ఏముంటుందా ఇంట్లో?
నాలుగ్గోడలు, ఇద్దరు మనుషులు
ఒకరు ఆమె, ఇంకొకరు అతను
వాళ్ళ లోపల చిక్కటి కృష్ణబిలాలు
భావాలు, భావోద్వేగాలు
అంతర్ధానమైన శూన్య బిలాలు
పాము కుబుసం వదిలినట్లు
జీవత్వం విడిచిన మనుషులు
ఎవరి వలయంలో వాళ్ళు గిరికిలు కొట్టే
జీవచ్ఛవాలు
పచ్చదనం మాయమై మోడైన మానులు
గుండె లోతుల్లో నీటి మడుగుల ఎండమావులు
జీవం జాడ కనిపించని మృత సముద్రాలు
జీవితాల నిండా ప్రేమను పరిచిన దేవతా వస్త్రాలు
యుగాల నుంచి చినుకు జాడలేని ఎడారిలా ఆమె దేహం
మరిగిన నీరు ఆవిరైనట్లు మాయమయ్యింది అతని శరీరం!
ఏముందా ఇంట్లో?
నాలుగ్గోడలు, ఎండిన రెండు సముద్రాలు!!