హెక్టర్
గ్రీకు సేనల భయంకరమైన ప్రతిఘటన గురించి రకరకాలుగా వస్తూన్న వార్తలు విని వాటిలో నిజానిజాలు ఏమిటో తేల్చుకుందామని ట్రోయ్ నగరపు స్త్రీలు ప్రయాం రాజావారి రాజప్రాసాదం ముందు గుంపులు గుంపులుగా చేరేరు.
అప్పుడు కోట ద్వారం వద్ద, రథం మీద లోనికి ప్రవేశిస్తూ, యువరాజు హెక్టర్ ప్రత్యక్షమయేడు. అతని ముఖం స్వేదావృతమై ఉంది. అతని శరీరం అంతా దుమ్ము, ధూళి, మట్టి, బురదతో మురికిగా కనిపించింది. రథాన్ని లాగుతూన్న గుర్రాల శరీరాలు పొడుగాటి రక్తపు జీరలతో బురదపట్టి మురికిగా ఉన్నాయి.
హెక్టర్ తల్లి, రాణి హెకూబా, వ్యాకులతతో రాజప్రాసాదపు మెట్లు దిగి, పరుగున వచ్చి, కొడుకుని హృదయానికి హత్తుకుని, “నాయనా! నువ్వు రణరంగాన్ని విడచి వచ్చేవంటే ఇంకా ఘోరమైన రోజులు ముందు ఉన్నాయన్నమాట. పరిచారికలు ద్రాక్ష మదిర పట్టుకొస్తున్నారు. దానిని జూస్ దేవుడికి నైవేద్యం పెట్టి, నీవూ కాసింత తాగి, ముందు కాసింత విశ్రాంతి తీసుకో.”
“అమ్మా! చూస్తున్నావు కదా! రక్తసిక్తమై, మురికిగా ఉన్న ఈ అవతారంతో దేవుడికి నైవేద్యం ఎలా పెడతాను? ముందు ఇక్కడ సమావేశమైన ఆడంగులందరినీ అథీనా ఆలయానికి తీసుకెళ్లి ఆమె కృపావీక్షణాలను కోరుకోండి. ఈలోగా నేను పేరిస్ ఎక్కడున్నాడో వెతుక్కొస్తాను. యుద్ధంలో నాకు సహాయం చెయ్యమని అడిగి చూస్తాను. నిజానికి, ఈ జగడం వాడి వల్లనే కదా వచ్చింది?”
హెలెన్ అంతఃపురంలో కనిపించేడు పేరిస్. అక్కడ అల్లికలు ఎలా అల్లాలో పరిచారికలకి హెలెన్ చెబుతూ ఉంటే పేరిస్ మిలమిలా మెరుస్తూన్న తన డాలును ఎదురుగా పట్టుకుని, అందులో తన ప్రతిబింబం చూసుకుని ఆనందిస్తున్నాడు.
ఆ దృశ్యం చూసేసరికి హెక్టర్కి చిర్రెత్తుకొచ్చింది. “ఇక్కడ గోళ్ళు గిల్లుకుంటూ ఎలా కూర్చోగలుగుతున్నావ్? అక్కడ మన సైనికులు శత్రువుల చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారే! అక్కడ మన ఆడంగులు భరించరాని రీతుల్లో భయపడి విలవిలలాడుతున్నారే! ఇక్కడ నువ్వు నీ డాలుకు మెరుగులు దిద్దుతూ అందులోనే నీ ప్రతిబింబాన్ని చూసుకుని మురిసిపోతున్నావా? నువ్వు మమ్మల్ని అందరినీ నట్టేట ముంచేవు కదా! ట్రోయ్ నగరం పతనమైపోతూ ఉంటే నీకు చీమ కుట్టినట్లయినా లేదా?”
హెక్టర్ ఆగ్రహజ్వాలలకు ఆ ప్రేమపక్షులు ఇద్దరూ అవాక్కయిపోయేరు.
ఒక్క నిమిషంలో తేరుకుని, “ఎందుకు లేదు? అందుకనే కదా ఇప్పుడు తక్షణకర్తవ్యం ఏమిటని సలహా అడగడానికి హెలెన్ దగ్గరకి వచ్చేను. నన్ను యుద్ధరంగంలోకి వెళ్ళమనే హెలెన్ ప్రోత్సహిస్తూంది. అందుకనే కదా నా డాలుకి మెరుగులు దిద్దుతున్నాను? ఇదిగో, ఇప్పుడే నా కవచాన్ని, నా శిరస్త్రాణాన్ని ధరించి నేను నీ వెనకాతలే వస్తున్నాను. నువ్వు ముందు పద!”
హెక్టర్ సమాధానం ఇవ్వకుండా తీక్షణంగా హెలెన్ వైపు చూసేడు. ఆమె తన దోసిట్లో ముఖాన్ని దాచుకుని, “ఓ! హెక్టర్! ఏమి పాడు పుట్టుక పుట్టేను. నా వల్లనే కదా మీ అందరి మీదా ఈ ఉపద్రవం వచ్చిపడింది. తప్పంతా నాది. పేరిస్ మీద కినుక వలదు. పేరిస్ నైజమే అంత. ఆతను ఇహ మారడు. మారలేడు. అందుకనే పేరిస్కి ఏమి ప్రమాదం ఎదురవుతుందో అని నేను ఎల్లప్పుడూ భయపడుతూ ఉంటాను,” అంటూ దీనవదనంతో ఆమె హెక్టర్ వైపు చూసింది. చూసి, ఓదార్పు వదనంతో తన పక్కన కూర్చోమని సైగ చేసింది. “హెక్టర్! నిన్ను చూస్తూ ఉంటే జాలి వేస్తూంది. ఇలా రా. వచ్చి నా పక్కన కూర్చుని కాసింత సేద తీర్చుకో!”
హెక్టర్ ఆమె ఓదార్పు మాటలను నిరాకరిస్తూ, తలా అడ్డుగా తాడించి, “విశ్రాంతి తీసుకోడానికి ఇది సమయమూ, సందర్భమూ కాదు. అక్కడ రణరంగంలో నా రాకకోసం ఎదురుచూస్తున్నారు. తిరిగి వెళ్ళేలోగా నేనొకసారి నా భార్య ఆండ్రొమాకేని, నా కొడుకు స్కామాండ్రియస్ని కలుసుకోవాలి. మళ్ళా నా భార్యని, నా కొడుకుని ఎప్పుడు చూస్తానో తెలియదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో నీకు తెలుసా?”
హెలెన్ తెలియదని చెప్పింది.
వాళ్ళకోసం హెక్టర్ రాజభవనం అంతా పరుగు పరుగున వెతికేడు. వాళ్ళు ఎక్కడా కనబడలేదు. నగరాన్ని వదలిపెట్టి యుద్ధరంగంలోకి వెళుతూ ఉంటే, దూరంగా, జనసందోహంలో, పిల్లాడిని చంకలో వేసుకుని పరిగెత్తుకు వస్తూ ఆండ్రొమాకే కనిపించింది! జలపాతాల్లా కారుతూన్న అశ్రుధారలతో ఆమె హెక్టర్ని వాటేసుకుని, భోరుమని ఏడ్చింది. “గ్రీకు సేనలు కోటని ముట్టడిస్తున్నాయని విన్నాను. విని అది ఎంత నిజమో చూద్దామని బయలుదేరేను. నీ ధైర్యం నీ పతనానికి కారణం కాకూడదు కదా. నువ్వు బయటకి వెళ్ళి శత్రువులను తరిమికొట్టడంకంటే లోపల ఉండి మన కోటను రక్షించడం ముఖ్యం కదా?”
హెక్టర్ అయిష్టంగానే భార్య కోరికని నిరాకరించేడు. “నేను అలా చెయ్యలేను. ఇప్పుడు నేను వెనక్కి తగ్గితే బ్రతికి ఉన్నంత కాలం తలెత్తుకు తిరగలేను. నా గురించి అనవసరంగా బెంగ పెట్టుకోకు. నాకు రాసిపెట్టిన కాలం ఉన్నంతసేపూ నన్నెవరూ చంపలేరు. నా కాలం చెల్లిపోయిన తరువాత మరణంనుండి నన్ను ఎవ్వరూ రక్షించనూలేరు. మన కొడుకుని నీతో తీసుకెళ్ళి జాగ్రత్తగా పెంచు. యుద్ధాన్ని మగవారికి వదిలేయ్! ట్రోయ్ పురుషులు యుద్ధం చెయ్యడానికే పుట్టేరు. జయాపజయాలు దైవాధీనాలు!” అంటూ భార్యనూ, కొడుకునూ కౌగలించుకుని, రథం ఎక్కి, వెనక్కు తిరిగి చూడకుండా, కొరడాను ఝళిపించేడు. మెరుస్తూన్న కవచ శిరస్త్రాణాలతో పేరిస్ అతణ్ణి అనుసరించాడు.
(సశేషం)