ఇల్లేరమ్మకు చలవపందిరి

బాల్యం గురించి రాయడమంటే దొమ్మీ కేసులో సాక్ష్యం చెప్పడం లాంటిది.

ఎందుకంటే కేసు జరిగిన ఏడాదికి గానీ చార్జిషీటు దాఖలు చెయ్యరు. ఇంకో పదేళ్ళకు గానీ కోర్టులో విచారణకి రాదు. అది జరిగీ… జరిగీ… పుష్కరం తరువాత బోనులో నిలబడి సాక్ష్యం చెప్పాల్సివస్తుంది. బోలెడు విషయాల్నీ అనేక పేర్లనీ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోపోతే క్రాస్ ఎక్జామినేషన్‌లో సాక్షి తప్పులో కాలువేసే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం సోమరాజు సుశీలగారు బోనులో నిలబడ్డ సాక్షి. నలభై నలభయ్యయిదేళ్ళ క్రితం మధ్యతరగతి కుటుంబాలలో నిత్యం ఉండే సాధక బాధకాలని ‘కథకానికథలే’లుగా ఇల్లేరమ్మ కథలుగా గుదిగుచ్చి మన ముందుంచారు. అప్పట్లో ఆవిడ పేరు ఇల్లేరమ్మ. ముగ్గురు చెల్లెళ్ళకి పెద్దక్క. వాళ్ళ అమ్మ చదివే అష్టోత్తరంలో బోలెడు పేర్లు! అందులో ఇంకోటి ‘ఆరిందాగోవిందమ్మ’.

శొంఠి లేని కషాయమా అన్నట్టు ఇందులో ఇల్లేరమ్మ లేని కత ఒక్కటీ లేదు. కాళ్ళకీ చేతులకీ మాటకీ అస్తస్తమానం అడ్డంపడే ముగ్గురు చెల్లెళ్ళూ, అమ్మానాన్న, ఇంటివాళ్ళూ వంటవాళ్ళూ, మధ్యమధ్యలో సిస్టర్లూ మదర్లూ–వీళ్ళందరితో ఒంటిరెక్కతో అలవోకగా ఈ కథాసాగరాన్ని ఈదుకు వచ్చింది ఇల్లేరమ్మ.

వాళ్ళ నాన్న ఉద్యోగరీత్యా ట్రాన్స్‌ఫర్లు అవుతూ ఉంటారు. బదిలీ అయినప్పుడల్లా కథలు కూడా ఆ ఊరు వెళుతూ ఉంటాయి. గుంటూరులో మొదలై ఏలూరికీ అక్కడ నుండి బెజవాడకీ మారి పాతికో కథ హైదరాబాద్ వచ్చి ఆగుతుంది.

ఇల్లేరమ్మకి వాళ్ళ అక్క పూలమాల ఎలా కట్టాలో చిన్నప్పుడే నేర్పింది. ‘రెండేసి మొగ్గలు ఎడమెడంగా పెడితే దండ వెడల్పుగా వస్తుంది. ఐదుసార్లు పది మొగ్గలయ్యాక, ఒకసారి మరువం, మళ్ళీ ఇంకో పది మొగ్గలయ్యాక కనకాంబరం పెట్టాలి…’ అంటూ నేర్పిన పాఠం ఇల్లేరమ్మకి బాగా వంటపట్టింది. అందుకే ఈ కథల్ని కదంబమాలల్లే తీరుగా అల్లారు. కాసిని ఇంటి కబుర్ల మధ్య మధ్య మరువం లాంటి ఇంటివారి ముచ్చట్లూ, చిన్నారీ ఇందూ బుజ్జీలతో వచ్చిపడే సమస్యలూ, అక్కడక్కడా మెచ్చుకోళ్ళ కనకాంబరాలూ, కలబోసి కట్టిన పూలచెండు ఈ కథాసంపుటి.

పువ్వులు కట్టే విద్య ఇల్లేరమ్మకి అబ్బినంతగా వాళ్ళ చెల్లెళ్ళకి అబ్బింది కాదు. అందుకని వాళ్ళ పూలు కూడా తనే కట్టి, ఒక్కొక్కరి దగ్గరా పదేసి పూలు ‘ఫీజు’ వసూలు చేసుకునేది ఇల్లేరమ్మ. పనితనానికీ, శ్రమశక్తికీ ఆ మాత్రం గిట్టుబాటు ధర వుండాల్సిందేననిపిస్తుంది. తర్వాత ఆ ముగ్గురినీ కూడగట్టుకుని ‘నారింజా సమ్మర్ స్కూల్’ స్థాపించి, నడిపి, చుట్టుపక్కల పిల్లల్ని ఆకట్టి, తల ఒక్కింటికీ రెండు రూపాయల ఫీజు వసూలు చేసింది. దీన్ని బట్టి మన కమర్షియల్ కేపిటల్ బెజవాడలో విద్యని వ్యాపారం చేసిన తొట్టతొలి తెలుగు మహిళ ఇల్లేరమ్మేనని స్పష్టం అవుతోంది. దీని మీద మరికొంత విస్తృతమైన పరిశోధన జరగాల్సి ఉంది.

ఒకటికి రెండుసార్లు చదివినా, ఈ ఇల్లేరమ్మ కథల్లో సాధారణ స్పృహే కానీ సామాజిక స్పృహ నాకెక్కడా తగల్లేదు. అయితే ఆనాటి సాంఘిక ఆర్థిక పరిస్థితులకు అద్దం పట్టే సంఘటనలూ, సమాచారాలూ అక్కడక్కడా ఉన్నాయి. బెజవాడ లక్ష్మీ టాకీస్‌లో జయసింహ సినిమా వందరోజులు ఆడిందనీ, శతదినోత్సవానికి అంజలీదేవీ, శ్రీరంజనీ స్వయంగా వచ్చారనే (నేను వెరిఫై చేశాను. 1955లో జయసింహ – లక్ష్మీ టాకీసు – ఆల్ కరెక్టు) లాంటి చారిత్రక సత్యాలు భావి తరాలకు అందకుండా పోయే ప్రమాదాన్ని తప్పించింది ఇల్లేరమ్మ. పావలాకి ఒక కారంబూంది, రెండు కారప్పూస, ఒక పకోడి పొట్లం వచ్చేవి ఆ రోజుల్లో. ఇలాంటి ఆర్థిక సత్యాలెన్నో తెలుసుకోవచ్చు. వీశడు బంగాళదుంపలు బదులు నోరుజారి కేజీ అనేసినా, అణా బదులు పది పైసలు మాట వాడినా, బెజవాడని విజయవాడన్నా, సాక్షీకానికి ఇంకా బలమే ఉండదు. అందుకే బోనులో సాక్షి చాలా అలర్ట్‌గా ఉండాలి, అమ్మో! ఈ విషయంలో ఇల్లేరమ్మ గుండెలు తీసిన బంటు. మంచి మాటకారి.

మొదటి కథ, శ్రీగణేశా!ఈశా! అని హిందుత్వ సెంటిమెంట్‌తో శ్రీకారం చుట్టుకుంది. ఇందులో మత సామరస్యం మీద మెసేజీ కూడా ఉంది. చాలా సింపుల్‌గా ‘తెలుగులో గుడి. ఇంగ్లీషులో చర్చి, అంతే కదా!’ అనేది ఇల్లేరమ్మ సూక్తి. దానిపేరు ‘శ్రీగణేశా! ఏసా!’ అని పెడితే కథోచితంగా ఉండేదనిపించింది.

ఆ రోజుల్లో గుంటూరు, ఏలూరు, బెజవాడ చిన్న రకం బస్తీలుగా ఉండేవి. ఇంటివాళ్ళూ-అద్దెవాళ్ళూ అరమరికలు, అడ్డుగోడలూ లేకుండా కలివిడిగా ఎలా కాలక్షేపం చేసేవారో చెప్పడానికి ప్రతి కథా ఒక సాక్షిగా నిలబడుతుంది. ‘ఆ రోజులు మళ్ళీ రావు కదా…’ అని దిగులేస్తుంది. క్రమేపీ మెదడుకూ గుండెకూ దూరం పెరిగి మనిషి జిరాఫీలా అయిపోతున్నాడనిపిస్తుంది.

‘చల్లావారిల్లు’, ‘విందులూ, సంగీతాలూ!’ వీటిని చదువుతున్నప్పుడు చలవపందిట్లో కూచుని శాస్త్రీయ సంగీతకచేరీ వింటున్న అనుభూతి కలుగుతుంది. ఆకాశవాణి సంగీతోత్సవాలకి మద్రాసు నించి, తంజావూరు, మధుర, కుంభకోణం నుండి వచ్చే కళాకారులంతా చల్లావారింట్లో విడిది చెయ్యడం రివాజు. ముందుగానే చల్లావారింట పెళ్ళిసందడి మొదలవుతుంది. దక్షిణాది వంటలతో వీధివీధంతా ఘుమఘుమలాడిపోతుంది. ఒకరోజూ రెండ్రోజులూ కాదు. వారం పదిరోజులు. ఎత్తే వాయిద్యాలు దింపే వాయిద్యాలు. నిష్ఠ నియమాలతో ఉండే ఆ మహాపండితుల్ని నవకాయ పిండివంటలతో సేవించుకోవడం, అదేమన్నా అంటే, ‘సాక్షాత్తూ సరస్వతీ స్వరూపాలైన వాళ్ళు వచ్చి మనింట్లో విస్తరేస్తే చాలదా! అమ్మవారే ఈ రూపంలో వచ్చిందనుకుంటాం మేము!’ అనేవాళ్ళు ఇప్పుడూ ఉండవచ్చు కానీ, వాళ్ళను వెదికి పట్టుకోవడం చాలా కష్టం. ఇల్లేరమ్మ ఇలాంటి సందడులూ సరదాలూ ఎన్నో చూసింది కాబట్టే ‘చల్లావారింట్లో మైసూర్ పాకులు జామెట్రీ బాక్సంత ఉంటాయి తెలుసా!’ అని గొప్పగా చెప్పగలిగింది.

బాగా పెద్దరికం వచ్చాక, చిన్నప్పటి మాటలు చెప్పేటప్పుడు, మరీ ముఖ్యంగా ఆటోబయోగ్రఫీ ఛందస్సులో కాస్తంత అక్కడక్కడా ‘గ్లోరిఫై’ చేసుకోవాలనే చాపల్యం సహజం. కథలన్నీ చదివాక, సుశీలగారు రంగప్రవేశం చెయ్యకుండా ఇల్లేరమ్మ ముఖతానే చెప్పించారనీ; అందుకే అమాయకత్వం, ఆరిందాతనం చెక్కుచెదరలేదనీ, పాఠకులూ నాలాగే అనుకుంటారు. తోచినప్పుడూ తోచనప్పుడూ కూడా హాయిగా చదువుకుంటారు. అంతా చదవలేని వాళ్ళకి ఇందులో ఒక మహావాక్యం ఉంది. ‘పాలింగ పట్టయ్యగారి పెద్ద పాలికాపు కొత్త పాలికాపా? పాత పాలికాపా?’ దీన్ని తడబడకుండా అనడానికి కృషి చెయ్యవచ్చు.

ఈ సంపుటిలో కథల్ని విడివిడిగా చదివితే ‘ఇల్లేరమ్మ కథలు.’ వరసాగా చదివితే ‘ఇల్లేరమ్మ బాల్యం’ నవల. మెరుపులూ, కిట్టించిన మలుపులూ మనకెక్కడా కనపడవు. మామిడి పిందెల పరికిణీ కతలో జాగ్రఫీ వైరాగ్యం నాకు నచ్చిన పాతిక కథల్లో ఒకటి. జామచెట్టు ఉన్నవాళ్ళకి దాని కొమ్మలు పట్టుకు ఊగవచ్చని తెలియదు. తెలిసినవాళ్ళకి జామచెట్లు ఉండవ్. దటీజ్ లైఫ్! ఇలాంటి జీవన సత్యాలెన్నింటినో చెబుతుంది ఇల్లేరమ్మ.

కాలానుక్రమం, ఆలోచనాధోరణి ఎక్కడా పొల్లుపోకుండా, వయసుని బట్టి ఇల్లేరమ్మ దృష్టిలో, మాటల్లో వచ్చే తేడాని పాఠకులు తేలిగ్గా పసికట్టవచ్చు… ‘అయితే నా రెండెకరాలూ గోవిందేనా’ అనే చివరి కథలో అసహాయత లోంచి, భయం లోంచి భక్తి ఎలా పుట్టుకొస్తుందో చిన్న సంఘటనతో అద్భుతంగా చెప్పింది. ఇల్లేరమ్మ ఇప్పటికే ముగ్గురు చెల్లెళ్ళతో వేగలేకపోతుంటే ఇప్పుడు ఇంకో తమ్ముడు పుట్టాడు. ఉన్న ఎనిమిదెకరాల మామిడితోట తలొక రెండు ఎకరాలు వస్తుందనుకున్న బుజ్జి చెల్లెలుకి తమ్ముడి రాకతో గుండెల్లో రాయి పడుతుంది. ‘ఆహా, కాని ఆడుకోడానికి చక్కని తమ్ముడు దొరికాడు కదా’ అని మురిసిపోతుంది ఇల్లేరమ్మ!

సోమరాజు సుశీలగారు చిన్న పరిశ్రమలూ-పెద్ద కథలూ సమర్థవంతంగా నడపగలరని ఇదివరకే నిరూపించుకున్నారు. ఈ కథలు ఆంధ్రజ్యోతి వీక్లీలో వారం వారం వస్తున్నప్పుడే, ఇంటింటా తిరిగి ఇల్లేరమ్మ మంచి పేరు తెచ్చుకుంది. చాలామందికి తమ చిన్నతనపు రోజుల్ని గుర్తు చేసింది.

అంతా బానే ఉంది గానీ, ఇన్నాళ్ళూ చేతులు కట్టుకు కూచుని, ఒక్కసారి ఈ రచయిత్రి ఇలా తిరుగుబాటు చేయడం, ఓవర్టేక్ చేసి పెద్దపీట ఆక్రమించడం సీనియారిటీని ఓవర్‌లుక్ చెయ్యడం అవుతుందని సంకోచంగా ఉన్నా ఆమెకు మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను. కనీసం కొన్నాళ్ళపాటు వీరు పీఠికల జోలికి రాకుండా ఉంటే చాలు. అదే నాలాంటి వాళ్ళకి పదివేలు.

[ఇల్లేరమ్మ కథలు పుస్తకానికి రాసిన ముందుమాట, రచయిత అనుమతితో – సం.]