పదిలక్షల పాదాలు

ఔసేపచ్చన్ అన్నాడు “ఈరోజు శుక్రవారం, అత్యంత శ్రేష్టం. సెయింట్ అంతోనీ పండుగ దినం. పైగా సాయంసంధ్యా సమయం. నాలాంటి నిజవిశ్వాసి అయిన నస్రానీ మార్థోమా క్రైస్తానుడికి చాలా పవిత్రమైనది.”

“అవునవును,” అన్నాడు కుమారన్ మాస్టర్.

“చల్లని సముద్రపు గాలి వీస్తున్న ఈ ఆహ్లాదకరమైన వేళలో ఈ దినాన్ని రకరకాలుగా గబ్బు పట్టించి నానా రభసా చేసి సెలబ్రేట్ చేసుకోడం పాపకార్యాల్లో మునిగి తేలడం. అంతకంటే మించి తెల్లోళ్ళ ఆడవాళ్ళను గుర్తుతెచ్చే సీసాల్లో పోసిన విదేశీ సారాను నిరాకరించి, మన కొచ్చిన్‍లోనే, సౌందర్య శోభాయమానమైన చాండిలంకలో, స్వచ్ఛతకు మాఱుపేరైన మనోడు అవఱాచ్చన్ స్వయంగా కాచివడబోసిన ప్రకృతిసిద్ధమైన నాటుసారాను తాగి, ఆధ్యాత్మిక ఉన్నతి పొందటమే గొప్ప భాగ్యం అని భావిస్తున్నాను. హల్లేలూయా!”

ఔసేపచ్చన్ తనగ్లాసును పైకెత్తగానే మిగిలినవాళ్ళు “ఆమెన్!” అంటూ వాళ్ళు కూడా తమ గ్లాసులు పైకెత్తారు.

“ఈషో మిసిహాయ్కి స్తోత్రము!” అంటూ ఔసేపచ్చన్ గాఢంగా ఓ నిట్టూర్పు విడిచాడు.

“మంచి సారా! మనోడు అవఱాచ్చన్, మంచి విశ్వాసపాత్రుడైన మార్థోమా క్రైస్తవుడు. పూర్వం ఆ ఏసునాథుని పన్నెండు శిష్యులలో ఒకడైన సెయింట్ థామస్, సముద్ర ప్రయాణం చేసి కొచ్చిన్ మెరైన్ డ్రైవ్‌లో చేతిలో బైబిల్‌తో పాటు శిలువ పట్టుకుని ఓడ దిగినప్పుడు…”

శ్రీధర్ “మార్క్సిస్టులు పరిగెత్తుకుంటూ వెళ్ళి దింపుడు కూలీ వసూలు చేసుంటారుగా?” అన్నాడు.

“ఛా, ఛా, అయన పట్టుకొచ్చింది ఒక చిన్న శిలువ. ఆయన దాన్ని తన మెడలోనే వేసుకుని వచ్చాడు” అన్నాడు ఔసేపచ్చన్. “దాన్ని చూసిన ఈ అవఱాచ్చన్ పూర్వీకులలో ఒకడు అదేంటని అడిగాడు. అవఱాచ్చన్ వాళ్ళ తాత మెడలో వేసుకున్న పూసల దండలో మోదుగుకర్రతో చేసిన ఒక పుల్ల వేలాడుతుండేది. అది గులిగన్ అనే దేవుడికి చెందినది. అ పూసల దండే ‘జపమాల’ అయింది. గులిగన్ సారాకు సంబంధించిన దేవుడు. మనూర్లో నాటుసారా కాచే వాళ్ళు సారాయి పాకం చెడకుండా సరైన మోతాదులో దిగిరావాలని ఆ పుల్లను మెళ్ళో వేసుకునేవాళ్ళు. దాన్నొక చేత్తో పట్టుకుని ‘ఆలాలోగుళిగా’ అని కేకేస్తూ భాండీలో మరిగే ద్రావకాన్ని కలియదిప్పితేనే ఊరబెట్టిన సారా ముడిసరుకు మనసు మురిసి మేలైన సారా చుక్కలను జారవిడుస్తుంది. ఒరేయ్! అరవ కథలు రాసుకునే ఎదవ నాయాలా, ఈ సారా అన్నది ఏంటి? అదొక కనిపించే దైవం. అందరు దేవుళ్ళూ ఆ గబ్బు మురుగునీళ్ళల్లోంచి పుట్టుకొచ్చినవాళ్ళే. మీ విష్ణుమూర్తి కూడా విరిగిన పాలలోంచేగా వచ్చాడు?”

నేను దాన్ని ఎంతో చాకచక్యంతో దాటేసి “సెయింట్ థామస్ ఏమన్నాడు?” అని అడిగాను.

“తాను ధరించినది ‘దొరల జపమాల’ అని సెయింట్ థామస్ అన్నాడు. దాని మెళ్ళో వేసుకుని సారా వడబోసినప్పుడే సారాలో ద్రాక్ష సువాసన వస్తుంది అని చెప్పి తన చేతిలోనున్న సీసాని వాసన చూడమన్నాడు. దాని వాసన చూసిన అవఱాచ్చన్ పూర్వీకుడు తక్షణమే ఓ గొప్ప పారలౌకికమైన అనుభూతి పొందినవాడై, వెంటనే ఆ దొరల జపమాలను మెడలో వేసుకున్నాడు. ఇలా మార్థోమా మతం అనే పరిశుద్ధమైన మతం ఇక్కడ వేళ్లూనుకుని పెనువృక్షమై విస్తరించింది” అన్నాడు ఔసేపచ్చన్. “అందుకే మేము మా మతాన్ని స్పిరిచువల్ అని అంటాము.”

“మట్టాంజేరికి కదా సెయింట్ థామస్ వచ్చింది?” అని అడిగాను నేను.

“అలా అని వేరే చరిత్ర పుస్తకంలో రాసుంది. చరిత్ర ఎదిగేటప్పుడు చరిత్ర పుస్తకాలు కూడా ఎదుగుతాయి. మన భారతీయ జనతా పార్టీ ప్రియతమ నాయకుడు ఈ భరత పుణ్యభూమి ప్రతిష్టను పెంపొందిస్తున్న ఈ పవిత్రమైన దశలో…”

మాటల్ని దారి మళ్ళిద్దామని “ఇప్పుడు చిన్న చిన్న లంకల్లో కూడా సారా తయారు చేస్తున్నారుగా?” అన్నాను నేను.

“ఇక్కడ సారా కాయడం అన్నది సంస్కృతిలో భాగం, కాదు కాదు ఒక మతం” అన్నాడు శ్రీధర్.

“నేనెక్కడున్నాను? ఆ… గుర్తొచ్చింది. ‘ఆలాలోగుళిగా’ అని అరిచే ఇక్కడి సంప్రదాయాన్ని అవఱాచ్చన్ పూర్వీకులు ‘హాలేలూయా’ అని మార్చుకున్నారు. సారాను తాగడానికి వచ్చిన నా పూర్వీకుడైన ఒచ్చప్పన్ నాయర్ పూటుగా తాగేసి తెగ ముగ్ధుడై అలా ఔసేపచ్చన్‌గా మారిపోయాడు. ఇలా ఈ పవిత్ర ద్రావకం ఇక్కడ తయారవ్వడం మొదలైంది. పిచ్చి నాయాలా! అసలు ఈ కేరళ క్రైస్తవం అంటే ఏంటి? అది ఒక గొప్ప నాటు సారా, చాలా పవరుఫుల్లు. దాని గురించి రచయిత పాల్ జకారియా ఒకసారి ఏమన్నాడంటే…”

“మనం ఇప్పుడు సురియాణి క్రైస్తవుల గురించి మాట్లాడుకోవద్దు… అలా చేస్తే ఆ దేవుడి మీద ఒట్టే!” అన్నాడు శ్రీధర్.

“సురియాణీ క్రైస్తవుల్లో పాల్ జకారియా ఒక దేవుడు, లూసిఫర్‌లాగా పతనమై పోయిన ఒక దేవుడు.”

“అలాగయితే బోంజిక్కరై రఫి గురించి మాట్లాడుకుందామా?” అని అడిగాడు ఔసేపచ్చన్.

“ఆయనెవరు?”

“ఒకానొకప్పుడు అద్భుతమైన కథలు రాసే రచయిత కాబోయిన వాడు” అన్నాడు ఔసేపచ్చన్. “పాపం ఒక్కటీ సరిగ్గా వచ్చి చావలేదు. అతనికి రచయిత పొన్‌కున్నం వర్కీ మీద చాలా కడుపుమంట ఉండేది. ఎందుకంటే వర్కీ కూడా అద్భుతమైన కథలు రాయాలని ఆశపడి భంగపడినవాడే. ఇద్దరు క్రైస్తవులు ఒకరినొకరు తిట్టుకునే సమయాల్లో ప్రభువు సభలో గంట మోగుతుంది అని అంటారు,” అంటూ ఔసేపచ్చన్ త్రేన్చి కొనసాగించాడు “అక్కడ ఆగని ఉరుముల మోతలా ఎల్లప్పుడూ గంటల మోతే. దేవతలందరూ చాలా కాలం క్రితమే చెవిటివాళ్ళైపోయారని ఆమోస్ పుణ్యాత్ముడు తన సందేశంలో చెప్పాడు.”

“నాటుసారా అన్నది సనాతన ధర్మం! పులిసిన కొద్ది తీపెక్కుతుంది. తల్లి మతానికి తిరిగొచ్చిన ఔసేపచ్చనుకు శుభాకాంక్షలు” అన్నాడు ఎలుకేశవన్. ఎలుక అన్న పేరుతో తను ఒక కథ రాశాక అదొచ్చి అతని పేరుకు అంటుకుంది.
నేను సంభాషణను వేరే దారి మళ్ళించాలని ఆశపడ్డాను. అసలే నాటుసారా. దీనికి తోడు క్రైస్తవ, హిందూమతాల మీద చర్చ అంటే అది ‘బాత్ టబ్బులో నూనె నింపి అందులో పడుకుని సంభోగం చేసే ఒక ప్రత్యేకమైన థాయ్ మస్సాజ్ లాటిది’. అలా అని చెప్పింది కూడా ఔసేపచ్చనే. ‘చర్య నిర్విరామంగా సాగుతుందిగానీ, నాయాల్ది! క్లయిమాక్సుకు చేరనివ్వదు.’

దూరాన సముద్రంలో నెమ్మదిగా తేలుతూ సాగుతున్న పెద్ద నావ ఒకదాన్ని చూపించి “ఎంత పెద్ద నావ! మొత్తం కర్రతో చేసినట్టున్నారు. ఇలాంటివి ఇంకా తయారు చేస్తున్నారా?” అని అడిగాను.

నేను అనుకున్నట్టుగానే ఔసేపచ్చన్ అటు పక్కకు తిరిగాడు. “దాన్ని పత్తేమారి అనీ పతమార్ అనీపిలుస్తారు. మన దేశపు పది రూపాయల నోటు మీద గాంధీ బొమ్మ లేని రోజుల్లో నోటు మీద దాని ఫోటో ఉండేది. ‘పతమార్’ అరబిక్ పేరు. తెలియనివాళ్ళు దాన్ని ఉరు అని అంటారు. ‘ఉరు’ అంటే పెద్ద సైజులో తయారు చేయబడినది అని అర్థం. దూరం నించి చూస్తే సముద్రంలో చిన్న పడవలా కనిపిస్తుంది. అసలు సముద్రం మీద అన్నీ చిన్నవిగానే కనిపిస్తాయి. దాన్ని నువ్వు నేలమీదున్నప్పుడు చూడాలి. అదొక ఐదు అంతస్తుల భవనమంత ఉంటుంది.”

“మొత్తం కర్రతో చేసిందే కదా?” అని అడిగాను.

“అవును మొత్తం కర్రే. ఒక్క ఇనప మేకైనా ఉండదు. అంతా కర్రతో చేసిన మేకులే. అందుకనే అది ఎక్కడా తుప్పుపట్టకుండా వందేళ్ళుపాటు సముద్రయానం చేసినా నిలుస్తుంది. ఇప్పుడు మంగళూరునుండి మాల్దీవుకి వెళ్ళే పత్తేమారీల్లో ఇలా వందేళ్ళు దాటి పనిచేస్తున్నవి ఓ ఇరవైకి పైనే ఉన్నాయి.”

“వాటిని ఇక్కడ తయారు చేస్తారా?” అని అడిగాను.

“ఇక్కడ మన కోళికోడు బేప్పూర్లోనే చేస్తారు. దాన్ని నిర్మించేవాళ్ళను మాపిళా కళాసీలంటారు. స్థానిక వడ్రంగులతో కలిసి వాళ్ళు వీటిని నిర్మిస్తుంటారు. ఇస్లాము పుట్టకముందునించే వీళ్ళకు అరేబియాతో రాకపోకలుండేటివి. చోళుల కాలంలో వీ‌ళ్ళ వైభవం మాగొప్పగా ఉండేది. ఓ వెలుగు వెలిగినవాళ్ళు. పదిహేడో శతాబ్దంలో ఫిరంగులతో ఐరోపావాళ్ళు ఓడల్లో వచ్చి పచ్చిమ తీరాన్ని ఆక్రమించుకునేదాకా అరేబియన్ సముద్రం వాళ్ళ చేతి క్రిందనే ఉండేది. ‘అరేబియా సముద్రం మన ఇంటి గుమ్మం’ అంటూ ఒక మాపిళా పాటలో కూడా ఉంటుంది.

“ఆ రోజుల్లోనే వీళ్ళు ఈ కర్ర నావలను నిర్మించే కళను ఒంటబట్టించుకున్నారు. ఆ నావ చూడటానికి ఒక గిన్నెలా ఉంటుంది. అక్కడే నువ్వొక విషయాన్ని గమనించాలి. పెనుతుఫాను సమయాల్లో ఈ పత్తేమారి ఓడ మీదికి అతి వేగంగా వచ్చి విరిగిపడే అలకు పది టన్నుల బలమైనా ఉంటుంది… పది టన్నులు! ఒక్క పలకగాని ఎక్కడైనా కొద్దిగా కదిలి పగులిచ్చినా, ఆ సందులోంచి లోపలికి ఉబికే నీటికి, ఒక టన్ను బరువున్న వస్తువునైనా సునాయాసంగా విసిరి అవతల పడేసేంత బలం ఉంటుంది. ఆ దెబ్బకు ఒక్క గంటలో అంత పెద్ద పత్తేమారి కూడా పూర్తిగా నీళ్ళలో మునిగిపోగలదు.” ఔసేపచ్చన్ ఒక చివరి గుక్క సారాను మింగేసి “సాక్షాత్తు అగ్గినే సీసాలో నింపుకొచ్చి పోసినట్టున్నాడు అవఱాచ్చన్. నేరుగా యహోవా ద్రవరూపంలో అవతరించి గొంతులోకి దిగి వచ్చినట్టు ఉంది.”

“వింటూంటే ఇంటరెస్టింగ్‌గా ఉంది, ఇంకా చెప్పు ఔసేపచ్చా!” అని అన్నాను.

“అంటే ఏం చెప్తున్నానంటే…” అంటూ ఔసేపచ్చన్ మళ్ళీ త్రేన్చి “ఆలోచించు, ఎనిమిది టన్నుల భారాన్ని మోయగల కర్ర పలకలు ఉంటాయా? ఎంత మందపాటివయినా?”

“లేదు” అని అన్నాను.

“మఱెలా, అంత బరువుని తట్టుకుంటుంది?”

“ఎలా?”

“లెక్క బామ్మర్దీ, లెక్క! అంతా లెక్క ప్రకారం తయారుచెయ్యడంలోనే ఉంది! అలాంటి విషయాలన్నీ అరవంలో కథలు రాసే తిరువిదాంగూర్ దద్దమ్మ నాయర్లకు అర్థంకాదు. కుమారన్ మాస్టారూ, మీరిది వినండి. తిరువిదాంగూర్ నాయర్లను జానమ్మ ఎలా గుర్తుపడుతుందో తెలుసా? రవిక ముడినో, హుక్కునో విప్పే ఉపాయం తెలియక కత్తికోసం వెతుకుతుంటారు వాళ్ళు.”

“లెక్కలు తెలిసిన తిరువిదాంగూర్ నాయర్ ఒకే ఒక్కడు ఉండేవాడు,” అంటూ కుమారన్ మాస్టారు “పాత తిరువిదాంగూర్ పేష్కార్ పి.సంకుణ్ణి మేనన్. ఎంత చిన్న లెక్కలకైనా వేళ్ళు లెక్కపెడుతూ ఉండేవాడు. పాపం ఒక్కసారిగూడా లెక్క సరిగ్గా కుదిరేదికాదు.”

“ఏం?”

“ఆయనకు ఒక చేతిలో ఆరు వేళ్ళు,” అంటూ కుమారన్ మాస్టారు “ఆ పైన సంకుణ్ణి లెక్కల పద్ధతిని కొత్తరకం గణితశాస్త్రంగా ప్రభుత్వం జీవో పాస్ చేసింది. దాన్ని బేస్ చేసుకుని ఆ రోజుల్లో బడ్జెటే వేశారు. అది ఎప్పుడూ అదనపు బడ్జెట్టే తెలుసా? ఆయన పోయాక లోటు బడ్జెట్ మొదలైంది.”

“నువ్వు చెప్పు… ఏం లెక్క?” అని అడిగాడు శ్రీధర్.

“అంటే…” మళ్ళీ ఔసేపచ్చన్ త్రేన్చి “లోపల అంతా మాడి మసై పోయిందనుకుంటా. పొగ వస్తోంది. ఇప్పుడు నా గుండెకాయంతా సేక్రెడ్ హార్ట్‌లా భగభగమని మండుతోంది”.

“చెప్పేదుందా లేదా?”

“పత్తేమార్ నిర్మాణంలో ప్రధానాంశం దాని ఒంపు. గోళాకారంలో వంపు తిరిగిన ఉపరితలం బాగా బరువు మోయగలదన్నది మనకందరికీ తెలిసిందే. ఆరేబీయుల భవన నిర్మాణ కళంతా ఒంపులతో కూడుకున్నదే.”

“వాళ్ళు ఒంపుల్ని ఆస్వాదించే రసజ్ఞత ఉన్నవాళ్ళు,” అన్నాడు శ్రీధర్.

“అవును, కేవలం ఇటుకలతోనే వాళ్ళు ఒంపులు తిప్పి బ్రహ్మాండమైన పైకప్పులున్న డోమ్‌లను నిర్మించారు… బీజాపూర్‌లోని గోల్గుంబజ్ మసీదుని చూడాలి నువ్వు. పైన ఆకాశంలా వంగి ఉన్న పైకప్పు, పెద్ద మైదానంలా ఉంటుంది. అంతా ఒట్టి ఇటుకలు పేర్చి నిర్మించిందే. దూలాలు, ఉత్తరాలు, చట్రాలు ఏమీ ఉండవు. మొత్తం వంపు తిరిగిన గోళాకారమే. గోళాకారపు ఉపరితలం, ఇటుకల్ని ఒకదాన్నొకటి గట్టిగా బిగుసుకుని పోయేట్టు చేసి కదలనీకుండా ఉంచుతుంది. అందుకే పరమ కరుణామయుడైన తండ్రి ఆకాశాన్ని గోళాకారంలో సృష్టించాడు.”

ఔసేపచ్చన్ కొనసాగించాడు. “పత్తేమారిలో అంతా గోళాకారంలోనే ఉంటుంది. అది నిర్దుష్టంగా అందంగా ఉండే గోళాకారం. దాని లోపల వేలాది కర్ర చట్రాలు బిగించి ఒకదాన్నొకటి పట్టుకుని ఉంటాయి. ఒక పత్తేమారి లోపలికి వెళ్ళి చూడాలి నువ్వు. దాని అడుగు భాగమంతా నేరుగా అడ్డంగా కర్ర చట్రాలు. లావుపాటివి కావు. మనిషి తొడంత పరిమాణంలో ఉంటాయి అంతే. అయితే అలాంటివి వేలాదిగా ఉంటాయి. చేవదేరిన చింత కర్రతో చేయబడిన చట్రాలు. ఇప్పుడు టేకు కర్రలు వాడుతున్నారు. వాటిని పైనుంచి చూస్తే ఒక పెద్ద వలలాగానో వంటచెరుకులు పేర్చినట్టో కనపడుతుంది. మేకులు కొట్టి సర్దినట్టు కూడా ఉంటుంది. అయితే అది నిజం కాదు. దానికి చాలా సూక్ష్మమైన లెక్కలున్నాయి. ఆ లెక్కలన్నీ వాళ్ళ దగ్గర పాటల రూపంలో ఉన్నాయి. ఆ పాటలు ముసిలి ఉస్తాదులకు తెలుసు. అయితే వాళ్ళకు ఆ లెక్కలు మాత్రమే తెలుసు, ఒక సింగిల్ ఛాయ్, రెండు పప్పు వడలకు చిల్లరివ్వాలంటే చేతివేళ్ళను ముడుచుకుంటూ ఆయాసపడుతూంటారు.

“వాళ్ళ లెక్కలపాట ‘ఒన్నుతొట్టు మూనల్లో యా అల్లా – ఒన్నిల్ కొణ్డదు ఎణ్బదల్లో! మూనిలి నిన్నదు నాప్పదల్లో యా రహ్మాన్ – మూనుం కూట్టి ముప్పదల్లో’ ఇలా సాగుతుంటుంది. నేను ఇచ్చింది చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ వ్యవస్థను నేను విజ్ఞానశాస్త్రం అనలేను. విజ్ఞానశాస్త్రానికి థియరీ ఉంటుంది. వీళ్ళదంతా కేవలం అనుభవజ్ఞానం మాత్రమే. సాలెపురుగు గూడు అల్లడం ఎలా నేర్చుకుందో, గిజిగాడు గూడు కట్టడం ఎలా నేర్చుకుందో అలా! వేలాదిమంది ఎన్నో వందలాది ఏళ్ళుగా సమష్టి జ్ఞానంతో కొంచం కొంచంగా పోగుచేసుకుని కింది తరాలకు అందించుకుంటున్న జ్ఞానం. బయటవాళ్ళల్లో ఎవ్వరికీ దీని గురించి తెలీదు. ఏ పుస్తకాల్లోనూ లేదు. అయితే సమష్టిగా మాపిళా సమాజంలో పారంపర్యంగా కొనసాగుతోంది.

“ఆ చట్రాల నిర్మాణాన్ని ఇప్పటి ఆటోమొబైల్ డిజైన్ భాషలో చెప్పాలంటే – వెయిట్ డిస్ట్రిబ్యూషన్. అంటే వేగంగా వచ్చిపడే అలల తాకిడిని ఈ చట్రాలు అన్నీ కొంచం కొంచంగా పంచుకుంటూ అబ్సార్బ్ చేసుకుని ఆ తాకిడిని పూర్తిగా తగ్గిచేస్తాయి. నేను వాటిల్లో ప్రయాణించినప్పుడు పత్తేమారిలో కింద అంతస్తుకు వెళ్ళి ఆ చట్రాలను చూశాను. అవి మెల్లగా కంపిస్తూ ఉంటాయి. చాలా నెమ్మదిగా. వాటి మీద నిల్చున్నప్పుడు మన కాళ్ళల్లో చిన్నపాటి కరెంటు పాకినట్టు అదురుతూ ఉంటుంది, అంతే”.

“అక్కడికి అట్లా వెళ్ళొచ్చా?” అనడిగాడు ఎలుకేశవన్.

“బావా, అది రాత్రుళ్ళలో మాపిళాలు పడుకునే చోటు. అక్కడ కూర్చుని మందు కొట్టడం బహుశా గొప్ప అనుభూతినివ్వొచ్చు. అక్కడ సంభోగం, దానికంటే గొప్ప అనుభవాన్నివ్వొచ్చు. ఎందుకంటే కెరటాలవల్ల వచ్చే ఊపుకూడా తోడవుతుంది కాబట్టి. కానీ మాపిళాలకు అంత కళాపోషణ, రసికత ఏడవలేదు. అలాంటి పనులను వాళ్ళు అనుమతించరు.”

“రసహీనులు,” అన్నాడు కుమారన్ మాస్టార్.

“నేను ఆ చట్రాలను నివ్వెరబోయి చూస్తూ ఉండిపోయాను. కెరటం తాకిడికి నూరుమైళ్ళ వేగంతో ఒక పత్తేమారి వెళ్ళి నేరుగా ఒక పెద్ద బండకు గుద్దుకున్నా కూడా అది పెద్దగా ఏం చెక్కు చెదరదు. ఇంతకీ బయట పక్క ఉన్న చెక్క, ఆరు అంగుళాల మందం మాత్రమే ఉంటుంది. టేకు కర్రతో చేస్తారు. పాత రోజుల్లో అడవి పనస కర్రతో చేసేవాళ్ళు,” అన్నాడు ఔసేపచ్చన్.

“ఇప్పుడూ చేస్తున్నారా?”

“పత్తేమారీలను ఇప్పుడు వాణిజ్యనౌకల కింద ఎవరూ తయారు చేయడం లేదనుకుంటా. వాళ్ళంతా ఇప్పుడు చిన్న పడవలను తయారు చేస్తున్నారు. కానీ పత్తేమారీలకు ఇప్పుడు డిమాండ్ కూడా పెద్దగాలేదు. చివరగా 2014లో ఒక అరబ్ షేక్ కావాలని అడిగాడని ఒకటి తయారు చేసి సముద్రంలోకి దింపారు. సొంత పత్తేమారీలు ఉండటం డబ్బులున్న అరబ్బులకు ఒక ప్రిస్టేజి సింబలు. ఆఱన్ముళ అద్దంలా ఇదీ ఒక రకమైన కళాఖండం. ఎందుకంటే వాటిని కూడా మనుషులు చేతులతోనే తయారు చేస్తారు. అంతేకాదు, పత్తేమారీలను తయారు చేయడానికి అత్యవసరమైన వస్తువు ఒకటి నేడు లేకుండా పోయింది.”

ఏమిటి, అని మేము అడగలేదు. ఔసేపచ్చన్ నాటకీయ విరామం కోసం కాస్త మందు ఒంపుకుని తాగేసి నెమ్మదిగా త్రేన్చాడు.
కొనసాగిస్తూ, “ఒకప్పటి మాపిళాల కట్టుదిట్టమైన సామాజిక వ్యవస్థ,” అన్నాడు. “అది చాలా చాలా బలమైన కట్టుబాట్లు కలిగినది. నాయకుడు, ఉప నాయకుడు, ప్రాంతీయ నాయకులు, పిల్లనాయకులు అంటూ ఉన్న పెద్ద సంస్థ. కనీసం ఓ వెయ్యి సంవత్సరాలు స్థిరంగా ఇలానే కొనసాగింది అని కచ్చితంగా చెప్పొచ్చు. అది ఒక వృత్తిని ఆధారం చేసుకుని వ్యవహరించే అతి పెద్ద సమష్టి సంస్థ అని చెప్పొచ్చు. ఒక విద్యాసంస్థ అని కూడా చెప్పొచ్చు. ఇస్లాంలో ఇదొక ఉపకులం లేదా ఉపసమాజం అని చెప్పవచ్చు. అయితే అది నెమ్మదిగా కనుమఱుగైంది. కాలచక్రపు తిరుగుడులో మఱుగైంది.” ఆ మాటను ఆస్వాదిస్తున్నవాడిలా ఔసేపచ్చన్ తన చేయి పైకెత్తి, “కాలచక్రం… అంటే, కాలమనే చక్రం!” అన్నాడు. “కాలాన్ని తాడేసి చక్రంలో బంధించి…” అంటూ త్రేన్చి, “మంచి అగ్గి లాంటి సారా!” అన్నాడు.

“అసలేం జరిగింది?” అనడిగాను.

“బోలెడు జరిగింది. మొదటిది బేప్పూర్ ఓడరేవు నాశనమవ్వడం. దానికి దగ్గర్లోనే కోళికోడ్ ఓడరేవు పుట్టుకొచ్చింది. బేప్పూర్ పాతకాలపు ఓడరేవు. పూర్వం రోజుల్లో ఓడరేవులన్నీ నది ముఖద్వారం దగ్గరే ఉండేవి. సముద్రమట్టం పెరిగి నీరు లోపలికి వచ్చినప్పుడు, ఓడలు నదిలోకి ప్రవేశించి రేవులకు చేరుకునేవి. నదుల మీద ఎక్కడికక్కడ ఆనకట్టలు వచ్చేశాక నదుల్లో నీటి ప్రవాహం బాగా తగ్గిపోయింది. నదీ ముఖద్వారాలన్నీ ఇసుక దిబ్బలుగా మారిపోయాయి. బేప్పూర్ సాలియార్ నది ఒడ్డున ఉండేది. ఇప్పటికీ ఆ నది లోతుగానే ఉంది, కానీ అప్పట్లో పెద్ద ఓడలు లోపలికి రాగలిగేంత లోతుగా ఉండేది. అంతే కాకుండా పోర్చుగీసువాళ్ళు, తర్వాత వచ్చిన బ్రిటీష్ వాళ్ళు మాపిళాలను అణగదొక్కేశారు. 1700వ సంవత్సరంనుండి రెండువందల ఏళ్ళపాటు మాపిళాలను రూపు మాపేయాలని యుద్ధాలు చేస్తూ వొచ్చారు. కుంజాలి మరకాయర్, వారియంగుందనత్తు హాజీలాంటి పెద్దపెద్ద నావికులందరూ బ్రిటీష్ వాళ్ళ చేతిలో చచ్చిపోయారు. మాపిళాల సముద్రాధిక్యత మెల్లగా క్షీణించింది. బతుకుతెఱువుకోసం మాపిళాలు ఇతర ఉద్యోగాలకు వెళ్ళసాగారు. చిన్నచిన్న వ్యాపారులుగా మారారు. దాంతో వాళ్ళ సామాజిక వ్యవస్థ కూలిపోవడం మొదలైంది.

“బ్రిటీష్ వాళ్ళిచ్చిన ఇంగ్లీష్ చదువు తరతరాలుగా సాగుతూ వచ్చిన సాంప్రదాయ విద్యనీ జ్ఞానాన్నీ నాశనం చేసింది. ఒక పిల్లవాడు మాపిళాల సాంప్రదాయ విద్యను, బ్రిటిష్ వాళ్ళ పాఠశాల విద్యను ఏకకాలంలో నేర్చుకోవడం అన్నది అసలు సాధ్యం కాని పని. ఇవికాక ఇస్లామిక్ సంస్కరణ ఉద్యమాలు. ఆ సంస్కరణలు ఈ వైపు వచ్చాక ఖిలాఫత్ ఉద్యమంతో మఱింత బలపడ్డాయి. వాళ్ళు ఇస్లాంను ఏకసాంప్రదాయాలను పాటించే మతంగా మార్చారు. మాపిళాలు పాటిస్తూ వచ్చిన సంప్రదాయాలు ఇస్లామిక్ సంప్రదాయాలు కాదనీ, అవి ఆచారవిరుద్ధం అనీ పరిగణించారు. అంతే, అక్కడితో వెయ్యి సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చిన ఒక సంప్రదాయం అయిపు లేకుండా పోయింది. అయినప్పటికీ కుండపోత వర్షం ఆగినా దాని తుంపరలు అంత తేలికగా ఆగవు అంటారు కదా? ముప్పై సంవత్సరాల క్రితం మాపిళాల కట్టుబాట్లను స్వయంగా చూసే అవకాశం నాకు దొరికింది. అవి ఎంతో గొప్ప రోజులు”.

“ఔసేపచ్చన్ ఇంక కథలోకి దిగేశాడు,” అన్నాడు శ్రీధర్. “ఇప్పుడింక చెప్తాడు చూడు తాను చేసిన వీరోచితసాహసాలు, గెలిచిన యుద్ధాలు, చేపట్టిన ఆడవాళ్ళతో సహా అన్నీ!”

“ఒరేయ్ నాయర్, నీ పని తాగడం, మెక్కడం అంతే. అట్టా కాకుండా పరిశుద్ధ కిరస్తానుల గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడావంటే ఇక్కడ రక్తం ఏఱులై పారగలదు” అన్నాడు ఔసేపచ్చన్. “సెయింట్ తోమాస్లీహా ఈ గడ్డలో అడుగుపెట్టింది నాయర్ల పిచ్చి వాగుడు వినడానికి కాదు.”

“శ్రీధరా, నువ్వు కాసేపు ఊరుకోరా, నువ్వు చెప్పు ఔసేపచ్చా!”

“అంటే ఇది జరిగింది మంగళూరులో, 1988న జరిగింది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే జూలై 19న. నాకెందుకు గుర్తుందంటే, కేరళను కుదిపేసిన అతిపెద్ద పెరుమణ్ రైలు ప్రమాదం జూలై 8, 1988న జరిగింది.”

“అవును, నాకు గుర్తుంది” అన్నాడు కుమారన్ మాస్టారు.

“జూలై 8, 1988 మధ్యాహ్నం, ఐలాండ్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరునుండి తిరువనంతపురం సెంట్రల్‌కు బయలుదేరింది,” అన్నాడు ఔసేపచ్చన్. “జూలై నెల అంటే కేరళలో నైరృతి ఋతుపవనాలు బలంగా ఉండే కాలం. మధ్యాహ్నం 1:15 గంటలకు రైలు కొల్లం సముద్రతీరాన పెరినాడు దగ్గర్లో ఉన్న అష్టముడి సరస్సు పైనవున్న రైల్వే వంతెనమీద నెమ్మదిగా కదులుతోంది. ఏం జరిగిందో తెలీదు గానీ, రైలు పట్టాలు తప్పింది. సాధారణంగా, రైళ్ళు పట్టాలు తప్పినప్పుడు అవి బోల్తా పడి అక్కడికక్కడే పడుంటాయి. అదీ వంతెనమీద అతి మెల్లగా వెళుతున్నప్పుడు పట్టాలు తప్పితే అక్కడే ఆగిపోయే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. అయితే, ఇంజిన్‌తో సహా పద్నాలుగు పెట్టెలు సరస్సులోకి ఎగిరిపడ్డాయి. అరవై అడుగుల లోతు నీళ్ళల్లో మునిగిపోయాయి.

“అదృష్టవశాత్తూ, దగ్గర్లోనే మన్ఱోలంక అనే జాలర్ల గ్రామం ఒక్కటుంది – అక్కడి జాలర్లు గజ ఈతగాళ్ళు. ఆ ఈతగాళ్ళు వచ్చి తమ ప్రాణాలను పణంగా పెట్టి సరస్సులోకి దూకారు. నమ్మశక్యం కాని రీతిలో బోలెడంతమంది ప్రాణాలను కాపాడారు. అరగంటలోపు కొల్లం నేవీ క్యాంప్‌నుండి కూడా డైవర్లు వచ్చారు. వాళ్ళు కూడా చాలామందిని ప్రాణాలతో గట్టెక్కించారు. దురదృష్టవశాత్తు నూట ఐదుగురు మరణించారు. రెండు వందలమందికి గాయాలయ్యాయి.”

“అక్కడ పెద్ద సుడిగాలి వచ్చి ఉండొచ్చునని అన్నట్టున్నారు?” కుమారన్ మాస్టర్ అడిగాడు.

“అన్నారు కానీ విచారణ కమిషన్ అలా కచ్చితంగా నిర్ధారించి చెప్పలేమంది. పెరుమణ్ ప్రమాదం నేటికీ ఒక అంతుచిక్కని రహస్యంగానే ఉంది. అయితే నేను చెప్పదల్చుకున్న విషయం అది కాదు. ఈ కథంతా మంగళూరులో జరిగింది. ఆ సమయంలో నేనక్కడ క్రైమ్ బ్రాంచ్‌లో డీఎస్పీగా ఉండేవాణ్ణి. డిఐజి అల్ఫోన్సో రొసారియో నాయకత్వంలో ఉద్యోగం. తాగుడు, తిరుగుడు, ఆదివారం రాగానే పాపవిమోచనార్థం చర్చి దర్శనం. దానెమ్మ, అవి నా జీవితంలో మఱపురాని రోజులు!” అంటూ ఔసేపచ్చన్ మందిచ్చిన ఉత్సాహంతో కొనసాగించాడు.

“ఒక రోజు మంగళూరు తీరాన, నేత్రావతి నది ముఖద్వారాన ఇసుక తిన్నెమీద ఒక శవం తేలింది. కళ్ళు బైటకు తేలిపోయి పొట్ట ఉబ్బిపోయి సగం కుళ్ళిపోయిన శవం. కడుపులో పేరుకుపోయిన గ్యాస్ వల్ల పొట్టంతా బెలూన్‌లాగా ఉబ్బిపోయి అలల్లో తేలుతూ నెమ్మదిగా ఒడ్డుకు కొట్టుకురావడం అంటే శవాలకు చాలా ఇష్టం. ఒరేయ్ పంతులూ, బుద్ధుడు కూడా చెప్పాడుగా సముద్రం శవాలను తిరిగి ఇస్తుంది అని?”

“బుద్ధుడు అలాంటివి చాలానే చెప్పాడ్లే! ఆయన సముద్రాన్ని ఎక్కడ చూశాడనీ? బీహార్‌లోని ఏదో ఒక చెరువుని చూసి చెప్పుంటాడ్లే. నువ్వు కథ చెప్పు రా, నస్రానీ నాయాలా.”

“సరే, చెప్తాను,” అన్నాడు ఔసేపచ్చన్. “అదొక యువకుడి శవం. ఇరవై ఏళ్ళకు పైనే ఉంటాయి. ఎరుపు రంగు. చిన్న శరీరం. ఒంటిమీద ఎటువంటి గాయాలూ లేవు. పోస్టుమార్టం రిపోర్టులో కూడా గాయాలేవీ లేవని తేలింది. ఊపిరితిత్తుల్లో నీళ్ళు నిండిపోయున్నాయి కాబట్టి అతను నీళ్ళలో మునిగి చనిపోయాడని రాశారు.

“అది మామూలే! ఎందుకంటే మంగళూరులోని నేత్రావతి నదిపైన ఉన్న రైల్వే వంతెన చాలా చాలా పొడవుగా ఉంటుంది. వంతెనకు ఒకవైపు నదిని, మఱోవైపున్న సముద్రాన్నీ చూడాలంటే రెండు కళ్ళూ చాలవు. మహా అందమైన దృశ్యాలవి. ఆ అందాలను ఆస్వాదించేందుకు ప్రతిరోజూ చాలామంది ఆ వంతెన మీద నడుచుకుంటూ వెళ్తుంటారు. మందు కొట్టేసి వచ్చేవాళ్ళు, అడ్డగోడల మీద ఎక్కి నిల్చుని ఆ దృశ్యాలను చూసేవాళ్ళు కొన్నిసార్లు తడబడో, కాలు జారో పడిపోతుంటారు. అకస్మాత్తుగా రైలు రావడం చూసి భయపడి ఏంచెయ్యాలో తోచక స్థిమితం కోల్పోయి జారిపడే వాళ్ళు కూడా ఉంటారు. నదిలో కొన్నిచోట్ల పైకి కనపడకుండా లోలోపల ప్రవాహాలుంటాయి, అంతర్వాహినులంటారు వాటిని. ఆ ప్రవాహాల్లో ఈ శరీరాలు చిక్కుకుంటాయి. కొత్త కొత్తగా ఇసుక తిన్నెలు ఏర్పడుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం దాదాపు ఓ ముప్పైమంది అలా కిందపడి చనిపోతారనేది ఓ లెక్క.

“ఈ కేసుకూడా ఆ లెక్కలోనే పడిపోయి మూసేసుండాలి. కానీ ఒక చిన్న సందేహం తలెత్తింది; ఇలాంటి క్రిమినల్ కేసుల్లో కొన్ని అనుమానాలు తరచుగా వస్తుంటాయి. అందుకే నేరాలు దర్యాప్తులు చేసి సత్యం కనుక్కోడం కూడా దేవుడి సేవేనని, తత్త్వజ్ఞానం కలిగిన నిజమైన క్రైస్తవులు నమ్ముతుంటారు. పోస్ట్‌మార్టం రిపోర్టులో ఇంత చిన్న వివరాన్ని నమోదు చెయ్యాలా వద్దా అని డాక్టర్‍కే సందేహం కలిగింది. ఎస్.ఐ.ని అడిగాడు. ఎస్.ఐ.కి కూడా అనుమానం వచ్చి, ఆ విషయాన్ని నా వరకూ తీసుకొచ్చాడు.

“మొట్టమొదట ఈ అనుమానం వచ్చింది, శవపరీక్ష డాక్టరుకు సహాయకుడిగా ఉన్న మహ్మద్ అబ్దుల్ ఖాదర్ అనే మమ్ముక్కాకి. ఆయన చాలా సీనియర్. శవపరీక్షలు చెయ్యడంలో అతనికి నలభై ఏళ్ళ అనుభవం ఉంది. అతనొక చిన్న విషయం కనిపెట్టాడు. శవం కుడి చేతి చూపుడు వేలుకు ఒక సన్నని దారం చుట్టుకుని ఉంది. ఏదో బట్టనుండి వచ్చిన నూలుపోగు. ౙరీలా మెరుస్తున్న పట్టు జరీ దారం అది.

“అది ఆ యువకుడు వేసుకున్న బట్టలనించి వచ్చిన పోగు కాదు. అతను వంతెన మీంచి పడిపోయినప్పుడు గబుక్కున అక్కడ దేన్నో పట్టుకుని ఉంటాడనే దానికి రుజువులు కనిపించలేదు. అది ఇంకెవరి బట్టలనుండో అతని చేతిలోకి వచ్చుండాలి. అతను చనిపోతుండగా ఆ బట్టను పట్టుకుని ఉన్నాడంటే అది వేసుకున్న మనిషి ఎవరు? ఆ వ్యక్తి ఇతన్ని కిందికి తోసాడా? అతను ఒకవేళ కాలు జారిపడిపోయి ఉంటే, అక్కడ అతనితోబాటు ఉన్న వ్యక్తి పోలీసులకో, ఇతరులకో ఎందుకు చెప్పలేదు? కాబట్టి ఇది హత్యా?

“మమ్ముక్కా ఇంకో విషయమూ చెప్పాడు. చాలా జంకుతూ, భయపడుతూ, బెరుకుగా. అది కేవలం తన అనుమానం మాత్రమే అన్నట్టు చెప్పాడు. “ఆ దారంపోగు పట్టు ౙరీతో తయారు చేయబడింది. ఇలాంటి తయారీ ముస్లింలు పెట్టుకునే టర్కిష్ టోపీలో ఉంటుంది. అవి అత్యంత ఖరీదైన టోపీలు. వాటిని ముస్లిమేతరులు ఉపయోగించరు” అని చెప్పాడు.

“అక్కడినుండి మొదలైంది కేసు. నేను ఆ దారపు పోగును పోస్ట్‌మార్టం నివేదికలో నమోదు చేయించాను. అనుమానాస్పద మరణంగా రాయించాను. చనిపోయిన వ్యక్తి ఎవరు అని అన్వేషణ మొదలుపెట్టాను. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో తప్పిపోయిన వాళ్ళ గురించి ఫిర్యాదులన్నింటినీ దర్యాప్తు చేశాము. గత సంవత్సరం రోజులుగా, గత రెండేళ్ళుగా, ఐదేళ్ళుగా అని వేర్వేరుగా తప్పిపోయిన వారి జాబితాలను తయారు చేసుకుని విచారణలు మొదలుపెట్టాము. అతను ఆ జాబితాల్లో ఎక్కడా దొరకలేదు.

“ఆ సమయంలో నా సీనియర్ రొసారియో అక్కడ లేరు, ఆయన సి.బి.ఐ.లో ఒక అసైన్‌మెంట్ కోసం ఢిల్లీ వెళ్ళారు. పోలీసుల సంఖ్యే పోలీసు శాఖకున్న ప్రధానమైన బలం అని అనేవాళ్ళు ఆయన. నేను కూడా అదే నమ్మాను. విస్తృతంగా వలవేసి గాలింపు చర్యలను మొదలుపెట్టాను. ఆ రోజుల్లో ఉన్న పద్ధతేంటంటే పోలీసులు ఫోటోలు చేతబట్టుకుని వెళ్ళి ప్రతి చోటా దర్యాప్తు చేయ్యడమే. ఇప్పటిరోజుల్లోలా అప్పట్లో సీసీటీవీలేం లేవు. దర్యాప్తు – బస్ స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, హోటళ్ళు, టీ దుకాణాలు, బడ్డీ కొట్లు, బార్లు, సారాయి కొట్లు అంటూ విస్తరించుకుంటూ సాగేది. దర్యాప్తు చేయడానికి ఏకైక మార్గం వీలైనంతమందిని నేరుగా కలిసి పలకరించి విచారించడమే. వీళ్ళకు ఇందులో సంబంధం ఉంటుందా, వీళ్ళకు తెలిసే అవకాశం ఉంటుందా లేదా ఇలాంటివి పట్టించుకోకుండా ఎంతమందిని అడగగలిగితే అంతమందిని అడగడమే. మీరు నమ్మరేమో కానీ, మేమదే అప్పట్లో సరైన విచారణ పద్ధతి అనుకునేవాళ్ళం.

“సాధారణంగా ఇలాంటి రద్దీ ప్రదేశాల్లో రకరకాల కొత్త ముఖాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరి ముఖమూ ఎవరికీ గుర్తుండదు. అయితే ఈ దర్యాప్తు, రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి ఇలాంటి కేసుల్లో ఎక్కడో చిన్న చిన్నవి, గుర్తుండిపోయే విషయాలు జరిగి, వాటివల్ల కొందరి ముఖాలు ఎవరైనా గుర్తుపెట్టుకుని అవకాశం ఉంటుంది. లేదా కొంతమందికి సహజంగానే ముఖాలను గుర్తుంచుకోగల సామర్థ్యం ఉంటుంది. అలాంటి అసాధారణ సామర్థ్యాలు కలిగిన వ్యక్తులు కొందరుంటారు. ధర్మస్థలలో ఒక హోటల్ యజమాని ఉన్నాడు, తన హోటల్లో తిన్నవాళ్ళందరి ముఖాలనూ గుర్తుపెట్టుకుంటాడు. అతను దానికోసం ప్రత్యేకించి ఎలాంటి ప్రయత్నమూ చెయ్యడు. అది అతనికి ఒక మానసిక వ్యాధిలాంటిది.

“నేను విసిరిన గాలింపు చర్యల వల ఒక నెల రోజుల్లో విస్తరించింది. ఈ వల వెయ్యడంలో ఒక మెథడాలజీ ఉంది. మొదటే క్షుణ్ణమైన దర్యాప్తులోకి దిగే ప్రయత్నం చెయ్యం. సమయం వృథా. ముందుగా, మంగళూరులోని ముఖ్యమైన ప్రదేశాల్లో పైపైన విచారిస్తాం. అంటే చేపలు ఎక్కువగా తుళ్ళుతుండే చోట్ల మాత్రమే గేలం వెయ్యడం లాగా. తరువాత రౌండ్‍లో కొంచం విస్తరించి, మంగళూరు మొత్తాన్ని పరిధిలోకి తీసుకుని కొంచెం వివరంగా దర్యాప్తు చేస్తాం. దాన్ని చుట్టువల వెయ్యడం అంటాము. అందరినీ అడుగుతాం. మూడవ రౌండ్లో చాలా వివరణాత్మకంగా అణువణువునీ గాలిస్తాం. అంటే, మడత వల వేయడం. ఇందులో చిన్న చిన్న జల్ల చేపలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. దర్యాప్తు చేసి అవసరం లేని వాటిని బయటకు తోసేయాలి.

“అందులో ఏమీ దొర్కకపోతే, ప్రత్యక్ష దర్యాప్తులు ఆపేస్తాము. అందరు పోలీసు అధికారులు, ఆ ముఖాన్ని గుర్తుంచుకోవాలని చెప్తాం. వాళ్ళు వెతుకుతూనే ఉండాలి, ఏ పని చేస్తున్నా, నేపథ్యంలో ఆ అన్వేషణ కొనసాగాలి. ఏ కేసు గురించి ఎవరిని ప్రశ్నించినా, ఈ కేసు గురించి కూడా ఒక ప్రశ్న ఉండి తీరాలి. ఇది ఇలా ఎన్నో నెలలు, సంవత్సరాలు కూడా కొనసాగవచ్చు. యంత్రంలా మనం దాన్ని ఆపేవరకు అది నడుస్తూనే ఉంటుంది.

“విచారణ పరిధి, క్షుణ్ణమైన వివరాలు ఎంత ముఖ్యమో దానికి పెట్టుకునే కాలవ్యవధి కూడా అంతే ముఖ్యం. క్షుణ్ణత, ఎన్నుకున్న ప్రాంతపు వైశాల్యం, కాలం అనే ఈ మూడు అంశాలను కలిసి పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఎంతో పెద్ద మొత్తంలో వివరాలు దొరుకుతాయి. అందులో మనకు కావలసినవి దొరికే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఇలా ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా కొన్ని కేసులకు సంబంధించిన చిక్కుముడులను విప్పాము.

“ఏడు నెలల తర్వాత ఈ అబ్బాయి ఎవరో కనుక్కున్నాం. అతను పణంబూరు బీచ్‌లో ఒక రెస్టారెంట్‌లో భోజనం చేసి తన పర్సు అక్కడే మర్చిపోయాడు. మళ్ళీ వెనక్కొచ్చి కౌంటర్‍లో ఒక సర్వర్ ఇచ్చిన పర్స్‌ను తీసుకెళ్ళాడు. అతను ఆ సర్వర్‌కు ఇరవై రూపాయల టిప్ ఇచ్చాడట. ఆ పర్సులో డబ్బేమీ లేదంట. సర్వర్ అతని ఫోటో చూపించినప్పుడు గుర్తుపట్టాడు. మఱో దొంగతనం కేసు దర్యాప్తు చేస్తుంటే ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియడం యాదృచ్ఛికంగా జరిగింది.

“మేము పణంబూరు చుట్టూ దర్యాప్తులు తిరిగి ప్రారంభించాం. మళ్ళీ, ఇది పోలీసుల సంఖ్యాబలంపై ఆధారపడిన అన్వేషణే. ప్రతి దుకాణంలో, ప్రతి హోటల్‌లో, లాడ్జీల్లో, ప్రతి ఇంట్లో విచారించాము. రెండు వారాల తర్వాత అతను పణంబూరు సమీపంలోని ఒక చిన్న లాడ్జీలో బస చేసినట్లు తెలుసుకున్నాం. లాడ్జీ యజమాని అతన్ని గుర్తుపట్టలేకపోయాడు. కానీ అక్కడ పనిచేసే ఒక అబ్బాయి అతన్ని గుర్తుపట్టాడు. అతను వచ్చినప్పుడు ఉన్న గదిని గుర్తుకు తెచ్చుకుని చెప్పాడు. 2A. దాని ఆధారంగా రిజిస్ట్రీలో నమోదు చేసిన చిరునామా దొరికింది. అది నకిలీ చిరునామా.

“కానీ నకిలీ చిరునామాలు కూడా చాలా మంచి సమాచారమే. ఎవరూ పూర్తిగా కల్పితమైన నకిలీ చిరునామా ఇవ్వలేరు. ఎక్కడైనా నకిలీ చిరునామాలో ఎక్కువ భాగం వాస్తవానికి దగ్గరగానే ఉంటుంది. అసలు చిరునామాను కొంచెం అటు ఇటూ మార్చేసి ఇచ్చేసి ఉంటారు. గాంధీనగర్‌ను నెహ్రూనగర్‌ అని రాస్తారు. కమ్యూనిస్టు నాయాలనుకో వాడు ఎ.కె.జి. నగర్‌ను ఇ.ఎం.ఎస్. నగర్‌గా మార్చేంతవరకే పని చేస్తుంది వాడి ఊహా శక్తి. ‘కాంజాంగోడు’ గ్రామవాసి తప్పు అడ్రస్ ఇవ్వాలంటే వాళ్ళ పక్కనుండే ఊరి పేరు ‘నీలేశ్వరం’ అని రాస్తాడు. అందునా రిజిస్టర్‍లో గబగబా పేరు, అడ్రస్ రాసిచ్చేప్పుడు ఏది తోస్తే అది రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ సమయంలో సరస్వతీదేవి వాళ్ళ కరములమీద కరుణను కురిపించే అవకాశం లేదు.

“అతను రాసిన చిరునామాలో తలచ్చేరి అనుంది. కాబట్టి కణ్ణూర్‌నుండి వడకరవరకు ఉన్న ప్రాంతాల్లో దృష్టి పెట్టి మళ్ళీ అన్వేషణను మొదలుపెట్టాం, ఈసారి మేము సులభంగానే కనిపెట్టేశాం. మూడు వారాల్లో. అతను వడకరకు చెందినవాడని పట్టేశాం. అక్కడ, ఒక చిన్న భగవతి దేవళంలో అర్చకత్వం చేస్తుండే ఎంబిరాంద్రి బ్రాహ్మణకులానికి చెందిన అబ్బాయి అని తెలిసింది. పేరు కృష్ణన్. వయసు 29. పదవ తరగతి తర్వాత చదువు మానేసి గుడిలో పూజలు చేయడం మొదలుపెట్టాడు. అదేం దేవస్థానం బోర్డు గుడి కాదు, గ్రామస్తుల ట్రస్ట్ ద్వారా నడిచే గుడి. కాబట్టి జీతభత్యం అదీ చాలా తక్కువ. గుడికి దగ్గర్లోనే అతనికి పాత ఇల్లు ఒకటి, పన్నెండు సెంట్‍ల భూమి ఉన్నాయి. తల్లి, చెల్లెలు మాత్రమే ఉన్నారు. వాళ్ళమ్మ ఇంట్లోనే స్వీట్లు, చిరుతిళ్ళు తయారు చేసి టీ దుకాణాలకు సప్లయ్ చేస్తూ కొంచెం సంపాదిస్తోంది. చెల్లెలు అమ్మకు వంటలో సహాయం చేస్తుంది.

“అర్చకవృత్తిలో అతనికి పెద్ద ఆదాయం లేదు, కాబట్టి అతను పని వెతుక్కోవడానికి ముంబై వెళ్తున్నానని చెప్పి ఇంట్లో చెప్పి వెళ్ళాడు. అతని లక్ష్యం అక్కడ ఏదైనా హోటల్లో ఉద్యోగం సంపాదించుకోడం. అతనికి స్థానికంగా చాలా అప్పులున్నాయని అతని తల్లి చెప్పింది, కానీ ఎంత అప్పు ఉందో ఆమెకు తెలియదు. అప్పుల భయంతో అతను ఊరు విడిచి వెళ్ళాడు. అతను వెళ్ళిన తర్వాత ఎటువంటి వార్తా లేదు. ఉత్తరం రాస్తాడని వాళ్ళు ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే కాలం గడిచిపోతున్న కొద్దీ ఇంకా ఇంకా బాధపడుతున్నారుగానీ, అతని కోసం వెతకాలనిగానీ, లేదా పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలనిగానీ వాళ్ళకు తట్టలేదు. అసలలా ఫిర్యాదు చేయ్యొచ్చన్న అవగాహన కూడా చాలామందికి ఉండదు.

“మొత్తానికి, మాకు ఈ కేసు విషయంలో లీలగా ఒక స్కెచ్చి అయితే బుర్రలోకొచ్చేసింది. అతను పని వెతుక్కుంటూ ముంబైకి వెళ్ళడం కోసమని మంగళూరు చేరుకున్నాడు. అక్కడే హత్యకు గురైయాడు. మొదటి ఆలోచన ఏమిటంటే ఇది దొంగతనానికి సంబంధించింది కావచ్చు అని. అంటే అతని దగ్గర డబ్బు ఉండి ఉండొచ్చు. లేదా డబ్బు ఉందనే అభిప్రాయాన్ని ఎదుటివాళ్ళకు కలుగచేసే వాడిలా ప్రవర్తించి ఉండొచ్చు. అప్పటికే మంగళూరు రైల్వేస్టేషన్, బస్‍స్టాండ్ ప్రాంతాల్లోని జేబుదొంగలు, చిల్లర దొంగలందరినీ క్షుణ్ణంగా దర్యాప్తు చేసేశాం. వాళ్ళలో ఎవరూ అతన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. అందరినీ మళ్ళీ పిలిపించి మఱింత కఠినంగా విచారించాము. ఒక వారంలో ఒక విషయం స్పష్టమైంది, వాళ్ళెవరూ అతన్ని చూడలేదు. మాకు దొరికిందంతా లాకప్‍లో మిగిలిపోయిన మూటెడు మలమూత్రాలే.

“నాకు అది ముందే తెలుసు. ఆ పట్టు జరీ దారం ధనవంతులైన ముస్లింలు పెట్టుకునే టోపీలోనిది అని. కాబట్టి ఆ చిల్లర దొంగలు ఈ పని చేసి ఉండకపోవచ్చు. నేను దర్యాప్తును ఆ దిశగానే చెయ్యసాగాను. కానీ ఏ ఒక్క అనుమానాన్ని వదిలిపెట్టకూడదని రొసారియో ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. దేన్నైనా పూర్తిగా పరిశీలించిన తర్వాతే విడిచి ముందుకెళ్ళాలి అని. అయినప్పటికీ ఒక చిన్న అవకాశాన్ని మిగుల్చుకోవాలి. పోలీసులకు కూడా అప్పుడప్పుడు రౌడీలను కొట్టే అవకాశాలు కల్పిస్తూ ఉండాలి. డబ్బు మాత్రమే మనిషికి ఆనందాన్ని ఇవ్వదని సెయింట్ గ్రెగొరీయోస్ ఎప్పుడో చెప్పాడు కదా?

“ఆ హత్య కుట్ర ముల్లు ఎక్కడెక్కడో తిరిగి చివరకు మంగళూర్, కాసర్గోడ్ ప్రాంతంలోని తీరపు స్మగ్లింగ్ ముఠాల వైపుకు చూపుతూ వచ్చి ఆగింది. తొంభై శాతం ఈ హత్యను స్మగ్లర్లే చేసుంటారు. అయితే ఈ పశ్చిమతీరంలో స్మగ్లింగ్ పరిశ్రమకు ఎన్నో శతాబ్దాల నాటి చరిత్ర ఉంది. దీన్ని చేసేవాళ్ళు పురాతనకాలంనుండి ఇక్కడ నివసిస్తూన్న పెద్ద కుటుంబాల వాళ్ళు. దాదాపుగా అందరూ మాపిళాలకు ఏదో రకంగా కనెక్షను ఉండేవాళ్ళే. కొంతమంది పంటులు అనబడే తుళు క్షత్రియులు. ఈ పంట్లు కొందరు మతం మార్చుకుని ఆలవాలు అని ప్రసిద్ధి చెందారు. ఆ సమయంలో, మెఠాల కృష్ణప్ప రాయ్ బెంగళూరుకు మకాం మార్చారు. అతని అల్లుడు మెఠాల గోవింద రాయ్, అతని కుమారుడు ఎరదల శివప్ప రాయ్ తీరప్రాంతంలో స్మగ్లింగ్ వృత్తిని కొనసాగిస్తూ ఉండేవారు. వాళ్ళకూ మాపిళాలకూ మధ్య భారీ పోటీ ఉండేది, దాని కారణంగా పెద్ద ఎత్తున గొడవలూ జరుగుతూ ఉండేవి.

“మంగళూరు మాపిళాల్లో ఒకరైన చీమేని అబ్దుల్ రెహమాన్ హాజీ మరణం తరువాత, అతని కుమారుడు చీమేని అబ్దుల్ నజీబ్ సాహిబ్ తన సామ్రాజ్యాన్ని కొనసాగించాడు. నేత్రావతి నది ముఖద్వారంలోని పిలాంధర, ముహమ్మద్ ఇబ్రహీం హాజీ కట్టుబాట్లో ఉండేది. అక్కడ మఱొక ప్రాంతం కొండల నారాయణప్ప శెట్టి కట్టుబాట్లో ఉండేది. నేత్రావతి నది ఒడ్డున పడవల రేవులను నిర్మించిన వాళ్ళు వెలంతర చంద్రశెట్టి, పెండాల రామప్ప రాయ్. సీమెని పక్షానికి చెందిన మణక్కాడు కుంజి ముహమ్మద్, కొరంబతు అబ్దుల్ సలీం, కొరండియిల్ అబ్దుల్ నాజర్ – ఈ ముగ్గురికి నేత్రావతిలో పడవల రేవులు ఉండేవి.

“వీళ్ళలో ఎవరో ఒక మాపిళాల గ్రూపే కృష్ణన్ ఎంబిరాంద్రిని చంపి ఉండాలి. కానీ ఎందుకని చంపి ఉంటారు? ఒక చిన్న భగవతి గుడిలో అర్చకుడు, పదవ తరగతివరకు మాత్రమే చదువుకున్న ఒక సాధారణ బ్రాహ్మణ యువకుడు వీళ్ళ హిట్ లిస్ట్‌లోకి ఎలా వచ్చాడు?

“ఆనాటి మాపిళాల గురించి చెప్తేగానీ కథ మీకు పూర్తిగా బోధపడదు. అక్రమ రవాణా వాళ్ళ వృత్తి, వాళ్ళ పూర్వీకులు చేస్తూ వచ్చినదే. ప్రభుత్వం, చట్టం దాన్ని నేరంగా పరిగణించినా, వాళ్ళకు మాత్రం అది నేరం కాదు. దానికోసం హత్య చెయ్యడం కూడా ఆ యుద్ధంలో ఒక భాగమే. వాళ్ళు వందల తరాలుగా యోధులు. కానీ వాళ్ళకు కొన్ని తీవ్రమైన కట్టుదిట్టాలు, నియమాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళు దొంగిలించరు. అది వాళ్ళకు హరామ్! అది శత్రువు ఆస్తి అయినా, వాళ్ళు దాన్ని ముట్టుకోరు. రెండు, వాళ్ళు మద్యం, మాదకద్రవ్యం ఈ రెంటినీ అక్రమ రవాణా చెయ్యరు; అది కూడా వాళ్ళకి హరామ్. బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు, కొన్ని ఆయుధాల అక్రమ రవాణా; అంతే! మూడు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలను, పిల్లలను చంపరు, వాళ్ళను కిడ్నాప్ చేసి రవాణా చెయ్యరు.

“నాల్గవది చాలా ముఖ్యమైనది, వాళ్ళు సామాన్య ప్రజల జీవితాల్లో ఏ విధంగానూ జోక్యం చేసుకోరు. వాళ్ళ గ్రూపుకు చెందిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్య ప్రజలతో తగువుకు దిగరు. ఒక మామూలు సగటు మనిషి మందుకొట్టి వాళ్ళను చావగొట్టినా సరే, వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడకుండా పక్కకు తప్పుకుని వెళ్ళిపోతారు. ఒక సామాన్యుడు అనుకోకుండా వాళ్ళలో ఒకరిని చంపేసినా, వాళ్ళు మా దగ్గరికొచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోమని అడుగుతారు తప్ప, వాళ్ళంతట వాళ్ళు ఏమీ చెయ్యరు.

“కాబట్టి ఆ సముద్రపు ఒడ్డున అంత పెద్ద నేరస్థుల ప్రపంచం ఉందని సాధారణ ప్రజలకు తెలియనే తెలియదు. నిజానికి ఆ నేరస్థుల ప్రపంచమే అక్కడి సాధారణ ప్రజలకు గొప్ప రక్షణ. చిల్లర దొంగలు, రౌడీలు అందరూ భయపడతారు. చివరిగా నేను చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. వాళ్ళకి బ్రాహ్మణుల పట్ల అపారమైన భక్తి, గౌరవం, విశ్వాసం.

“ఈ మాపిళాలు జకాత్ సంప్రదాయాన్ని పొల్లుపోకుండా పాటిస్తారు. వాళ్ళు సంపాయించిన డబ్బులో నలభైయ్యోవంతును, అంటే రెండున్నర శాతం, ఏటా ఇతరులకు విరాళంగా ఇస్తూ ఉంటారు. వాళ్ళు దానిని ముస్లింలకే ఇవ్వాలని అనుకోరు. పేదవాళ్ళకెవరికైనా ఇస్తారు. బంధువులకు ఇవ్వడం జకాత్‍గా పరిగణించబడదు. వాళ్ళలో చాలామంది పేదలకోసం ఎంతో గొప్ప ఉచిత ఆసుపత్రులను నడిపారు. వాళ్ళు ప్రతి సంవత్సరం ఎన్నో విద్యాలయాలకు విరాళాలు అందించారు. చీమేని హాజీ అబ్దుల్ హమీద్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న చీమేని హాస్పిటల్, భారతదేశంలోనే అత్యుత్తమ ఉచిత ఆసుపత్రులలో ఒకటి.

“కాబట్టి వాళ్ళు ఏ కారణంగానూ ఒక అమాయకుణ్ణి, అందునా బ్రాహ్మణుడ్ని చంపే అవకాశమే లేదు. అతను వాళ్ళకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినా, వాళ్ళను బెదిరించినా కూడా వాళ్ళు హత్య చెయ్యనే చెయ్యరు. అది వాళ్ళకు మహా పెద్ద హరామ్. మఱి అయితే ఏం జరిగి ఉంటుంది?

“పోలీసులకు, స్మగ్లింగ్ గ్రూపులకు మధ్య చాలా కాలంగా పరస్పరం ఒక రకమైన అవగాహన ఉంటుంది. సుదీర్ఘ నేరచరిత్ర ఉన్న ఏ ప్రదేశంలోనైనా, కాలక్రమేణా ఈ పరస్పర అవగాహన ఏర్పడుతూ వస్తుంది. ఇరుపక్షాల చేరి పోరాడుతున్న సైన్యాల మధ్య ఏర్పడే అవగాహనలాంటిది. లేదా అడవిలో పులులు మూత్రం చుక్కల ద్వారా తమ సరిహద్దులను ఏర్పరుచుకున్నట్లుగా! మాకు వాళ్ళకు మధ్య వకీళ్ళు ఉండేవాళ్ళు. పంట్లతో రాయభారాలు జరపడానికి టి.ఎస్. పద్మనాభ షెనాయ్ అనే వకీలు ఉన్నారు. మాపిళాలతో మంతనాలాడటానికి కో‌ళికోడ్‌నుండి వచ్చిన ఎం.ఎ. నిస్సార్ అనే న్యాయవాది ఉండేవాడు.

“నేను వాళ్ళిద్దర్నీ ఇంటికి వెళ్ళి కలిశాను. ఆ హత్యతో స్మగ్లింగ్ గ్రూపులకు ఏమైనా సంబంధం ఉందా అని అడిగాను. పంట్లకు కృష్ణన్ ఎంబిరాంద్రి ఏ రకంగానైనా తెలుసా? మాపిళాలు ఏ కారణం చేతనైనా అతన్ని చంపారా? వాళ్ళు ఒక వేళ తెలియక చేసినట్టయితే, వాళ్ళే ఒకణ్ణి దోషి అని అప్పగించేస్తే కేసును ముగించేయొచ్చు.

“నాలుగు రోజుల్లో టి.ఎస్. పద్మనాభ షెనాయ్ వాళ్ళలో ఎవరూ కృష్ణన్‌ను చూడలేదని కబురు పంపించాడు. ఒక వారం తర్వాత, ఎం.ఎ. నిస్సార్, ‘లేదు, ఆ హత్యతో మాపిళాలకు ఎటువంటి సంబంధం లేదు’ అని అన్నాడు. పత్రికలో హత్య వార్త చదివిన వెంటనే వాళ్ళే దాన్ని విచారించి, దర్యాప్తు చేశారు. వాళ్ళలో ఎవరూ ఈ హత్య చేయలేదు. వాళ్ళు అబద్ధం చెప్పరని నాకు తెలుసు. కాబట్టి చేసేదేమీ లేదు, కేసు మూసెయ్యాల్సిందే.

“చాలా రోజులు అలా గడిచాయి. ఆ కేసే మళ్ళీ టక్కున జ్ఞాపకం వచ్చింది. ఇలా అన్ని దారులూ మూసుకుపోయి ఎక్కడికక్కడ ఆగిపోయిన కేసులను పదే పదే గుర్తుచేసుకుంటాం. అంతు దొరక్క గిలగిలా కొట్టుకోవడం అన్నది మానవ మాత్రులుగా మన ఆఖరి ప్రతిస్పందన. అప్పుడు దేవుడు మందహాసం చేస్తాడు. ఒక చిన్న క్లూ విసిరి చూస్తాడు. వీడు దీన్ని పట్టుకోగలుగుతాడా అని సరదాగా పైనుండి వేడుక చూస్తాడు. కానీ మనం సీతలా ‘కృష్ణా!’ అంటూ చేతులు పైకెత్తేయాలి.”

“సీత కాదు, ద్రౌపది” అన్నాను.

“ద్రౌపదినా హనుమంతుడు ఎత్తుకుపోయాడు?” అనుమానంగా అడిగాడు ఔసేపచ్చన్.

“తీసుకెళ్ళినవాడు హనుమంతుడు కాదు. తీసుకెళ్ళింది ద్రౌపదినీ కాదు.”

“ఇంకెవర్ని?”

“తీసుకెళ్ళినవాడు రావణాసురుడు. తీసుకెళ్ళబడింది సీత.”

“నేను చెప్పింది అదే కదా?”

“ఒరేయ్, వదిలేయ్! కిరస్తానీగాడికి రామాయణం ఎందుకు? వాడికి బైబిలే సరిగ్గా తెలీదు.”

“ఏఁవైందిప్పుడు? నేను సరిగ్గానే చెప్పానుగా!”

“ఈ చర్చను ఇక్కడే వదిలేద్దాం.”

“నాకు బైబిల్ తెలీదన్న కుక్క ఎవడ్రా?”

“నీకు బైబిల్ ఎందుకులేరా! నువ్వు నిజమైన విశ్వాసివి, నువ్వు పుడుతూనే పరిపూర్ణ జ్ఞానంతో ఈ భూమ్మీదికి వచ్చావు… ఓహ్ నస్రానీ మహాశయా, మిగిలిన కథ చెప్పు”.

“అంటే దేవుడు నన్ను చూసి చిన్నగా నవ్వాడు. ఎలాగంటే, మనం మెరైన్ డ్రైవ్‌ రోడ్డులో బైక్‍లో వెళ్తుంటే, ఒక అందమైన అమ్మాయి మనల్ని చూసి తెలిసినట్లుగా నవ్వుతుంది. మనం దాటి వెళ్ళిపోతాం. ఆ తర్వాత, ఆమె ఎవరు అని ఆలోచిస్తూ బుర్రను బద్ధలు కొట్టుకుంటూ ఉంటాం కదా? అలా!” అన్నాడు ఔసేపచ్చన్.

“ఎలా?” అన్నాను నేను.

“చెప్తాను,” ఔసేపచ్చన్ అందుకున్నాడు. “నేను మొదట్లో చెప్పాను కదా పెరుమణ్ ప్రమాదం అని? దాన్నీ ఈ కేసునీ నా మనస్సులో ఎలా పెనవేసి పెట్టుకున్నానో తెలిస్తే ఇది మఱింత అర్థమవుతుంది.”

“పెరుమణ్ ప్రమాదం జరిగి అప్పటికి ఏడాది దాటింది. రైల్వేలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న నా స్నేహితుడు అరవింద్ త్రిపాఠి మంగళూరుకు వచ్చాడు. అతను నా బ్యాచ్‌మేట్. పోలీసుశాఖనుండి అక్కడికి వెళ్ళాడు. మంగళూరులో ఒక ఇన్స్పెక్షన్. అది ముగించుకుని కోళికోడ్ వెళ్తానని చెప్పాడు. అతను చెప్పిన కారణం నాకు ఆసక్తికరంగా అనిపించింది. అతను అక్కడ మాపిళా కళాసీలను కలవడానికి వెళ్తున్నట్టు చెప్పాడు.

“పద్నాలుగు రైలు బోగీలు నీటిలో మునిగిపోయాయి కదా? వాటిని బయటకు తీయడానికి అతను పలు విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. లోపల ఇరవైకి పైగా మృతదేహాలు పెట్టెల కింద ఇరుక్కుపోయాయి. వాళ్ళ బంధువులు ఆ శవాలను బయటకు తీసుకురావాలని అంటున్నారు. అప్పుడే వాళ్ళకు అంత్యక్రియలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. కానీ పెట్టెలు పైకి తీయడం చాలా ఖర్చుతో కూడిన పని. నీటితోబాటు అవి ఎన్నో టన్నుల బరువు ఉంటాయి. ఆ బరువును పైకి లాగడానికి భారీ క్రేన్లు అవసరం.

“కొచ్చిన్ పోర్టునుండి క్రేన్ నిపుణులు వచ్చి అంచనాలు వేశారు. ఆ క్రేన్ వంతెనపై నిలబడదు, అది ఆ బరువును తాళలేదు. ఒడ్డంతా బురద మట్టి, క్రేన్‍ను అక్కడ నిలపడం అసాధ్యం. దానికోసం ఒక పెద్ద సిమెంట్ ప్లాట్‌ఫామ్ నిర్మించాలి. అది పది అడుగుల ఎత్తు, నలబై అడుగుల పొడవు, ఇరవై అడుగుల వెడల్పు ఉండాలి. దాన్ని అక్కడ కట్టాలంటే, ముప్పై అడుగుల లోతుకు తవ్వి పునాది వేయాలి. అది జరిగే పనా? అంతే కాదు, క్రేన్లను విప్పదీసి, వాటి భాగాలను రైలులో తీసుకువచ్చి మళ్ళీ అమర్చాలి. మొత్తం ఖర్చు కొన్ని కోట్లు. దానికి రైల్వే వద్ద డబ్బు లేదు.

“అప్పుడే అరవింద్ మాపిళా కళాసీల గురించి విన్నాడు. సముద్రంలో మునిగిపోయిన పత్తేమారీలను చాలా తక్కువ ఖర్చుతో వెలికితీసే టెక్నాలజీ వాళ్ళ దగ్గరుందని చెప్పాడు. అయితే ఆ వివరాలు కొన్ని పాత బ్రిటిష్ రికార్డులలో ఉన్నాయి. కోళికోడ్‍కు చెందిన రైల్వే ఉద్యోగులెవరికీ దీని తాలూకు వివరాలేమీ తెలియదు. కేరళ జర్నలిస్టులకు కూడా ఏమీ తెలియదు. అది చరిత్రలో చిరిగిపోయిన ఒక పేజీ, ఈ రోజుల్లో అలాంటివాళ్ళు ఎవరూ లేరని అన్నారు.

“అయితే బ్రిటీష్ వాళ్ళు తాము చూడని దేన్నీ చూసినట్టు రాయరని అరవింద్ గాఢంగా నమ్మాడు. ఎందుకంటే 1872లో ఒక బ్రిటీష్ వాడు రాసిన డిస్ట్రిక్ట్ మాన్యువల్‌లో, అరవింద్ వాళ్ళ ముత్తాత సదానంద్ త్రిపాఠి అవధ్ నవాబుకు తార్పుడు పని చేసిపెట్టి మంత్రి అయ్యాడని సమాచారం ఉంది. అరవింద్ దీనికోసమే ప్రత్యేకంగా బయలుదేరి వచ్చాడు. మలయాళం మాట్లాడటానికి నన్ను తనతో రమ్మని పిలిచాడు. నాక్కూడా ‘మంగళూరు వదిలి నాల్రోజులు వేరే చోటికి వెళ్తే చాల్రా బాబూ’ అనిపించింది. అచ్చమైన మలయాళం చెవిన పడితే బాగుండు అనిపించేది. వీలైతే రొయ్యలు, నత్త గుల్లలు, పీతల వేపుడు నంజుకుంటూ తాగాలనిపించింది. ఎక్కడో ఒక చోట పడుండి కమ్యూనిజాన్ని నాలుగు బూతులు నోరారా తిట్టుకొని రావాలి అనిపించింది. నేను కూడా బయల్దేరి వెళ్ళాను.

“కోళికోడ్‌లో మేము రైల్వే గెస్ట్ హౌస్‌లో బస చేసాము. అక్కడ్నుండి, పత్తేమారిలు తయారు చేసే రెండు ప్రదేశాలకు వెళ్ళి చూశాము. నేను దాని గురించి వివరంగా చెప్పబోవడం లేదు. అది మాపిళాలు, స్థానిక వడ్రంగులూ కలిసి చేసే ఆ పెద్ద పని ఒక అద్భుతమనే చెప్పాలి. ఒక పెద్ద ఫ్యాక్టరీలో చేయాల్సిన పనిని, వా‌ళ్ళు ఒక సాధారణ కొబ్బరాకుల పైకప్పు కింద ఉలి, సుత్తి, త్రోపుళ్ళు పెట్టుకుని టొక్కు టొక్కుమని కొడుతూ చేసేస్తున్నారు. సగం తయారైన పత్తేమారి ఒకటి ‘ఎప్పుడ్రా నన్ను పూర్తి చేస్తావు?’ అన్నట్లుగా దయనీయంగా చూస్తూ నిలబడి ఉంది.

“మాపిళాలకు ఒక లెక్కుంది. వడ్రంగులకు ఇంకో లెక్కుంది. ఇద్దరూ ఒకరిది ఒకరితో పంచుకోరు. అయినా చివరికి ఒక దెయ్యం పుట్టుకొచ్చినట్టు పత్తేమారి తయారై వచ్చేస్తుంది. అది కేవలం చెక్క అయినప్పటికీ, దాదాపుగా మూడు వందల టన్నుల బరువు ఉంటుంది. పదిమందితో కూడిన మాపిళాల బృందం దానిని సునాయాసంగా సముద్రంలోకి నెట్టేయగలరు. వాళ్ళు ఇసుక నేలమీద రెండు కర్రలు పట్టాల మాదిరిగా వేస్తారు. చక్కగా పాలిష్ చేసిన కర్రలు. వాటిమీదకు పత్తేమారిని ఎక్కిస్తారు. పొడవాటి మీట కర్రలు, తాళ్ళ సాయంతో నెడతారు. అది బాతులాగా జారి నెమ్మదిగా నీళ్ళల్లోకి దిగేస్తుంది. అట్లాగే నీటిలోంచి ఒడ్డుకు తీసుకు రావాలన్నా ఆవుదూడను తీసుకొచ్చేంత సునాయసంగా పైకి లాగేస్తారు.

“మేము అక్కడికి వెళ్ళిన ఆ సమయంలో ఒక పెద్ద పత్తేమారి నిర్మాణం పూర్తయిన దశలో నిల్చుని ఉంది. దాన్ని సముద్రంలోకి దింపడానికి ఇంకా ఒక సంవత్సరం పడుతుందని చెప్పారు. మేము వచ్చిన పని గురించి వివరించాము. మేము అలా చెప్పగానే వాళ్ళు కళ్ళల్లో అనుమానం కనపడింది. వాళ్ళెందుకు అంత జంకుతున్నారో నాకు వెంటనే అర్థమైంది. నేను అరవింద్‍ని తీసుకుని వెనక్కి వచ్చేశాను. అక్కడ చెప్పాల్సిన వ్యక్తి వచ్చి చెప్పకుంటే ఏ పనీ జరగదని నాకు తెలుసు.

“అక్కడ వీళ్ళందరికీ అధ్యక్షత వహించే ముఖ్యమైన మాపిళా ఎవరు అని కనుక్కున్నాను. అప్పుడు కోళికోడ్ హాజీ ఎం.ఎ. అబ్దుల్లా ఆధీనంలో ఉండేది. ఆయన అరేబియా నుండి కోళికోడ్‍కు వచ్చిన మాలిక్ దినార్ ఇబ్న్ వంశస్తుడని చెప్పారు. ఆయన కోళికోడ్‍లో ప్రసిద్ధికెక్కిన నావికా వీరుడు కుంజాలి మరక్కాయుల వంశానికి చెందినవారు. మాలిక్ దినార్ ఉచిత హాస్పిటల్, మాలిక్ దినార్ స్కూల్, ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థలు నడిపిస్తున్నారు. ఆయన నలభై ఏళ్ళుగా కోళికోడ్ తీరానికి దాదా. పోపూర్ ప్రాంతం మొత్తం అతని కనుసన్నల్లోనే నడుస్తుంది. పోర్టులో కూడా ఆయనతో ఎవరూ తగాదాలు పెట్టుకోరు. ఆయన రాజకీయాల్లో లేరు. కాబట్టి స్థానికంగా ఎవరితోనూ గొడవ లేదు. మనంతట మనం వెళ్ళి ఆయనతో తగువుకు దిగితే తప్ప ఆయన ఉనికే తెలియదు.

“నేను మంగళూరుకు ఫోన్ చేసి నిస్సార్‌‍తో మాట్లాడి ఇక్కడ ఎం.ఎ. అబ్దుల్లాని కలిసి మాట్లాడాలంటే మార్గాలేంటని కనుక్కున్నాను. అతను కోళికోడ్‌లోని అబ్దుల్ షామిర్‌ అనే వకీల్ను పరిచయం చేశాడు. వకీలుతో ఫోన్‌లో మాట్లాడాక నేను షామిర్‌ను వెళ్ళి కలిశాను. షామిర్ ద్వారా ఎం.ఎ. అబ్దుల్లాతో మాట్లాడటానికి ఏర్పాట్లు జరిగాయి. సాహిబ్ వాళ్ళ బీచ్ గెస్ట్ హౌస్‍లో మాకు విందు ఏర్పాటు చేశారు. మీరు మాపిళాలు ఇచ్చే విందు భోజనం తిననంతవరకు జీవితంలో మీరు విందు భోజనమే తినలేదని అర్థం. కానీ ఒక విషయం ఏంటంటే, ఆ భోజనాన్ని పూర్తి స్థాయిలో చవి చూడాలంటే మీకు మొసలికుండే కోరపళ్ళు, తోడేలు పొట్టా ఉండాల్సిందే.

“ఎంఏ అబ్దుల్లా సాహిబ్‍ది ఎంత చక్కని రూపం! మాంచి ఎర్రటి మేని ఛాయ. దట్టమైన గడ్డం, దానిలో కొన్ని నెరిసిన వెంట్రుకలు. చతురస్రాకార ముఖం, వాడిగా ఉన్న అరేబియా ముక్కు. బొమ్మ గీసినట్లుగా కనిపించే కనుబొమ్మలు. అందంగా వికసించినట్టుండే కళ్ళు. బొజ్జ లేదు. నిటారుగా ఉన్న పొడవైన శరీరం. అతనిలాంటి అందమైన వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. మన మమ్ముట్టికి పది గ్రేస్ మార్కులు ఎక్స్ట్రా వేస్తే అప్పుడు పోల్చొచ్చు.

“ఎం.ఎ. అబ్దుల్లా మంచి మాటకారి అని విన్నాను. ఆ రోజు స్వయంగా చూశాను ఆ నైపుణ్యమేంటో! ఒకదాని వెంబడి ఒకటి మాపిళాల చమత్కారాలు, చలోక్తులు. మాపిళాల పాటలు ఆయన మాటల్లో ప్రవహిస్తూనే వున్నాయి. నేను ‘మాపిళాల రామాయణం’ వినడం అదే మొదటిసారి. మీరు విని ఉండరు. కోళికోడ్‌కు చెందిన మోయిన్‌కుట్టి భాగవతార్ రచించిన పేరడీ ఇతిహాసం. మొదటి సన్నివేశంలో రావణుడు తన ఇరవై గడ్డాలకూ ఒక్కొక్కటిగా సెల్ఫ్-షేవింగ్ చేసుకుంటుంటాడు. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ బుర్ర తక్కువ పంది ఇక్కడున్నపుడు వద్దులే, వీడు అరవంలో దీని గురించి ఏదైనా రాసి చస్తే మతాల కింద చీలిపోయికొట్టుకుని చస్తారు అరవోళ్ళు. ఇంకెప్పుడైనా చెబుతాను.

“నవ్వులతో గడిచిపోయింది ఆ రోజంతా. చివరికి సాహిబ్ మా అభ్యర్థనను అంగీకరించాడు. ఆయన స్వయంగా మాపిళా కళాసీల ముఠాలకు చెందిన ఇద్దరు నాయకుల్ని పిలిపించి మాకు పరిచయం చేశారు. మేము వాళ్ళతో కూర్చుని అంతా వివరంగా మాట్లాడాము. వాళ్ళు చాలా మామూలుగా ‘రైలు బోగీలే కదా? మేము పైకి తీసుకొస్తాము.” అని అన్నారు.
“అరవింద్ నార్త్ వాడు కదా. అతి జాగ్రత్తపరుడు. “వాళ్ళు మరీ ఎక్కువ డబ్బులు అడుగుతారేమో డ్యూడ్, మాకు బడ్జెట్ లిమిట్ ఉంటుంది. ఎంతబడితే అంత ఇవ్వలేము” అని నాతో ఇంగ్లీషులో చెప్పాడు. “మహా అంటే ముప్పై లక్షల వరకు బేరమాడొచ్చు. అంతకంటే ఎక్కువ అడిగితే, వద్దని చెప్పేయ్. కొత్త తలనొప్పులొద్దు.”

నేను ఆ పెద్ద కళాసీ లీడరుతో “ఉస్తాద్, రేటు ఎంత?” నేను లౌక్యంగా అడిగాను. “చూసి చెప్పండి. ప్రభుత్వానికి నిధుల కొరత బాగా ఉంది ఇప్పుడు”.

ఉస్తాద్ ముఖాన్ని చిన్నది చేసుకుని, కళ్ళు కుంచించి, తన వేళ్ళతో లెక్కించి, “పన్నెండు వేల రూపాయలు. అందులో ఒక్క పైసా కూడా తగ్గడానికి వీల్లేదు” అని కటువుగా అన్నాడు.

“ఒక మనిషికా” నేను అడిగాను.

“కాదు, మొత్తానికి! ఇందులో టీ, కాఫీల ఖర్చులు చేర్చకూడదు.” అన్నాడు ఉస్తాద్.

నేను ఆ విషయాన్ని అరవింద్‍కు ఇంగ్లీషులో చెప్పగానే “పన్నెండు వేల సౌదీ రియాలా?” అన్నాడు.

“కాదు, డాలర్లు. వాళ్ళు అసలు మన రూపాయలే పెద్ద ఎక్కువగా కళ్ళ చూడరు పాపం. రియాల్‌లకు, డాలర్లకు ఎక్కడికి పోతారు!” అన్నాను.

“పద్నాలుగు పెట్టెలు బురదలో అరవై అడుగుల లోతులో పడి ఉన్నాయి, తెలుసా?” అని అడిగాడు.

“నేను నీకు నాలుగుసార్లు చెప్పాను, వాళ్ళు తెలివైనవాళ్ళు. వాళ్ళు అంతా తెలిసే చెబ్తున్నారు.”

అరవింద్ వెంటనే అడ్వాన్స్ ఇచ్చాడు. తిరిగి వస్తుంటే, “ఒరేయ్, నువ్వు చెప్పింది నిజమేనా? వాళ్ళు చివరికి ‘మీరన్నది రైలు పెట్టెలా? మేము అగ్గిపెట్టెలనుకున్నామే’ అనేస్తారేమో?” అని అనుమానంగా అన్నాడు.

“నువ్వు ఇంకో మాట మాట్లాడితే నీ మీద బ్రాందీ పోసి నిప్పంటించేస్తా!” అన్నాను.

అప్పుడుగానీ వాడు తగ్గలేదు. ఉత్తరాది బ్రాహ్మణులకు చావు భయం ఎక్కువ. ఎందుకంటే ఉత్తరాదిని పాలించిన అవధ్ నవాబులు క్రూరులు. ఆ రోజెందుకనో నాకు అశాంతిగా అనిపించింది. కుదురుగా లేను. బాగా తాగాను. నిద్రపోయి లేచాక అట్టే ముడుచుకున్న కాళ్ళని …

“నీ దరిద్రపు ఉపమానాలొద్దురోయ్… ఇక్కడ చిన్న పిల్లలున్నారు!”

“సరే,” అన్నాడు ఔసేపచ్చన్. “కళాసీలు చెప్పినట్లుగానే రైలు బోగీలను వెలికి తీశారు. దాని గురించి అప్పట్లో చాలా రాశారు. ప్రపంచం మొత్తం ఆగి వెనక్కి తిరిగి చూసిన సంఘటన. బిబిసి కూడా దాన్ని డాక్యుమెంటరీగా తీసిందనుకుంటాను. మాపిళాల దగ్గర ఎలాంటి ఆధునిక పరికరాలు లేవు. ఉన్నదంతా వాళ్ళు తెచ్చుకున్న కర్రలతో ఊని చేసుకున్న తులాదండాల నాటు క్రేన్‌లు రెండు మాత్రమే. కర్రలతో రైలు పట్టాల్లా నిర్మించుకున్న తోవర్ అనే ట్రాకులు. చక్రాల్లా తిప్పడానికి రోకళ్ళ బండల్లాంటి గట్టి కర్రలు. బలూక్కులనే దృఢమైన చింత కర్రలు, లావుగా పేనిన కిత్తనార మోకులు; అంతే. ఇవే వాళ్ళ పరికర సామగ్రి.

“వాళ్ళు బోగీలను ఎలా పైకి తీసుకొచ్చారన్నది నేను వివరిస్తే మీకు అర్థం కాదు. ఎందుకంటే నేను స్వయంగా అక్కడికి వెళ్ళి చూశాను, నాకూ అర్థం కాలేదు. ముందుగా నీళ్ళ లోపలికి మునిగి రైలు బోగీలకు తాళ్ళు కట్టారు. ఒడ్డున నిలబడి తాళ్ళను లాగారు. కూర్చున్న ఉస్తాద్ ఒక చెక్క పలకను సుత్తితో కొట్టి తాళం వేసేవాడు. వాళ్ళు తాళానికి అనుగుణంగా లాగేవారు. ఆ తాళ్ళను నేలమీద దిగేసిన గూటాలకు చుట్టి కట్టేవాళ్ళు. అలా ఇంచీ ఇంచీలుగా లాగేవారు. ఆ నాటు క్రేన్‌తో అర, పావు ఇంచీలు పైకెత్తేవాళ్ళు. తర్వాత ఒకటి రెండు ఇంచీలు తాళ్ళతో లాగేవాళ్ళు. ఒడ్డున కొన్ని రోకళ్ళ కర్రలకు తాళ్ళు కట్టి తిప్పేవాళ్ళు. వీటన్నింటికీ చాలా కచ్చితమైన లెక్కలు ఉన్నాయి వాళ్ళకి.

“చివరికి, రైలు బోగీ అమాంతం దానంతట అదే పైకి లేస్తున్నట్టు ఒడ్డుకు వచ్చింది. ఆ బోగీని సరిగ్గా లాగి రోకళ్ళ బండల మీద కూర్చోబెట్టారు. వాళ్ళ ప్లాను ఎలాంటిదో సింపుల్‌గా చెప్పాలంటే, గ్లాసు నీళ్ళల్లో పడుందనుకుందాం. మామూలు క్రేన్‌లు దాన్ని అలానే పైకి లాగుతాయి. వీళ్ళు ఆ గ్లాసును నీటిలో ఉండగానే బోర్లా తిప్పి లాగుతారు. దానికి తోడు, ఒకే మోపున పైకి లాగేయరు. ఈ పనంతా మెల్లగా ఇంచీ ఇంచీగా జరుగుతుంది. కాబట్టి లాగడానికి కావాల్సిన శక్తి వేలాది యూనిట్ల కింద విభజింపబడుతుంది. రెండు వందల టన్నుల బరువును లక్షసార్లు కొద్ది కొద్దిగా పైకి లాగాలంటే ఒకసారి లాగడానికి ఎంత శక్తి కావాలి?

“ఎంతా?”

“నువ్వు చెప్పు… నేను లెక్కల్లో వీక్,” అన్నాడు ఔసేపచ్చన్.

“సరే దాన్నొదిలేయి. ఆ కేసు ఏమైందో చెప్పు?”

“అక్కడికే వస్తున్నా. నేను పెరుమణ్‌లో ఉన్నప్పుడు, ఏదో బల్బు టక్కున వెలిగింది. దేవుడు విసిరినదాన్ని నేను పట్టుకున్నా. అదే ఆ పట్టు జరీ దారం! హాజీ ఎం.ఎ. అబ్దుల్లా దగ్గర టర్కిష్ టోపీ ఉండేది. తవుడు రంగు టోపీ. కానీ దానికి ఒక రకమైన బంగారు మెఱుపు ఉంటుంది. ఈ దారం అందులోదే. అలా చెప్పడానికి ఆధారాలు అంటూ ఏమీ లేవు, కానీ మన అంతరాత్మ ఒక్కోసారి మాట్లాడుతూవుంటుందిగా!

“నేను ఎం.ఎ. అబ్దుల్లా సాహిబ్ గురించి తవ్వడం మొదలుపెట్టాను. ఆయన దైనందిన జీవితం, అలవాట్లు, అభిరుచులు, ఇలా. చాలా గొప్ప వ్యక్తి. తూచా తప్పక నియమనిష్టలు పాటించే ముస్లిం. అలాగే గొప్ప కళాపిపాసకుడు. షాజహాన్ చక్రవర్తి అలానే ఉండి ఉంటాడు. గజల్స్ అంటే పిచ్చి. ప్రతి నెలా కనీసం ఒక ఉస్తాద్‌ అయినా ఉత్తరాదినుండి వచ్చి ఈయన ఇంట్లో పాడేవాళ్ళు. కవిత్వం, సాహిత్యంతో పరిచయం. తకళి శివశంకరపిళ్ళైకి స్నేహితుడు. వైకమ్ మహమ్మద్ బషీర్ ‘మిస్టర్ మే’ అని పిలిచేవాడు. ఎం.టి. వాసుదేవన్ నాయర్‌ తో ఈయనకు ‘రారా, పోరా’ అని పిలిచుకునేంత చనువు.
సాహిబ్ వేసుకునే బట్టలు ముంబైలో తయారయ్యి వచ్చేవి. ముంబై సుల్తాన్ అహ్మద్ పాషా అండ్ కంపెనీలో. నేను ముంబై వెళ్ళి ఆ దుకాణం చూశాను. ముస్లింల షేర్వానీలు, కమీజ్‌లకు ప్రసిద్ధి చెందిన దుకాణం. సాహిబ్ బట్టలు అక్కడే కుడతారు. అక్కడ పనిచేసే వాళ్ళకు లంచమిచ్చి సాహిబ్‌లు పెట్టుకునే టర్కిష్ టోపీలలో ఒకదాన్ని తీసుకొచ్చాను. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఇచ్చి పోల్చి చెప్పమన్నాను. శవం చేతిలో దొరికిన దారమూ టర్కిష్ టోపీలో ఉన్న దారమూ ఒకటే. ఇదేం కోర్టులో నిలబడే సాక్ష్యం కాదని తెలుసు. కానీ నా అనుమానాన్ని ఖరారు చేసుకోడానికి పనికొస్తుంది.

“ఆ బ్రాహ్మణ కుర్రాడికీ ఎం.ఎ. అబ్దుల్లా సాహిబ్‌కీ మధ్య సంబంధం ఏంటి? ఆ తీగెను వెతికి పట్టుకోవాలి. ముందుగా, ఒక విషయాన్ని కనుక్కోమన్నాను. కృష్ణన్ చనిపోయిన రోజు అబ్దుల్లా సాహిబ్ ఎక్కడ ఉన్నారు అని. తెలిసొచ్చిందేంటంటే ఆ రోజు, ఆయను కోళికోడ్‌లోని వాళ్ళ హాస్పిటల్లో ఒక కొత్త వార్డును ప్రారంభించడానికి స్థానిక ఎమ్మెల్యే, డిఎంఓలతో ఉన్నారు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయి. అకస్మాత్తుగా ఒక తలుపు మూసుకుపోయింది.

“కొద్దిగా నీరసం వచ్చింది. ఇన్వెస్టిగేషన్‌లో ఎదురయ్యే అడ్డంకులు ఎలాంటివంటే, ఎక్కడో ఏదో ఒక క్లూ దొరగ్గానే మన ఊహాశక్తితో ఒక బ్రహ్మాండమైన స్కెచ్చి వేసుకుంటాం. అది ఠప్పున బెలూన్‌లా పేలిపోతుంది. అందుకని ఊహను విస్తరించుకుంటూ వెళ్ళకుండా ఉండటం సాధ్యం కాదు. ఆ ఊహలతోనే మనం ఏ దిక్కుగా వెళ్ళాలన్న కొత్త మార్గాలు దొరుకుతాయి. వాటిలో ఏదో ఒకటే మనల్ని నిజమైన దారిలోకి తీసుకెళ్తుంది.

“ఉత్సాహాన్ని కూడబలుక్కుని నీరసంనుండి బయటికొచ్చాను. ఇలాంటి సందర్భాల్లో రొసారియో ‘సరైన మార్గం వైపుకు వెళ్ళడానికి దేవుడు నాకు మఱొక అవకాశం ఇచ్చాడనుకోవాలి’ అనుకోమంటాడు. ఆ మాటల్ని డైరీలో నాలుగైదుసార్లు రాశాను. ఇక ఎం.ఎ. అబ్దుల్లా వైపునుండి దర్యాప్తులు చెయ్యాల్సిన అవసరం లేదు. అటువైపునుండి నఱుక్కు రావాల్సిందే.

“ఆ అబ్బాయి గురించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశోధించాను. కథ ఇప్పుడు పూర్తిగా కోళికోడ్‌కు బదిలీ అయింది. కోళికోడ్‌లో నాకు అత్యంత సన్నిహితుడైన ఇన్‌స్పెక్టర్ మాధవన్ నాయర్ ఉన్నాడు. పూర్వం అతనికి ఎంతో సాయం చేసాను. ఇప్పుడు నా ఈ దర్యాప్తుకు అడ్డూ అదుపూ లేకుండా దారిచ్చేశాడు. కోళికోడ్‌తో కృష్ణన్ ఎంబిరాంద్రికి ఉన్న సంబంధాలు ఏమిటి?

“దర్యాప్తును ఒకే విషయంమీద కేంద్రీకరిస్తే, విచారణ ఒక కొలిక్కి రాకుండా దిక్కులేకుండా విస్తరించుకుపోతుంది. కానీ ఒక విషయాన్ని మఱొక విషయంతో కనెక్ట్ చేసి దర్యాప్తు చేస్తే పరిమితులు ఏర్పడతాయి. ఇది దర్యాప్తుల్లో నిగూఢమైన గోల్డెన్ రూల్. కృష్ణన్ ఎంబిరాంద్రి అని అన్వేషిస్తూ పోతే అది వక్రరేఖలా నిర్విరామంగా గిరికీలు కొడుతూనే వుంటుంది. అదే కృష్ణన్ ఎంబిరాంద్రి-కోజికోడ్‌ల మధ్య గీతగీస్తే సరళరేఖ ఔతుంది. ఈ రూటులో కేవలం ఎనిమిది రోజుల్లోనే అన్ని వివరాల్నీ సేకరించేశాం.

“వడకరకు, కోళికోడ్ పెద్ద దూరమేమీలేదు. తరచుగా జనాల రాకపోకలుండే ఊళ్ళే. కానీ ఈ కుర్రాడు పూజారి. తన చిన్న ప్రపంచంలో గిరిగీసుకు బతికినవాడు. అతను కోళికోడ్‌కు వెళ్ళిందే తక్కువ. సినిమాలు చూసే అలవాటు లేదు. ఈ ఊరినుండి కోళికోడ్‌‌కు తరచూ వచ్చెళ్ళేవాళ్ళు తొమ్మిదిమందని తేలారు. వాళ్ళలో ముగ్గురు టీచర్లు, ఒక స్టేట్ గవర్నమెంటు ఉద్యోగి, ఒక బేకరీలో పనిచేసే అతను, మిగిలిన వాళ్ళు సరుకులకోసం కోళికోడ్ మార్కెట్‌కు వెళ్ళొస్తుండే బడ్డీకొట్టు వ్యాపారులు.

“ఆ తొమ్మిదిమందిలో అతను పౌరోహిత్యం చేసే గుడికి వచ్చే భక్తులెవరెవరని ఆ లిస్టును మఱింత కుదించితే మిగిలింది రాధామణి. ఆమె కోళికోడ్ అవతలున్న ఎలత్తూర్ అనే ఊర్లో టీచర్‌గా పనిచేస్తుంది. ఆమె భర్తా, బిడ్డా వాళ్ళ స్వగ్రామమైన వడకరలోనే ఉంటారు. ఊరికి వచ్చినప్పుడు భగవతి గుడికి వెళ్ళి అమ్మవార్ని దర్శించుకుని వెళ్ళడం ఆమెకు అలవాటు. అవన్నీ పనికిమాలిన వివరాలే. చెప్పాలంటే నేను మొదటి పదిహేను రోజులు రాధామణిని పిలిచి మాట్లాడ్డానికే ఆసక్తి చూపించలేదు. ఉపయోగమేమీ ఉండదనిపించింది.

“కానీ మాధవన్ నాయర్ పంపించిన ఫైల్‌లో రాధామణి బ్లాక్-అండ్-వైట్ ఫోటో చూశాను. ఒక్క క్షణంలో నా బుర్రలో ఏదో వెలిగింది. నేను ఇలాంటి కేసులు చాలా చూశాను. పేద కుటుంబాల్లో కొన్నిసార్లు అసాధారణమైన అందమున్న అమ్మాయిలు ఉంటారు. నమ్మశక్యం కానంత గొప్ప అందగత్తెలు. ఆ అందమే వాళ్ళకు శాపంగా మాఱి ప్రశాంతమైన జీవనం జీవించలేకపోతారు. సమాజంలో డబ్బూ, హోదా ఉన్న ఏ బలవంతులకో ఉంపుడుగత్తెగా మాఱాలి, వాడి అనుమానాలను, పెట్టే హింసనూ జీవితాంతం భరిస్తూ చచ్చిపోవాలి. లేకపోతే ఈ బలవంతులు వెంటాడి వేటాడి వీళ్ళను నాశనం చేస్తారు. వీధి కూడలిలో పడున్న ఎలుక శవంలా, అన్ని కాకులూ చీల్చి చెండాడుతాయి.

“నేను రాధామణిని తీసుకురమ్మన్నాను. ఆమె గాబరా పడుతూ వచ్చింది. ఆమెకు అనుమానం రాకుండా ఉండాలని నేను స్కూళ్ళ డీ.ఈ.ఓ ఆఫీసుకు వెళ్ళి ఆయన గదిలో కూర్చున్నాను. ఆయన ప్యూన్‌ని రాధామణి వాళ్ళ స్కూల్‌కి పంపించి ఆమెను రమ్మని చెప్పాను. ఆ ప్యూన్‌కి నేను పోలీస్ ఆఫీసర్‌ని అని తెలియదు. కానీ ఆమె ఎలాగో గ్రహించింది. పిలుపు అందగానే ఊహించి ఉండొచ్చు.

“ఆమె లోపలికి రాగానే నేను ప్రశాంతంగా ఉండాలని దీర్ఘంగా శ్వాస తీసుకున్నాను. నా చూపును అదుపులో పెట్టుకోవడం నాకు చాలా కష్టమైంది. ఆమె ఎంత అందంగా ఉందో ఎలా చెప్పగలను? ఇదిగో, ఈ పశ్చిమ సముద్రతీరం మానవజాతి సంకరాలకు ఓ గొప్ప టెస్టు కేసు. ప్రపంచవ్యాప్తంగా, ఇలా నానాజాతుల సంకరం జరిగిన చోట్లే గొప్ప అందగత్తెలు పుట్టారు. ఉదాహరణకు, ఇటలీ, ఆసియా-ఐరోపాలకు చెందిన జాతులు కలిసిన భూమి. లాటిన్ అమెరికా మఱొక ఉదాహరణ. అంతకంటే ముందే తెల్లతోలున్న ఆర్యులు, నల్లతోలున్న కాప్టిక్ జాతీ కలయికతో అరేబియా ఏర్పడింది. కాక్‌టెయిల్‌కంటే మించిన మందులేదని చాటి చెప్పిన ఫ్రెంచ్ వాళ్ళు ఊరికే చెప్పారా? నిజమైన సౌందర్యారాధకులు వాళ్ళు.

“అరబ్బులు, పోర్చుగీసులు పశ్చిమతీరానికి వచ్చారు కాబట్టి ఇక్కడ అద్భుతమైన కలయికలు జరిగాయి. ఇక్కడ అన్ని కులాలు, మతాల వాళ్ళలోనూ జాతి సంగమానికి ఆనవాళ్ళు ఉన్నాయి. నీలి కళ్ళున్న వా‌ళ్ళు కోకొల్లలుగా కనబడుతుంటారు. కొంకణీ బ్రాహ్మలు, మధ్వ బ్రాహ్మలు, ముస్లింలు, నాయర్లు, నంబియార్లు ఒకరని కాదు, అన్ని కులాల్లో సంకర రక్తం ఉండే వాళ్ళుంటారు. నిజానికి కులాల క్రమంలో కిందకి వెళ్ళిన కొద్దీ జాతి సంకరం తగ్గుతుంది.

“రాధామణి ఎలా ఉండేది? కాస్త బొద్దుగా ఉన్న ఐశ్వర్య రాయ్ అనొచ్చు! ఆమె వచ్చి కూర్చోగానే ఆమెలో దడ మొదలైంది. నేను సూటిగా “చెప్పు,” అన్నాను. ఆమె చేతులు జోడించింది. “నాకు అంతా తెలుసు. నేను వినదలచుకున్నది కేవలం నీ తరఫున నువ్వు ఏం చెప్పదలచుకున్నావన్నది మాత్రమే” అన్నాను.

ఆమె భోరుమని ఏడ్చింది. నేను ఏడుపు ఆగేంతవరకు ఊరుకున్నాను. కానీ ఇలాంటప్పుడు వాళ్ళను ఎక్కువసేపు అలా వదిలేయకూడదు. ఆలోచించడం మొదలుపెట్టేస్తారు.

నేను మళ్ళీ గట్టిగా “మాట్లాడు,” అన్నాను.

ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. ఒక గట్టి షాక్ తగిల్తేగానీ చెప్పదు. నేను బిగ్గరగా, “చెప్పు, కృష్ణన్‌ని చంపింది నువ్వా? నీ భర్తా?” అని అడిగాను.

ఆమె కంగారుగా, “లేదు సార్! లేదు సార్!” అంది. “మాకు ఏమీ తెలియదు, సార్. అతను ఎందుకు మంగళూరుకు వెళ్ళాడో నాకు తెలియదు, సార్.”

“నీకతను తెలుసు కదా?”

“అవును సార్… తెలుసు.”

“చెప్పు.”

“నేను కృష్ణన్‌తో అన్నీ చెప్పాను సార్. అతను నా తమ్ముడ్లాంటివాడు. ఊరికి వెళ్ళినప్పుడు తరచుగా గుడికి వెళ్ళేదాన్ని. ఆప్యాయంగా మాట్లాడేవాడు. నా సమస్యలు విని చక్కటి సలహాలు ఇస్తుండేవాడు. అందుకే అతనికన్నీ చెప్పాను.”

“ఏం చెప్పావు?”

“ఆయన పెట్టిన ఇబ్బందులు గురించి.”

“ఎవరు పెట్టిన ఇబ్బందులు?”

ఆమె మాట్లాడకుండా ఆగిపోయింది.

“చెప్పు.”

ఆమె పెదవులు కొరుక్కుంది.

“నాకు అన్నీ తెలుసు. అది నీ నోటినుండి వినాలి. అంతే. నీ అంతట నువ్వే చెప్పేస్తే వదిలేస్తాను. లేకపోతే జైలే”

“చెప్పలేను సార్. నేను ఓ మామూలు కుటుంబంనుండి వచ్చాను. నాకు వెనకా ముందూ పెద్ద ఎవరూ లేరు.”

“నువ్వు ఎవరికి భయపడుతున్నావో నాకు తెలుసు. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు నాకు చెప్పేది ఎక్కడా రిపోర్టులో రాయను. ఎవరైనా నిన్నడిగితే నీకేం తెలీదని చెప్పానని చెప్పు.”

“వాళ్ళు నన్ను చంపేస్తారు.”

“దాన్నుండి తప్పిస్తాననే కదా నేన్నీకు చెప్తున్నది? కానీ నువ్వు నాకు చెప్పకుండా మాత్రం తప్పించుకోలేవు. నిన్ను, నీ భర్తను వెంటనే అరెస్టు చేస్తాను. ఆ న్యూసు, పేపర్లో కూడా వేస్తారు.”

“నేను ఏం చెయ్యలేదు సార్.”

“ఆ విషయాన్ని నేను రూఢి చేసుకోవాలంటే, నువ్వు నిజం చెప్పాలి. నిజం చెబితే, నీకు పోలీసు రక్షణ ఉంటుంది. నువ్వు చెప్పకపోతే పోలీసులు కూడా నీకు శత్రువులై పోతారు. నువ్వొచ్చి సహాయం అడిగినా పోలీసులు పట్టించుకోరు.”

“సార్!” అని మళ్ళీ గట్టిగా ఏడ్చింది.

నేను పదే పదే ఆమెకు అదే మాట చెప్తూ ఉన్నాను. విచారణలో అదొక పద్ధతి. తప్పించుకోడానికి ఒక్క దారి మాత్రం తెఱవడం. మిగిలిన అన్ని దారుల్నీ ఏదో లాజిక్కులు చెప్పి మూస్తూ పోవడం. ఆమె తప్పక ఈ దార్లోకి రావాల్సిందే. కానీ ఆపకుండా అదే చెప్తూ ఉండాలి. రకరకాలుగా అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాలి. అవే మాటలు వినీవినీ అవతలి వాళ్ళ బుర్ర నీరసించిపోతుంది. ఆలోచించలేని పరిస్థితికి తీసుకెళ్ళిపోతుంది. నేను ఆపకుండా చెప్తూ పోవడంతో, ఆమె డస్సిపోయి చివరికి సర్దుకుని కూర్చుంది.

“చెప్పు” అన్నాను.

“అతను నా వెంటబడేవాడు సార్.”

“ఎవరు?”

“అతనే సార్. అబ్దుల్లా సాహిబ్ కొడుకు.”

“పేరు?”

“హాషిమ్…”

“మొహమ్మద్ హాషిమ్?”

“అవును, సార్”

“కానీ… చెప్పు!”

“ఒకసారి నన్ను అతను రోడ్డు మీద చూశాడు. అప్పట్నుండి నా వెనకాలే వస్తూండేవాడు. పెద్ద నల్ల కారు నా వెంటే వస్తుండేది. ఒకోసారి బైక్ మీద వచ్చి మా ఇంటికి ముందు నిలబడి నన్నే చూస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడూ స్కూల్ గేటు దగ్గర నిల్చుని ఉండేవాడు.”

“కానీ…”

“అతని దగ్గర పనిచేసే ఒకడు వచ్చి ఆయన నన్ను ప్రేమిస్తున్నారని చెప్పాడు. ఆ పనివాడి పేరు అబ్దుల్ అజీజ్. అతను నన్ను హాషిమ్‌తో వాళ్ళ బీచ్ బంగ్లాకు వెళ్ళి ఒక రోజు గడపగలవా?’ అని అడిగాడు. లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాడు. నేను వాడి మీద ఉమ్మేసి తిట్టి పంపించేశాను.”

“ఊ…”

“ఆ తర్వాత కూడా వాడు వచ్చి మాట్లాడాడు. అస్సలు వదల్లేదు. మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నాడు. నేను ఎంత తిట్టినా వదిలిపెట్టలేదు. చాలా డబ్బులిస్తానని చెప్పాడు. పదిహేను లక్షల వరకు అన్నాడు. ”

“పదిహేను లక్షలా?” ఆ క్షణంలో ఈ పిల్లకేమైనా పిచ్చా అనిపించింది! ఎందుకంటే మేము నస్రానీ కిరస్తానీలం! ఫక్తు యాపారస్థులం.

“అవును. నాకు పెద్ద ఇల్లు కొనిచ్చి, ఎస్టేట్ రాస్తారని చెప్పాడు అజీజ్. ఒక రోజు వజ్రాల నగలు తీసుకొచ్చి చూపించాడు. నాకు ఏమి చెయ్యాలో అర్థంకాలేదు. నేను చాలా రోజులు స్కూల్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయాను. అజీజ్ నా ఇంటికే వచ్చేశాడు. నా భర్తను విడిచిపెట్టి వచ్చేస్తే రాణిలా ఉండొచ్చని చెప్పాడు. నాకు మంగళూరులోనో ముంబైలోనో ఒక పెద్ద ఇల్లు, కారు ఇస్తారని చెప్పాడు.”

“ఓకే”

“చివరకు, ఒక రోజు అతనే స్వయంగా వచ్చాడు.”

“హాషిమ్?”

“అవును, నన్ను పెళ్ళి చేసుకో అన్నాడు. అతను నాకంటే నాలుగేళ్ళు చిన్నవాడు, పెళ్ళి కాలేదు. అతను నన్ను మతం మార్చి భార్యగా చేసుకుంటానని చెప్పాడు. వాళ్ళ అమ్మా-నాన్నలు, అన్నయ్యలూ అందర్నీ ఒప్పిస్తాను అన్నాడు.”

“నువ్వేం అన్నావు?”

“నేను అతని కాళ్ళమీద పడి ఏడ్చాను. నన్ను నా దారికి వదిలేయమని వేడుకున్నాను.”

“అతను నిన్ను బెదిరించాడా?”

“లేదు, అతను కూడా ఏడ్చాడు. నన్ను మర్చిపోలేకపోతున్నానన్నాడు. నేను దొరక్కుంటే చచ్చిపోతానని కూడా అన్నాడు.”

“నువ్వేం అన్నావు?”

“అతన్ని తిట్టి, బయటకు పో కుక్కా అన్నా. అలా అనకు, అలా అనకు అంటూ అరుస్తూ నన్ను పట్టుకోవడానికి వచ్చాడు. బలాత్కారం చెయ్యడానికి కాదు. ఏడుస్తూ బాధతో నన్ను హత్తుకోడానికి వచ్చాడు. నాకు కోపం వచ్చి అతన్ని దూరంగా నెట్టేశాను. అతను కింద పడిపోయాడు. నా చేతికందిన ప్రతిదీ తీసి అతని మీదకు విసిరాను. అతను లేచి బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉన్మాదిలా అరుస్తూనే ఉన్నాను. ఆ తర్వాత కూర్చుని ఏడ్చాను.”

“ఆ తర్వాత?”

“తర్వాత చూస్తే గదంతా చెల్లాచెదరుగా వస్తువులు, విరిగిన వస్తువుల ముక్కలు. అన్నీ తీసి సర్దాను. అక్కడ ఓ టోపీ కనపడింది. అతని టోపీ.”

నేను లేస్తూ “టర్కిష్ టోపీనా?” అనడుగుతూ ఫోటో చూపించి, “ఇలాంటిదా?” అనడిగాను.

“అవును”

ఒక క్షణం నా బుర్రలో ఎంత మట్టి పేరుకుపోయిందో అర్థమై నామీద నాకే చిరాకేసింది! అబ్దుల్లా సాహిబ్ కొడుకులు కూడా అవే టోపీలు పెట్టుకుంటూండొచ్చు అన్న ఆలోచనే నాకసలు రాలేదు.

“ఆ టోపీ ఎక్కడ?”

“దాన్ని పడేయాలనుకున్నాను. కానీ ఎవరి కంటయినా పడొచ్చనిపించింది. అందుకని దాన్ని వంటగదిలో ఒక పెట్టెలో పెట్టాను.”

“తర్వాతేం జరిగింది?”

“ఒంట్లో బాలేదు, అమ్మ దగ్గరకు వెళ్తున్నాను అని లెటర్ రాసిపెట్టి వడకరకు వెళ్ళిపోయాను. ఆరు రోజులు అక్కడే ఉండిపోయాను.”

“అప్పుడు కృష్ణన్‌ని కలిశావు కదా?”

“అవును, అతనికి అదివరకే ఇవన్నీ చెప్పున్నా కాబట్టి తర్వాత జరిగిందంతా చెప్పి మా ఆయనకి చెప్పనా? అనడిగాను. ‘వద్దు, చెప్పకు, చెప్తే మీ ఆయన నిన్ను ఇంకా ఎక్కువగా అనుమానిస్తాడు’ అన్నాడు. నిజమే, మా ఆయనకు ఎప్పుడూ అనుమానమే. మగవాళ్ళు ఎవరైనా నాతో మాట్లాడితేనే, ఇంటికి వచ్చి నన్ను కొట్టేవాడు. ఆఖరికి ముసలోళ్ళు మాట్లాడినా కూడా…”

“ఆ రోజు జరిగిందంతా కృష్ణన్‌కి పూసగుచ్చినట్టు చెప్పావు కదా?”

“అవును.”

“తర్వాత?”

“అమ్మవాళ్ళ ఇంటినుండి తిరిగి వచ్చేశాను. అప్పుడు కొంచెం మనసు తేలిక పడినట్టు అనిపించింది.”

“ఆ తర్వాత హాషిమ్ నుండి ఏవైనా ఇబ్బందులొచ్చాయా?”

“లేదు. ఎలాంటి ఇబ్బందీ రాలేదు. అతను ఏదైనా చేస్తాడేమోనని ఒక వారంపాటు ఎక్కడా బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాను. అతను రాలేదు. అప్పుడు మళ్ళీ స్కూలుకు వెళ్ళడం మొదలుపెట్టాను. మఱో వారానికి అంతా బాగానే ఉన్నట్లు అనిపించింది.”

“అప్పుడు కృష్ణన్ వచ్చాడు కదా?”

“అవును.”

“ఏమన్నాడు?”

“ముంబైకి వెళ్ళి అక్కడ ఉద్యోగం వెతుక్కుంటానని చెప్పాడు.”

“అతనికి ఇక్కడ లక్షన్నరవరకు అప్పు ఉంది, నీకు తెలుసా?” అడిగాను.

“తెలుసు” అంది. “అతనికి గుడిలో జీతంలాంటిదేం లేదు. దక్షిణలు కూడా పెద్దగా రావు. కుటుంబాన్ని పోషించడం గగనంగా ఉండేది. అప్పుడప్పుడు నా దగ్గర కూడా అప్పు తీసుకునేవాడు. అప్పు తీర్చలేకే ఊరు విడిచి వెళ్ళిపోయాడు. అప్పు ఇచ్చిన వాళ్ళు బాగా బెదిరించారు. ఒక్క రోజు కూడా ఊర్లో ఉండలేని పరిస్థితి. ఇంటి పత్రాలవీ కూడా వేరే ఎవరి దగ్గరో ఉండేవి. అరవై వేలు అప్పిచ్చిన ఒకాయన ‘వడ్డీతో కలిపి నాకు ఎనబై వేలు ఇవ్వకపోతే ఇంటికొచ్చి, నా డబ్బు నాకివ్వకుంటే వీధిలోకి ఈడ్చుకొచ్చి పంచె ఊడదీసి కొడతాను’ అని బెదిరించాడు. అది విని భయపడి ఇంటినుండి పారిపోయాడు.”

“నిన్నేమైనా డబ్బులు అడిగాడా?”

“అడిగాడు. కానీ నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర నా నగలూ ఏవీ లేవు. మా ఆయన అంతకు ముందు నెలలోనే కో-ఆపరేటివ్ బ్యాంకులో అన్నీ తాకట్టు పెట్టాడు. ఇల్లు కట్టుకోవడానికి చిన్న స్థలం కొనాలని అనుకున్నాం. నా దగ్గర అరవై రూపాయలు మాత్రమే ఉందని చెప్పాను. వాడి దగ్గర ఎనిమిది రూపాయలు ఉందన్నాడు.”

“ఇంకా?”

“ఏం చేయాలో దిక్కు తోచట్లేదని ఏడ్చాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఎవర్నడగాలో తెలీడం లేదన్నాడు. నేను కూడా ఏడ్చాను. ఉన్నట్టుండి, నీ దగ్గర ఆ టర్కిష్ టోపీ ఉంది కదా దాన్ని నాకివ్వు అని అడిగాడు.”

“ఇచ్చావా?”

“అవును.”

నేను నిట్టూర్చాను.

“టోపీ తీసి తన సంచిలో పెట్టుకుని వెళ్ళిపోయాడు.”

“ఆ టోపీతో ఏం చెయ్యాలనుకున్నాడో నీకు తెలుసా?” అడిగానామెను.

“అప్పుడు తెలియదు, తర్వాత తెల్సింది.”

“ఏమని?”

ఆమె పెదవులు కొరుకుతూ మౌనంగా ఉండిపోయింది.

“చెప్పు.”

“అతను హాషిమ్‌ను బెదిరించడానికి వెళ్ళి ఉండొచ్చని.”

“హాషిమ్‌ని కలిశాడా?”

“నాకు తెలియదు.”

“హాషిమ్ నిన్ను తరువాత కలిశాడా?”

“లేదు.”

“అతను హాషిమ్‌ను కలిసుంటే, బ్యాగులో ఆ టోపీ ఉండదు కదా? అతను ఆ టోపీతో మంగళూరువరకు ఎందుకు వెళ్ళాడు.”

“నాకు తెలియదు.”

“సరే, నువ్వు వెళ్ళొచ్చు.”

“సార్, నాకెలాంటి సమస్యలు రావు కదా? పసిబిడ్డ తల్లిని.”

“నీకెలాంటి సమస్యలూ రావు.”

ఆమె ఇంకో క్షణం తడబడి, “సార్” అంది.

“చెప్పు.”

“అతను కృష్ణన్‌ని చంపి ఉండడు” అని ఆమె చెప్పింది.

“ఎవరు?”

“హాషిమ్.”

“నువ్వెలా చెప్పగలవ్?”

“సార్, అతను చాలా మంచి కుర్రాడు. మంకుపట్టు పట్టే మొండి పిల్లాడ్లా అనిపించాడు నాకు. బాగా కలిగిన ఇంటి పిల్లవాడు. కోరుకున్నవన్నీ చేజిక్కించుకున్నవాడు. అతనికి ఇతరుల మనస్తత్వం అర్థం కాదు. ఇతరుల జీవిత పరిస్థితులు, యథార్థాలూ తెలియవు. అందుకే అంటున్నాను అతనిదొక చిన్న పిల్లవాడి మనస్తత్వం అని.”

“చిన్నపిల్లలు కూడా హత్యలు చేస్తారు, చూడలేదా? చిన్న చిన్న పురుగుల్ని…”

ఆమె కళ్ళలో నీళ్ళు పొంగుకు రావడం చూశాను, “హాషిమ్ దృష్టిలో కృష్ణన్ ఒక చిన్న పురుగే” అన్నాను.

“లేదు సార్, నాకు తెలుసు…”

నేను ఆమె కళ్ళలోకి చూసి, “అతని పట్ల సానుభూతా?” అనడిగాను.

ఆమె నా కళ్ళలోకి సూటిగా చూసింది, ఇప్పుడు ఆమె పూర్తిగా భిన్నమైన మఱో మనిషిలా అనిపించింది. “అవును” అంది.

“లేదు, ప్రేమా?”

“తెలియదు. కానీ అతని కళ్ళలో నా మీద తనకున్న ప్రేమ కనిపించింది. ఎవరి కళ్ళలోనూ అలాంటి ప్రేమ నాకు కనపడలేదు. నన్ను చూసే వాళ్ళందరి కళ్ళల్లో నాకు ఓ మాంసం ముక్కను చూసే కుక్క చూపే కనపడుతుంది.”

నేను చిన్నగా నవ్వాను.

“అతను చంపడు సార్.”

“అతనికి నీ మీద అంత స్వచ్ఛమైన, గాఢమైన ప్రేమ ఉంటే, దానికోసం అతను ఏమైనా చేయగలడు కదా?”

“అవును, నా ఇంటి వాకిట్లో నిల్చుకోవచ్చు. నా కోసం ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు. కానీ అతను నన్ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నించాడన్న వాస్తవాన్ని మాత్రం దాచడు. దాని అడ్డు పెట్టుకుని బెదిరించే ఎవరినీ అతను చంపడు.”

“నువ్వు హాషిమ్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నావా?”

“ఆమె కళ్ళు! అబ్బాయిలూ, పిచ్చి కథలు రాసుకునే సగం మలయాళీ అరవోడా, ముఖ్యంగా నువ్వు… మీరందరూ ఒక విషయం బాగా తెలుసుకోండి. కొన్ని సందర్భాల్లో మనుషుల మనస్సు లోపలేముందో తేటతెల్లంగా కనపడ్డప్పుడు వెన్నులో వణుకుపుడుతుందంటే నమ్మండి.

“ఆమె దృఢమైన స్వరంతో, ‘అవును, నా జీవితంలో నాకు తీపి గురుతు ఏదైనా ఉందంటే అదొక్కటే. నేను చనిపోయే రోజు వరకు అతనికోసం చూస్తూ అతని ప్రేమను గుర్తు చేసుకుంటూ ఉంటాను,’ అంటూ సమాధానం ఇచ్చింది.

“ఆమె వెళ్ళిపోయిన తర్వాత, నాకు చాలాసేపు ఏమీ తోచలేదు. కూర్చుని ఏవేవో ఆలోచిస్తున్నాను. తర్వాత ఏం జరిగి ఉంటుంది? కృష్ణన్ వెళ్ళి హాషిమ్‌ని బ్లాక్-మెయిల్ చేశాడా? డబ్బు తీసుకునుంటే ఆ టోపీ ఎలా ఇంకా వాడి దగ్గరే ఎలా ఉండుంటుంది? అతనికి హషిమ్ నించి డబ్బు అందకపోయుంటే మంగళూరుకు ఎందుకు వెళ్ళాడు?

“ఏ కోణంలో దర్యాప్తు చేయాలో నాకు తెలియలేదు. ఒక రోజంతా కోళికోడ్‌లోని ఒక హోటల్‌లో ఉన్నాను. చివరగా ఒకటి తట్టింది, నేరుగా ఎం.ఎ. అబ్దుల్లానే అడగడం మంచిదని. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన అబద్ధమాడరు. నవ్వుతున్న ఆయన ముఖం నా కళ్ళ ముందుకొచ్చింది. గొప్ప వర్చస్సు ఉన్న ముఖం – అలాంటి పరిస్థితిలో కూడా నాకలా అనిపించడం ఆశ్చర్యం.

“వకీల్ అబ్దుల్ షమీర్ ద్వారా ఎం.ఎ. అబ్దుల్లా సాహిబ్‌ను ఏకాంతంగా కలవడానికి సందేశం పంపాను. ఒక కేసు విషయంగా అని కూడా తెలియజేయమన్నాను. ఆయన రమ్మన్నారని వకీల్ కబురందించాడు. సాహిబ్ సహాయకుడు ఖాదర్ వచ్చి నన్ను తీసుకెళ్ళాడు. ఈసారి నేను ఆయన్ని సముద్రంలో లంగరు వేసిన ఒక పెద్ద ఆడంబరమైన లాంచీలో కలిశాను. అంతకు ముందే మఱొక సమావేశం ముగించుకుని ఆయన నాకోసం చూస్తూ ఉన్నాడు.

“వికసించిన ముఖంతో రెండు చేతులూ బార్లా చాపుకుంటూ వచ్చి నన్ను కౌగిలించుకుని స్వాగతం పలికారు. కుశలప్రశ్నలు వేస్తూ కూర్చోమని చెప్పారు. కాసేపు మామూలు పలకరింపులు సాగాయి. నేను ఒక కేసు గురించి కలవడానికి వస్తున్నట్టు అదివరకే చెప్పున్నాను. అది కృష్ణన్ గురించిన కేస్ అన్నది కూడా ఆయనకు తెలిసే ఉంటుంది. అయినా ఆయన ముఖంలో, మాటలో ఎలాంటి మార్పూ లేదు. ఎప్పుడూ తొణికిసలాడే అదే అందమైన చిరునవ్వు. ఖచ్చితమైన తెల్లటి పలువరుస. స్పటికంలాంటి కళ్ళజోడు.

“నేను నేరుగా విషయానికొచ్చాను. ‘సాహిబ్, నేను ఒక కేసు విషయంగా దర్యాప్తు చేయడానికి వచ్చాను. ఒక హత్య కేసు. మీరు చేసిన హత్యే అయినా దాచరని నాకు తెలుసు’.

“అవును, నేను నా జీవితంలో ఎవరినుండి ఏదీ దాచింది లేదు” సాహిబ్ అన్నారు.

“సాహిబ్, కృష్ణన్ ఎంబిరాంద్రి అనే యువకుడు మంగళూరులో హత్యకు గురయ్యాడు. అతన్ని మీరో మీ మనుషులో చంపారా?”

“లేదు,” అన్నారు సాహిబ్.

“సరే, మీరు అతన్ని కలిశారా?”

“అవును,” చెక్కుచెదరని చిరునవ్వుతో అన్నాడు.

“ఎక్కడ, ఎప్పుడు అని తెలుసుకోవచ్చా?”

“అతను చనిపోయిన తేదీ గత ఏడాది జూలై 19 కదా?”

“అవును.”

“దానికి నాలుగు రోజుల ముందు, జూలై 15న కలిశాను.”

“అంటే, అతను వడకరనుండి బయలుదేరిన మఱుసటి రోజు.”

“అవును.”

“ఎక్కడ, ఎలా కలిశారు?”

“మా అబ్బాయికోసం వెతుకుతూ మా ఇంటికి వచ్చాడు. సాధారణంగా ఎవరూ మా స్థావరానికి అలా రారు. అతను బ్రాహ్మణుడు, కాబట్టి భయపడాల్సిన పని లేదని అతనికి తెలుసు. నా సహాయకుడు హాజీ ముస్తఫా అక్కడ ఉన్నాడు. హాషిమ్‌ని కలవడం వీలుకాదని ముస్తఫా అతనికి చెప్తే సాహిబ్‌ని కలుస్తానని చెప్పాడట. పిచ్చోడేమోనని ఒక క్షణం అనుమానం వచ్చింది ముస్తఫాకి. సాహిబ్‌ను కలవడానికి లేదని అన్నాడు. దానికి ‘ఇప్పుడు నన్ను కలవకపోతే, రేపు వాళ్ళిద్దరూ పోలీసుల్ని కలవాల్సి వస్తుంది’ అని గట్టిగా అరిచాడట.

“నేను నవ్వాను.

“సాహిబ్ కూడా నవ్వి, “ముస్తఫా నాకు ఫోన్ చేసి చెప్పాడు. అతన్ని నా దగ్గరకు పంపించమని చెప్పాను. అతనో పిచ్చి బ్రామ్మడని అర్థమైంది. నేను నాలుగు మంచి మాటలు చెప్పి సముదాయించి పంపించేయొచ్చని అనుకున్నాను.”

“నిజంగా పిచ్చి బ్రామ్మడే!”

“రాగానే నాతో బిగ్గరగా మాట్లాడటం మొదలుపెట్టాడు. నన్ను బెదిరించాలనుకున్నాడు. కానీ అతనికి అలాంటివి అలవాటులేదు. గొంతు మాత్రమే గట్టిగా వినిపించింది. లోలోపల బాగా భయపడుతున్నాడని తెలుస్తోంది. తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. నా కొడుకు హషిమ్ ఒక సగటు అమాయక మహిళను చెరచడానికి ప్రయత్నించాడని, ఆమె అతన్ని కొట్టి తరిమికొట్టిందని, దానికి తన దగ్గర ఆధారాలున్నాయని చెప్పాడు. హిందూ ఆడవాళ్ళను ముస్లింలు చెరచడాన్ని బట్టబయలు చేస్తే కల్లోలాలు చెలరేగుతాయని అన్నాడు.”

“సాహిబ్ చాలా సహజంగా అప్రయత్నంగా, ఏ భావోద్వేగాలు లేకుండా చెప్పుకుపోతున్నారు. ఎవరి కథో చెబుతున్నట్లు. ‘నేను అతన్ని కూర్చుని మాట్లాడమన్నాను. సమస్య ఏంటని అడిగాను. నన్నూ, నా కొడుకునీ జైలుకు పంపుతానని మళ్ళీ బెదిరించాడు. ‘విషయమేంటో చెప్పండి స్వాములూ’ అన్నాను. తర్వాత అతను కాస్త శాంతించి హాషిమ్, రాధామణి అనే అమ్మాయిని వెంబడించినట్టూ, బెదిరించినట్టూ చెప్పాడు. చివరికి ఇంట్లోకి దూరిపోయి ఆమె మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని చెప్పాడు.

“నేను సాహిబ్ ముఖమే చూస్తున్నాను. అదే చిరునవ్వు, కవళికలు మారని ముఖం, స్పష్టమైన కళ్ళు. ఎంత బిగువైన నరాలు అని ఆశ్చర్యపోయాను. తరతరాలుగా మంటలు, రక్తం, కన్నీళ్ళను చవిచూసినవవి.

“నేను అతన్ని వేచి ఉండమని చెప్పాను. లేచి వెనుక గదికి వెళ్ళి హాషిమ్ దగ్గర పనిచేసే అజీజ్‌ని తీసుకు రమ్మని చెప్పాను. అతను రాగానే ఏమయ్యిందని ఆరా తీశాను. అజీజ్ వణికిపోయాడు. నానుండి ఎవరూ ఏమీ దాచలేరని అతనికి తెలుసు. హాషిమ్ రాధామణిని వెంబడించి ఆమెను ఆకట్టుకోడానికి ప్రయత్నించాడన్నది నిజమేనని చెప్పాడు. కానీ ఆమె మీద ఎటువంటి అత్యాచార ప్రయత్నమూ చెయ్యలేదని, హాషిమ్ ఆమెను పిచ్చిగా ప్రేమిస్తున్నాడనీ ఎలాగైనా ఆమె ప్రేమను పొంది ఆమెను పెళ్ళి చేసుకోవాలని కలలు కంటున్నాడని చెప్పాడు.”

“నేను ఒక్కటే అడిగాను, ఆ అమ్మాయి ఏమంటోంది? అని. ఆమె హాషిమ్‌ను ఇష్టపడలేదని, తన భర్తతో కలిసి ప్రశాంతంగా జీవించనివ్వమని ఏడుస్తూ వేడుకున్నదని చెప్పాడు. ‘సరే, వెళ్ళు’ అని అజీజ్‌కు చెప్పి కృష్ణన్ ఉన్న గదికి వచ్చాను.

“సాహిబ్ కొనసాగించారు. “కృష్ణన్ గాబరా పడిపోతున్నాడు. అంత ఒత్తిడిని అతను తట్టుకోలేకపోతున్నాడు. లేచి గదిలోనే తిరుగుతున్నాడు. నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి కనుక్కున్నారు కదా? నేను చెప్పేది నిజమే కదా? నా దగ్గర ఆధారాలున్నాయి అన్నాడు.

“నేను అతన్ని మళ్ళీ కూర్చోమన్నాను. ‘సరే, ఇక ముందు మా అబ్బాయివల్ల ఎటువంటి ఇబ్బందీ రాదు’ అన్నాను. ‘కానీ ఇప్పటివరకు కలిగించిన ఇబ్బందికి సమాధానం ఏమిటి?’ అని అరిచాడు కృష్ణన్. ‘ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఇదేనా ప్రసిద్ధ మాలిక్ దినార్ రాజవంశస్తుల ప్రవర్తన? పేదింటి ఆడవాళ్ళను వెంటాడి అత్యాచారం చేయడమే కుంఞాలీ మరకాయర్ల వారసులు చేసే పని? హాజీ ఎం.ఎ. అబ్దుల్లా సాహిబ్ అంటే ధర్మం తప్పని దేవుడు అని అంటారే, దాని అర్థం ఇదేనా?’ అని అరుస్తూ ఉన్నాడు.

“నేను అతనిని మళ్ళీ మళ్ళీ శాంతపరచడానికి ప్రయత్నించాను. ‘సరే, దీన్నంతా మఱిచిపొమ్మని ఆ అమ్మాయికి చెప్పండి. ఇకనుండి ఆమె నిర్భయంగా ఉండొచ్చని చెప్పండి. ఆమెకు ఎలాంటి సమస్యా రాకుండా నేను చూసుకుంటాను’ అన్నాను. ‘ఈ విషయంలో ఆమె ఊరుకున్నా, నేను ఊరుకోను’ అన్నాడు కృష్ణన్. ‘సరే, మీకు ఏం కావాలి?’ అని అడిగాను. ఉన్నపళాన నేను అలా అడిగేసరికి ఏం చేయాలో తోచక నిశ్చేష్టుడైపోయాడు. ఏమీ చెప్పలేక పోయాడు. అభంశుభం తెలీని అమాయకుడు. కంగారుగా ఊపిరి పీల్చుకున్నాడు. కాసేపటి తర్వాత రెండు లక్షల రూపాయలు కావాలన్నాడు.” సాహిబ్ అన్నారు.

“అతనికి ఉన్న అప్పు అంతే” అన్నాను.

“అవును, అది నాకు వెంటనే అర్థమైంది. నేను లేచి నాలుగు లక్షల రూపాయలు తెచ్చి, ఒక ప్లేట్లో పెట్టి, ఆపిల్, తమలపాకులు, పువ్వులతో కలిపి ఉంచి అతనికి ఇచ్చాను. ‘స్వాములూ, మీరు నన్ను బెదిరించడంవల్ల నేను దీన్ని మీకు ఇవ్వట్లేదు. నన్ను ఎవరూ బెదిరించలేరు. మీరు పౌరోహిత్యం చేసుకునే పవిత్ర బ్రాహ్మణులు, నేను ఒక సాధారణ క్షత్రియుడ్ని, కాబట్టి దీన్ని నైవేద్యంగా మాత్రమే సమర్పిస్తున్నాను. మీరు దయచేసి దీన్ని స్వీకరించి నన్ను, నా కుటుంబాన్ని దీవించాలి!” అన్నాను. అతను గబుక్కున డబ్బు కట్టలు మాత్రమే తీసుకున్నాడు. దాన్ని తన సంచిలో పెట్టుకుని, ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకు పరుగుతీశాడు.”

“అతను వె‌ళ్ళడాన్ని కాసేపు నిల్చుని చూశాను. నేను తప్పు చేశానేమో అనిపించింది. అతను ఆ డబ్బును దాచలేడు. ఎక్కడో రౌడీలకు పట్టుబడే అవకాశాలున్నాయి. ఆ డబ్బును అతని ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చి ఉండాలి. డబ్బు భలే చెడ్డది! అయినా అతను నేరుగా ఇంటికే వెళ్తాడు అనుకున్నాను. ఎందుకంటే రెండు లక్షల రూపాయలు అదనంగా ఉన్నాయి. అప్పులన్నీ తీర్చాక కూడా మిగిలిన డబ్బుతో ప్రశాంతంగా బతకొచ్చు. అయితే నాలుగు రోజుల తర్వాత, అతను మంగళూరులో హత్యకు గురయ్యాడని వార్తలు వచ్చాయి. ఏం జరిగిందో నాకు అర్థమైంది. అతని చేతిలో డబ్బు ఉందని చూసి ఎవరో అతన్ని చంపేశారు. చేయగలిగింది ఏమీ లేదు. నేనే అతని చావుకు కారణమని బాధేసింది…”

“సాహిబ్, నేను మొదటిసారి వచ్చి కలిసినప్పుడే నేను ఈ కేసు గురించి దర్యాప్తు చేస్తున్నట్టు మీకు తెలుసా?”

“సాహిబ్ నవ్వి, ‘బాగా తెలుసు. కృష్ణన్ చేతిలోని పట్టుజరీ దారం గురించి కూడా నాకు తెలుసు. నేను పోస్ట్‌మార్టం రిపోర్ట్ కాపీని తెప్పించుకుని చదివాను’.

“నేను ఈ కేసును తొందరగానే ఛేదించానంటారా?”

“అవును, కానీ రొసారియో అయుంటే ఇంకా తొందరగా చకచకా ముళ్ళు విప్పేసి ఉండేవాడు” సాహిబ్ నవ్వారు. “రొసారియో ఆ పట్టు దారాన్ని పోస్ట్‌మార్టం నివేదికలో చేర్చేవాడు కాదు. నేరుగా ఆయన నా దగ్గరికి వచ్చేవాడు. అలాంటి టోపీలు వేసుకునేవాళ్ళు ఎవరు అని మాత్రమే వాకబు చేసుండేవాడు. నన్ను గుర్తు పట్టిన తర్వాతే కృష్ణన్ ఎవరన్నది వెతికుండేవాడు. అదే తేలికైన మార్గం.”

నేను, “అవును, ఇప్పుడు అర్థమైంది” అన్నాను.

“దేన్ని చూడాలనుకుంటారో దాని మీదున్న మూతనే ముందు తియ్యాలి” అన్నారు సాహిబ్. ఈనాటివరకూ నేను నా దర్యాప్తుల్లో తూచా తప్పకుండా పాటిస్తున్న మార్గదర్శక వాక్యం అది.

“సాహిబ్, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. అతను మంగళూరు ఎందుకు వెళ్ళాడు? ఆ టోపీని మీకు ఎందుకు చూపించలేదు?” అడిగాను.

“అది మానవ సహజం కదా? ఇలా అడగ్గానే నేను వెంటనే డబ్బు తీసి అతనికి ఇచ్చేశాను. ఆ టోపీతో బెదిరించాల్సిన అవసరమే రాలేదు. అతను డబ్బును చూడగానే తీసుకుని గబగబా పరిగెత్తాడు. బయటకు వెళ్ళి కోళికోడ్ రైల్వేస్టేషన్ చేరుకున్నప్పుడు దేవుడికీ సాతానుకూ మధ్య చిక్కుకుపోయుండొచ్చు.”

“ఎలా?”

“డబ్బు అనేది మామ్మోన్ అనే దేవత. అది సాతాను సైనికులలో ఒకటి. డబ్బును చెమటోడ్చి సంపాదించాలి లేదా రక్తమూ, కన్నీళ్ళు కార్చి సంపాదించాలి. చెమట, రక్తం, కన్నీళ్ళు మనం అల్లాహ్‌కు చెల్లించే మూల్యం, దానికి ప్రతిగా ఆయన మనకు సంపదనిస్తాడు. అలా సంపాదించిన సంపదనే అల్లాహ్ రక్షిస్తాడు. అల్లాహ్‌కు మూల్యం చెల్లించకుండా, ప్రాప్తం లేకుండా ముట్టే సంపద సైతానుకు చెందుతుంది. మనం సాతాన్నుండి తప్పించుకోలేము. అందుకే నేను ఎవరికీ ఉచితంగా డబ్బులివ్వను. నేను విద్య, వైద్యంలాంటివి అందచేస్తాను. పెళ్ళిళ్ళు చేయిస్తాను. డబ్బులు ఇవ్వను. డబ్బులివ్వడం అంటే సాతాను దగ్గరకు నెట్టడమే”.

నేను ఆయన కళ్ళలోకి చూస్తూ ఉన్నాను. అరబ్ సన్యాసిలా, సూఫీలా, సుల్తాన్ లాగా కనిపించాడు. మళ్ళీ అదే భావన, ఎంత గొప్ప అందగాడు!

“అతను రైల్వే‌స్టేషన్‌ చేరుకున్నప్పుడు అతనికి రెండు మార్గాలు ఉన్నాయి. డబ్బుతో వడకరకు వెళ్ళుండచ్చు. అది ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేది. అవసరమైతే రాధామణికి కూడా కొంత ఇచ్చుండచ్చు. కానీ ఆ క్షణంలో అతని లోలోపల పులిసి దుర్వాసన కొడుతూన్న కలల్నే బయటకు తెచ్చాడు సాతాన్.”

నేను “అవును” అన్నాను.

“అలాంటివి లేని మానవ హృదయమే లేదు. అందుకే డబ్బులుండేవాడు, అల్లాహ్ మార్గంలో తనను తాను నిలబెట్టుకోవడానికి ప్రతి క్షణం కష్టపడాల్సి ఉంటుంది. డబ్బు లేనివాడు మఱింత దురదృష్టవంతుడు. అతను తను పేదరికంతో బంధించబడ్డాడని అనుకుంటాడు. ప్రపంచం మొత్తం సంతోషంగా వేడుకలు చేసుకుంటుంటే, తాను ఒక్కడినే భూమిలో మట్టి కొట్టుకుపోతున్నట్టు భావిస్తాడు. అతనికి డబ్బు వస్తే అది అతన్ని పిచ్చివాడ్ని చేస్తుంది.”

నేను నవ్వాను.

“అతను రెండో మార్గం ఎంచుకుని మంగళూరు వెళ్ళాడు. అక్కడే ఎక్కడో ఉండి, తనకు నచ్చిన కొన్ని పనులు చేసుంటాడు. అయితే, అతనికి అలా చేసే మార్గాలు సరిగ్గా తెలియవు. ఒళ్ళు తెలియకుండా డబ్బును వెదజల్లి ఉంటాడు. ఏ అపరిచితులతోనో పరిచయాలు ఏర్పడి ఉండొచ్చు.”

“అవును, అదే జరిగుంటుంది” అన్నాను.

“వాళ్ళు అతని దగ్గర ఉన్న ఆ టోపీని చూసి ఉంటారు. వాళ్ళు దాన్ని అడ్డుపెట్టుకుని హాషిమ్‌ను ఏకాంతంగా కలవాలని, అతన్ని బ్లాక్‌మెయిల్ చేసి మఱింత డబ్బు గుంజాలని ప్లాన్ చేసుంటారు. వాళ్ళు ఆ నెపంతో మంగళూరు బ్రిడ్జి దగ్గరకు వెళ్ళి ఈ విషయం మీద సంప్రదింపులు జరుపుకుందామని చెప్పుంటారు. వాళ్ళు టోపీని లాక్కుని అతన్ని తరిమికొట్టడానికి ప్రయత్నించి ఉంటారు. చంపే ఉద్దేశం కూడా ఉండి ఉండవచ్చు. టోపీ కోసం జరిగిన తోపులాటలో అతను దాన్ని గట్టిగా పట్టుకునుంటాడు. చేతికి ఒకే ఒక దారం మాత్రం మిగిలింది. కిందున్న నదిలో పడి మునిగి చనిపోయాడు” సాహిబ్ అన్నారు.

నేను నిట్టూర్చాను. లాంచీ నెమ్మదిగా ఊగుతోంది. అరేబియా సముద్రంలోని నీరు ముదురు నీలంరంగులో ఉంటుంది. సాయంత్రం చీకటి అద్దుకుని మఱింత నల్లగా అయిపోతుంది. సూర్యుడు పశ్చిమాకాశంలో ఎరుపు రంగులు చిమ్ముతూ అస్తమిస్తున్నాడు. సముద్రపు గాలిలో అప్పటిదాక ఉన్న వేడి ఆవిరి చల్లగా మారుతోంది.

“ఎంత హాయైన గాలి! ఊటీ, కొడైకెనాల్ వంటి కొండప్రాంతాలకు వెళ్తారు. సముద్రపు గాలిలోని మాధుర్యం మఱెక్కడా లేదనిపిస్తుంది నాకు. నా ఊపిరితిత్తుల్లో కొంచెం ఉప్పు గాలి ఉంటేనే నిద్ర పడుతుంది” సాహిబ్ అన్నారు.

“అవును, నేను కూడా మంగళూరు వచ్చాక దానికి కొంచెం అలవాటు పడ్డాను. సముద్రపు గాలిలో పొగ, దుమ్ము లేదు. స్వచ్ఛంగా ఉంటుంది” అన్నాను.

“మీరు వైన్ కావాలంటే తీసుకోవచ్చు. మాకు మద్యం నిషిద్ధం – హరామ్” అన్నారు.

“నేను నవ్వాను. ఆయన చేత్తో సైగ చేశారు.వచ్చి ముందు వంగి నిలబడ్డ నౌకరుతో మృదువైన స్వరంతో ఏదో చెప్పాడు. హెన్రీ జోయర్ వైన్ వచ్చింది. నేను కప్పు తీసుకున్నాను. కొంచెం కొంచెంగా చప్పరిస్తూ ఆ చేదును నా నాలుకమీద నిలిపి ఉంచుకున్నాను.

“వైన్ లోపలికి ఎప్పుడు వెళ్ళినా దర్జాగా మహారాజునన్న భావన కలిగిస్తుంది. అంతకంటే ముఖ్యంగా ఒక నేనో జెంటిల్మెన్‌ అనిపిస్తుంది. ప్రశాంతత ఆవరిస్తుంది. కాళ్ళు విదిలించుకుని మళ్ళీ మామూలు స్థితికి వచ్చాను. చిన్నగా నవ్వాను. సముద్రపు అలలను ఆనందంగా కలియచూశాను. ‘కడలినక్కరె పోణోరే…’ అన్న పాట గుర్తొచ్చింది. ఆ పాట ట్యూన్ నాలో లేని దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. వైన్‌కు సరైన జోడీ సన్నటి దుఃఖం! అప్పుడు మనం మఱింత నిమ్మళంగా, విశ్రాంతంగా, జెంటిల్మేన్‌లా ఫీల్ అవుతాం.

“సాహిబ్, నేను అడగబోయేది ఓ వృత్తిపరమైన సాయం, తప్పనిసరేం కాదు. మీకు ఇష్టమైతేనే సాయం చెయ్యండి. కృష్ణన్‌ను చంపిన ముఠా ఆ రోజే మంగళూరు వదిలి వెళ్ళిపోయి ఉండాలి. అయితే వాళ్ళ దగ్గర హషీమ్ టోపీ ఉంది. దాన్ని ఉపయోగించుకోకుండా పోయే అవకాశమే లేదు. వాళ్ళుగానీ హాషిమ్‌ను సంప్రదించారా, ఏదైనా బేరాలాడారా?” అనడిగాను.

“నేను హాషిమ్‌తో ఒక అరగంట మాట్లాడాలి.”

“వాడితో మాట్లాడటం వీలుకాదు.”

“ఎందుకు?”

“వాడు లేడు.”

“ఎక్కడున్నాడు?”

ఆయన తన పాదాలను చూపిస్తూ, ‘ఈ అరేబియా సముద్రం లోతుల్లో,’ అన్నారు.

నేను వణుకుతున్న చేతులతో అప్రయత్నంగా లేచి నిల్చున్నాను. నెమ్మదిగా గ్లాసును టీపాయ్ మీద పెట్టాను. “సాహిబ్…మీరేనా?” అడిగాను.

“నేనే. పెద్దవాళ్ళ అనుమతితో” అన్నారు. “ఇది మా అంతర్గత వ్యవహారం. ఇందులో పోలీసులు జోక్యం చేసుకునే అవసరం లేదు.”

“అవును” అని కూర్చున్నాను. ఇదంతా చెప్తున్నప్పుడు కూడా ఆయన ముఖంలో అదే చెక్కు చెదరని చిరునవ్వు. ఆఖరికి కనురెప్పలు కూడా ఒక్కక్షణం మూతపడలేదు. అదే విప్పారిన ముఖంతో ఉన్నారు.

“సాహిబ్, ఎందుకలా చేశారు? ఆ అమ్మాయే స్వయంగా చెప్పింది అతనొక చిన్నపిల్లవాడని. పసిపిల్లాడు బొమ్మను ఇష్టపడినట్టు ఇష్టపడ్డాడు. మొండిపట్టు పట్టాడు.”

“నాకు తెలుసు. అందరిలోకి వాడంటేనే నాకు ఎక్కువ ముద్దు. వాడి గురించి నేను కొత్తగా తెలుసుకునేది ఏమీ లేదు,” అన్నారు సాహిబ్. “కానీ మా నియమాలను ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించడానికి వీల్లేదు. నేను కూడా అధిగమించలేను. ఎవరూ ఉల్లంఘించనంతవరకే ఇవన్నీ నిలుస్తాయి. ఒక చిన్న తప్పుకు కూడా ఇక్కడ చోటివ్వకూడదు.”

“అతను పిల్లాడు… ఎంతైనా…”

“అవును, ఇది సుల్తాన్లకు మార్గదర్శనం చేసిన ఖడ్గం. దీన్ని దోపిడీకి ఉపయోగించకూడదు.”

“తప్పే” అన్నాను.

“ఇది ఒక్కసారి మొదలైతే తర్వాత ఆపడానికే వీల్లేని తప్పు. నా హయాంలోనైతే మాత్రం అది మొదలవ్వదు!” ఆయన సముద్రానికేసి చూస్తూ కూర్చుని ఉన్నాడు. గాజు కిటికీకవతల అలలు కనిపిస్తున్నాయి.

“నేను ఆయన్నే చూస్తున్నాను. తరువాత కళ్ళు మూసుకుని చాలాసేపు అక్కడే ఉండిపోయాను. నేను మళ్ళీ కళ్ళు తెరిచినప్పుడు, ఆకాశం చీకటిగా ఉంది. సూర్యుడి చివరి రంగులు మిగిలి ఉన్నాయి.

“సాహిబ్ లేచి నిల్చుని, “ఈరోజు విందామని ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ ఎల్‌పీలు రెండు తీసిపెట్టాను. ఈరోజు సప్తమి, శుక్లపక్షపు వెన్నెల. చంద్రకౌన్స్ – సప్తమి వెన్నెల తాలూకు రాగం. మీకు సంగీతం అంటే ఆసక్తి ఉంటే ఆస్వాదించొచ్చు.”

“నేను ఆయన ముఖంలోకి చూశాను. అదే చిరునవ్వు, అదే స్పష్టమైన, అందమైన కళ్ళు. పువ్వు మీద మఱో పువ్వును పెట్టినంత సౌకుమార్యంగా సూదిని మ్యూజిక్ ప్లేట్ మీద ఉంచారు. నల్లటి ముత్యంలా మెరుస్తున్న LP రికార్డ్ ప్లేయర్. అది పాడటం మొదలుపెట్టింది. మత్తెక్కించే ఉస్తాద్ స్వరం గాల్లో నిండింది. అది మానవస్వరం కానే కాదు. కొండలు, సముద్రం, అగ్ని, ఆకాశం, గాలిలా అలౌకిక స్వరం.

“సాహిబ్ కుర్చీలో కూర్చున్నారు. ఆయన చేతులు మడిచి తన ఛాతీపై పెట్టుకున్నారు. కళ్ళలో ఒక కల మెదిలింది. ప్రాయంలో ఉన్న లేత కుర్రాడి ముఖం. నేను ఆయన వైపే చూస్తున్నాను.

“చెప్పనలవి కాదు అది. ఫ్రెండ్స్, అది చాలా అరుదైన రోజు. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించకూడదని ఒక్కోసారి అనిపిస్తుంది కదా, అలాంటి రోజుల్లో ఆ రోజు కూడా ఒకటి.”


అస్తమిస్తున్న సూర్యుడి ఎర్రటి కాంతులు మెరైన్ డ్రైవ్ అలలపై తళతళమనిమెరుస్తున్నాయి. చాలా చాలా నెమ్మదిగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఒక పెద్ద నీటి బొట్టు కూడబలుక్కుని రాలిపడి అదృశ్యమైనట్టు. జీవితంలో కొన్ని అపురూపమైన క్షణాలు ఇలా మెరిసి అలా మఱుక్షణంలో అదృశ్యమౌతాయి. నేను ఔసేపచ్చన్‌ వైపే చూస్తున్నాను.

ఔసేపచ్చన్ అన్నాడు – “కృష్ణన్ ఎంబిరాంద్రి బస చేసిన హోటల్‌లో అతనక్కడ ఉన్నప్పుడు, పక్క గదుల్లో బస చేసిన వాళ్ళ వివరాలు సేకరించాము. వాళ్ళలో ఒకడు మంగళూర్లో పేరుమోసిన క్రిమినల్ల్స్ లో ఒకడు. కృష్ణన్‌ను చంపి డబ్బు పట్టుకుపోయింది వాడే. అయితే వాడి దగ్గర ఆ టోపీ లేదు. ఆ పెనుగులాటలో అది సముద్రంలో పడిపోయింది. మేము వాడి వెనకాల వెళ్ళాం. ఆ డబ్బుతో వాడు గోవా వెళ్ళాడు. అక్కడ తాగి దుర్మార్గంగా ప్రవర్తించాడు. వాడ్ని మఱో ముఠావాళ్ళు కొట్టి డబ్బును దొంగిలించుకుపోయారు. మేము వాడ్ని అరెస్టు చేసినప్పుడు ఓ తాగుబోతు కింద మారి భిక్షమెత్తుకుంటున్నాడు.”

మేము ఆ తర్వాత ఏం జరిగిందో వినాలనుకోలేదు. ఎలుకేశవన్ లేచి, “భోజనం రెడీ అయిందో లేదో చూస్తాను” అన్నాడు.
ఔసేపచ్చన్ నన్ను, “నీ అభిప్రాయం ఏంటి, సాహిబ్ చేసింది సరైనదేనంటావా?” అని అడిగాడు.

“ఏం చెప్పగలం? వాళ్ళ మనస్తత్వం నాకు అర్థం కావడం లేదు” అన్నాను. “వాళ్ళు వేరే కాలానికి చెందిన మనుషులు.”

“నేనూ అదే విషయం వెయ్యి సార్లైనా ఆలోచించి ఉంటాను,” అన్నాడు ఔసేపచ్చన్. “ఆలోచించిన ప్రతిసారీ మాపిళా కళాసీలు రైలు పెట్టెలను పైకి లాగిన దృశ్యమే గుర్తుకొస్తూ ఉంటుంది. వృద్ధ ఉస్తాద్ నాతో అన్నారు, వేవేల పాదాలు. అంటే వెయ్యి ఇంటూ వెయ్యి – పదిలక్షల పాదాలు కలిసి నిలవాలంటే వాటిలో ఒకటి… కేవలం ఒకటి తప్పుగా పడినా, అంతే! తప్పు పలురెట్లుగా పెరిగిపోయి ఓడ అమాంతం సముద్రంలో మునిగిపోతుంది”.

ఎలుకేశవన్ వచ్చి “బీఫ్ వేపుడు రెడీ” అన్నాడు.

“తీసుకురారా గాడిదా” అన్నాడు ఔసేపచ్చన్.


మూలం: పత్తులట్చం కాలడిగళ్, 17 ఏప్రిల్ 2020

***
పత్తేమార్
ఉరు
మాపిళా కళాసీ
పెరుమణ్ రైలు ప్రమాదం

మూల కథ: పత్తులట్చం కాలడిదళ్– April 17, 2020


అవినేని భాస్కర్

రచయిత అవినేని భాస్కర్ గురించి:

తమిళ తెలుగు అనువాదక రచయిత అవినేని భాస్కర్. ప్రధానంగా తమిళం వంటి ఇతర భారతీయ భాషలలోని ఉత్తమ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయడంలో ఆయన విశేష కృషి చేస్తున్నారు. అలాగే, తెలుగు కథలను తమిళంలోకి కూడా తన అనువాదం ద్వారా అందజేస్తూ, దక్షిణ భారతీయ భాషల మధ్య సాహిత్య వారధిగా నిలుస్తూ, అవినేని భాస్కర్ గారు తెలుగు-తమిళ సాహిత్య రంగాల్ని సుసంపన్నం చేస్తున్నాడు.

 ...


జయమోహన్

రచయిత జయమోహన్ గురించి:

జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.

 ...