రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

పెద్దనగారి ప్రశిష్యులు, కాదన్న కవయిత్రులు

రచన: కె. వి. ఎస్. రామారావు
నవంబర్ 2026

అల్లసాని పెద్దన “ఆంధ్రకవితాపితామహుడు”. అంటే అంతకుముందు ఆంధ్రకవిత్వం లేదని కాదు, అతని సమకాలీనకవుల్లో పెద్దన పెద్దతలకాయ అని; ప్రబంధ సాహిత్యానికి అతను అంకురార్పణ చేశాడని.

పెద్దన చేసిన ఒక సాహసం వరూధిని అనే పాత్రను సృష్టించటం. అదివరకు ఎన్నో స్త్రీపాత్రలు వచ్చాయి కాని వరూధిని వంటి వ్యక్తిని సృష్టించే పరిస్థితులు, కవులు అంతవరకు రాలేదు. కృష్ణదేవరాయల పాలన నాటి రాజకీయ, సాంఘిక స్థితిగతులు పెద్దనవంటి వారు విలాసభరితమైన సాహిత్యాన్ని, విలాసులైన స్త్రీపాత్రలను నిర్మించటానికి అనుకూలమయ్యాయి.

ధిషణ, వాదనాపటిమ వున్న స్త్రీపాత్రలు అంతకుముందు వచ్చారు, పురుషుల్నెదిరించి వాదించి సాధించారు. ద్రౌపది, దమయంతి, భారత ఉపాఖ్యానాల్లో ఇంకొందరు – ఇందుకు ఉదాహరణలుగా చెప్పొచ్చు. ఐతే, ‘నాకు నీమీద కోరిక వుంది; అది నువ్వు తీర్చాల్సిందే’ అని పట్టుపట్టినవారు భారతంలో ఒక్క దేవయాని తప్ప మరెవరూ కనిపించరు. ఆమె గారాబాల పట్టి. అంటే, ఇప్పటి భాషలో చెప్పాలంటే స్పాయిల్‌డ్ చైల్డ్ (spoiled child). తండ్రికి ఆమెమీద వున్న అమితప్రేమతో వయసు పెరిగినా లోకం తెలియని వ్యక్తి. వరూధిని అలా కాదు.

సీ.
చిన్ని వెన్నెలకందు వెన్నుదన్ని సుధాబ్ధిపొడమిన చెలువ తోబుట్టు మాకురహివుట్ట జంత్రగాత్రముల రాల్‌ కరగించువిమలగాంధర్వంబు విద్య మాకుఅనవిల్తుశాస్త్రంపు మినుకు లావర్తించుపని వెన్నతోడ పెట్టినది మాకుహయమేధ రాజసూయములన పేర్వడ్డసవనతంత్రంబు లుంకువలు మాకు
తే.గీ.
కనకనగసీమ కల్పవృక్షముల నీడపచ్చరా చట్టుగమి రచ్చపట్టు మాకుపద్మసంభవ వైకుంఠ భర్గ సభలుసాముగరిడీలు మాకు గోత్రామరేంద్ర

అని ధాటిగా, సూటిగా తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించగలిగిన వ్యక్తి.

సీ.
“హయమేధ రాజసూయములన పేర్వడ్డసవనతంత్రంబు లుంకువలు మాకు”
అంటూ అల్లాటప్పా యజ్ఞయాగాదులు కాదు, అత్యంతప్రధానమైన వాటి ద్వారానే పొందగలిగిన దాన్నని తన అంతస్తుని తెలియజెప్పిన వ్యక్తి. “భాషాపరశేషభోగి” ఐన ప్రవరుడితో బాహాబాహీ అన్నట్టు తార్కికవాదం చెయ్యగలిగిన వ్యక్తి.

శా.
ఎందే డెందము కందళించు రహిచే నేకాగ్రతన్‌ నిర్వృతింజెందుం కుంభగత ప్రదీపకళికాశ్రీ దోప నెందెందు పోకెందే నింద్రియముల్‌ సుఖంబు గను నా యింపే పరబ్రహ్మ, “మానందో బ్రహ్మ” యటన్న ప్రాజదువు నంతర్బుద్ధి నూహింపుమా

అంటూ అతనికి “ప్రాజదువుల” అంతరార్థాలు వివరించగల వ్యక్తి. ఆమెను తర్కంతో ఎలా ఓడించాలో తెలియక చివరికి ప్రవరుడు ఆమెకి “కామశాస్త్రోపాధ్యాయిని” అంటూ పేర్లుపెట్టటం చూస్తాం – తర్కం దొరకనప్పుడు తిట్టే దిక్కన్నట్టు. (గమ్మత్తేమిటంటే, ఆమె మాటలేవీ కామశాస్త్రానికి సంబంధించినవి కావు; ప్రవరుడికి వేదవేదాంగాలు తెలుసునేమో గాని కామశాస్త్రం తెలియదని ఇక్కడ పెద్దన సూచిస్తున్నాడని నా అనుమానం. ఏమైనా, ఇది రామాయణంలో పిడకల వేట.)

ఆ తరవాత వచ్చిన భట్టుమూర్తి (రామరాజభూషణుడు) ప్రబంధప్రక్రియని అత్యున్నతస్థితికి ఎత్తి భవిష్యత్ కవులందర్నీ అయోమయంలో పడేశాడు. అతని భాషావైదుష్యాన్ని, పదకల్పనాసామర్థ్యాన్ని, సంప్రదాయపాండిత్యప్రకర్షని అందుకోగలిగిన స్థాయి వున్న కవులెవరూ ఆ తర్వాత తెలుగు సాహిత్యంలో రాలేదు.

మరి ఆ తర్వాత వచ్చిన కవుల గతేమిటి? వాళ్లు ఏం రాయాలి? ఎలా రాయాలి?

ఈ చిక్కుప్రశ్నకు ఒక సమాధానం కనుక్కున్న తొలికవి చేమకూర వెంకటకవి. అతని సారంగధర చరిత్రము పెద్దన-భట్టుమూర్తుల మార్గాల కలయిక. పెద్దన వరూధిని ఒక దేవవేశ్య ఐతే చేమకూర నాయిక చిత్రాంగి, రాజరాజుకి ఉంపుడుగత్తె. ఆమెకి రాజరాజు కొడుకు సారంగధరుడి మీద కోరిక. రాజు వేటకువెళ్లిన వేళ, అతను తన ప్రియమైన పావురం కోసం ఆమె మందిరంలోకి వెళ్తాడు. వాళ్లిద్దరి మధ్య జరిగే సుదీర్ఘ సంభాషణని చేమకూర శ్లేషోపకరణంతో ఎంతో చాకచక్యంగా సాగిస్తాడు. ఐతే ఆమె వరూధినిని బాగా వంటబట్టించుకున్న ప్రౌఢ.

పెద్దన వరూధిని వాదం ద్వారా ప్రవేశపెట్టిన ఒక తర్కమార్గం (వక్రమార్గమైనా చమత్కారకారకం) “నీకంటే గొప్పవాళ్లు ఈ పని చేశారు, నువ్వు చెయ్యటంలో తప్పులేదు” అనేది. ఇది వరూధిని గొంతులో ఇలా పలుకుతుంది:

సీ.
వెలివెట్టిరే బాడబులు పరాశరు బట్టిదాశకన్యాకేళి తప్పుచేసికులములో వన్నెతక్కువయయ్యెనే గాధిపట్టికి మేనక చుట్టరికముఅనుపుకాడై వేల్పు నాగవాసము గూడిమహిమ గోల్పడియెనే మాందకర్ణిస్వారాజ్య మేలంగనీరైరె సుర లహల్యాజారుడైన జంభాసురారి
తే.గీ.
వారికంటెను నీ మహత్త్వంబు ఘనమెపవన పర్ణాంబు భక్షులై నవసి యినుపకచ్చడాల్‌ కట్టుకొను మునిమ్రుచ్చులెల్లతామరసనేత్ర లిండ్ల బందాలు కారె

చిత్రాంగి ఈ తర్కాన్ని దొరకబుచ్చుకుని ఇంకో మెట్టు పైకెక్కుతుంది:

సీ.
దారువనస్త్రీల దగిలెగాని యదేమొనీవలె ముక్కంటి నేరడయ్యెగారాబుగూతునె గవిసెగాని యదేమొనీవలె పరమేష్టి నేరడయ్యెనల యహల్యాకాంత నంటెగాని యదేమొనీవలె జంభారి నేరడయ్యెగురునియిల్లాలితో గూడెగాని యదేమొనీవలె నుడురాజు నేరడయ్యె
తే.గీ.
వారికంటెను హెచ్చైనవాడ వౌరనీకు గలబుద్ధి వారికి లేకపోయెనీవు నాటికి లేకపోయితివి గాకచేరి వారలయోజలు చెరుపలేవె

అలాగే, వరూధిని చాలా తాపీగా:

“ప్రాంచద్భూషణ బాహుమూలరుచితో పాలిండ్లుపొంగార పై
యంచుల్‌ మోవగ కౌగిలించి యధరంబాసింప”

చిత్రాంగి అతన్ని “అలమి బలిమి నొడిసి” పట్టింది. ఎంత గట్టిగా పట్టిందంటే ఆమెని తప్పించుకుని సారంగధరుడు పైపంచెను వదిలేసి “సాము సేసినగతి దట్టిచల్లడంబుతో” పారిపోవల్సొచ్చింది!

చేమకూర తర్వాత కొద్దికాలానికి వచ్చిన వారు సముఖము వేంకటకృష్ణప్ప నాయకుడు, శేషము వేంకటపతి. వాళ్లిద్దరూ మంచి మిత్రులని వేంకటకృష్ణప్ప చెప్పుకున్నాడు కూడ. వీళ్లు చేమకూరని దాటేసి అతని పై పద్యంలో వున్న ఇంద్రుణ్ణీ, చంద్రుణ్ణీ తమ నాయకులుగా ఎంచుకున్నారు – వేంకటకృష్ణప్ప “అహల్యాసంక్రందనము”, వేంకటపతి “శశాంకవిజయము”. చేమకూర దారిలో పెద్దన-భట్టుమూర్తుల మార్గాల కలయికని అనుసరించారు.

అహల్య కథకి మూలం ఋగ్వేదంలో ఇంద్రుణ్ణి “అహల్యాజారుడి”గా కీర్తించటం దగ్గర్నుంచి ఉంది. “అహల్య కథ” గురించి ఎన్నో పరిశోధనా పత్రాలు వచ్చాయి. ఓ రెండు ముఖ్యమైన వాటిని కింద సూచించాను.

ఇక్కడ మనక్కావలసిన విషయం వేంకటకృష్ణప్ప ఆ కథని ఎలా మలిచాడనేది.

అహల్య గురించిన చాలా కథనాలలో ఇంద్రుడు ఆమెను బలాత్కరిస్తాడు; అతను ఆమె భర్త గౌతముడి వేషంలో వెళ్లి ఆమెను కలవటం వల్ల ఆమెకి అతను ఇంద్రుడని తెలియదు. నదికి వెళ్లిన గౌతముడు తిరిగి వచ్చాకే తెలుస్తుంది. ఐనా అతని శాపానికి గురికాక తప్పదు.

వేంకటకృష్ణప్ప ఆలోచన వేరు: మొదటగా, ఇంద్రలోకంలో ఒక సభ జరుగుతుంది. అక్కడ, (వేరే మాట్లాడుకోవటానికి ఏమీ లేనట్టు) దేవవేశ్యల్లో ఎవరు అందరికన్నా అందమైన వాళ్లు అన్న విషయం మీద దేవతలు, ఋషులు తిట్టుకుని తన్నుకునే స్థితికి వస్తారు. అప్పుడు ఇంద్రుడు అందర్నీ వారించి “బ్రహ్మ దగ్గరకు వెళదాం, ఆయనే మన సందేహం తీరుస్తాడు” అని తీసుకెళ్తాడు. వెళ్లి ‘నీ సృష్టిలో అందరికన్నా అందమైన స్త్రీ ఎవరు?’ అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ అన్నిలోకాల్లో వున్న స్త్రీలందరికీ ఏదో ఒక వంక పెట్టి , “ఇప్పుడే నేను అందానికి ప్రతిరూపం ఐన స్త్రీని సృష్టిస్తాను చూడు” అంటూ అహల్యను సృష్టిస్తాడు. ఆ వెంటనే ఇంద్రుడు ఆమెను తనకివ్వమని అడుగుతాడు; అహల్య కూడ అప్పటికప్పుడే అతనితో ప్రేమలో పడుతుంది. అతని కథనం ప్రకారం అలా వాళ్లు తొలినుంచీ పరస్పర ప్రేమికులు.

బ్రహ్మ అతన్ని కాదని ఆమెకి గౌతముడితో వివాహం చేస్తాడు.

ఈ నిర్మాణంతో వచ్చే ఒక చిక్కు – చిత్రాంగిలా అహల్య ఇంద్రుణ్ణి తన కోరిక తీర్చమని అడగటం, అతన్ని ఒప్పించటానికి వరూధిని వంటి తర్కాన్ని వాడటం కుదరదు. ఐతే ఇలాటి చిన్న చిన్న చిక్కుల్ని దాటటం వేంకటకృష్ణప్పలాటి ప్రతిభావంతుడికి కష్టం కాదు: అతనొక యోగిని పాత్రని అందుకోసం తయారుచేస్తాడు. ఆ యోగిని అహల్యని ఒప్పించటానికి వరూధిని తర్కాన్ని వాడుతుంది –

సీ.
పతుల గాదనుచు గోపాలుతో బోయినగొల్లయిల్లాండ్ర కేకొదువ వచ్చెధవులేవురుండ నారవవాని గోరిననాళాయనికి నేమి నయము తగ్గెఘటికాద్వయికి నొక్కకాంతుచెంతకు చేరుపౌలోమి కేపాటి పదవి దప్పెమగని నటుంచి మార్మగని వెంబడిజన్నతార కేయిల్లాలితనము తగ్గె
తే.గీ.
వారికెవ్వారికిని లేని యారు దూరునీతలనె వ్రాసెనే ధాత నికృతిచేతనిశ్చలానంద మొందుము నెమ్మి నేడునలినలోచన దేవుడున్నాడు నాడు

అంతేకాదు,

ఉ.
ఇంతులపాపముల్ పతుల కింతయెగాని ప్రసక్తిలేదు కాసంతయు వారికంచు స్మృతులన్నియు బల్కును కాదటంచు నింతింతయు గల్గెనేని ఋతువైన జనున్ మరిచింతయేలనేకాంతకు సమ్మతంబయిన కాంతుని బొందుటె యొక్కనేరమా

అని వరూధిని అందించిన “ఆనందో బ్రహ్మ” విశ్లేషణని అందిపుచ్చుకుని విశాలపరుస్తుంది. భార్య ఏం తప్పుచేసినా దాని పాపఫలితం ఆమె భర్తకే చెందుతుందని ఘంటాపథంగా చాటుతుంది.

వేంకటకృష్ణప్ప మిత్రుడు శేషము వేంకటపతి తన “శశాంకవిజయము”లో ఇంకా ముందుకు అడుగేసి, తార చేత ఇలా అనిపిస్తాడు:

లోకములోన కొందరబలుల్ సతులం దనియింపలేక య
స్తోకమనీష నన్యపురుషుల్ తమకాంతల నంటకుండ తా
టాకులలోన వ్రాసిరి పరాంగన గూడిన పాపమంచు న
య్యాకుల పాటు జూచి యిపు డాకులపాటెనయంగ నేటికిన్

అసలు ధర్మశాస్త్రాలే అంతా తుస్సు; ఎందుకూ పలికిమాలినవాళ్లు తాటాకులు చెడగొట్టటానికి రాసిన రాతలే తప్ప పాటించవలసినవి కావని కుండబద్దలు కొడుతుందన్నమాట.

వేంకటపతి కూడ వరూధిని మార్గాన్ని వదలకుండా తార చేత ఇలా అనిపిస్తాడు:

సీ.
కన్నకూతురటంచు నెన్నక భారతీతరుణి గూడడె నీపితామహుండుమేనత్తయను మేర మీరి రాధికతోడనెనయడే నిన్న నీ యనుగుబావవదినె యంచు నొకింత వావిలేకయె జ్యేష్టునెలతతో బొందడె నీ గురుండుమునిపత్ని యన కహల్యను బట్టడే నీదుసహపాఠియగు పాకశాసనుండు
తే.గీ.
ఇట్టి మీవారినడతలు గట్టిపెట్టియమ్మ నే చెల్ల న్యాయంబులాడెదౌరకడకు నీరంకు నీవెరుంగని వితానదూరెదవు నన్ను జలపోరి దోసకారి

అలా, ఒక దేవవేశ్యతో మొదలైన ఈ మార్గం కొత్తపుంతలు తొక్కి గురుపత్నులు, సవతితల్లులు (సారంగధరుడు చిత్రాంగిని తనతల్లితో సమానగా చూస్తాడు గనక), కట్టుబాట్లు దాటిన ఋషిపత్నుల శృంగార వ్యవహారాల చుట్టూ (erotic transgressions) చుట్టూ కథలల్లటం లోకి పరిణమించింది. ఎలాటి సాంఘిక, రాజకీయ పరిస్థితులు ఇలాటి రచనలకి దారితీశాయో తెలియాలంటే నారాయణరావు, షుల్మన్, సుబ్రహ్మణ్యంల సింబల్స్ ఆఫ్ సబ్‌స్టాన్స్ (Symbols of Substance) పుస్తకం చదవాల్సిందే. ప్రపంచ సాహిత్యవిమర్శక లోకానికి అధునాతనపూర్వ తెలుగు సాహిత్యాన్ని పరిచయం చెయ్యటమే కాదు, తెలుగు సాహిత్యానికి ప్రత్యేకమైన స్వయంప్రతిపత్తి వున్నదని, అది సంస్కృతసాహిత్యానికి అనువాదం కాదని సహేతుకంగా, సశాస్త్రీయంగా నిరూపించిన ఈ ముగ్గురు పరిశోధకులు అత్యంత అభినందనీయులు.

ఇదివరకే ఈ వ్యాసపరంపరలో అన్నట్టు విక్టోరియన్, పాశ్చాత్య భావాల బానిసత్వంలో పడిపోయిన ప్రముఖ తెలుగు విశ్లేషకులకు విజయనగరోత్తర సాహిత్యంలో బూతు తప్ప మరేమీ కనిపించలేదు. కందుకూరి వీరేశలింగం, కట్టమంచి రామలింగారెడ్డి – వీరిలో అత్యంత ప్రభావం చూపించిన వాళ్లు. అప్పటి కావ్యాల్లో విషయాల్ని పైపైన తిరగేసి తమకు అప్పటికే వున్న అభిప్రాయాల దృష్టికోణంలోంచి (through the prism of prejudice) చూసి వాటిని ఆరడుగుల లోతున పాతెయ్యకపోతే సంఘానికి ప్రమాదమని హడావుడిగా నిషేధించడానికి కంకణం కట్టుకున్న మహానుభావుల వల్ల వందల యేళ్ల తెలుగు సాహిత్యాన్ని కట్టకట్టి అవతల పారెయ్యటం జరిగింది. వీళ్ల తరవాత వచ్చిన వాళ్లు చాలాభాగం వీళ్లభావాలకి వంతపాట పాడిన వాళ్లే కావటం తెలుగు సాహిత్యం దురదృష్టం. దీని పర్యవసానంగా షుల్మన్ లాటి వాళ్లు చెప్తేగాని దక్షిణాంధ్రసాహిత్యం గురించి ప్రపంచానికి తెలియని దుస్థితి దాపురించింది.



ఈ ప్రబంధసాహిత్యంలో గుర్తించాల్సిన మరో విషయం ఏమిటంటే – ఈ కవులు తమ నాయికల చేత చాలా అతివేల శృంగారాన్ని గట్టిగా సమర్థించే వాదనలు చేయించారు కాని చివరకు “అబ్బే, ఇదంతా ఉత్తిత్తినే!” అని తేల్చిపారేశారు. ఇందుకు వాళ్లు మూడు రకాలైన పద్ధతుల్ని వాడారు. ఒక మార్గం, వాళ్ల మాటల దూకుడుకి అసలు కారణం “మదనతాపం” అని, అందువల్ల వాళ్లేం మాట్లాడుతున్నది వాళ్లకి తెలియదని ఒక మాటతో కొట్టిపారెయ్యటం. చేమకూర, వేంకటపతి ఇందుకు ఉదాహరణలు. ఒకరకంగా ఇది కూడ పెద్దన పెట్టిన భిక్షే.

మరో మార్గం వాళ్లపని తీరాక, అంటే వాళ్లచేత మాట్లాడించాల్సినవి మాట్లాడించాక, ఆ పాత్రల్ని తెరమరుగు చెయ్యటం. చిత్రాంగి విషయంలో ఇది చూస్తాం. మరొకటి, ఎంత విప్లవాత్మకభావాలు వాళ్లచేత పలికించినా చివరికి వాళ్ల ఖర్మకి వాళ్లని వదిలెయ్యటం: అహల్య కథలో, ఎప్పటిలాగానే ఆమెకి శాపం తప్పదు. ఇక తార విషయం మరీ ఘోరం – ఆమె చంద్రుడితో వెళ్లిపోయి వుంటుంటే, ఆమెకోసం బృహస్పతి ఇంద్రుడి దగ్గరికి వెళ్లి తనగోడు చెప్పుకుని చంద్రుడి మీదికి యుద్ధానికి పంపుతాడు. అలా ఇంద్రుడి వైపు దిక్పాలకులందరూ, చంద్రుడివైపు ఇదే సందని దేవతలమీద పగతీర్చుకోవటానికి రాక్షసులందరూ – యుద్ధం చేస్తారు. (దేవదానవ యుద్ధాల్లో ఇదీ ప్రముఖమైందిగా విశ్లేషకులు లెక్కేస్తారు.)

చివరకు బ్రహ్మ వచ్చి సంధిచేసి తారని బృహస్పతితో పంపుతాడు. అలా, ఎక్కడినుంచి పారిపోవటానికి ప్రయత్నించిందో అక్కడికే ఆమెని మళ్లీ పంపటం జరుగుతుంది. ఆ తర్వాత ఆమెకి బుధుడు పుడితే వాడు నా కొడుకని చంద్రుడు, కాదూ నా కొడుకని బృహస్పతీ వాదించుకుంటే మళ్లీ బ్రహ్మ వచ్చి తారని అడుగుతాడు. ఆమె బుధుడి తండ్రి చంద్రుడే అని చెబుతుంది. దాంతో బుధుణ్ణి చంద్రుడికిచ్చి పంపుతారు. మొత్తానికి, ఆమెకి ప్రియుడూ మిగలడు, కొడుకూ మిగలడు. వదిలించుకుందామనుకున్న బృహస్పతే మిగుల్తాడు.

ఇలా ఈ పెద్దనగారి ప్రశిష్యకవులు తమ నాయికలు తెగువలో, మాటల తెంపరితనంలో వరూధినిని మించేట్టు చేసినా వాళ్లకు దానివల్ల కలిగే పర్యవసానాల్ని మాత్రం మార్చటానికి సాహసించలేకపోయారు. తమ నాయికల ద్వారా విప్లవాత్మక భావాల్ని పలికించి ఆ తర్వాత వాటికి పెద్ద విలువ ఇవ్వకుండా వాళ్లు ఆ నాయికలను సాధనాలుగా (proxies) వాడుకున్నారనుకోవచ్చు – “చూడండి మేం ఎంత కొత్తభావాల్ని ప్రజల్లోకి తీసుకువచ్చామో!” అని ఒకవంక చూపుతూ మరోవంక “అబ్బే అవి మదనతాపంతో రగిలిపోతున్న ఉన్మత్తుల ప్రలాపాలు; అవి ఎంత ప్రమాదకరమైనవో చూపటమే మా ఉద్దేశ్యం” అనటానికి అవకాశం కల్పించుకున్నారు.

ఈ కథలన్నిటికి ఒక సామాన్యాంశం – “ముసలి భర్త, పడుచు భార్య” చట్రం. అలాటి సందర్భంలో స్త్రీ తనకిష్టమైన మరో మగవాణ్ణి చూసుకోవటంలో తప్పులేదు అని చెప్తున్నట్టు ఈ కవులు నటించారా అని నా అనుమానం.


ఇందుకు భిన్నంగా ప్రబంధాల్ని రాసినవారు ఇద్దరు – రంగాజమ్మ, ముద్దుపళని. ఇద్దరూ కవయిత్రులే కావటం విశేషం. రంగాజమ్మ ఉషాపరిణయం, ముద్దుపళని రాధికాసాంత్వనం రాశారు. మనకు వెంటనే కావ్యాల పేర్లలోనే తేడా కనిపిస్తుంది – మగకవుల కావ్యాలు సారంగధర చరిత్రము, అనిరుద్ధ చరిత్రము (ఇది రంగాజమ్మ రాసిన ఉషాపరిణయ కథే), శశాంకవిజయము ఐతే స్త్రీల కావ్యాలు ఉషాపరిణయం, రాధికాసాంత్వనం!

ఉషాపరిణయం మూలకథలో అనిరుద్ధుడికి కథాప్రారంభంలో పెళ్లవుతుంది. వసంతకాలం వస్తుంది. ఉషలో కొత్త ఊహలు మొదలౌతయ్. అప్పుడామె అనిరుద్ధుణ్ణి కల్లో చూసి ప్రేమలో పడుతుంది. ఆమె స్నేహితురాలు వెళ్లి అనిరుద్ధుణ్ణి ఉష దగ్గరకు తీసుకురావటం, వాళ్ల గాంధర్వవివాహం, ఆ తర్వాత ఉష తండ్రికి ఈ విషయం తెలియటం, ఇంతలో కృష్ణుడు ఈ విషయం తెలిసి సైన్యాల్తో వెళ్లి యుద్ధం చేసి అనిరుద్ధుణ్ణి విడిపించుకుని తీసుకురావటం జరుగుతయ్.

ఈ కథనంలో మనం గుర్తించవలసిన కొన్ని విషయాలు – అనిరుద్ధుడికి అప్పటికే పెళ్లయింది కనుక ఉష అతని భార్యల్లో ఒకరుగా వెళ్తుందన్నమాట; రెండవది ఉష అనిరుద్ధుణ్ణి కల్లో చూడటానికి కారణం – వసంతఋతువు. అంటే ఆమె తన స్నేహితురాలి చేత అతన్ని తెప్పించటానికి కారణం యథావిధిగానే “మదనతాపం” అన్నమాట.

రంగాజమ్మ దీన్లో ఎన్నో మార్పులు చేస్తుంది. మొదటిది – అనిరుద్ధుడి పెళ్లి ప్రస్తావనే తేవకపోవటం. ఆమె కథనంలో అనిరుద్ధుడు బ్రహ్మచారే. ఇక ఉష అనిరుద్ధుణ్ణి కోరుకోవటానికి చాలా బలమైన, సంప్రదాయబద్ధమైన కారణాన్ని తయారుచేస్తుంది రంగాజమ్మ: ఆమె తండ్రి బాణాసురుడు శివుడి గురించి ఘోరతపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. వాడు శివుణ్ణి వచ్చి తన కోటగుమ్మం దగ్గర కాపలాగా ఉండమంటాడు. అలా శివపార్వతులు కోటవెలుపల తోటలో శృంగారక్రీడలో వుండగా ఉష వాళ్లని చూస్తుంది. పార్వతి ఉషని ఆదరించి, “నీకు త్వరలో వివాహం ఔతుంది, వైశాఖ శుక్ల ద్వాదశి రాత్రి నీకు ఎవరు కలలో కనిపిస్తాడో, అతనే నీకు భర్త” అని చెప్తుంది. ఆ తర్వాత మిగిలిన కథ ఒకటే. కాని ఈ రెండు మార్పులతో రంగాజమ్మ ఉష పాత్రని చాలా ఉదాత్తంగా తీర్చిదిద్దింది. ఆమె కథనం ప్రకారం అనిరుద్ధుణ్ణి ఆమె కోరుకోవటం అనేది పార్వతీదేవి వరం వల్ల జరిగిందన్న మాట. మగకవులు “వసంతకాలం వల్ల వచ్చిన మదనతాపం” గా చూపించిన కారణాన్ని ఆమె అలా దేవీవరప్రభావంగా మార్చటం సాహసం. అలాగే అనిరుద్ధుడికి అప్పటికే వివాహం అయివుండటాన్ని కూడ మార్చి వాళ్ల ప్రేమకి పవిత్రతని సమకూర్చింది.

ముద్దుపళని విషయానికి వస్తే, ఆమె రాధా-కృష్ణుల సంబంధాన్ని విష్ణులీలగా చిత్రిస్తుంది. ఆమె కథనంలో రాధ నందుడి చెల్లెలు, కృష్ణుడికి మేనత్త. అతనికన్న వయసులో పెద్దది. అతనికి శృంగారరహస్యాలు నేర్పించినది. కనుక పాఠకులు “ఈ వ్యవహారమేదో సరిగా లేదే” అనుకునే ప్రమాదం ఉంది. అందుకు విరుగుడుగా ఆమె రెండు పనులు కథ మొదల్లోనే చేసేస్తుంది – ఒకటి, రాధాకృష్ణుల లైంగికసంబంధంలో ఎలాటి రహస్యమూ లేదని, వ్రేపల్లెలో అందరికీ ఆ విషయం తెలుసునని చెప్పటం, రెండవది – కృష్ణుడు బాలరూపంలో వున్న విష్ణువని అక్కడే స్పష్టం చెయ్యటం. ఆమె వాడిన మరో సాధనం, ఆమె ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించిందో చూపిస్తుంది – కావ్యం అంతటా, వాళ్లిద్దరి శృంగారసందర్భం వచ్చినప్పుడల్లా కృష్ణుడిని విష్ణువుకున్న పేర్లతో సంబోధించటం. అలా, రాధ సంబంధం విష్ణువుతోనని, కృష్ణుడు కేవలం విష్ణుని మానవరూపం అని రంధ్రాన్వేషకుల్ని ముందుగానే హెచ్చరించటం అన్నమాట.

ఇలా ఈ ఇద్దరు కవయిత్రులు వరూధిని ప్రభావాన్నుంచి తమ నాయికల్ని కాపాడుకోవటమే కాదు, చేమకూర, వేంకటపతి, వేంకటకృష్ణప్పల లాగా అతివేలశృంగారకథనాలనుంచి (from erotic transgressive narrative) తమ కథనాల్ని కాపాడుకున్నారు. వాళ్ల రచనల్లో శృంగారం వున్నా (ముద్దుపళని విషయంలో అది శ్రుతి మించినట్లనిపించినా) దాన్ని సంసారపక్షంగానే ఉంచారు తప్ప విపరీతమార్గాలకు మళ్లించలేదు. ఒకమాటలో చెప్పాలంటే, మగకవులు పెద్దనని అనుసరిస్తూ తమ నాయికలు వరూధినిని మించిపోవటానికి నానాతిప్పలూ పడితే, కవయిత్రులు తమ రచనలకి పెద్దన గాలి తగలకుండా జాగ్రత్తపడ్డారు.

ముద్దుపళని గురించి మరో విశేషం — ఆధునికపూర్వ కాలంలో ఇంత స్వతంత్రంగా, విశృంఖలంగా రాసిన రచయిత్రి నాకు తెలిసినంతవరకూ భారతీయసాహిత్యంలో మరొకరు లేరు!


ఆధారగ్రంథాలు

  1. Söhnen-Thieme, Renate. “The Ahalya Story Through the Ages.” Myth and Mythmaking: Continuous Evolution in Indian Tradition, edited by Julia Leslie, Curzon Press, 1996, pp. 39–62.
  2. Doniger, Wendy. “Sita and Helen, Ahalya and Alcmena: A Comparative Study.” History of Religions, vol. 37, no. 1, 1997, pp. 21–49.

Both are available online.

    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    కొడవళ్ళ హనుమంతరావు November 8, 2026 5:41 pm

    వ్యాసంలోని ప్రధాన విషయంపై నాకు అంతగా అవగాహన లేకపోయినా, రెండు మూడు అంశాల్లో భిన్నాభిప్రాయముంది.

    “పెద్దన చేసిన ఒక సాహసం వరూధిని అనే పాత్రను సృష్టించటం. అదివరకు ఎన్నో స్త్రీపాత్రలు వచ్చాయి కాని వరూధిని వంటి వ్యక్తిని సృష్టించే పరిస్థితులు, కవులు అంతవరకు రాలేదు. కృష్ణదేవరాయల పాలన నాటి రాజకీయ, సాంఘిక స్థితిగతులు పెద్దనవంటి వారు విలాసభరితమైన సాహిత్యాన్ని, విలాసులైన స్త్రీపాత్రలను నిర్మించటానికి అనుకూలమయ్యాయి.”

    మనుచరిత్ర కథకూ, వరూధిని పాత్రకూ మూలం రాయల కాలానికి ఎన్నో శతాబ్దాల ముందటి మార్కండేయ పురాణం. పెద్దన ఆ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దినా, ఆయనే సృష్టించాడనడం చారిత్రకంగా సరికాదు.

    “ఇదివరకే ఈ వ్యాసపరంపరలో అన్నట్టు విక్టోరియన్, పాశ్చాత్య భావాల బానిసత్వంలో పడిపోయిన ప్రముఖ తెలుగు విశ్లేషకులకు విజయనగరోత్తర సాహిత్యంలో బూతు తప్ప మరేమీ కనిపించలేదు. కందుకూరి వీరేశలింగం, కట్టమంచి రామలింగారెడ్డి – వీరిలో అత్యంత ప్రభావం చూపించిన వాళ్లు. అప్పటి కావ్యాల్లో విషయాల్ని పైపైన తిరగేసి …”

    ఈ ఆరోపణకు ఆధారమేమిటి? కట్టమంచి “కవిత్వతత్త్వ విచారము” చదివాను. విజయనగర పతనం తర్వాత తెలుగు కవిత్వం క్షీణించిందని ఆయన అభిప్రాయపడ్డ మాట నిజమే. కానీ ఆయన విమర్శ కేవలం శృంగార వర్ణనలకే పరిమితం కాలేదు. ప్రబంధాల్లో కథానిర్మాణం, పాత్రచిత్రణ, పునరుక్తి, మితిమీరిన వర్ణనల వంటి అంశాలను సోదాహరణంగా విమర్శించాడు. తరువాతి ప్రబంధాలను విమర్శిస్తూనే, “చేమకూర వేంకటపతి కృతులు దప్ప” అని స్పష్టంగా మినహాయించాడు.

    విజయనగరోత్తర సాహిత్యంపై కట్టమంచి తీర్పును ప్రశ్నించవచ్చు. కానీ ఆయనకు ఆ సాహిత్యంలో బూతు తప్ప మరేమీ కనిపించలేదని, ఆయన విమర్శనంతటినీ విక్టోరియన్, పాశ్చాత్య భావాల బానిసత్వంగా కొట్టిపారేసే ముందర కాస్త ఆధారాలు చూపించాలి. ఈ సందర్భంలో వల్లంపాటి రాసిన “కట్టమంచి వారి ‘కవిత్వతత్వ విచారం’” చదవదగ్గది.

    కొడవళ్ళ హనుమంతరావు

  2. 2
    K.V.S. Ramarao November 9, 2026 2:59 pm

    కొడవళ్ల హనుమంతరావు గారి అభిప్రాయం చాలా సంతోషం కలిగించింది – వారు ఈ వ్యాసాన్ని పూర్తిగా చదవటమే కాకుండా ప్రశ్నలు కూడ లేవదీసినందుకు.

    మొదటిది వరూధిని గురించి. ఆ పాత్ర మార్కండేయ పురాణ కథలో ఉందికదా, పెద్దన సృష్టించాడనటం భావ్యమేనా అని ప్రశ్న. నా అభిప్రాయంలో పాత్రల పేర్లు ఒకటై, ప్రవర్తనలో సామ్యం ఉన్నంతమాత్రాన రెండూ ఒకటి కావు; పెద్దన వరూధిని మాటతీరు గాని, తార్కిక ప్రతిభ గాని మూల వరూధినిలో లేవు. పెద్దన వరూధిని, నా అభిప్రాయంలో, ఒక స్వయంప్రతిపత్తి వున్న వ్యక్తి, మూలంలోని వరూధినికి, ఈ వరూధినికి ఎంతో వ్యత్యాసం వుంది. అందరికీ అందుబాటులో ఉంటుందని ఇక్కడ మార్కండేయ పురాణంలో ప్రవరుని ఘట్టం ఆంగ్లానువాదానికి లంకె ఇస్తున్నాను, చూడండి. https://www.wisdomlib.org/hinduism/book/the-markandeya-purana/d/doc117114.html . ఈమాటలో చాలాకాలం క్రితం మనుచరిత్ర తొలి రెండాశ్వాసాలు ఉంచాను. బేరీజు వేసి చూసుకోవచ్చు.

    ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఈ పద్యం చూడండి:

    ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడుదు భూసురేంద్ర యే
    కాంతమునందు నున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా
    గింతియె కాక నీవెరుగవే మును వచ్చిన త్రోవ చొప్పు నీ
    కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్

    ఒక్కసారి కళ్లు మూసుకుని ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి – “ఇంతలు కన్నులుండ” అనే ఎత్తుగడలోనే ఆమె గడుసుదనం కనబడటం లేదూ? “ఏకాంతమునందు నున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లాగు” అని అతని మీద కృత్రిమకోపాన్ని చూపటం, “ఇంతియె కాక నీవెరుగవే మును వచ్చిన త్రోవ చొప్పు” అని నీ దొంగాట నాకు తెలియదా అన్నట్టు ప్రశ్నించటం, “నీకింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె” అని బింకాన్ని ప్రదర్శించటం, ఆ వెంటనే తన మనసులోని తొందరపాటుని బయటపడేస్తూ “మాటలేటికిన్” అని అతన్ని తొందరచెయ్యటం – ఇన్నిన్ని భావాల పరంపరని ఒక్క చిన్నపద్యంలో మనముందు పరిచాడు పెద్దన.

    ఇదొక్కటే కాదు, వరూధిని పలికే ప్రతి మాట, దాని వెనక వుండే ధ్వని, దానితో కదిలే వరూధిని హావభావాలు – ఒక్కొక్కపద్యాన్ని ఒక రసగుళికగా చేసినయ్.

    ఈ వరూధినికీ మార్కండేయ పురాణంలో ప్రవరుణ్ణి ప్రాధేయపడుతూ కొన్నాళ్లైనా ఉండమని వేడుకుంటూ ‘పూలిస్తాను, పండ్లిస్తాను, వాడిపోని యవ్వనమిస్తా’ నని బతిమాలుకునే వరూధినికీ పోలికైనా వుందా?

    రెండవది కట్టమంచి వారి గురించి. విదేశాలకు వెళ్లాక తెలుగు సాహిత్యం మీద తనకున్న అభిప్రాయాలు ఎంతో మారాయని పుస్తకం అవతారికలో తనే రాసుకున్నారు, అది నేను కనుక్కున్న విషయం కాదు. “మనుచరిత్రము వసుచరిత్రము వీనికి నడుమ వ్రాయబడిన గ్రంథములును ఇంత గుణశూన్యములు కావు. చేమకూర వేంకటకవి కృతులు తప్ప అను సమయము గూఢము” అని ఒక ఫుట్ నోట్ లో అన్నారు; బాగుంది. ఆ తర్వాత పాశ్చాత్యకవుల సద్గుణాల్ని తనివితీరా కీర్తించాక మరో ఫుట్ నోట్ లో “ఇచట నైరోపాలోని కళలగూర్చి చెప్పబడిన స్తుతియంతయు భారతాదుల రచించిన మన పూర్వుల యందును జెల్లును. చెల్లనివారెవరనగా దేశక్షయకాలపు హిందూకవులగు ప్రబంధకారులు.” అని ప్రకటించారు కదా! ఇకపోతే, వారు ప్రస్తావించిన కొన్ని టాపిక్‌లు: “ప్రాచీనుల మోహతాపము”, “తుచ్చశృంగారములకు గారణములు మన యనాచారములు”, “అసహ్యశృంగారము”, “తుచ్చశృంగారములకు హేతువులు”.

    కవిత్వతత్త్వవిచారం నుంచి అనేక పుటల్ని ఆధారాలుగా చూపించవచ్చు గాని అవన్నీ టైప్ చేసే ఓపిక ఇప్పుడు లేదు. పరుచూరి శ్రీనివాస్ గారు పంపిన డిజిటల్ కాపీ నాదగ్గర వుంది; చదవాలని నిజంగా ఉత్సాహం వున్నవారుంటే ఈ పత్రిక ప్రస్తుతసంపాదకులకు దాన్నిపంపి సైట్ లో ఉంచమని కోరతాను.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • టాస్
  • తానా 2011 ప్రసంగాలు: సాంప్రదాయ సాహిత్యం
  • తానా 2011 ప్రసంగాలు: సాహిత్య ప్రక్రియలు
  • ఈమాట జులై 2013 సంచికకు స్వాగతం!
  • గడి-నుడి 7 సమాధానాలు

ఇటువంటివే…

  1. ఇద్దరు కవయిత్రులు – రెండు అభివ్యక్తులు
  2. నాకు నచ్చిన పద్యం: కైలాసాన్నే కాదన్న వీరవనిత
  3. మహాకవి రావిపాటి త్రిపురాంతకుడు – V: అంబికా శతకము
  4. నింగీ, నీరూ, నికోబార్-4
  5. కంప్యూటర్ చిప్ కథ – 19: కూలిపోని హైడ్రోజన్ పరమాణువు – బోర్ క్వాంటం సిద్ధాంతం

నవంబర్ 2026 సంచికలో ...

  • ఇలియాడ్: రణరంగం-IV
  • కంప్యూటర్ చిప్ కథ – 19: కూలిపోని హైడ్రోజన్ పరమాణువు – బోర్ క్వాంటం సిద్ధాంతం
  • చిన్న రిక్వెస్ట్
  • తప్పిపోయిన కవిత
  • నవంబరు 2026
  • నా కవిత్వం రంగు రంగుల పువ్వులు
  • నింగీ, నీరూ, నికోబార్-4
  • పుణ్యకూపం!
  • పెద్దనగారి ప్రశిష్యులు, కాదన్న కవయిత్రులు
  • పేజీల మధ్య
  • బ్రతుకు రచన
  • మంకుతిమ్మని మరో మిణుకు – 10 (91-100)
  • మహాకవి రావిపాటి త్రిపురాంతకుడు – V: అంబికా శతకము
  • మాయదారి మాబుగాడు
  • యూట్యూబ్ లో ఈమాట: నవంబర్ 2026
  • రెండు కృష్ణబిలాలు
  • సీతాంజనేయ సంభాషణం – VI
  • సురుకు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఇలియాడ్: రణరంగం-IV
మాయదారి మాబుగాడు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.