మబ్బురంగు సిల్కు షర్టూ పూనా చీరా పేక్ చేయించుకొని, ఆ రోజు చాలా ఆనందంగా బయల్దేరాడు రావు, ఇంటికి. యమున బాబునెత్తుకువచ్చి వారం రోజులైంది. బాబు చాలా ముద్దుగా బొద్దుగా గుండ్రటి కళ్ళతో తల్లిలాగే వుంటాడు. వాడి కళ్ళలోకి చూస్తే కిలారుమంటూ బోసినవ్వు నవ్వుతాడు. వాణ్ణి గుండెలకు హత్తుకుంటే, “ఓహో! పితృప్రేమ!” అంటూ హాస్యం చేస్తుంది యమున. మొదట మొదట తనకు సిగ్గువేసినా ఆ వారం రోజులలోనూ వాణ్ణి తనివితీరా ముద్దులు పెట్టుకోవడం, ఎత్తుకు తిప్పడం అలవాటయ్యాయి.
యమునతో ఒకసారి తను “నిజం చెప్దూ! చందమామ వీడికన్నా అందంగా వుంటుందా?” అన్నాడు.
“ఉండదు. వాడి బాబుకన్నా కూడా అందంగా వుండదు.” అంది.
“మరి నీకేం కావాలో అడగరాదూ ఇస్తాను,” గర్వంగా చూశాడు తను.
“సిగ్గులేకపోతేసరి. కట్టుడు చీరలు కావాలని ఎన్నిసార్లు చెప్పాను! పైగా వరాలడగాలా?” అంది చివాట్లు పెడుతూ.
ఆ రోజు, యమునకే ఆ చీర కొన్నాడు. బాబుకి స్వెట్టర్ కూడా కొన్నాడు. పిల్లాడు పుట్టాక తను చాలా మారాడు. తను తండ్రి అయ్యాడు! బిడ్డలూ… సంసారం బాధ్యతలూ! తల్చుకొంటోంటే అవన్నీ మధురంగానే వున్నాయి. ఎంతటెంతట వాటిని నిర్వహించే రోజు వస్తుందా అని ఆతృత కలుగుతోంది. అబ్బాయిని చదివించాలి! తనలా కాదు, బాగా చదివించాలి! కొడుకు పుట్టినప్పట్నించీ రావుకి వాణ్ణి ఎలా పెంచాలీ అన్న ఆలోచనే!
యమున ఎలాంటి విషయాన్నయినా తేలిగ్గానే తీసుకుంటుంది. “చీర చాలా బాగుంది.” అంది సంతోషంగా. రావు తేలికపడ్డాడు.
యమున కాఫీ అందిస్తూ నవ్వింది. “స్వెట్టర్ కూడా చాలా బాగుంది.” అంది.
“బాగుండటం కాదు! అది వేసి వాణ్ణి వేరే పడుకోబెడితే చలేం వెయ్యదుగా?”
“మీరు కూడా స్వెట్టర్ కొనుక్కుంటే మీకూ చలి వెయ్యదుగా?”
“అలా పెంకితనం చేస్తే వూరుకోను.”
“మూడు నెలలయినా నిండని ఆ పసివాడి మీద ఎందుకో మీకంత అసూయ? వాడు వాళ్ళమ్మ దగ్గరే పడుకుంటాడు. స్వెట్టరూ గిట్టరూ అక్కర్లేకుండా అమ్మ గుండెల్లో వెచ్చగా నిద్రపోతాడు. ఏం, పాతికేళ్ళు నిండిన మిమ్మల్ని మీ అమ్మ ఈ నాటికీ పసిబిడ్డలా చూసుకొంటూంటే, నేను అప్పుడే నా బిడ్డని గాలికి విడిచిపెట్టనా? ఊహు! నా వల్ల కాదు!” రావు నవ్వాడు. వేడి వేడి కాఫీ తాగుతూ కూర్చున్నాడు. యమున స్వెట్టర్ విప్పి బాబుకి తొడిగింది.
“అయితే యమునా! మా అమ్మ మంచిదా, బాబు అమ్మ మంచిదా?”
“మీ అమ్మే మంచిది.”
“ఎందుకూ?”
“ఈ నాటివరకూ మిమ్మల్ని పెంచుతూనే వున్నారుగా? నా మాట అప్పుడే ఏం చెప్పగలం?” యమున కళ్ళనిండా మాతృత్వపు మమత చూడగలిగాడు రావు. యమున బాబుని హృదయానికి హత్తుకొని నిలబడింది. రావు తదేకంగా చూశాడు. ఆ దృశ్యం రావు హృదయం నిండా అలుముకొంది. అప్రయత్నంగా లేచి దగ్గరికి నడిచాడు, “నేనూ ఆడపిల్లనై పుట్టి అమ్మని కాగలిగితే? ఈ సంతోషం అమ్మలకే తెలుస్తుందేమో!” అన్నాడు.
నవ్వింది యమున. బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టి జోకొడుతూ అంది, “మీకో కబురు చెప్తాను. భలే ఆశ్చర్యపోతారు.”
“ఆహాఁ!” అన్నట్టు చూశాడు రావు.
“నా మాట నమ్మరేమో అసలు!”
“చెప్పు చూద్దాం! చిత్రమా, విచిత్రమా? విచారమా, సంతోషమా?”
“విచిత్రమేం కాదు కానీ చిత్రమే! విచారం దేనికీ? సంతోషమే!”
“ఓహో! ఏమిటబ్బా అది?”
“ఆలోచించండి చూద్దాం!”
చిరాగ్గా నుదురు చిట్లించాడు రావు. “నువ్వేం చెప్పక్కర్లేదు గానీ సినిమాకి వెళ్దాం, తొందరగా బైల్దేరు. కొత్తచీర కట్టుకో!”
“అమ్మో! పిల్లాడితోనా సినిమాకి? ఇంకా వంటా గింటా మొదలెట్టలేదు. చాలా పని వుందే.”
“ఏం? అమ్మ ఏమైంది? అన్నీ చూసుకుంటుందిలే.”
యమున కళ్ళలో నవ్వు చిందించింది. “పడుకున్నారు.”
“వంట్లో బాగాలేదా?” ఆతృతగా అడిగాడు.
“ఒంట్లో కాదు, మనసు బాగాలేదేమో!”
“ఏమిటి యమునా! ఆ చెప్పేదేదో సరిగ్గా చెప్పరాదూ?”
“అయితే చెప్పేస్తాను. ఆరు నెలల్లో… వింటున్నారా? చెప్పేస్తున్నాను… మీకు చిన్ని తమ్ముడో చెల్లెలో పుడతారు. వినేశారా?” ఫక్కుమంది యమున.
“చాల్లే! ఏమిటా మోటు హాస్యం?” రావు చురుగ్గా చూశాడు.
“బాగుంది. మధ్య నాదా మోటు హాస్యం? రేపట్నించీ తమ్ముణ్ణెత్తుకుని వూరేగేది మీరేగా?” యమునకు కాస్త కోపం వచ్చింది. విసురుగానే అంది, “ఉన్న సంగతి చెప్పాను. నమ్మితే నమ్మాలి, మానితే మానాలిగానీ, నా మీద దేనికి మీకంత చిరాకు?”
“అసలేమిటి అమ్మకి?”
“ఏమో, ఏమిటో? మీరే అడగరాదూ వెళ్ళి?”
“ఎవరు చెప్పారు నీకు?” ఆతృతగా అడిగాడు.
ఒక్క క్షణం చూసి మామూలుగా అంది యమున, “నా మాట కొట్టిపారేస్తోంటే నేనేంచేసేది?” అంటూ చెప్పుకొచ్చింది. “అసలావిడికి రెండు మూడు నెలలనుంచీ అనుమానంగానే వుందట,” కాస్త గొంతు తగ్గించింది. “బహిష్టులు పోతాయేమో అనుకున్నారట. మరీ సరిపెట్టుకోబుద్ధిగాక ఇవ్వాళ పొద్దున్న సీతమ్మ పిన్నిగార్ని తీసుకుని ఆస్పత్రికి వెళ్ళారు. అసలు వెళ్ళే ముందు నాకు చెప్పనేలేదు. వచ్చాకమాత్రం చెప్పారేమిటి? పిన్నిగారే చెప్పింది. డాక్టరమ్మ పరీక్షచేసి మూడో నెలని చెప్పిందట. పెద్ద వయస్సు కాబట్టి జాగ్రత్తగా వుండాలనీ, మంచి ఆహారం తీసుకోవాలనీ, నెలనెలా వచ్చి చూపించుకోవాలనీ చెప్పిందట.”
మాటా పలుకూ లేకుండా నిలువుగుడ్లతో చూస్తూ వుండిపోయాడు రావు. యమున ఇంకా ఇంకా చెప్పింది. “అత్తయ్య కళ్ళ నీళ్ళు పెట్టుకుంటోంటే డాక్టరమ్మ భుజంమీద చెయ్యి వేసి ధైర్యం చెప్పి బుజ్జగించిందట. ‘పెద్ద వయస్సయినా మీరేమీ భయపడకండి. నేను మీకే ఆపదా రాకుండా పురుడుపోసి పంపుతానుగా!’ అందట. ఏదో మందులు రాసికూడా ఇచ్చిందట! ఆ చీటీ మీ అమ్మ ఆస్పత్రి దాటగానే చించిపారేశారట. మొహం అదోలా పెట్టుకుని ఇంటికి వస్తే ఏమో అనుకున్నాను. రాగానే గదిలో నేలమీద కొంగు పర్చుకొని పడుకున్నారు. ఎంత పలకరించినా మాట్లాడారు కాదు. ఒంట్లో బాగాలేదో ఏవిటో అని వూరుకున్నాను. సీతమ్మ పిన్ని అంతా చెప్పింది. మొదట మీలాగే నేనూ ఆశ్చర్యపోయాను. ఆవిడ మొహం చూడాలంటే భలే సిగ్గేసింది. ఏమీ ఎరగనిదానిలా ‘అన్నానికి రండి అత్తయ్యా!’ అని పిల్చాను.
‘నేను తిననమ్మాయీ! నువ్వు భోంచెయ్యి.’ అన్నారు.
అప్పుడే చూశాను. కళ్ళు ఉబ్బిపోయి వున్నాయి. ఏడుస్తూ కూర్చున్నారు. లేచి రానేలేదు. నాకూ ఒక్కదాన్నీ తినటానికి సహించక వూరుకున్నాను. పిన్నిని పిలిచి ఆవిడ అన్నం తినడంలేదని చెప్పాను. పిన్ని అత్తయ్యని మందలించింది, ‘పిచ్చా, వెర్రా? ఎందుకలా బెంబేలుపడతావు? దేవుడిస్తే దెయ్యం కంటుందిట. వాడి ఇష్టం గానీ మన చేతుల్లో ఏముంది? నీకన్నా పెద్దవాళ్ళయి పురుళ్ళు పోసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? నువ్వేం తప్పుడు పని చేశావు గనకా? చాలు గాని లేచి అన్నం తిను. నీకోసం యమున కూడా అలా వుండిపోయింది. చంటిబిడ్డ తల్లి. లేచిరా వదినా, లేచిరా!’ అంటూ బలవంతంగా లేవదీసి అన్నం కలిపి తినిపించినంత చేసింది. ఇక తప్పదని ఆవిడే తిని మళ్ళీ ముణగదీసుకుని పడుకున్నారు.” యమున నోటికి కొంగు అడ్డం పెట్టుకుని రావుకేసి చూసింది.
రావు ఏమీ వినని వాడిలాగ ఎటో చూస్తూ నిలబడ్డాడు.
యమున మళ్ళీ అంది, “పాపం, అత్తయ్యకి భయమో యేమిటో కుమిలి కుమిలి యేడుస్తున్నారు. అన్నట్టు మావయ్యకి కూడా తెలిసిపోయింది. పిన్ని నవ్వుతూ నవ్వుతూ చెప్పేసింది. అందరిలాగే ఆయనా విస్తుపోయినట్టు చూసి మళ్ళీ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.”
చటుక్కున తలతిప్పి చూశాడు.
“అదేవిటి? మీరెందుకలా చూస్తారూ? నేను చెప్తోంది అబద్ధమనుకుంటున్నారా? కావాలంటే పిన్నిని పిలుస్తాను, అడగండి. అయ్యో! మర్చిపోయాను. ఎసరు మరిగిపోతోందో యేమో!” లోపలికి పరిగెత్తింది యమున.
రావు హఠాత్తుగా స్టాండుమీది బట్టలు వేసుకుని వరండాలోంచి వెళ్తూ జోళ్ళు తగిలించుకుని మెట్లుదిగి రోడ్డుమీదపడ్డాడు.
గబగబా గాలి పీల్చుకుంటూ నడిచాడు. ఆ రోజు కూడా పార్క్ చివరికంటా పోయి ఒంటరిగా కూర్చున్నాడు. అమ్మ కబురు తల్చుకుంటూంటే ఎప్పటికప్పుడే విభ్రాంతి కలుగుతోంది. యమున చెప్పింది నిజమా కాదా అన్న ఆలోచన అక్కర్లేదు. యమునే కాదు, ఎవరూ ఇలాంటి అబద్ధాలు కల్పించరు. తనకి తమ్ముడో చెల్లెలో! ఇప్పుడు! ఛీ! ఎంత సిగ్గుచేటు! తను పెరిగి పెద్దవాడై తండ్రి కూడా అయితే, ఇంకా తన తల్లితండ్రులు పిల్లల్ని కనటమా! ఆ సంగతి విని తన తండ్రి నవ్వుకున్నాడా!
రావునేదో అర్థం కాని అసహ్యభావం ముంచేసింది. శరీరం యావత్తూ ఏవగింపుతో జలదరించింది. తననీ, తన సంతానాన్నీ చూసుకుంటూ కాలం గడిపేయాల్సిన తల్లిదండ్రులు! అమ్మకి నలభై ఐదేళ్ళు దాటాయి. నాన్నకి యాభై ఏడో ఎనిమిదో ఉంటాయి. ఇద్దరూ వృద్ధాప్యంలో అడుగుపెట్టారు. కొడుకూ కోడలూ, కూతురూ అల్లుడూ, రెండు వేపులా మనవలూ! అమ్మమ్మకీ తాతకీ ఇప్పుడు పిల్లలా? ఇప్పుడు పసిబిడ్డ! ఒక్కసారిగా ఆ ఇద్దరి మీదా రావుకి చీదర ముంచుకొచ్చింది. అసలు ఈ వయస్సులో బిడ్డల్ని కనవచ్చునా? అలాంటి బిడ్డలు ఎన్ని అవకరాలతో పుడతారో! తల్లికి మాత్రం ఎంత ప్రమాదం! అబ్బా, ఎంత బుద్ధిలేదో! వాళ్ళ బాధ్యతలేమిటో వాళ్ళకు తెలియకుండా పోయాయి.
చీకటిపడ్డా లేచి ఇంటికి వెళ్ళటానికి మనస్కరించలేదు. అమ్మ కన్పిస్తే… చెట్టంత కొడుకు మొహం చూడటానికి సిగ్గుపడిపోదూ? నాన్నమాత్రం? ఏ మొహం పెట్టుకుని వీధిలో తిరుగుతాడు? బిడ్డల మొహం ఎలా చూస్తాడు?
రావు చాలాసేపు అక్కడే కూర్చున్నాడు. లేవక తప్పలేదు. ఇంటికి వెళ్ళకా తప్పలేదు. గుమ్మంలో అడుగు పెడుతోంటే గుండెలు గబగబా కొట్టుకుంటున్నట్టనిపించింది. తండ్రి కంఠస్వరం చెవుల్లో పడేసరికి కడుపులో ఎక్కడో వికారం పుట్టింది. రోజూలాగే తండ్రి ప్రయివేటు కుర్రాళ్ళకు పాఠాలు చెప్తున్నాడు ఉత్సాహంగా. ఏమీ సిగ్గుపడుతున్నట్టు లేదు! మొహం చిట్లించుకుంటూ రావు గబగబా లోపలికి వెళ్ళాడు.
ఉయ్యాల వూపుతోన్న యమున ఎదురు వచ్చింది. ఒక్క క్షణం చూశాడు. సాయంత్రం తెచ్చిన కొత్తచీర కట్టుకుంది. చటుక్కున తల తిప్పుకుని చొక్కా విప్పుతూ స్టాండు దగ్గరికి పోయాడు. కొంచెం ఆశ్చర్యపడుతూనే అంది యమున, “మీరు సరిగా చూడలేదా? సాయంత్రం తెచ్చిన కొత్త చీర కట్టుకున్నాను.”
“కనబడుతోందిగా? చూడకపోవటం ఏమిటి?” ముక్తసరిగా అన్నాడు.
ఆశ్చర్యంగా చూసింది యమున. “అలా వున్నారేం? ఇందాక కూడా చెప్పకుండానే వెళ్ళిపోయారే!”
“అబ్బ! నువ్వు కబుర్లకి దిగితే ఇంతే! వచ్చీరాగానే ఏమిటి నీ ప్రశ్నలు?” బట్టలు తీసుకుని రెండంగల్లో బాత్ రూమ్‌కేసి నడిచాడు.
యమున పలకరించకుండానే అన్నం వడ్డించింది. రావు దించిన తల ఎత్తకుండా గబగబా రెండు ముద్దలు తిని ఎవరో తరుముకొస్తున్నట్టే గదిలోకొచ్చిపడ్డాడు. అమ్మ కనిపించలేదు. ఏ క్షణంలో బయటకొస్తుందోనని కంగారుపడ్డాడు.
తండ్రి కంఠం విన్పించటంలేదు. ప్రయివేటు పిల్లలు వెళ్ళిపోయినట్టున్నారు. తనకు గుర్తున్నంత వరకూ తన తండ్రిని ఇంతగా అసహ్యించుకున్న రోజు ఎన్నడూ లేదు. అమ్మంటేనే తనకు బాగా ఇష్టమైనా, నాన్నంటే కూడా ఇష్టమే. తను చదువుకునే రోజుల్లో డబ్బు కోసం ఇబ్బందిపడే నాన్నని చూస్తూ తను కన్నీళ్ళు తెచ్చుకున్న సమయాలు కూడా వున్నాయి. తనకి ఉద్యోగం వచ్చాక నాన్నతో ఎన్నోసార్లు చెప్పాడు, “నీకీయాతనెందుకు నాన్నా? నువ్వు ప్రయివేటు చెప్పకపోతే మాత్రం మనం బతకలేకపోతామా? హాయిగా విశ్రాంతి తీసుకో, చాలు.” అన్నాడు.