ఒకటి నుంచి పదిల దాకా…

అపుడెపుడో చిన్నప్పుడు నిదరొచ్చే వేళ
కన్నుల్లో రంగు కలలు పరచుకునే వేళ
బుజ్జిజింకల కనులు ఒరిగి మూతపడే వేళ
కనురెప్పలు అలసి సొలసి వూగి-తూగే వేళ

అల్లాంటి కథల వేళ!

చదువమ్మా! అంటూ బుజ్జిజింకలిచ్చే బుక్స్
అంత నచ్చిన పుస్తకమా అని చూస్తే – Dr. Seuss!
చదవడం మొదలెట్టిన అమ్మకెంత నచ్చిందో
Dr. Seuss గారి నింకెంతగ మెచ్చిందో.

నాకెందుకు దొరకలేదు ఇంత చక్కటి పుస్తకం చిన్నప్పుడు?
అని బుంగమూతి పెట్టి అలిగింది అమ్మ లోని పాప
అంతలోనే – దొరికిందిగా చదవనా ఎంచక్కా ఇప్పుడు!
అనుకుని గబగబ చదివింది – అసలెవ్వరి తరమింక ఆప!

చదివి ఆగిందా అమ్మ? ఉహూఁ –

తేట తెలుగులో
మన మేటి తెలుగులో
బుల్లిపాపల నవ్వించేలా
బుజ్జిబాబుల కవ్వించేలా
నేనూ చెప్పనా ఒక తమాషా కథ
లెక్కెట్టే అంకెల కథ!

అనుకుంది అమ్మ! అనుకున్న తడవే చెప్పేసింది ఇదిగో…!

ఒకటి నుంచి పదిల దాకా…

టి… ఒకటి
బుల్లి ముక్కు తోటి
చిట్టి నోటి తోటి
ఈల పాట తోటి
వచ్చెనదే చక్కరూపు పిట్ట ఒకటి
లెక్కపెట్టి చూస్తేనూ ఒక్కటంటే ఒక్కటి
ఒకటే ఒకటి

డు డు… రెండు
మంచిని మాటాడు
తీపి పాట పాడు
అలుపెరగని ఆటలాడు
మురిపాల ముద్దులాడు
మరో పిట్ట వచ్చె చూడు
ఒకటితో ఒకటి చేరి అయ్యెను రెండు

డు డు డు… మూడు
ఇంకోసారి అని చూడు
అటు చూడు ఇటు చూడు
తెచ్చెను పిట్టలు రెండు
ముక్కులతో పట్టి తూడు
లెక్కపెట్టి తమ్మిపూలు మూడు

గు గు గు గు… నాలుగు
పిట్టకింకో పేరు పులుగు
పై తెల్లని వెన్నెల వెలుగు
పాడే పులుగుల ఎలుగు
అది వింటే ముదము కలుగు
అమ్మానాన్నా కలిసి పులుగులయ్యె నాలుగు

దు దు – దు దు దు… ఐదు
పాడే పిట్టల కాకలి వేయదు
ఆడే పిట్టల కలసట రాదు
పిలిచిన అమ్మకి బదులు దొరకదు
వెతికే నాన్నకు అస్సలు చిక్కదు
బుజ్జిపిట్టలు అమ్మానాన్నల ప్రాణాలైదు

రు రు రు – రు రు రు… ఆరు
అమ్మ పిలిచినా రారు
నాన్న వెతికినా దొరకరు
పండు కొరకరు దిండు కొరగరు
అల్లరి గువ్వలు గూడున నిలవరు
అలుపెరుగని ఆటల్లో కరిగే కాలా లారు

డు డు డు – డు డు – డు డు… ఏడు
ఎర్రతామరల తూడు
పచ్చాపచ్చని బంతుల కూడు
నీలాకాశపు నిగనిగ తోడు
వెలిసిందొక వానవిల్లు చూడు
రంగులు పూసుకు ఏడు

ది ది ది ది – ది ది ది ది… ఎనిమిది
వాన అలా కురుస్తూనే వుంది
నేనునేనని ఎండా కాసింది
వానవిల్లు ఇంకా చిక్కనయింది
నాకింకో పేరుంది
అది ఇంద్రధనుస్సు – తానంది
ఇంకా తెలుసా అన్నది, తన రంగులకూడిక – ఎనిమిది

ది ది ది – ది ది ది – ది ది ది… తొమ్మిది
ఏడు రంగుల కూడిక – ఎనిమిది!
తెలియలేదా చిన్నిపిట్టకి – ఎలా అయ్యింది?
అన్నపిట్టతో, తేలని లెక్కను మళ్ళీ మళ్ళీ పెట్టింది
అమ్మకు వెళ్ళి చెప్పింది నాన్నను వెళ్ళి అడిగింది
ఇంతలోనే గడియారం టంగని కొట్టింది తొమ్మిది

ది ది ది – ది ది ది – ది ది ది ది… పది
అమ్మ బువ్వ బుజ్జిపిట్టల బొజ్జ నింపింది
నాన్నగువ్వ ఏడురంగుల చక్రం తిప్పింది;
ఏడురంగులూ కలిసిన కొత్త రంగు తెలుపయింది
పిట్టల నవ్వుల దివ్వెల వెలుగై వెదజల్లింది
చల్లని వెన్నెల పది కాలాలై కాసింది.