలని తెగ ఉబలాట పడ్డాడు. కాలేజీలో సీటు రాలేదు; మార్కులు చాలినన్ని రాలేదు, కులమూ కలిసి రాలేదు! డబ్బులుకట్టి కాలేజీకెళ్ళే స్తోమతు అసలే లేదు. ఉద్యోగం కోసం నానా గడ్డీ కరిచాడు. పంచాయితీ ఆఫీసర్ల దగ్గిరకి వెళ్ళాడు; ఎం.ఎల్.ఏ ల చుట్టూ తిరిగాడు. కాళ్ళు బలపాలు కట్టిపోయాయి కానీ, చివరకి చప్రాసీ ఉద్యోగంకూడా రాలేదు. ఢీలా పడిపోయాడు. ఈ లోగా వాళ్ళనాన్న హరీ అన్నాడు. చివరకి వాడి పెద్దనాన్న దగ్గిర ఏదో కాస్తం వైదీకం నేర్చుకుంటే మంచిదని వాడి చుట్టాలందరూ పోరితే, భీమవరం వెళ్ళి ఒక ఏడాది అక్కడ ఉండి తిరిగి వచ్చాడు, వసారా క్రాపు, వెనక పిలక,ముఖంమీద, జబ్బలమీదా విభూది, అంగవస్త్రం, కండువాతో!
వృద్ధిలోకి వస్తున్నాడు అని అన్నదమ్ముల పిల్లలు అంతా సంతోషించారు. ఒక నాలుగేళ్ళ పాటు అంతా సవ్యంగానే జరిగిపోయింది. బాగానే గడుస్తున్నది వాడి వ్యాపారం! శుభకార్యాలకి ఎక్కడికి పిలిచినా,ఎవ్వరు సంభావనలిస్తారని తెలిసినా అరమరిక లేకండా జిల్లామొత్తం ఏ ఊరికైనా పోయేవాడు. ఏవేవో మంత్రాలుకూడా వల్లిస్తూనే వుండేవాడు. వైదీకవృత్తిలో ఉన్న వాళ్ళందరితో బాగా స్నేహం కూడా ఉండేది. ఇల్లా ఉండగా పిడుగు పడ్డట్టు వాడి భీమవరం బతుకు బయట పడింది. అక్కడ ఎవరో కులంకానికులం అమ్మాయితో కాపరం చేశాడని , ఒక కూతురుకూడా పుట్టిందనీ తెలిసింది. అదేమీ పుకారు కాదు! ఆ అమ్మాయి కూతురినివేసుకోని వాడి దగ్గిరకి వచ్చింది. మరొకడైతే ఆవిడని తన్ని తగిలేసే వాడేమో కానీ, హయగ్రీవ శాస్త్రి ఆ పని మాత్రం చెయ్యలేదు. పబ్లీగ్గా ఆవిడతో కాపరం పెట్టాడు. అంతే! అదే వాడి పతనం అన్నారు, హేమాహేమీలందరూ !
వైదీకవృత్తిలో స్నేహితులు, సీతారామయ్య సంసారం, అన్నదమ్ముల పిల్లలూ అందరూ వాడిని వెలి వేసినట్టు దూరంగా ఉంచారు. వాడి పేరే ఎత్తేవాడుకాదు, సీతారామయ్య! ఇటువంటి విషయాలు శరవేగంతో ప్రయాణం చేస్తాయి. శుభకార్యాలకి పెద్దకులాలవాళ్ళు,డబ్బున్న మోతుబరులూ, వాడిని పిలవడం మానుకున్నారు. ఎంతనా కులభ్రష్టుడయ్యాడుగదా! వాడిచేత శుభకార్యాలు ఎల్లా చేయించుకుంటారు? హయగ్రీవశాస్త్రికి గడవడం కష్ట మయిపోతూన్నది, రోజు రోజుకీ! చివరకి, కాలవ దగ్గిర వంతెన మీద గద్దల్లా కాచుకొ కూచునే బ్రాహ్మలు — క్షుద్రకర్మలు చేసే వాళ్ళు,అంటే శవాలని మోసేవాళ్ళు,దహనకాండలు జరిపించేవాళ్ళు కూడా — వీడిని దగ్గిరకి చేరనిచ్చేవాళ్ళు కారు. వీడు అటూ ఇటూ కాకండా రెంటికీ చెడ్డ రేవడయ్యాడు.
చివరకి భార్య అక్కడా ఇక్కడా కూలి పని చేసి తెచ్చిందే ఆధారం అయ్యింది. వీడికి ఏవో వ్యసనాలుకూడా అబ్బినాయి. మరి ఏమయిందో ఏమో ఎవరికీ తెలియదు. ఇవాళ వాడి శవం మాత్రం ఏటి గట్టున తేలింది. అనాధ ప్రేతంగా…
హనుమంతుకి ఈ విషయాలన్నీ తెలుసు. అందుకనే, సీతారామయ్య రానన్నాడని ఆదెయ్య చెప్పినప్పుడు ఆశ్చర్యపడలేదు. కనీసం వాడికి దహనకర్మలు చేయిస్తే తనకి శాంతి. అంతే కాదు, ఆపని చేస్తే కోటియజ్ఞాల ఫలం అని అన్నారుకదా! హనుమంతుకి ఇల్లాటి విషయాల్మీద గట్టి నమ్మకం.
ఇనస్పెక్తర్ గారు వచ్చింతర్వాత వస్తానని పోలీసుకి చెప్పి వెంటనే ఆదెయ్య రిక్షాఎక్కి పురాణం శాస్తుర్లు గారి దగ్గిరకొచ్చాడు. జరిగిన విషయం చెప్పాడు. హయగ్రీవశాస్త్రికి చెయ్యవలసిన కర్మలకి అయ్యే కర్చు తను పెట్టుకుంటానని చెప్పి, శాస్తుర్లు గారిని ఆ కర్మలు చేయించే ఏర్పాటు చెయ్యమని ప్రాధేయ పడ్డాడు. శాస్తుర్లుగారు ,చిరునవ్వు నవ్వి, ” చూడు బాబూ! అతను కులభ్రష్టుడు కదా! ఆ కర్మలు మనం ఎల్లాచేస్తాం చెప్పు? కోటియజ్ఞాలఫలం వస్తుంది నిజమే! కానీ, ఈ జన్మలో నన్ను మళ్ళీ బాలాజీ గుడిలో అడుగు పెట్టనివ్వరు. నువ్వూ డబ్బు ఇస్తానన్నావు అనుకో! నా జీవితాంతం సరిపోయే డబ్బు ఇవ్వలేవు కదా! అందుచేత ఆ విషయం మరిచిపో!” అన్నారు!
హనుమంతుకి మతిపోయినంతపని అయ్యింది. కోటియజ్ఞాలఫలం అన్న లోకోక్తి మీద అనుమానం రావడం మొదలెట్టింది. తిన్నగా ఆదెయ్య రిక్షా ఎక్కి భక్త జన మహాసభ వాళ్ళదగ్గిరకి వచ్చాడు. వాళ్ళేమన్నా సహాయం చేస్తారేమోనని!వాళ్ళూ పురాణాలు,చెప్పిస్తారు; గీత బోధిస్తారు; పేదవిద్యార్థులకి ధన సహాయం చేస్తారు; అడుక్కునే బిచ్చగాళ్ళకి సంవత్సరానికోసారి బనీనులు ఇస్తారు. రామకోటి ఉత్సవాలు మంచి హడావుడిగా దర్జాగా చేయిస్తారు. ఈ విషయం చెప్పంగానే, అక్కడకూచున్న షావుకారుగారు,” అతను పైకులం వాడు, మనం అతనికి అంత్యక్రియలు చెయ్యకూడదు, అది పాపం!” అన్నాడు. హనుమంతు ఆయనకి అనాధప్రేత సంస్కారాత్ కోటియజ్ఞ ఫలం లభేత్ అని చెప్పి వప్పిద్దామని చూశాడు. ఆయన శాస్తుర్లుగారిలాగానే నవ్వి, ఊరుకున్నాడు.
పోనీ హాస్పటల్ వాళ్ళకే డబ్బిచ్చి అంత్యక్రియలు యధావిధిగా చెయ్యచ్చునేమో వాకబు చేశాడు. అక్కడ అసలు మాట్లాడే వాళ్ళే దొరక లేదు. చివరకి ఆదెయ్యనిసలహా అడిగాడు.”మా చర్చిలో పాదరీ వాళ్ళు సాయం చేస్తారు బాబూ! కానీ, మీరనే కర్మలన్నీ ఆళ్ళకి నమ్మకం లేదు. మరి డబ్బిత్తే చేయిత్తారేమో తెలీదు,” అన్నాడు ఆదెయ్య.
హనుమంతుకి సీతారామయ్య మీద, శాస్తుర్లుగారిమీద, భక్తజనమహాసభవాళ్ళమీద చంపేద్దామన్నంత కోపం వచ్చింది కానీ… పళ్ళుమాత్రం కటకట కొరుక్కొని ఊరుకున్నాడు.
ఒక్క దిక్కుమాలిన శవానికి అంత్యక్రియలు చేయించలేకపోయానే అన్న బాధ మాత్రం మిగిలింది. తిన్నగా, ఆదెయ్య రిక్షా ఎక్కి మళ్ళీ ఏటి గట్టుకి వచ్చాడు, పురాణానికి వెళ్ళడానికి బదులుగా!
హయగ్రీవశాస్త్రి శవం ఇంకా అక్కడే ఉంది. ఒకడికి ఇద్దరు పోలీసులు కూడా అక్కడే ఉన్నారు.
హయగ్రీవశాస్త్రి భార్య, కూతురూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు, ఆ శవం పక్కనే కూచొని!
ఆ రోదన హనిమంతు భరించలేక పోయాడు. వెంటనే ఆదెయ్యని రిక్షా ఎక్కి ,ఇంటికి బయల్దేరాడు, కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ! ఎవరూ చూడ లేదు కానీ, ఆదెయ్య కి కూడా కంటినిండా నీళ్ళు నిండాయి.
సుమారు ఐదు దశాబ్దాలక్రితం, సుబ్బారావు పాణిగ్రాహి తన పాటలలో, విప్లవ గీతాలలో పిట్టకథగా చమత్కారంగా అల్లి “అనాధప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలం లభేత్,” అన్నలోకోక్తి మీద వ్యంగ్యంగా చలోక్తి వేస్తూ,”ఇదే గనక నిజమైతే,తాతాలు,బిర్లాలూ గోయంకాలూ మనదేశంలో ఒక్క టంటే ఒక్క అనాధ శవం మిగులుస్తారా చెప్పండి! అనాధప్రేతసంస్కార లిమిటెడ్ అనే వ్యాపారం పెట్టి,ఇచ్చట అనాధ ప్రేతములు అమ్మబడును,అని ప్రకటనలు దంచేసి కోటానుకోట్లు గడించేయరూ? అనాధ శవాల ప్రతి అవయవానికీ విలువ కట్టి, అంగాగాలన్నీఅమ్మి పారేసే వాళ్ళు,” అని చెప్పగా విన్నాను.ఈ కథకి అతని వ్యంగ్య చలోక్తి స్ఫూర్తి.ఈ కథ అతని స్మృతికి అంకితం.
సుబ్బారావు పాణిగ్రాహిని 1969 డిసెంబర్ 21 తెల్లవారుఝామున న పోలీసులు కాల్చి చంపేశారు. అతనికి అప్పటికి 36 ఏళ్ళ వయస్సు.